హాలీవుడ్ సినిమా ది ఫ్లాష్ ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైంది. యూట్యూబ్ లో ది ఫ్లాష్ సినిమా విడుదల చేశారు మేకర్స్ వార్నర్ బ్రదర్స్. రిలీజైనప్పటి నుంచి ట్రెండింగ్ లో కొనసాగుతున్న ది ఫ్లాష్ ట్రైలర్.. ఈ రోజు కూడా ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉంది. అయితే.. ఈ ట్రైలర్లో ఓ ఇంట్రస్టింగ్ విషయాన్ని కనిపెట్టారు వ్యూయర్స్. ట్రైలర్ లో ఓ ఫ్రేమ్ లో హీరో వెనుక హిందువుల దైవమైన హనుమంతుడి ఫోటో కనిపిస్తోంది. అరక్షణం కూడా కనిపించని ఈ ఫ్రేమ్ లో హనుమంతుడి ఫోటో ఉండటాన్ని ఎవరు కనిపెట్టారో కానీ.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశంగా మారింది. ట్రైలర్ లోని 216 వద్ద హనుమంతుడి ఫోటో స్పష్టంగా కనిపిస్తోంది.
భారీ సైన్స్ ఫిక్షన్, యాక్షన్, థ్రిల్లర్ జోన్లో తెరకెక్కిన ది ఫ్లాష్ బేస్ స్టోరీ టైమ్ ట్రావెల్ అని మేకర్స్ చెప్తున్నారు. టైమ్ లో వెనక్కి వెళ్ళి గతంలో జరిగిన వాటిని మార్చాలనే ప్రయత్నం వల్ల జరిగిన పరిణామాలు ఏమిటి.. బ్యాట్ మెన్ ఈ సినిమాలో ఎందుకు కనిపించాడు.. అనేవి ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్ యాండీ ముషియెట్టీ. ట్రైలర్ లోని ప్రతీ ఫ్రేమ్ రిచ్ గా, ఇంట్రస్టింగ్ గా కనిపిస్తోంది. వార్నర్ బ్రదర్స్ మేకింగ్ క్వాలిటీకి ఈ సినిమా ఏమాత్రం తగ్గదని అనిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 14న విడుదల కానుంది.
“ది ఫ్లాష్” హాలీవుడ్ సినిమా ట్రైలర్లో హనుమంతుని ఫోటో
కాంగ్రెస్ తో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన మంత్రి తలసాని
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ తప్పదనీ.. బీఆర్ఎస్ పార్టీకే కాదు.. అసలు ఏ పార్టీకి కూడా 60 సీట్లు కూడా రావంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించాడు. ఢిల్లీలో ఈ మాటలు మాట్లాడిన ఆయన.. హైదరాబాద్ వచ్చే సరికి మాట మార్చేశాడు. నేను అలా చెప్పలేదు.. ఇలా చెప్పాను.. అంటూ మాట మార్చేసి.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ మీడియా మీద నింద వేశాడు కోమటిరెడ్డి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. రాహుల్ గాంధీ గతంలోనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా కోమటిరెడ్డి ఇలా మాట్లాడటం సరికాదన్నారు. అయితే.. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి కూడా పొత్తుపై క్లారిటీ వచ్చింది.
మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి తలసాని శ్రీనివాస్.. వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశమే లేదని చెప్పారు. కేసీఆర్ సారధ్యంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఖచ్చితంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. కోమటిరెడ్డి ఏం మాట్లాడాడో తనకే క్లారిటీ లేదనీ.. ఢిల్లీలో ఓ మాట.. హైదరాబాద్ లో ఓ మాట మాట్లాడిన కోమటిరెడ్డిపై తాను కామెంట్ కూడా చేయదల్చుకోలేదనీ అన్నారు.
ట్విస్ట్ ఇచ్చిన ఎలాన్ మస్క్ : ట్విటర్ సీఈఓ కుర్చీలో కుక్క
తరచూ ఏవేవో పోస్టులు, పోల్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉండే ట్విటర్ కొత్త ఓనర్ ఎలాన్ మస్క్.. మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ ను టేకోవర్ చేసిన తర్వాత సీఈఓను ఇంటికి పంపించేసిన మస్క్.. ఆ తర్వాత కొత్త సీఈఓగా ఎవరినీ అనౌన్స్ చేయలేదు. సగం మంది ఉద్యోగులతో పాటు సీఈఓను కూడా పీకేసిన మస్క్.. కొత్త సీఈఓను ఎప్పుడు నియమిస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్న వేళ.. సీఈఓ కుర్చీలో తన పెంపుడు కుక్కను కూర్చోబెట్టి ఫోటో తీసి తన ట్విటర్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అసలే కొత్త సీఈఓగా ఎవరు వస్తారోనని ఇన్వెస్టర్లు గగ్గోలు పెడుతుంటే.. ఆ కుర్చీలో కుక్కను కూర్చోబెట్టడం వాళ్ళకు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుతం తాత్కాలిక సీఈఓగా పనిచేస్తూ ట్విటర్ ను నడిపిస్తున్న ఎలాన్ మస్క్.. ఈ విషయంపై జోకులు చేయటం అందరినీ ఆగ్రహానికీ, ఆశ్చర్యానికీ గురి చేస్తోంది.
ట్విటర్ ను టేకోవర్ చేసిన సమయంలో కొత్త సంవత్సరంలో తెలివి తక్కువ వాడు దొరికే వరకూ సీఈఓ స్థానం ఖాళీగానే ఉంటుందనీ.. అప్పటి దాకా తానే సీఈఓా ఉంటానని ఎలాన్ మస్క్ చెప్పాడు. అప్పట్లో దీనిపై కూడా సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. సీఈఓ పోస్ట్ పై వివాదం జరుగుతున్న సమయంలో.. నేను ట్విటర్ సీఈఓగా ఉండాలా.. రాజీనామా చేయాలా అని కూడా మస్క్ ఓ పోల్ నిర్వహించాడు. ఇందులో ఎక్కువ మంది మస్క్ వైదొలగాలంటూ ఓటు వేశారు. కానీ మస్క్ అలాగే ఉన్నాడు. ఇప్పుడు కుర్చీలో కుక్కను కూర్చోబెట్టి మరో వివాదానికి కారణమయ్యాడు.
చరిత్ర సృష్టించిన ఇండియన్ క్రికెట్ టీమ్
ఇండియన్ క్రికెట్ టీమ్ సరికొత్త రికార్డు సృష్టించింది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో ఏకకాలంలో నెంబర్ వన్ స్థానాన్ని సంపాదించి క్రికెట్ హిస్టరీలోనే అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే టీ20, వన్డే ఫార్మాట్లలో నెంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్న టీమిండియా.. నాగ్ పూర్ లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించటం ద్వారా 115 రేటింగ్ పాయింట్లు పొందిన టీమిండియా టెస్టుల్లో కూడా నెంబర్ వన్ ప్లేస్ కైవసం చేసుకుంది. తద్వారా మూడు ఫార్మాట్లలో ఏకకాలంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. టెస్టుల్లో రెండో స్థానంలో ఆస్ట్రేలియా నిలవగా.. ఇంగ్లాండ్, న్యూజీలాండ్, సౌతాఫ్రికా ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.
ఇంతకు ముందు ఇలాంటి రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఏక కాలంలో అన్ని ఫార్మాట్లలో నెంబర్ వన్ ప్లేస్ సాధించిన మొదటి టీమ్ గా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించగా మళ్ళీ అలాంటి రికార్డు టీమిండియా పేరిట నమోదైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ జరుగుతోంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. ఫిబ్రవరి 17న రెండో టెస్ట్ ఢిల్లీలో జరగాల్సి ఉంది.
ముంబైలో దారుణం : ప్రియురాలిని చంపి బాక్స్ లో దాచిన ప్రియుడు
ముంబైలో దారణ ఘటన వెలుగులోకి వచ్చింది. లివిన్ రిలేషన్షిప్ లో ఉన్న ప్రియురాలిని చంపేసి బెడ్ రూమ్ లోని బెడ్ బాక్స్ లో దాచిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హార్ధిక్ షా, మేఘా తోవీ అనే జంట మహారాష్ట్రలోని నలసోపారలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇంటిని అద్దెకు తీసుకునే సమయంలో రాసుకున్న రెంటల్ అగ్రిమెంట్ లో కాబోయే దంపతులు అని పేర్కొన్నారు. చాలా కాలంగా కలిసి ఉంటున్న ఈ జంట మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తటంతో ప్రియురాలిని గొంతుపిసికి చంపేసి మంచానికి ఉన్న సీక్రెట్ బాక్స్ లో దాచేశాడు.
సంజీవ్ ఠాకూర్ అనే రియలెస్టేట్ ఏజెంట్ తమకు ఫోన్ చేసి సమాచారమిచ్చాడని పోలీసులు చెప్తున్నారు. కర్ణాటకలో ఉండే మేఘా బంధువు తనకు ఫోన్ చేసి మేఘాను చంపేసి తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ హార్ధిక్ షా బెదిరిస్తున్నాడంటూ తనకు సమాచారం ఇచ్చిందని సంజీవ్ ఠాకూర్ చెప్తున్నాడు. అతడి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హార్థిక్ ఇంటికి వెళ్ళి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి లోపలి నుంచి ఓ రకమైన దుర్వాసన రావటాన్ని గుర్తించిన పోలీసులు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి వెతికితే మంచంలోపల ఉన్న బాక్స్ లో సగం పాడైపోయిన స్థితిలో మేఘా మృతదేహం కనిపించింది. మేఘా గొంతుపై నులిమిన ఆనవాళ్ళు కనిపించాయని పోలీసులు చెప్తున్నారు.
20 రోజుల క్రితమే వీరిద్దరు కొత్త ఫ్లాట్ లో దిగారని.. ఇద్దరి మధ్య డబ్బులకు సంబంధించిన గొడవలే మేఘా హత్యకు దారితీసినట్టు పోలీసులు చెప్తున్నారు. హత్య చేసి తప్పించుకొని పారిపోటానికి ప్రయత్నిస్తున్న హార్ధిక్ ను పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అన్ని రైల్వే స్టేషన్లలో నిఘా ఉంచిన పోలీసులు నగ్డా రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం హార్థిక్ ను పోలీసులు విచారిస్తు్న్నారు.
కొండగట్టుకు మరో 500 కోట్లు-సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కొండగట్టులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. కొండగట్టు అంజన్నను దర్శించుకునేందుకు వెళ్ళిన కేసీఆర్ కు అక్కడి పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత కేసీఆర్ అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి అధికారులతో భేటీ అయిన కేసీఆర్.. కొండగట్టును దేశంలోనే ప్రముఖ ఆంజనేయ స్వామి క్షేత్రంగా తీర్చిదిద్దాలని.. అందుకోసం మరో 500 కోట్లు కేటాయిస్తున్నామనీ చెప్పారు. ఇప్పటికే కొండగట్టు ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఇటీవలే వంద కోట్ల నిధులు కేటాయించిన కేసీఆర్.. ఆ నిధులకు అదనంగా మరో 500 కోట్లు కేటాయించారు.
కొండగట్టు దేవాలయాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని.. తెలంగాణ రాష్ట్రానికి దేశంలో గుర్తింపు తెచ్చే స్థాయిలో అభివృద్ధి జరగాలని కేసీఆర్ ఆదేశించారు. ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణాలు జరిపించాలని ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే మొదలైన కొండగట్టు దేవాలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. హెలీకాప్టర్ ద్వారా ఆలయాన్ని విహంగ వీక్షణం చేశారు.
పోడు భూముల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ సర్కార్
తెలంగాణలో పోడు భూముల వివాదానికి తెర దించేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. త్వరలోనే పేదలకు పోడు భూములు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సర్వే చేపడతామని ప్రభుత్వం గతంలో ప్రకటించి విరమించుకుంది. అప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడ సర్వేలు చేపట్టాలన్నా సర్వేయర్లు తక్కువ మంది ఉండడంతో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ఇదిలా ఉంటే పొడు భూముల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో సర్వేయర్ల కొరత సర్కారుకు ఆశనిపాతంలా మారింది.. కొద్దిరోజుల క్రితం పోడు భూముల సమస్య కేంద్రం పరిధిలో ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.. మళ్లీ కొద్దిరోజుల తరువాత రాష్ట్ర ప్రభుత్వమే ఈ సమస్యను పరిష్కరిస్తుందని, పోడు భూముల సమస్యపై కమిటీని నియమించింది ప్రభుత్వం… కానీ ఈ కమిటీ అటవీ హక్కుల చట్టానికి విరుద్ధంగా ఉండడంతో కమిటీ ఎలాంటి పనులు చేయకూడదని కోర్టు స్టే విధించింది.
రాష్ట్రంలో అటవీ భూములకు హక్కు పత్రాలు కావాలని 4 లక్షల 14 వేల దరఖాస్తులు అందాయి.. గతంలో దాదాపు 90 వేల మందికి పట్టాలు ఇచ్చారు.. ఇప్పటికే దాదాపు లక్షకు పైగా పాత దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే పాత, కొత్త దరఖాస్తులు కలుపుకొని 4 లక్షలకు పైగా పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది. సుమారు 12 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.. ఫిబ్రవరి నెలాఖరులో పోడు భూముల పంపిణీ చేపడతామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ కంటే… అటవీ హక్కు చట్టంలోని నిబంధనల మేరకు ఏర్పాటు చేసిన గ్రామ స్థాయి, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు పోడు భూముల సమస్య పరిష్కరించవచ్చు.. గ్రామాల్లో గ్రామ సభ ఏర్పాటు చేసిన కమిటీలో 2 / 3 వ వంతు గిరిజన మహిళలు ఉండాలి. ఆ కమిటీ గ్రామంలో ఉన్న పోడు భూములు స్వభావం..? ఎంత మంది గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు..? వారి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో..? చూసి ఆ గ్రామ కమిటీపై ఉన్నత స్థాయి కమిటీలకు రిఫర్ చేసి… గిరిజనులకు పట్టాలు ఇప్పించవచ్చు… కానీ ప్రభుత్వం అటవీ హక్కుల చట్టానికి వ్యతిరేకంగా కమిటీలు ఏర్పాటు చేసి… సమస్యను మరింత జఠిలం చేయాలని ప్రభుత్వం చూస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గ్రామ, సబ్ డివిజనల్, డివిజన్, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటులో భాగంగా గ్రామ సర్పంచ్, ఆ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన పెద్దలతో పాటు.. వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న రెవెన్యూ, సర్వే సిబ్బంది, అటవీశాఖ అధికారులతో సదరు దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే హక్కుల ఉత్తర్వులు జారీ చేయాలి. రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోని గిరిజన రైతులు, ఫారెస్ట్అధికారుల మధ్య తరచూ యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో కూడా వరుసగా ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తున్నారు. పంటల సీజన్ వచ్చిన ప్రతిసారీ పంటలు సాగు చేయడానికి వచ్చిన తమపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేసి, అరెస్ట్ చేస్తున్నారని ఆదివాసులు వాపోతున్నారు.
పోడు భూములకు పట్టాలు ఇస్తామని అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటించి చెప్పిన నేపథ్యంలో… పట్టాలు ఎప్పుడు ఇస్తారోనని గిరిజనులు ఎదురుచూస్తున్నారు.. ఇప్పటికే మూడు సార్లు కమిటీ భేటీ అయింది.. భేటీలు కావడం తప్ప… పంపిణీ తేదీని ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఈ నెలలో పంపిణీ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. అయితే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో… వేచి చూడాలి.
బీబీసీ-ఐటీ దాడులపై కేటీఆర్ సెటైర్లు
ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పోరేషన్-బీబీసీపై మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న ఐటీ సోదాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఐటీ, ఈడీ, సీబీఐలను పూర్తిగా మోడీ ప్రభుత్వం తన కంట్రోల్ లో ఉంచుకున్నదని కేటీఆర్ విమర్శించారు. “నెక్స్ట్ ఈడీ దాడులు అదానీ కుంభకోణం గురించి చెప్పిన హిండెన్ బర్గ్ పైనేనా ?” అంటూ సెటైర్లు వేశారు కేటీఆర్. తమ ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిపై ఐటీ,ఈడీ, సీబీఐ దాడులు చేయించటం మోడీ ప్రభుత్వానికి అలవాటైందంటూ విమర్శించారు. ఈ మేరకు ట్విటర్ లో ట్వీట్ చేశారు.
కొద్ది రోజుల క్రితం బీబీసీ సంస్థ.. ప్రధాని మోడీ పై “ఇండియా – ది మోడీ క్వశ్చన్” పేరుతో ఓ డాక్యుమెంటరీని తెరకెక్కించింది. ఇందులో గుజరాత్ అల్లర్ల విషయంలో మోడీని దోషిగా చెప్పే ప్రయత్నం చేసింది బీబీసీ. దీంతో భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఈ డాక్యుమెంటరీ చేసినందుకే ఇప్పుడు బీబీసీపై ఐటీ దాడులు చేస్తోందంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. అయితే.. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ కొనుగోలు చేయటాన్ని సహించలేని ఓ వర్గం.. బీబీసీతో కావాలనే మోడీపై ఇలాంటి డాక్యుమెంటరీ చేయించింది అనేది కొంత మంది వాదన. అంతే కాదు.. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వెనుక కూడా ఎన్డీటీవీ, కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉంది అని కూడా ఓ వాదన ఉంది. ఎన్డీటీవీని అదానీ గ్రూప్ స్వాధీనం చేసుకున్న కొద్ది రోజులకే బీబీసీ మోడీ వివాదాస్ఫద డాక్యుమెంటరీ విడుదల చేయటం.. ఆ వెంటనే హిండెన్ బర్గ్ అదానీ గ్రూప్ పై నివేదిక విడుదల చేయటం జరగటం చూస్తుంటే ఇవి కావాలని చేసినవే అని స్పష్టంగా అర్థమవుతోందని బీజేపీ నేతలు చెప్తున్నారు.
తన గుండె వ్యాధి గురించి బయటపెట్టిన రేణు దేశాయ్
తాను గత కొంత కాలంగా గుండెంకు సంబంధించిన వ్యాధితో పాటు మరిన్ని అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానంటూ రేణు దేశాయ్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఆమె ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడే ఎందుకు బయటపెట్టాల్సి వచ్చిందో కూడా క్లియర్ గా చెప్పింది రేణు. నేను చాలా కాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో పాటు మరికొన్ని అనారోగ్య కారణాలతో సతమతమవుతున్నాను. ఇప్పుడు ఈ విషయం చెప్పటానికి కారణం.. నాలా అనారోగ్య కారణాలతో బాధపడే వారికి ధైర్యం చెప్పటమే. మనం మన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. జీవితంపై ఆశను, విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఏ సమస్యనైనా నవ్వుతోనే ఎదుర్కోవాలి.. అంటూ ఆమె ట్విటర్ లో పోస్ట్ చేసింది. రేణు దేశాయ్ పోస్టు చూసిన అభిమానులు.. ఆమె త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు.
గత కొంత కాలంగా టాలీవుడ్ హీరోయిన్లు తన అనారోగ్యానికి సంబంధించిన రహస్యాలను బయటపెడుతున్నారు. సమంత తాను మయోసైటిస్ తో బాధపడుతున్నట్టు వెల్లడించగా ఆ తర్వాత పలువురు హీరోయిన్లు తమ అనారోగ్యం గురించి అభిమానులతో షేర్ చేసుకున్నారు. బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రేణు దేశాయ్.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకోవటం.. విడాకులు తీసుకోవటం జరిగిపోయాయి. ప్రస్తుతం రేణు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటోంది.
కర్పూరం వెలిగిస్తూ 600 మెట్లెక్కిన సమంత
మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇంట్లోనే రోజుకు సుమారు 4 గంటల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటున్న నటి సమంత.. ఇంత అనారోగ్యంతో కూడా తన శరీరాన్ని కష్టపెడుతూనే ఉంది. ఎంత అనారోగ్యంగా ఉన్నా వర్కౌట్స్ మానని సమంత.. ఈసారి 600 మెట్లెక్కి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. అది కూడా మెట్టు మెట్టుకూ కర్పూరం వెలిగిస్తూ మరీ ఆరు వందల మెట్లను అవలీలగా ఎక్కేసింది సమంత. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తమిళనాడు లోని పళని మురుగన్ దేవాలయాన్ని సందర్శించిన సమంత.. దైవ దర్శనానికి మెట్ల దారి గుండా వెళ్ళింది. ప్రతి మెట్టుకూ హారతి కర్పూరాన్ని వెలిగిస్తూ మొత్తం ఆరు వందల మెట్లను ఎక్కి మరీ దైవదర్శనం చేసుకుంది సమంత.
సాంప్రదాయ దుస్తుల్లో హిందూ సాంప్రదాయం ప్రకారం నుదుటన బొట్టు పెట్టుకొని గుడికి వచ్చిన సమంత కమిట్మెంట్ ను ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. సమంత గారూ.. మీ కోరికలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు.. అంటూ కొంత మంది కామెంట్లు చేస్తుంటే.. మా ప్రేమతో పాటు అద్భుతమైన ఆరోగ్యం కూడా మీ వెంటే ఉంటుంది.. అంటూ మరి కొంత మంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత. ఆమె కొత్త సినిమా శాకుంతలం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.