Home Blog Page 37

కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తరచూ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని చెప్పిన కోమటిరెడ్డి.. ఖచ్చితంగా హంగ్ ఏర్పడుతుందని జోష్యం చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి టీపీసీసీలో బాంబు పేల్చాడు కోమటిరెడ్డి. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అలజడి ఏర్పడింది. అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణలు, విమర్శలు చేసే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీతోనే పొత్తు పెట్టుకుంటుందంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యానించటంతో కాంగ్రెస్ లో భూకంపం వచ్చినంత పనైంది.
కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పార్టీకి పనికివచ్చే పని చేయాలేకానీ ఇలా ఇరకాటంలో పెట్టే పనులు చేయటం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తగిన పని కాదంటూ అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మరో కాంగ్రెస్ నేత మహేష్ గౌడ్.. కోమటిరెడ్డి చెప్పింది ఆయన సొంత అభిప్రాయం మాత్రమేననీ.. కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ఆలోచనలోనే లేదనీ చెప్పారు. తెలంగాణ పొత్తులపై రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ సభలో స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. ఇటు కాంగ్రెస్ లోనూ.. అటు బీఆర్ఎస్ లోనూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

అదానీ వ్యవహారంపై అమిత్ షా హాట్ కామెంట్స్

దేశాన్ని కుదిపేస్తున్న అదానీ వ్యవహారంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తొలిసారి స్పందించారు. అదానీ వ్యవహారం గురించి బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి భయం లేదని చెప్పిన ఆయన.. ఈ విషయంలో తాము దాచాల్సింది కూడా ఏమీ లేదంటూ సూటిగా చెప్పేశారు. ప్రస్తుతం అదానీ వ్యవహారం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నదనీ.. ఇలాంటి సమయంలో మంత్రిగా అదానీ వ్యవహారంపై మాట్లాడటం తగదనీ చెప్పిన ఆయన.. ఏ తప్పు ఉన్నా కోర్టు తేల్చుకుంది అంటూ సమాధానం చెప్పారు. “కోర్టులు ఉన్నది నిజాలు నిగ్గు తేల్చటానికే కదా.. మేం కోర్టు దగ్గర ఏమీ దాచలేదు.. దీనిపై ఎలాంటి విచారణ చేయాలని కోర్టు నిర్ణయించుకున్నా మేం దాన్ని ఆపలేం కదా.. కోర్టులను ఆపే శక్తి ప్రభుత్వాలకు ఉండనప్పుడు.. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంలో అర్థం లేదు..” అంటూ క్లారిటీ ఇచ్చారు.
“కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఆ కుంభకోణాల్లో కాంగ్రెస్ నాయకుల పాత్ర స్పష్టంగా బయటపడింది. ఇప్పుడు కూడా అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే నిరభ్యంతరంగా కోర్టుకు వెళ్ళొచ్చు. మాకేమీ భయం లేదు. పెగాసస్ విషయంలో కూడా కాంగ్రెస్ అదే పని చేసింది.. కానీ బెడిసికొట్టింది..” అంటూ కాంగ్రెస్ నేతలకు క్లియర్ కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. అదానీ వ్యవహారంపై విచారణ కమిటీ వేసేందుకు సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిన మరుసటి రోజే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉద్యోగులను తొలగించిన లింక్డ్ ఇన్

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న లే ఆఫ్ ల సెగ ప్రముఖ సోషల్ మీడియా నెట్వర్క్ లింక్డ్ ఇన్ ను తాకింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి ఆఫర్ లెటర్ లు సంపాదించిన వాళ్ళతో పాటు కొత్తగా చేరిన వాళ్ళనూ.. కొంత మంది పాత వాళ్ళను కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది. అయితే మొత్తం ఎంత మందిని తొలగించింది అనేది మాత్రం తెలియరాలేదు. లింక్డ్ ఇన్ అధికారికంగా దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఆర్థిక మాంద్యం అంటూ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారే తప్ప ఇప్పటి వరకూ ప్రపంచంలోని ఏ స్టాక్ మార్కెట్ లో కూడా నష్టాల జాడలు కనిపించలేదు. కానీ ముందస్తు భయాలతో కంపెనీలు ఉద్యోగాల తొలగింపునకు నిర్ణయించుకుంటున్నాయి.
ఇప్పటికే ప్రపంచ ఆన్ లైన్ దిగ్గజం అమేజాన్ అత్యధికంగా 10 వేల మందిని తొలగించింది. అంటే అమేజాన్ లో ఈ సంఖ్య 5 శాతానికి సమానం. ఫేస్ బుక్, ట్విటర్, గోల్డ్ మెన్ సాక్స్, యాహూ, గూగుల్ సహా.. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలుగా పేరున్న కంపెనీలన్నీ లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. పెద్ద కంపెనీల ఎఫెక్ట్ తో చిన్న కంపెనీలు సైతం భవిష్యత్తులో ప్రాజెక్టులు ఉంటాయో లేదోనన్న ఆందోళనతో రిక్రూట్మెంట్ లను నిలిపివేయటంతో పాటు రిజర్వ్ బెంచ్ పై ఉన్న వాళ్ళను తొలగించేస్తున్నాయి. ఇప్పుడే ఉద్యోగాల తొలగింపు ఈ స్థాయిలో ఉంటే.. ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టు ముడితే ఏ స్థాయిలో ఉంటుందో అనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారు.

ప్రపంచానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా తెలిసింది

ఏరో ఇండియా షో.. ది రన్ వే టు బిలియన్ అపార్చునిటీస్ పేరుతో బెంగళూరులో జరిగిన ఎయిర్ షో.. భారత వైమానిక దళం ఎంత శక్తివంతమైనదో ప్రపంచానికి తెలియజెప్పింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉన్న అత్యాధునిక యుద్ధ విమానాలను ప్రపంచానికి పరిచయం చేసింది. ఐదు రోజులు.. 811 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనలు.. 98 దేశాలు.. వీటన్నింటికీ మించి అక్షరాలా 75వేల కోట్ల విలువైన ఒప్పందాలు.. ఇవన్నీ ఏరో ఇండియా ప్రత్యేకతలే. అందుకే ఇది జస్ట్ ఎయిర్ షో కాదనేది. ఇదే సమయంలో మేడిన్ ఇండియా ఫైటర్స్ తేజస్, ప్రచండ్‌ లైట్ వెయిటర్ హెలికాప్టర్లు ప్రపంచం దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ఏరో ఇండియా 2023 అంతకుమించిన అవకాశాలకు రన్‌వేగా మారుతోంది. గతంలో కేవలం తమ ఆయుధాలను భారత్‌కు విక్రయించాలనే లక్ష్యంతో ఇతర దేశాల ఆయుధ కంపెనీలు ఏరో ఇండియాలో పాల్గొనేవి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. మేడిన్ ఇండియా వెపన్స్‌ దగ్గర నుంచి చూసి భారత్‌తో డీల్ చేసుకోవాలనే టార్గెట్‌తో ప్రపంచ దేశాలు భారత్‌కు వచ్చాయి. ఇందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 98 దేశాలు ఏరో ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రపంచంలోనే టాప్ క్లాస్ ఆయుధ కంపెనీలు ఎయిర్‌బస్‌, బోయింగ్‌, లాక్హీడ్‌ మార్టిన్‌, ఇజ్రాయెల్‌ ఏరోస్పేస్‌, బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌, ఆర్మీ ఏవియేషన్‌, హెచ్‌సీ రోబోటిక్స్‌, సాబ్‌, సఫ్రాన్‌, రోల్స్‌ రాయీస్‌, ఎల్‌అండ్‌టీ, భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌, హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, బీఈఎంఎల్‌ లాంటి సంస్థలన్నీ బెంగళూరు కేంద్రంగా ఆయుధ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. అయితే, ఈసారి ప్రదర్శనల్లో మాత్రం అందరి దృష్టీ మేడిన్ ఇండియా ఉత్పత్తులపైనే.. మరీ ముఖ్యంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్, శత్రుభీకర యుద్ధ విమానం తేజస్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఏరో ఇండియా అంటే జస్ట్ ఎయిర్ షో కాదు.. బిలియన్ ఆపర్చునిటీలకు అద్భుతమైన రన్‌వే. ఈ మాట ప్రధాని మోడీ చెప్పిందే. దాదాపు 100 దేశాలు ఏరో ఇండియాలో పాల్గొంటున్నాయంటే.. భారత్‌పై ప్రపంచం ఎంత నమ్మకం పెట్టుకుందో అర్ధం చేసుకోవచ్చని కూడా మోడీ అన్నారు. విదేశీ రక్షణ ఉత్పత్తులకు మార్కెట్‌గానే కాకుండా, పలు దేశాలకు రక్షణ భాగస్వామిగా కూడా భారత్ ఉందని ప్రధాని గుర్తుచేశారు. అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు.
ది రన్‌‌వే టు ఎ బిలియన్‌ ఆపర్చునిటీస్ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య దాదాపు 75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ వెల్లడించారు. LCA Tejas Mk 1A ఫైటర్లను అర్జెంటీనా, మలేషియాలకు విక్రయించి మంచి డీల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా శత్రువు అంతుచూసే లైట్ వెయిటర్ హెలికాప్టర్ ప్రచండ్‌ను కూడా ఇతర దేశాలకు విక్రయించే అవకాశాలున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ రెండూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినవే కావడంతో ప్రపంచ ఆయుధ మార్కెట్‌లో ఇండియా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
నిజానికి.. దశాబ్దాలుగా అతిపెద్ద రక్షణ దిగుమతిదారుగా ఉన్న భారత్ ఇప్పుడు 75 దేశాలకు రక్షణ పరికరాలు ఎగుమతి చేస్తోంది. దీనికి ప్రధాన కారణం గత ఐదేళ్లలో వచ్చిన మార్పులే. గత ఐదేళ్లుగా భారత రక్షణ రంగానికి అవసరమైన ఉత్పత్తుల్లో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే. ఆత్మనిర్భర్‌ నిధులతో రక్షణ రంగం సాధించిన ప్రగతి వేదిక ద్వారా.. ప్రపంచ స్థాయి రక్షణ ఉత్పత్తులనే ఇప్పుడు ఏరో ఇండియాలో ప్రదర్శిస్తున్నారు. అయితే, ఇది కేవలం ప్రారంభం మాత్రమే.. అసలు లక్ష్యాలన్నీ వచ్చే రెండేళ్ల కాలంపైనే. 2024-25 నాటికి రక్షణ ఎగుమతులను అక్షరాలా 5 బిలియన్‌ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి తొలి అడుగుగా ఏరో ఇండియా నిలవబోతోందనడానికి ఇప్పుడు జరగబోయే 75వేల కోట్ల రూపాయల ఒప్పందాలే ఉదాహరణ.
ఆయుధాల ప్రదర్శన, ఇతర దేశాలతో డీల్స్ మాత్రమే కాదు.. ఏరో ఇండియా మరెన్నో అద్భుత అవాకాశాలకు నిజంగానే రన్‌వేగా మారబోతోంది. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సాంకేతిక మార్పులు తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎలక్ట్రానిక్‌ యుద్ధ నైపుణ్యాలు, కమ్యూనికేషన్లలో మార్పులు, సీసీటీవీ సెక్యూరిటీ, బుల్లెట్‌ఫ్రూఫ్‌ జాకెట్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లు, హెలికాప్టర్లు, ఆయుధాలు… ఇలా చాలా అంశాలు తెలుసుకునేందుకు ఏరో ఇండియానే సరైన వేదిక. ఇదే సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శన ద్వారా మనకున్న అత్యాధునిక యుద్ధ విమానాలు, పైలట్ల సత్తా ప్రపంచానికి చాటిచెప్పినట్లు అవుతుంది. నిజానికి.. భారత్‌కు ఆయుధాలు, రక్షణ సామగ్రి విక్రయించాలనే ఉద్దేశంలో ఏరో ఇండియాకు గతంలో పెద్ద సంఖ్యలో విదేశీ సంస్థలు హాజరయ్యేవి. కానీ ఇటీవల కాలంలో భారత సంస్థల భాగస్వామ్యం పెరుగుతోంది. రక్షణ తయారీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న దేశీయ కంపెనీలు ఈ ప్రదర్శనను వినియోగించుకుంటున్నాయి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారయిన తేజస్‌ యుద్ధ విమానంపై చాలా దేశాలు ఆసక్తి చూపుతున్నాయంటేనే పరిస్థితుల్లో ఎలాంటి మార్పొచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాల ద్వారా దేశంలోని రక్షణ రంగ పరిశ్రమలను ప్రోత్సహించే అవకాశం మరింత పెరుగుతోంది.
రక్షణ పరికరాల తయారీలో దేశీయ సంస్థల పాత్ర పెరుగుతోంది. సైన్యానికి ఆయుధ సామగ్రి, విడిభాగాలను విదేశాల నుంచి తెప్పించుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. అవసరమైన సామగ్రి అనుకున్న సమయానికి రాకపోవచ్చు. అందువల్ల విడిభాగాలను ఎక్కువగా నిల్వ చేసుకోవాల్సి వస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఇక్కడి సంస్థలను విస్తరించడమే మార్గం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశీయ కంపెనీలను ఎంతగానో ప్రోత్సహిస్తోంది. హెచ్‌ఏఎల్‌, డిఫెన్స్‌ పీఎస్‌యూలు, ప్రైవేటు కంపెనీల ద్వారా అవసరమైన విడిభాగాలు, ఉపకరణాలను తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఆవిష్కరించిన ‘ఆఫ్‌సెట్‌ క్లాజ్‌’, ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ లాంటి సంస్కరణలు దీనికి వీలు కల్పిస్తున్నాయి. దేశీయ అవసరాలు తీర్చడమే కాకుండా, ఎగుమతుల వైపు దృష్టి సారించే స్థాయికి దేశీయ రక్షణ రంగ సంస్థలు కొద్ది కొద్దిగా చేరుకుంటున్నాయి. అందుకే మరో రెండేళ్ల కాలంలోనే 5 బిలియన్ డాలర్ల ఎగుమతులు లక్ష్యంగా అడుగు లేస్తున్నట్టు మోడీ ప్రకటించారు.
ఇక.. ఏరో ఇండియాలో మోడీ సర్కార్ మరో అంశాన్ని కూడా టార్గెట్ చేస్తోంది. 2030 నాటికి భారత్‌ను ప్రపంచ డ్రోన్ హబ్‌గా మార్చాలని లక్ష్యానికి ఈ కార్యక్రమం ద్వారా అడుగులు పడినట్టే అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మిలటరీ డ్రోన్ల విషయంలో ఇండియా అగ్రశ్రేణి జాబితాలోకి చేరింది. తపస్, ఘాతక్ లాంటి పూర్తి స్వదేశీ మానవరహిత డ్రోన్లు తాజా ఏరో ఇండియాలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన పూర్తయిన తర్వాత తపస్ ఇండియన్ ఆర్మీలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. మరికొన్ని నెలల్లోనే శత్రుభీకర ఘాతక్‌ కూడా ఆర్మీ అమ్ములపొదిలే చేర్చేందుకు ప్రయత్నాలు వేగంగా జరుగుతున్నాయి. అందుకే ఏరో ఇండియాలో భారత డ్రోన్లు కూడా ప్రపంచాన్ని ఆకట్టుకోవడం ఖాయం. ఇలా ఏ రకంగా చూసినా బెంగళూరు ఏరో ఇండియా భారత్‌కు అద్భుత అవకాశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

భారత్ కు పొంచి ఉన్న భారీ భూకంపం ముప్పు

భూకంపం.. మనిషి నియంత్రించలేని ప్రకృతి విపత్తుల్లో అత్యంత ఘోరమైన మరియు అత్యంత శక్తివంతమైన విపత్తు. ఒక దేశం లేదా ఒక ప్రాంతం దశాబ్ధాల పాటు సాధించిన అభివృద్ధిని.. యెన్నో లక్షల కోట్ల సంపదను క్షణాల్లో తుడిచిపెట్టేయగలదు. టర్కీలో జరిగిన ఈ విషాదం మనం చూస్తునే ఉన్నాం. మళ్ళీ టర్కీ మునుపటి పరిస్థితికి రావటానికి ఎన్నేళ్ళు శ్రమించాలో. భారత్ లోని గుజరాత్ లో 2001 రిపబ్లిక్ డే నాడు సంభవించిన భూకంపం.. ఆ రాష్ట్రాలన్ని కనీసం 20 యేళ్ళు వెనక్కి తీసుకెళ్ళింది. మళ్ళీ కోలుకోటానికి గుజరాత్ కు చాలా కాలమే పట్టింది. ఇప్పుడు భారత దేశం ఇదే పెను విపత్తును మున్ముందు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు నిపుణులు.
టర్కీ భూకంపం గురించి ఫ్రాంక్ అనే సైంటిస్టు ముందుగానే ట్వీట్ ద్వారా హెచ్చరిక చేశాడు. త్వరలోనే సౌత్ సెంట్రల్ తుర్కియే, జోర్దాన్, సిరియా లెబెనాన్ కేంద్రంగా 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించే ఛాన్స్ ఉన్నట్టు ఆ ట్వీట్‌లో చెప్పారు. ఐతే, ఈ ట్వీట్ తర్వాత అతనిపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. మరి కొంతమంది అయితే ఎగతాళి చేశారు. ఎవ్వరూ ఫ్రాంక్ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోలేదు. కానీ, ఫ్రాంక్‌ ట్వీట్ చేసిన మూడు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 6న నిజంగానే తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో ఫ్రాంక్‌ హూగర్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. చాలా దేశాల మీడియా సంస్థలు ఆయనతో ఇంటర్వ్యూలు చేయడం మొదలైంది. ఈ క్రమంలోనే భారత్‌లో భూకంపం వచ్చే అవకాశముందా అని ఫ్రాంక్‌ను ఇండియా టూడే క్వశ్చన్‌ చేసింది. ఈ ప్రశ్నకు డచ్ సైంటిస్ట్ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు కోట్లాది మంది భారతీయులను టెన్షన్ పెడుతోంది.
తుర్కియే, సిరియా భూకంపాన్ని ముందే పసిగట్టిన ఫ్రాంక్.. భారత్‌లోనూ ఇదే తరహా భూకంపం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఒక్క భారత్‌ మాత్రమే కాదు మన పొరుగు దేశాలైన అఫ్ఘానిస్తాన్‌, పాకిస్తాన్, చైనా ప్రాంతంలో కూడా భారీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు‌. 2001లో వేల మందిని పొట్టన పెట్టుకున్న గుజరాత్ భూకంపం ఇంకా కళ్లముందే కదలాడుతోంది. 2001కచ్ భూకంపం దేశంలో మూడో అతిపెద్దది. ఈ విధ్వంసంలో వేల మంది మరణించారు. లక్షా 67 వేలమందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఇప్పుడు ఫ్రాంక్ అంచనాలు ఆనాటి భూప్రళయానికి ఏమాత్రం తీసిపోని భూకంపం మళ్లీ రావచ్చనేవే. ఐతే, ఇది ఛాన్స్ మాత్రమేననీ.. ఇందులో ఖచ్చితత్వం లేదంటున్నారు. భారత ప్రభుత్వం తనను సంప్రదిస్తే.. తన దగ్గరున్న వివరాలను పంచుకోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నానన్నారు‌. ఐతే, ఫ్రాంక్ ఒక్కరే కాదు.. భారత్‌కు భారీ భూకంప ముప్పు పొంచి ఉందన్న అంచనాలు ఇప్పటికే చాలా మంది సైంటిస్టుల నుంచి వినిపించాయి. భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనాలకూ భూకంప ముప్పు ఉందన్న హెచ్చరిక ఫ్రాంక్ నోటిమాటగా చెప్పింది కూడా కాదు.. ఈ దేశాలకు భూకంపం ముప్పు ఉందనడానికి అసలు కారణం వేరే ఉంది.
హిమాలయాస్.. ఇక్కడ భూమి కంపిస్తే ఏం జరుగుతుందో తెల్సా? 8లక్షల మంది.. అక్షరాలా
8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు. హిమాలయాలు కంపిస్తే భారత్‌తో పాటు పొరుగు దేశాల పునాదులు కూడా కదిలి పోతాయి. భూకంపం రావడానికి అసలుకారణం టెక్టానిక్ ప్లేట్ల మధ్య కదలికలే.. గతకొన్నేళ్లుగా ఇండియన్ టెక్టానిక్ ప్లేట్, ఆసియా టెక్టానిక్ ప్లేట్ మధ్య ఘర్షణ తీవ్రమవుతుందని పరిశోధనల్లో తేలింది. టిబెట్ పీఠభూమి ఎత్తును కొనసాగిస్తూ.. భారత ప్లేట్ ఏడాదికి 47 మిల్లీమీటర్ల చొప్పున కదులుతోంది. ఇది హిమాలయ, ఆల్టిన్ టాగ్, టియన్ షాన్ పర్వతాలను విచ్ఛిన్నం చేస్తుంది. దీని కారణంగా హిమాలయాల ఎత్తు పెరగడంతో పాటూ చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తున్నాయి. అవి తీవ్రమైతే ఏర్పడే భూకంపాన్ని తట్టు కోవడం అసాధ్యం. బహుశా డచ్ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ కూడా తన రీసెర్చ్‌లో ఇదే తెలుసుకుని ఉండొచ్చు. అందుకే భారత ప్రభుత్వం అనుమతిస్తే తన దగ్గరున్న వివరాలు అందిస్తానని చెప్పి ఉంటారనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ హిమాలయ పర్వత శిఖరాల్లో సంభవించే భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 8 పాయింట్లు నమోదైతే కనుక సుమారు 8 లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనేది ఎక్స్‌పర్ట్స్‌ అంచనా. హిమాచల్‌ప్రదేశ్ మండిలో భూకంపం సంభవిస్తే చండిఘర్‌లో 20 వేల మంది ప్రాణలకు ముప్పు ఏర్పడుతుందట. హిమాలయ పర్వత శ్రేణులకు ఆనుకుని ఉండే రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణచల్ ప్రదేశ్ వరకూ గత 53 సంవత్సరాల్లో భూకంప తీవ్రత చాలా ఉధృతంగా ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఆ తీవ్రత పెరిగి భూమి కదిలితే 1950 తర్వాత ఇదే అతిపెద్ద భూప్రళయంగా మిగులుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు భారతదేశంలో 1950లో భారత్-చైనా స‌రిహ‌ద్దులో 8.6 మ్యాగ్నిట్యూడ్‌తో వ‌చ్చిన భూకంప‌మే అతిపెద్ద‌దని రికార్డులు చెబుతున్నాయి. దీని భూకంప కేంద్రం భూమిలోప‌ల 30 కిలోమీట‌ర్ల లోతులో ఉన్న‌ట్లు శాస్త్రవేత్త‌లు గుర్తించారు. అలాగే, వ‌ర‌ల్డ్ డేటా స‌ర్వీస్ లెక్క‌ ప్ర‌కారం 1950 నుంచి 2021 మధ్య కాలంలో 71 సార్లు రిక్టర్ స్కేల్‌పై 3.8, ఆ పైస్థాయి తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇవి కాకుండా త‌క్కువ మ్యాగ్నిట్యూడ్‌తో వ‌చ్చిన‌వి వంద‌ల సంఖ్య‌లో ఉంటాయ‌ని భూగ‌ర్భ ప‌రిశోధ‌న శాస్త్రవేత్త‌లు చెబుతున్నారు.
మరోవైపు.. హిమాలయ పర్వతాల్లో అతిపెద్ద భూకంపం సంభవిస్తే.. దానికి తగ్గట్టుగా ప్రాథమిక
న‌ష్టాన్ని అంచ‌నా వేసుకుని ఏం చేయాల‌నే విష‌యమై జాతీయ విప‌త్తుల యాజ‌మాన్య సంస్థ నిర్దిష్ట ప్ర‌ణాళిక రూపొందించుకుంది. భూకంపాల ప్రభావ తీవ్రత‌ను త‌గ్గించడంపై అన్ని రాష్ట్రాల‌లోని జాతీయ విప‌త్తుల యాజ‌మాన్య సంస్థల‌తో చ‌ర్చించుకుని ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నారు. భార‌త్‌లో జోన్‌-1 అనేది లేదు. అందువ‌ల్ల అన్ని ప్రాంతాల్లో భూకంపం సంభ‌వించే ముప్పుంది. నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ సిస్మాల‌జీ ప్ర‌కారం.. భూకంప ముప్పు తీవ్రత అంచనాల ఆధారంగా భారత్‌ను మొదట్లో ఐదు జోన్లుగా విభ‌జించారు. 1993లో వ‌చ్చిన కిల్లారి భూకంపం త‌ర్వాత జోన్‌-1ను జాబితా నుంచి శాస్త్రవేత్త‌లు తొల‌గించారు. ప్ర‌స్తుతం నాలుగు జోన్లు మాత్రమే ఉన్నాయి. దీని ప్ర‌కారం భార‌తదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఏదో ఒక సందర్భంలో భూకంపం వచ్చే ముప్పుంది. మ్యాగ్నిట్యూడ్ స్కేల్‌పై 1-4 తీవ్రతతో భూకంపం వ‌చ్చే అవ‌కాశం ఉంటే జోన్-2 ప‌రిధిలో ఉన్న‌ట్లు ప‌రిగ‌ణిస్తారు. మ్యాగ్నిట్యూడ్ స్కేల్‌పై 5తో భూకంపం వ‌స్తే జోన్‌-3 కేట‌గిరీలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 6,7తో వ‌స్తే జోన్‌-4 ప‌రిధిలో ఉంటుంది. మ్యాగ్నిట్యూడ్ 7కంటే ఎక్కువ తీవ్ర‌త‌తో వ‌స్తే జోన్‌-5లో ఉంటుంది. దీని ప్ర‌కారం జోన్‌-5లోని ప్రాంతాల‌లో ఎక్కువ మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపాలు సంభ‌వించే అవ‌కాశం ఉంటుంద‌న్నారు.
ఇదిలా ఉంటే.. వ‌ర‌ల్డ్ బ్యాంక్, ఐక్య‌రాజ్య స‌మితి అంచ‌నా ప్ర‌కారం 2050 నాటికి భారత దేశంలో 20 కోట్ల మంది భూకంపాల ముప్పు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జీవిస్తారని అంచ‌నా. ఐతే, వాస్త‌వ లెక్క‌ల ప్ర‌కారం ఈ సంఖ్య 25-30 కోట్ల‌కు చేర‌వ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్న‌మాట‌. గత 150 ఏళ్లలో హిమాలయ ప్రాంతాల్లో నాలుగు భారీ భూకంపాలు వచ్చాయి. రానున్న రోజుల్లో కూడా భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లు ప్రిపేర్ అయి ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఏదేమైనా భారత్‌కూ భారీ భూకంప ముప్పుందన్న డచ్ సైంటిస్ట్‌ ఫ్రాంక్ హూగర్ బీట్స్ అంచనాలై యంత్రాంగం అలర్ట్ కావాల్సిన టైం వచ్చినట్టు కనిపిస్తోంది.

అదానీ వ్యవహారంపై మోడీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్

భారత్ లో ప్రకంపనలు సృష్టించి స్టాక్ మార్కెట్ పతనానికి కారణమైన అదానీ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ఎట్టకేలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అంగీకరించింది. హిండెన్ బర్గ్ నివేదిక.. అదానీ షేర్ల పతనం.. అకౌంటింగ్ ఆరోపణలు.. ఇలా అన్నింటిపై విచారణ జరిపించేందుకు నిపుణుల కమిటీని నియమించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కమిటీలో సభ్యులుగా ఉండాల్సిన వాళ్ళను సూచించాలని కూడా కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కమిటీ సభ్యుల పేర్లను సీల్డ్ కవర్ లో పంపాలని.. మిగతా అంశాలపై రెండు రోజుల్లో నివేదిక అందజేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. అదానీ వ్యవహారంపై ఈ రోజు సాయంత్రం సుప్రీంలో జరిగిన విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై విచారణ ఈ నెల 17కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సుప్రీం ముందు హాజరైన తుషార్ మెహతా.. అదానీ గ్రూపు నష్టాల వల్ల భారత మార్కెట్లపై పడిన ప్రభావాన్ని సెబీ ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాన్ని కాపాడేందుకే తాము అదానీ వ్వహారంపై కమిటీ వేసేందుకు అంగీకరిస్తున్నామని ఆయన చెప్పారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే అదానీ గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక మీద సెబి, కేంద్ర హోంశాఖ దర్యాప్తు చేయాలని కోరుతూ మనోహర్ లాల్ శర్మ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

సీన్ రివర్స్ : పుతిన్ తో పెట్టుకున్న పాకిస్తాన్

పాకిస్తాన్ లో పరిస్థితులు ఎంతగా దిగజారినా ఆ దేశ పాలకులకు బుద్ధి రావటం లేదు. జనం ఒక్క పూట భోజనం కోసం తుపాకీలకు ఎదురు వెళ్ళాల్సిన పరిస్థితుల్లోనూ ఆ జనం గురించి ప్రధాని షెహబాద్ షరీఫ్ కు పట్టింపే లేకుండా పోయింది సరికదా.. జనాన్ని గాలికి వదిలేసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాడు. ఉక్రెయిన్ కీలక నగరాలను మిసైల్ దాడులతో రష్యా అతలాకుతలం చేస్తున్న వేళ.. ఉక్రెయిన్ కు పాకిస్తాన్ ప్రభుత్వం ఆయుధ సాయం పంపింది. 12 వేల మిసైల్స్ తో పాటు భారీగా తుపాకులను, బుల్లెట్ షెల్స్ ను సముద్ర మార్గం ద్వారా మూడోకంటికి తెలియకుండా ఉక్రెయిన్ చేరవేసింది పాకిస్తాన్. అన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ విషయాన్ని ప్రముఖ వార్తగా ప్రచురించాయి. పాకిస్తాన్ లోని అన్ని ఆయుధ డిపోలలో ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ ను, మెషీన్ గన్స్ మరియు వాటి బుల్లెట్లను కరాచీ పోర్టు నుంచి పోలండ్ దేశానికి తరలించి అక్కడి నుంచి ఉక్రెయిను తరలించినట్టు పలు ఇంటర్నేషనల్ మ్యాగజైన్లలో కథనాలు వెలువడ్డాయి.
ఈ కథనాలు అమెరికా, రష్యా దేశాలను షాక్ కు గురి చేశాయి. తమ దేశం కరువులో ఉన్నదనీ.. కాబట్టి చౌక ధరకు తమకు ఆయిల్ ఆండ్ గ్యాస్ సరఫరా చేయాలంటూ పాకిస్తాన్ ప్రభుత్వం గత కొద్ది నెలలుగా రష్యాను బతిమిలాడుతోంది. కానీ పాకిస్తాన్ కు ఎలాంటి సబ్సిడీ ఇచ్చేందుకు పుతిన్ ఒప్పుకోలేదు. ఓ వైపు సాయం కోసం రష్యాను బతిమిలాడుతూ మరోవైపు రష్యా శతృవుకు సాయం చేయటం పాకిస్తాన్ కుటిల నీతికి నిదర్శనం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై యేడాది కావస్తున్న వేళ.. ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేసీ చేసీ యూరపియన్ యూనియన్, అమెరికాలు భారీగానే నష్టపోయాయి. అయినా పుతిన్ వెనక్కి తగ్గకపోవటంతో ఆర్థికంగా మరింత చితికిపోవటం ఇష్టం లేని యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్ కు సాయం చేయటాన్ని నిలిపివేశాయి. ప్రతిపక్షాలు ఆగ్రహించటంతో బైడెన్ సైతం ఉక్రెయిన్ కు ఆయుధ సాయానికి బ్రేక్ వేశాడు.
యుద్ధ వాతావరణం చల్లబడి.. భారత్ లాంటి దేశం మధ్యవర్తిత్వం వహిస్తే ఉక్రెయిన్ రష్యా ఘర్షణలు ఓ కొలిక్కి వస్తాయని అమెరికాలాంటి దేశాలు బహిరంగంగా కోరుతున్న సమయంలో.. పాకిస్తాన్ ఈ సాహసానికి పాల్పడటం నిజంగా ఊహించని పరిణామమే. మోడీ చెప్తే పుతిన్ వింటాడనీ.. మోడీ మధ్యవర్తిత్వం వహిస్తే రష్యా యుద్ధం ఆపేస్తుందనీ.. కాబట్టి మోడీ రంగంలోకి దిగాలనీ బైడెన్ మీడియా ముఖంగా చెప్పాడు. నేడో రేపో చర్చలు జరుగుతాయని ఆశిస్తున్న ఇలాంటి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా పాకిస్తాన్ ఉక్రెయిన్ కు సాయం చేయటం యుద్ధాన్ని మరింత రెచ్చగొట్టినట్టే. దీనిపై పుతిన్ ఇంకా రియాక్ట్ కాలేదు. ఉక్రెయిన్ కు సాయం చేసే విషయంలో యూరోపియన్ యూనియన్ దేశాలకూ.. అమెరికాే గట్టి హెచ్చరికలు చేసిన పుతిన్.. పాకిస్తాన్ పై ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

“నాతో మజాగ్ చెయ్యొద్దు” : వార్నింగ్ ఇచ్చిన వెంకటేష్

బిగ్ మిస్టేక్ నహీ కర్నా నెట్ ఫ్లిక్స్.. అంటూ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కు విక్టరీ వెంకటేష్ భారీ వార్నింగ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న రానా నాయుడు త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హీరో ఎవరు.. నేను.. స్టార్ ఎవరు.. నేను.. అందంగా కనిపించేది నేనే.. ఫ్యాన్స్ మొత్తం నా వాళ్ళే.. అలాంటప్పుడు ఈ షో కు నాగా నాయుడు అని పేరు పెట్టాలి కానీ.. రానా నాయుడు అని పేరు పెట్టడం ఏంది.. మజాగ్ మజాగ్ చేస్తే అబ్దుల్ రజాక్ అయిపోద్ది.. బాప్ అయిన నాతోనే ఆటలా.. అంటూ వెంకీ హిందీలో వార్నింగ్ ఇస్తున్న సెల్ఫీ వీడియోను అభిమానులు తెగ వైరల్ చేసేస్తున్నారు. వెంకీ తన అఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ వీడియో పోస్ట్ చేశాడు.
రానా నాయుడులో వెంకటేష్, రానా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో వెంకీ క్యారెక్టర్ పేరు నాగా నాయుడు. అమెరికాలో రిలీజై సూపర్ హిట్ కొట్టిన రే డోనోవన్ టీవీ సిరీస్ కు ఇది అఫీషియల్ రీమేక్. ఇందులో ఇద్దరూ కలిసి నటిస్తున్నట్టు రానా గతంలోనే అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకేలో ఇదివరకే చెప్పేశాడు. దీని కోసం ఇద్దరూ హిందీని ప్రాక్టీస్ చేయాల్సి వస్తోందని అప్పుడే చెప్పాడు రానా. లేటెస్ట్ గా వెంకీ విడుదల చేసిన ఫన్నీ వీడియోలో వెంకీ మాస్ హిందీలో అదరగొట్టేశాడు. బాప్ సే పంగా నహీ లేనా అంటూ తుపాకీ చేతులో పట్టుకొని వెంకీ వార్నింగ్ ఇవ్వటం చూస్తుంటే.. రానా నాయుడులో వెంకీ మాస్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో ఊహించవచ్చు. అయితే.. ఇది ఎప్పుడు విడుదల అవుతుందనేది మాత్రం ఇప్పటి వరకు మేకర్స్ అనౌన్స్ చేయలేదు.

టర్కీలో హృదయ విదారక దృశ్యాలు

వారం క్రితం టర్కీ సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన భూకంపం ఆయా దేశాల చరిత్రలోనే అత్యంత పెద్ద విపత్తులుగా రికార్డయ్యాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 37వేలకు పైనే అని ఆయా దేశాల మీడియా చెప్తోంది. అయితే.. ప్రభుత్వం మాత్రం భూకంపంలో మరణించిన వారి సంఖ్యను అధికారికంగా వెల్లడించటం నిలిపివేసింది. మీడియా కథనాల ప్రకారం టర్కీలో 32 వేల మంది మరణించగా సిరియాలో సుమారు 5 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ఈ సంఖ్య ఇప్పటితో ఆగేలా లేదు. ఇంకా వేలాది భవనాల కింద వేలాది మంది చిక్కుకోని ఉన్నారు. వారిలో దాదాపు ఎవరూ ప్రాణాలతో ఉండే అవకాశం లేదని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
మృతదేహాలను ఖననం చేసేందుకు చేస్తున్న ఏర్పాట్లు చూస్తే గుండెలు అవిసిపోతాయి. మృతదేహాలను కుప్పలుగా క్రేన్లలో తరలించటం.. కుప్పలుగా పడేసి ఖననం చేస్తున్న దృశ్యాలను చూస్తున్న మృతుల కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారిపోయింది. ఊర్లే స్మశానాలుగా మారిన టర్కీ మరుభూమిని తలపిస్తోంది. ఇంత దారుణమైన దృశ్యాలను జీవితంలో చూడాల్సి వస్తుందని.. అది తమ కుటుంబ సభ్యుల మృతదేహాలకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదంటూ మృతుల బంధువులు తల్లడిల్లిపోతున్నారు. రోజులో సుమారు 18 గంటల పాటు మృతదేహాల ఖననం కొనసాగుతూనే ఉంది. మరోవైపు శిథిలాల కింద నలిగిపోయిన వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఛిద్రమైన శరీరాలను వెలికి తీస్తున్న క్రమంలో అక్కడే కోటి ఆశలతో తమ వారి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు తీవ్ర నిరాశతో పాటు విషాదమే మిగులుతోంది.
గత సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో తొలిసారి భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వరుసగా 3 రోజుల పాటు వందకు పైగా భూప్రకంపనలు సంభవించి సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం కలగజేశాయి. ఈ రోజు ఉదయం కూడా టర్కీలో 4.7 తీవ్రతతో భూమి కంపించింది.

ఎల్టీటీఈ పెద్దపులి ప్రభాకర్ బతికే ఉన్నాడట

శ్రీలంకను గజగజ వణికించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలమ్ వ్యవస్థాపకుడు వేలుపిళ్ళై ప్రభాకరన్ అలియాసస్ పెద్దపులి ప్రభాకర్ బతికే ఉన్నాడంటూ తమిళనాడు కాంగ్రెస్ నేత నెడుమారన్ వ్యాఖ్యానించటం తమిళనాట సంచలనంగా మారింది. తమిళుల హక్కుల పేరుతో శ్రీలంక ప్రభుత్వంతో యుద్ధం చేసిన ప్రభాకర్ ను 2009లో లంక సైన్యం హతమార్చింది. ప్రభాకరన్ తో పాటు అతడి కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపింది శ్రీలంక సైన్యం. కానీ నెడుమారన్ మాత్రం ప్రభాకరన్ బతికే ఉన్నాడనీ.. తనకు, తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం ఆయన టచ్ లోనే ఉన్నాడనీ చెప్తున్నాడు. ఎల్టీటీఈని మళ్ళీ పునరుద్ధరించి గత వైభ‌వం తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విలేఖరుల సమావేశంలో నెడుమారన్ చెప్పటం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మిగతా పార్టీ నేతలు మాత్రం స్పందించలేదు.
తమిళుల హక్కుల పేరిట దశాబ్ధాల పాటు శ్రీలంకలో ఎల్టీటీఈ ప్రభాకరన్ తిరుగుబాటు చేశాడు. అప్పట్లో ఎల్టీటీఈ ప్రపంచంలో ఎయిర్ ఫోర్స్ కలిగిన ఏకైక తీవ్రవాద సంస్థగా ప్రకటించబడింది. ఎల్టీటీఐ సైన్యం దాదాపు శ్రీలంక సైన్యానికి సమానంగా భావించే వారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని హతమార్చింది కూడా ఎల్టీటీఈ తీవ్రవాదులే. వీరి అరాచకాలు తీవ్రం కావటంతో శ్రీలంక సైన్యం ఎల్టీటీఈపై మిలిటరీ యాక్షన్ ప్రకటించి దొరికిన వారిని దొరికినట్టు ఎన్ కౌంటర్ చేశారు. ఇదే దాడిలో వేలుపిళ్ళై ప్రభాకర్ అతని కుటుంబం అడవిలోని ఓ స్థావరంలో చిక్కటంతో శ్రీలంక సైనికులు వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేశారు. అనంతరం డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి చనిపోయింది ప్రభాకరనే అంటూ శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో ఎల్టీటీఈ ఇక లేదని చెప్పింది. కానీ సుమారు పద్నాలుగేళ్ళ తర్వాత ప్రభాకరన్ ప్రాణాలతో ఉన్నాడంటూ నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది.