ఓటర్ల జాబితా సవరణతో దేశవ్యాప్తంగా చాలా మంది ఓట్లు మాయం అవుతున్నాయంటూ ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న వేళ.. ఉత్తర్ ప్రదేశ్‌లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అమేథీ ఓటర్ల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఓటు కనిపించకుండా పోయింది. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో ఓటు వేసిన ఆమె.. తాజాగా పంచాయతీ ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడంపై కంగుతిన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసలు ఏం జరిగిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం తీవ్ర చర్చనీయాంశమైంది. అమెథీ జిల్లాలోని స్థానిక పంచాయతీ ఓటర్ల జాబితాలో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరు కనిపించకపోవడం సంచలనంగా మారింది. ఈ నెల 10న యూపీ ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేసిన తుది పంచాయతీ ఓటర్ల జాబితాలో ఈ లోపం వెలుగుచూసింది. లోక్‌సభ, అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉన్నప్పటికీ, స్థానిక గ్రామ పంచాయతీ లిస్టులో పేరు లేకపోవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గౌరీగంజ్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ‘మేదన్ మవాయ్’ గ్రామ పంచాయతీ పరిధిలో స్మృతి ఇరానీకి సొంత నివాసం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆమె ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఇదే గ్రామంలోని ‘లీలా తిక్రా’ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు.
పంచాయతీ ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం కలకలం రేపింది. ఈ విషయంలో ఏం జరిగిందో తెలుసుకోడానికి అమేథీ జిల్లా కలెక్టర్ సంజయ్ చౌహాన్ తక్షణ విచారణకు ఆదేశించారు. ఈ వివాదంపై గౌరీగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ప్రీతి తివారీ స్పందించారు. స్మృతి ఇరానీ ఓటు తొలగించటం అనేది అనుకోకుండా లేదా తెలియకుండా జరిగిందే తప్ప దీని వెనుక ఏ రాజకీయ కోణం లేదని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రూపొందించే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా వేరుగా ఉండటం వల్ల లోపం తలెత్తినట్లు అనుమానిస్తున్నారు. 2021 పంచాయతీ ఎన్నికల సమయానికి స్మృతి ఇరానీ ఈ గ్రామంలో ఓటరుగా లేకపోవడం వల్లే ఆమె ఓటు చేర్చలేదని..
లోక్‌సభ ఎన్నికలకు ముందు మాత్రమే స్మృతి ఇరానీ ఇక్కడ సాధారణ ఓటరుగా నమోదయ్యారని చెబుతున్నారు. స్మృతి ఇరానీ విషయంపై మేదన్ మవాయ్ గ్రామ మహిళా ప్రధాన్ ‘బబితా మిశ్రా’ స్పందించారు. స్మృతి ఇరానీ గ్రామంలోనే శాశ్వతంగా నివసిస్తున్నారని, ఆమె పేరు ఇప్పటికే అసెంబ్లీ ఓటర్ల జాబితాలో ఉన్నందున పంచాయతీ లిస్టులో కూడా చేర్చాలని కోరుతూ గౌరీగంజ్ నియోజకవర్గ ఎన్నికల అధికారికి లేఖ రాశారు. కాగా, బిజెపి అమేథీ జిల్లా అధ్యక్షుడు సుధాంశు శుక్లా కూడా ఈ అంశంపై స్పందిస్తూ.. స్మృతి ఇరానీ పేరును పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చడానికి అవసరమైన అధికారిక దరఖాస్తును సమర్పించామని తెలిపారు. జరిగిన దానిపై పూర్తి విచారణ జరిపిస్తామనీ.. త్వరలోనే స్మృతి ఇరానీ పేరు మళ్ళీ ఓటర్ల జాబితాలో చేర్చుతామని అధికారులు చెప్తున్నారు
