జాతుల మధ్య వైరంతో మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ అదుపులో ఉంది. ఎక్కడ చూసినా కత్తులు, ఏకే 47 తుపాకులతో జనం కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటించేందుకు వెళ్ళారు. తొలుత హెలీకాప్టర్ లో మణిపూర్ కు వెళ్ళనున్నట్టు చెప్పిన రాహుల్.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా మణిపూర్ లోని ఇంఫాల్ కు చేరుకునే ప్రయత్నం చేశారు. ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో పోలీసులు రాహుల్ గాంధీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవని చెప్పిన పోలీసులు.. రాహుల్ కాన్వాయ్ తో సహా తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన రాహుల్.. చివరకు ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్ళిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో రాహుల్ పర్యటించాలని చూడటం సరికాదంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అల్లర్లను, సంఘర్షణలను కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. వేర్వేరు తెగల వారికి వేర్వేరు చట్టాలు అమలు చేయటమే ఈ సమస్యకు మూలం. కుకీ తెగ వాళ్ళను పొరుగున ఉన్న మణిపూర్ వేర్పాటు వాదులు రెచ్చగొట్టి అల్లర్లకు ఎగదోస్తున్నారు. మణిపూర్ ను అల్లకల్లోలం చేయటమే లక్ష్యంగా కుకీ తెగ వారికి ఏకే 47 తుపాకులను, గ్రెనేడ్ లను సప్లై చేస్తున్నారు మయన్మార్ తీవ్రవాదులు. ఎన్ని రోజులుగా ప్రయత్నించినా మణిపూర్ లో పరిస్థితి సద్దుమణగటం లేదు. ఒక్క నిముషం పాటు పోలీసులు, ఆర్మీ కళ్ళు మూసుకున్నా మళ్ళీ రణరంగంగా మారుతుంది మణిపూర్. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటించాలని వెళ్ళటం వివాదాన్ని మరింత పెంచటమే అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంకా రాహుల్ ఇంఫాల్ లోనే ఉన్నాడు. వీలైతే హెలీకాప్టర్ లో మణిపూర్ లో పర్యటించాలని అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాడు.