కాకినాడ జిల్లా తునిలో గత కొద్ది రోజులుగా సంచలనంగా మారిన మూడేళ్ళ చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అదృశ్యమైన చిన్నారి జాడ కనుక్కునేందుకు ఉపయోగపడుతుందనుకున్న పెంపుడు కుక్క అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. పాపను కనిపెట్టేందుకు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ కట్టి దాన్ని అడవిలో వదిలిపెట్టారు. అది పాపను వెతుక్కుంటూ వెళ్ళి ఒక వేళ పాప ఆచూకీ కనిపెడితే.. ఆ జీపీఎస్ ట్రాకర్ ద్వారా పాపను కనిపెట్టొచ్చని భావించారు పోలీసులు. కానీ కుక్కను అడవిలోకి వదిలిని కొద్ది గంటల్లోనే అది చనిపోయింది. ఇన్ని రోజులు అడవిలో తిరిగి ఇంటికి క్షేమంగా వచ్చిన కుక్క.. జీపీఎస్ ట్రాకర్ అమర్చిన తర్వాత ప్రాణాలు కోల్పోవటం అనుమానాలకు తావిస్తోంది. అడవిలోకి వెళ్ళిన కుక్క సుమారు 8 కిలోమీటర్ల మేర తిరిగి తిరిగి ఇంటికి వచ్చింది. అడవిలో తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చిన కుక్క.. ఆహారం తీసుకోకపోవటం వల్లనే చనిపోయిందని భావిస్తున్నారు. అయితే.. ఇప్పటికీ జ్ఞానేశ్వరి ఆచూకీ మాత్రం తెలియలేదు.
వారం రోజుల క్రితం మూడేళ్ల చిన్నారి జాహ్నవి తన పెంపుడు కుక్కతో కలిసి ఇంటి బయట ఆడుకునేందుకు వెళ్ళింది. అయితే, ఆ తర్వాత ఆ చిన్నారి ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. బాలిక అదృశ్యమైన మూడు రోజుల తర్వాత పెంపుడు కుక్క మాత్రం అనూహ్యంగా తిరిగి ఇంటికి వచ్చింది. కానీ, మూడేళ్ల జాహ్నవి ఆచూకీ మాత్రం లభించలేదు. చిన్నారిని కనిపెట్టేందుకు సుమారు 200 మంది పోలీసు సిబ్బంది, స్నిఫర్ డాగ్స్ రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
చిన్నారితో పాటు వెళ్లి, మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చిన పెంపుడు కుక్కే ఈ కేసుకు కీలకమని పోలీసులు భావించారు. దానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చి, బాలిక జాడ కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఆ కుక్కను బయటకు వదిలిన మరుసటి రోజే అది ఉన్నట్టుండి ప్రాణాలు కోల్పోవడం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ట్రాకర్ అమర్చిన వెంటనే కుక్క చనిపోవడం వెనుక ఎవరిదైనా కుట్ర ఉందా? బాలికను ఎవరైనా కిడ్నాప్ చేశారా? చిన్నారి కుటుంబానికి ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
