Home Blog Page 35

450 మంది భారతీయులను తొలగించిన గూగుల్

పెద్ద కంపెనీల్లో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. దిగ్గజ సంస్థ గూగుల్ ఈసారి 450 మంది ఇండియన్ ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ ఉద్యోగులకు రాత్రి ఈ మెయిల్ ద్వారా తొలగిస్తున్నట్టు మెయిల్ వచ్చింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా నుంచి మెయిల్ వచ్చినట్టు హిందూ బిజినెస్ లైన్ కథనం ప్రచురించింది. గత నెలలోనే గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తూ భారీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి లేఆఫ్ పేరిట మరి కొంత మంది ఉద్యోగులను తొలగిస్తోంది. ఉద్యోగాల నుంచి తొలగించబడిన కొంత మంది లింక్డ్ ఇన్ లో ఈ విషయాన్ని పేర్కొంటూ కొత్త ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్తున్నారు.
గత నెలలోనే గూగుల్ సహా దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగుల ఉద్వాసన పర్వాన్ని ప్రారంభించాయి. గూగుల్, అమేజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, ట్విటర్.. ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల నుంచి లేఆఫ్ ల వల్ల తొలగించబడిన వారి సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి. అయితే.. ఈ ఉద్యోగాల తొలగింపు ఇక్కడితో ఆగిపోతాయా లేక మరింత మంది ఉద్యోగులను తొలగిస్తారా అనేది మాంద్యం తీవ్రతపై ఆధారపడి ఉండనుంది.

ఇండియన్ ఆర్మీకి జెట్ ప్యాక్ సూట్లు : చూస్తే నమ్మశక్యం కాదు

ఇండియన్ ఆర్మీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు ఊపందుకున్నాయి. కొద్ది రోజుల క్రితం ఇండియన్ ఆర్మీకి జెట్ ప్యాక్ సూట్లు అందజేసే ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో ముందడుగు పడింది. అత్యాధునిక జెట్ ప్యాక్స్ ను ఇండియన్ ఆర్మీకి అందజేసింది భారత ప్రభుత్వం. ఈ జెట్‌ప్యాక్స్‌ను బెంగళూరుకు చెందిన అబ్సొల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఆ కంపెనీ వీటిని భారత సాయుధ దళాల కోసం ఈ జెట్‌ప్యాక్‌ను రూపొందించింది. చాలా మంది భవిష్యత్తులో ఈ జెట్‌ప్యాక్‌లను రెస్క్యూ ఆపరేషన్‌లు, అర్బన్ ఆగ్మెంటెడ్ కంబాట్, హిట్-అండ్-రన్ రైడ్‌ వంటి వాటికి ఉపయోగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు. భారత్ కూడా తన సొంత బ్యాచ్ జెట్‌ప్యాక్‌లను కొనుగోలు చేయాలని చూస్తోంది. గత నెలలో రక్షణ మంత్రిత్వ శాఖ బై ఇండియన్ కేటగిరీ కింద ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ ద్వారా అత్యవసరంగా 48 జెట్‌ప్యాక్ సూట్‌లు కావాలని రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ పెట్టింది. రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌ ప్రకారం.. జెట్‌ప్యాక్‌లు మైదానాలు, పర్వతాలు, ఎడారులు, ఎత్తైన ప్రాంతాల్లో 3వేల మీటర్ల ఎత్తు వరకు పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆయా కంపెనీలకు ప్రతి పాదనలు సమర్పించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి 17 వరకు గడువు ఇచ్చింది. జెట్‌ప్యాక్‌ తయారీలో స్వదేశీ భాగాలు తప్పనిసరిగా 60 శాతం కంటే ఎక్కువ లేదా సమానంగా ఉండాలని కండిషన్ పెట్టింది. గరిష్టంగా కనీసం 50 కిలోమీటర్ల వేగం అందించాలని, పేలోడ్ సామర్థ్యం కనీసం 80 కేజీలు ఉండాలని పేర్కొంది.
మరోవైపు.. బెంగళూరు అబ్సొల్యూట్ కంపోజిట్ ప్రైవేట్ లిమిటెడ్ తయారు చేసిన జెట్‌ప్యాక్ సూట్ వెనుక టర్బో ఇంజిన్‌తో సహా ఐదు ఇంజిన్‌లు ఉన్నాయి. టర్బోజెట్‌ల పనితీరును పోలిన ఇంధన వ్యవస్థలు జెట్‌ప్యాక్‌లో ఉన్నాయి. ఇందులో ఇంధనంతో మండించే చిన్నపాటి కంప్రెసర్లతో కూడిన టర్బో ఇంజిన్‌, 30 లీటర్ల డీజిల్‌ ట్యాంకు అమర్చారు. ఎయిర్‌ ఇన్‌లెట్‌ కాంపాక్ట్‌ ఫ్లయింగ్‌ మిషన్‌ విధానంతో ఎగిరే వ్యవస్థలు ఉన్నాయి. వీటిని ధరించిన సైనికుడు దాదాపుగా గంటకు 50 కిలోమీటర్ల వేగంతో 15 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలిగే వీలుంటుంది. వీటిని 70శాతం స్వదేశీ పరిజ్ఞానంతో, పేలోడ్‌తో కలిపి 80 కిలోల బరువుతో తయారు చేశారు. ఇప్పటికే 48 జెట్‌ సూట్‌లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు రక్షణ శాఖ ప్రతిపాదనల విభాగానికి పంపారు. వీటిని వచ్చేవారం పరీక్షించిన అనంతరం పూర్తిస్థాయిలో సైనిక సేవలకు వినియోగించేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఇక.. ఈ జెట్‌ప్యాక్స్ ఇప్పటివరకు తయారు చేసిన అత్యంత కాంపాక్ట్ ఫ్లయింగ్ మెషీన్ అని సంస్థ చెబుతోంది. దీని తయారీకి రెండేళ్ల సమయం పట్టినట్టు తెలిపారు.
అన్నీ అనుకున్నట్టు జరిగి జెట్‌ప్యాక్ సూట్స్ ఆర్మీ చేతికి అందితే.. మొదట చైనా సరిహద్దుల్లోని లడఖ్ లాంటి కఠినమైన ప్రాంతాల్లో వినియోగించే వీలుంది. అదే జరిగితే అక్కడి సైనికులకు ఇదో అద్భుత వరంగానే చెప్పాలి. భౌగోళికంగా లడఖ్‌ లాంటి ప్రాంతాల్లో నిఘా చర్యలు అంత ఈజీ కాదు. పైగా ఎమర్జెన్సీ సమయాల్లో ఈ సూట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. గత నెలలో జెట్‌ప్యాక్ సేట్లతో పాటు రోబిటిక్ మ్యూల్స్‌ను సైతం అత్యవసరంగా కొనుగోలు చేసేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధమైంది. హిల్ స్టేషన్లలో గస్తీ నిర్వహించే సైనికుల కోసం ఆహారం, చిన్నపాటి ఆయుధాలు, ఇతర అవసరాల కోసం చాలా కష్టపడాల్సి వస్తోంది. చాలా సందర్భాల్లో సమయానికి ఆయుధాలు, ఆహారం, మందులు లాంటివి అందక సైనికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితులకు చెక్ పెట్టడం కోసమే ఆర్మీ రోబోటిక్ మ్యూల్స్‌పై ఫోకస్ చేసింది. గతంలో ఇలాంటి అవసరాల కోసం గాడిదలను ఉపయోగించేవారు. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వాటినే వాడుతున్నారు. కానీ, మారుతున్న టెక్నాలజీతో పాటే దేశ రక్షణ పరికరాలు కూడా అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే రోబోటిక్ మ్యూల్స్‌ కొనుగోలుపై ఆర్మీ ఫోకస్ చేసింది.
ఈ రోబోటిక్ మ్యూల్స్ అచ్చం జంతువులలాగే నాలుగు కాళ్లతో నడుస్తాయి. వీటిని కూడా జెట్‌ప్యాక్ సూట్ల మాదిరిగానే స్వదేశీ కంపెనీ నుంచి మాత్రమే భారత సైన్యం కొనుగోలు చేస్తుంది. రోబోటిక్ మ్యూల్స్ దాని పొడవు, వెడల్పు, ఎత్తు ఒక మీటర్ వరకూ ఉంటుంది. అలాగే వాటి బరువు 60 కిలోల వరకు ఉంటుంది. దీనిని దాదాపు 4వేల మీటర్ల ఎత్తులో ఉపయోగించవచ్చు. సుమారు 10 సంవత్సరాల పాటు పని చేసేలా వీటిని నిర్మిస్తారు. 60 కిలోల బరువుండే ఒక్కో మ్యూల్‌.. 72 కిలోల బరువు వరకూ మోస్తాయని ఆర్మీ చెబుతోంది. ఇవి విశ్రాంతి లేకుండా 26 కిలోమీటర్లు పరుగెత్తగలుగుతాయి. రోబోటిక్ మ్యూల్ వేగం చాలా ఎక్కువ. అందుకే యుద్ధ సమయాల్లో సేనలకు చిన్నపాటి ఆయుధాలు అత్యవసరంగా చేరవేయడంలో ఇవి ఉపయోగపడతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, రష్యా యుద్ధమే. సుదీర్ఘంగా జరుగుతున్న ఈ యుద్ధంలో వేలమంది రష్యన్ సేనలు టైంకి ఆహారం, ఔషధాలు అందకే చనిపోయినట్టు నివేదికలు వచ్చాయి. ఏ దేశ సైన్యానికైనా యుద్ధంలో ఆహారం, ఔషధాలు కీలకం. అవి అందకుంటే ఎనిమీ దాడికంటే ముందే మరణానికి వెల్‌కమ్ చెప్పాల్సి ఉంటుంది. చైనా, పాక్‌తో అత్యంత కఠినమైన సరిహద్దు ప్రాంతాలు ఉన్న భారత్‌కు ఇవి ఇంకాస్త ఎక్కువగానే అవసరం. ఇందుకే ఇండియన్ ఆర్మీ సైతం ఈ రోబోటిక్ మ్యూల్స్‌పై ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదట 100 మ్యూల్స్‌ను ప్రయోగాత్మకంగా రంగంలోకి దించబోతోంది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇండియన్ ఆర్మీ తీసుకుంటున్న చర్యలు బోర్డర్‌లో సైనికులను మరింత ఉత్సాహంతో పనిచేసేలా చేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

అలస్కాపై పుతిన్ కన్ను : రష్యా అమెరికా మధ్య యుద్ధమేఘాలు

ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను. ఈ ఫేమస్ డైలాగ్ రష్యన్ ప్రెసిడెంట్‌కు అక్షరాలా అతికి నట్టు సరిపోతుంది. ఉక్రెయిన్‌పై తన దండయాత్రలో ఇంటర్‌ ఫియర్ ఐతే సీన్ మరోలా ఉంటుందని అమెరికా ను పదే పదే హెచ్చరిస్తూ వచ్చిన పుతిన్.. ఇప్పుడు అదే యాక్షన్‌లోకి దిగిపోయినట్టు కనిపిస్తోంది. తాజాగ అప్పుడెప్పుడో అమెరికాకు అమ్మేసిన అలస్కా నింగిలో తన టీయూ-95 బాంబర్లను గింగిరాలు తిప్పి వార్ సందేశం ఇస్తోంది. దీనిపై స్పందించిన అగ్రరాజ్యం రష్యన్ బాంబర్లను తరిమేశామని పైకి చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరేలా కనిపిస్తున్నాయి.
అలస్కా.. అగ్రరాజ్యం అమెరికాలో 49వ రాష్ట్రం. అయితే, ఐతే, 1867 సంవత్సరానికి ముందు రష్యాలో అంతర్భాగంగా ఉండేది. అదే ఏడాది రష్యా ఈ ప్రాంతాన్ని అమెరికాకు విక్రయించింది. అది కూడా చాలా చౌకగా.. అంటే కేవలం 70.2 లక్షల డాలర్లకు తీసుకుని అలస్కాను అమెరికా చేతిలో పెట్టింది. అనేక‌ పాలక మార్పుల త‌ర్వాత‌ 1959, జనవరి 3న అమెరికా 49వ రాష్ట్రంగా అల‌స్కాను గుర్తించారు. ఇప్పుడు అలస్కా జీడీపీ ఎంతో తెలుసా? అక్షరాలా 5వేల కోట్ల డాలర్లు. ఈ ప్రాంతంలో సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి. అంతటి అలస్కాను ఆనాడు రష్యా ఎలా అమ్మేసిందన్న విషయాన్ని కాస్త పక్కనపెట్టి.. ప్రస్తుతా నికి వస్తే.. ఇప్పుడదే అలస్కా అమెరికా, రష్యా మధ్య కొత్త యుద్ధానికి దారితీయబోతున్నట్టు కనిపిస్తోంది.
అలస్కా అంశంలో ఫిబ్రవర్ 13న కీలక పరిణామం జరిగింది. అలస్కా సమీపంలోకి రష్యా యుద్ధ విమానాలు వచ్చాయి. రష్యాకు చెందిన టీయూ-95 బేర్‌ హెచ్‌ బాంబర్లు, సుఖోయ్‌ 35 ఫైటర్ జెట్‌లు అలస్కా ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ సమీపంలోకి అనూహ్యంగా దూసుకొచ్చాయి. ఈ హఠాత్ పరిణామంతో అగ్రరాజ్యం ఎయిర్‌ ఫోర్స్ షేక్ అయిపోయింది. వెంటనే తేరుకుని తన ఫైటర్‌ జెట్స్‌నురంగంలోకి దించింది. గాల్లోకి లేచిన అమెరికా ఫైటర్‌ జెట్లు రష్యా యుద్ధ విమానాలను అడ్డుకుని తరిమేశాయి. ఈ విషయాలన్నీ నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ బయటపెట్టింది. అలాగే, రష్యన్ బాంబర్లు అంతర్జాతీయ గగనతలంలోనే ఉన్నాయనీ అలస్కా, లేదా కెనడా సార్వభౌమ గగనతలంలోకి అవి పూర్తిగా ప్రవేశించ లేదని తెలిపింది. ఇదే సమయంలో రష్యా ప్రయత్నాలను అడ్డుకునేందుకు తమ విమానాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని కాన్ఫిడెంట్‌గా చెప్పింది. ఈ ప్రాంతంలో రష్యా వాయు కార్యకలాపాలు నిత్యం జరుగుతాయనీ.. వీటిని ముప్పుగానో, రెచ్చగొట్టే చర్యగానో తాము భావించడం లేదని పేర్కొంది. ఓవరాల్‌గా రష్యన్ బాంబర్లను తమ యుద్ధ విమానాలు అడ్డగించి దారిమళ్లించేశాయి.. ఇక్కడితో అంతాఐపోయిందనేది అమెరికా ఎయిర్‌ ఫోర్స్‌ ప్రకటన సారాంశం. ఇది కేవలం అమెరికా ఎయిర్ ఫోర్స్ వర్షన్ మాత్రమే.
ఇదే ఇష్యూపై మాస్కో నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. అమెరికా ఇది మాత్రమే జరిగిందని నోటిమాటగా చెప్పుకొస్తే.. మాస్కో మాత్రం అగ్రరాజ్యానికి ఓ రేంజ్ యాక్షన్ సినిమా చూపించింది. అలస్కా లోకి వచ్చిన యుద్ధవిమానాలు ఇవేనేమో చూడండి అని.. రష్యా, అలస్కా మధ్య ఎగురుతున్న టీయూ- 95 బాంబర్లకు సంబంధించిన వీడియోను రష్యా అధికారిక మీడియా విడుదల చేసింది. మాస్కో ఈ వీడియో విడుదల చేయడానికి కారణం.. మాస్కో యుద్ధ విమానాలను తమ ఫైటర్ జెట్లు దారి మళ్లించా యనీ, వాటిని తామే తరిమేశాయని అమెరికా ఎయిర్‌ ఫోర్స్ చేసిన ప్రకటనే కావొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా బాంబర్లను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం మినహా తరిమేసేంత సీన్ ఉండదనేది విశ్లేషకుల మాట. ఇదే సమయంలో అలస్కాకు రష్యన్ బాంబర్ల ఎంట్రీ కూడా పొరపాటున జరిగింది అయి ఉండదు. అగ్రరాజ్యాన్ని బెదిరించేందుకు మాస్కో వాంటెడ్‌గానే అలస్కాకు తమ బాంబర్లను పంపి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం గతంలో పుతిన్ చేసిన హెచ్చరికలే. ఉక్రెయిన్‌పై మాస్కో దండయాత్రను ఏ రకంగా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా.. తమపై ఆర్ధిక ఆంక్షలు విధించినా అలస్కాను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మాస్కో ప్రకటించింది. ఇప్పుడా సమయం వచ్చిందనేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మొదలైన మూడు నెలల తర్వాత అలస్కా మాదే అంటూ రష్యాలో హోర్డింగ్స్ కనిపించాయి. ర‌ష్యాలోని క్రాస్నోయార్స్క్ వ్యాప్తంగా కన‌ప‌డ్డ ఈ రాత‌ల‌కు సంబంధించిన ఫొటోలు అప్పట్లో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న ర‌ష్యాపై అమెరికా స‌హా ప‌లు దేశాలు ఆంక్ష‌లు విధించిన నేప‌థ్యంలో అల‌స్కా అంశాన్ని ర‌ష్యా ప్ర‌భుత్వం తెర‌పైకి తీసుకొచ్చింది. త‌మ‌పై ప‌శ్చిమ దేశాలు ఆంక్ష‌ల‌ను ఇలాగే ఆంక్ష‌లు కొన‌సాగిస్తే అల‌స్కాను అమెరికా నుంచి తిరిగి స్వాధీనం చేసుకుంటామ‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ విధేయుడు, ఆ దేశ నేత వ్యాచెస్లావ్ వోలోడిన్ ప్రకటించారు. ఆ సమయంలో దీనిపై స్పందించిన అమెరికా గుడ్ ల‌క్ అంటూ రష్యాను ఎద్దేవా చేసింది. అయితే, అమెరికా అప్పుడు అలస్కా అంశం అంత సీరియస్ అవుతుందని ఊహించలేదు. మాస్కో నుంచి వచ్చే ఈ తరహా ప్రకటనలను తేలిగ్గా తీసుకుంది. తీరా ఉక్రెయిన్‌పై యుద్ధం పీక్స్‌కు చేరుకున్న ఇలాంటి సమయంలో రష్యన్ బాంబర్లు అలస్కావైపు వెళ్లడం.. ఆ వీడియోను మాస్కోనే రిలీజ్ చేయడం లాంటి పరిణామాలు అగ్రరాజ్యా నికి హైవోల్టేజ్ షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే, మాస్కో ఇప్పుడే అలస్కాపై ఎందుకు ఫోకస్ చేస్తోంది?
నిజానికి.. అలస్కాను తిరిగి స్వాధీనం చేసుకోవడం పుతిన్ ఆలోచన కాకపోవచ్చు. కష్టమో నష్టమో ఒకసారి అధికారికంగా విక్రయించిన తర్వాత దాన్ని తిరిగి స్వాధీనం చేసుకునే ఆలోచన కూడా పుతిన్ చేయరు. అయితే, అలస్కావైపు తమ యుద్ధ విమానాలు పంపించడం ద్వారా అగ్రరాజ్యానికి ఓ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఉక్రెయిన్‌ కథ ముగించేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్న ఇలాంటి సమయంలో.. అమెరికా హద్దులు దాటకుండా ఉండేందుకు.. తాము తల్చుకుంటే అలస్కాను తిరిగి హస్తగతం చేసుకోగలం అనే సంకేతాలివ్వాలన్నదే పుతిన్ ఆలోచన కావొచ్చంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. వాస్తవానికి.. ఉక్రెయిన్ విషయంలో అమెరికాను ఒత్తిడిలోకి నెట్టడంలో ఇప్పటికే మాస్కో విజ యం సాధించింది. దీని ఫలితంగానే కీవ్‌కు ఆయుధాలు ఇవ్వడంపై అగ్రరాజ్యం పునరాలోచనలో పడింది. ఇదే సమయంలో రాజకీయంగానూ బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఆర్ధి సంక్షోభం వేళ.. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్ధిక ప్యాకేజీలు ఇవ్వడంపై వ్యతిరేకత పెరిగింది. ఇలాంటి సమయంలో అలస్కాపై మాస్కో తన యాక్షన్ మార్చితే ఆ ఒత్తిడి ఇంకాస్త పెరగడం ఖాయం. అందుకే, తమ బాంబర్లను అలస్కావైపు పంపి ఉండొచ్చు. మొత్తంగా.. యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ అలస్కా అంశం తెరపైకి తేవడం అమెరికాకు కంటిమీద కునుకులేకుండా చేసే ప్రయత్నంగానే చూడాలి.

కేసీఆర్ కోసం 69 కిలోల కేక్.. ఇంకా ఎన్నో సర్ ప్రైజులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు కోసం ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 17 న ఆయన 69వ పుట్టిన రోజును భారీగా సెలబ్రేట్ చేయటంతో పాటు ఆయనకు సర్ ప్రైజ్ ఇచ్చేందుకు 69 కిలోల కేక్ ను సిద్ధం చేశారు. కేక్ తో పాటు పలు ఆసక్తికరమైన బహుమతులు ఆయన పుట్టిన రోజు కోసం సిద్ధం చేశారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, పథకాలను వివరిస్తూ 3డీ యానిమేషన్స్ తో ఓ వీడియోను కూడా సిద్ధం చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని థ్రిల్ సిటీలో ఘనంగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు భారీ స్థాయిలో కార్యకర్తలు పాల్గొననున్నారు.
కేసీఆర్ పుట్టిన రోజున ఆయన క్షేమాన్ని కోరుకుంటూ తెలంగాణలోని పలు దేవాలయాల్లో చండీయాగం, ఆయుష్ హోమం, రాజశ్యామల యాగం నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు. అంతే కాకుండా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పలు క్రీడా టోర్నమెంట్లలో విజేతలను ప్రకటించి ఇదే రోజున వారికి బహుమతులు అందజేయనున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పెద్దమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజును ఘనంగా నిర్వహించేందుకు కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేయటంతో తెలంగాణ మొత్తం సందడి వాతావరణం కనిపిస్తోంది.

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై దాడి

కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. నల్గొండలోని ఇటుకలపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన స్థానిక బీఆర్ఎస్ నేతలు కుర్చీలు, కర్రలు కోమటిరెడ్డిపైకి విసిరారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కోమటిరెడ్డిపై దాడి జరిగినా ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆయన అనుచరులు సురక్షితంగా కోమటిరెడ్డిని అక్కడి నుంచి తరలించారు. విషయం తెలిసి రంగప్రవేశం చేసిన పోలీసులు రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. సుమారు 2 గంటల పాటు గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించిన వారందరిపైనా ఇలాగే దాడులు చేస్తారా అంటూ కోమటిరెడ్డి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
నిన్న ఢిల్లీలో కోమటిరెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమని జోష్యం చెప్పిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇటు బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదంటూ ఇరు పార్టీల అగ్రనాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలతో పాటు టీపీసీసీలో అలజడి రేకెత్తించిన కోమటిరెడ్డి.. హైదరాబాద్ రాగానే మాట మార్చి తాను అలా అనలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జరిగిన మర్నాడే కోమటిరెడ్డిపై దాడి జరగటం గమనార్హం.

స్కామ్ ఆరోపణలపై అదానీ సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ గ్రూప్ స్కామ్ ఆరోపణలపై అధినేత అదానీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన గ్రూప్ సంస్థలన్నింటిపై ఓ ప్రైవేట్ ఆడిటింగ్ సంస్థ చేత ఆడిట్ చేయించి తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం అని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇందు కోసం గ్రాంట్ థోర్న్ టన్ అనే ప్రైవేట్ ఆడిటింగ్ కంపెనీని ఎంపిక చేసుకొని.. నిష్పక్షపాతంగా ఆడిట్ చేసి రిపోర్ట్ ను షేర్ హోల్టర్ల ముందు ఉంచాలని కోరాడు. ఇప్పటికే ఈ కంపెనీకి కాంట్రాక్టు ప్రక్రియ అయిపోయినట్టు తెలుస్తోంది. అదానీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొద్ది రోజుల క్రితం బ్రిటన్ కు చెందిన హిండెన్ బర్గ్ అనే షార్ట్ సెల్లింగ్ కంపెనీ అదానీ గ్రూప్ లో అక్రమాలు జరిగాయంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ రిపోర్ట్ విడుదల చేసింది. దీంతో అదానీకి చెందిన 120 బిలియన్ డాలర్లు క్షణాల్లో ఆవిరయ్యాయి. ప్రతిపక్షాలు అదానీ గ్రూపు తో పాటు మోడీపై తీవ్ర ఆరోపణలు చేశాయి.. మోడీ వల్లనే అదానీ ఇంత వాడు అయ్యాడనీ.. ఇప్పుడు అదానీ చేసిన కుంభకోణంతో లక్షల కోట్ల ప్రజా సంపద ఆవిరైందనీ ఆరోపించాయి. వెంటనే అదానీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ ఎంక్వైరీ చేయాలంటూ కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. రెండు రోజుల క్రితం అదానీ వ్యవహారంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు స్పష్టం చేసింది. ఈ క్రమంలో తన కంపెనీపై తానే ప్రైవేట్ ఆడిటింగ్ చేయించాలని అదానీ నిర్ణయించుకోవటం మరో సంచలనంగా మారింది.

వణికిస్తున్న మార్ బర్గ్ వైరస్ : సోకిందంటే చావే

మార్‌బర్గ్‌.. ఈ మాటను మార్క్‌ చేసిపెట్టుకోవాల్సిన టైం వచ్చింది. ఇదే సీజనల్‌గా వచ్చే వైరల్ ఫీవర్ కాదు.. 14 రోజులు క్వారెంటైన్‌లో గడిపేస్తే బయటపడిపోయే కరోనా కూడా కాదు.. డేంజరస్ ఎబోలా ను మించిన డెడ్లీ వైరస్. ఒక్కసారి మన శరీరంలోకి ఎంట్రీ ఇస్తే 21 రోజులపాటు జీవించి ఉంటూ మనల్ని జీవశ్చవంగా మార్చేసే మహమ్మారి. ఈ వ్యాధి సోకిన వారిలో 88శాతం మరణాల రేటు ఉందంటే ఇదెంత కంత్రీ వైరసో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా.. ఈ మహమ్మారి ఎంట్రీ మరోసారి ఆఫ్రికాలోనే జరిగింది. ఆఫ్రికన్ కంట్రీ ఈక్వటోరియల్ గినియాలో మార్‌బర్గ్‌ కారణంగా పదిమంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్ధ సైతం రంగంలోకి దిగింది. అనుమానితులు, క్లోజ్ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కి తరలించి పరీక్షలు షురూ చేసింది. మార్‌బర్గ్ దెబ్బకు గినియాలోని ఓ ప్రావిన్స్‌ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచాల్సిన పరిస్థితులు వచ్చాయి.
మార్‌బర్గ్ కలకలంతో ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలో దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో అనుమానిత కేసులను పరిశీలిస్తున్నట్లు గినియా ప్రభుత్వం గత వారం ప్రకటించింది. ఐతే, ముగ్గురి వ్యక్తుల్లో మాత్రమే తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్యసమితితో చర్చల అనంతరం ఆ ప్రావిన్స్‌లో లాక్‌డౌన్‌ అమలు చేశారు. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌, పొరుగు జిల్లా మొంగోమోలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించబడిందని ఆరోగ్య మంత్రి మితోహా ఒండో అయేకాబా విలేకరుల సమావేశంలో చెప్పారు. కీ-ఎన్‌టెమ్ ప్రావిన్స్‌లో 4వేల 325 మందిని ఈ వైరస్ ప్రభావితం చేసిందని ఆయన చెప్పారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7 మధ్య తొమ్మిది మరణాలు సంభవించాయని, ఫిబ్రవరి 10న ఆసుపత్రిలో అనుమానాస్పద మరణం కూడా మార్‌బర్గ్‌ మరణమే అని తేలింది. దీంతో ఈ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడి ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నిజానికి.. మార్‌బర్గ్ అనేది ఎబోలా ఫ్యామిలీకి చెందిన అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాప్తిస్తుంది. వాటి నుంచే మనుషులకు సంక్రమిస్తుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు, దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ప్రాణాంతకమైన ఈ వైరస్ 2 నుంచి 21 రోజుల వరకూ బాధిత శరీరంలో సజీవంగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మరణాల రేటు ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. మార్‌బర్గ్ వైరస్ ఫిలోవైరస్ కుటుంబంలో భాగం. ఇందులో ఎబోలా వైరస్ కూడా ఉంది. ఎబోలా ఆఫ్రికాలో ఎలాంటి విధ్వంసం సృష్టించిందో ప్రపంచం మొత్తం చూసింది. దీంతో మార్‌బర్గ్‌ వ్యాప్తి ఆఫ్రికాను మరోసారి కలవర పరుస్తోంది. మార్‌బర్గ్‌ సోకిన వ్యక్తికి దాదాపుగా ఎబోలాలో కనిపించిన లక్షణాలే కనిపిస్తున్నాయి.
జ్వరంతోపాటూ తలనొప్పి, తీవ్రమైన అస్వస్థత ఏర్పడుతున్నాయి. చాలా మందికి వైరస్ సోకిన వారం తర్వాత లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట్లో టైపాయిడ్, మలేరియాలా కనిపిస్తుంది. తర్వాత ఇది మార్‌బర్గ్ అని అర్థమవుతుంది. ఐతే, అప్పటికే బాధితుడికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్‌బర్గ్‌ను వీలైనంత త్వరగా గుర్తించాలనే ప్రయత్నాలు చేస్తోంది.
మరోవైపు.. మార్‌బర్గ్ అనేది కొత్త వ్యాధి కాదు. ఇదివరకు అంగోలా, డీఆర్ కాంగో, గినియా, కెన్యా, సౌత్ ఆఫ్రికా, ఘనా, ఉగాండాలో కూడా ఇది సోకింది. గతేడాది జులైలో ఘనాలో ఇది సోకింది. మరణాలు సంభవించాయి. ఐతే గతేడాది సెప్టెంబర్ నాటికి ఇది ముగిసినట్లు ఆయా దేశాలు ప్రకటించాయి. కానీ, ఇప్పుడు గినియాలో మళ్లీ మార్‌బర్గ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వ్యాధి సోకుతున్న ప్రాంతాల్లో WHO.. ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దింపింది. మరింత మందికి ఇది సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. దాదాపు 500 మంది హెల్త్ వర్కర్లకు పీపీఈ కిట్లు, గ్లోవ్స్, మాస్క్‌లను ఇచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్ కంట్రోల్‌లోనే ఉందని చెబుతున్నప్పటికీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం కాస్త ఆందోళనకరంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మార్‌బర్గ్‌ను ఎదుర్కొనేందుకు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. ఎక్కువ నీరు తాగితే బతికే అవకాశాలు ఉంటాయి. అలాగే బ్లడ్ ప్రొడక్ట్స్, ఇమ్యూన్ థెరపీలు, డ్రగ్ థెరపీల వంటి ట్రీట్‌మెంట్స్‌తో నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక.. ఈ వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణం ఫ్రూట్ బ్యాట్స్.. ఆఫ్రికాలో ఓ రకమైన గబ్బిలాలే ఈ ఫ్రూట్ బ్యాట్స్. వీటి నుంచే మనుషులకు సోకుతోంది.
ఎబోలా, నిఫా, సార్స్, మెర్స్, హెండ్రా.. ఇప్పుడు మార్‌బర్గ్ ఈ వ్యాధులన్నీ వ్యాప్తి చెందేవి గబ్బిలాల నుంచే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 13వందల జాతుల గబ్బిలాలు ఉన్నాయి. ఒక్క భారత్‌లోనే 128 జాతులున్నట్టు అంచనా. ఐతే, ఇవన్నీ ప్రాణాంతక వైరస్‌లు మనుషులపైకి వదిలే గబ్బిలాలు కాదు.. ఓ రకంగా చెప్పాలంటే గబ్బిలాలు లేకపోయినా మన జీవితాలు సాఫీగా సాగవు. గబ్బిలాలు పురుగుల్ని తినడం వల్ల ఒక్క భారత్‌లోనే ఏటా 2వేల 900 టన్నుల ధాన్యం
సేవ్ అవుతోంది. ఈ గబ్బిలాలే లేకపోతే ప్రపంచానికి తిండిగింజలు కరువయ్యే పరిస్థితులుకూడా రావచ్చట. కానీ, వీటిలో కొన్ని జాతుల గబ్బిలాలు మాత్రం భయంకరమైన వైరస్‌లకు కారణం అవుతున్నాయి. ఇదే సమయంలో ఆ వైరస్‌లన్నీ మనుషులకే కానీ గబ్బిలాలకు ప్రమాదకరంగా మారడం లేదు. దీనికి కారణం గబ్బిలాల్లో రోగనిరోధక శక్తి అధికంగా ఉండటమే అంటున్నారు శాస్త్రవేత్తలు. గబ్బిలాలు నిత్యం ఎగురు తుండటం వల్ల వాటి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఓక థియరీ చెబుతోంది. ఎప్పుడూ ఎగురుతుండటం వల్ల దాని శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని ఆ సమయంలో వాటికి వైరస్ వచ్చే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. ఎబోలా, మార్‌బర్గ్ లాంటి వైరస్‌లను ఎదుర్కోవాలంటే ఒక్కటే మార్గం. గబ్బిలా లకు దూరంగా ఉండడమే. గబ్బిలాలకు దూరంగా ఉండడంతో పాటు అడవుల్లో సేకరించిన ఆహార ఉత్పత్తు లను శుభ్రం చేసి తినడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే గబ్బిలాలను అంతం చేయడం అసాధ్యం.. జాగ్రత్తలు మాత్రమే మనల్ని కాపాడుతాయని వైద్యులు చెబుతున్నారు. ఏదే మైనా మార్‌బర్గ్ లాంటి మహమ్మారుల పట్ల అప్రమత్తంగా ఉండకుంటే కరోనాను మించిన కల్లోలాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు.

దటీజ్ పుతిన్ : పూర్తిగా పతనం దిశగా నాటో దేశాలు

ఉక్రెయిన్ మరో ఆఫ్ఘనిస్తాన్‌లా మారడానికి ఎంతో సమయం లేదా? యుద్ధభూమిలో పరిస్థితులు చూస్తుంటే ఔననే సమాధానమే వినిపిస్తోంది. రష్యాను నిలువరించాలనే లక్ష్యంతో ఉక్రెయిన్‌ను వాడుకున్న నాటో దేశాల మధ్య పైకి కనిపించని అంతర్యుద్ధం జరుగుతోంది. చివరికి రష్యాను ఓడించటం మాటటుంచితే
కూటమి కొట్లాటలతో నాటో భవిష్యతే అగమ్యగోచరంగా మారే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అదే జరిగి నాటో బీటలు వారితో ఉక్రెయిన్ పోరాటానికి అర్ధమే లేకుండా పోతుంది. అంతేనా, ఎంతో ఘనకీర్తి ఉన్న దేశం మరో ఆఫ్ఘనిస్తాన్‌గా మారే ప్రమాదం కూడా కనిపిస్తోంది. యుద్ధం ఎప్పుడూ మంచి చేయదు. ఈ విషయం జిన్‌పింగ్, కిమ్ లాంటి నియంతలకు అర్ధం కాకపోయినా.. ఉక్రెయిన్, రష్యాతో పాటూ ప్రపంచం మొత్తానికీ అర్ధమవుతోంది. మరీ ముఖ్యంగా నాటో కూటమి దేశాలకు ఇంకాస్త ఎక్కువగానే అర్ధమవుతుంది. దీనికి కారణం ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధమే. రష్యాను ఢీకొట్టడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌ను తమ కూటమిలో చేర్చుకుంటామని ప్రకటించి ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రేపింది. ఎలాగో తామిచ్చే అడ్వాన్స్‌డ్‌ ఆయుధాలు మాస్కో సేనల భరతం పట్టేస్తాయనీ, త్వరలోనే పుతిన్ తమ ముందు సాగిలపడిపోతారనీ కలలు కన్నారు. కానీ, ఏడాది కావొస్తున్నా ఈయుద్ధం
మాత్రం ముగియలేదు. పైగా ఉక్రెయిన్ అడిగినప్పుడల్లా నాటో కూటమి దేశాలు ఆయుధాలు ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆయుధాలు ఇవ్వలేమని చేతులెత్తేస్తే ప్రపంచం ముందు అభాసుపాలయ్యే ప్రమాదం. ఇలాంటి పరిస్థితుల్లోనే నాటోను వెంటాడుతున్న మరో భయం తమ ఆయుధాలతో మాస్కోపైకి ఉక్రెయిన్‌ వెళ్లే ప్రమాదముండటం. ఇదే జరిగితే పుతిన్ తుపాకీ నాటో దేశాలవైపునకు తిరుగుతుంది. ఈ పరిణామాలు నాటో కూటమిని నిలకడ లేకుండా చేస్తున్నాయి.
పైకి నాటో దేశాలన్నీ తామంతా ఏకతాటిపైనే ఉన్నామని చెబుతున్నాయి. కానీ, వాస్తవం మాత్రం వేరేలా కనిపిస్తోంది. ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తన ఎఫ్ సిక్స్టీన్ ఫైటర్ జెట్లు ఉక్రెయిన్‌కు ఇచ్చేదిలేదని తేల్చేసింది. ఈ పరిణామాలు కూటమిలో విభేదాలు తెచ్చే పరిస్థితులు వచ్చాయి. చివరికి 31 అబ్రహం ట్యాంకులు పంపేందుకు అయిష్టంగానే బైడెన్ సంతకం చేశారు. ఆ వెంటనే జర్మనీ సహా ఇతర యూరర్ దేశాలు తమ దగ్గరున్న లెపర్డ్-2 ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపుతున్నట్టు ప్రకటించాయి. కట్‌చేస్తే.. నాటో కూటమి యుద్ధ ట్యాంకుల సరఫరాకు అంగీకారం తెలపగానే ఉక్రెయిన్ యుద్ధ విమానాల డిమాండ్ తెరపైకి తెచ్చింది. నాలుగో తరానికి చెందిన ఎఫ్‌16, యూరోఫైటర్స్, టోర్నడో, ఫ్రెంచ్‌ రఫేల్‌ ఫైటర్ జెట్స్ అవసరాన్ని జెలెన్‌స్కీ పదే పదే గుర్తు చేస్తున్నారు. మాస్కో దగ్గర నాలుగోతరం యుద్ధ విమానాలు 772 ఉంటే తమ దగ్గర సోవియెట్‌ నాటి పాతబడిన 69 విమానాలే ఉన్నాయనీ వాటితో రష్యాను నిలువరించడం కష్టమని ఉక్రెయిన్‌ చెబుతోంది. ఈ కొత్త డిమాండే ఇప్పుడు నాటో దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.
ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు అందించేందుకు బైడెన్ ససేమిరా అన్నా.. కూటమిలోని ఫ్రాన్స్, నెదర్లాండ్స్, తిథువేనియా దేశాలు మాత్రం పాజిటివ్‌గా స్పందించాయి. ఇప్పుడీ యుద్ధ విమానాల అంశమే నాటో కూటమిలో విభేదాలకు దారితీస్తున్నట్టు కనిపిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు అండగా నిలిచిన నాటో కూటమిలో దేశాలు అందిస్తున్న సాయంపై ఈ మధ్య కాలంలో అంతర్మథనం జరుగుతోంది. మహా అయితే నెలరోజుల్లో మాస్కో కథ ముగుస్తుందనుకున్న నాటోకు ఏడాదికాలం కావొస్తున్నా రష్యా కొరకరాని కొయ్యగా మారడమే ఇందుకు కారణం. ఈ యుద్ధం ఇంకెప్పుడు ముగుస్తుందన్నదీ మిలియన్ మార్క్ మిస్టరీనే. ఫలితంగా.. ఉక్రెయిన్‌కు ఇంకెంత కాలం ఇలా ఆయుధాలు ఇచ్చుకుంటూ వెళ్లాలో తెలీని పరిస్థితి. ఫలితంగా ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వడంపై కూటమిలోని దేశాలు చేతులెత్తేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.
ఇటీవల అమెరికా తన దగ్గరున్న అధునాతన అబ్రహం ట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇవ్వడానికి అంగీకరిస్తేనే తాము లెపర్డ్‌–2 ట్యాంకులు ఇవ్వడానికి ఒప్పుకుంటామని జర్మనీ చాన్స్‌లర్‌ ఒలాఫ్‌ స్కోల్జ్‌ పట్టుబట్టారు. అమెరికా భాగస్వామ్యం లేకుండా తాము ట్యాంకులు పంపితే రష్యా తన ఆగ్రహాన్ని తమపై గురిపెడుతుందన్న భయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ తెరవెనుక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. యూరప్‌లోని నాటో దేశాలు స్పెయిన్, పోలాండ్, ఫిన్‌లాండ్, నార్వే తమ వద్ద ఉన్న లెపర్డ్‌–2 ట్యాంకులను పంపడానికి సిద్ధంగా ఉన్నా జర్మనీ అనుమతి లేకుండా వాటిని ఇతర దేశాలకు పంపకూడదన్న ఒప్పందాన్ని అనుసరించి ముందడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. అబ్రహం ట్యాంకులు అత్యాధునికమైనవని, వాటిని ఉపయోగించడం కష్టసాధ్యమని, వాటి తయారీకి అనేక నెలలు పడుతుందని, రిపేర్లు చేయడం ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని అమెరికా అధినేతలు బహిరంగంగా వాదిస్తూ వచ్చారు. పెంటగాన్‌ అధికారి కాలిన్‌ హెబ్‌ కాల్, అమెరికా జాతీయ భద్రతా దళ ప్రతినిధి జాన్‌ కిర్బి ఈ వాదనలు ముందుకు తెచ్చారు. అయినా కూడా జర్మనీ ససేమిరా అంది. చివరికి అమెరికా వెనక్కి తగ్గక తప్పలేదు. ఇలాంటి పరిణామాలతోనే కూటమిలో పైకి కనిపించని యుద్ధమేదో జరుగుతోంది.
సరే.. అయ్యేదేదో అవుతుందని తెగించి ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు, ఎఫ్‌ సిక్స్టీన్ లాంటి ఫైటర్ జెట్స్ ఇచ్చే ప్రయత్నం చేద్దామన్నా.. ఇక్కడ మరో సమస్య కూడా నాటో దేశాలను వెంటాడే ఛాన్స్ ఉంది. ఏడాదిపాటు రష్యాలాంటి అతిశక్తివంతమైన దేశాన్ని నిలువరించగలిగిన ఉక్రెయిన్.. ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో మరింత దూకుడుగా వెళ్లి యుద్ధాన్ని రష్యా భూభాగంలోకి తీసుకువెళుతుందేమోనన్న అనుమానాలు కూటమి దేశాల్లో మొదలయ్యాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రష్యా ఆక్రమించుకున్న తన భూభాగాలతో పాటు క్రిమియాను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఉక్రెయిన్‌ ఉవ్విళ్లూరుతోంది. నాటో అందిస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్‌ ఇలాంటి దుస్సాహసం చేస్తే యుద్ధం తీరే మారిపోయే అవకాశముంది. నాటో దేశాల ఆయుధాలు మాస్కోను ఢీకొంటే.. పుతిన్ గతంలో చెప్పినట్టే యుద్ధం నాటో దేశాల సరిద్దులు దాటుతుంది. ఇప్పుడు కూటమిలోని చాలా దేశాల భయం కూడా ఇదే. ప్రధానంగా రష్యాకు దగ్గరలో ఉన్న దేశాల్లో ఆ భయం స్పష్టంగా కనిపిస్తోంది.
మొత్తంగా.. ఉక్రెయిన్ అభ్యర్ధనను మన్నించి యుద్ధ విమానాలూ పంపలేక.. సుదీర్ఘ కాలం ఉక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వలేక.. తాము ఆశించిన రష్యా ఓటమినీ చూడలేని పరిస్థితులు నాటో కూటమికి వచ్చేలా కనిపిస్తున్నాయి. అదే జరిగితే మరే దేశమైనా నాటో కూటమిలో ఎందుకు చేరాలనే ప్రశ్నలు తలెత్తుతాయి. అందుకే.. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఓటమి మాత్రం నాటో కూటమిదే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే సమయంలో నాటో ఆటలో చివరికి ఉక్రెయిన్‌ మరో ఆఫ్ఘనిస్తాన్‌లా మారక తప్పేలా లేదు.

ఆప్ఘనిస్తాన్ లో అంతర్యుద్ధం : తమలో తామే కొట్టుకుంటున్న తాలిబన్లు

ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ అంతర్యుద్ధం జరగబోతోంది. గతంలో ప్రభుత్వం, తాలిబన్ల మధ్య అంతర్యుద్ధం జరిగితే.. ఈ సారి మాత్రం తాలిబన్ల మధ్యే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా ఆఫ్ఘాన్ మరోసారి రక్తసిక్తం కాక తప్పేలా లేదు. ఇటీవల పాక్ మద్దతు ఉన్న హక్కానీ వర్గం ఏకంగా సుప్రీం లీడర్‌నే టార్గెట్ చేసింది. ఈ సాహసం మరెవరైనా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, తమలోనే గ్రూపులు తేలడంతో ఎలా ముందుకెళ్లాలో తెలీని పరిస్థితులు సుప్రీం లీడర్‌ వర్గంలో కనిపిస్తోంది. అలా అని హక్కానీ వర్గాన్ని విడిచిపెట్టేశారని అనుకోడానికీ లేదు. ఫలితంగా పేలడానికి సిద్ధంగా ఉన్న ఆర్డీఎక్స్‌లా ఆఫ్ఘనిస్తాన్‌ మారుతోంది.
సుప్రీం లీడర్‌ వర్గం ఓవైపు.. పాకిస్తాన్ మద్దతున్న హక్కానీ వర్గం మరోవైపు.. విమర్శలు ఒక్కటే కాదు.. అవసరమైతే గల్లాలు పట్టుకోడానికీ సిద్ధపడినట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హక్కానీ వర్గం ఏకం గా సుప్రీం లీడర్‌నే టార్గెట్ చేసింది. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌ పేలడానికి సిద్ధంగా ఉన్న అణుబాంబు మాదిరిగా మారిపోయింది. రెండుగా చీలిపోతున్న తాలిబన్ల వ్యవహారంలో అంతర్యుద్ధం అనే ఆటంబాంబ్ ఏ క్షణమైనా పేలే ఛాన్స్ కనిపిస్తోంది. అదే జరిగితే ఆఫ్ఘనిస్తాన్‌ను కాపాడ్డం ఎవ్వరితరం కాకపోవచ్చు.
సిరాజుద్దీన్ హక్కానీ.. ఈయన హక్కానీ గ్రూప్ సీనియర్ నాయకుడు.. ఇతడు చేసిన వ్యాఖ్యలే ఆఫ్ఘన్‌ను రావణకాష్టంగా మార్చబోతున్నాయి. సుప్రీం లీడర్ అఖుంద్‌జాద ఒక్కడే అధికారాలను అనుభవి
స్తున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఖోస్ట్‌ ప్రాంతంలో జరిగిన మతపెద్దల సమావేశంలో అఖుంద్‌జాద పేరు ప్రస్తావించకుండా అధికార కేంద్రీకరణ పాలన వ్యవస్థ పరువు తీస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని చూస్తూ సహించే పరిస్థితిని ఎప్పుడో దాటేశాం అన్న సిరాజుద్దీన్.. ఇక ఏ మాత్రం సహించేది లేదనీ.. పాలన వ్యవస్థకు ప్రజలకు మధ్య చీలికలు తెచ్చే విధానాలను అవలంభించడం మానుకోవాలని హితవు పలికారు. లేకపోతే ఇది ఇస్లాంను నిందించడానికి ఇతరులకు అవకాశం ఇస్తుందని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా రంగంలోకి దిగిన తాలిబన్ ప్రతినిధి జుబైహుల్లా.. బహిరంగంగా ఈ తరహా విమర్శలు ఇకనైనా మానుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
నిజానికి.. ఇరు వర్గాల మధ్య ఈ తరహా పరిస్థితులు రావడానికి కారణం అఖుంద్‌జాద పాలనే.
ఇటీవల అఖుంద్‌జాద కాందహార్‌ వేదికగా పాలన సాగిస్తున్నారు. ఆఫ్గానిస్తాన్ మహిళలు చాలా చోట్ల పనిచేయడాన్ని నిషేధించారు. దీంతోపాటు వారిని విద్యకు కూడా దూరం చేశారు. ఈ నిర్ణయాలను అఖుంద్‌జాద సమర్థించుకొన్నారు. ఇదే సమయంలో ఆఫ్ఘన్ మహిళలు ఒంటరిగా 70 కిలోమీటర్లకు మించి ప్రయాణించడంపైనా నిషేధం విధించారు. అఖుంద్‌జాద తీసుకున్న ఈ నిర్ణయాలను తాలిబన్లతో సన్నిహితంగా ఉంటున్న దేశాలు కూడా వ్యతిరేకించాయి. హక్కానీ వర్గం మాత్రం బాలిక విద్యపై నిషేధం ఎత్తివేయాలని కోరుతోంది. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రజలు పాత గాయాల నుంచి కోలుకొనేట్లు చేయాలని హక్కానీ ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ డిమాండ్‌ను పట్టించుకునే ఆలోచన అఖుంద్‌జాద చేయడం లేదు. ఇదే సమయంలో తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌ కూడా మహిళలకు హక్కుల పట్ల పాజిటివ్‌గా ఉన్నారు. వారికి హక్కులు ఉన్నప్పుడే అంతర్జాతీయంగా ఆఫ్ఘాన్ ఏకాకిగా మారకుండా ఉంటుందని అతడు భావిస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను హస్తగతం అయితే చేసుకున్నారు కానీ.. సవ్యంగా పాలన సాగించేందుకు వారి దగ్గర అవసరమైనన్ని నిధులు లేవు. ఇదే సమయంలో తాలిబన్ల పాలనను ప్రపంచ దేశాలు గుర్తించ లేదు. ఫలితంగా ఇతర దేశాల్లో ఆఫ్ఘన్ ఆస్తులన్నీ లాక్ అయిపోయాయి. ఇలాంటి సమయంలో షరియా చట్టాలు అమలు చేసుకుంటూ పోతే.. ఆఫ్ఘన్‌కు భవిష్యత్ కష్టమని తాలిబన్లలో కొన్ని గ్రూపులు భావిస్తున్నా యి. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టిన వారిలో మెజారిటీ సంఖ్య ఛాందసవాదులదే. వీరంతా ఖచ్చితంగా షరియా చట్టాన్ని అమలు చేసేందుకే పట్టుబడుతున్నారు. మహిళలను ఉద్యోగాలు చేయనివ్వ క పోవడం, విద్యకు దూరం చేయడం లాంటి నిర్ణయాలన్నీ ఈ మెజారిటీ వర్గమే డిసైడ్ చేస్తోంది. మరోవైపు అధిక సంఖ్యలో ఉన్న మితవాదులకు అధికారాలు తక్కువ సంఖ్యలో దక్కాయి. ఫలితంగా అతివాదుల నిర్ణయాలు బలవంతంగా ప్రభుత్వంపై రుద్దుతున్నారనే భావన మితవాదుల్లో పెరుగుతోంది. తాజా సిరాజుద్దీ న్ వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. ప్రస్తుతం ఈ పరిస్థితులే ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధానికి దారి తీసే ప్రమాదం కనిపిస్తోంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి అంతర్యుద్ధం మొదలైతే ఆ దేశ ప్రజలను కాపాడడం ఎవరి తరం కాకపోవచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం చాలా మంది తాలిబన్ నాయకులకు ప్రైవేట్‌ సైన్యాలు ఉండడమే. తాజాగా సుప్రీం లీడర్‌ను విమర్శించిన సిరాజుద్దీన్ చేతిలో కూడా అత్యంత బలమైన
హక్కానీ నెట్‌వర్క్‌ ఉంది. ముల్లా యాకూబ్‌ వద్ద ముల్లా ఒమర్‌ సేనలు ఉన్నాయి. వీరి దగ్గరే అగ్రరాజ్యం అమెరికా విడిచి వెళ్లిన బిలియన్ డాలర్ల విలువైన అత్యాధునిక ఆయుధాలున్నాయి. బహుశా ఈ ధీమా తోనే సుప్రీం లీడర్‌ అఖుంద్‌జాదకు ఎదురెళ్లే ధైర్యం చేస్తున్నారేమో. ఇదే సమయంలో అఖుంద్‌జాద చేతిలో మాత్రం కాందహార్‌లోని స్థానిక మిలిటెంట్లు ఉన్నారు. దీంతోపాటు అతివాద దళాలు కూడా ఆయన మాటే వింటున్నాయి. ఫలితంగా ఈ రెండు వర్గాల మధ్య యుద్ధం మొదలైతే.. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ల గ్రూపులు అన్నీ రెండుగా విడిపోయి కొట్లాడే పరిస్థితులు తలెత్తుతాయి. అదే జరిగితే ఈ సారి జరిగే అంతర్యుద్ధం వేలా ది మంది ఆఫ్ఘాన్ ప్రజలను పొట్టనపెట్టుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
నిజానికి.. తాలిబన్లలో గ్రూపులు, వివాదాలు కూడా కొత్తేం కాదు. 2021లో ఆఫ్ఘన్‌ను హస్తగతం చేసుకున్న తర్వాత మంత్రి వర్గం ఏర్పాటుతో పాటు తాలిబన్ల విజయంపై క్రెడిట్ ఎవరికి దక్కాలనే దానిపై హక్కానీ నెట్‌వర్క్‌లోని శక్తిమంతమైన నాయకుడు ఖలీల్‌ ఉర్‌ రహ్మన్‌ హక్కానీ, శాంతి చర్చల నాయకుడు ముల్లా బరాదర్‌ మధ్య వివాదం జరిగింది. తమ దౌత్యం వల్లే అమెరికా సేనలు వెళ్లిపోయాయని బరాదర్‌ వాదిస్తే.. తాము యుద్ధం చేయడంతోనే అమెరికన్లు పలాయనం చిత్తగించారని హక్కానీ అనుచరులు వాదించారు. ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో పక్కన ఉన్న ఇరువర్గాల సభ్యులు ఇష్టారీతిన తన్నుకొన్నారు. దీంతో మంత్రివర్గం కూర్పుపై అలిగిన బరాదర్‌ అప్పట్లో కాందహార్‌ వెళ్లి సుప్రీం లీడర్‌ ముల్లా హబైతుల్లా అఖుంద్‌జాదాతో భేటీ అయ్యారు. అయితే, ఆ తర్వాత పరిస్థితులు కాస్త చక్కబడినా.. మళ్లీ ఇప్పుడు అంతర్యుద్ధం ముసురుకునే పరిస్థితులు కనిపిస్తు న్నాయి.
ఇదిలా ఉంటే.. తాలిబన్లలోని సిరాజుద్దీన్‌ హక్కానీ వర్గం, ముల్లా ఒమర్‌ కుమారుడు ముల్లా యాకూబ్‌లను పాకిస్థాన్‌ చేరదీసింది. వీరిద్దరూ పాక్‌కు మద్దతుదారులు. ఆఫ్ఘనిస్తాన్‌ ఆక్రమణలో పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ వీరికి కీలక సహకారం అందించింది. తాజాగా తాలిబన్లు పాక్‌పై దాడులు చేస్తుంది. ఈ దాడులకు కారణం సిరాజుద్దీన్ హక్కానీ, ముల్లా యాకుబ్‌లను పాకిస్తాన్‌కు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఇందుకే సుప్రీం లీడర్ అఖుంద్‌జాద పాకిస్తాన్‌ను పరోక్షంగా టార్గెట్ చేస్తున్నారనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తాలిబన్ నాయకులకు ప్రైవేట్ సైన్యాలుండడం.. సిరాజుద్దీన్ చేతిలో బలమైన హక్కానీ నెట్‌వర్క్ ఉండటం.. ముల్లా యాకూబ్‌ దగ్గరున్న ముల్లా ఒమర్ సేనల దగ్గర అమెరికా విడిచి వెళ్లిన అత్యాధునిక ఆయుధాలు ఉండటం.. ఇలాంటి సమయంలోనే సిరాజుద్దీన్‌ ఏకంగా సుప్రీం లీడర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం లాంటి పరిణామాలు ఆఫ్ఘనిస్తాన్‌లో ఏ క్షణమైనా అంతర్యుద్ధం మొదలు కావొచ్చనే సంకేతాలిస్తున్నాయి.

జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్-నిర్మలా సీతారామన్

ప్రపంచ వ్యాప్తంగా క్రూడా ఆయిల్ ధరలు పెరిగిన సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగిపోయాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఓపెక్ కంట్రీస్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించుకోవటం తదితర కారణాల వల్ల ఆయిల్ రేట్లు పెరగటం తప్ప తగ్గలేదు. కాకపోతే.. యుద్ధం పుణ్యమాని రష్యా నుంచి భారత్ ఆయిల్ దిగుమతి పెంచుకోవటం.. రష్యా భారత్ కు ధరల్లో డిస్కౌంట్లు ఇవ్వటం వంటి కారణాలతో మన పొరుగు దేశాలతో పోల్చితే భారత్ లో ఆయిల్ ధరలు తక్కువే ఉన్నాయి. ఈ ధరలు ఇంకా తగ్గాలంటే ఆయిల్ ధరలను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకువాలనే డిమాండ్లు ప్రధానంగా వినిపించాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి కూడా ఎదుర్కున్నది. ధరల మంటతో సామాన్యుడు అష్ట కష్టాలు పడుతున్నాడనీ.. వెంటనే ఆయిల్ రేట్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకువాలని డిమాండ్లు ఎక్కువగా వినిపించాయి.
ఇప్పుడు దీనిపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావటానికి కేంద్రానికి ఏం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాకపోతే ఇది కేంద్రం స్వంతంగా తీసుకునే నిర్ణయం కాదనీ.. రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇందుకు అంగీకరిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం ముందు ఇదే డిమాండ్ ఉంచింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఒప్పుకుంటే వెంటనే ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. రాష్ట్రాల ప్రభుత్వాలు లిక్కర్ మరియు ఆయిల్ పై వచ్చే పన్నులతోనే ప్రభుత్వాలను నడిపిస్తాయనీ.. ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ ధరలు తగ్గుతాయి.. కానీ ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం తగ్గుతుంది. కాబట్టి తుది నిర్ణయం రాష్ట్రాలదే అని స్పష్టం చేశారు.