ఖమ్మం జిల్లా సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు ఖమ్మంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఈ నేపథ్యంలో ఖమ్మం బహిరంగ సభ కోసం పొంగులేని అనుచరులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కడ చూసినా పొంగులేటి ఫ్లెక్సీలే కనిపించేలా ఊరంతా ఫ్లెక్సీల మయం చేసేశారు. ఇది చూసిన కాంగ్రెస్ సీనియర్లు పొంగులేటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. “కొత్తగా పార్టీలోకి వచ్చే నువ్వే ఇంత హడావుడి చేస్తే ఎలా.. ఇన్ని ఫ్లెక్సీలు కట్టి చాలా ఎక్కువ చేస్తున్నావు.. అదుపులో ఉండు..” అంటూ తనను సీనియర్లు హెచ్చరిస్తున్నారని పొంగులేటి ఆరోపిస్తున్నాడు. కాంగ్రెస్ లోని సీనియర్లు తిడుతున్నారంటూ మీడియా ముందే గతంలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు పొంగులేటి. ఇప్పుడు మరోసారి తనను సీనియర్లు బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే.. పొంగులేటి ఆరోపణల్లో నిజం లేకపోలేదు.
భట్టి విక్రమార్క ప్రస్తుతం పీపుల్స్ మార్చ్ అనే పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తన యాత్రకకు పోటీగా పొంగులేటి హడావుడి చేస్తున్నాడనీ.. జిల్లాలో పొంగులేటి ఒక్కడే లీడర్ అనే రేంజ్ లో ప్రవర్తిస్తున్నాడనీ భట్టి విక్రమార్క పొంగులేటి అనుచరులకు వార్నింగ్ ఇచ్చాడట. అటు మరో సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఇలాగే పొంగులేటిని బెదిరించాడట. రాహుల్ తెలంగాణకు వస్తున్న వేళ తమను మించిన పబ్లిసిటీ చేసుకోవటం బహుశా కాంగ్రెస్ సీనియర్లకు నచ్చటం లేదేమో. కాంగ్రెస్ అంటేనే వర్గపోరు.. కాంగ్రెస్ అంటేనే అభిప్రాయ బేధాలకు అడ్డా. అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి రావటానికి ముందే పొంగులేటి ఆలోచించుకోవాల్సింది. రేవంత్ రెడ్డికే చుక్కలు చూపిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు.. ఇక పొంగులేటి ఎంత వాళ్ళకు..!? “కొత్తగా వచ్చి నువ్వేంటి మాకు చెప్పేది” అంటూ రేవంత్ రెడ్డి మాటనే లెక్కచేయక ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వి హనుమంతరావు.. పొంగులేటి పెత్తనాన్ని భరిస్తారా..? కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఇలాగే ఉంటుంది.. కాకపోతే పొంగులేటి ముందే ఊహించలేకపోయాడంతే. ఇక ఇన్ని జరుగుతున్నా రేవంత్ రెడ్డి దీనిపై బహిరంగంగా స్పందించలేదు. రేపు రాహుల్ సభ ముగిసే లోపు ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతాయో కాంగ్రెస్ పార్టీలో.