Home Blog Page 17

మడతపెట్టే(ఫోల్డబుల్) ఫోన్ : గూగుల్ మరో అద్భుతం

ప్రపంచ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ రూపురేఖలను మార్చివేసే రేంజ్ లో గూగుల్ కంపెనీ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోందని గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలపై గూగుల్ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే పిక్సెల్ ఫోల్డ్ పేరుతో అద్బుతమైన ఫీచర్లతో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతున్నట్టు గూగుల్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇందుకు సంబంధించిన ఓ టీజర్ వీడియోను గూగుల్ రిలీజ్ చేసింది. దీనిలో గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలియకపోయినా.. డిజైన్ ఎలా ఉంటుందనేది మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. స్పెసిఫికేషన్లు మాత్రం ఇంకా తెలియరాలేదు. కానీ మార్కెట్లో పోటీ అనేదే లేకుండా టెక్నాలజీ ప్రపంచంలో నిలిచిపోయే రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్ ఉండబోతోందనేది మాత్రం గూగుల్ ప్రతినిథులు చెప్తున్నారు.
టెన్సర్ జీ2 ప్రాసెసర్ తో 48 మెగా పిక్సెల్ కెమెరా.. 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా.. ఇలా కొన్ని ఫీచర్ల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా.. కేవలం డిజైన్ తప్ప మిగతా వివరాలేవీ గూగుల్ వెల్లడించలేదు. ఇప్పటికే సామ్ సంగ్ నుంచి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఉన్న విషయం తెలిసిందే. సామ్ సంగ్ ఫోన్ ను తలదన్నే ఫీచర్లతో పిక్సెల్ ఫోల్డ్ ను మార్కెట్లోకి వదలబోతున్నారని తెలుస్తోంది. మరో వారం రోజుల్లో ఫుల్ ఫీచర్స్ మరియు డిటైల్స్ ను గూగుల్ అఫీషియల్ గా వెల్లడించనుంది.

వైరల్ : రష్యా ప్రతినిథిపై ఉక్రెయిన్ ఎంపీ పిడిగుద్దులు

రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సుమారు 14 నెలలుగా యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్ పై మొదలైన రష్యా సైనిక చర్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ప్రతినిథులు ఎక్కడ ఏ వేదికపై ఎదురైనా ఘర్షణ వాతావరణం నెలకొంటున్నది. ఇప్పుడు ఏకంగా ఇరుదేశాల ప్రతినిథులు లైవ్ లో అందరి ముందు కొట్టుకోవటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం మొదలైన తర్వాత ఇరు దేశాల మధ్య బ్లాక్ సీ ఎకానమిక్ కమ్యూనిటీ సమావేశం తొలిసారి నిన్న జరిగింది. ఈ సమావేశానికి రష్యా, ఉక్రెయిన్ తరఫున ప్రతినిథులు హాజరయ్యారు. ఈ సమావేశం వేదికపై తన దేశపు జెండా పట్టుకొని నిలబడి ఉన్న ఉక్రెయిన్ ఎంపీ నుంచి రష్యన్ ప్రతినిథి జెండాను లాక్కొని వెళ్ళిపోయాడు. దీంతో ఆగ్రహించిన ఉక్రెయిన్ మంత్రి.. రష్యా ప్రతినిథిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు.
వీరిద్దరూ ముఖాముఖి తలపడటం అక్కడున్న వాళ్ళను షాక్ కు గురిచేసింది. దీంతో వెంటనే అక్కడున్న వాళ్ళు కలగజేసుకొని ఇద్దరినీ విడదీసి దూరంగా ఉంచారు. టర్కీ రాజధాని అంకారాలో జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉక్రెయిన్ కు చెందిన ఓ మీడియా సంస్థ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక భవనంపై డ్రోన్ దాడి జరగింది. ఈ దాడి చేసింది ఉక్రెయిన్ సైన్యమేనని ఆరోపించిన రష్యా.. ఇక తమకు ఓపిక లేదని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని చంపటం తప్ప ఈ వివాదానికి మరో పరిష్కారం లేదని తీవ్రమైన హెచ్చరిక చేసింది. రష్యా రక్షణ శాఖ మంత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడిని చంపాల్సి వస్తే అది తమ తప్పుకాదనీ.. మరో మార్గం లేదంటూ నేరుగా హెచ్చరించటం ఉక్రెయిన్, అమెరికాలను షాక్ కు గురి చేసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్, రష్యా ప్రతినిథులు నేరుగా కొట్టుకోవటం హాట్ టాపిక్ కా మారింది.

ఏటూ తేల్చని పొంగులేటి.. ఈ రోజు మరో ట్విస్టు

0

సొంత పార్టీ బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరనున్నారంటూ ఉదయం నుంచి చర్చ జరుగుతోంది. తెలంగాణ బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు పొంగులేటితో సమావేశమయ్యారు. బీజేపీలో చేరాలంటూ పొంగులేటిని ఆహ్వానించారు. కానీ ఆయన నుంచి మాత్రం ఇప్పటి వరకూ స్పష్టమైన ప్రకటన రాలేదు. బీజేపీ నేతలంతా పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించినా ఆయన ఎటూ తేల్చకుండా ఎందుకు ఉన్నారో ఎవరికీ అర్థం కాని విషయం. కొద్దిరోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. రాహుల్ గాంధీ కూడా పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించగా.. ఆయన డిమాండ్లు విన్న రాహుల్ ఎటూ తేల్చకుండా ఇది జరిగేలా లేదని పెదవి విరిచి వెళ్ళిపోయారు. ఇప్పుడు బీజేపీ నేతలు పిలుస్తున్నా పొంగులేటి క్లారిటీ ఇవ్వటం లేదు. పొంగులేటి వ్యవహారం ఇలాగే కొనసాగితే చివరకు ఎటూ కాకుండా మిగిలిపోతారనే భయం ఆయన కార్యకర్తల నుంచే వ్యక్తమవుతోంది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాక ముందే పొంగులేటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరబోతున్నాడని వార్తలొచ్చాయి. వైఎస్ విజయమ్మ కూడా ఆయన తమ పార్టీలో చేరుతున్నాడని చెప్పిందే కానీ అది జరగనేలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు.. ఇప్పుడు బీజేపీ నేతలతో మంతనాలు.. ఇలా జరుగుతూనే ఉన్నాయే తప్ప పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఎటూ తేల్చకుండా మితిమీరిన డిమాండ్లు చేస్తున్నాడు. కేవలం ఖమ్మం జిల్లాలో కొంత పట్టు ఉన్న కారణంగా పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకోటానికి ప్రతిపక్షాలు ఆసక్తి చూపిస్తుంటే.. ఆయన మాత్రం ఖమ్మం జిల్లాలో తాను ఏది చెప్తే అదే శాసనం అనే రేంజ్ లో తన గురించి తాను చాలా ఎక్కువగా ఊహించుకొని.. ఏ పార్టీలోనూ చేరకుండా కార్యకర్తలను గందరగోళానికి గురి చేస్తున్నారు. ఏ పార్టీ నేతలైనా తమ పార్టీలో చేరాలని అడిగినప్పుడే ఏదో నిర్ణయం తీసుకోవాలి గానీ.. ఇలా నాన్చితే చివరకు విసుకొచ్చి వస్తే రా.. పోతే పో అనే సందర్భం వస్తుందంటూ పొంగులేటికి దగ్గరి వ్యక్తులు సలహా ఇస్తున్నారట. అయినా ఇప్పటికీ ఏటూ తేల్చడం లేదు. చివరికి పొంగులేటి విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.

నంది అవార్డుల వివాదంపై తలసాని కీలక ప్రకటన

0

తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డులపై నిర్మాత అశ్వనీదత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా స్పందించారు. ఎవరు పడితే వాళ్ళు అడిగితే నంది అవార్డులు ఇవ్వరని.. అసలు తమకు సినిమా అవార్డులు ఇచ్చే విషయంలో ఆసక్తే లేదని స్పష్టం చేశారు. “తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటి వరకూ ఎవరూ నంది అవార్డుల విషయంలో మమ్మల్ని సంప్రదించలేదు.. కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదు.. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత నంది అవార్డుల విషయంలో రెండు రాష్ట్రాలకూ ఏవిధమైన ఆసక్తి లేదు. అయినా.. నంది అవార్డుల విషయంలో చాలా అపోహలు ఉన్నాయి. సినీ పరిశ్రమ నుంచి ప్రతిపాదనలు అందితే వచ్చే సంవత్సరం నంది అవార్డులు ఇస్తాం..” అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో నిర్మాత అశ్వీనదత్ మాట్లాడుతూ నంది అవార్డులు ఇప్పుడు టాలీవుడ్ లో తెలుగు రాష్ట్రాలకు ఇవ్వటం లేదని.. ఇప్పుడు అన్నీ ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డులే ఇస్తున్నారనీ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశారు. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీరియస్ గా స్పందించారు. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నంది అవార్డుల విషయంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు స్పష్టత లేదు. అవార్డులను ఏ రాష్ట్రం అధికారికంగా ఇవ్వాలి అనే దానిపై రెండు రాష్ట్రాల మధ్య ఏనాడూ చర్చ రాలేదు. కాబట్టి రెండు రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఒక వేళ ఏ రాష్ట్రం అధికారికంగా నంది అవార్డులు ఇచ్చినా రెండో రాష్ట్రం నుంచి అభ్యంతరం వ్యక్తం కావచ్చు అనే కారణంగా అనవసర వివాదాన్ని సృష్టించటం ఇష్టం లేక రెండు రాష్ట్రాలు ఈ విషయాన్ని వదిలేశాయనే చెప్పాలి. ఇప్పుడు తలసాని ప్రకటన తర్వాత ఏపీ నుంచి ఎలాంటి అభ్యంతరం రాకుంటే తెలంగాణ ప్రభుత్వం అవార్డుల విషయంలో చొరవ తీసుకోవచ్చు.

ఇక నుంచి బ్యాంకులు వారానికి 5 రోజులే

బ్యాంకు పనిదినాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక నుంచి అన్ని బ్యాంకులు వారానికి కేవలం 5 రోజులు మాత్రమే పని చేసే దిశగా ఆదేశాలు జారీ చేయనున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో బ్యాంకులకు వారానికి 5 రోజులు పని దినాలుగా ఉండాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. కానీ.. బ్యాంకు ఖాతాదారులకు ఇబ్బందులు తలెత్తుతాయన్న కారణంగా కేంద్రం ఈ డిమాండ్ ను అంగీకరించలేదు. కావాలంటే ఉద్యోగులకు 19 శాతం వేతనం పెంచటానికి సిద్ధంగా ఉన్నామని.. పనిదినాల కుదింపు కుదరదని అప్పట్లో కేంద్రం బ్యాంకు ఉద్యోగ సంఘాలకు తేల్చి చెప్పింది. దీనిపై బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు కూడా పిలుపునివ్వగా.. కొన్ని కారణాల వల్ల సమ్మె వాయిదాపడింది. కానీ ఇప్పుడు ఆ నిర్ణయానికి కేంద్రం ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
వారానికి 5 పనిదినాలు పనిచేసినందుకు గానూ ప్రతి రోజూ ఉద్యోగుల పని సమయాన్ని 40 నిముషాల పాటు పెంచేందుకు కూడా కేంద్రం నిర్ణయించుకుంది. ఇక నుంచి బ్యాంకులు ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేయనున్నాయి. ఈ నిబంధనకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. అయితే.. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలోనే ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

కాగ్నిజెంట్ లో 3500 మంది ఉద్యోగుల తొలగింపు

ఆర్థిక మాంద్యం పేరుతో ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ దిగ్గజ కంపెనీలు అమేజాన్, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ అయినా కాగ్నిజెంట్ 3 వేల ఐదు వందల మంది ఉద్యోగులను తొలగించేందుకు నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవి కుమార్ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు మూడున్నర లక్షల మంది ఉద్యోగులు కాగ్నిజెంట్ లో ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారిలో ఎక్కువ భాగం భారత్ లోనే పనిచేస్తారు. సుమారు 2 లక్షల మంది ఉద్యోగులు భారత్ లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే తొలగించిన ఉద్యోగులు భారత్ లో పనిచేసే వారా లేక ఇతర దేశంలో పనిచేసే వారా అనేది ఆయన చెప్పలేదు.
ఉద్యోగులకు రెండు నెలల ముందే పింక్ స్లిప్ ఇవ్వాలని సంస్థ నిర్ణయించుకున్నదనీ.. ఖర్చుల తగ్గింపు కోసమే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనీ రవి కుమార్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కార్యాలయాలను కూడా ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఈ సంవత్సరం కాగ్నిజెంట్ కు లాభాలు గణనీయంగా పడిపోయాయని.. ఫలితంగానే ఖర్చులను తగ్గించుకోవాల్సి రావటం వల్లనే ఉద్యోగుల తొలగింపు మరియు కార్యాలయాలు ఖాళీ చేయాలనే నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందనీ చెప్పారు.

ఉమేశ్ పాల్ హత్య వీడియో : దారుణంగా కాల్సి చంపేశారు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో ఫుటేజ్ ను పోలీసులు సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం ఉమేష్ ను చుట్టు ముట్టిన అతీక్ అహ్మద్ గ్యాంగ్ మనుషులు.. ప్రాణాలు పోయేదాకా ఉమేష్ పాల్ పై బుల్లెట్ల వర్షం కురిపించారు. పోలీసులు విడుదల చేసిన వీడియోలో వారి క్రూరత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఉమేష్ పాల్ కు సెక్యూరిటీగా ఉన్న గన్ మెన్ ను కూడా అతీక్ గ్యాంగ్ కాల్చి చంపింది. అతి దగ్గరి నుంచి తుపాకీ తో కాల్చి.. ఉమేష్ కింద పడిపోయాక మరిన్ని రౌండ్లు కాల్పులు జరపటం వీడియోలో కనిపిస్తోంది. ఉమేష్ బాడీగార్డ్ కూడా దగ్గరి నుంచి కాల్చటంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. కింద పడిపోయిన తర్వాత కూడా ఇద్దరిపై కాల్పులు జరిపారు దుండగులు. పోలీసులు అనుమానించినట్టే అతీక్ అహ్మద్ తమ్ముడు అసద్ కూడా సంఘటన స్థలంలో ఉన్నాడు.
2005లో అతీక్ అహ్మద్ గ్యాంగ్ రాజు పాల్ ను హత్య చేయగా.. ఆ హత్య కేసులో ఉమేష్ పాల్ కీలక సాక్షి. కేసు రుజువు అయ్యే సమయానికి ఉమేష్ పాల్ ను అతీక్ గ్యాంగ్ హత్య చేయించింది. ఇది ఉత్తర్ ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రతిపక్షాల తీవ్రమైన ఆరోపణలకు సమాధానంగా మాఫియాను మట్టిలో కలిపేస్తానని చెప్పిన సీఎం యోగీ.. చెప్పినట్టుగానే ఉమేష్ పాల్ హత్యతో సంబంధం ఉన్న అందరినీ పోలీసులు ఎన్ కౌంటర్లో చంపేశారు. అతీక్ గ్యాంగ్ లోని అర్బాజ్ ఫిబ్రవరి 27న ఎన్ కౌంటర్ లో చనిపోగా, ఆ తర్వాత అతీక్ తమ్ముడు అసద్, గులాం, అర్బాజ్, ఉస్మాన్ లను కూడా పోలీసులు హతమార్చారు. చివరికి అతీక్ అహ్మద్, అతని తమ్ముడు అష్రఫ్ పోలీసుల కళ్ళ ముందే ప్రత్యర్థుల కాల్పుల్లో హతం కావటంతో ఈ మాఫియా సర్కిల్ ఇక్కడితో ముగిసిపోయింది. మొత్తం ఎన్ కౌంటర్లకు కారణమైన ఉమేష్ పాల్ హత్యకు సంబంధించిన ఒరిజినల్ వీడియోను ఎట్టకేలకు పోలీసులు సాక్ష్యంగా పేర్కొంటూ విడుదల చేయగా.. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఓటీటీలో అఖిల్ ఏజెంట్.. ఇదో టైప్ రికార్డు

0

చాలా రోజుల గ్యాప్ తర్వాత ఏజెంట్ అంటూ స్పై థ్రిల్లింగ్ స్టోరీతో వచ్చిన యంగ్ హీరో అఖిల్.. మరోసారి బిగ్గెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన హలో అనే ఓ సినిమా.. రీసెంట్ గా మిస్టర్ మజ్నూ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే సినిమాలు మాత్రమే యావరేజ్ పేరు తెచ్చుకున్నాయి. మిగతా సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ సినిమాలే పాపం అఖిల్ కు. ఇక లేటెస్ట్ గా ఏజెంట్ సినిమా మాత్రం అఖిల్ కు మాత్రమే కాదు.. టాలీవుడ్ కే ఓ మచ్చలాంటి సినిమాగా మిగిలిపోయింది. హిట్ సినిమాలే లేని హీరోలతో చేసి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చే డైరెక్టర్ సురేందర్ రెడ్డి.. అఖిల్ విషయంలో మాత్రం ఇంత ఘోరంగా ఎలా బోల్తా పడ్డాడా అనేది ఎవరికీ అర్థం కాని విషయం. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ సినిమా బడ్జెట్ వంద కోట్లు అని ప్రమోషన్స్ లో నొక్కి నొక్కి చెప్పారు మేకర్స్. ఇప్పుడు కనీసం 25 కోట్లు కూడా వసూలు చేయలేక ప్రొడ్యూసర్, బయ్యర్, డిస్ట్రిబ్యూటర్.. ఇలా అందరినీ ముంచేసింది.
కలెక్షన్ల సంగతి పక్కన పెడితే అఖిల్ ఏజెంట్ సినిమా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విడుదలైన మూడో వారంలోపే ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఇంతకు ముందు ఆచార్య, శకుంతల సినిమాలు కూడా ఇలాగే మూడు వారాల లోపే ఓటీటీలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ఆ వరుసలో ఏజెంట్ సినిమా చేరిపోయింది. మే 19న ఈ సినిమా సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. థియేటర్లో మరీ దారుణమైన టాక్ మూటగట్టుకున్న ఏజెంట్.. ఓటీటీ లో ఏం చేస్తుందో చూడాలి. సోనీ లివ్ కూడా ఏజెంట్ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ మొత్తానికే కొనుక్కుంది. ఇప్పుడు చూస్తే.. ఇదీ సినిమా పరిస్థితి.

వీడనున్న పూరీ మూడో గది సంపద మిస్టరీ : జూలై 10న డోర్స్ ఓపెన్

భారతదేశం మొత్తాన్ని శాసించి, మన సంపదను దోచుకెళ్లిన బ్రిటిషర్లు పూరీ జగన్నాథుని దేవాలయాన్ని మాత్రం ముట్టుకునే ప్రయత్నం చేయలేదు. ది మిస్టీరియస్ గాడ్ అంటూ పూరీ ఆలయాన్ని టచ్ చేయలేక వణికిపోయారు. దేశ సంపదనంతా దోచుకోగలిగారురు కానీ, జగన్నాథుని రత్న భాండా గారం తలుపును కూడా టచ్ చేయలేకపోయారు. పైగా శ్రీక్షేత్రం సంపద దొంగలపాలు కాకుండా ఉండేందుకు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, అదంతా గతం. ఇప్పుడు మాత్రం బ్రిటిషర్లు దోచుకోలేకపోయిన జగన్నాథుని సంపద ఎంతవరకూ భద్రం అన్నదే అసలు ప్రశ్నంతా. కొన్ని దశాబ్దాలుగా రత్న భాండాగారం తలుపులు తెరుచుకోవడంలేదు. 50 ఏళ్లకు ముందు ఆ తలుపులు తెరిచినా సంపదను అంచనా వేయలేకపోయపోయారు. ఆ తర్వాత తెరుద్దామన్నా కుదరలేదు. దీనికి కారణం ఆ పురాతన రత్న భాండా గారం తలుపులకు సంబంధించిన తాళం కనిపించకుండా పోవడమే. ఆ తాళం ఎలా మిస్సయింది? ఎవరి దగ్గర ఉందనే ప్రశ్నలు ఏళ్ల తరబడి తొలిచేసిన వేళ.. ఆ మిస్టరీని ఛేదించడానికి ఒడిశా సర్కార్‌ ఓ కమిటీని నియమించింది.
2018 నవంబర్‌ 30.. జస్టిస్ రఘువీర్ దాస్ కమిషన్ కనిపించకుండా పోయిన తాళానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి అందించింది ఆరోజే. కానీ, ఇది జరిగి నాలుగేళ్లు పూర్తయిపోయినా ఆ నివేదికలో ఏముందనేది బయటకు వచ్చిందే లేదు. 324 పేజీల రిపోర్ట్‌లో ఎలాంటి అంశాలు పొందుపరిచారో నవీన్ పట్నాయక్ సర్కార్ బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు. ఇదే సమయంలో ఆ న్యాయ విచారణ కోసం ఎంత ఖర్చు చేశారో తెలుశా? అక్షరాలా 22లక్షల 27వేల 918 రూపాయలు. మరి ఇంత ఖర్చుచేసి,
అంత సమయం కేటాయించి, 324 పేజీల రిపోర్ట్ చేతికందిన తర్వాత కూడా దానిపై సర్కార్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడం నేటికీ మిలియన్ మార్క్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఫలితంగా రత్న భాండాగారం కీ గల్లంతుపై న్యాయ విచారణ నివేదికను బహిర్గతం చేయాలని హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసు విచారణ సందర్భంగా ఇరుపక్షాలైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జూలై 10లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఇరువురు ప్రతివాదులను కోర్టు ఆదేశించింది. దీంతో మరోసారి మిస్టీరియస్ గాడ్ విలువైన సంపద దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌ అవుతోంది.
పూరీ జగన్నాథ్ ఆలయం కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు సమర్పించిన అనేక వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగంలో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తుంటారు. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి. దీంతో.. ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా?లేదా? అన్నదానిపై భక్తుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్‌ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే, రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా వెలుపల నుంచి పరిశీలించిన బృందంలోని సభ్యులు.. పైకప్పుల పెచ్చులు ఊడటం, గోడల్లో తేమ ఉండడాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్‌ తాళం ఒకటి లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. అయినా, రత్న భాండాగారాన్ని తెరిచే ప్రయత్నం చేయలేదు. దీంతో ఒడిశా సర్కార్‌ దగ్గర నిజంగా తాళం ఉందా? లేదంటే వివాదం చెలరేగకుండా ఉండేందుకు అలా చెప్పారా? అనే ప్రశ్నలు వినిపించాయి.
భాండాగారంలో భారీ మొత్తంలో బంగారం, వజ్రాలు, నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కపెట్టెల్లో ఉన్నాయని ఆలయ మాజీ నిర్వాహకులు రబీంద్ర నారాయణ్‌ మిశ్రా చెప్పారు. 1978లో ఓసారి ఆ గదిని పరిశీలించిన బృందంలో మిశ్రా కూడా ఒకరు. ఆ సమయంలో విలువైన నగల వివరాలు అన్నింటిని పొందుపరిచారు. తమిళనాడు, గుజరాత్‌ల నుంచి నిపుణులను పిలిపించినప్పటికీ.. అందులోని ఆభరణాల విలువను మాత్రం లెక్కకట్టలేకపోయారు. తిరిగి 1985లో ఆ రత్న భాండాగారాన్ని తెరిచి చూసినప్పటికీ కొత్త జాబితాను మాత్రం రూపొందించలేదు. వాస్తవానికి.. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్‌ జెనా మాట్లాడుతూ.. 1978లో రూపొందించిన జాబితా ప్రకారం.. దాదాపు 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి ఇతర విలువైన విలువైన రత్నాలు, రాళ్లు ఉన్నట్టు గుర్తించిచారు. వీటితోపాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి. అయితే, పలు కారణాల వల్ల 14 బంగారు, వెండి ఆభరణాలను కొలవలేకపోయి నందున వాటిని ఈ జాబితాలో పొందుపరచలేదని చెప్పారు. అయితే అవన్నీ 50 సంవత్సరాల క్రితం లెక్కలు. ఇప్పుడు ఆ సంపద ఎంతవరకూ ఉందనేది ఊహకందని ప్రశ్నే. ఎందుకంటే ఆ గది తాళం కనిపించకుండాపోయి చాలా కాలం అయింది.
జగన్నాథుని సంపదపై నిర్వహకుల లెక్కలు ఇలా ఉంటే.. చరిత్రకారులు మాత్రం మరోలా చెబుతున్నారు. 1926లోనే పూరీ రాజు గజపతి రామచంద్రదేవ, బ్రిటిష్‌ పాలకులు కలిసి పూరీ జగన్నాథుని రత్న భాండాగారాన్ని తెరిపించి, ఆభరణాలను లెక్కించారట. అందులో 15 కిలోల కంటే ఎక్కువ బరువున్న జగన్నాథ, బలభద్ర, సుభద్రల బంగారు కిరీటాలతో పాటు 597 రకాల విలులైన ఆభరణాలు ఉన్నట్టు గుర్తించారని చరిత్రకారులు చెబుతున్నారు. కానీ రత్న భాండాగారంలోని అసలైన గది తలుపులు మాత్రం తెరవలేకపోయారట. ఇందుకు కారణం ఆ గదిని చేరుకునే కొద్దీ వింత శబ్ధాలు రావడమే. దీంతో ముందుకు వెళ్లే ధైర్యం చేయలేక ఆ గదిని తెరవాలన్న ఆలోచనను విరమించుకున్నారని చెబుతారు. వాస్తవానికి అప్పట్లో శ్రీక్షేత్రంపై 18 సార్లు దండయాత్రలు జరిగాయి. కానీ, జగన్నాథుని రత్న భాండాగారం లోపలి గదుల్లోకి ఎవరూ ప్రవేశించ లేకపోయారు. అందుకే బ్రిటిష్‌ పాలకులు జగన్నాథుడిని మిస్టీరియస్‌ గాడ్‌గా అభివర్ణించారు. అంతేకాదు, తమ పాలనలో రత్న భాండాగారం సంరక్షణ, నియమాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఇదే సమయంలో ఒకవేళ రత్న భాండాగారం తాళం దొరక్కపోయినా ఆ గదులోపలికి వెళ్లడానికి ఓ మార్గం ఉందని చరిత్రకారుడు సురేంద్ర మిశ్రా చెప్పారు. రహస్య మూడో గదిని చేరుకునేందుకు ఓ సొరంగ మార్గం ఉందన్నారు. ఐతే, అక్కడికి చేరుకోవాలంటే అంత సులువేం కాదన్నారు. ఆరహస్య మార్గానికి సంబంధించి 1926లో చెన్నైకు చెందిన అధికారులు కీలక వివరాలు నిథికి సంబంధించిన పట్టీపై రాసినట్టు గుర్తుచేశారు. ఆ వివరాలు పూర్తి స్థాయిలో సంపాదిస్తే అనంతపద్మనాభ స్వామి నేలమాలిగళకు మించిన సంపద రత్న భాండాగారంలో బయటపడొచ్చని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అలాగే, రత్న భాండాగారం లో అందరూ చెబుతున్నట్టు మూడు గదులు కావనీ, వాటికింద మరిన్న రహస్య గదులున్నాయని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. వాస్తవానికి.. 46 మంది రాజులు కొన్ని వందల యుద్ధాలు చేసి, వాటిలో విజయం సాధించిన ప్రతిసారీ ఓటమి పాలైన రాజ్యానికి చెందిన సంపదనంతా తెచ్చి జగన్నాథుని పాదాల దగ్గరే ఉంచేవారట. స్వతహాగా పురుషోత్తముడి భక్తులైన ఉత్కళ రాజులు ఏ రాజ్యంపై దండెత్తినా అక్కడి నుంచి తెచ్చే వజ్ర, వైఢూర్యాలు, రత్నాభరణాలు జగన్నాథుని రత్న భాండాగారంలోనే దాచేవారని చరిత్ర చెబుతోంది. అందుకే, 1978 లెక్కలు నిజాలు కావని, రత్న భాండాగారంలోని అన్ని గదులు తెరవలేదనే వాదనలు వినిపిస్తాయి.
తాళం కనిపించకుండా పోయింది.. సర్కార్ చేయించిన డూప్లికేట్ కీ కూడా మిస్సయింది.. ఐనా రత్న భాండాగారం తెరవడానికి రహస్య సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు కూడా. వీటన్నింటికీమించి రత్న భాండాగారం తెరవకపోతే కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని పురావస్తు శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. అదే జరిగితే ఆలయానికి కూడా ప్రమాదమే. ఎందుకంటే రత్న భాండాగారం ఉంది జగన్నాథుని పాదాల కింద అనే విషయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినప్పటికీ ఒడిశా ప్రభుత్వం మాత్రం రత్న భాండాగారం తెరవడం లేదు. పైగా కమిటీల నివేదికల్లో కూడా ఏముందన్నది బయటకు రానీయడం లేదు. ఇలాంటి సమయంలో హైకోర్టులో ప్రజావాజ్యం దాఖలు కావడం, జులై 10లోగా లెక్క తేల్చాలని కోర్టు ఆదేశించడం దేశ వ్యాప్తంగా ఉత్కంఠను అమాంతం పెంచేసింది. ఇదే సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన బీజేపీ, కాంగ్రెస్‌లు.. ఆలయంలోని ఆ రత్న భాండాగారాన్ని తెరవాలని పట్టుబడుతున్నాయి. ఐదేళ్ల క్రితమే ప్రభుత్వానికి ఆ నివేదిక చేరినప్పటికీ ప్రభుత్వం దాన్ని కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టేసిందని బీజేపీ విమర్శిస్తోంది.
ఒడిశా కాంగ్రెస్‌ సైతం సర్కార్‌ను టార్గెట్ చేస్తోంది. డూప్లికేట్‌ తాళాలు దొరికినప్పటికీ గదిని తెరవడానికి ప్రభుత్వం ఎందుకు సంకోచిస్తోందని ప్రశ్నిస్తోంది. పారదర్శకత పాటిస్తే వెంటనే ఆ నివేదికను బహిరంగపరచాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో ఆధ్యాత్మిక సంఘాలు, భక్తులు, సేవాయత్‌లు సైతం ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో పరిస్థితి తీవ్రం అవుతోందని గ్రహించిన అధికార బీజేడీ ఓ ప్రకటన విడుదల చేసింది. 38 ఏళ్లుగా ఆ రత్న భాండాగారాన్ని తెరవలేదని.. దీనిని విపక్ష పార్టీలు రాజకీయం చేయొద్దంటూ ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మొత్తంగా.. పూరీ జగన్నాథుని రత్న భాండాగారం మిస్టరీ వీడాలంటే జులై 10వరకూ వేచి చూడక తప్పేలా లేదు.

బీజేపీకి షాకిచ్చిన కాంగ్రెస్ : “ఫ్రీ” స్కీంలతో కొత్త మేనిఫెస్టో

కన్నడనాట పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల వ్యూహాలు ఊహకందని రీతిలో కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ అభ్యర్ధిని ఎంపికచేయడంలోనో, ప్రత్యర్ధుల బలహీనతలను దెబ్బకొట్టడంలో నో మాత్రమే కనిపించే వ్యూహాలు.. కర్ణాటకలో మాత్రం మేనిఫెస్టోలకు ఎక్కుతున్నాయి. వాస్తవానికి.. ఏ పార్టీ అయినా తన మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తామో మాత్రమే చెబుతోంది. కానీ, కన్నడనాట అగ్రపార్టీల మేనిఫెస్టోల్లో కావాల్సినంత సంక్షేమంతోపాటూ అంతకుమించిన మాస్టర్ స్ట్రాటజీలు కూడా కనిపిస్తున్నాయి. రీసెంట్‌గా కమలం పార్టీ మేనిఫెస్టోలో పేదోళ్లకి రోజుకు అరలీటరు నందిని పాలు ఫ్రీ అని హామీ ఇస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ సైతం కమలం హామీలకు ఏమాత్రం తీసిపోని వాగ్దానాలు చేసింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యంగా పాత పెన్షన్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వీటిలో పాటే మరో 5 కీలక హామీలు ఇచ్చారు. వాటిలో గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య, యువ నిధి, శక్తి లాంటి పథకాలు ఉన్నాయి. ఈ మేనిఫెస్టో కేవలం వాగ్దానం మాత్రమే కాదని, కర్ణాటక ప్రజలకు మంచి భవిష్యత్తు, సత్వర అభివృద్ధి కోసం తమ నిబద్ధత అని కాంగ్రెస్ చెబుతోంది. ఇంతవరకూ అంతా బాగానే ఉన్నప్పటికీ.. హస్తం పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన ఓ‌ అంశం మాత్రం ఆ రాష్ట్ర ఎన్నికలను మరో మలుపుతిప్పడం ఖాయంగా కనిపిస్తోంది. తాము అధికారంలోకి బజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐ వంటి సంస్థలను నిషేధిస్తామన్న ఒకేఒక్క ప్రకటన ఇప్పుడు మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారిపోయింది. కుల, మత ప్రాతిపదికన వర్గాల మధ్య ద్వేషం వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై బలమైన, నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఇప్పుడు ఇదే అంశాన్ని కమలం పార్టీ ఏకిపారేస్తోంది.
బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రధాని మోడీ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. శ్రీరాముడు, హనుమంతుని పేర్లను జపించే వారితో కాంగ్రెస్ పార్టీకి సమస్య ఉందన్నారు. హనుమంతుని జన్మస్థలంలో ఉండటం తన అదృష్టం అన్న ప్రధాని.. తాను కర్ణాటకలో ఉన్న సమయంలోనే కాంగ్రెస్ ఇలాంటి ప్రకటన చేయడం దరదృష్టం అన్నారు. ఒక్క మోడీ మాత్రమే కాదు.. అంతకుముందు అస్సాం సీఎం హిమంత సైతం హస్తం పార్టీపై అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. పీఎఫ్‌ఐపై ఇప్పటికే నిషేధం ఉందని గుర్తు చేసిన ఆయన.. గతంలో సిద్ధరామ య్య ప్రభుత్వం పీఎఫ్‌ఐ కేసులను ఉపసంహరించుకుంది కాబట్టే ముస్లింలను ప్రసన్నం చేసుకునేందుకు బజరంగ్ దళ్‌పై నిషేధం విధిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో పీఎఫ్‌ఐ, రాడికల్ ముస్లిం సంస్థల మేనిఫెస్టోను పోలి ఉందని అస్సాం సీఎం మండిపడ్డారు.
బీజేపీ విమర్శలు కంటిన్యూ అవుతుండగానే ఢిల్లీలో బజరంగ్ దళ్ మాతృ సంస్థ విశ్వహిందూ పరిషత్ రంగంలోకి దిగింది. అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీపై ఆ పార్టీ కార్యాలయం ముందే ఆందోళనలు షురూ చేసింది. భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యాలయం దగ్గరకు చేరుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఇండియాతో బజరంగ్ దళ్‌ను పోలుస్తూ కాంగ్రెస్ ఈ హామీ ఇవ్వడంపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్ధానాన్ని సవా ల్‌గా తీసుకుంటామని వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ తెలిపారు. కాంగ్రెస్ కార్యాలయం దగ్గర ఆందోళన చేసిన వీహెచ్‌పీ నేతలు సైతం కాంగ్రెస్‌ను హిందూ విరోధిగా అభివర్ణించారు.
ఆర్ఎస్ఎస్ సహా కొన్ని హిందూ సంస్థలపై నిషేధం అనేది చాలా సందర్భాల్లో వినిపించినప్పటికీ అది ఒక పార్టీ వాగ్దానం కిందకు మాత్రం ఎప్పుడూ రాలేదు. కానీ మొదటిసారి ఒక హిందూ సంస్థను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. గతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ను కాంగ్రెస్ పార్టీయే రద్దు చేసింది. అనంతరం కొద్ది రోజులకు నిషేధం ఎత్తి వేసింది. ఇక అప్పటి నుంచి హిందూ సంస్థలు రద్దైన దాఖలాలు లేవు. అప్పుడు రాజకీయ నేతల నుంచి రద్దుకు సంబంధించిన వ్యాఖ్యలు వచ్చినప్పటికీ పార్టీ నిర్ణయాలుగానో వాగ్దానాలుగానో ఎప్పుడూ మారింది లేదు. మళ్లీ ఇన్నేళ్లకు హిందూ సంస్థను రద్దు చేస్తామని ఏకంగా మేనిఫెస్టోలోనే పెట్టడంపై పెద్ద ఎత్తున రాజకీయ చర్చ జరుగుతోంది.
బజరంగ్ దళ్‌ అనేది విశ్వహిందూ పరిషత్ యువజన విభాగం. దేశంలో ఆర్ఎస్ఎస్ తర్వాత అత్యంత ఆదరణ ఉన్న హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్. దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ రద్దు కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో తాము అధికారంలోకి వస్తే పీఎఫ్ఐతో పాటు బజరంగ్ దళ్‌‭ను రద్దు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఇరు వర్గాల మధ్య విధ్వేషాలు సృష్టించడంలో పీఎఫ్ఐ వ్యవహరించిన తీరుగానే బజరంగ్ దళ్‌ సైతం వ్యవహరి స్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చూస్తుంటే, బజరంగ్ దళ్‌ను బ్యాన్ చేస్తామన్న హామీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేదిగానే కనిపిస్తోంది. ఓ వైపు ప్రీపోల్ సర్వేలన్నీ హస్తం పార్టీకే కర్ణాటక పట్టం కడుతుందని అంచనా వేస్తుంటే.. ఇలాంటి సమయంలో పనికట్టుకుని వివాదాలు కొని తెచ్చుకోవడం ఫలితాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందంటున్నారు విశ్లేషకులు.
కమలం పార్టీ సైతం కాంగ్రెస్ హామీని తనకు అనుకూలంగా మార్చుకునే ఛాన్స్ దొరికింది. ఇప్పుడు ఆ దిశగానే ఆ పార్టీ యాక్షన్ కనిపిస్తోంది కూడా. స్వతహాగా హిందుత్వపార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీకి కాంగ్రెస్ తాజా హామీ ఓ అద్భుత అవకాశమే అవుతుందనేది విశ్లేషకుల మాట. మొత్తంగా.. బజరంగ్ దళ్‌ను పీఎఫ్‌ఐతో పోల్చుతూ బ్యాన్ చేస్తామన్న కాంగ్రెస్ హామీ కర్ణాటక ఫలితాల ఈక్వేషన్స్‌ను మార్చేసేలానే కనిపిస్తోంది.