పదిహేనేళ్ళ పాటు పశ్చిమ బెంగాల్‌ను నియంతలా పరిపాలించిన మమతా బెనర్జీకి.. ఈ సారి ఓటర్లు షాకిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో అధికారం కోల్పోయిన దీదీకి.. సొంత పార్టీ ఎంపీలు ఇప్పుడు పార్టీని కూడా దూరం చేసేలా కనిపిస్తున్నారు. మమతా బెనర్జీకి వ్యతిరేకంగా గళం విప్పిన పలువురు తిరుగుబాటు దారులైన ఎమ్మెల్యేలు, ఎంపీలు.. బీజేపీకి మద్దతిస్తూ ఎన్డీయే కూటమిలో చేరటం ద్వారా.. ఏకంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే బీజేపీలో విలీనం చేసేలా కనిపిస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటు దారుల చేతిలో దారుణమైన దెబ్బతిన్న మమతకు మరో షాకిచ్చారు సొంత పార్టీ ఎంపీలు. సుమారు 20 మంది ఎంపీలు ఎన్డీయేకు పూర్తి మద్దతిస్తున్నామంటూ ప్రకటించారు. ఈ మేరకు ఎంపీ కకోలీ ఘోష్ నేతృత్వంలో రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ సమర్పించారు. లోక్‌సభలో పార్టీ చీఫ్ విప్‌గా తాను.. తోటి ఎంపీలతో సంప్రదింపుల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఘోష్ తెలిపారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ.. వారు ఎన్నుకున్న ప్రభుత్వంతోనే కలిసి పని చేయాలని తమ బృందం నిర్ణయించుకుందని ఆమె పేర్కొన్నారు. ఈ విఫయంపై టీఎంసీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ చీలికతో లోక్‌సభలో మమతాబెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌కు కేవలం ఎనిమిదిమంది సభ్యులే మిగిలారు.
ఇప్పటికే మమత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. రితబ్రత బెనర్జీని సపోర్ట్ చేస్తున్న 58 మంది ఎమ్మెల్యేలు మరో బాంబు పేల్చారు. అసలైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమదేననీ.. మమతా బెనర్జీకి పార్టీతో సంబంధం లేదంటూ కొత్త పాటందుకున్నారు. మమత తరఫున మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా తక్కువ మంది అని చెప్పాలి. ఒకప్పుడు మహారాష్ట్రలో శివసేన పార్టీకి పట్టిన గతే ప్రస్తుతం మమతా బెనర్జీ టీఎంసీకి పట్టబోతోందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే ప్రకటించారు. అసలైన తృణమూల్ పార్టీ తమదేనని బెంగాల్ స్పీకర్ వద్ద తమ బలం నిరూపించుకుంటే గనుక.. దశాబ్ధాల తరబడి మమతా బెనర్జీ కట్టుకున్న టీఎంసీ అనే కోటను ఇక వదులుకోవాల్సిందే. ఇప్పటికే బెంగాల్ రాజకీయాలు చిత్రవిచిత్ర మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో మమతా పరిస్థితి.. టీఎంసీ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

