టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. షర్మిళను ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా హౌజ్ అరెస్ట్ చేసినందుకు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిళ.. తన సమీపంలోకి వచ్చిన మహిళా కానిస్టేబుల్ తో పాటు మరో ఎస్సైని తోసేసి రచ్చ రచ్చ చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదే సంఘటనకు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
షర్మిళను అదుపులోకి తీసుకోటానికి వచ్చిన పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగింది. “ఎవరు మీరు..? ఎందుకు వచ్చారు..? నేను బయటకు పోకుండా ఎందుకు కాపలా కాస్తున్నరు..? నేను ఎక్కడికైనా పోతా.. సిట్ ఆఫీసుకే పోతా.. అపోలో హాస్పిటల్ కే పోతా.. చర్చికే పోతా.. నాకు ఇష్టమొచ్చిన చోటికి పోయే హక్కు నాకు లేదా..?” అంటూ అక్కడున్న ఎస్సైపై ప్రశ్నల వర్షం కురిపించింది షర్మిళ. షర్మిళ అడిగిన ప్రతీ ప్రశ్నకూ సమాధానమిచ్చాడు ఆ పోలీసు అధికారి. “నాకు పని లేదా” అంటే.. “ఎందుకు ఉండదు మేడం.. ఉంటుంది..” అన్న ఆ పోలీస్.. “మీకు ఏపనీ లేకపోతే పోయి గొర్లను కాసుకోండి..” అని షర్మిళ అనగానే “ఇప్పుడు అదే పని చేస్తున్నం మేడం..” అంటూ కౌంటర్ ఇచ్చాడు. సడన్ గా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఈ వీడియో వైరల్ అవుతోంది.
షర్మిళను గాడిద అన్న పోలీస్.. వీడియో వైరల్
ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లిక్కర్ డోర్ డెలివరీ
లిక్కర్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలనే ఉద్దేశంతో తమిళనాడు డీఎంకే సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ను డోర్ డెలివరీ చేసే సరికొత్త సౌకర్యాన్ని ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే ఇందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. పెళ్ళిళ్ళు, రిసెప్షన్లు, పుట్టినరోజు వేడుకలు, కొత్త సంవత్సరం వేడుకలు.. ఇలా సందర్భానికి తగినట్టు ఆయా వేడుకల్లో మద్యం సేవించేందుకు అధికారికంగా అనుమతులు ఇచ్చే సరికొత్త లైసెన్స్ విధానం త్వరలోనే అమలు కాబోతోంది. ఎఫ్ఎల్ 12 అనే సరికొత్త లిక్కర్ లైసెన్సింగ్ విధానాన్ని అమలులోకి తీసుకురాబోతున్నట్టు ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను కూడా తమిళనాడు ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ గత నెలలోనే జారీ చేయటం విశేషం.
ఇళ్ళలో లేదా క్లబ్ లేదా ఫంక్షన్ హాల్.. ఇలా ఏదైనా ఓ చోట పెళ్ళి లేదా మరేదైనా వేడుకలో మద్యం తాగేందుకు ఒకటి లేదా రెండు రోజులకు లైసెన్స్ ఇస్తారు. ఈ లైసెన్స్ తీసుకున్న వారికి ఆయా వేడుకల్లో అతిథులు సేవించటానికి మద్యం సరఫరా చేస్తారు. ఈ లైసెన్స్ కోసం వారం రోజుల ముందు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కొత్త వెబ్ సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా సరఫరా చేయాలనుకునే వారు ముందుగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి లైసెన్స్ వచ్చిన తర్వాత వారి వారి ఏరియాల్లో మద్యం సరఫరా చేసుకోవచ్చు. కమర్షియల్ ఈవెంట్ల కోసం అయితే కార్పోరేషన్లలో సంవత్సరానికి లక్ష రూపాయలు, మున్సిపాలిటీలలో 75 వేలు, ఇతర ప్రదేశాల్లో 50వేలు లైసెన్స్ ఫీజుగా ప్రభుత్వానికి చెల్లించాలి. ఇక ఇళ్ళలో జరిగే ఫంక్షన్లకు లిక్కర్ సరఫరా చేయటానికి ఇచ్చే లైసెన్స్ ను నాన్ కమర్షియల్ లైసెన్స్ గా పేర్కొంటారు. ఈ పద్ధతిలో ఒక్క రోజు లైసెన్స్ కోసం మున్సిపల్ కార్పోరేషన్లలో 11 వేలు, మున్సిపాలిటీలలో 7500, గ్రామాల్లో మరియు ఇతర ప్రాంతాల్లో 5 వేలు చెల్లించాలి. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కేవలం లిక్కర్ పై వచ్చే ఆదాయంపైనే ఎక్కువ శాతం ఆధారపడాల్సి వచ్చిన రాష్ట్రాలకు ఇదో మార్గదర్శకం లాంటిది. త్వరలోనే తమిళనాటు బాటలోనేే మరిన్ని రాష్ట్రాలు లిక్కర్ హోమ్ డెలివరీ విషయంలో కొత్త లిక్కర్ పాలసీలు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
చలాకీ చంటికి గుండెపోటు
బుల్లి తెర కమెడియన్ చలాకీ చంటికి గుండెపోటు వచ్చి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 21న తీవ్రమైన చాతీ నొప్పి రావటంతో గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ కు తరలించగా చంటిని పరీక్షించిన డాక్టర్లు.. హార్ట్ ఎటాక్ అని నిర్ధారించారు. కాకపోతే తీవ్రమైన గుండెపోటు కాకపోవటంతో చంటికి ప్రమాదం తప్పిందని.. ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో ఉంచారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చంటి బ్లడ్ వెసెల్స్ లో రక్తం గడ్డ కట్టి అక్కడక్కడ పూడికలు ఉన్నాయనీ.. ఈ హార్ట్ బ్లాక్స్ కారణంగా రక్త సరఫరాలో చిన్న ఆటంకం ఏర్పడి హార్ట్ ఎటాక్ వచ్చిందని.. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదనీ కేర్ హాస్పిటల్ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం చంటి ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
చంటికి హార్ట్ అటాక్ వచ్చిందన్న విషయం ఈ రోజు వరకు అతడి కుటుంబ సభ్యులు బయటకు వెల్లడించలేదు. చంటికి చాలా దగ్గరి స్నేహితులు, బంధువులకు మాత్రమే అతని పరిస్థితి వివరించారు తప్ప బయటకు రానివ్వలేదు. ఈ విషయం తెలిసిన చంటి అభిమానులు, చంటితో పాటు బుల్లితెరపై నటించిన అతడి సహ నటీనటులు, జబర్దస్త్ కమెడియన్స్ షాక్ కు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే కేర్ హాస్పిటల్స్ కు వెళ్తున్నారు. అయితే చంటి ఐసీయూలోనే ట్రీట్మెంట్ తీసుకుంటుండటంతో ఎవరినీ కలిసే పరిస్థితి లేదు.
పోలీసులపై చేయి చేసుకున్న షర్మిళ, విజయమ్మ.. అరెస్టు
తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలిసిన పోలీసులు షర్మిళను ఇంటి దగ్గరే ఆపివేశారు. తనను రోడ్డు మీదకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ షర్మిళ తన అనుచరులతో కలిసి రోడ్డు మీద బైఠాయించగా.. పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన షర్మిళ పోలీస్ కానిస్టేబుల్లను నెట్టివేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ మహిళా పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు షర్మిళను అరెస్టు చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
షర్మిళ అరెస్టును నిరసిస్తూ వైఎస్ విజయమ్మ ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఆందోళన చేపట్టగా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ పై విజయమ్మ చేయి చేసుకోవటం వివాదాస్ఫదమైంది. దీంతో విజయమ్మపై కేసు నమోదు చేసిన పోలీసులు బలవంతంగా విజయమ్మను కార్లో ఎక్కించి వెనక్కి పంపించివేశారు. షర్మిళ, విజయమ్మ ఇద్దరూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తనను అడ్డుకుంటున్న మహిళా కానిస్టేబుల్ పై విజయమ్మ చేయి చేసుకోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అటు షర్మిళ కూడా మహిళా పోలీసులను తిడుతూ నెట్టేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రాహుల్ గాంధీ ఇల్లు ఖాళీ చేయించిన అధికారులు
పరువు నష్టం కేసులో జైలు శిక్ష పడిన మాజీ పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి తన తల్లి సోనియా నివాసానికి వెళ్ళిపోయాడు. కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా గెలుపొందిన రాహుల్ గాంధీ 2005 ఏప్రిల్ 22న ఢిల్లీ లోని తుగ్లక్ లేన్ 12వ ప్రభుత్వ అధికారిక నివాసానికి మారాడు. సరిగ్గా ఇప్పుడు ఏప్రిల్ 22వ తేదీనే రాహుల్ తన అధికారిక గృహాన్ని యాధృచ్ఛికంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. 10 జన్ పథ్ లోని సోనియా అధికారిక నివాసానికి రాహుల్ తన సామాగ్రిని షిఫ్ట్ చేసుకున్నాడు. పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయిన వెంటనే ఎంపీలు తమ అధికారిక నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చి రాహుల్ ను ఇల్లు ఖాళీ చేయిస్తే.. కాంగ్రెస్ మాత్రం బీజేపీ రాహుల్ పై కక్ష సాధిస్తున్నదంటూ ఆరోపణలు చేస్తోంది. బీజేపీ నేతలు మాత్రం చేసుకున్న ఖర్మకు ఫలితం అనుభవించక తప్పదంటూ హిత బోధ చేస్తున్నారు.
లోక్ సభ సాధారణ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ ఎన్నికల ప్రచారసభలో ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ.. దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఉంటుంది ఎందుకో.. అంటూ పరోక్షంగా ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకొని వివాదాస్ఫద వ్యాఖ్య చేయగా.. గుజరాత్ ఎమ్మెల్యే అయిన పూర్ణేశ్ మోడీ రాహుల్ పై పరువునష్టం కేసు దాఖలు చేశాడు. గత నెల ఈ కేసును విచారించిన గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సూరత్ కోర్టుపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ రాహుల్ కు ఎదురుదెబ్బ తప్పలేదు. ప్రస్తుతం రాహుల్ ఆండ్ టీమ్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ కూడా రాహుల్ గాంధీకి చుక్కెదురైతే ఇక రాహుల్ రాజకీయ జీవితం ముగిసినట్టే అనే అంచనాలు వినిపిస్తున్నాయి.
మోదీ పర్యటనపై “సూసైడ్ బాంబ్” : కేరళలో బెదిరింపు లేఖ కలకలం
ప్రధానమంత్రి మోదీ పర్యటనపై ఆత్మాహుతి దాడి చేస్తామంటూ బీజేపీ కార్యాలయానికి వచ్చిన బెదిరింపు లేఖతో కేరళ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. వారం రోజుల క్రితమే రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి ఈ లేఖ వచ్చినప్పటికీ బీజేపీ నేతలు దీన్ని దాచి ఉంచారు. కాకపోతే.. లేఖ అందగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.సురేంద్రన్ ఈ లేఖతో పాటు మిగతా వివరాలను ఇంటలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ కు అందజేశారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన సెక్యూరిటీ ప్రోటోకాల్ అంశాలు మీడియాకు లీక్ కావటంతో అందులోని ఈ లేఖ విషయం కూడా బయటకు వచ్చింది. రసహ్యంగా ఉంచాల్సిన లేఖ విషయం లీక్ కావటంపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ కేరళ పోలీసు శాఖను ఆదేశించారు.
ఏప్రిల్ 24న ప్రధాని మోదీ కేరళలో పర్యటించనున్నారు. కొచ్చిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించటంతో పాటు తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను మోదీ ప్రారంభించనున్నారు. బెదిరింపు లేఖ నేపథ్యంలో మోదీ కేరళ పర్యటన రద్దు అవుతుందంటూ వార్తలు రాగా.. దీనిపై కేరళ బీజేపీ స్పందించింది. మోదీ పర్యటన యధావిధిగా ఉంటుందంటూ స్పష్టం చేసింది. కశ్మీర్ లో జీ20 సదస్సు నిర్వహణపై పాకిస్తాన్ నుంచి హెచ్చరికలు రావటం.. అతీక్ అహ్మద్ హత్య తర్వాత తీవ్రవాద సంస్థల నుంచి హెచ్చరికలు రావటం.. ఇప్పుడు కేరళలో ఆత్మాహుతి దాడి చేస్తామంటూ హెచ్చరికలు రావటం.. అన్నింటి వెనుక ఉన్నది ఒక్క కుట్ర కోణమే అనేది ఇంటలిజెన్స్ అనుమానం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో పరిస్థితులు అద్బుతంగా ఉన్నాయని నిరూపించేందుకే బీజేపీ ప్రభుత్వం కశ్మీర్ లో జీ-20 సదస్సు నిర్వహించేందుకు సిద్ధపడింది. కానీ.. కశ్మీర్ లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నాయన్న విషయం బయట ప్రపంచానికి తెలియటం ఇష్టంలేని పాకిస్తాన్, చైనా దేశాలు ఇలా తీవ్రవాద సంస్థలతో బెదిరింపులకు పాల్పడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన విషయంగా మారింది.
ఈటెల కామెంట్లతో ఇరుక్కున్న బీజేపీ : కాంగ్రెస్ కు మైలేజ్
రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న వారు కూడా అప్పుడప్పుడు రాంగ్ స్టేట్మెంట్లు ఇచ్చి నాలుక కరుచుకుంటారు. అయ్యో ఎంత మాట అనేశాను.. అంటూ రిగ్రెట్ అవ్వాల్సిన పరిస్థితి తెచ్చుకుంటారు. ఇప్పుడు తెలంగాణ సీనియర్ లీడర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు. తాజాగా ఆయన చేసిన ఓ వ్యాఖ్య తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టడమే కాకుండా.. కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత మైలేజీ తెచ్చిపెట్టింది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డికి 25 కోట్లు ముడుపులు అందాయంటూ ఈటెల ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను హీటెక్కించాయి. ఈటెల మాటలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఘాటైన కౌంటర్లు పడిపోతున్నాయి. దీంతో తెలంగాణ బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయింది.
“నేను 25 కోట్లు తీసుకున్నట్టు నీ దగ్గర ఆధారాలుంటే చూపించు.. లేకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయానికి తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయి.. నేనూ నీతో పాటే వస్తా.. ప్రమాణం చేస్తా..” ఇవీ ఈటెల ఆరోపణలకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన కౌంటర్ వ్యాఖ్యలు. ఎప్పుడు ఏ వివాదం జరిగినా బండి సంజయ్ లాంటి వాళ్ళు చేసే సవాల్ ఒక్కటే.. భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రమాణం. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని బీజేపీపైనే కాంగ్రెస్ ప్రయోగించింది. ఈటెల ఆరోపణలపై భగ్గుమన్న రేవంత్ రెడ్డి మొత్తం బీజేపీని ఉతికి ఆరేశాడు. ఇక మిగిలిన కాంగ్రెస్ నేతలు మాత్రం ఊరుకున్నారా.. వాళ్ళూ బీజేపీ నేతలను ఓ ఆట ఆడేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈటెలకు సొంత పార్టీ నేత విజయశాంతి నుంచి కూడా కౌంటర్ రావటం మరో ఎత్తు. ఈటెల ఆలోచించి మాట్లాడాలి.. లేకపోతే తెలంగాణ బీజేపీ పరువు పోతుంది.. అంటూ విజయశాంతి ట్విటర్ లో ట్వీట్ చేసి ఈటెలకు షాకిచ్చింది. ప్రస్తుతానికి ఈ ప్రమాణాల పర్వం పీక్స్ లో ఉంది.. ఇక ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.
పూజా హెగ్డే వైరల్ వీడియో : సోషల్ మీడియాలో ట్రోలింగ్
ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కొడితే.. ఆ తర్వాత వరుస అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. ఇదీ పూజా హెగ్డే కెరీర్ పరిస్థితి. ఒక లైలా కోసం సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూజా.. ఒక్క హిట్ పడితే ఆ తర్వాత వరుస ఫ్లాపులు కొడుతోంది. లేటెస్ట్ గా అప్పుడెప్పుడో ఫస్ట్ లాక్ డౌన్ కు ముందు అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిందంటే.. ఇప్పటి వరకూ మళ్ళీ హిట్ సినిమాయే లేదు పాపం. దీనికి తోడు తరచూ పూజా ట్రోలర్లకు ఫుల్ స్టఫ్ ఇచ్చేస్తోంది తన ఏడుపు సీన్లతో. ఏదైనా సినిమాలో ఏడవాల్సిన సీన్ ఉంటే.. ఇంక ఆ సీన్ లో పూజా నటన.. ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా ఉండవు. అసలు ఏడుస్తోందా.. లేక నవ్వుతోందా.. లేక నవ్వలేక ఏడుస్తోందా.. ఏడ్వలేక నవ్వుతోందా.. అన్నట్టుగా ఉంటుంది ఆమె యాక్టింగ్. అరవింత సమేత సినిమాలో పూజ ఏడుపు సీన్ ఇప్పటికీ సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా పూజాను మరో సారి ట్రోలర్ల చేతికి చిక్కేలా చేసింది.
సల్మాన్ ఖాన్ కొత్త సినిమా కిసీ కీ జాన్ కిసీకా భాయ్ సినిమాలో సల్మాన్ ముందు కూర్చొని పూజా హెగ్డే ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదివరకటి లాగే పాపం పూజా ఏడుస్తోందో.. నవ్వుతోందో తెలియని విచిత్రమైన ఎక్స్ ప్రెషన్. చాన్స్ దొరికితే చాలు రెచ్చిపోయే సోషల్ మీడియా మీమర్స్.. పూజా వీడియోను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక పూజా హెగ్డే మరో విషయంలో కూడా ట్రోల్ అవుతోంది. ఆమె అడుగు పెడితే చాలు సినిమా ఫట్టు.. ఆమెది ఐరన్ లెగ్ అని. భారీ అంచనాలతో వచ్చిన సూపర్ స్టార్ల సినిమాలు రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య.. ఇలా వరుసగా ఫ్లాప్ సినిమాలే అన్నీ. దీంతో త్వరలో రాబోయే మహేష్ బాబు సినిమాపై ఫ్యాన్స్ ఇప్పటి నుంచే వర్రీ అవుతున్నారు పాపం.
అతీక్ ను చంపినందుకు ప్రతీకారం తప్పదు : అల్ ఖైదా వార్నింగ్
ఉత్తర్ ప్రదేశ్ మోస్ట్ డేంజరస్ రౌడీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ ను చంపినందుకు భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ పాకిస్తాన్ కు చెందిన అల్ ఖైదా భారత్ ను హెచ్చరించింది. చనిపోయిన ఇద్దరినీ అమరవీరులుగా గుర్తిస్తున్నట్టు రంజాన్ సందేశంలో పేర్కొన్న అల్ ఖైదా.. తమ వారిని చంపినందుకు ప్రతీకార దాడులు తప్పవని తీవ్ర హెచ్చరికలు చేసింది. ఈ ఇద్దరు రౌడీ షీటర్ల హత్యను కొన్ని పార్టీలు రాజకీయం చేసి వాడుకొని ఏదో అమాయకులను ప్రభుత్వం చంపినట్టు చిత్రీకరిస్తున్నాయి. వందకు పైగా క్రిమినల్ కేసులు.. హత్య, కిడ్నాప్ వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి. పాకిస్తాన్ ఐఎస్ఐతో పాటు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. అల్ ఖైదా బెదిరింపుతో ఇప్పుడు అతీక్ గ్యాంగ్ కు తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న విషయం స్పష్టమవుతోంది. ఇలాంటి వ్యక్తులను ప్రజా నాయకులుగా, అన్యాయానికి గురి కాబడిన వారిగా చిత్రీకరిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయి కొన్ని పార్టీలు.
సమాజ్ వాదీ పార్టీ తరఫునే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నికైన అతీక్.. అదే పార్టీ కోసం ఎన్నో నేరాలు చేసినా సమాద్ వాదీ నేతలు మాత్రం అతీక్ ఓ దేశభక్తుడు, సంఘ సంస్కర్త అనే స్థాయిలో ప్రచారం చేస్తోంది. అధికార బీజేపీ తో పాటు సీఎం యోగీ అదిత్యనాథ్ ముస్లింలపై కక్షకట్టిందంటూ అబద్ధపు ప్రచారం చేస్తోంది. రాజకీయ లాభం కోసం కొంత మంది చేస్తున్న ఈ దుష్ప్రచారం నిజంగానే హిందూ, ముస్లిం వర్గాల మధ్య అగ్గి రాజేస్తే పరిస్థితి చేయిదాటిపోతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్యాంగ్ స్టర్ ను ప్రత్యర్థులు మాటు వేసి హత్య చేస్తే అది బీజేపీ కక్ష సాధింపు చర్య అనీ, ముస్లింలపై దౌర్జన్యమనీ ప్రచారం చేయటం కేవలం అఖిలేష్ యాదవ్ పార్టీకే చెల్లింది. ఇప్పుడు అల్ ఖైదా ఎంట్రీతో త్వరలో ఇది భారత్-పాకిస్తాన్ సమస్యగా చిత్రీకరించబడుతుంది. దీన్ని ఇక్కడికిక్కడే అణచి వేయకపోతే.. భారత్ లో అంతర్గత పోరుకు దారితీస్తుంది అనటంలో సందేహం లేదు.
రష్యా విమానం భారీ పొరపాటు.. ధ్వంసమైన సొంత నగరం
రష్యా యుద్ధ విమానం వల్ల జరిగిన చిన్న పొరపాటు భారీ విధ్వంసానికి కారణమయ్యింది. ఉక్రెయిన్ సరిహద్దుకు దగ్గరగా ఉండే బెల్గోరాడ్ నగరంపై రష్యా యుద్ధ విమానం పొరపాటున బాంబును జారవిడవటంతో నగరంలో భారీ విధ్వంసం జరిగింది. బాంబు పడిన చోట సుమారు 40 మీటర్ల వ్యాసంలో భారీ గొయ్యి ఏర్పడింది. చుట్టుపక్కల భవనాలు భారీగా దెబ్బతిన్నాయి. వాహనాలు ఎగిరి చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే.. ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని రష్యా సైన్యం తెలిపింది. పేలుడు ధాటికి కొంత మంది చిన్న చిన్న గాయాలపాలైనట్టు చెప్తోంది.
ఉక్రెయిన్ తో యుద్ధం మొదలైన నాటి నుంచి రాత్రిపూట ఉక్రెయిన్ లోని కీలక స్థావరాలపై రష్యా వైమానిక దాడులు చేస్తోంది. ఇప్పటికే చాలా రకాల ఆయుధాలు వినియోగించిన రష్యా ఆయుధ డిపోల్లో వెపన్స్ సంఖ్య తగ్గిపోవటంతో రష్యా పెద్ద పెద్ద ఆయుధాలను కూడా బయటకు తీస్తోంది. తాజాగా సుఖోయ్-34 యుద్ధ విమానాలను రష్యా రంగంలోకి దించింది. ఇది యుద్ధంలో చాలా పెద్ద విధ్వంసాన్ని సృష్టించగల విధ్వంసకారి. రకరకాల ఆయుధాలతో పాటు భారీగా సైన్యాన్ని మోసకెళ్ళగలదు. కళ్ళు మూసి తెరిచేలోగా లక్ష్యాలపై దాడులు చేసి తిరిగి వచ్చేయటం దీని ప్రత్యేకత. అయితే.. రష్యా ఇలాంటి సుఖోయ్-34 యుద్ధ విమానాలను ఎన్నింటిని సైన్యానికి అందజేసిందో మాత్రం వెల్లడికాలేదు. అమెరికా, యూరప్ దేశాలు ఇంకా ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేస్తుండటం పుతిన్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. ప్రస్తుత యుద్ధం పరిస్థితి చూస్తుంటే పుతిన్ ఏ క్షణంలోనైనా తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.