తెలంగాణలో జనసేన పోటీ చేయటాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించటంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యాడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో.. జనసేనాని స్వయంగా తన ఇంటి ముందు కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలను తీవ్రంగా విమర్శించాడు. తెలంగాణలో అడుగుపెట్టవద్దని చెప్తున్న కాంగ్రెస్ నేతలు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకులు.. కనీసం ఎప్పుడైనా జై తెలంగాణ అన్నారా అంటూ ప్రశ్నలు సంధించాడు పవన్ కళ్యాణ్. కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడిన పవన్.. బీఆర్ఎస్ పార్టీ మరియు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
“తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు గానీ.. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గానీ.. కేసీఆర్ గురించి ఒక్క మాటైనా తప్పుగా మాట్లాడానా.. ఈ రోజు పదవులు అనుభవిస్తున్న కాంగ్రెస్ నేతల్లో ఒక్కరైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా.. ఆంధ్రా ప్రజలు వ్యతిరేకించినా నేను తెలంగాణ ఉద్యమానికి మద్దతిచ్చాను.. నా జీవితంలో తెలంగాణ అంతర్భాగం.. ఆంధ్రాలో ఓడిపోయినప్పుడు.. నేను తెలంగాణలో పోటీ చేసి ఉంటే ఓడిపోయి ఉండేవాడిని కాదని తెలంగాణ జనసేన నేతలు నాతో అన్నారు..” అంటూ వ్యాఖ్యానించాడు పవన్ కళ్యాణ్. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ప్రాంతీయ విభేధాలు రెచ్చగొడుతున్నారనీ.. ఇంకొంత మంది ఆంధ్రా తెలంగాణ పేరుతో విడదీసి లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై విమర్శలు చేశారు. ఆంధ్రా తెలంగాణ ప్రాంతీయ విభేధాలపై కొద్ది రోజుల నుంచి చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకోగా.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

