Home Blog Page 21

తెలంగాణలో అమిత్ షా పర్యటన : ఆర్ఆర్ఆర్ టీమ్ తో పార్టీ

0

హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 23న అమిత్ షా హైదరాబాద్ రానున్నారు. అదే రోజు సాయంత్రం ఆర్ఆర్ఆర్ టీమ్ తో పార్టీలో పాల్లొని ఆస్కార్ దక్కించుకున్నందుకు వారిని సన్మానించనున్నారు. ఈ పార్టీకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, చంద్రబోస్, కీరవాణి తదితరులకు అఫీషియల్ గా ఇన్విటేషన్ అందిందని సమాచారం. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నేతలతో పార్టీ సమావేశంలో పాల్గొని ఆ తర్వాత సాయంత్రం చేవెళ్ళలో జరిగే పార్టీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీ వచ్చి వెళ్ళిన కొద్ది రోజులకే అమిత్ షా తెలంగాణలో పర్యటించటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రస్తుతం బీజేపీ జాతీయ నేతలంతా ఆ ఎన్నికలపై ఫోకస్ చేయటంతో పాటు అదనంగా తెలంగాణపై కూడా దృష్టి సారిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే తరచుగా జాతీయ నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. అమిత్ షా సభ కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితర బీజేపీ నేతలు అమిత్ షా సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలోని పలువురు అసంతృప్త నేతలు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి ఒకరు ఇదే బాటలో ఉన్నారంటూ బీజేపీ నేతలు హింట్స్ ఇస్తున్నారు. ఏపీలో విశాఖ ఉక్కు చుట్టూ తిరిగిన రాజకీయాల్లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఎంటర్ కావటం.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్న నేపథ్యంలో అమిత్ షా పర్యటన ఆసక్తికరంగా మారింది.

“విరూపాక్ష” రివ్యూ

0

బైక్ యాక్సిడెంట్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా విరూపాక్ష సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. రొటీన్ యాక్షన్, లవ్ స్టోరీతో కాకుండా ఈ సారి థ్రిల్లర్ కథతో తెరకెక్కిన విరూపాక్ష సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. విరూపాక్ష ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వచ్చేలా చేసింది. విడుదలకు ముందు సినిమా యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేసింది విరూపాక్ష. శుక్రవారం రిలీజైన ఈ సినిమా అంచనాలకు తగ్గట్టే ప్రేక్షకులను థ్రిల్ చేసింది.
ఓ ఊరిలో అనుకోకుండా జరిగిన ఓ భయానక ఘటన.. ఆ ఘటన తర్వాత ఆ గ్రామంలో జరిగే పర్యవసానాలు.. వాటికి కారణాలను వెతుక్కుంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళే ఓ యువకుడు.. చిత్ర విచిత్రమైన మరియు భయానక పరిస్థితులు.. ఊహించని ట్విస్టులు.. చివరకు ఆ యువకుడు సమస్యకు పరిష్కారం కనుక్కోవటం.. ఇదీ విరూపాక్ష బేస్ స్టోరీ.
రుద్రవనం అనే ఊరిలో చేతబడి చేస్తున్నారంటూ ఓ జంటను సజీవదహనం చేస్తారు గ్రామస్తులు. చనిపోయే సమయంలో ఆ జంట ఊరిని శపిస్తారు. ఆ శాపం వల్ల ఊరిలో వరుస మరణాలు సంభవిస్తుంటాయి. దీనికి పరిష్కారంగా ఊరిని అష్టదిగ్బంధనం చేస్తారు గ్రామస్తులు. కానీ తాను ప్రేమించిన అబ్బాయి కోసం ఆ ఊరి అమ్మాయి పొలిమేర దాటడంలో ఊహించని విపత్తు గ్రామానికి ఎదురౌతుంది. తాను ప్రేమించిన అమ్మాయిని ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడేయటానికి.. ఊర్లో జరుగుతున్న మరణాలకు కారణాలు కనుక్కోటానికి ఆ ఊర్లో అడుగుపెడతాడు హీరో. ఆ క్రమంలో అతడికి ఊహించని పరిస్థితులు ఎదురవుతుంటాయి. జీవితంలో ఎప్పుడూ చూడని.. కనీసం ఊహించని భయానక పరిస్థితుల్లో హీరో ఏమాత్రం భయపడకుండా ముందుకెళ్తాడు. ఈ క్రమంలో కథలోని ట్విస్టులు ప్రేక్షకులను షాక్ కు గురి చేస్తాయని చెప్పాలి. థ్రిల్లింగ్ స్టోరీ అంటే నిజంగా థ్రిల్ అయ్యేలాగానే కథ రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. ఇక సుకుమార్ స్క్రీన్ ప్లే గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అజనీష్ లోక్ నాథ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను కథతో ఎంగేజ్ అయ్యాలా చేసింది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ థ్రిల్లర్ కథకు తగినట్టు అద్భుతంగా ఉంది. ఇక సంయుక్త, రాజీవ్ కనకాల, అభినమ్ గోమఠం.. ఇలా మిగితా పాత్రలన్నీ బాగానే ఉన్నాయి. మొత్తానికి సినిమా నిజమైన థ్రిల్లర్.. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా.

ఇండియన్ పాపులేషన్ పై చైనా ఏడవటానికి కారణమిదే..!

“క్వాంటిటీ కాదు.. క్వాలిటీనే ఇంపార్టెంట్”. ఈ మాటంది మరెవరో కాదు డ్రాగన్ కంట్రీ చైనా. అదికూడా మన దేశాన్ని ఉద్దేశించే. దీనికి కారణం జనాభాలో ఇండియా చైనాను బీట్ చేయడమే. ఇప్పటికే జనాభా కొరతతో తిప్పలు పడుతున్న డ్రాగన్.. తాజా పరిణామాలను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతోంది. ఫలితంగా ఇండియన్లలో కష్టించే తత్వం లేదంటూ కౌంటర్లేస్తోంది. చైనా కడుపుమంటను కాస్త పక్కనపెట్టేస్తే.. మన దేశంలోనూ చాలా మందికి పెరుగుతున్న జనాభాతో ఏం జరగబోతోందనే ఆందోళన కనిపిస్తోంది. చైనా, జపాన్, దక్షిణ కొరియా.. ఈ మూడు దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జనాభా తగ్గుదల. ఈ దేశాల్లో జననాల రేటు దారుణంగా పడిపోయింది. చైనా, జపాన్‌లో అయితే వృద్ధుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ రెండు దేశాలు మాత్రమే కాదు ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కూడా వృద్ధాప్యమే. ఏ దేశంలో ఐనా జననాల రేటు పడిపోయి వృద్ధుల సంఖ్య పెరిగితే అప్పుడే వాటి పతనం మొదలయినట్టు. అందుకే, జనాభా రేటు తగ్గుతుందని తెలియగానే ఆయా దేశాలు ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు పిల్లల్ని కనండి మహా ప్రభో అని ప్రజలను మొత్తు కుంటాయి. ప్రస్తుతం చైనా, జపాన్‌, దక్షిణ కొరియాల పరిస్థితి అలాగే ఉంది. జిన్‌పింగ్ సర్కార్ ఐతే కాలేజీ విద్యార్థులకు ప్రేమించుకోండి అంటూ ప్రత్యేక సెలవులు ఇస్తోంది. ఒక్క సెలవులేంటి? పెళ్లి కాకుండానే పిల్లల్ని కనే అవకాశంతో పాటూ ఆ పిల్లల పెంపకానికయ్యే ఖర్చుల వరకూ అన్నింట్లో అండగా ఉంటోంది. ఈ పాట్లన్నీ జననాల రేటు పెంచుకోవడం కోసమే. కానీ, ఆశించిన ఫలితాలు మాత్రం ఆ దేశంలోనే కాదు మరే దేశంలోనూ కనిపించడం లేదు. ఒక్క ఇండియా విషయంలో తప్ప..!
ప్రపంచ జనాభాలో ఇప్పుడు మనమే నెంబర్‌ వన్. ఇప్పట్లో మనల్ని కొట్టేవారే లేరు. ఉండరు కూడా. ప్రస్తుతం మన దేశ జనాభా 142.86కోట్లు.. అది చైనాకంటే 29 లక్షలు అధికం.. ఇంకాస్త గట్టిగా చెప్పాల్సి వస్తే, ప్రపంచ జనాభాలో ఐదోవంతు మన దగ్గరే ఉంది. చైనా జనాభా 142 కోట్ల 57 లక్షలు ఉండగా.. 34 కోట్ల జనాభాతో అమెరికా ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. గతేడాది నుంచి చైనా జనాభా తగ్గుదల మొదలు కాగా.. ఎప్పట్లాగే భారత జనాభా పెరుగుతుండటంతో.. మన దేశం డ్రాగన్‌ను వెనక్కి నెట్టి జనాభా విషయంలో మొదటి స్థానానికి చేరుకుంది. వాస్తవానికి..భారత్‌లో చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. 2021లో జన గణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్-19 కారణం గా ఆలస్యమైంది. దీంతో భారత్ సరిగ్గా ఏ రోజున చైనాను దాటేసిందనే విషయాన్ని చెప్పలేమని ఐక్యరాజ్య సమితి అధికారులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 804.5 కోట్ల మంది నివసిస్తుండగా.. అందులో మూడొంతుల జనాభా ఈ రెండు దేశాల్లోనే నివసిస్తున్నారు. గత ఆరు దశాబ్దాల్లో తొలిసారిగా గత ఏడాది చైనా జనాభా తగ్గింది. 2022లో చైనాలో నమోదైన జననాల కంటే మరణాల సంఖ్యే ఎక్కువ.
యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ డేటా ప్రకారం భారత జనాభాలో 25శాతం 0-14ఏళ్ల మధ్య వయసువారే. ఇక 10నుంచి 19 ఏళ్ల వయసున్నవారు 18శాతం. అదే 10నుంచి 24 ఏళ్లను తీసుకుంటే 26శాతం జనాభా వారే.. ఇంకా చెప్పాలంటే సగం జనాభా 30ఏళ్లలోపు వారే.. కొన్ని లెక్కల ప్రకారం కేరళ, పంజాబ్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతుండగా.. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో యువజనాభా కనిపిస్తోంది. ఈ లెక్కల ప్రకారం మరో మూడు దశాబ్దాల పాటు జనాభాలో మనల్ని కొట్టేవారుండరు.. ఇదే ఊపులో పెరుగుతూ పోతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 165కోట్ల మార్కును టచ్ చేస్తాం. ఆ తర్వాత నుంచి తగ్గుదల మొదలవుతుందని అంచనా వేస్తున్నారు. 2050నాటికి మన జనాభా 165కోట్లకు చేరితే చైనా జనాభా 131కోట్లకు పడిపోతుందని చెబుతున్నారు. నిజానికి.. ప్రపంచజనాభా వయసు పెరుగుతోంది. కానీ మన దగ్గర మాత్రం యువజనాభా పెరుగుతోంది. అంటే వర్క్‌ఫోర్స్‌ అంతా మన దగ్గరే ఉండబోతోంది. చైనాలో కఠినమైన ఆంక్షల కారణంగా గత కొన్ని దశాబ్దాల్లో జనాభా తగ్గిపోయింది. వయసుపైబడిన వారి సంఖ్య పెరిగింది. యువజనాభా తగ్గింది. అదే ఇప్పుడు ఆ దేశం కొంపముంచింది. అందుకే ఒక్కసారిగా జనాభాను పెంచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాకు వయసే ఇప్పుడు అడ్వాంటేజ్. మన జనాభాలో పావుశాతం 14ఏళ్లలోపు వారే. అంటే మరో రెండు దశాబ్దాలు వారివే. మిగిలిన దేశాల్లో జనాభా తగ్గుదల కారణంగా మన యంగ్ ఇండియానే గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌గా మారుతుందనడంలో అనుమానమే అక్కర్లేదు.
ఇదిలా ఉంటే.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలవడం పట్ల చైనా ఎప్పట్లానే
కడుపుమంట బయటపెట్టుకుంది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ వెన్‌బిన్.. జనాభా ఎంత ఎక్కువ అనేదాని కంటే ఎంత నాణ్యమైన జనాభా ఉందనేదే ముఖ్యమంటూ కన్నింగ్ కామెంట్ చేశారు. జనాభా ముఖ్యమే గానీ.. టాలెంట్ కూడా ముఖ్యమేనన్నారు. తమ దేశంలో ఇప్పటికీ 90 కోట్ల మంది పని చేసే ప్రజలు ఉన్నారని.. తమ దేశాభివృద్ధి కోసం వారు ఇతోధికంగా శ్రమిస్తున్నారని వాంగ్ చెప్పుకొచ్చారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘చైనాలో దాదాపు 90 కోట్ల మంది పని చేసే వారుండగా.. ఏటా కోటిన్నర మంది కొత్తగా శ్రామికవర్గంలో చేరుతున్నారు. చైనాలో 24 కోట్ల మందికిపైగా ఉన్నత విద్యను పూర్తి చేశారు. ప్రస్తుతం శ్రామిక వర్గంలో చేరుతున్న వారు సగటున 14 ఏళ్లు చదువుతున్నారని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ కూడా కామెంట్ చేశారు. పైకి ఇలాంటి లెక్కలు చెబుతున్నప్పటికీ డ్రాగన్ దేశంలో వాస్తవ పరిస్థితులు మాత్రం అవి కావు.
2022లో చైనా జనాభా 8 లక్షల 50 వేలు తగ్గింది. చైనా జనాభా పెరుగుదల రేటు మైనస్ 0.6 శాతంగా నమోదైందని నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2023 జనవరిలోనే ప్రకటించింది. నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం 2020 నాటికి చైనాలో 60 ఏళ్లు దాటిన జనాభా 26.4 కోట్లుగా ఉంది. ఈ రెండు మూడేళ్లలో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2035 నాటికి చైనాలో 40 కోట్ల మంది వృద్ధులు ఉండనున్నారు. ఇది అప్పటి చైనా జనాభాలో 30 శాతం ఉండనుండటం ఆ దేశ పాలకులను ఇప్పటికే టెన్షన్ పెడుతున్న అంశం. వృద్ధుల సంఖ్య పెరిగేకొద్దీ పని చేసే వారి సంఖ్య తగ్గడంతోపాటు వయసు మీద పడిన వారి ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేసే ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా.. ప్రపంచతయారీ కేంద్రంగా ఉన్న చైనా క్రమంగా వెనకడుగులు వేయాల్సి వస్తుంది. ఇప్పటికే చైనా నుంచి ప్రపంచ స్థాయి కంపెనీలు బయటకొచ్చేస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌ యాపిల్ సంస్థే. ఇప్పటివరకూ 95శాతం యాపిల్ ప్రోడక్ట్స్‌ చైనాలోనే తయారయ్యేవి.. ఇప్పుడు 25శాతం ఇండియాలో తయారీ చేయాలని ఆ సంస్థ డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ముంబై, ఢిల్లీలో రిటైల్ స్టోర్స్ సైతం ప్రారంభించింది. దీనికోసం స్వయంగా యాపిల్ సీఈవో ఇండియాకు వచ్చారు. ప్రధాని మోడీతో సైతం సమావేశమై దేశ వ్యాప్తంగా పెట్టుబడులకు సిద్ధం అని ప్రకటించారు. ఇదంతా యంగ్ ఇండియాను దృష్టిలో ఉంచుకునే అని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
మరోవైపు.. మన దేశంలో దాదాపు 50శాతం మంది 30 ఏళ్లలోపు వారే కావడం, వారంతా పని చేసే ఏజ్ గ్రూప్‌కి చెందిన వారే కావడం ఇండియాను ప్రపంచ తయారీ కేంద్రంగా మారుస్తుంది. అయితే, మన దేశ యువ జనాభాను, వనరులను సక్రమంగా వాడుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా అడుగులు వేయగలిగితే భారత ప్రస్తుత జీడీపి 3.5 ట్రిలియన్ల నుంచి 2030నాటికి 9 ట్రిలియన్లకు, 2047నాటికి 40 ట్రిలియన్ల టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టమేం కాదనేది ఆర్ధిక రంగ నిపుణులు కూడా చెబుతున్న మాట. ఇదే సమయంలో మేథో వలసకు అడ్డుకట్ట వేయడం, సంపన్నులు దేశంవిడిచి వెళ్లకుండా చూడటం లాంటి సవాళ్లను కూడా భారత్ అధిగమించాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. నిజానికి.. డ్రాగన్ కంట్రీ చైనా ప్రపంచంలోనే రెండో ఆర్ధిక వ్యవస్థగా ఎదగడానికి కారణాలు కూడా ఇవే. డ్రాగన్ దేశం ప్రపంచ తయారీ కేంద్రంగా ఎదగడంతో ఆ దేశ యువతదే కీలక పాత్రగా చెబుతారు. ప్రపంచ స్థాయి సంస్థలు డ్రాగన్ దేశంలో పెట్టుబడులు కుమ్మరించటానికి కూడా చైనాలో యువత అధికంగా ఉండటమే. కానీ, వన్ చైల్డ్‌ పాలసీని తెచ్చి ఆ అవకాశాలను చైనా ఇప్పుడు చేజేతులా పోగొట్టుకుంటోంది. ఇప్పుడు అదే అంశం ఇండియాకు వరం కాబోతోంది.
ఇదే సమయంలో జనాభా పెరుగుదల కొన్ని ఇబ్బందులను కూడా కొనితేవడం ఖాయం. జనాభా వేగంగా పెరగడంతో ఆకలి, పేదరికం, నిరుద్యోగం లాంటి సవాళ్లను ఏ దేశమైనా ఎదుర్కోక తప్పదు. ప్రజలకు సరైన వైద్యం అందడం, నాణ్యమైన విద్య అందించడం కష్టం అవుతుంది. ఇండియా లాంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇవి కాస్త ఇబ్బంది పెట్టే సవాళ్లే. అయితే, కోవిడ్ లాంటి పరిస్థితులను అధి గమించడంలో విజయం సాధించిన భారత్‌.. క్రమంగా ఎదురయ్యే జనాభా పెరుగుదలను హ్యాండిల్‌ చేయడంలో తడబడే పరిస్థితి ఉండకపోవచ్చు. మొత్తంగా.. ఇండియన్ యంగ్ స్టర్లకు ప్రపంచాన్ని శాసించే టైం ఐతే వచ్చినట్టే కనిపిస్తోంది. ఈ సమయంలో కావాల్సిందల్లా మోడీ సర్కార్ ప్రోత్సాహం ఒక్కటే. ఆత్మ నిర్భర్ భారత్, మేకిన్ ఇండియా లాంటి సంస్కరణలతో ఆ దిశగా ఇప్పటికే తయారీ రంగంలో దూసుకుపోతున్న వేళ, యాపిల్ మాదిరిగానే మరిన్ని ప్రపంచ స్థాయి సంస్థల ఇండియా ఎంట్రీకి లైన్ క్లియర్ అయితే అద్భుతం జరగడం ఖాయం. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.

పారిపోటానికి ట్రై చేసిన అమృత్ పాల్ భార్య.. ఎయిర్ పోర్టులో అరెస్ట్

ఖలిస్తాన్ వేర్పాటువాదంతో సంచలనంగా మారిన పంజాబ్ కు చెందిన అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్ దీప్ కౌర్ ను పంజాబ్ ఎయిర్ పోర్టులో ఈ రోజు మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. లండన్ ఫ్లైట్ కు టిక్కెట్లు బుక్ చేసుకున్న కిరణ్ దీప్.. లండన్ వెళ్ళే ఫ్లైట్ టైమ్ కు ఎయిర్ పోర్టుకు రాగా పోలీసులు అమెను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మార్చి 18న అమృత్ పాల్ సింగ్ చిక్కినట్టే చిక్కి పోలీసుల నుంచి జలంధర్ లో తప్పించుకున్నాడు. ఇప్పటి వరకు అమృత్ పాల్ సింగ్ జాడను పోలీసులు కనుక్కోలేకపోయారు. నేపాల్ గుండా కెనడా పారిపోయి ఉంటాడనే వాదన వినిపిస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం భారత్ లోనే దాక్కున్నాడని భావిస్తున్నారు. అతడి భార్య కిరణ్ దీప్ కౌర్ దగ్గర బహుశా అమృత్ పాల్ సింగ్ ఎక్కడ ఉన్నాడనే సమాచారం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అరెస్ట్ చేయబడిన కిరణ్ దీప్ కౌర్ కూడా అమృత్ పాల్ సింగ్ లాగానే వేర్పాటు వాదియే. ఈమె గతం గురించి ఆరా తీసిన పోలీసులకు ఆశ్చర్యకరమైన సమాచారం లభించింది. కిరణ్ దీప్ కౌర్ బ్రిటన్ పాస్ పోర్ట్ కలిగిన బ్రిటిష్ సిటిజన్. పంజాబ్ వేర్పాటువాద సంస్థ అయిన బబ్బర్ ఖల్సాతో ఆమెకు బలమైన సంబంధాలు ఉన్నాయి. 2020లోనే బ్రిటన్ పోలీసులు ఈమె నేర చరిత్రపై ఓ కన్నేసి ఉంచారని సమాచారం. అయితే.. కిరణ్ దీప్ కౌర్ అమృత్ పాల్ సింగ్ లాగా బహిరంగంగా వేర్పాటువాద ధోరణి ప్రదర్శించకుండా రహస్యంగా ఆ సంస్థ కోసం పనిచేసే యాక్టివ్ మెంబర్. కానీ ఆమెపై భారత్ లో గానీ విదేశాల్లో గానీ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. బబ్బర్ ఖల్సా కోసం విదేశాల నుంచి నిధులు సేకరించటమే ఈమె మెయిన్ టాస్క్. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ దీప్ కౌర్ నుంచి గట్టి సమాచారమే లభించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

ఓటీటీలోకి “దసరా” డేట్ కన్ఫర్మ్

0

నాని హీరోగా సింగరేణి బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన దసరా సినిమా ఓటీటీ డేట్ ఖరారు చేసుకుంది. థియేటర్లలో రిలీజైన ఆరు రోజుల్లోనే వందకోట్ల కలెక్షన్లు రాబట్టి నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా ఏప్రిల్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే దసరా ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుండగా.. ట్రైలర్ చివర్లో 27 నుంచి ఫుల్ సినిమా స్ట్రీమింగ్ కానుందని కనిపిస్తోంది. నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ తో తెరకెక్కిన దసరా.. అచ్చ తెలంగాణ యాసలో గోదావరిఖని బొగ్గు గనులపై ఆధారపడి బతికే ఊరి నేపథ్యంలో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తెలంగాణ ప్రజలతో పాటు తెలుగు ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవటంలో శ్రీకాంత్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.
నిజానికి దసరా సినిమా మరిన్ని రోజులు థియేటర్లో ఆడినా జనం చూసే అవకాశాలు లేకపోలేదు. నాని సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వస్తుంటారు. సమ్మర్ హాలిడేస్ లో జనం థియేటర్ కు రావటానికి ఇంట్రస్ట్ చూపించటంతో పాటు ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాలు కూడా ఏమీ లేవు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష రిలీజ్ కు రెడీగా ఉండగా.. ఇక పెద్ద సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేవు. కానీ సినిమా యూనిట్ మాత్రం మరో వారం రోజుల్లోనే దసరా సినిమాను ఓటీటీ రిలీజ్ చేయటానికి నిర్ణయించుకుంది.

రాహుల్ గాంధీకి షాక్..! జైలు శిక్ష తప్పేలా లేదు

0

ఏఐసీసీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి మరో సారి కోర్టులో చుక్కెదురైంది. పరువు నష్టం కేసులో తనకు విధించబడిన రెండేళ్ళ జైలు శిక్ష తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ను విచారించిన గుజరాత్ లోని సూరత్ కోర్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో రాహుల్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. పరువు నష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష విధించటం అన్యాయమనీ.. తనపై కక్ష సాధింపుతోనే కోర్టు తనకు రెండేళ్ళ జైలు శిక్ష విధించిందంటూ రాహుల్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. జైలు శిక్ష రద్దు చేయకపోతే తన పరువుకు పూడ్చలేనంత నష్టం జరుగుతుందని కూడా పిటిషన్లో పేర్కొన్నాడు. కానీ సూరత్ కోర్టు మాత్రం శిక్ష రద్దు చేయటానికి అంగీకరించలేదు.
2019 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలోని కోలార్ లో జరిగిన సభలో మాట్లాడుతూ దొంగలందరికీ మోడీ అనే ఇంటి పేరు ఉంటుంది.. ఎందుకో.. అంటూ పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శిస్తూ వ్యాఖ్యానించాడు. దీంతో గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ రాహుల్ పై పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. ఈ కేసును విచారించిన సూరత్ కోర్టు.. మోడీ అనే పేరున్న వాళ్ళందరినీ కించపరిచినట్టే అని చెప్తూ రాహుల్ గాంధీకి రెండేళ్ళ జైలు శిక్ష ‌విధించింది. శిక్ష విధించిందే తప్ప అప్పటికప్పుడు జైలుకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా నెల రోజుల పాటు బెయిల్ కూడా మంజూరు చేసింది.. అలాగే ఈ తీర్పును అప్పీల్ చేసుకోవచ్చంటూ మరో అవకాశాన్ని కూడా ఇచ్చింది. 1951లో రూపొందించబడిన ప్రజాప్రతినిథుల చట్టం ప్రకారం నేరం రుజువై రెండేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష విధించబడిన వారు చట్ట సభల్లో ఉండటానికి అనర్హులు. జైలు శిక్షా కాలం తర్వాత కూడా నాలుగేళ్ళ పాటు సదరు ప్రజా ప్రతినిథి ఎన్నికల్లో పాల్గొనకూడదు. ఇదే చట్ట ప్రకారం రాహుల్ కు ఉన్న లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్ సభ సచివాలయం రాహుల్ ను సస్పెండ్ చేసింది. రాహుల్ జైలుకు వెళ్ళాల్సి వస్తే కనుక ఇక అతడి రాజకీయ జీవితం అక్కడితో దాదాపు అంతమైనట్టే.

రామ్ చరణ్ సినిమాలో జాన్వీ కపూర్

0

నాటు నాటు పాటకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొంది ఆర్ఆర్ఆర్ లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రామ్ చరణ్.. కబడ్డీ ఆట బేస్ తో రూపొందించిన కథతో త్వరలోనే మరో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఉప్పెన సినిమాతో హిట్ సినిమా ఇచ్చిన సానా బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా కనిపించనుందని టాలీవుడ్ న్యూస్. ఇప్పటికే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్30 సినిమాలో జాన్వీ నటిస్తోంది. ఇప్పుడు రామ్ చరణ్ పక్కన తన రెండో సినిమా సైన్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది. తెలుగులో ఇప్పటి వరకు సినిమా ఒప్పుకోని జాన్వీ కపూర్.. ఇప్పుడు సైన్ చేసిన రెండు సినిమాలు ఆస్కార్ యాక్టర్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ లతోనే కావటం విశేషం.
పూర్తిగా కబడ్డీ ఆట చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా తెరకెక్కనుందట. అంతే కాకుండా రామ్ చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని కూడా చెప్పుకుంటున్నారు. అయితే తండ్రీ కొడుకుల పాత్రనా లేక అన్నదమ్ముల పాత్రనా అనేది మాత్రం తెలియదు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా వివరాలు అసలు ఇప్పటి వరకూ ఎక్కడా అఫీషియల్ గా చెప్పిందే లేదు. కేవలం స్టోరీ లైన్, డైరెక్టర్ వివరాలు తప్ప ఈ సినిమా గురించిన మరే విషయాన్నీ యూనిట్ బయటకు రానివ్వటం లేదు. ప్రేక్షకులకు సర్ ప్రైజ్ గా త్వరలోనే సినిమా గురించిన డిటైల్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని ఇండస్ట్రీ టాక్.

చైనాను దాటేసిన భారత్ : జనాభాలో నెంబర్ వన్

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది. ఇదివరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న చైనాను అధిగమించి 142.86 కోట్ల జనాభాతో మొదటి స్థానానికి ఎగబాకింది. చైనా కంటే సుమారు 29 లక్షల మంది జనాభాను అధికంగా భారత్ కలిగి ఉన్నదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 లో భాగంగా ఐరాస తాజా జనాభా నివేదికను వెలువరించింది. ప్రపంచ జనాభా సుమారు 805 కోట్లు అని అంచనా.. అయితే అందులో సుమారు 30 శాతం కంటే అధికంగా జనాభాను కేవలం భారత్, చైనా దేశాలే కలిగి ఉన్నాయి. ఇదివరకు భారత్ కంటే అధిక జనాభాతో మొదటి స్థానంలో ఉన్న చైనాను భారత్ అధిగమించగా.. ప్రస్తుతం మూడో స్థానంలో 34 కోట్ల మంది జనాభాతో అమెరికా నిలిచింది.
భారత్ మొదటి స్థానానికి ఎగబాకడానికి భారత్ లో ప్రతి సంవత్సరం జనాభా సుమారు 1.2 శాతం పెరుగుదల నమోదు కావటంతో పాటు సుమారు ఒకటిన్నర దశాబ్ధాల కాలంగా చైనాలో జనాభా తరుగుదల సంభవిస్తున్నది. అధిక జనాభా కారణంగా చైనాలో కేవలం ఒకే ఒక్క సంతానాన్ని కలిగి ఉండాలన్న నిబంధన గతంలో ఉండేది. అయితే.. జనాభా పెరుగుదల గణనీయంగా పడిపోవటంతో పాటు చైనా దేశవ్యాప్తంగా యువకుల సంఖ్య విపరీతంగా పడిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే చైనా యువ శక్తి లేక పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఒకే ఒక్క సంతానం నిబంధనను ఎత్తివేసింది. చైనా యువత పెళ్ళిళ్ళు, పిల్లల విషయంలో ఆసక్తి కనపరచకపోవటంతో చైనా జనాభా తగ్గుతూ రాగా.. భారత్ లో జనాభా పెరుగుతూ వచ్చి చైనాను మించిపోయింది.
2011లో భారత ప్రభుత్వం అధికారికంగా జనాభా లెక్కలు చేపట్టింది. ప్రపంచంలోనే ఈ జనగణన అతిపెద్దదిగా అప్పట్లో రికార్డు సృష్టించింది. పదేళ్ళ తర్వాత.. అంటే 2021లో జనాభా లెక్కలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా కారణంగా జన గణన వాయిదా పడింది. జనాభా పెరుగుదల అనేది ఆందోళన కరమైన అంశంగా ఇదివరకు భావించేవారు. కానీ భారత్ లో జనాభా పెరుగుదల కారణంగా ఇక్కడ యువకుల సంఖ్య పెరగటం భారత్ పాలిట వరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా యువ శక్తి కోసం అభివృద్ధి చెందిన దేశాలు భారత్ నే నమ్ముకున్నాయి. ఆర్థిక వేత్తల భావన ప్రకారం అత్యధిక జనాభా కలిగి ఉన్న భారతదేశం.. ప్రపంచ మార్కెట్ కు అత్యధిక మంది కస్టమర్లను పొంద గలిగిన దేశంగా కనిపిస్తుంది. భారతీయులు ఏదైనా ఒక వస్తువును వీపరీతంగా వాడితే.. అప్పుడు అది ప్రపంచంలోనే అత్యధిక మంది కస్టమర్లను కలిగి ఉన్న వస్తువుగా మారతుందనేది ఆర్థిక, వ్యాపార నిపుణుల భావన.

కరోనాతో 21 యేళ్ళ యువకుడు మృతి

0

ప్రపంచాన్ని వణికించిన మహమ్మారి కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. విశాఖపట్నంలోని ఎన్జీఓ హోమ్ లో కరోనాతో 21 సంవత్సరాల యువకుడు మరణించటం తెలుగు రాష్ట్రాల ప్రజలను భయపెడుతోంది. కరోనా కారణంగానే ఆ యువకుడు మరణించినట్టు విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించటం విశాఖలో కలకలం రేపింది. వెంటనే అలర్ట్ అయిన వైద్యాధికారులు యువకుడితో కాంటాక్ట్ అయిన అందరినీ హోమ్ ఐసోలేషన్ లో ఉంచారు. అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించటంతో పాటు వైద్యం మొదలుపెట్టారు. కరోనాతో యువకుడు ప్రాణాలు కోల్పోవటాన్ని తీవ్రంగా పరిగణించిన ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా అలర్ట్ ప్రకటించింది.
మరో వైపు దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ఇదివరకే అలర్ట్ అయిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కరోనా గైడ్ లైన్స్ జారీ చేసింది. కోవిడ్ డ్రైవ్ లు నిర్వహించటంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం.. అలాగే కరోనా పరీక్షలు చేసి, వ్యాక్సినేషన్ చేపట్టడం వెంటనే మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా కేసులు నమోదు అవుతుండటం తెలిసిందే కానీ మరణాలు సంభవించటం ఇటీవలి కాలంలో చాలా అరుదుగానే జరుగుతోంది. వయసు మీద పడిన వృద్ధులు శ్వాసకోశ వ్యాధులతో కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన కేసులు కనిపించాయే తప్ప ఆరోగ్యంగా ఉన్న యువకులు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరగలేదు. విశాఖ ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.

గుణశేఖర్ 300 కోట్ల కొత్త సినిమా గోవిందా గోవింద

0

అప్పుడెప్పుడో రుద్రమదేవి సినిమాతో ఫరవాలేదనిపించిన టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్.. రీసెంట్ గా శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బొక్క బోర్లా పడ్డారు. స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం.. మూడో రోజు నుంచే కలెక్షన్లలో డల్ అయిపోయి బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. నిర్మాతతో పాటు డిస్ట్రిబ్యూటర్లు కూడా శాకుంతలం కలెక్షన్లతో డీలా పడ్డారు. బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ రేంజ్ అంచనాలతో వచ్చిన ఈ సినిమాతో సమంతకు పెద్దగా వచ్చిన నష్టమేమీ లేదు.. అలాగే దిల్ రాజుకు కూడా ఎఫెక్ట్ ఏమీ కాదు. కానీ డైరెక్టర్ గుణశేఖర్ కు మాత్రం శాకుంతలం పెద్ద షాకే ఇచ్చింది. అతడిని నమ్మి ఇకపై భారీ బడ్జెట్ సినిమాల కోసం ఇన్వెస్ట్ చేయటానికి భవిష్యత్తులో ఏ నిర్మాతా ముందుకు వచ్చే అవకాశం లేదనే చెప్పాలి.
శాకుంతలం సినిమా తర్వాత హిరణ్య కశ్యప అనే మరో భారీ ప్రాజెక్టు కోసం గుణశేఖర్ ఎదురు చూస్తున్నాడు. నిర్మాత సురేష్ బాబు 300 కోట్ల బడ్జెట్ తో హిరణ్యకశ్యప సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడనే వార్తలు ఇదివరకు వినిపించాయి. కానీ శాకుంతలం సినిమా తర్వాత ఇలాంటి భారీ పెట్టుబడి పెట్టేందుకు సురేష్ బాబు సిద్ధంగా లేడనీ.. గుణశేఖర్ ఈ ప్రాజెక్టు గురించి ఆలోచన మానుకుంటే మేలనీ టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రుద్రమదేవి సినిమా విషయంలో కూడా గుణశేఖర్ చాలా ఆర్థిక కష్టాలు అనుభవించాడు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం రుద్రమదేవి సినిమాకు పన్ను మాఫీ లాంటి స్కీమ్ ప్రకటించి ఉండకపోతే గుణశేఖర్ చాలా నష్టపోవాల్సి వచ్చేది. ఇప్పుడు శాకుంతలం డిజాస్టర్ అయిన తర్వాత.. ఇక ఈ డైరెక్టర్ పై మళ్ళీ నమ్మకం ఉంచి అంత పెద్ద ప్రాజెక్టులు చేయటానికి నిర్మాతలు ముందుకు వచ్చే అవకాశాలు లేనట్టే.