ఎంత సెక్యూరిటీ ఉన్నా ఫీమేల్ సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొన్ని అనూహ్య పరిణామాలు ఎదుర్కుంటునే ఉంటారు. ముఖ్యంగా జనాలు భారీగా ఉన్న ఈవెంట్లకు, ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు ఈ చాన్స్ మరింత ఎక్కువ. ఒక్కోసారి ఫ్యాన్సే హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు.. దాని వల్ల హీరోయిన్లు అసౌకర్యానికి గురవుతారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి విషయంలో ఇలాంటి సంఘటననే చోటు చేసుకుంది. అపర్ణ లీడ్ రోల్ లో నటించిన తన్కమ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ కాలేజీకి తన సినిమా యూనిట్ తో కలిసి వెళ్ళింది అపర్ణ. కార్యక్రమంలో అందరి మధ్య అపర్ణ కూర్చొని ఉండగా.. ఆమె దగ్గరికి వచ్చిన ఆ కాలేజ్ కు చెందిన విద్యార్థి.. అపర్ణకు షేక్ హ్యాండిచ్చాడు. అభిమాని కదా అని చెయ్యి ఇస్తే.. అపర్ణను చేయి పట్టుకొని స్టేజ్ మీదకు లాగేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె భుజంపై చేయి వేయటానికి ప్రయత్నించారు. దీంతో అపర్ణ చాలా అసౌకర్యానికి గురై ఆ యువకుడి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసింది. అంతలోనే అక్కడున్న ఇతర స్టూడెంట్స్ అరుపులు విన్న ఆ విద్యార్థి.. వెంటనే అపర్ణకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి సారీ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థి ప్రవర్తనతో కొద్దిసేపు అపర్ణ అసౌకర్యంగానే అక్కడ కూర్చుంది.
అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను అభిమానులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ఆ విద్యార్థిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడే ఉన్న తన్కమ్ హీరో వినీత్ శ్రీనివాసన్ కూడా స్పందించకపోవటం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉంటే సరిపోతు.. ఎలా ప్రవర్తించాలో తెలియాలి.. అంతా అయిపోయాక క్షమాపణలు చెప్తే సరిపోతుందా.. అంటూ అపర్ణ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
స్టూడెంట్ అనుచిత ప్రవర్తనతో షాక్ తిన్న అపర్ణ బాలమురళి
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రష్మిక
పొగడ్తలు.. విమర్శలు.. గాసిప్స్.. ఫోటోస్.. ఇలా ఏదో ఒక విషయంలో గత కొద్ది రోజులుగా ఎప్పుడు చూసినా రష్మిక వార్తల్లోనే ఉంటోంది. కాంతార సినిమా చూడలేదంటూ కామెంట్స్ చేసి కన్నడ ప్రేక్షకుల చేత తిట్లు తిన్న రష్మిక.. ఆ తర్వాత రిషబ్ శెట్టి గురించి పాజిటివ్ కామెంట్లు చేసి మరోసారి ట్రోల్ అయ్యింది. ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసి విపరీతంగా వైరల్ అవుతోంది.
మిషన్ మజ్ను సినిమాకు సంబంధించిన ఓ ప్రమోషనల్ ఈవెంట్ కు అటెండ్ అయిన రష్మిక.. తన కాస్ట్యూమ్ వల్ల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఈవెంట్లో ఆమె వేసుకున్న డ్రెస్ పైనే జనాలు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక ఎక్స్ పోజింగ్ తో ఆమె ఫ్యాన్స్ మాత్రం ఫిదా అయిపోయారు. లైకులు, షేర్లు, కామెంట్లతో అదరగొట్టేస్తున్నారు. రష్మిక తన అందాలతో క్రష్ చేస్తూ క్రష్మిక అవతారం ఎత్తిందని ఆమె ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
నటి రాఖీ సావంత్ అరెస్ట్
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ను అంబోలి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నటి షెర్లీన్ చోప్రా ఇచ్చిన కంప్లైంట్ మేరకు అంబోలీ పోలీసులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు.. అభ్యంతరకరమైన వీడియో చేసినందుకు పలు ఐపీసీ సెక్షన్ల కింద ముంబై పోలీసులు అరెస్టు చేసినట్టు షెర్లీన్ చోప్రా ట్వీట్ చేసింది. బెయిల్ కోసం రాఖీ సావంత్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా ముంబై సెషన్స్ కోర్టు రిజెక్ట్ చేసినట్టు తెలిపింది.
ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ ఒక మోడల్ గురించి అభ్యంతరకమైన వ్యాఖ్యలు చేసిందనీ.. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ చేసిందనీ.. ఇవి ఆ అమ్మాయి పరువుకు నష్టం కలిగించాయని పేర్కొంటూ షెర్లీన్ చోప్రా రాఖీ సావంత్ పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ కంప్లైంట్ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ మోడల్ కు సంబంధించిన వీడియో, ఫోటోలను లీక్ చేయకుండా ఉండాలంటే తనకు డబ్బు కావాలని ఆ మోడల్ ను రాఖీ సావంత్ బెదిరించినట్టు కూడా ఫిర్యాదులో ఉంది. అయితే.. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కిమ్ జోంగ్ కు విచిత్రమైన వ్యాధి.. వణుకుతున్న నియంత !
ఓ నియంత భయపడుతున్నాడు. వింత వ్యాధితో బెంబేలెత్తిపోతున్నాడు. నిత్యం అణ్వస్త్ర ప్రయోగాలతో ప్రపంచదేశాలను గడగడలాడించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్..ఇప్పుడు ఓ వింత వ్యాధితో తెగ బాధపడుతున్నాడట. వారానికో అణ్వస్ర్త ప్రయోగం చేసి అగ్రరాజ్యం అమెరికానే వణికించిన కిమ్..ఇప్పుడు అంతకుమించిన భయంతో గజ గజా వణికిపోతున్నాడట. ఒంటి చేత్తో ఏకచత్రాధిపత్యంగా దేశాన్ని ఏలుతున్న కిమ్‌కు ఇప్పుడు కొంతంత కష్టం వచ్చిందట. తాను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా ఇన్నాళ్లూ వ్యవహరించిన కిమ్..ఇప్పుడు కుక్కిన పేనులా ఇంట్లో ఓ మూలన కూర్చొని గుక్కపట్టి ఏడుస్తున్నాడట. ఒక్కోసారి నిద్ర పట్టక..అర్థరాత్రి వరకు పెగ్గు మీద పెగ్గు తెగ తాగేస్తూ బోరున విలపిస్తున్నాడట. ఈ విషయాలన్నీ చెప్పింది మరెవరో కాదు..మిర్రర్ అనే ఓ పత్రిక తన కథనంలో కిమ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది.
ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ మిడ్ లైఫ్ సంక్షోభంతో బాధపడుతున్నారని, రోజంతా ఏడుస్తూ, మద్యం తాగుతూ గడుపుతున్నారంటూ ఓ నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ వారంలో 40వ వడిలోకి ప్రవేశించిన ఆయన ప్రజలకు దూరంగా గడుపుతుండడం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు రకరకాల ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్..ప్రస్తుతం మిడ్ లైఫ్ సంక్షోభం’తో బాధపడుతున్నాడని ‘మిర్రర్’ ఓ కథనంలో పేర్కొంది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మిడ్ లైఫ్ సంక్షోభంతో బాధపడుతున్నట్లు వార్తా కథనాలు రావడంతో..అసలు మిడ్ లైఫ్ సంక్షోభం అంటే ఏంటి అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారింది. మిడ్ లైఫ్ సంక్షోభం అంటే మరేదో కాదని..ఇది ఒక నిర్దిష్ట మానసిక అనారోగ్యమని వివరించారు. మగవాళ్లు మధ్య వయసులోకి మారినప్పుడు కలిగే అసంతృప్తి, ఆందోళన, నిరాశ, పశ్చాత్తాపం వంటివి మెదడును చుట్టుముట్టి మనిషిని ఉక్కిరి బిక్కిరి చేస్తాయట. దీనినే ‘మిడ్ లైఫ్ క్రైసిస్’ అంటారని వైద్య నిపుణులు చెప్తున్నారు. కిమ్ 40 ఏళ్ల వయసులోకి ప్రవేశించారని, అందుకే ఆయన ఇలాంటి వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నారని సియోల్‌కు చెందిన నార్త్ కొరియన్ విద్యావేత్త ఒకరు చెప్తున్నారు. కిమ్ రోజులో చాలా వరకు మద్యం తాగుతూ ఏడుస్తున్నట్టు వివరించారు. పెగ్గుల మీద పెగ్గులు తాగుతున్నాడట. అంతేకాదు..ఒక్కోసారి ఒంటరిగా గడుపుతూ తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు వివరించారు. అయితే ఇలాంటి మానసిక సంబంధిత సమస్య నుంచి బయటపడాలంటే నిత్యం వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే కిమ్ మాత్రం..డాక్టర్లు చెప్పిన సలహాలు, సూచనలను పెడచెవిన పెడుతున్నారని ‘మిర్రర్’ నివేదించింది. తన అనారోగ్య వార్తలపై కిమ్ ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది. అంతేకాదు, కిమ్ విదేశాలకు వెళ్తున్నప్పుడు కూడా సొంత టాయిలెట్‌ను తీసుకెళ్తున్నట్టు ‘మిర్రర్’ ఆ కథనంలో పేర్కొంది. తన ఆరోగ్య సమస్యలు తెలుసుకోవడానికి గూఢచారులు తన మలమూత్ర విసర్జాల కోసం వెతకకుండా ఉండేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. కిమ్ తన వ్యక్తిగత జీవితాన్ని చాలా రహస్యంగా ఉంచుతారు.
గతేడాది తొలిసారి కిమ్ తన కుమార్తెతో కలిసి బహిరంగంగా కనిపించారు. ఆ సమయంలో కిమ్ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా కన్పించారు. తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో గోప్యంగా ఉంచే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మొట్టమొదటి సారి బహిరంగంగా కనిపించడం అప్పట్లో పెను సంచలనం రేపింది. తెల్లటి జాకెట్ ధరించిన కుమార్తె చేతులు పట్టుకొని నడుస్తూ కిమ్ జోంగ్ కనిపించినట్లు మీడియా వెల్లడించింది. క్షిపణి ప్రయోగం సందర్భంగా కిమ్ తన వెంట కుమార్తెను తీసుకొచ్చినట్లు అప్పట్లో పలు కథనాలు వెలువడ్డాయి. అంతకుముందు కొన్ని నెలల క్రితం కిమ్ జోంగ్ తన భార్య సోల్ జుతో కలిసి బహిరంగంగా కనిపించారు. అప్పుడు కూడా కిమ్ ఎంతో యాక్టీవ్‌గా కన్పించారు. కానీ ప్రస్తుతం కిమ్..ఎందుకిలా వింతలా ప్రవర్తిస్తున్నారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. మిడ్ లైఫ్ క్రైసిస్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపినా…దీని వెనుక ఇంకా ఏదైనా సీక్రెట్ ఉందా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. గతంలోనే కిమ్ అనారోగ్యానికి గురైనట్లు స్వయంగా ఆయన సోదరే మీడియా సాక్షిగా ప్రకటించడం అప్పట్లో పలు ఊహాగానాలకు ఊతమిచ్చింది. కరోనా సోకినట్లు కిమ్ సోదరి ప్రకటించినా..అంతకు మించిన అనారోగ్య సమస్యలేవో కిమ్‌ను వెంటాడుతున్నాయనే అనుమానాలు తలెత్తాయి.
మొత్తానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌కు ఏమైందన్న సందేహాలు సర్వత్రా తలెత్తుతున్నాయి. నిత్యం క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించిన కిమ్..ఇప్పుడు కిమ్మనకుండా ఇంట్లోనే కాలం వెల్లదీస్తుండడంపై అనేక అనుమానాలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పరిమితికి మించి మద్యం తాగుతుండడం, నిద్రలేని రాత్రులు గడుపుతుండడం, ఇంట్లో ఒంటరిగా ఏడవడం వంటి క్రియలు దేనికి సంకేతమన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. కిమ్ ప్రస్తుతం మధ్య వయసుతో బాధపడుతున్నట్లు వైద్యులు ప్రకటించినా..అసలు కిటుకు ఇంకేదో ఉందనే సంకేతాలు విన్పిస్తున్నాయి. కిమ్ ఆరోగ్యంపై గతంలో ఎన్నో వార్తలు పుకార్లు, షికార్లు చేశాయి. ప్రస్తుతం కిమ్‌కు తలెత్తిన అనారోగ్య సమస్య కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దావూద్ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన NIA
పరారీలో ఉన్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం నెక్ట్స్ టార్గెట్ ఏంటనే సంచలన విషయాన్ని అతని మేనల్లుడు అలీషా పార్కర్ బయటపెట్టాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి దావూద్ ఇబ్రహీం ఉగ్రవాద నెట్‌వర్క్‌కు సంబంధించి పలువురిని అరెస్టు చేశారు. అందులో భాగంగా ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడన్న కేసులో అరెస్ట్ అయిన దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషాను..NIA అధికారులు విచారించారు. అయితే విచారణలో దావూద్‌కు సంబంధించిన అనేక కీలక విషయాలను వెల్లడించాడు. అలీషా తెలిపిన వివరాలు ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తున్నాయి. భారత్‌లోని అనేక మంది ప్రముఖ నేతలు, వ్యాపారవేత్తలపై దాడులు చేసేందుకు దావూద్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడని…ఈ గ్యాంగ్ పెద్ద పెద్ద నగరాల్లో అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడుతుందని అలీషా NIA విచారణలో బయటపెట్టాడు. ప్రస్తుతం కరాచీలో ఉంటున్న దావూద్ కుటుంబంతో పాటు మరో ప్రాంతానికి తన మకాం మర్చాడని వివరించాడు. ప్రస్తుతం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం..అతని సన్నిహితులు అనీస్ ఇబ్రహీం షేక్, ముంతాజ్ రహీమ్ ఫకీ తదితరులు తమ కుటుంబాలతో సహా పాకిస్తాన్‌లోని కరాచీ డిఫెన్స్ కాలనీలో అబ్దుల్లా ఘాజీ బాబా దర్గ వెనుక నివసిస్తున్నాడని తెలిపాడు.
అంతేకాదు..దావూద్‌కు నలుగురు సోదరులు, సోదరీమణులు ఉన్నారని అలీషా తెలిపాడు. దావూద్‌కు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు వివరించాడు. జాతీయ దర్యాప్తు సంస్థ..NIA విచారణలో దావూద్ మొదటి భార్య మెహజబీన్ గురించీ అలీషా అనేక కీలక విషయాలను బయటపెట్టాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం 2022 సెప్టెంబర్ నెలలో రెండో పెళ్లి చేసుకున్నాడని వివరించాడు. తన మొదటి భార్యకు ఇంకా విడాకులు ఇవ్వలేదని అలీషా చెప్పాడు. దావూద్ రెండవ వివాహం మెహజబీన్ నుంచి దర్యాప్తు సంస్థల దృష్టిని మరల్చడానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చని NIA అధికారులు అనుమానిస్తున్నారు. 2022 జులై నెలలో తాను దావూద్ ఇబ్రహీం మొదటి భార్యను దుబాయ్‌లో కలిశానని, రెండో మహిళతో దావూద్ వివాహం గురించి ఆమె తనకు చెప్పిందని అలీ షా వివరించాడు. మెహజబీన్ షేక్ వాట్సాప్ కాల్స్ ద్వారా భారతదేశంలోని బంధువులతో దావూద్ సంబంధాలు కొనసాగిస్తున్నాడని అలీషా తెలిపాడు.
అనేక నేరాలకు పాల్పడి అండర్ వరల్డ్ డాన్‌గా ముద్రపడిన దావూద్ ఇబ్రహీం నేర చరిత్రను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. షేక్ దావూద్ ఇబ్రహీం, హాజీ మస్తాన్ గ్యాంగ్‌తో తన నేర సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే ముంబై అండర్ వరల్డ్‌లో కీలకంగా ఎదిగాడు. అయితే మస్తాన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ గ్యాంగ్‌ను స్వాధీనం చేసుకొని ముఠాను మరింత పెద్దదిగా మార్చాడు. ప్రపంచంలోనే లార్జెస్ట్ క్రైమ్ సిండికేట్లలో ఒక దాన్ని దావూద్ నడుపుతున్నడంటే..ఇతని నెట్‌వర్క్ ఎంతలా వ్యాపించిందో అర్థం చేసుకోవచ్చు. 1993 ముంబై పేలుళ్ల సూత్రదారి అయిన దావూద్ ఇబ్రహీం 12 చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకులను పొట్టనపెట్టుకున్నాడు. అంతేకాదు ఈ దాడుల్లో దాదాపు 700 మంది తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గ్లోబల్ టెర్రరిస్టుగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి దావూద్‌ను గుర్తించింది. అంతేకాదు 2003లో దావూద్ ఇబ్రహీంను, భారత దేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాయి. అంతేకాదు దావూద్‌పై 25 మిలియన్ డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. దీంతో అరెస్ట్‌ను తప్పించుకోవడానింకి దావూద్ పాకిస్తాన్‌లో తల దాచుకుంటున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. ఆయుధాల స్మగ్లింగ్, నార్కో టెర్రరిజం, అండర్ వరల్డ్ క్రిమినల్ సిండికేట్, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి దావూద్ ఇబ్రహీం డీ కంపెనీ పేరుతో భారత్‌లో ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసిందని గతంలోనే ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, అల్‌ఖైదా, జైషే మహ్మద్ వంటి అంతర్జాతీయ ఉగ్ర ముఠాలకు ఈ డీ కంపెనీ కీలక సమాచారం అందిస్తోంది. అంతేకాదు..ఆఫ్రికా దేశాలను డీ కంపెనీ పట్టి పీడిస్తోంది. నైజీరియాకు చెందిన బోకో హరమ్ ఉగ్ర సంస్థలో కూడా డీ కంపెనీ పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తేలింది. ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధింత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై అనేక కేసులు నమోదయ్యాయి. 2008లో ముంబైలో జరిగిన ఉగ్ర దాడుల్లో..దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను సైతం దావూద్ నడిపించాడనే ఆరోపణలున్నాయి.
దావూద్ మేనల్లుడు అలీషా చెప్పిన వివరాల ప్రకారం అండర్ వరల్డ్ డాన్..పాకిస్తాన్‌లోని కరాచీలోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారిన పాకిస్తాన్‌లోనే ఉంటూ తన నేర సామ్రాజ్యాన్ని ఇంకా నడిపిస్తున్నాడు. పాక్‌లో ఉంటూనే భారత్‌లోని తన బంధువులతో నిత్యం వాట్సాప్ కాల్స్‌లో టచ్‌లో ఉంటున్నాడు. అయితే అండర్ వరల్డ్ డాన్‌ను ఎలాగైనా అంతమొందించాలన్న లక్ష్యంతో ఇటు భారత్‌తో పాటు అమెరికా, ఐక్యరాజ్యసమితి సంయుక్తంగా వేట ప్రారంభించాయి. దావూద్‌ను అంతమొందించేందుకు అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు రంగంలోకి దిగినట్లు సమాచారం.
ఖమ్మం సభ : సమయం లేక సగమే మాట్లాడిన కేసీఆర్
భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేసీఆర్ ఏం చెప్పబోతున్నారోనని రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలతో పాటు జాతీయ రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురు చూసిన వేళ.. ఆయన మాత్రం సమయం లేక సగమే మాట్లాడినట్టు అనిపించింది. ఆయన కంటే ముందు ప్రసంగించిన మిగితా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులే ఎక్కువ సమయాన్ని తీసుకోగా.. చివరికి ప్రసంగించిన కేసీఆర్.. చాలా తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించేశారు. “ముందు మీ పంచాయతి.. ఆ తర్వాత నా పంచాయితి..” అంటూ మొదలుపెట్టిన కేసీఆర్.. ముందు ఖమ్మం జిల్లాకు వరాల జల్లు కురిపిస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత బీఆర్ఎస్ గురించి ప్రసంగం మొదలుపెట్టిన ఆయన.. షరా మామూలుగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రధాని మోడీ సహా కేంద్రం విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు.
ప్రపంచంలో మరే దేశానికి లేనంత వ్యవసాయ భూమి.. అద్భుతమైన నీటి వనరులు.. మానవ వనరులు భారతదేశంలో ఉన్నా వాటిని వినియోగించుకునే బుద్ధి మాత్రం పాలకులకు లేకుండా పోయిందన్నారు. చిన్న చిన్న దేశాల్లో పెద్ద పెద్ద నీటి ప్రాజెక్టులు ఉంటే.. ఇంత పెద్ద దేశంలో ఒక్క ప్రపంచ స్థాయి ప్రాజెక్టు కూడా లేదన్నారు. బీఆర్ఎస్ కు స్పష్టమైన విధానం ఉన్నదనీ.. కేంద్రంలో వచ్చేసారి అధికారంలోకి వచ్చేది తామేననీ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసినట్టే దళిత బంధు, ఉచిత విద్యుత్ లాంటి పథకాలు దేశం మొత్తం అమలు చేస్తామని చెప్పారు. ప్రతి సంవత్సరం 25 లక్షల కుటుంబాల చొప్పున ప్రతి దళితుడికి దళిత బంధు అందజేస్తామన్నారు. ఎవరి దగ్గరా చేయి చాపి రుణాలు అడగాల్సిన పరిస్తితి భారత్ కు లేదనీ.. పాలకుల వల్లనే ఆ పరిస్థితి వచ్చిందన్నారు. ఏ దేశం ముందైనా సరే మోకరిల్ల వలసిన అవసరం భారత్ కు లేదనీ.. తాము అధికారంలోకి వస్తే భారత్ రాత మార్చేస్తామన్నారు. రైతులు, నీరు, కరెంటు.. ఇలాంటివే బీఆర్ఎస్ అసలు లక్ష్యమని చెప్పారు. సమయం ఎక్కువగా లేదనీ.. ఇంత కంటే ఎక్కువ మాట్లాడలేననీ చెప్పిన కేసీఆర్.. తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని పూర్తి చేసి తిరుగు పయనమయ్యారు.
డబుల్ సెంచరీతో రెచ్చిపోయిన గిల్ : భారత్ భారీ స్కోర్
హైదరాబాద్ లో జరుగుతున్న భారత్ వర్సెస్ న్యూజీలాండ్ ఫస్ట్ వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు సాధించి కివీస్ జట్టు ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ శుభ్మాన్ గిల్ రెచ్చిపోవటంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 145 బాల్స్ లో 19 ఫోర్లు, 9 సిక్సర్లతో గిల్ 208 పరుగుల కెరీర్ బెస్ట్ స్కోర్ సాధించటంతో పాటు.. డబుల్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. డబుల్ సెంచరీ ముంగిట ఏమాత్రం భయం లేకుండా 3 వరుస సిక్సర్లు బాది డబుల్ సెంచరీ రికార్డును సొంతం చేసుకున్నాడు గిల్. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 34, సూర్య కుమార్ యాదవ్ 31 మినహా మిగితా బ్యాట్స్ మెన్ ఎవ్వరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఒంటరి పోరాటం చేసిన గిల్ ఇన్నింగ్స్ వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.
ఖమ్మం జిల్లాకు కేసీఆర్ వరాల జల్లు
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా ఖమ్మం జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయతీకి 10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నానంటూ ప్రకటించారు. అలాగే మున్సిపాలిటీలుగా మారని 10 జనాభా పైబడి ఉన్న మేజర్ గ్రామ పంచాయితీలకు 10 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ఖమ్మం మున్సిపాలిటీకి సీఎం ఫండ్ నుంచి 50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఏం కావాలన్నా వెంటనే మంజూరు చేయాలంటూ పక్కనే ఉన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు చెప్పారు.
అలాగే ఖమ్మం జిల్లాకు చెందిన ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు. వీడియో జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు కూడా ఇంటి స్థలం కేటాయించాలని హరీష్ రావును ఆదేశించారు. నెల రోజుల్లో ఇంటి స్థలాల కేటాయింపు పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాన్ని కొనైనా సరే పూర్తి చేయాలని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభతో మొత్తానికి ఖమ్మం దశ తిరగనుంది.
మోడీకి వార్నింగ్ ఇచ్చిన పంజాబ్ సీఎం
ఖమ్మంలో జరుగుతున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో నేతల విమర్శల వాడి ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. కేసీఆర్ తో పాటు వేదికను పంచుకున్న కేరళ సీఎం.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకు పడగా.. ఆయన తర్వాత ప్రసంగించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మోడీపై తీవ్ర విమర్శలు చేశాడు. అధికారం కోసం మోడీ ఏ పనైనా చేస్తాడనీ.. అధికారం రాని చోట ఎమ్మెల్యేలను కొనేసి.. ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారం దక్కించుకోవటమే ఆయనకు కావాల్సింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అవసరమైతే ఉప ఎన్నికలు సృష్టించి రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చేసి.. బీజేపీ అధికారాన్ని దక్కించుకుంటుందన్నాడు.
ఇక ప్రతి సంవత్సరం ఆగష్టు 15న స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోటపై జెండా ఎగరవేసి ఉపన్యాసం ఇచ్చే మోడీ.. ప్రతి సంవత్సరం చెప్పిందే చెప్పటం అలవాటు చేసుకున్నాడని విమర్శించారు. ప్రతి సారీ దేశంలో నిరుద్యోగం, తీవ్రవాదం, అవినీతి అని మాట్లాడి.. ఉపన్యాసం పూర్తయ్యాక వాటిని మరిచిపోతాడన్నారు. దేశాన్ని ఎలాగో మార్చలేనప్పుడు.. కనీసం ఉపన్యాసం మార్చుకో అంటూ మోడీకి వార్నింగ్ ఇచ్చాడు భగవంత్ సింగ్. ప్రభుత్వ సంస్థలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అమ్మేసిన మోడీ.. మీడియాను మాత్రం కొనేశాడని ఎద్దేవా చేశాడు. భగవంత్ సింగ్ వ్యాఖ్యలు సభను హీటెక్కించాయి. ఇక మిగిలిన నేతలు ఏ రేంజ్ లో విరుచుకుపడతారో చూడాలి.
కేసీఆర్ ను ఆకాశానికెత్తేసిన కేరళ సీఎం
ఖమ్మంలో జరుగుతున్న భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించే ఆలోచనతో జాతీయ కూటమి ఏర్పాటు దిశగా కేసీఆర్ తో కలిసి వెళ్ళేందుకు నిర్ణయించుకున్న విజయన్.. కేసీఆర్ ను.. ఆయన రాజకీయాన్ని ఆకాశానికెత్తేశాడు. ఖమ్మం సభలో మొదటి ప్రసంగం చేసిన విజయన్.. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలో మరెక్కడా తాను చూడలేదన్నారు. కంటి వెగులు కార్యక్రమం నిజంగా ఓ అద్భుత పథకమనీ.. ఈ ఆలోచనే ఏ ముఖ్యమంత్రికీ రాలేదన్నారు.
ఇదే సభ వేదికగా కేంద్ర ప్రభుత్వం.. బీజేపీ పార్టీపై కూడా విజయన్ విమర్శలు చేశారు. దేశంలో రాజ్యాంగం సంక్షోభంలో ఉన్నదనీ.. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు బీజేపీని ఓడించటం ఒక్కటే మార్గమని చెప్పారు. అలాగే గవర్నర్ వ్యవస్థ గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేసేందుకే గవర్నర్ వ్యవస్థ ఉన్నదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవటం ఖాయమన్నారు. మొత్తానికి కేసీఆర్ కు తన మద్దతు ఉన్నదన్న విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్పారు.