Home Blog Page 62

టీపీసీసీ ఆధిపత్య పోరు.. రంగంలోకి ట్రబుల్ షూటర్

0

తెలంగాణ కాంగ్రెస్ లో ఒరిజినల్స్ వర్సెస్ మైగ్రెంట్స్ యుద్ధంలో సీనియర్లు కాస్త విరామం ప్రకటించారు. టీపీసీసీలో నెలకొన్న వర్గపోరుకు బ్రేక్ వేసేందుకు జాతీయ కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. డిగ్గీ ఎంట్రీతో రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేసిన సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, ఉత్తమ్ సహా పలువురు రెబల్స్ కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ లో నెలకొన్న ఈ అంతర్యుద్ధాన్ని ఏదో ఒకటి చేసి ముగించాల్సిందిగా దిగ్విజయ్ సింగ్ కు ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. సీనియర్లు కొత్తవాళ్ళు అనే తేడా లేకుండా వచ్చే ఎన్నికల కోసం అందరూ కలిసి పనిచేసే విధంగా పార్టీ నేతలను ఒక్కతాటిపైకి తెచ్చి.. ముసలంను ముగించాల్సిన బాధ్యత దిగ్విజయ్ పై వేసింది కాంగ్రెస్ అధిష్టానం.

రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టినప్పటి నుంచీ కాంగ్రెస్ సీనియర్ నేతలు వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క వంటి నేతలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. జగ్గారెడ్డి ఏకంగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన పని చేయటం ఇష్టం లేదని కుండ బద్దలు కొట్టడం.. ఆ తర్వాత సీనియర్ నాయకులంతా రేవంత్ రెడ్డిపై చాలాసార్లు అధిష్టానానికి కంప్లైంట్ చేయటం జరుగుతూ వస్తున్నాయి. అయితే.. ఈ అంతర్యుద్ధం ఈసారి కొంచెం తీవ్రరూపం దాల్చింది. రేవంత్ కు ఎదురు తిరిగిన సీనియర్లకు షాకిస్తూ.. రేవంత్ రెడ్డి వర్గం కూడా రాజీనామాల అస్త్రాన్ని ప్రయోగించింది. అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే సీతక్క వంటి వారు రేవంత్ కు మద్దతుగా నిలిచారు. ప్రస్తుతానికి ఈ ఆధిపత్య పోరుకు కాస్త విరామం దొరికినట్టు అనిపించినా.. తెలంగాణ కాంగ్రెస్ లో ఐక్యత కనిపిస్తుందన్న ఆశ మాత్రం ఎవరికీ లేనట్టే కనిపిస్తోంది.