చాలా రోజుల తర్వాత తెలంగాణలో పర్యటించి ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశాడు. “తెలంగాణలో టీడీపీ లేదు అనే వారికి ఇదే సమాధానం” అంటూ భారీగా హాజరైన కార్యకర్తలను చూపించాడు చంద్రబాబు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలో లేక అభిమానులో.. లేక ఎన్టీఆర్ అభిమానులో.. అదీ కాక చంద్రబాబు అభిమానులో.. ఎవరైతే ఏంటి.. మొత్తానికి ఆయన సభకు భారీగా జనం హాజరయ్యారు. ఇది టీడీపీ శ్రేణులకు చాలా మంచి పరిణామం. కానీ.. ఈ మాత్రం దానికే తెలుగు దేశం పార్టీ తెలంగాణలో ఏదో సాధించబోదు అన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ.. ఒకప్పుడు తన పార్టీకి కంచుకోట లాంటి ప్రాంతం కాబట్టి తాను తన అభిమానులకు కార్యకర్తలకు దూరం కాలేదు అని గట్టిగా చెప్పటమే చంద్రబాబు ఉద్దేశం కావచ్చు. ఏది ఏమైనా.. ఈ సభలో చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఓ క్లారిటీని తీసుకొచ్చాయి.
గత కొద్ది రోజులుగా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ విలీనం గురించి ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు మాట్లాడటం చూస్తున్నాం. రెండు రాష్ట్రాలు కలిస్తే తమకంటే ఎక్కువ సంతోషించే వారు లేరంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఇంకొంత మంది ఇతర నేతలు కూడా తెలుగు రాష్ట్రాలు మళ్ళీ కలిస్తే శుభ పరిణామమే అంటూ మాట్లాడారు. కానీ చంద్రబాబు మాత్రం అందరికంటే స్పష్టంగా మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల కలయికపై “బుద్ధి ఉన్న వారెవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరు” అంటూ తిట్టేశారు. ఆయనకు కూడా రెండు రాష్ట్రాలు కలవాలని మనసులో ఉండొచ్చు.. కానీ తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు కదా.. కాబట్టి తెలంగాణకు వచ్చి తెలంగాణను ఏపీతో కలిపేస్తా అంటే తెలంగాణ ప్రజలు తిరగబడతారు కదా.. అందుకే ఉమ్మడి రాష్ట్రం కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. యేళ్ళ కొద్దీ పోరాడి.. ప్రాణ త్యాగాలు చేసి సాధించిన తెలంగాణను మళ్ళీ ఏపీతో కలిపేస్తామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా.. అసలు అది జరిగే పనేనా.. ఈ మాత్రం ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు చాలా మంది. కానీ చంద్రబాబు అందుకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటారు అనటంలో సందేహం లేదు
యాక్షన్ థ్రిల్లర్ కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే తమిళ హీరో విశాల్.. ఈసారి కూడా అలాంటి స్టోరీతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టర్లో మాస్ యాక్షన్ ఫైట్స్.. ఊర మాస్ డైలాగ్స్.. ఇలాంటి యాక్షన్ అంశాలతో తెరకెక్కిన లాఠీ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సునయన, ప్రభు, రమణ ప్రధాన పాత్రల్లో నటించిన లాఠీ.. ప్రేక్షకులు ఊహించినట్టే మాంచి మాస్ మసాలా కథాంశాలతో వచ్చింది. ఓ తప్పు చేసి సస్పెండైన సాధారణ కానిస్టేబుల్.. అనుకోకుండా మళ్ళీ పై అధికారి ఆదేశాలతో చేసిన ఓ చిన్న పని.. ఆ కానిస్టేబుల్ ను కష్టాల్లో పడేస్తుంది. లాఠీని వాడటంలో ఎక్స్ పర్ట్ అయిన ఆ కానిస్టేబుల్.. ఆ లాఠీ తోనే శతృవుకు సమాధానం చెప్తాడు. తనను కొట్టిన కానిస్టేబుల్ పై ఓ వ్యక్తి పగ తీర్చుకోవాలనుకోవటం.. దాన్ని విశాల్ ఎదుర్కోవటమే లాఠీ కథ. కొడుకే ప్రాణంగా బతికే కానిస్టేబుల్ భార్య.. కుటుంబాన్ని శతృవుల నుంచి రక్షించుకునే దారిలో సవాళ్ళను ఎదుర్కునే కానిస్టేబుల్.. ఇదే సినిమా. ప్రేక్షకులు ఊహించినట్టుగానే సినిమాలో భారీ యాక్షన్ సీన్లు ఉన్నాయి. అక్కడక్కడా ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఇంతకంటే సినిమా గురించి ఎక్కువ చెప్పుకుంటే థియేటర్లో చూడటానికి ఏమీ మిగలదు. సో.. విశాల్ లాఠీ సినిమా అందరినీ మెప్పించే సినిమా.. మాస్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమా.
పఠాన్ సినిమా కాంట్రవర్శీ రోజుకో మలుపు తిరుగుతోంది. బేషరమ్ పాట సృష్టించిన గాలివాన.. పెను తుఫాన్ గా మారింది. కాషాయ రంగును అవమానించిందంటూ దీపికను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన బీజేపీ నేతలు.. పఠాన్ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పుడు మరో మెట్టు ఎక్కింది. జీహాదీలా ప్రవర్తిస్తున్న షారూఖ్ ఖాన్ ను చంపేయాలంటూ అయోధ్యకు చెందిన మహంత్ పరమహంస్ ఆచార్య అనే స్వామీజీ సంచలన ప్రకటన చేశాడు. హిందువుల మనో భావాలను దెబ్బతీసే పనులు చేస్తున్న షారూఖ్ ఖాన్ ను సజీవ దహనం చేయాలి అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి.. బేషరమ్ రచ్చను మరింత రాజేశాడు. దీంతో బాలీవుడ్ పత్రికలు షరా మామూలుగానే షారూఖ్ ఖాన్ ను ప్రాణభయం అంటూ హెడ్డింగులు పెట్టేసి వార్తలు రాసేస్తున్నాయి. షారూష్ ఖాన్ దీపికా పదుకొణే కాంబినేషన్లో వస్తున్న పఠాన్ సినిమాలో బేషరమ్ పాట వచ్చీ రాగానే పెద్ద దుమారాన్ని రేపింది. ఈ పాటలో దీపికా పదుకొనే కాషాయ రంగు కాస్ట్యూమ్ ధరించటం.. ఆ బట్టలు కూడా చాలా బోల్డ్ గా ఉండటంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా బ్యాన్ పఠాన్ అంటూ కొత్త ట్రెండ్ చక్కర్లు కొడుతోంది. ఇంతకు ముందు మరో బడా ఖాన్.. అమీర్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కున్నాడు. ఇండియన్ ఆర్మీని అవమానకరంగా చూపించాడంటూ లాల్ సింగ్ చడ్డాను దేశం మొత్తం బహిష్కరించింది. ఇప్పుడు షారూఖ్ వంతు వచ్చింది.
వైఎస్ జగన్ ఒక్క చాన్స్ దెబ్బకు ఏపీలో కేవలం 23 సీట్లకు పరిమితమైన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు బలహీనమైన ప్రతిపక్ష పార్టీగా మిగిలిపోయింది. వచ్చే ఎన్నికలలోగా పుంజుకొని మళ్ళీ అధికారాన్ని సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు.. ఈసారి తెలంగాణపై కూడా ఫోకస్ చేస్తున్నారట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత కనుమరుగైపోయింది. తెలంగాణలో నామమాత్రంగా మిగిలిపోయిన టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడు లాంటి పదవులు కూడా నామమాత్రంగానే మారిపోయాయి. అయితే.. ఇటీవల తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చేశారు చంద్రబాబు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా కనీసం 40 సీట్లలో పోటీ చేసి.. అధికారంలోకి రాకపోయినా.. కనీసం ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనేది చంద్రబాబు ఆలోచన. ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేయటం దాదాపు ఖరారైనట్టే. తెలంగాణలో ఎవరితో పొత్తు ఉంటుందో ఎలా పోటీలో నిలబడతారో అన్న విషయాల్లో స్పష్టత లేనప్పటికీ.. ఖచ్చితంగా తెలంగాణలో 40 స్థానాల్లో పోటీ చేసి తీరాలనేది మాత్రం చంద్రబాబు ధృడ నిశ్చయమని పార్టీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. క్రితం సారి బీసీ పాట పాడి మోసపోయిన చంద్రబాబు.. ఈసారి తెలంగాణలో ఏ నినాదంతో పోటీ చేస్తాడో చూడాలి.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాల్లో అనుకోని పరిణామాలు సంభవిస్తున్నాయి. కాంగ్రెస్ లో కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు మధ్య వివాదం ఎన్నడూ లేనంత తీవ్ర రూపం దాల్చటం.. గతంలో ఎన్నడూ లేని విధంగా బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో కూడా ఆధిపత్య పోరు, అంతర్యుద్ధం జరగటం.. ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో పెద్ద మార్పులే సంభవిస్తాయని భావించవచ్చు. జరుగుతున్న పరిణామాలను ఓసారి విశ్లేషిస్తే..
రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన నాటి నుంచీ కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ఏక పక్ష ధోరణితో వ్యవహరిస్తున్నాడంటూ జగ్గారెడ్డి, వి హనుమంతరావు వంటి నేతలు బహిరంగంగానే విమర్శలు చేయటంతో పాటు అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన సందర్భాలు అనేకం. ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగినా రేవంత్ రెడ్డి గానీ.. ఆయన అనుచరులు గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. తాను చేయాలనుకున్న పనిని కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ఆదేశాల రూపంలో టీకాంగ్రెస్ నేతలతో చేయించాడు రేవంత్ రెడ్డి. తిరుగుబాటు ఆలోచనలు ఉన్న రెబల్స్ కు రాహుల్ గాంధీ ద్వారా పరోక్షంగా వార్నింగ్ ఇప్పించటమే కాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మణికం ఠాగూర్ తో డైరెక్ట్ హెచ్చరికలు కూడా చేయించాడు. టీ కాంగ్రెస్ లో తానే కింగ్ అనీ.. తన నిర్ణయమే ఫైనల్ అనీ చెప్పకనే చెప్పాడు రేవంత్. అధిష్టానం రేవంత్ వైపు నిలబడటంతో సీనియర్లు రేవంత్ ను ఎదుర్కోలేకపోయారు. కానీ అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ను ఎదురిస్తూనే వచ్చారు. ఇదంతా గతం.. ఇప్పుడు సీన్ మారింది. తామే కాంగ్రెస్ లో సీనియర్లమనీ.. రేవంత్ లాంటి వాళ్ళు తమ తర్వాతేననీ రెబల్స్ మరోసారి తిరుగుబాటు చేశారు. ఇటీవల కాంగ్రెస్ లో జరిగిన కమిటీ బాధ్యుల నియామకాల్లో తమ మాట ఎక్కడా చెల్లుబాటు కాలేదనీ..
రేవంత్ రెడ్డి తాను అనుకున్న వాళ్ళకే పదవులు కట్టబెట్టాడనీ సీనియర్లు రోడ్డెక్కారు. కానీ.. రేవంత్ మాత్రం ఇంతకు ముందులా సైలెంట్ గా లేడు. ఈసారి తానేమిటో.. కాంగ్రెస్ లో తనకున్న ఫాలోయింగ్ ఎంతటిదో చూపించాలనుకున్నట్టున్నాడు. అందుకే తన అనుచరులతో రెబల్స్ కు భారీ షాకిప్పించాడు. ఎమ్మెల్యే సీతక్క సహా పలువురు ప్రముఖ నాయకులంతా ఒక్కటై.. సీనియర్లకు ఎదురు తిరిగారు. తాము కూడా కాంగ్రెస్ లోకి వలస వచ్చిన వాళ్ళమేననీ.. తామంతా రేవంత్ వెంటే ఉంటామంటూ రేవంత్ వర్గం ఎదురు తిరగటంతో కాంగ్రెస్ జాతీయ అధిష్టానం రంగంలోకి దిగాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఏకంగా రెండు వర్గాలుగా చీలిపోయే స్థితికి వచ్చేసిందని గ్రహించిన ఏఐసీసీ.. ఈ అగ్గని చల్లార్చేందుకు దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దించింది. సమస్యను పరిష్కరించి సీనియర్లను ఊరుకోబెట్టి కాంగ్రెస్ క్లాష్ ను క్లోజ్ చేయాలని ప్రస్తుతం ఏఐసీసీ భావిస్తోంది. దిగ్విజయ్ ఎంట్రీతో కాంగ్రెస్ రెబల్స్ సైలెంట్ కావటంతో పాటు తమ స్పీడుకు బ్రేకులు వేశారు. ఇదే తెలంగాణ బీజేపీకి కలిసి వచ్చే అంశం కానుంది. కాంగ్రెస్ లో ఇదివరకు ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో తిరుగుబాటు జరగటాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే వారిని బీజేపీలోకి లాగేయాలని ఆపరేషన్ ఆకర్ష్ వ్యూహం రచిస్తోంది. మెల్లమెల్లగా కాంగ్రెస్ రెబల్స్ ను బజ్జగించి తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీకి ఇది సువర్ణావకాశం.
టీఆర్ఎస్ లోనూ రెబల్స్..
మరోవైపు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ పార్టీలో ముసలం ఏర్పడినట్టు కనిపిస్తోంది. మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా ఐదుగురు ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశం కావటం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది. తమ ఆదేశాలను పట్టించువద్దంటూ తమ జిల్లా కలెక్టర్లకు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలిస్తున్నారు అనేది ఈ ఐదుగురు ఎమ్మెల్యేల ఆరోపణ. తమ ప్రాంతాల్లో కూడా మంత్రి మల్లారెడ్డి పెత్తనం చేయటం సహించని ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమై చర్చించుకోవటం దుమారం రేపింది. సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా.. ఏ మంత్రి అయినా కేసీఆర్ పట్ల విపరీతమైన భయం, భక్తిని ప్రదర్శిస్తుంటారు. కానీ ఇది అందుకు భిన్నం. మొదటిసారి కేసీఆర్ కు తెలియకుండా కేసీఆర్ కు సన్నిహిత మంత్రి అయిన మల్లారెడ్డిపై తిరుగుబాటు చేయాలనుకోవటం సంచలనమే. తిరుగుబాటు, అసంతృప్తి అనేవి లేని రాజకీయ పార్టీ అనేది ఉండదు. అయితే.. అవి ఎంత వరకు లోలోపల పరిష్కారం అవుతాయో అంత వరకు ఆ పార్టీలో అన్ని సక్రమంగానే ఉన్నట్టు. ఎప్పుడైతే ఒక్క సారి తిరుగుబాటు స్వరం బట్టబయలు అవుతుందో.. అది రాబోయే మరిన్ని తిరుగుబాట్లకు దారి వేసినట్టవుతుది. కారు పార్టీలోనూ అసమ్మతులు.. అసంతృప్తులు ఉన్నారనేది నిజం. ఎన్నికల వేళ అవి మరింత ముదిరి పాకాన పడితే మాత్రం.. అది కేసీఆర్ కు ఏమాత్రం మంచిది కాదు. ఈ పరిణామం కూడా బీజేపీకి చాలా కలిసి వచ్చేదే. ఉద్యమ సమయం నాటి నుంచి కేసీఆర్ వెంట ఉండి కూడా ఏ పదవీ అనుభవించని వాళ్ళు టీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చి పెద్ద పదవులను ఎత్తుకెళ్ళిన వారిపై రగిలిపోయే పాత నాయకులకు కొదవే లేదు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదన్న భయం ఉన్న వాళ్ళూ.. ఇతర పార్టీల నుంచి వచ్చి పెత్తనం చేస్తున్న వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళు.. కాంట్రాక్టులు దక్కక బిక్కు బిక్కుమంటున్న వాళ్ళు.. ఇలా చాలా మంది రెబల్స్ టీఆర్ఎస్ లోనూ ఉన్నారు. కాకపోతే వారికి సమయం రాలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చినట్టే కనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళందరికీ బీజేపీ గాలం వేస్తే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కేసీఆర్ తో పాటే ఉండి ఆయనకు ఎదురు తిరిగిన ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు రంగంలోకి దిగితే.. చాలా మంది టీఆర్ఎస్ రెబల్స్ ను బీజేపీలోకి లాగేయటం సులభమవుతుంది. ఇలా రెండు రకాలుగా బీజేపీకి బంపర్ ఆఫర్ దొరికింది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కనుక సక్సెస్ అయితే.. తెలంగాణ రాజకీయాల్లో కుదుపు ఖాయమే. చూద్దాం.. ఈ అవకాశాలను తెలంగాణ బీజేపీ ఎంత మేరకు తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందో. !
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య చేసినట్టుగానే తైవాన్ పై కూడా చైనా సైనిక చర్య చేసి స్వాధీనం చేసుకునేందుకు వ్యూహ రచన చేస్తోందన్న వార్తల నేపథ్యంలో.. అటు తైవాన్.. ఇటు అమెరికా గట్టిగా స్పందించిన విషయం తెలిసిందే. తైవాన్ పై చైనా దండయాత్ర చేస్తే అమెరికా అడ్డుకుంటుందంటూ బైడెన్ బహిరంగంగానే హెచ్చరించగా.. అటు తైవాన్ కూడా తామేమీ తక్కువ కాదంటూ చైనాకు హెచ్చరికలు పంపింది. చైనాకు చెక్ పెట్టేందుకు తైవాన్ పై అమెరికా ఎక్కువ ఫోకస్ పెడుతోందన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు అమెరికా తీసుకున్న మరో నిర్ణయం సంచలనంగా మారింది. తైవాన్ కు 858 బిలియన్ డాలర్ల రక్షణ రంగ సాయాన్ని ఆమోదిస్తూ అమెరికా సెనేట్ బిల్లును ఆమోదించింది. అంటే.. తైవాన్ రక్షణ రంగం మరింత బలంగా మారేందుకు అమెరికా సాయం చేసినట్టే. ఇది ఖచ్చితంగా చైనాకు చెక్ పెట్టేందుకేనని అంతర్జాతీయ విశ్లేషకుల భావన. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్ స్ట్రీల్ జర్నల్ ప్రచురించింది.
Taiwan & USA
2027 లోగా తైవాన్ ను పూర్తిగా చైనాలో కలిపేసుకోవాలనేది చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆలోచన అనీ.. అందుకు సంబంధించిన ఆదేశాలను ఆయన ఇప్పటికే చైనా ఆర్మీకి ఇచ్చారనీ.. ఇందుకు సమాధానంగానే అమెరికా తైవాన్ కు భారీ సాయాన్ని ప్రకటించిందనీ నిపుణుల భావన. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించి తైవాన్ పై సైనిక చర్య తీసుకొని తైవాన్ ను చైనాలో విలీనం చేయాలనేది జిన్ పింగ్ ఆలోచన. వన్ చైనా పాలసీలో ఇదే ఉందనీ.. పార్టీ సమావేశంలో ఇది ఆమోదించబడిందని కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే.. అమెరికా మాత్రం ఇందుకు అడ్డుపడుతోంది. తైవాన్ ను చైనా విలీనం చేసుకుంటే అమెరికాకు భారీ ఎదురు దెబ్బ తప్పదు. ఎందుకంటే.. అమెరికాలో వినియోగించబడుతున్న సెమీ కండక్టర్లలో 70 శాతానికి పైగా తైవాన్ లో తయారైనవే. తైవాన్ ను చైనా ఆక్రమిస్తే అమెరికాకు సెమీ కండక్లర్ల సరఫరా నిలిచిపోతుంది. అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సెమీ కండక్టర్ల సరఫరా నిలిచిపోతే అమెరికా కోలుకోలేని స్థితికి చేరుకుంటుంది. ఈ కారణం వల్లనే తైవాన్ కు అమెరికా అండగా నిలబడటంతో పాటు భారీ సాయాన్ని అందజేస్తూ చైనాకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది.
అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాన మంత్రి మోడీపై విరుచుకుపడే తెలంగాణ మంత్రి కేటీఆర్.. మరోసారి మోడీపై నిప్పులు చెరిగారు. సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల సమావేశంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు గానూ కేటీఆర్ సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ అటు బీజేపీపై.. ఇటు ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో అత్యధికంగా అభివృద్ధి జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేననీ.. దేశంలో అందరికంటే నెంబర్ వన్ సీఎం కేసీఆరేనని చెప్పారు.
KTR on Modi
మోడీ బోడీ ఎవ్వడు లేడు.. ఈ దేశానికి ఎవ్వడు ఏం చెయ్యలే.. ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనైన అభివృద్ధి జరిగిందంటే అది తెలంగాణల మాత్రమే.. ఏ ముఖ్యమంత్రి అయిన అభివృద్ధి చేసిండండే అది కేసీఆర్ మాత్రమే.. అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఇంటింటికీ మంచి నీళ్ళు ఇచ్చి మహిళల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆరేననీ.. బీజేపీ ఈ పని చేసిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ను ఆ పార్టీ అధినేత కేసీఆర్.. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీగా మార్చిన విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శల వాడి పెంచుతున్నారు.
డిసెంబర్ 9న చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. కానీ నిజంగా అక్కడ ఏం జరిగిందనే విషయాలు మాత్రం పూర్తిగా వెల్లడించలేదు. అయితే.. అందుకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ వర్గాలు బహిర్గతం చేశాయి. గతంలో గాల్వాన్ లోయలో జరిగినట్టుగానే అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో మరో దురాక్రమణ యత్నం జరగబోతోందని భారత ఆర్మీ ఇంటలిజెన్స్ ముందుగానే గుర్తించింది. మొత్తం ఆర్మీ అధికారులను అప్రమత్తం చేసింది. చైనాకు షాకిచ్చే అదిరిపోయే వ్యూహాన్ని భారత ఆర్మీ సిద్ధం చేసుకుంది. డిసెంబర్ 9 కు కొద్ది రోజులు ముందుగానే తవాంగ్ లో చైనా సైనికుల సంఖ్య క్రమంగా పెరగటాన్ని భారత్ పసిగట్టింది. ఆ తర్వాత ఇరు దేశాల సైనికులు ఎదురు పడటం.. హెచ్చరికలు.. చిన్న చిన్న చర్చలు జరుగుతూ వచ్చాయి. ఇదే సమయంలో చైనా మాత్రం తన సైనికుల సంఖ్యలను రహస్యంగా పెంచటం మొదలుపెట్టింది. గాల్వన్ లో చేసినట్టుగానే భారత సైన్యంపై దాడి చేసేందుకు ముళ్ళ కర్రలు, ఎలక్ట్రిక్ బ్యాట్ లతో సిద్ధమైంది. భారత్ వైపు 50 మంది సైనికులు ఉంటారని.. వీరిపై భయానకమైన దాడి చేయాలని కుట్ర చేసింది.
డిసెంబర్ 9న భారత సైనికులపై దాడి చేసేందుకు సుమారు 300 మంది చైనా సైనికులు సిద్ధమయ్యారు. ఇక్కడే చైనా.. భారత్ ను తక్కువ అంచనా వేసింది. పరిస్థితి ముందే తెలిసిన భారత సైన్యం కూడా ముళ్ళ తీగ చుట్టిన కర్రలు, మందమైన కర్రలు, రాడ్ లతో సిద్ధంగా ఉంది. ఈ విషయం తెలియని చైనా సైనికులు భారత సైన్యంపై దాడి చేశారు. ఈ దాడికి భారత సైనికులు గట్టి సమాధానం చెప్పారు. క్యూఆర్టీ అని పిలవబడే భారత కమాండో దశం రంగంలోకి దిగి చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి చైనా పొట్టి సైనికులకు తమ సత్తా చూపించటం మొదలుపెట్టారు. ఆయుధాలతో పిచ్చి కొట్టుడు కొట్టడంతో చైనా సైనికులు విలవిలలాడిపోయారు. రక్తంమొడుతున్న తమ తోటి సైనికులను చూసి మిగతా సైనికులు పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన మన సైన్యం.. దొరికిన వాళ్ళను దొరికినట్టు చితక్కొట్టింది. ఇలాంటిది జరుగుతుందని ఊహించని చైనా సైనికులు వెంటనే సరిహద్దు వద్ద పహారా కాస్తున్న తమ అదనపు బలగాలకు సమాచారం అందించటంతో చైనాకు చెందిన అదనపు సైనికులు తుపాకులతో అక్కడికి చేరుకొని గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భారత సైనికులు దాడి ఆపి వెనక్కి వచ్చేశారు. కొద్ది సమయం తర్వాత ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. ఈ దాడిలో చైనాకు చెందిన 15 మంది సైనికులు తీవ్ర గాయాలపాలయ్యారని భారత ఆర్మీ పేర్కొంది. ఈ సైనికులు మరణించి ఉండవచ్చని అంచనా వేసింది. మిగితా సైనికులు కూడా గాయాలపాలయ్యారని.. తమ దాడిని ఎదుర్కోలేక పారిపోయారని ఇండియన్ ఆర్మీ చెప్పింది. చావు దెబ్బ తిన్న చైనా.. సరిహద్దుల్లో నిఘా పెంచిందనీ.. వైైమానిక దళం సరిహద్దుల్లో పహారా కాస్తోందనీ ఇండియన్ ఆర్మీ చెప్పింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని పేర్కొంది.
భారత ఉప రాష్ట్రపతి.. రాజ్య సభ సభాపతి జగదీప్ ధన్ కర్ నోటి నుంచి వచ్చిన మాట.. పెద్ద చర్చకు దారితీసింది. రాజ్య సభ జరుగుతున్న తీరుపై మండిపడిన ఆయన.. ఓ దశలో సభ్యల ప్రవర్తన పట్ల తీవ్ర అసహనానికి లోనై ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఈ పరిస్థితి రావటానికి అసలు కారణం ఏమిటంటే..
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుకు మల్లిఖార్జున్ ఖర్గే రాజస్తాన్ లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొని మాట్లాడుతూ.. ఓ అభ్యంతరకమైన వ్యాఖ్య చేశాడు. దేశం కోసం రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారనీ.. బీజేపీ నేతల ఇళ్ళలోంచి ఒక కుక్క కూడా దేశం కోసం మరణించలేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దీనిపై బీజేపీ నేతలు ఫైరయ్యారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే ఖర్గే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేయగా.. సభ బయట జరిగిన విషయంపై సభలో చర్చ అనవసరమనీ.. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదనీ ఖర్గే తేల్చి చెప్పాడు. దీంతో రాజ్యసభ రసాభాసగా మారింది. సభ్యులు శాంతించాలనీ.. ఎవరి స్థానాల్లో వారు కూర్చోవాలంటూ జగదీప్ ధన్ కర్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా సభ్యులు పట్టించుకోకుండా గొడవకు దిగారు. దీంతో అసహనానికి గురైన సభాధ్యక్షుడు.. “సభ జరిగే తీరు ఇదేనా.. మన ప్రవర్తన చూస్తే దేశంలోని 135 కోట్ల మంది ప్రజలు నిరుత్సాహానికి గురవుతారు.. దేశం మనల్ని చూసి సిగ్గుపడే పరిస్థితి వస్తుంది..” అంటూ తీవ్రంగా స్పందించారు. తీవ్ర అసహనంతో ధన్ కర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేశాయి. కోట్ల కొద్దీ ప్రజాధనం వెచ్చించి నిర్వహించే పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలు, దేశ అభివృద్ధి గురించి కాకుండా.. అనవసరమైన విషయాలపై చర్చించటం సరైనది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం ఈ పేరు చాలా మంది హీరోయిన్ల క్రష్. టాలీవుడ్ బాలీవుడ్ తేడా లేకుండా హీరోయిన్లందరి మనసుల్లో తిష్ట వేసిన విజయ్.. నేషనల్ క్రష్ గా మారిపోయాడు. కాఫీ విత్ కరణ్ దగ్గరి నుంచి.. అన్ స్టాపబుల్ దాకా.. చాలా మంది సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ తమ క్రష్ అంటూ చెప్పటం కనిపిస్తూనే ఉంది. విజయ్ తమ క్రష్ అని చెప్పే హీరోయిన్ల జాబితాలో లేటెస్ట్ గా రాశీ ఖన్నా చేరిపోయింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలతో భారీ బజ్ క్రియేట్ చేస్తూ సాగిపోతున్న బాలయ్య అన్ స్టాపబుల్ షో లో.. రాశి తన క్రష్ విజయ్ దేవరకొండ అని చెప్పేసింది. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నుంచి.. టాలీవుడ్ భామ రాశీ వరకూ ఈ మాట చెప్పిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు.
అలనాటి అందాల తారలు జయసుధ, జయప్రద ఇద్దరూ బాలయ్యతో అన్ స్టాపబుల్ షో కు వచ్చారు. వీళ్ళిద్దరితో పాటు రాశీ ఖన్నా కూడా మధ్యలో ఎంట్రీ ఇచ్చింది. లేటెస్ట్ గా రిలీజైన ప్రోమోలో ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య సందడి చేశారు. ఈ కార్యక్రమంలోనే.. రాశీని నీ క్రష్ ఎవరు అంటూ అడిగిన ప్రశ్నకు రాశీ.. ఏమాత్రం ఆలోచించకుండా “ఐ థింక్ విజయ్ దేవరకొండ..!” అంటూ ఆన్సర్ ఇచ్చేసింది. దీంతో విజయ్ ఫాలోయింగ్ హీరోయిన్లలో ఏ రేంజ్ లో ఉందో అర్థమైపోతోంది.