తన ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఒక్క సారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కించాడు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. సొంత పార్టీ ప్రభుత్వంతో పాటు తన సహచర నేతలపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు కోటంరెడ్డి. నా ఫోన్ దొంగ చాటుగా వినాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తూనే.. తన వద్ద 12 ఫోన్లు ఉన్నాయనీ.. కావాలంటే అవి కూడా ట్యాప్ చేయండి అంటూ జగన్ సర్కార్ కు సవాల్ విసిరాడు. తన స్నేహితులే తన ఫోన్ ను ట్యాప్ చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశాడు. దీంతో నెల్లూరు రాజకీయం తాడేపల్లి దాకా చేరింది. కోటంరెడ్డి వ్యవహారం ఏంటో తేల్చేందుకు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ లో ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యాడు.
ప్రశాంతంగా ఉన్న నెల్లూరు రాజకీయాల్లో అలజడికి కారణాలు ఏంటో తెలుసుకునే పనిలో ఉన్నాడు జగన్. ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ ఆంజనేయులును ఉన్నఫలంగా క్యాంప్ ఆఫీస్ కు రమ్మని.. ఆయనతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నట్టు సమాచారం. ఇక సజ్జల మాత్రం కోటంరెడ్డి వ్యవహారంపై ఘాటుగా స్పందించాడు. ఆయన నిన్నటిదాకా వైసీపీ ఎమ్మెల్యే అనీ.. ఇప్పుడు కాకపోయి ఉండవచ్చని పరోక్షంగా చురకలంటించాడు. తెలుగుదేశం పార్టీతో అన్నీ మాట్లాడుకున్నాకే కోటంరెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నాడంటూ సజ్జల ఎద్దేవా చేశాడు. కోటంరెడ్డి వైపీసీకి రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. వివాదం నేపథ్యంలో ప్రస్తుతం కోటంరెడ్డికి ఉన్న నెల్లూరు రూరల్ ఇంచార్జి పదవిని కూడా జగన్ తొలగించనున్నట్టు సమాచారం.
ఫోన్ ట్యాపింగ్ కలకలం : రంగంలోకి దిగిన సీఎం జగన్
విజయ్ దేవరకొండ అభిమానులకు సారీ చెప్పిన సమంత
తన వల్లే షూటింగ్ ఆలస్యమవుతోందంటూ సమంత విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు డైరెక్టర్ శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ కు సారీ చెప్పింది. ఈ మేరకు ట్విటర్లో ఆమె ట్వీట్ చేసింది. తాను కోలుకున్నానని.. వీలైనంత త్వరలోనే ఖుషీ సినిమా షూటింగ్ కు అటెండ్ అవుతాననీ సమంత చెప్తోంది. విజయ్-సమంత జోడీగా శివ నిర్వాణ డైరెక్షన్లో మైత్రీ మూవీస్ వారు ఖుషీ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మయోసైటిస్ వల్ల సమంత రెస్ట్ కే పరిమితం కావటం.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో ఓ వెబ్ సిరీస్ కూడా సమంత సైన్ చేయటం వల్ల ఖుషీ సినిమా కాస్త ఆలస్యమవుతోంది. అందుకే సమంత సారీ చెప్పింది. సమంత చేసిన ట్వీట్ కు విజయ్ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
రీసెంట్ గా సమంత చేసిన శాకుంతలం సినిమా ప్రస్తుతం రిలీజ్ కు రెడీగా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో అదిరిపోయే గ్రాఫిక్స్ తో డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించాడు. అప్పుడెప్పుడో రుద్రమదేవి తర్వాత మళ్ళీ గుణశేఖర్ శాకుంతలం సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. గుణశేఖర్ కలల ప్రాజెక్టు కావటం.. సమంత ఈ సినిమాలో లీడ్ రోల్ చేయటంతో శాకుంతలంపై అంచనాలు భారీగా ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్.. అంచనాలను మరింత పెంచింది.
ఇంకొంచం మెరుగుపడిన తారకరత్న ఆరోగ్యం
గుండెపోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకుంటున్న నందమూరి తారకరత్న ఆరోగ్యం నిన్నటి కంటే కాస్తంత మెరుగయ్యిందని డాక్టర్లు చెప్తున్నారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తారకరత్న గుండె,కాలేయం పనితీరు 90 శాతం సాధారణ స్థాయికి చేరుకుందనీ.. కాకపోతే మెదడు పనిచేయటం ఇంకా మొదలు కాలేదని తెలిపారు. మెదడు పనిచేయటం ప్రారంభిస్తే లైఫ్ సపోర్ట్ తీసివేసి ట్రీట్మెంట్ కొనసాగించే అవకాశం వస్తుందన్నారు. గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాకేజ్ ఉన్నదనీ, మెదడు పనిచేయటం లేదు కాబట్టి బ్లాకేజ్ తొలగించేందుకు గుండెకు సర్జరీ చేసే అవకాశం లేదన్నారు. ఇక కిడ్నీల పనితీరు కూడా ఇదివరకటి కంటే కాస్త మెరుగైందన్నారు. ఇదిలా ఉంటే.. హాస్పిటల్ బెడ్ పై తారకరత్న ఉన్న ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.
వైద్యులో, లేక కుటుంబ సభ్యులో కావాలనే ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు. నందమూరి అభిమానులు ఈ ఫోటో కింద తారకరత్న త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. తారకరత్న తల్లిదండ్రులు మోహనకృష్ణ, అలేఖ్య రెడ్డి నిత్యం అతడి వెంటే ఉంటున్నారు. కుటుంబ పెద్దలు ఎప్పకిటప్పుడు తారకరత్న ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటున్నారనీ వారు చెప్పారు. తారకరత్న గుండెపోటుకు గురై నేటికి ఆరో రోజు.
ధరలు పెరిగేవి ఏవి.. తగ్గేవి ఏవి
ప్రతి సంవత్సరం లాగానే ఈసారి బడ్జెట్ వల్ల కొన్ని వస్తువుల ధరలు పెరిగితే మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ సారి చూస్తే..
ముబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్ ల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. అలాగే కెమెరా లెన్సులపై యేడాదిపాటు 2.5 శాతం పన్ను మినహాయింపు వల్ల కెమెరాలు, లెన్సుల ధరలు తగ్గే అవకాశం ఉంది. లిథియం అయాన్ బ్యాటరీలపై పన్ను మినహాయింపు లభించింది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై ప్రభావం పడుతుంది. ఎలక్ట్రిక్ టూవీలర్ల ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. అలాగే రొయ్యలు, రొయ్యల ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇక వజ్రాలు, వజ్రాల నగలపై కూడా పన్ను మినహాయింపు లభించింది. ఇకపోతే.. బంగారం, వెండి, ప్లాటినం వంటి వాటి ఉత్పత్తులపై పన్నులు పెరిగాయి కాబట్టి ఆయా వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా సిగరెట్లపై ట్యాక్స్ పెరిగింది. రబ్బరు, టైర్లు, రాగి వంటి వాటిపై కూడా పన్నులు పెంచారు.
Budget 2023-24 : 7 లక్షల వరకు నో ఇన్ కమ్ ట్యాక్స్
బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై జాలి చూపించింది. సంవత్సరానికి 7 లక్షల వేతనం కంటే ఎక్కువ ఉన్న వారు మాత్రమే ఇకపై ఆదాయపన్ను చెల్లించాల్సి ఉంది. 7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వాళ్ళకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. ఇది సగటు వేతన జీవికి భారీ ఉరట అని చెప్పాలి. పెట్రోల్, డీజిల్, గ్యాస్.. ఇలా విపరీతమైన ధరల పెరుగుదలతో ఇంతకు ముందు కంటే రెట్టింపు పన్నులు చెల్లిస్తున్న మధ్య తరగతి మనుషులు.. సంపాదించే కాస్త సంపాదనపై కూడా ఆదాయపు పన్ను చెల్లించాల్సి రావటం భారత పన్నుల వ్యవస్థలో ఉన్న అతి పెద్ద తప్పు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని సవరించింది. కనీసం ఈసారైనా ఆదాయపు పన్ను స్లాబ్ ను భారీగా పెంచి ఊరటనిచ్చింది.
అలాగే కొత్త బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయాలే తీసుకుందని చెప్పాలి. అంతర్జాతీయంగా భారత్ పలుకుబడి పెరిగిన వేళ.. భారతదేశాన్ని సందర్శించాలనుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఇండియా టూరిజం కోసం కొత్త ప్రణాళికలు తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి రావటం గొప్ప విషయమే. “దేఖో అప్నా దేశ్” పేరిట కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇక ప్రపంచాన్ని మాంద్యం కమ్ముకొస్తున్న వేళ కొత్త సంస్కరణలు భారత బ్యాంకింగ్ కు బలం చేకూరుస్తాయి. దేశంలో ఏ లావాదేవీ జరిగినా చివరకు అది బ్యాంకుకు ముడిపడే ఉంటుంది కాబట్టి.. దీని వల్ల మిగతా రంగాలలో మార్పులు జరుగుతాయి. వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగాయి. మహిళల కోసం ప్రత్యేక కేటాయింపులు జరిగాయి. ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల వెంట పడుతున్న వేళ.. లిథియం అయాన్ బ్యాటరీపై పన్నుల తగ్గింపు ఆ రంగానికి ఊరటనిస్తుంది. ఏదిఏమైనా ఈ బడ్జెట్ లో సామాన్యుడికి మేలు చేసే నిర్ణయాలు మాత్రం తీసుకున్నారని చెప్పొచ్చు.
అమిగోస్ “ఎన్నో రాత్రులొస్తాయి” ఫుల్ సాంగ్ : రీమిక్స్ సక్సెస్
కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో రాబోతున్న థ్రిల్లింగ్ మూవీ అమిగోస్ నుంచి కొత్త పాట రిలీజైంది. ఎన్నో రాత్రులొస్తాయి గానీ పాట ప్రోమో ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ రోజు ఫుల్ సాంగ్ రిలీజైంది. ఇదివరకే ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ కావాల్సి ఉండగా.. తారకరత్న గుండెపోటుతో హాస్పిటళ్ళో చేరటంతో సాంగ్ రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ రోజు మేకర్స్ ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. వచ్చీ రాగానే పాట మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. 1992లో బాలకృష్ణ హీరోగా వచ్చిన ధర్మక్షేత్రంలోని ఒరిజినల్ సాంగ్ అప్పట్లో ట్రెండ్ సెట్టర్. ఇప్పటికీ ఈ పాటను వదల్లేదు అటు ప్రేక్షకులు.. ఇటు నందమూరి అభిమానులు. అంత క్రేజ్ ఉన్న సాంగ్ ను ఇప్పుడు కళ్యాణ్ రామ్ అమిగోస్ కోసం రీమిక్స్ చేశారు.
ఒరిజినల్ సాంగ్ ను ఇండియన్ వెటరన్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం పాడగా.. ఇప్పుడు రీమిక్స్ పాటను ఆయన కుమారుడు ఎస్పీబీ చరణ్ ఆలపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ పాటను రీమిక్స్ చేయటంలో అన్ని ఎలిమెంట్స్ ను బాగానే హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తోంది. రీమిక్స్ పాట ఒరిజినల్ ను కిల్ చేసిన వికట ప్రయోగాలు ఇదివరకు చూశాం. కానీ ఈసారి ప్రయోగం సక్సెస్. అచ్చంగా తండ్రి లాగానే పాడాడు చరణ్. చరణ్ మామూలుగా పాడితేనే అచ్చం తండ్రి గొంతులా ఉంటుంది.. ఇక ఇమిటేట్ చేసి పాడాడు కాబట్టి.. అసలు బాలు గొంతుకు, చరణ్ గొంతుకు తేడాయే కనిపించటం లేదు.. సారీ.. వినిపించటం లేదని చెప్పాలి. మొత్తానికి అమిగోస్ కొత్త అప్డేట్ అదిరిపోయింది.
తారకరత్నకు బ్రెయిన్ డ్యామేజ్
గుండెపోటుతో నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం గురించి డాక్టర్లు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండె పని తీరు కాస్తంత మెరుగు పడిందని రిపోర్టులో పేర్కొన్న వైద్యులు.. సపోర్ట్ సిస్టమ్ రేంజ్ ను కాస్త తగ్గించి చూశామనీ.. అయినప్పటికీ గుండె పనితీరు బాగానే ఉందని చెప్పారు. అయితే.. ఇప్పటికీ తారకరత్న వెంటిలేటర్ పైనా ఉన్నాడు. గుండె బ్లడ్ పంపింగ్ సరిగ్గా చేయకపోవటంతో రక్తం సరఫరా కాని సమయంలో మెదడుకు సంబంధించిన సమస్య వచ్చిందని.. బ్రెయిన్ డ్యామేజ్ అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. రక్తం సరఫరాలో అంతరాయం వల్ల కిడ్నీల సమస్య కూడా తెలత్తిందని డాక్టర్లు ఇదివరకే చెప్పారు.
ప్రస్తుతానికి గుండె, కాలేయంతో పాటు మెదడు పని తీరు కాస్త మెరుగయ్యిందని డాక్టర్లు చెప్పారు. కర్ణాటకలోనే అత్యుత్తమ వైద్యుల బృందం తారకరత్నకు చికిత్స అందజేస్తున్నారని నందమూరి రామకృష్ణ మీడియాకు చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు వెంటిలేటర్ పై ఉంచుతారనే విషయం తెలియదనీ.. కాకపోతే.. మెల్లమెల్లగా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ను తొలగించే ప్రయత్నం చేస్తామని డాక్టర్లు చెప్పారని రామకృష్ణ తెలిపారు. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, ఎన్టీఆర్ తో పాటు మిగితా కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు.
ఆశారాం బాపూ గురించి చాలా మందికి తెలియని నిజాలు
మైనర్ బాలిక అత్యాచారం కేసులో ఈ రోజు ఉదయం కోర్టు ఆశారాం బాపూ అనే దొంగ బాబాకు జీవితఖైదు విధించిన విషయం తెలిసిందే. 2013లో సూరత్ కు చెందిన ఓ మహిళ ఆశారాం బాపూ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన పోలీసులు 2014లో చార్జి షీట్ దాఖలు చేసిన పోలీసులు ఏడుగురిని సాక్షులుగా చేసి విచారణ చేపట్టగా.. చాలా పరిణామాల తర్వాత 2018లో జోధ్ పూర్ కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. మళ్ళీ కొన్ని పరిణామాల తర్వాత నేడు ఆశారాంకు శిక్ష ఖరారైంది. శిక్షకు గురైన ఆశారాం ఆస్తులపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
1941లో పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో పుట్టిన ఆశారాం అసలు పేరు అసుమల్ హర్పలానీ. 1947 తర్వాత అహ్మదాబాద్ లో స్థిరపడింది ఆశారాం కుటుంబం. 1960లో లీలాషా అనే ఆధ్యాత్మిక గురువు వద్ద శిష్యుడిగా చేసిన ఆశారాం.. ఆ తర్వాత సబర్మతి నది ఒడ్డున సొంత ఆశ్రమాన్ని నిర్మించటం.. ఆ తర్వాత ఏకంగా 400 ఆశ్రమాలు నిర్మించే స్థాయికి చేరుకోవటం చాలా వేగంగా జరిగిపోయాయి. ఉచిత అన్నదానాలు.. ఆశ్రమాలతో కోట్లాది మంది భక్తులను సంపాదించుకున్న ఆశారాం పేరిట కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఒక్క గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఆశ్రమ భవనాలు, వాటి పేరిట ట్రస్టులు, వాటి అకౌంట్లలో కోట్లాది రూపాయలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఆస్తులు కూడబెట్టాడు ఆశారాం. ఒక్క గుజరాత్ లోని ఆస్తుల విలువే 10 వేల కోట్ల పైమాటే. అంటే మొత్తం ఆస్తుల విలువ కనీసం లక్ష కోట్లు ఉండొచ్చని అంచనా.
ఆశారాం పెద్ద మాఫియా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆశారాం కేసు విచారణ జరుగుతున్నన్ని రోజులూ ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. కేసు విచారణ సమయంలో సాక్ష్యం చెప్పేందుకు వచ్చే వాళ్ళలో చాలా మంది అయితే కనిపించకుండా పోయేవాళ్ళు.. లేదంటే సడన్ గా మరణించేవారు. ఇదంతా ఆశారాం మాఫియానే చేస్తుందని ఆరోపణలు వచ్చినా రుజువులు దొరకలేదు. దేశవ్యాప్త నెట్ వర్క్ నిర్మించుకున్న ఆశారాం.. చాలా నేరాలకు పాల్పడేవాడు. కానీ బయటకు రాలేదు సరికదా.. ఎవ్వరికీ అనుమానం కూడా కలగలేదు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి సహా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఫేక్ బాబాను నమ్మి సందర్శించే వాళ్ళు. నేటితో ఈ కేసు ముగిసింది.. ఎట్టకేలకు ఆశారాం శిక్షకు గురయ్యాడు.
కుప్పకూలిన దక్కన్ మాల్.. భారీ ప్రమాదం తప్పింది
అగ్నిప్రమాదంలో పూర్తిగా దెబ్బతిన్న దక్కన్ మాల్ బిల్డింగ్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేస్తుండగా పెను ప్రమాదం తప్పింది. క్రేన్ తో భవనాన్ని కొద్దికొద్దిగా కూల్చేస్తున్న క్రమంలో.. పిల్లర్లు వీక్ గా ఉండటంతో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అధికారులు షాకయ్యారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కన ప్రాంతాలను ఖాళీ చేయించటంతో ఎవరికీ ఏమీ కాలేదు. అధికారులు కూడా ప్రమాదం నుంచి బయటపడ్డారు. శిథిలాలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. దీంతో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులకు కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయి.
భవనాన్ని ఆనవాళ్ళు లేకుండా కూల్చేయాలంటే కుప్పలన్నీ ముందు అక్కడి నుంచి తొలగించి.. భవనం లోపలి ప్రాంతాలకు వెళ్ళి కూల్చివేత కొనసాగించాల్సి ఉంది. భవనం కుప్పకూలిపోవటానికి సంబంధించిన వీడియోను అధికారులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ సంభవించి దక్కన్ స్టోర్ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం బిల్డింగ్ కూల్చివేత పనులు ఇంకా మిగిలే ఉన్నాయి.
చాపకింద నీరులా ముంచుకొస్తున్న అమెరికా చైనా యుద్ధం
కరోనా కల్లోలం నుంచి కోలుకునే పనిలో డ్రాగన్ బిజీబిజీగా ఉందనే అందరూ అనుకుంటున్నారు. బీజింగ్ బిజీగానే ఉంది కానీ, కోవిడ్ నివారణ చర్యల్లో కాదు. ప్రత్యర్ధులపై పావులు కదపడంలో. ఔను.. ఇదే విషయాన్ని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఎయిర్‌ఫోర్స్‌లో టాప్ జనరల్ అంచనా వేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. తైవాన్ ఆక్రమణకు, అమెరికాపై యుద్ధానికీ ఒక్కసారే సిద్ధమయ్యేలా బీజింగ్ గ్రౌండ్‌వర్క్ చేస్తున్నట్టు ఆ జనరల్ అంచనా వేశారట. “డ్రాగన్ ఏ క్షణానైనా దండెత్తే ఛాన్స్ ఉంది.. యుద్ధానికి సిద్ధం కావాలంటూ అధికారులకు అంతర్గతంగా లేఖలు సైతం పంపినట్టు వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో రాసింది.
మైక్ మినిహాన్ అనే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ టాప్ జనరల్ దీనిపై సైన్యాధికారులకు లేఖలు రాశాడు. ఆ లేఖల్లోని సారాంశమేంటంటే.. బీజింగ్ ఏ క్షణానైనా అమెరికాపై దండెత్తొచ్చని. ఫలితంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ యుద్దం లక్ష్యం చైనాను అడ్డుకోవడమేనని.. లేదంటే డ్రాగన్‌ను ఓడించడమేనని లేఖలో పేర్కొన్నారు. ఒకవేళ తన అంచనా తప్పు కావొచ్చంటూనే.. 2025లో బీజింగ్‌తో కచ్చితంగా పోరాడుతామని తన సిక్స్త్ సెన్స్ చెబుతోందని ఆ లేఖలో చెప్పుకొచ్చారు.
ఎయిర్ ఫోర్స్‌లోని ఎయిర్ మబైలిటీ కామాండ్ హెడ్ ఈ జనరల్ మైక్ మినిహాన్.. అతడి కింద 50వేల మంది సైనికులు, 500 యుద్ధ విమానాలు ఉంటాయి. ఎయిర్ ఫోర్స్‌లో టాప్ అధికారి కావడంతో ఇప్పుడు మినిహాన్ లేఖలు అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.
తైవాన్‌ను టార్గెట్ చేయడం వరకూ ఓకే. కానీ, అగ్రరాజ్యం అమెరికాను బీజింగ్ ఎందుకు లక్ష్యం చేసుకుంటుంది? ఇదేం సమాధానం దొరకని భేతాళ ప్రశ్నేం కాదు. తైవాన్ కావాలంటే బీజింగ్ కచ్చితంగా అమెరికాను ఓడించాలి. లేదంటే తైవాన్‌ను హస్తగతం చేసుకునేలోపే అమెరికా మిస్సైళ్లు బీజింగ్‌ను ధ్వంసం నామరూపాల్లేకుండా తుడిచిపెట్టేస్తాయి. ఇటీవల తైవాన్, చైనా ఉద్రిక్తతల సమయంలో ఇదే మాట వైట్‌హౌస్ పదే పదే చెబుతూ వచ్చింది. దీనికితోడు జిన్‌పింగ్ సేనలు తైవాన్‌ను చుట్టుముట్టిన క్షణాల్లోను అమెరికా అంతకుమించిన యాక్షన్‌ను షురూ చేసింది. తైవాన్ తమదే అనీ, అందులో వేలు పెట్టొద్దంటూ బీజింగ్ పదే పదే హెచ్చరించినా లెక్కచేయకుండా యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను మోహరిస్తూ కవ్వించింది. అంతటితో ఆగకుండా ఉద్రిక్తతలు తీవ్రమైన వేళ ఏకంగా అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీ తైపీలో పర్యటించి డ్రాగన్‌కు సవాల్ చేసింది. ఆ సమయంలో పెలోసీ తైపీలో అడుగుపెడితే తమ యుద్ధ విమానాలు రంగంలో దిగుతాయని హెచ్చరించిన చైనా.. చివరికి ఆ సాహసం కూడా చేసింది. అయితే, పెలోసీ పర్యటనను అడ్డుకోలేక ప్రపంచం ముందు అభాసుపాలైంది. అప్పట్నుంచే తైవాన్‌తో పాటూ అమెరికాను టార్గెట్ చేయడం మొదలైంది.
నిజానికి.. గతేడాది ఆగస్ట్‌లోనే తైవాన్ విషయాన్ని తేల్చేయాలని బీజింగ్ భావించింది. కానీ, అధ్యక్ష ఎన్నికలు జిన్‌పింగ్‌ను ఆపేశాయి. చైనా గత చరిత్రను తిరగరాస్తూ మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపైను దృష్టి సారించడంతో తైవాన్ అంశాన్ని కాస్త పక్కనపెట్టారనే వార్తలు వినిపించాయి. చివరికి జిన్‌పింగ్ మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధానికి సిద్ధం కావాలని ఆదేశించడం, అలాగే త్రివిధ దళాల్లో అమెరికాను దాటేసేందుకు ఆయుధాలపై ఫోకస్ చేయడం లాంటి నిర్ణయాలు బీజింగ్ తీసుకుంది. మొదట ఈ పరిణామాలన్నీ భారత్‌పై యుద్ధానికే అని భావించినా.. మైక్ లేఖతో తైవాన్, అమెరికాపై యాక్షన్ కోసమే అనే వాదనలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దక్షిణ చైనా సముద్రంలో అమెరికా తన సైనిక విన్యాసాలు నిర్వహించడం లాంటి పరిణామా లు చూస్తుంటే మైక్ అనుమానాలే నిజమవుతాయేమో అంటున్నారు మిలటరీ ఎక్స్‌పర్ట్స్ ఏదేమైనా చైనా దూకుడుతో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తోంది.