యువగళం పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు లోకల్ పోలీసులు షాకిచ్చారు. పలమనేరు లో పర్యటిస్తున్న సమయంలో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు లోకేష్ ప్రచార రథాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. లోకేష్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన ప్రసంగం ముగిసిన తర్వాత ప్రచార రథాన్ని ఆధీనంలోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. పాదయాత్రలో మైక్ వాడటానికి అనుమతి లేదని.. అందుకే ప్రచార రథాన్ని సీజ్ చేశామని పోలీసులు చెప్పారు.
పోలీసుల ప్రవర్తనతో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఆగ్రహానికి లోనయ్యారు. అక్కడే కూర్చొని నిరసన వ్యక్తం చేసారు. జీఓ నెంబర్ 1 రాజ్యాంగానికి వ్యతిరేకమనీ.. తమ యాత్రకు పోలీసులు అడ్డంకులు సృష్టించటం మానుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళన ఉగ్రరూపం దాల్చక ముందే పోలీసులు లోకేష్ ప్రచార రథాన్ని విడిచిపెట్టారు. దీంతో లోకేష్ మళ్ళీ యాత్రను ప్రారంభించారు. కానీ మైక్ ఉపయోగించటానికి వీల్లేదని పోలీసులు స్పష్టం చేశారు.
లోకేష్ కు షాకిచ్చిన పోలీసులు : ప్రచార రథం సీజ్
కొత్త లుక్ తో షాకిచ్చిన నిత్యా మీనన్
పాత్రలో జీవించేందుకు కొంత మంది నటీనటులు సెస్సేషనల్ నిర్ణయాలు తీసుకుంటారు. నిత్యా మీనన్ కూడా సినిమా కోసం విపరీతమైన బరువు పెరిగిన విషయం తెలిసిందే. నిత్య లుక్ చూసి ఆమె ఫ్యాన్స్ దాదాపు హర్ట్ అయ్యారు. ఎంత సినిమా కోసం అయితే మాత్రం ఇంత బరువు పెరగటం అవసరమా అని కామెంట్లు చేశారు. కానీ నిత్య కొత్త లుక్ చూశారంటే ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపడిపోవాల్సిందే. పూర్తిగా బరువు తగ్గి మళ్ళీ ఇదివరకటి క్యూట్ లుక్స్ తో తన కొత్త ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది నిత్యా మీనన్. కొత్త లుక్స్ కు ఫిదా అయిన ఆమె అభిమానులు ఈ ఫోటోలను విపరీతంగా వైరల్ చేసేస్తున్నారు.
లైకులు, షేర్లు, కామెంట్లతో సోషల్ మీడియాలో యెల్లో కలర్ ఔట్ ఫిట్ లో ఉన్న నిత్య కొత్త లుక్ ట్రెండింగ్ అవుతోంది. నిత్యా మీనన్ భీమ్లా నాయక్ సినిమాలో పవన్ పక్కన కనిపించిన తర్వాత మరో తెలుగు సినిమా అనౌన్స్ చేయలేదు. కాకపోతే.. ఇటీవల నిత్యా సోషల్ సర్వీస్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ఓ స్కూల్ లో పిల్లలకు పాఠాలు చెప్పిన నిత్య మీనన్.. తనకు సోషల్ సర్వీస్ పై ఎంత ఆసక్తి ఉందో చెప్పకనే చెప్పింది. తన ప్రొఫైల్ లో తరచుగా సోషల్ మేసేజ్ ఇచ్చే పోస్టులనే షేర్ చేస్తోంది నిత్య. తన కొత్త ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తుందోనని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు.
పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ-హిండెన్ బర్గ్ వివాదం
అదానీ గ్రూప్-హిండెన్ బర్గ్ వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై చర్చించాల్సిందేనంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు రాద్ధాంతం చేయటంతో ఉభయ సభల్లో గందరగోళ పరిస్థితి నెలకొనగా.. చివరికి చేసేదేమీ లేక.. ఇరు సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా.. కాంగ్రెస్ సభ్యులు హిండెన్ బర్గ్ నివేదికపై చర్చించాలంటూ పట్టుబట్టారు. విపక్షాలు కూడా ఏకమై రాద్ధాంతం చేయటంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్న స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమైనప్పటికీ పరిస్థితి అలాగే కొనసాగింది. అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై చర్చించాల్సిందే అంటూ విపక్షాలు మళ్లీ ఆందోళన చేపట్టాయి. ఎంత సేపటికీ పరిస్థితి సద్దుమణగకపోవటంతో సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నిన్న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ సమావేశాల్లో కొత్త బడ్జెట్ పై చర్చించాల్సి ఉండగా.. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి.
అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన బిచ్చగాడు హీరో
షూటింగ్ లో ప్రమాదవశాత్తు తీవ్ర గాయాలపాలై ఐసీయూ ట్రీట్మెంట్ తీసుకున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ ఆరోగ్యం దాదాపు పూర్తిగా మెరుగుపడిందట. ఈ మేరకు తన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇస్తూ విజయ్ ట్వీట్ చేశాడు. విరిగిన ఎముకలు అతుక్కున్నాయి.. 90 శాతం కోలుకున్నాను.. ఈరోజు నుంచే బిచ్చగాడు-2 సినిమా షూటింగ్ లో పాల్గొంటాను అంటూ విజయ్ ట్వీట్ లో పేర్కొన్నాడు. విజయ్ ట్వీట్ తో అభిమానులు హ్యాప్పీ అని చెప్పాలి. యాక్సిడెంట్ గురించి విపరీతంగా పుకార్లు పుట్టుకొచ్చాయి. విజయ్ ప్రాణాలతో బయటపడటం కష్టమనీ.. ఐసీయూ నుంచి తిరిగి రావటం అసాధ్యమనీ ఇలా చాలా చాలా పుకార్లు షికార్లు చేశాయి.
2016లో వచ్చిన బిచ్చగాడు సినిమా విజయ్ ఆంటోనీ కెరీర్ నే మార్చివేసింది. సాదా సీదా సినిమాగా థియేటర్లలోకి వచ్చిన బిచ్చగాడు.. ఊహించని సెన్సేషన్ క్రియేట్ చేసి భారీ హిట్ గా నిలిచింది. టాలీవుడు లో బయ్యర్లకు కనకవర్షం కురిపించిన సినిమా బిచ్చగాడు. ఈ సినిమాకు విజయ్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.
చరిత్రలో మొదటిసారి నిజం ఒప్పుకున్న పాకిస్తాన్
ప్రపంచంలో ఓపెన్ గా ప్రభుత్వమే తీవ్రవాదాన్ని పెంచి పోషించే దేశం ఏదైనా ఉంది అంటే అది కేవలం పాకిస్తాన్ మాత్రమే. నామమాత్రపు సూడో ప్రభుత్వాన్ని గుప్పిట్లో ఉంచుకొని పరోక్షంగా పాలించే పాకిస్తాన్ సైన్యం.. తీవ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ భారత సరిహద్దుల్లో సేఫ్ గా ల్యాండ్ చేస్తారు భారత్ పై దాడులు చేయటానికి. పైగా అంతర్జాతీయ వేదికలపైన అవకాశం వచ్చినప్పుడల్లా కశ్మీర్ లో భారత్ హక్కుల హననం చేస్తోందనీ.. కశ్మీర్ పై చర్చలు మాత్రమే పరిష్కారమంటూ పిచ్చికూతలు కూయటం పాక్ కు అలవాటు. దీనికి అమెరికా, చైనా వత్తాసు పలకటం తరచుగా జరిగే తంతు. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియనిది కాదు. జనం అన్నం కోసం రోడ్లపై బిచ్చమెత్తుకుంటున్నారు. ఆకలితో ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాయం కోసం పాకిస్తాన్ అడగని దేశమే లేదు. కానీ అన్ని దేశాలు ఛీ పో అన్నాయే తప్ప రూపాయి విదల్చలేదు. చివరికి పాకిస్తాన్ మీడియా.. భారత్ తప్ప మరో శరణు లేదు పాకిస్తాన్ కు అని కోడై కూస్తోంది. భారత్ తప్ప పాకిస్తాన్ ను మరేదేశమూ ఆదుకోలేదనీ.. మోడీ తప్ప పాక్ కు మరో దేవుడు లేడనీ పాకిస్తాన్ మీడియా బల్లగుద్ది చెప్తోంది.
ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కు ఇక మరో మార్గమే లేని పరిస్థితుల్లో చివరికి ఆ దేశం నిజం ఒప్పుకోవాల్సి వచ్చింది. భారత్ తరచుగా చేసే తీవ్రవాద ఆరోపణలను పాకిస్తాన్ ఎట్టకేలకు అంగీకరించింది. ఇన్ని రోజులు తీవ్రవాదాన్ని పెంచి పోషించింది తామేననీ.. ఇప్పుడు అదే పాకిస్తాన్ కొంప ముంచిందనీ ఆ దేశ పాలకులు చెంపలేసుకుంటున్నారు. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో వంద మందికి పైగా చనిపోగా.. సుమారు 200 మంది గాయపడ్డారు. ఇది పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. పాకిస్తాన్ తో ఇక పని లేదని నట్టేట వదిలేసింది చైనా. ఉక్రెయిన్ కు భారీ సాయం చేసీ చేసీ కష్టాల్లో కూరుకుపోయింది అమెరికా. ఇక పాకిస్తాన్ ను కబలించేందుకు తాలిబన్లకు ఇదే సరైన సమయం. అందుకే అల్లకల్లోలం సృష్టిస్తున్నారు ప్రస్తుతం తాలిబన్లు పాకిస్తాన్లో. ఒంటరిగా మారిన పాకిస్తాన్ కు ప్రస్తుతం నిజం ఒప్పుకోవటం తప్ప మరో మార్గం లేదు. సో.. మేం తీవ్రవాదాన్ని పెంచిపోషించాం.. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నాం.. అంటున్నారు. అంటే భారత్ ఇన్ని రోజులు అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ గురించి చేసిన ఆరోపణలన్నీ నిజమేనని పాక్ అంగీకరించింది. ఇన్నాళ్ళూ పాకిస్తాన్ తీవ్రవాద దేశం కాదని వాదించిన అమెరికా, చైనాలు ముఖం ఎక్కడపెట్టుకుంటాయో చూడాలి. ఎట్టకేలకు మేమే తీవ్రవాదులను పెంచిపోషించామని ఒప్పుకున్న పాకిస్తాన్ తదుపరి చర్య ఎలా ఉండబోతోందో ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పాకిస్తాన్ మీడియా మొత్తుకుంటున్నట్టు ఆ దేశం భారత్ ముందు మోకరిల్లే సమయం మరెంతో దూరంలో లేదనిపిస్తోంది.
పెట్రోల్ లేదు.. డీజిల్ లేదు.. గ్యాస్ లేదు.. కరెంటు లేదు.. గోధుమలు లేవు.. బియ్యం లేవు.. చివరికి రోడ్లపైకి వచ్చి ప్రభుత్వం రేషన్ పై ఇచ్చే గోధుమ బస్తాను తీసుకోటానికి స్వేచ్ఛ కూడా లేదు. ఎవడి దగ్గర తుపాకీ ఉంటే వాడిదే రాజ్యంగా మారింది పాకిస్తాన్లో. నడిసంద్రంలో నావలా మారిన పాకిస్తాన్ ను పాకిస్తాన్ మీడియా చెప్పినట్టు భారత్ తప్ప మరే దేశమూ ఆదుకోలేదు. కానీ మోడీజీ అలాంటి నిర్ణయం తీసుకుంటారా.. అసాధ్యమనే చెప్పాలి. దేశ విభజన తర్వాత పాకిస్తాన్ గత 75 యేళ్ళుగా భారత్ పై జరిపిన దమనకాండను భారత్ మరిచిపోతుందా.. రెండు సార్లు పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాన్ని భారత్ మరిచిపోతుందా.. ముంబై దాడులను.. పుల్వామా పేలుళ్ళను.. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడులను భారత్ మరిచిపోతుందా.. లేదు. అవి భారత చరిత్రలో పాకిస్తాన్ నాయకులు రాసిన రక్తపు చరిత్రలో కొన్ని ఎరుపు మరకలు మాత్రమే. కానీ.. ఇప్పుడు భారత్ కు బలం వస్తుంది. పాకిస్తాన్ పై కనీసం ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా.. ఒక్క భారత సైనికుడు కూడా ప్రాణత్యాగం చేయనవసరం లేకుండా.. కేవలం విదేశాంగ విధానంతో పాకిస్తాన్ చుట్టూ ఉచ్చు మరింత బిగించి.. ఆ దేశాన్ని కాళ్ళ బేరానికి తెచ్చుకునే అవకాశం మాత్రం భారత్ ముందుంది. చూద్దాం.. ఇంకా పాకిస్తాన్ ఎంత దిగజారుతుందో.. భారత్ విలువ ఎంత పెరుగుతుందో.
అమెరికా చట్ట సభల్లో ప్రసంగించనున్న మోడీ
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరోసారి త్వరలోనే అమెరికాలో పర్యటించనున్నారు. అంతే కాదు.. అమెరికా ఉభయ సభల్లో మోడీ ప్రసంగించే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు కనిపిస్తున్నాయి. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నేరుగానే ఈ విషయాన్ని గురించి కథనాలు ప్రచురించింది. భారత్ లోనూ.. అమెరికాలోనూ ప్రస్తుతం ఎన్నికల వాతావరణం కనిపిస్తున్నది. మోడీని అమెరికాకు రప్పించి తనకు అనుకూలంగా ప్రచారం చేయించుకునేందుకు జో బిడెన్ ఎదురు చూస్తున్నారని కూడా చెప్పుకుంటున్నారు. అయితే.. అబ్ కీ బార్.. ట్రంప్ కీ సర్కార్ అంటూ గతంలో ట్రంప్ కోసం ప్రచారం చేసిన మోడీ ఇప్పుడు బైడెన్ కు ఓట్లు వేయాలని అమెరికా ప్రజలను కోరతారా అనేది సందేహమే. ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో బైడెన్ భారత్ కు వార్నింగ్ ఇచ్చిన విషయం ఇంకా ఎవరూ మరిచిపోలేదు.
జో బిడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మోడీ అమెరికాలో సెప్టెంబర్ 2021లో పర్యటించారు. ఇప్పుడు అమెరికా పర్యటనకు వెళ్తే రెండోసారి అవుతుంది. ప్రస్తుతం జీ20 కూటమి పగ్గాలు భారత్ చేతుల్లోనే ఉన్నాయి. అదీ కాక.. కొద్ది రోజుల క్రితం బైడెన్ వెతుక్కుంటూ వచ్చి మరీ మోడీని కలిసిన వీడియో ప్రపంచం మొత్తం ఆసక్తిగా చూసింది. సో.. అమెరికాకు మోడీ అవసరం ఉన్నట్టుంది. కాబట్టి మోడీకి ఈ సారి అమెరికా ప్రభుత్వం బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. కానీ మోడీ మరియు ఆయన యంత్రాంగం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్న. త్వరలోనే ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది.
కీర్తి సురేష్ డ్రెస్ పై నెటిజన్ల సెటైర్లు
అందాల భామ కీర్తి సురేష్ డ్రెస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. డైరెక్టర్ వెంకీ అట్లూరి పెళ్ళికి హీరో నితిన్ తో కలిసి హాజరైన కీర్తి సురేష్.. ఈ ఈవెంట్ కోసం వేసుకొచ్చిన కాస్ట్యూమ్ ప్రస్తుతం ట్రోల్ అవుతోంది. రంగురంగుల డ్రెస్ వేసుకొని రావటమే ఈ ట్రోల్ కు కారణం. నాలుగు షామ్యానాలు చింపేసి కలిపి కుట్టించినట్టు ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మల్టీ కలర్ డ్రెస్ ఏంటి కీర్తి అని ఆమె ఫ్యాన్స్ క్వశ్చన్ చేస్తున్నారు. భైరవద్వీపం సినిమాలో కనిపించే జంట దయ్యాల ఫోటోను రిప్లైలో జత చేస్తున్నారు. ఈ దయ్యాలు కూడా రంగు రంగుల గుడ్డలన్నీ కలిపి కుట్టించిన బట్టల్లో కనిపిస్తాయి సినిమాలో. ఎవరికి తోచిన కామెంట్ వారు చేసేస్తున్నారు కీర్తి సురేష్ డ్రెస్ పై.
వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన రంగ్ దే సినిమాలో నితిని, కీర్తి కలిసి నటించారు. అందుకేనేమో ఇద్దరూ కలిసి వెంకీ పెళ్ళి వేడుకకు హాజరై వధూవరులను కలిసి విష్ చేశారు. అయితే నితిన్ మాత్రం మాలధారణలో ఉన్నాడు కాబట్టి కాషాయ వస్త్రాల్లోనే కీర్తితో కలిసి వచ్చాడు. ఏదైతేనేం.. పాపం కీర్తి మరోసారి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. అప్పుడప్పుడు ఫ్యాషన్ ఇలాగే డిజాస్టర్ అవుతుంది.
త్రీ క్యాపిటల్స్ పై జగన్ హాట్ కామెంట్స్
మూడు రాజధానులపై ఎన్ని ఆటంకాలొచ్చినా జగన్ సర్కార్ ముందుకే అంటోంది. క్యాపిటల్స్ విషయంలో జగన్ క్రిస్టల్ క్లియర్ క్లారిటీతో ముందుకెళుతున్నట్టు ఆయన యాక్షనే చెబుతోంది. తాజాగా.. వచ్చే నెలలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ముందు ఏపీ ప్రభుత్వం దేశ రాజధానిలో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్‌కు పలువురు దౌత్యవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నుండి వ్యక్తులను ఆహ్వానించారు. వారిని ఉద్దేశించి ఏపీ సీఎం ప్రసంగించారు. ఇలాంటి సమయంలో ప్రసంగం అంటే రాష్ట్రంలో పెట్టుబడులకు ఆహ్వానాలు కామన్. కానీ, సీఎం నోటివెంట మొదటి మాటగా విశాఖ వచ్చింది. అతిత్వరలో విశాఖ రాజధానిగా మారబోతోందని.. వైజాగ్‌కు పెట్టుబడులు పెట్టేందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విశాఖే రాజధాని అని క్లారిటీలు, విమర్శలను కాస్త పక్కన పెడితే.. జగన్ ప్రకటించినంత వేగంగా విశాఖ నుంచి పాలన మొదలవుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి లీగల్‌గా ఏపీకి రాజధాని అమరావతి మాత్రమే. కేంద్రం కూడా అదే విషయాన్ని తెలిపింది. దీంతో ఒకవేళ వైజాగ్‌ను రాజధానిగా ప్రకటించాలీ అంటే అసెంబ్లీలో మళ్ళీ బిల్ ప్రవేశ పెట్టాలి. దానికి గవర్నర్ ఆమోద ముద్ర పడాలి. ఈ మొత్తం వ్యవహారానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. అందుకే మొదట సీఎం క్యాంపు కార్యాలయం వైజాగ్‌లో ఏర్పాటు చెయ్యాలని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదుర్చుకుని ఉగాది నాటికి సీఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించి వారంలో రెండు లేదా మూడు రోజులు అక్కడి నుండే పాలన సాగిస్తారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవుతున్న నేపథ్యంలో ఆయన కార్యాలయం ఏర్పాటు కోసం భవనాలను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు. రిషికొండపై రెడీ అవుతున్న భవనం సహా.. ఏయూలోని పలు భవనాలు.. కలెక్టర్ కార్యాలయం.. సర్క్యూట్ హౌస్.. టౌన్ హాల్ ఇలా అనేక భవనాలు రెడీగా ఉన్నాయి. వీటిలో సీఎం కార్యాలయం ఏర్పాటుకు ఏది అనువుగా ఉంటుందో తేల్చే పనిలో పడ్డట్టు వైవీ కామెంట్స్ కూడా తేల్చేస్తున్నాయి. ఇదే సమయంలో విశాఖకు రాజధానిని తరలించే ప్రయత్నం వేగవంతం అవుతున్నవేళ రానున్న సమావేశాల్లోనే మూడు రాజధానుల బిల్లు మరోసారి అసెంబ్లీ ప్రవేశ పెట్టబోతోంది ఏపీ ప్రభుత్వం అంటున్నారు విశ్లేషకులు. తాజాగా సీఎం చేసిన ప్రకటనతో ఆ ప్రక్రియ మరింత వేగవంతం కానున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా సీఎం జగన్ తాను అతి త్వరలోనే హలో వైజాగ్ అనడం ఖాయం అని తేల్చేసారు. మరి దీనిపై విపక్షాల యాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
పాకిస్తాన్ ప్రజల నెత్తిన మరో పిడుగు
ఏ దేశంలో అయినా రాజకీయాలు ఎలా ఉండకూడదో పాకిస్తాన్‌ను చూసి అర్ధం చేసుకోవచ్చు. ఆ దేశం ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజల ఆకలి తీర్చలేని పరిస్థితికి ప్రభుత్వం చేరిపోయింది. కానీ, ఇవేవీ అక్కడి రాజకీయాలను ప్రభావితం చేయడంలేదు. అధికారంలో ఎవరున్నా ఇప్పటికిప్పుడు పాక్ ప్రజల కష్టాలు, కన్నీళ్లు తీరే సీన్ ఎలాగో లేదనుకున్నారో ఏమోకానీ.. అక్కడి పాలకులు అగ్రరాజ్యాల్లో కూడా కనిపించని రాజకీయాన్ని నెరపుతున్నారు. అప్పట్లో షెహబాజ్ షరీఫ్ అండ్ కో ఇమ్రాన్ సర్కార్‌ను అర్ధాంతరంగా గద్దె దించేస్తే.. ఇప్పుడేమో వచ్చే ఎన్నికల్లో షరీఫ్ సర్కార్‌ను సాగనంపేందుకు పీటీఐ అధినేత ఇమ్రాన్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార, విపక్షాలు దేశాన్నీ, పాక్ ప్రజలను కష్టాలనుంచి ఎలా గట్టెక్కించాలనే దానిపై కలిసి పనిచేయాలి. అలా జరిగితే అది పాక్ రాజకీయం ఎలా అవుతుంది? అందుకే జనం ఎలాపోతే ఏంటి, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం.. అన్నట్టుగా అక్కడి పాలకుల వైఖరి కనిపిస్తోంది.
నిజానికి.. పాకిస్తాన్ ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం ఈ ఏడాది ఆగస్ట్‌తో ముగుస్తుంది. అప్పటి నుంచి 90 రోజుల్లోగా సార్వత్రిక ఎన్నికల నిర్వహించాల్సి ఉంటుంది. ఆ గడువుకు ముందే ఎన్నికలు నిర్వహించాలని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మిగతా పీటీఐ సభ్యుల రాజీనామాలను కూడా అంగీకరిస్తే.. జాతీయ అసెంబ్లీ నుంచి ఇమ్రాన్ ఖాన్ పార్టీ పూర్తిగా వైదొలిగినట్లవుతుంది. నిజానికి.. ఇమ్రాన్ ఖాన్ ఇలా ఒకేసారి ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం ఇదే తొలిసారి కాదు. గతేడాది అక్టోబరులో జరిగిన జాతీయ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ 7 స్థానాల్లో పోటీ చేసి ఆరు చోట్ల విజయం సాధించారు. ఇదేం లెక్క అనుకోకండి ఎందుకంటే పాకిస్థాన్ ఎన్నికల్లో ఒక వ్యక్తి ఎన్ని చోట్ల నుంచైనా పోటీ చేయవచ్చు. ఐతే, ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే మాత్రం మనలాగే ఏ స్థానాలను వదులుకుంటారో ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇమ్రాన్‌ఖాన్ చేస్తానంటోంది కూడా అదే. ఐతే, ఆగస్ట్ నెలతో అసెంబ్లీ గడువు ముగిసే వేళ.. ఉపఎన్నికలు నిర్వహించడం ఒకెత్తయితే.. వాటన్నింటిలో ఇమ్రాన్ ఒక్కరే పోటీ చేయాలని డిసైడ్ అవ్వడం మరో ఎత్తు. ఆర్ధిక సంక్షోభ పరిస్థితుల్లో అత్యంత ఖర్చుతో కూడుకున్న ఈ ఉప ఎన్నికలు అవసరమా అధ్యక్షా? అనేది కోట్లాది మంది పాకిస్తానీయుల ప్రశ్న.
మార్చి 16న జరిగే ఉప ఎన్నికల స్థానాలు తమ పార్టీ సిట్టింగ్‌వే కావడంతో తన గెలుపు సులభమని ఇమ్రాన్ ఖాన్ అంచనా. అన్నిచోట్లా తానే గెలిచి రాజకీయ సంక్షోభానికి తెరతీసి ముందస్తు ఎన్నికలు జరిగేలా ఒత్తిడి తీసుకురావాలన్నది ఇమ్రాన్ ఖాన్ ఎత్తుగడ. కానీ, అసలు చిక్కంతా ఇక్కడే ఉంది. ఇమ్రాన్ ఖాన్ అన్ని సీట్లలోనూ గెలిచి రాజకీయ సంక్షోభానికి దారి తీస్తే నష్టపోయేది మళ్లీ కోట్లాది పాకిస్తానీలే. అసలే ఆర్ధిక పతనంలో ఉన్న పాకిస్తాన్‌కు రాజకీయంగా కూడా స్థిరత్వం లేకపోతే ఇప్పుడున్న షెహబాజ్ షరీఫ్ సర్కార్ సైతం చేతులెస్తేయాల్సిందే. దేశాన్ని గట్టెక్కించడానికి ఐఎంఎఫ్ లాంటి సంస్థల సాయాన్నే కోరాలో.. లేక రాజకీయంగా ఇమ్రాన్‌ఖాన్‌తో తలపడాలో తెలీక దేశాన్ని గాలికొదిలేసే పరిస్థితే తలెత్తుతుంది. ఇప్పుడేదో దేశాన్ని ఆర్ధికంగా నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కాదు. కానీ, ఆ కొద్దిపాటి ప్రయత్నాలు కూడా రాజకీయ సంక్షోభంతో చేయలేరనేది జగమెరిన సత్యం. ఈ చిన్న లాజిక్ ఇమ్రాన్ ఖాన్ ఎలా మిస్ అవుతున్నారో అర్ధం కావట్లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అందుకే ఇమ్రాన్ తీసుకున్న నిర్ణయంలో పక్కా రివేంజ్ పొలిటికల్ స్ట్రాటజీనే తప్ప మరో అంశం లేదంటున్నారు.
పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి అంతా దైవాదీనం అంటారు.. విదేశాంగ మంత్రేమో ప్రజల కష్టాలు పక్కనపెట్టి డాన్సులేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. ప్రధానమంత్రి గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చాం అంటూ భవిష్యత్ గురించి పట్టించుకోరు.. ప్రతిపక్ష నేత అధికార పార్టీపై రివేంజ్ స్ట్రాటజీలు ప్లాన్ చేస్తారు. ఇలా డర్టీ పాలిటిక్స్ ఎలా చేయాలో అన్ని సూత్రాలు వారికి తెలుసు కానీ.. దేశాన్ని కష్టాలసుడిగుండం నుంచి బయటపడేసే ఆలోచన మాత్రం ఎవ్వరూ చేయరు. సింపుల్‌గా సింగిల్ లైన్‌లో చెప్పాలంటే పాకిస్తాన్ పాలకులు దేశాన్ని గట్టెక్కించడం ఏమో కానీ దివాలాకు దగ్గర చేయడంలో మాత్రం పక్కా పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఒక్కమాటలో ఇలాంటి పాలకులు ఉన్నంత కాలం పాకిస్తాన్ పరిస్థితి ఇంతే.
కొత్త బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఎమ్మెల్సీ కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రధానమంత్రి మోడీ ఆడిన అంకెల గారడీ అన్నారు. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు తప్ప కొత్త బడ్జెట్ తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఏం ఒరిగేది లేదని తేల్చారు. సొంత రాష్ట్రం గుజరాత్ లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకూ పన్ను మినహాయింపు ఇచ్చిన మోడీ.. తెలంగాణలోని సెజ్ లను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. భవిష్యత్తుపై నిర్థిష్టమైన ప్రణాళిక లేని బడ్జెట్ ఇది అన్నారు. ఎన్నికలు వస్తున్న సమయంలో కర్ణాటకపై మాత్రం మోడీ దృష్టిపెట్టి.. కోట్ల రూపాయలను కుమ్మరించారన్నారు. స్మార్ట్ సిటీ అని పేరుకు భారీ ప్రాజెక్టు అయినా.. దానికి కేటాయింపులు మాత్రం ఒక్క శాతం కూడా లేవని విమర్శించారు.
తెలంగాణలాంటి రాష్ట్రాలను అసలు పట్టించుకోని మోడీ.. రైతులకు మొండిచేయి చూపించాడని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2047 కల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారనుందని మోడీ పదే పదే చెప్తున్నాడనీ.. కానీ బడ్జెట్ లో మాత్రం లెక్కలు తప్ప కేటాయింపులు దేనికి చేశారో తెలియదని పేర్కొన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని పదే పదే వాదించే మోడీ ప్రభుత్వం.. దేశానికి వెన్నెముకలాంటి వ్యవసాయాన్ని, రైతులను పక్కనపెట్టారన్న విషయం బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. మొత్తానికి ఇది తెలంగాణకు ఏమాత్రం పనికిరాని బడ్జెట్ గా కవిత అభివర్ణించారు.