Home Blog Page 33

గవర్నర్ కు సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్ ముందు హాజరయ్యాడు. ఈ రోజు ఉదయం ఢిల్లీ వెళ్ళి మహిళా కమిషన్ ముందు హాజరైన కౌశిక్ రెడ్డి గవర్నర్ పై చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. జమ్మికుంటలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసైపై కౌశిక్ రెడ్డి తీవ్ర పదజాలంతో మాట్లాడాడు. ప్రభుత్వం రూపొందించిన బిల్లుల గవర్నర్ ఆమోదం విషయంలో కౌశిక్ రెడ్డి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇచ్చుకోవాలంటూ నోటీసులు పంపింది.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పాత వివాదాలను ఎన్నికల దాకా మోసుకుపోవద్దన్న పెద్దల సలహాతోనే కౌశిక్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి క్షమాపణ చెప్పాడని సమాచారం. గవర్నర్ తమిళిసైకి కూడా క్షమాపణలు చెప్తూ లేఖ రాస్తానని మహిళా కమిషన్ ముందు రాతపూర్వకంగా కౌశిక్ రెడ్డి అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ టిక్కెట్ కౌశిక్ రెడ్డికే అన్నది మొన్నటి కేటీఆర్ వ్యాఖ్యలతో తేలిపోయింది. ఇక ఈటెల రాజేందర్ పై పోటీకి సిద్ధమవుతున్న వేళ.. వివాదాలకు దూరంగా ఉంటేనే మంచిదని పార్టీ పెద్దలు కౌశిక్ రెడ్డికి సలహా ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలోనే తెలంగాణ ప్రభుత్వానికీ, గవర్నర్ కు మధ్య అంతరం ఏర్పడి.. అది పెద్ద గాలిదుమారంగా మారి.. సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య భారీ గ్యాప్ రావటానికి కారణమైంది. ఇప్పుడు కౌశిక్ రెడ్డి క్షమాపణతో ఆ వివాదం కాస్త సద్దుమణుగుతుందేమో చూడాలి.

నేను అందుకు సిద్ధమే : పుతిన్ సంచలన ప్రకటన

రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి యేడాది పూర్తి కావస్తోంది. యుద్ధం గెలిచిన వారికీ ఓడిన వారికీ ఇద్దరికీ నష్టమే మిగుల్చుతుందనేది మరోసారి ఈ యుద్ధంతో రుజువైంది. రష్యా దాడిలో ఉక్రెయిన్ దేశ నామరూపాలే మారిపోతే.. రష్యా ఆర్థికంగా చతికిలపడటానికి కూడా ఈ యుద్ధమే కారణం. ఇక యుద్ధంలో పరోక్షంగా పాల్గొన్న యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు కూడా బాగానే నష్టాన్ని చవిచూశాయి. ఉక్రెయిన్ కు ఆర్థికంగానూ, ఆయుధ పరంగానూ సాయం ప్రకటించి.. రష్యాను ఒంటరి చేద్దామనుకున్న ఈ దేశాలు చివరికి గ్యాస్, పెట్రోల్, డీజిల్ లేక పతనాన్ని ముద్దాడాయి. పంతానికి పోయిన పుతిన్ కూడా రష్యా చరిత్రలో ఎప్పుడూ ఎదురు కాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉక్రెయిన్ తో యుద్ధం చేయటానికి రష్యాకు అయిన ఖర్చు.. అక్షరాలా 150 బిలియన్ డాలర్లు. ఈ విషయాన్ని స్వయంగా పుతిన్ వెల్లడించాడు. యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
స్వతహాగా మొండి మనిషి అయిన పుతిన్ ఇప్పటి వరకూ శాంతి ఊసెత్తనే లేదు. వీలైతే ఉక్రెయిన్ పై దాడిని మరింత తీవ్రం చేశాడే తప్ప మేం చర్చలకు సిద్ధమంటూ బహిరంగంగా వ్యాఖ్యానించిందే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మేం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధం అంటూ పుతిన్ బాహాటంగా ప్రకటించారు. ఇలా చేసి శాంతి అనే బంతిని అవతలి వాళ్ళ కోర్టులో వేశాడు పుతిన్. ఇక ఇప్పుడు ఏం చేయాలో తేల్చుకోవాల్సింది ఉక్రెయిన్ మరియు ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న దేశాలే. వారు యుద్ధమే కోరుకుంటే పుతిన్ స్ట్రేటజిక్ అణుబాంబుతో సమాధానం చెప్తాడు ఈసారి. శాంతి కోరుకుంటే మధ్యవర్తితో చర్చలు జరిపి యుద్ధాన్ని ముగించేస్తాడు. ఏదైనా ఉక్రెయిన్ చేతిలోనే ఉందిప్పుడు. చర్చలకు సిద్ధమని చెప్పినా జెలెన్ స్కీ ఆయుధాలే కోరుకుంటే ఈసారి ఉక్రెయిన్ అణుదాడిని ఎదుర్కోక తప్పదు. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇందుకు ప్రపంచంలో ఏదేశమూ సిద్ధంగా లేదు.. అమెరికా యూరప్ సహా. భారత ప్రధాని మోడీలాంటి ప్రభావవంతమైన వ్యక్తి మధ్యవర్తిత్వానికి పూనుకుంటే శాంతి మరింత సులువవుతుంది. ఏది ఏమైనా రాక్షసుడిలాంటి పుతిన్ నోట మేం శాంతి చర్చలకు సిద్ధమన్న బహిరంగ వ్యాఖ్యలు రావటం అనూహ్య పరిణామమే.

థాక్రే Vs షిండే : శివసేనపై ఎన్నికల సంఘం సంచలన తీర్పు

విల్లు-బాణం.. శివసేన పార్టీ సింబల్‌లో కనిపించేవి ఇవే. ఇది జస్ట్ పార్టీ సింబల్ మాత్రమే కాదు.. అంతకుమించిన ఎమోషన్. కోట్లాది మంది మరాఠీల ఓట్లూ, అధికారానికి కావాల్సినన్ని సీట్లూ ఎవరికి దక్కాలనేది ఈ ఒక్క సింబల్‌పైనే డిపెండ్ అయి ఉన్నాయి. అలాంటి విల్లు-బాణం సింబల్‌తో పాటూ మరాఠీల అభిమాన నేత బాల్‌ఠాక్రే స్థాపించిన శివసేన పేరు కూడా షిండే అండ్ టీమ్‌కే అనేసింది ఎన్నికల సంఘం. ఇంకేముంది.. ఇరు వర్గాల మధ్య వార్‌ఆఫ్ వర్డ్స్‌కు ఈ సీనే కేరాఫ్ అడ్రస్ అయింది. ఓ వైపు సవాళ్లూ, విమర్శలూ కంటిన్యూ చేస్తూనే.. శివసేన మాదంటే మాదే అంటూ ఆ రెండు వర్గాలూ సుప్రీం గడపతొక్కాయి. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం శివసేన సింబల్‌‌ను ఏ ప్రాతిపదికన షిండే వర్గానికి కేటాయించింది? బాల్‌ఠాక్రే స్థాపించిన పార్టీ పేరు, సింబల్‌ ఆయన కుమారుడికి కాకుండా షిండే వర్గానికి కేటాయించడం వెనుక సీక్రెట్ ఏంటి? షిండే వర్గానికి సింబల్ కేటాయింపులో వేల కోట్ల రూపాయలే కీలక పాత్ర పోషించాయన్న సంజయ్ రౌత్ ఆరోపణల్లో నిజమెంత?
ఏక్‌నాథ్ షిండే.. ఎనిమిది నెలలక్రితం మహారాష్ట్ర రాజకీయంలో ఈయన ఆడిన ఆట దేశం మొత్తం అటెన్షన్‌ను సాధించింది. రాజకీయాల్లో ఎన్నిరకాల వ్యూహాలుంటాయో అన్నీ తెలిసిన ఉద్దండులకు కూడా షిండే యాక్షన్‌తో మైండ్ బ్లాంక్ అయిపోయింది. అప్పటివరకూ కామ్‌గా పనిచేసుకుపోతున్న మహా వికాస్ అఘాడీ కూటమి షిండే సింగిల్ స్ట్రోక్‌తో చెల్లాదెరైపోయింది. 40 మంది ఎమ్మెల్యేలు, 13మంది ఎంపీలను అక్కడా ఇక్కడా తిప్పి చివరికి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, సీఎంగా ప్రమాణస్వీకారమూ చేసేశారు. ఆ నాటి నుంచి ఏక్‌నాథ్ షిండే పేరు ఒక్క మహారాష్ట్రలోనే కాదు.. బీజేపీయేతర పార్టీల పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మార్మోగడం మొదలైంది. కట్‌చేస్తే.. ఇప్పుడు అదే షిండ్ ఉద్ధవ్ అండ్ టీమ్‌ ఏమాత్రం ఊహించని షాక్ ఇచ్చారు. ఎనిమిది నెలల క్రితం ప్రభుత్వాన్ని కూల్చేసిన షిండే.. ఇప్పుడు శివసేన పేరు, సింబల్‌నూ హస్తగతం చేసుకున్నారు.
మహారాష్ట్ర రాజకీయంలో శివసేనకున్న క్రెడిబిలిటీ సాధారణమైంది కాదు. 1996లో బాల్‭ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. ఆనాటి నుంచి మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. అలాంటి పార్టీ నుంచి అధికారాన్ని తీసుకోవడం ఒక్కటే కాదు.. ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ పేరు, సింబల్‌నే ఏక్‌నాథ్ షిండే హైజాక్ చేసేశారు. గత ఎనిమిది నెలలుగా పార్టీ మాదే.. పేరూ మాదే.. అన్నింటికీమించి విల్లు-బాణం సింబలూ మాదే అంటూ ఇరు వర్గాలూ కొట్లాడుకుంటున్న వేళ.. షిండే అండ్ టీమ్ వాదనకే ఈసీ ఓటేసింది. గత ఎన్నికల్లో శివసేన జెండాతో గెలిచిన వారిలో మెజారిటీ సభ్యులు, ఆ సభ్యులకు పడిన ఓట్లు షిండే వర్గానివే కాబట్టి.. శివసేన పేరు, గుర్తు కూడా తమదే అన్న ఆ వర్గం వాదనతో ఈసీ ఏకీభవిం చింది. ఇంకేముంది ఈ పరిణామాం మహారాజకీయాన్ని అంతకుమించి అన్నట్టుగా మార్చేసింది.ఇక్కడే ఉద్ధవ్ ఠాక్రే వర్గం గేర్ మార్చింది. ఆ వర్గానికి చెందిన ఎంపీ సంజయ్‌ రౌత్ షిండే వర్గాన్ని టార్గెట్ చేశారు. షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సంపాదించేందుకు 2000 కోట్లు లంచంగా ముట్టజెప్పిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ మొత్తం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంతకంటే ఎక్కువే చేతులు మారి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. ఇక్కడితో ఆగలేదు.. ఈ సారి నేరుగా ఉద్ధవ్ ఠాక్రే రంగంలోకి దిగారు. ఈసీ నిర్ణయంపై సుప్రీంలోనే తేల్చుకుంటామన్న ఉద్ధవ్.. ఈసీ అమ్ముడుపోయిందని పెను సంచలనమే సృష్టించారు. ఇదే సమయంలో
ఏక్‌నాథ్‌ షిండేకు దమ్ముంటే తన తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే పేరును వదిలేసి వచ్చే ఎన్నికల్లో ఆయన తండ్రి పేరుతో గెలువాలని సవాల్‌ చేశారు. ఓవైపు ఉద్ధవ్ ఠాక్రే వర్గం విమర్శలూ, సవాళ్లకు పదునుపెడుతుంటే.. మరోవైపు సింబల్ తనదే అనే ధీమాతో షిండే అండ్ రిలాక్స్ అయిపోలేదు. ఈ విషయంలో ఉద్ధవ్ ఠాక్రే సుప్రీం గడపతొక్కుతుందని ముందే అంచనా వేసిన షిండే వర్గం.. ఉద్ధవ్ కంటే ముందే సుప్రీంకోర్టు మెట్లెక్కింది. శివసేన పార్టీ, గుర్తు విషయమై ఏదైనా ఉత్తర్వు జారీ చేసే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాదనలు వినాలని ఆ కేవియట్‭లో షిండే కోరారు. షిండే లెక్క తప్పలేదు. ఆయన అనుకున్నట్టే ఉద్ధవ్ ఠాక్రే పార్టీ పేరు, సింబల్ పంచాయితీని సుప్రీం కోర్టుకు చేర్చారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండానే ఈసీ నిర్ణయం తీసుకుందని, శివసేన మెజారిటీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మరికొద్ది నెలల్లోనే మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. అలాగే, త్వరలో ముంబై మున్సిపాలిటీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన గుర్తుపై మళ్లీ రగడ లేకుండా ఉండేందుకు ఇరు వర్గాలూ గేర్ మార్చేస్తున్నాయి. ఈ అంశాన్ని కాస్త పక్కనపెట్టేస్తే.. శివసేన పేరు, సింబల్‌ షిండే వర్గానికే చెందుతాయని ఈసీ ఎందుకు తేల్చేసిందన్నదే అసలు ప్రశ్నంతా.నిజానికి.. ఇటీవల కాలంలో ఎన్నికల సంఘం మెజారిటీ మంత్రాన్నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో మెజారిటీ మద్దతు షిండే కూటమికే ఉందని, ఆ వర్గానికే గుర్తు పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. ఇప్పుడు శివసేన తరహాలో మరో వివాదం ఎన్నికల సంఘం ముందు ఉంది. అదే బిహార్‌లోని లోక్‌ జనశక్తి పార్టీ చీలిక వ్యవహారం. కేంద్ర మాజీ మంత్రి రామ్‌విలాస్‌ పాసవాన్‌ స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణించిన కొన్ని నెలలకే 2021లో రెండుగా చీలింది. ఓ వర్గానికి పాసవాన్‌ కుమారుడు చిరాగ్‌ పాస్వాన్‌, మరో వర్గానికి అతని సోదరుడు పశుపతి కుమార్‌ పరాస్‌ నేతృత్వం వహిస్తున్నారు. తదనంతర పరిణామాల్లో 2021 అక్టోబర్‌లో ఆ పార్టీ గుర్తన బంగళాపై ఈసీ నిషేధం విధించింది. తుది నిర్ణయం తీసుకొనేవరకు చిహ్నాన్ని రెండు వర్గాలూ వాడకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఐతే శివసేన వివాదంలో ఎన్నికల సంఘం అనుసరించిన వైఖరి చూస్తే.. ఈ గొడవా మెజారిటీ ఆధారంగానే పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. 1969లో కాంగ్రెస్‌ తొలిసారి చీలినప్పటి నుంచీ ఈసీ వైఖరి మెజారిటీనే. ఈ విషయంలో ఎన్నికల సంఘం విధానాన్ని న్యాయస్థానాలూ బలపరుస్తూ వచ్చాయి. రాజ్యాంగంలోని 324వ అధికరణం కింద, 1968లో వెలువడిన చిహ్నాల ఉత్తర్వుల ప్రకారం. పార్టీల గుర్తులపై నిర్ణయం తీసుకొనే అధికారం ఈసీకే ఉంది. 2017లో పార్టీపై పట్టు కోసం సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, అతని కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ మధ్య పంచాయితీ ఈసీ దగ్గరకు చేరింది. అప్పుడు కూడా శాసనసభ్యుల్లో, శ్రేణుల్లో ఆదరణ అఖిలేశ్‌కే ఉందంటూ పార్టీ పేరును, గుర్తును అతనికే కేటాయించింది. అలాగే, 2016లో తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే.. పన్నీర్‌సెల్వం, శశికళ-పళనిస్వామి వర్గాలుగా విడిపోయి పార్టీ గుర్తు రెండాకులపై ఘర్షణ పడ్డారు. తదనంతర పరిణామాల్లో పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి కలిసిపోయారు. దీంతో మెజారిటీ ఆధారంగా ఈ వర్గమే.. ఎన్నికల సంఘం నుంచి గుర్తును దక్కించుకుంది. ఇప్పుడు కూడా అదే జరిగినట్టు తెలుస్తోంది. ఏదేమైనా షిండ్ వర్సెస్ ఉద్ధవ్ మధ్య శివసేన గుర్తు పంచాయితీకి ఎలాంటి ముగింపు దొరుకుతుందో వేచి చూడాలి.

సింగర్ మంగ్లీకి ఊహించని షాక్

0

టాలీవుడ్ ట్రెండింగ్ సింగర్ మంగ్లీకి ఊహించని షాక్ తగిలింది. శివరాత్రి సందర్భంగా ఆమె సొంత చానల్ మంగ్లీ అఫీషియల్ లో రిలీజ్ అయిన శివుడి బమ్ బమ్ భోలే పాట.. పెద్ద వివాదానికి కారణమైంది. శ్రీకాళహస్తి దేవాలయంలో పాటను చిత్రీకరించటంపై భక్తులు భగ్గుమన్నారు. మంగ్లీ తన సొంత ఇమేజ్ ను పెంచుకోటానికి దేవాలయాలను వాడుకోవటం ఏంటంటూ భక్తులు మండి పడుతున్నారు. దేవాలయం బయట షూటింగ్ చేసుకుంటే ఫరవాలేదు కానీ.. దేవాలయం లోపల.. అదీ గర్భగుడి దగ్గర ఆడి పాడటం.. షూటింగ్ చేయటం భక్తుల మనో భావాలను దెబ్బతీయటమే అవుతుందంటూ తెలుగు రాష్ట్రాల్లోని అర్చకులు విమర్శలు గుప్పిస్తున్నారు. 20 సంవత్సరాలుగా షూటింగ్స్ కు పర్మిషన్ ఇవ్వని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మాత్రం మంగ్లీ పాట కోసం పర్మిషన్ ఇవ్వటమేమిటని ప్రశ్నిస్తున్నారు.
శివరాత్రి స్పెషల్ శివుడి పాటలను మంగ్లీ ఆమె సోదరి ఇంద్రావతి కాశీ, వారణాశితో పాటు ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివాలయం శ్రీకాళహస్తిలో షూట్ చేశారు. శ్రీకాళహస్తి దేవాలయంలో భక్తుల దర్శనాలకు బ్రేక్ ఇచ్చి మరీ పాటను షూట్ చేశారట. ఆలయ పరిసరాల్లో షూట్ చేయకుండా ఏకంగా దేవాలయం లోపల అదీ గర్భగుడి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేయటం ఇప్పుడు వివాదాస్ఫదమైంది. అప్పుడెప్పుడే ఎన్టీఆర్ సాంబ సినిమా షూటింగ్ కోసం శ్రీకాళహస్తి దేవాలయంలో అనుమతిచ్చారట. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ దేవాలయంలో ఎలాంటి షూటింగ్స్ జరగలేదు. మంగ్లీ కోసం ప్రత్యేకంగా అనుమతివ్వటంపై ఏపీ ప్రభుత్వాన్ని కూడా శివభక్తులు విమర్శిస్తున్నారు. ఇప్పుడే రాజుకున్న వివాదం ఎటు పోయి ఏమౌతుందో చూడాలి.

బాక్సాఫీస్ బద్దలు కొట్టిన సార్.. కలెక్షన్లు ఎంతో తెలుసా

ధనుష్ సినిమా సార్ ఊహించని వసూళ్ళను సొంతం చేసుకుంది. ఇండియా, ఓవర్సీస్ కలెక్షన్లన్నీ కలిపి మొత్తంగా నాలుగు రోజుల్లో 12 కోట్లకు పైగానే వసూళ్ళు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ధనుష్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ ఈ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమా.. తమిళంలో వాతిగా విడుదలై అక్కడ కూడా మంచి విజయం దక్కించుకుంది. కొత్త హీరోయిన్ సంయుక్త సార్ సినిమాతో బ్రేక్ అందుకున్నట్టే. ఇప్పుడిప్పుడే స్టార్ డమ్ సంపాదించుకుంటున్న సంయుక్త.. సార్ సినిమాతో ఓ మెట్టు ఎక్కినట్టే.
కొద్ది రోజుల క్రితం తమిళ స్టార్ విజయ్ సినిమా వారసుడు భారీ అంచనాలతో వచ్చి తెలుగులో చతికిల పడింది. ఊహించిన కలెక్షన్లు రాకపోవటంతో తెలుగులో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలపాలైనట్టు చెప్పుకున్నారు. దిల్ రాజు వారసుడు సినిమాతో వివాదాల్లో ఇరుక్కున్నాడు. చివరికి వారసుడు ట్రోలింగ్ కు స్టఫ్ ఇచ్చిన సినిమాగా మిగిలిపోగా.. ధనుష్ మాత్రం తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ధనుష్ తో పాటు డైరెక్టర్ వెంకీ అట్లూరికి కరెక్ట్ టైమ్ లో బ్రేక్ ఇచ్చిన సినిమా సార్.

మా పని అయిపోయింది-పాకిస్తాన్ రక్షణ మంత్రి

దివాలా అంచున నిలిచిన పాక్.. త్వరలోనే దివాలా తీయబోతున్న పాకిస్తాన్. నిన్నమొన్నటి వరకూ నిత్యం హెడ్‌లైన్స్‌లో వినిపించినవీ, కనిపించినవీ ఇవే. కానీ, అసలు విషయం అది కాదు. పాక్ ఎప్పుడో దివాలా తీసింది. ఇప్పుడక్కడ ఉన్నవారంతా దివాలా తీసిన దేశంలోనే ఉన్నారు. ఈ ప్రకటన స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటినుంచి వచ్చింది. ఇదే మాట కోట్లాది పాకిస్తానీయుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇదొక్క మాటే కాదు.. పాకిస్తాన్‌లో గత రెండున్నర ఏళ్ల కాలంలో జరిగిన రాజకీయ తప్పిదాలన్నింటిపై ఆసిఫ్ కుండబద్దలు కొట్టేశారు ఆ తప్పులే తమ దేశాన్ని కబళించేస్తున్నాయ ని క్లారిటీ ఇచ్చారు. పాక్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐఎంఎఫ్‌ను అడుక్కోవడం వల్ల లాభం లేదనేశారు. ఇదే సమయంలో పాక్ కష్టాలు తీరే మార్గం ఒకటుందంటూనే తాలిబన్ల అంశాన్ని టచ్ చేశారు. ఇప్పుడు పాక్‌లో చర్చంతా దానిపైనే.
పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇవే. ఆల్రెడీ దివాలా తీసిన దేశంలోనే బతుకు తున్నామన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థను అడుక్కోవడం వల్ల పాక్‌కు ప్రయోజనం లేదన్నారు. పాక్ సమస్యకు ఐఎంఎఫ్‌ దగ్గర పరిష్కారం లేదని, తమ దేశంలోనే ఉందని తెలిపారు. ఖరీదైన ప్రభుత్వ భూమిలో నిర్మించిన రెండు గోల్ఫ్ క్లబ్‌లను విక్రయిస్తే పాకిస్థాన్ మొత్తం రుణంలో నాలుగింట ఒక వంతు చెల్లించవచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇవేం అంత సంచలనం కాదు.. ప్రస్తుతం పాక్‌లో జరుగు తున్న ఉగ్రదాడులపై చేసిన వ్యాఖ్యలే చర్చనీయాంశమయ్యాయి. గత ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులతో పోల్చిన ఆసిఫ్.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఉగ్రదాడులకు వారే కారణమని ఆరోపించారు. ఇప్పుడు పాక్ జరుగుతున్న ఉగ్రదాడులకు కారకులు తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ గ్రూప్‌కు చెందిన తాలిబన్లే. ఇక్కడే ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే చర్చ మొదలైంది.
2021 ఆగస్ట్.. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భం.. ఆ సమయంలో ప్రపంచం మొత్తం తాలిబన్ల యాక్షన్‌ను చూసి వణికిపోయింది. కానీ, పాకిస్తాన్‌లో మాత్రం సంబరాలు జరిగాయి. తమ కనుసన్నల్లో మెలిగిన తాలిబన్లు అమెరికన్లను తరిమి కొట్టారని, అగ్రరాజ్యంపై ఇస్లాం అద్భుత విజయం సాధించిందంటూ నాయకులందరూ ప్రకటనలు గుప్పించారు. ఆ నాటి పాక్‌ ఐఎస్‌ఐ చీఫ్‌ ఫయాజ్‌ హమీద్‌ కాబూల్‌కు వెళ్లి తాలిబన్ల ప్రభుత్వ స్థాపనకు స్వయంగా ఏర్పాట్లు చేసి మరీ వచ్చారు. కట్‌చేస్తే.. ఈ పరిణా మాల తర్వాత అఫ్గాన్‌లో అధికారంలోకొచ్చిన తాలిబన్ల అండతో తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ పాకిస్తాన్‌ రెచ్చిపోవడం ప్రారంభించింది. పాకిస్తాన్‌ సార్వభౌమాధికారాన్నే ప్రశ్నిస్తూ దాడులకు దిగడం మొదలు పెట్టింది. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు వరకు పాక్‌లో దాదాపు 300 దాడులు జరిగాయని పాక్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌ గణాంకాలు చెబున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే దాడుల సంఖ్య రెట్టింపైంది. ఈ దాడుల్లో 95శాతం బెలూచిస్తాన్, ఖైబర్‌ పఖ్‌తుఖ్వాలో కీలక ప్రాంతాలు లక్ష్యంగా జరిగాయి. ఈ ఏడాది జనవరిలో 100 మంది ప్రాణాలను బలితీసుకున్న పెషావర్‌ మసీదు దాడి ఘటన జరిగిన కొద్ది రోజులకే కరాచీలో పోలీసుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు.
నిజానికి.. ఆఫ్ఘాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వెంటనే పరిస్థితులన్నీ తమకు అనుకూలంగా మారిపోతాయని అప్పటి ఇమ్రాన్ సర్కార్ అనుకుంది. రెండు దశాబ్దాల పాటు ఆఫ్ఘాన్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు సాయం అందించి అంతర్జాతీయంగా మంచి పేరు సంపాదించుకున్న భారత్‌ ఓ పక్కకి వెళ్లిపోతుందని సంబరపడింది. ఐతే సరిహద్దు రూపంలో తాలిబన్లతో సమస్య మొదలైంది. డ్యూరాండ్‌ రేఖపై ఇరు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. టీటీపీ తుపాకీలు వదిలి జన జీవన స్రవంతిలోకి రావాలని పాక్‌ సర్కార్‌ చేసిన ప్రయత్నాలు కొనసాగలేదు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనుల్ని పాక్‌ చేతుల నుంచి విడిపించడమే తమ లక్ష్యమన్నట్టుగా టీటీపీ మారిపోయింది. ఆఫ్ఘాన్‌ సరిహద్దుల నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. కొన్నాళ్లు కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ పాకిస్తాన్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసీమ్‌ మునీర్‌ బాధ్యతలు స్వీకరించగానే కాల్పుల విరమణను రద్దు చేసింది. అప్పట్నుంచే పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడులు, ప్రభుత్వ అధికారుల కిడ్నాప్‌లు పతాకస్థాయికి చేరిపోయాయి.
మరోవైపు.. ఇన్నాళ్లూ ఆఫ్ఘాన్‌లో మంచి తాలిబన్లు, పాక్‌లో ఉన్న టీటీపీ చెడ్డ తాలిబన్లు అని భావించిన పాకిస్తాన్‌కు.. ఆ ఇద్దరూ చేతులు కలపడంతో అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి అని కాస్త లేటుగా జ్ఞానోదయం అయింది. ఈ పరిణామాలన్నీ దేశంలో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చుననే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలే దీనికి ఉదాహరణ. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. పాకిస్తాన్‌ మిలటరీ విధానాలను తీవ్రంగా వ్యతిరేంచిన టీటీపీ దేశాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. 2021లో అఫ్గాన్‌ నుంచి అమెరికా, నాటో దళాలు వెళ్లిపోయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే పాక్‌పై దృష్టి సారించింది.
ఇస్లాం విస్తరణ తాలిబన్ల ప్రధాన ధ్యేయంగా మారింది. కానీ, మనం మనం బరంపురం అన్నట్టుగా ఆనాటి ఇమ్రాన్ సర్కార్‌కూ, ప్రస్తుత షరీఫ్ ప్రభుత్వానికీ విషయం అర్ధం కాలేదు. ఇప్పుడు తెలుసుకున్నా ఏం చేయలేని పరిస్థితి.
“పాకిస్తాన్‌లో ఉగ్ర దాడులకు ఐసిస్‌ అవసరం లేదు. పాకిస్తానీ తాలిబన్లు చాలు. అఫ్గానిస్తాన్‌ తరహాలో ఏదో ఒకరోజు తాలిబన్లు పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఈ మాట చెప్పింది బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్. త్వరలో ఇదే నిజం కాబోతోందన్నదే అంతర్జాతీయ విశ్లే షకుల మాట కూడా. ఒక్కమాటలో పాముకు పాలుపోసి పెంచితే ఏం జరుగుతుందో.. తాలిబన్లకు నీడనిచ్చి న పాకిస్తాన్‌ను చూసి అర్ధం చేసుకోవచ్చు. ఇంకోమాటలో పాలకుల తప్పిదాలకు దేశ ప్రజల భవిష్యత్ ఎలా మారిపోతుంది.. ఇమ్రాన్, షరీఫ్ ప్రభుత్వాలను చూసి అర్ధం చేసుకోవచ్చు.

జిన్ పింగ్ కు ఎదురు తిరిగిన వారంతా “మిస్సింగ్”

జీరో కోవిడ్ పాలసీ.. ఈ విధానమే చైనాను అన్ని రంగాల్లో వెనక్కి నెట్టేసింది. ప్రపంచమంతా కరోనా తగ్గుముఖం పట్టినా చైనాలో మాత్రం కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మరణ మృదంగం మోగించిన వేళ.. తప్పనిసరి పరిస్థితుల్లో చైనా ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠిన లాక్ డౌన్ అమలు చేయాల్సి వచ్చింది. కనీసం ఒక్క పూట కడుపు నిండా తిండికి కూడా చైనా జనం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఓ దశలో చైనా యువత లాక్ డౌన్ నిబంధనలు పక్కనపెట్టి ఏకంగా మూకుమ్మడిగా రోడ్ల మీదకు వచ్చి జిన్ పింగ్ కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ సమయంలో చైనా యువత తెగువ చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. ఏ గుండె ధైర్యంతో ఇంతమంది జిన్‌పింగ్‌ను దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారనేదానిపై చర్చలు, డిబేట్లకైతే కొదవే లేదు. ఇందుకు కారణం చైనా పాలకులకు ఎదురుతిరిగితే ఏం జరుగుతుందో కోట్లాదిమంది చైనీయులతో పాటూ కమ్యునిస్టు సర్కార్ చరిత్ర చూసిన అందరికీ తెలుసు. జిన్‌పింగ్‌ను మాత్రమే కాదు అంతకుముందు నియంతలకే నియంతగా పేరున్న మావో జెడాంగ్‌‌ను వ్యతిరేకించినా పరిణామాలు తీవ్రంగా ఉండేవి. అప్పుడెప్పుడో తియానన్మెన్‌ స్క్వేర్‌లో ఆందోళన చేసిన విద్యార్థులను యుద్ధ ట్యాంకులతో తొక్కించడాన్ని కళ్లారా చూసిన ప్రపంచం.. జీరో కోవిడ్‌పై చైనా యువత ఆందోళనలను అంతే ఉత్కంఠగా ఫాలో అయింది. ఐతే, ఆ సమయంలో బీజింగ్ ఆందోళనలకారులపై అంతగా రియాక్ట్ కాలేదు. వీలైతే అరెస్టులు చేసిందే తప్ప గతి తప్పిన గత చరిత్రను పునరావృతం చేసే ధైర్యం చేయలేదు. ఎందుకంటే ఇలాంటి ఆందోళనలపై జిన్‌పింగ్ యంత్రాంగానికి వాట్ నెక్స్ట్‌ అనే దానిపై కావాల్సినంత క్లారిటీ ఉంది. ఇప్పుడా సమయం రానేవచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం చైనాలో పెరుగుతున్న మిస్సింగ్ మిస్టరీలే.
సాధారణంగా దేశంలో మిస్సింగ్ కేసులు పెరిగితే ఏ సర్కార్‌పై అయినా ఒత్తిడి పెరుగుతుంది. ఆ మిస్సింగ్ కేసులు అరికట్టడానికి ఆదేశాలిస్తుంది. కానీ, ప్రభుత్వమే వారందరినీ ఎత్తుకుపోతే? ఇప్పుడు డ్రాగన్ కంట్రీ చైనాలో జరుగుతోంది ఇదే. జీరో కోవిడ్‌కు వ్యతిరేకంగా ఆనాడు చేపట్టిన ఆందోళనల్లో కొన్ని వేల మంది పాల్గొన్నారు. చైనా మొత్తంలో ఆ సంఖ్య లక్షల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. వారిలో విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు ఇలా ఒక్కటేంటి అన్ని వర్గాలకు సంబంధించినవారూ ఉన్నారు. అయితే, ఇప్పుడు వారిలో కొందరు వ్యక్తులు కనిపించడం లేదు. కొందరంటే నలుగురో లేదంటే పదిమందో కాదు.. చైనాలో ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన వారి సంఖ్య వందమందికిపైగామాటే. ఈ లెక్క ఇక్కడితో ఆగిపోతుందనుకోడానికీ లేదు. ఎందుకంటే అప్పుడు రోడ్డెక్కిన సంఖ్యనుబట్టే ఈ మిస్సింగ్ కేసుల లెక్క కూడా ఉంటుందని అంతర్జాతీయ మీడియా కథనాలు చూస్తే అర్ధమవుతోంది. బీజింగ్ కూడా ఈ కేసులపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడం చూస్తుంటే.. ఈ కిడ్నాప్స్ అన్నింటినీ ఎవరు చేస్తున్నారో ఓ అంచనాకు వచ్చేయొచ్చు. కనిపించకుండా పోతున్నవారిలో మరీ ముఖ్యంగా వైట్ పేపర్ నిరసనకారులే ఉన్నారు.
మరోవైపు.. చైనాలో కనిపించకుండా పోయినవారంతా జీరో కోవిడ్‌ విధానాన్ని వ్యతిరేకించినవారే కాదు. వీరిలో చాలా మంది మహిళలు ఉన్నారు. అమెరికా, బ్రిటన్‌లో చదువుకుని వచ్చిన రచయితలు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, సంగీతకారులు ఉన్నట్టు బీబీసీ తెలిపింది. కనిపించకుండా పోయిన ఆందోళన కారుల వివరాలు.. వారు గతంలో ఎలాంటి ఆందోళనల్లో పాల్గొన్నారనే సమాచారం సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి, మహిళల హక్కుల కోసం గొంతు విప్పుతున్న వ్యక్తులపై జిన్‌పింగ్ ప్రభుత్వం కన్నేసి ఉంచింది. వీరితో ఆందోళనలకు దిగేలా ప్రేరేపించిన వ్యక్తులు లేదా సంస్థలకు వివరాలను సేకరిస్తున్నట్లుగా ఎప్పట్నుంచో ఆరోపణలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో చైనాలో ఏ విధంగానైనా నిరసన వాతావరణం రాకూడదని జిన్‌పింగ్ సర్కార్ కోరుకుంటోంది. దీనికి డ్రాగన్ ఎంచుకున్న మార్గమే అణచివేత.
సాధారణ పౌరులనే కాదు అవసరమైతే.. బడా వ్యాపారవేత్తలను సైతం విడిచిపెట్టకూడదని జిన్‌పింగ్ సర్కార్ ప్లాన్ చేసింది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌.. గతంలో దేశం దాటేసిన జాక్ మా ఒకరైతే.. తాజాగా కనిపించకుండా పోయిన బావో ఫాన్ మరొకరు.
కమ్యూనిస్ట్ పార్టీ పాలనలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొంత కాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్ మా ఉన్నట్టుండి గల్లంతు అయ్యారు. ఇలా జరగడానికి కొద్ది రోజుల ముందే ఆయన జిన్‭పింగ్ ప్రభుత్వ బ్యాంకింగ్ విధానాలపై విమర్శలు చేశారు. జాక్ మా ఏమయ్యారో, అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. తాజాగా ఆయన చైనా విడిచి వెళ్లారని, జపాన్‭లో నివసిస్తున్నట్లు తెలిసింది. కట్‌చేస్తే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ చైనా రినయ్‌సెన్స్ చైర్మన్, సీఈఓ బావో ఫాన్ ఉన్నట్టుండి గల్లంతు అయ్యారు. బావో ఫాన్‌ కనిపించడం లేదని, ఆయన ఆచూకీ తెలియడం లేదని, ఆయనను సంప్రదించడం కూడా సాధ్యం కావడం లేదని ‘ఈ బ్యాంక్’ ఓ ప్రకటనలో తెలిపింది. బావో ఫాన్ అందుబాటులో లేకపోవడానికి, తమ కంపెనీ వ్యాపార కార్యకలాపాలకు సంబంధం ఉందో, లేదో తెలియదని ఈ ప్రకటన పేర్కొంది.
బావో ఫాన్ మిస్సింగ్ వార్త ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావడంతో ఆయన కనిపించకుండా పోయిన మరుసటిరోజే ఈ కంపెనీ షేర్లు 50 శాతం పతనమయ్యాయి. బావో ఫ్యాన్ 1990వ దశకంలో ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూసీలలో ఆయన కెరీర్ సాగింది. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్‌లలో అడ్వైజర్‌గా పని చేశారు. ఇద్దరితో కలిసి చైనా రినయ్‌సెన్స్‌ను 2005లో ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మెయిటువన్, డియన్‌పింగ్ 2015లో విలీనమవడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరే కాదు.. గతంలో 2017లో కూడా చైనీస్ కెనడియన్ బిజినెస్‌మెన్ జిన్హువాను మెయిన్‌లాండ్ అధికారులు అరెస్ట్ చేశారు. తర్వాత ఆగస్టులో అతడిపై అవినీతి ఆరోపణలు రాగా 13 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
మరోవైపు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చర్యలను అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. అదుపులోకి తీసుకున్న వారిని బేషరతుగా విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. అక్రమ మార్గాల్లో నిర్బంధించిన వ్యక్తుల జాబితాను కూడా ఒక ప్రైవేట్ సంస్థ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇలాంటి సంస్థలు ఎన్ని జాబితాలు సిద్ధం చేసినా.. జిన్‌పింగ్ సర్కార్ ఎత్తుకెళ్లిన వారి లొకేషన్‌ గుర్తించడం ఎవరి తరం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో జీరో కోవిడ్ విధానానికి వ్యతిరేకంగా గళం వినిపించిన వారంతా బిక్కుబిక్కుమంటున్నారు. ప్రధానంగా వైట్ పేపర్లతో నిరసన తెలిపిన వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. నేరుగా జిన్‌పింగ్ ప్రభుత్వాన్ని విమర్శించే ధైర్యం చేయలేకే అప్పట్లో తెల్లకాగితంతో ఆందోళనలు చేశారు. గతంలో కూడా ఈ తరహా ఆందోళనలు బీజింగ్‌కు ఆగ్రహం తెప్పించాయి. అందుకే మరోసారి తెల్లకాగితంతో రోడ్డెక్కకుండా జిన్ పింగ్ సర్కార్ యాక్షన్ షురూ చేసినట్టు తెలుస్తోంది. ఏదేమైనా చైనాలో పెరుగుతున్న మిస్సింగ్ కేసులతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి.

అదానీ, అంబానీ, టాటా, బిర్లా కంటే నేనే గ్రేట్-బాబా రాందేవ్

ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ అప్పుడప్పుడు కాంట్రవర్శీ స్టేట్మెంట్లు ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. మొన్నామధ్య ముస్లింలు, క్రైస్తవులు అంటూ వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి తర్వాత నేను అలా అనలేదు అంటూ సారీ చెప్పిన రాందేవ్ బాబా.. ఇప్పుడు మరో విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చి వార్తల్లోకెక్కాడు. భారతదేశంలోని వ్యాపార దిగ్గజాలైన ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా, బిర్లా వంటి వాళ్ళతో తనను తాను పోల్చుకున్న రాందేవ్ బాబా.. వాళ్ళందరికంటే తన సమయమే గొప్పదంటూ చెప్పుకొచ్చారు. స్వప్రయోజనం, వ్యాపారం కోసమే తమ జీవితంలో 99 శాతం సమయాన్ని కేటాయించే ఈ వ్యాపార దిగ్గజాల వల్ల సామాన్యుడికి పెద్దగా ఉపయోగం లేదన్న ఆయన.. సమాజం కోసం సమయాన్ని గడిపే తన టైమే గొప్పదంటూ చెప్పుకొచ్చాడు.
గోవాలో పతంజలి సంస్థ సీఈఓ అయిన ఆచార్య బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం జరిగింది. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తున్న సమయంలో బాబా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. వేదికపై ఉన్న వాళ్ళు ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. పతంజలి సంస్థ మూతపడే స్థాయి నుంచి ఇంత పెద్ద స్థాయికి ఎదగటానికి ఆచార్య బాలకృష్ణ పనితీరు, జవాబుదారీ తనమే కారణమని బాబా రాందేవ్ బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తాడు. విచిత్రం ఏమిటంటే.. బాలకృష్ణ కూడా తన జీవితంలోని అత్యధిక సమయాన్ని పతంజలి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించటం కోసమే కేటాయిస్తాడు మరి.

గుడ్ న్యూస్ : 1400 గవర్నమెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ స్థాయుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1400 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. సోమవారం హైదరాబాద్ లోని పాతబస్తీ పేట్ల బురుజు హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ కాలేజీలన్నింటిలో ఉన్న ఖాళీలను ఏకకాలంలో భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ప్రజారోగ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ నిధులు కేటాయించిందని ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలతో పాటు బస్తీ దవాఖానాల ఏర్పాటుతో తెలంగాణ ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని ఆయన చెప్పారు.

2 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు

విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఫోన్ కాల్ పోలీసులను పరుగులు పెట్టించింది. ఇంటలిజెన్స్ అధికారులకు చెమటలు పట్టించింది. తీరా చూస్తే అక్కడేమీ లేదు. సోమవారం ఢిల్లీ నుంచి ఒడిషాలోని దేవ్ గఢ్ కు వెళ్ళాల్సిన విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఎయిర్ పోర్టు అధికారులకు పోలీసులు సమాచారం అందించగా అప్పటికే విమానం టేకాఫ్ అయింది. దీంతో అటు పోలీసులు, ఇటు ఎయిర్ పోర్టు అధికారులతో పాటు ఇంటలిజెన్స్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని భయపడిపోయారు. విమానాన్ని దారి మళ్ళించి లక్నో విమానాశ్రయంలో ఎమర్జెన్సీ లాండింగ్ చేశారు. విమానాన్ని పూర్తిగా తనిఖీ చేయగా అందులో బాంబు లేదని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ ఫోన్ కాల్ చేసిన వారిని గుర్తించేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే హైదరాబాద్ లోని శంషాబాద్ నుంచి చెన్నై వెళ్ళే విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం ఇవ్వగా వెంటనే విమానంలో తనిఖీలు చేసారు. కానీ బాంబు లేదని తేలటంతో ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గంటల వ్యవధిలోనే ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్ళాల్సిన ఓ వ్యక్తి విమానాశ్రయానికి ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో అధికారులు అతడిని లోనికి అనుమతించలేదు. దీంతో విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. తాను సమయానికి ఎయిర్ పోర్ట్ చేరుకోలేకపోయాననీ.. బాంబు ఉందని చెప్తే విమానం ఆలస్యంగా బయల్దేరుతుందని భావించి అలా చేశాననీ ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.