Home Blog Page 32

మీ ఏరియాలో కుక్కలున్నాయా.. ఈ గైడ్ లైన్స్ మీకోసమే

0

అంబర్ పేటలో వీది కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలు భగ్గుమన్నారు. వీధి కుక్కలను చంపేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. ఇంత పెద్ద వివాదం చెలరేగినా ప్రభుత్వం స్పందించటం లేదంటూ విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీధి కుక్కల నియంత్రణ విషయంలో క్లారిటీ ఇచ్చారు. వీధి కుక్కల విషయంలో గైడ్ లైన్స్ విడుదల చేశారు.
కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వేగవంతం చేయటం.
కుక్కలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కుక్క కాటు ప్రమాదాల నియంత్రణ.
GHMC పరిధిలో హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు 040 21111111
మాసం దుకాణాలు, హోటల్స్ నిర్వాహకులు రోడ్లపై వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవటం.
కుక్కల స్థితిపై GHMC , స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించాలి.
GHMC పరిధిలో ఉన్న అన్ని రకాల శానిటేషన్ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి.
పాఠశాలల్లో విద్యార్థులకు వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలనే అంశాలను వివరించాలి.
కాలనీ సంఘాలు, బస్తీలలో వచ్చే నెల రోజులు కుక్క కాటుపై అవగాహన కల్పించాలి.
కాలనీలే కాకుండా, మూసీ నది పరిసర ప్రాంతాల్లో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కుక్కలకు స్టెరిలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయటం.
వీధి కుక్కల దత్తత తీసుకోవటంపై ప్రజలకు అవగాహన పెంచడం.
కుక్క కాటుకు గురైన వారి పూర్తి వివరాలు సేకరించి సరైన సమయంలో వైద్యం, ఇతర సహకారాలు అందించడం.
వీధి కుక్కల పట్ల ఎలా వ్యవహారించాలన్న దానిపై హోర్డింగ్స్, పోస్టర్స్, బిల్ బోర్డ్స్‌తో ప్రచారం.
వీధి కుక్కల కోసం ప్రజలకు దూరంగా నీటి పాత్రలు ఏర్పాటు చేయటం.
కుక్కలు మనుషుల మీద దాడులు చేస్తుంటే కుక్కలను నియంత్రించాల్సింది పోయి.. మనుషులు కుక్కల విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పటం గమనార్హం.

మోహన్ లాల్ కు షాకిచ్చిన కేరళ హైకోర్టు

0

మోహన్ లాల్ ను ఏనుగు దంతాల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో మోహన్ లాల్ కు కేరళ హైకోర్టు మొట్టికాయలు వేసింది. అసలేం జరిగిందంటే.. ఇదివరకు మోహన్ లాల్ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు చేశారు. అప్పుడు మోహన్ లాల్ ఇంట్లో రెండు ఏనుగు దంతాలను అధికారులు స్వాధీనం చేసుకొని మోహన్ లాల్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయంలో మోహన్ లాల్ కోర్టుకు హాజరై సమాధానం చెప్పుకున్నారు. తాను చనిపోయిన ఏనుగు దంతాలను మాత్రమే తన ఇంట్లో ఉంచుకున్నాననీ.. ఇందుకు ప్రభుత్వం అనుమతి కూడా తీసుకున్నానని మోహన్ లాల్ చెప్పాడు. అయితే.. దీనికి కోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. మోహన్ లాల్ ఇంట్లో ఉన్నవి చనిపోయిన ఏనుగు దంతాలేననీ.. ఆయన అనుమతి తీసుకున్నాడనీ ప్రభుత్వ ప్రతినిథులు సమాధానం ఇచ్చారు.
ఈ కేసు మళ్ళీ విచారణకు రాగా.. మోహన్ లాల్ కు మరోసారి కోర్టు షాకిచ్చింది. మోహన్ లాల్ తో పాటు ప్రభుత్వానికి కూడా కేరళ హైకోర్టు మొట్టికాయలు వేసింది. మోహన్ లాల్ విషయంలో ప్రభుత్వం కావాలని మద్దతు ఇస్తోందంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ఇదే ఒక సామాన్యుడి ఇంట్లో ఏనుగు దంతాలు అంలంకారంగా పెట్టుకుంటే ప్రభుత్వం ఇలాగే మద్దతిస్తూ మాట్లాడుతుందా అంటూ ప్రశ్నించింది. ప్రభుత్వం దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలనీ.. అలాగే మోహన్ లాల్ కూడా మరోసారి దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కాంగ్రెస్ పై మోడీ కొత్త వెపన్.. జైశంకర్

0

జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా ప్రపంచానికి పరిచయమే అక్కర్లేని వ్యక్తి. రష్యా నుంచి ఆయిల్‌ దిగుమతులు చేసుకుంటున్నా, అంతర్జాతీయ వేదికలపై శత్రు దేశాలకు చెక్ పెడుతున్నా.. వాటి వెనుకుంది ఈయనే. ఐతే, ఎప్పుడూ దేశం బయట రాజకీయ వ్యూహాలు పన్నడంలో బిజీగా ఉండే జైశంకర్.. తాజాగా దేశ రాజకీయాల్లోనూ తన మార్క్ యాక్షన్ షురూ చేస్తున్నారు. గతంలో చైనాతో ఉద్రిక్తతలు, తాజాగా జార్జ్‌ సోరోస్ విమర్శలు లాంటి అంశాలను అస్త్రంగా చేసుకుంటున్న ప్రత్యర్ధులపై పవర్ పంచ్‌లు పేల్చుతున్నారు. ఈ క్రమంలోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీపై జైశంకర్ చేసిన సంచలన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టి స్తున్నాయి.
విదేశాంగ మంత్రి జైశంకర్‌ గతంలో ఎన్నడూ చూడనంతగా దేశ రాజకీయాల్లో కనిపిస్తున్నారు. వీలుచిక్కిన ప్రతిసారీ ప్రత్యర్ధులను కార్నర్ చేసేలా పంచ్‌లు పేల్చుతున్నారు తాజాగా గ్రాండ్ ఓల్డ్ పార్టీని ఇరుకునపెట్టేలా “మీ వైఖరి తీసేసేది ఐతే.. మోడీ సర్కార్‌ విధానం చేర్చుకునేది అంటూ సంచలన కామెంట్లు చేశారు.ఇవీ కాంగ్రెస్‌పై విదేశాంగ మంత్రి చేసిన విమర్శలు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి కె.సుబ్రహ్మణ్యంను కేంద్ర కార్యదర్శిగా తొలగించారని జైశంకర్ అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో తన తండ్రిని క్యాబినెట్ సెక్రటరీ పదవికి తన కంటే జూనియర్ ఎవరో నియమించారని విదేశాంగ మంత్రి తెలిపారు. కె.సుబ్రహ్మణ్యం 1980లో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారు. 1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తొలగించిన మొదటి కార్యదర్శి ఆయనే అని జైశంకర్ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఇదే సమయంలో ప్రధాని మోడీ తనను కేబినెట్‌తో ఆహ్వానించడాన్ని కూడా గుర్తు చేశారు. మోడీ లాంటి పర్ఫెక్ట్ లీడర్‌ను తానిప్పటివరకూ చూడలేదన్నారు. జైశంకర్ తాన వ్యాఖ్యలతో చెప్పాలనుకుంది ఒక్కటే. నిజాయితీపరులను, టాలెంట్ ఉన్నవారిని కాంగ్రెస్ దూరం చేస్తే.. మోడీ మాత్రం ప్రతిభను వెదికిమరీ అవకాశాలిచ్చరని చెప్పడమే. అయితే, ఇవే విమర్శలు కాంగ్రెస్ పార్టీకి మంటతెప్పించాయి. ఫలితంగా ఆ పార్టీ అధికార ప్రతినిధి సుప్రియ మీడియా ముందుకొచ్చారు. వస్తూ వస్తూనే ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి జైశంకర్‌పై విరుచుకుపడ్డారు. జైశంకర్‌ను అయితే ఫెయిల్యూర్ మంత్రిగా అభివర్ణించారు.కాంగ్రెస్ మాత్రమే కాదు బీజేపీ సర్కార్‌ను పదే పదే విమర్శిస్తున్న టీఎంసీ సైతం జైశంకర్‌పై విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ ఎంపీ జవహర్ సిర్కార్‌ ప్రధాని మోడీని అసురతో పోల్చారు. జైశంకర్‌ తండ్రి కే సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోడీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. జైశంకర్‌ తండ్రి కే.సుబ్రమణ్యం గుజరాత్‌ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోడీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్‌ మండిపడ్డారు. నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి.. గాంధీలపై ఉన్న అక్కసును మరోసారి జైశంకర్‌ బయటపెట్టుకున్నారని జవహర్ సిర్కార్ మండిపడ్డారు. ఈ పొలిటికల్ విమర్శలను పక్కనపెడితే.. విపక్షాలపై ఎదురుదాడికి జైశంకర్‌ను రంగంలోకి దించడానికి రీజన్ లేకపోలేదు. ఇటీవలికాలంలో దేశ రాజకీయాలు మొత్తం అదానీ, హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్, చైనా, పాకిస్తాన్ సరిహద్దు వివాదాలతోపాటూ గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ చుట్టే తిరుగుతున్నాయి. గతేడాది తవాంగ్‌ ఉద్రిక్తతల తర్వాత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా, పాకిస్తాన్‌తో ఒకేసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితులున్నాయనీ.. చైనా మన భూభాగాన్నీ కబ్జా చేస్తుంటే మోడీ సర్కార్ చూస్తూ కూర్చుందని ఆరోపించారు. ఆ తర్వాత అదానీ వ్యవహారంపైనా జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాల్సిందే అని డిమాండ్ చేశారు. తాజాగా బీబీసీ డాక్యుమెంటరీపైనా మోడీ నోరువిప్పాలని పట్టుబడుతున్నారు. ఓరకంగా వీటన్నింటికీ ఇతర మంత్రులకంటే విదేశాంగ మంత్రి సమాధానం చెబితేనే లెక్క సరిపోతుందని మోడీ సర్కార్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే జైశంకర్‌ను రెచ్చిపొమ్మంటున్నారనే చర్చఈ క్రమంలోనే సందర్భం ఎలాంటిదైనా.. చైనాతో విబేధాల దగ్గర నుంచి ప్రధాని మోడీపై నోరు పారేసుకున్న జార్జ్‌ సోరోస్ వరకూ ప్రతి అంశాన్నీ విదేశాంగ మంత్రి టచ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. రాజకీయాలంటే దేశంలోని పార్టీల మధ్యే కాదనీ, ఫారిన్‌ నుంచి కూడా జరుగుతాయని వ్యాఖ్యానించడం వెనుక రీజన్ కూడా అదే అంటున్నారు విశ్లేషకులు. తద్వారా భారత్‌పై విదేశీ శక్తుల కుట్రలను ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. ఏదేమైనా కంట్రీ పాలిటిక్స్‌లో జైశంకర్ మార్క్‌ యాక్షన్‌తో సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయినట్టే కనిపిస్తోంది.

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న భూకంపాల భయం

0

దేవభూమిలో జరుగుతున్న పరిణామాలు 140 కోట్లకుపైగా భారతీయులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మొన్నటికిమొన్న బీటలు వారిన జోషీమఠ్‌ అంశం దేశాన్ని కలవరపెడితే.. ఇప్పుడా బీటలు జోషీమఠ్ సరిహద్దులు దాటేశాయి. ఒక్కటీరెండూకాదు ఏకంగా ఎనభై కిలోమీటర్లకు పైగా రహదారులు నెర్రలిచ్చేశాయి. ఇదెక్కడ ఆగుతుందో అంచనాకు కూడా అందడంలేదు. ఇదే సమయంలో ఉత్తరభారతం స్వల్ప భూకంపాలతో చిగురుటాకులా వణికిపోయింది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, హర్యానాలతోపాటూ పొరుగుదేశం నేపాల్‌లోనూ భూమి కంపించింది. అదికూడా కేవలం గంటల వ్యవధిలోనే. ఇలాంటి సమయంలోనే టర్కీ, సిరియా లాంటి భయంకర భూకంపం భారత్‌కూ తప్పదనే సైంటిస్టుల హెచ్చరికలు ఇంకాస్త టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఫలితంగా భారత్‌లోనే చారిత్రాత్మక యాత్ర చార్‌ధామ్‌పై అందరి అటెన్షన్ కనిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక యాత్ర ప్రారంభం కాబోతోంది. ఇలాంటి సమయంలో చార్‌ ధామ్ యాత్ర సేఫేనా అన్న ఆందోళనే అందరిదీ.
ఆదిశంకరాచార్యులు నెలకొల్పిన మఠాల్లో ఒకదానికి నెలవైన జోషీమఠ్‌లో ఇటీవల నేల కుంగిపోయింది. వందల సంఖ్యలో భవనాలకు నెర్రెలిచ్చాయి. అక్కడ ఏ క్షణమైనా భూకంపం సంభవించ వచ్చనే శాస్త్రవేత్తల హెచ్చరికలు ఇప్పటికే గగ్గోలు పుట్టిస్తున్నాయి. జోషీమఠ్‌కు 82 కిలోమీటర్ల దూరంలోని కర్ణప్రయాగ్‌లోనూ తాజాగా భూమి కుంగి భవనాలు బీటలు వారాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్‌కు వెళ్ళే రహదారి కొన్నిచోట్ల పగుళ్లు తేలితే- అధికార యంత్రాంగం కొద్దిరోజుల క్రితం వట్టిగా సిమెంట్‌తో వాటిని పూడ్చేసింది. అవి తిరిగి నోళ్లు తెరుస్తుండటమే కాదు- అదే దోవలో జోషీమఠ్‌ నుంచి మార్‌వాడీల మధ్య కొత్తగా కనీసం పది చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు కారణాలేమిటో, వాటి పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయో ఎవరికీ అంతుచిక్కడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే స్వల్ప భూకంపాలతో ఉత్తరభారతం వణికిపోయింది.
ఢిల్లీ, ఎన్‌సీఆర్‌, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేపాల్‌లోని జుమ్లాకు 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. 10 కిలోమీటర్ల లోతున భూమి కంపించింది. గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరచూ భూకంపాలు వస్తున్నాయి. అంతకుముందు జనవరి 24న నేపాల్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. గత ఏడాది నవంబర్‌లో నేపాల్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు చెన్నైలో బుధవారం ఉదయం తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని, అన్నాసాలై మరియు వైట్స్ రోడ్‌లోని అనేక భవనాల నివాసితులలో భయాందోళనలు చోటుచేసుకున్నాయని నివేదికలు వెలువడ్డాయి. అయితే, ఈ స్వల్ప భూకంపాలకు ముందే హైదరాబాద్‌లోని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు పలు హెచ్చరికలు చేశారు.
ఇవీ సైంటిస్ట్ పూర్ణచంద్రరావు చేసిన హెచ్చరికలు. ఇటీవల టర్కీ, సిరియాలను కుదిపేసిన మాదిరిగానే ఉత్తరాఖండ్‌‌ ప్రాంతంలో‌నూ ఎప్పుడైనా శక్తివంతమైన భూకంపం సంభవించవచ్చని, ఇందుకు సమయం దగ్గర పడిందని హెచ్చరించారు. ఉత్తరాఖండ్ ప్రాంతంలోని భూమి ఉపరితలం కింద చాలా ఒత్తిడి ఏర్పడుతోందని, దీని కారణంగా పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉందన్నారు. నిజానికి,బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ముఖద్వారంగా భావించే జోషిమఠ్‌లో ఇటీవల భూమి క్షీణించిన నేపథ్యంలో సీనియర్ శాస్త్రవేత్త హెచ్చరికలకు ప్రాధాన్యత ఏర్పడింది. లక్షలాది మంది యాత్రికులను ఉత్తరాఖండ్ పర్వతాలకు చేర్చే చార్‌ధామ్ యాత్ర దాదాపు రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే జోషీమఠ్ పరిస్థితులపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాఖండ్‌పై దృష్టిసారించిన శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతాల్లో దాదాపు 80 భూకంప కేంద్రాలను ఏర్పాటు చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే హిమాలయాల భూమిలో ఒత్తిడి పెద్ద మొత్తంలో పేరుకుపోతున్నట్లు తమ డేటా చూపిస్తుందనీ, కచ్చితమైన సమయం చెప్పలేకపోయినా.. టర్కీలాంటి భూకంపం ముప్పు హిమాలయాలకు పొంచి ఉందని తేల్చేశారు. ఈ ప్రకటన చేసిన తర్వాతిరోజే హిమాలయాలకు నెలవైన ఉత్తరాఖండ్, నేపాల్‌లో భూమి కంపించింది.
మరోవైపు.. ఏప్రిల్‌ నెల నుంచి చార్‌ధామ్‌ యాత్ర నిర్వహణకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాస్త్రవేత్తలను ఇప్పుడదే తీవ్రంగా విస్మయపరుస్తోంది. బద్రీనాథ్‌ మార్గంలో గతేడాది 16 లక్షల మంది ప్రయాణించారు. భక్తులూ పర్యాటకుల తాకిడి ఈసారి అంతకు మూడు రెట్లు అధికంగా ఉండొచ్చనే అంచనాలున్నాయి. రాకపోకలు పెద్దగా లేని రోజుల్లోనే పగుళ్లు తేలిన రహదారి.. చార్‌ధామ్ యాత్ర ఊపందుకొని వేల సంఖ్యలో వాహనాలు పరుగులు తీసే సమయంలో పెనుఒత్తిడిని తట్టుకోగలదా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా నేల కుంగుబాటుపై సమగ్రఅధ్యయనం నిర్వహించా ల్సి ఉంది.. అప్పటివరకు ప్రమాదకరమైన ఈ ప్రాంతంలోకి లక్షల సంఖ్యలో ప్రజలను అనుమతించడం నిప్పుతో చెలగాటమాడటమేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నాలుగు పుణ్యధామాల సందర్శనకు తరలిరాబోతున్న ఆసేతుహిమాచల అశేష భక్తజనాన్ని ఆ మేరకు ఉత్తరాఖండ్‌ సర్కారు పూర్తిస్థాయిలో అప్రమత్తం చేయాల్సి ఉంది. కానీ, ఆ దిశగా ఎలాంటి అడుగులూ పడుతున్నట్టుగా కనిపించడం లేదు.
ఇదిలాఉంటే.. శాస్త్రవేత్తల అంచనాలే నిజమై హిమాలయాల్లో భారీ భూకంపం సంభవిస్తే మాత్రం భారత్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కల్లోలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్నీ శాస్త్రవేత్తలే అంచనా వేస్తున్నారు. హిమాలయాల్లో ఎనిమిది తీవ్రతతో భూకంపం సంభవిస్తే దాదాపుగా 8 లక్షల మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందనేది శాస్త్రవేత్తలు ముందునుంచీ హెచ్చరిస్తున్న వేళ.. తాజా పరిణామాలు ఇంకాస్త టెన్షన్ పెట్టేస్తున్నాయి. ఇటీవల తుర్కియే, సిరియా భూకంపాన్ని ముందే ఊహించిన డచ్ సైంటిస్ట్ ఫ్రాంక్ హూగర్ బీట్స్ సైతం ఇలాంటి హెచ్చరికలే చేయడంతో హిమాలయాలు డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టే కనిపిస్తోంది.

గుడ్ న్యూస్ : వాట్సాప్ లో మెట్రో టికెట్స్ బుకింగ్

0

హైదరాబాద్ మెట్రో రైల్ లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్. మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవటం, క్యాన్సలేషన్, రిచీర్జ్ వంటి సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం మెట్రో కల్పిస్తోంది. త్వరలోనే ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్, బెంగళూరు, పుణే, ముంబై మెట్రో సంస్థలతో మెటా ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. త్వరలోనే ఈ అత్యాధునిక ఫీచర్ ను వాట్సాప్ బిజినెస్ ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
5 నిముషాలు వ్యాటిడిటీ కలిగిన క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయటం ద్వారా మెట్రో టికెట్ బుక్ చేసుకోవటం మరియు క్యాన్సిల్ చేసుకోవటం, రిచార్జ్ చేసుకోవటం వాట్సాప్ బిజినెస్ యాప్ ద్వారా చేయవచ్చు. టికెట్ ధరలు, మెట్రో రైల్ టైమింగ్స్, రూట్ల వివరాలు ఇలా మెట్రోకు సంబంధించిన సమగ్ర సమాచారం వాట్సాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతానికి బెంగళూరులో ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మార్చిలో హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు కూడా ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఉద్ధవ్ థాక్రేకు షాకిచ్చిన సుప్రీంకోర్టు

0

శివసేన పార్టీ గుర్తును, ఆ పార్టీ పేరును రెండింటినీ ఏక్ నాథ్ షిండే వర్గానికే సొంతం అంటూ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అసలైన శివసేన షిండే వర్గానిదేనంటూ ఎన్నికల సంఘం నిర్ణయించగా.. దీనిపై భగ్గుమన్న ఉద్ధవ్ థాక్రే సుప్రీం కోర్టుకు వెళ్ళారు. అంత అర్జెంటుగా షిండే వర్గానికి శివసేన పార్టీ పేరును, గుర్తును కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ప్రశ్నించిన థాక్రే.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సుప్రీం.. ఎన్నికల సంఘం నిర్ణయంపై స్టే విధించటానికి నిరాకరించింది. దీంతో థాక్రే వర్గానికి చుక్కెదురైంది.
తన తండ్రి అయిన దివంగత బాలా సాహెబ్ థాక్రే స్థాపించిన శివసేన పార్టీని ఇతరుల పార్టీగా నిర్ణయించటం పట్ల థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగా ముఖ్యమంత్రి పదవితో పాటు శివసేన పార్టీని, గుర్తును కూడా ఏక్ నాథ్ షిండే లాగేసుకున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇక తన ఇంటి పేరును కూడా షిండే లాగేసుకుంటారా అంటూ థాక్రే ప్రశ్నించాడు. కొద్ది నెలల క్రితం ఏక్ నాథ్ షిండే తన అనుచరులతో కలిసి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్ వద్ద తన అనుచర ఎమ్మెల్యేలతో బల నిరూపణ చేసుకొని తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇందుకు బీజేపీ మద్దతిచ్చింది. శివసేన పార్టీ పేరు, గుర్తు రెండూ తమ వర్గానికే చెందుతాయంటూ షిండే, థాక్రే వర్గాల మధ్య వివాదం నడుస్తోంది.

ఢిల్లీలో భూకంపం : భయపెడుతున్న శాస్త్రవేత్తల హెచ్చరికలు

0

దేశ రాజధాని ఢిల్లిలో బుధవారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. 2 గంటల ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూప్రకంపనలు నమోదైనట్టు జాతీయ భూకంపాల అధ్యయన కేంద్రం ప్రకటించింది. ఉత్తర్ ప్రదేశ్, హర్యాణా, నేపాల్ లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయని చెప్పారు. చెన్నైలోనూ భూమి కంపించిందంటూ జాతీయ భూకంపాల పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఢిల్లీలో భూ ప్రకంపనలతో వణికిపోయిన జనం ఇళ్ళ నుంచి పరుగులు తీశారు. అయితే.. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్టు నమోదు కాలేదు.
కొద్ది రోజుల క్రితం టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. వేలాది మందిని పొట్టన పెట్టుకున్న టర్కీ భూకంపం.. ఆ దేశాల చరిత్రలో అతిపెద్ద విపత్తుగా నమోదైంది. టర్కీ భూకంపం నేపథ్యంలో భారత్ లో కూడా భూ అంతర్భాగంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నదనీ.. రాబోయే రోజుల్లో భారత్ లో కూడా భూంకంపం సంభవించే అవకాశాలు కొట్టి పారేయలేమనీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో సంభవించిన భూకంపం అందరినీ వణికిస్తోంది. ఎప్పుడు ఏ ప్రళయం ముంచుకొస్తుందోననే భయం వెంటాడుతోంది.

రిలయన్స్ మరో సంచలనం ఐపీఎల్ స్ట్రీమింగ్ పూర్తి ఫ్రీ

0

ఫ్రీ పథకాలతో కస్టమర్లకు ఆకర్షించే రిలయన్స్ ఇప్పుడు మరో ఫ్రీ ఆఫర్ తో మార్కెట్ ను షేక్ చేసేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ 2023 సీజన్ స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకున్న వయాకామ్ 18.. ఐపీఎల్ ప్రసారాలను పూర్తి ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్టు ఇదివరకు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలు నిజమేనని బ్లూమ్ బర్గ్ కథనాలు చెప్తున్నాయి. వయాకామ్ హైరార్కీలో ఉండే అఫీషియల్స్ దీన్ని ధృవీకరించారంటూ బ్లూమ్ బర్గ్ పేర్కొంది. అయితే దీనిపై వయాకామ్ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కానీ ఇది నిజమేననే మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చే ఐపీఎల్ ను ఏకంగా 12 భాషల్లో అదీ 4కే రిజల్యూషన్లో ఫ్రీగా స్ట్రీమింగ్ చేయనున్నట్టు సమాచారం.
ఇప్పటి దాకా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఐపీఎల్ ప్రసారం చేసింది. ఈ సీజన్ ప్రసార హక్కులను వయాకామ్ 2.7 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. కేవలం ఐపీఎల్ కోసం లక్షలాది మంది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ కొనుక్కునే వారు. ఐపీఎల్ వల్ల కోట్లాది రూపాయల ఆదాయాన్ని సబ్ స్క్రైబర్ల రూపంలో డిస్నీ సంపాదించేది. ఇప్పుడు రిలయన్స్ ఏకంగా ఐపీఎల్ ప్రసారాలు ఫ్రీగా ఇవ్వటానికి సిద్ధమైంది. కస్టమర్లకు ముందు తన ఫ్లేవర్ ను ఫ్రీగా అలవాటు చేసి ఆ తర్వాత సర్వీస్ తో ఇంప్రెస్ చేసి చివరికి కొనుక్కునేలా చేయటంలో రిలయన్స్ పేరుగాంచిన సంస్థ. వయాకామ్ ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు వచ్చే ఐపీఎల్ సీజన్ ఫ్రీగా చూడొచ్చు. కానీ మ్యాచ్ మధ్యలో వచ్చే వయాకామ్ అడ్వర్టైజ్మెంట్ లను భరించాల్సిందే.

అమెరికా అధ్యక్ష రేసులో మరో ఇండియన్..! ఎవరో తెలుసా ?

0

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి పోటీ చేయనున్నాడు. అమెరికాలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన ఇండియన్ ఆరిజిన్ వివేక్ రామస్వామి ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నానని ప్రకటించాడు. రిపబ్లికన్ పార్టీ నుంచి తాను అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని చెప్పాడు. ఇప్పటికే ఇండియన్ ఆరిజిన్ నిక్కీ హేలీ యూఎస్ఏ ప్రెసిడెంట్ రేసులో ఉన్నారు. 37 సంవత్సరాల వివేక్ రామస్వామి.. ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచిన అందరిలోనీ చిన్నవాడు. వివేక్ తల్లిదండ్రులు వివేక్ పుట్టక ముందే కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్ళారు. ఓహయోలో 1985 ఆగష్ట్ 9న వివేక్ జన్మించారు. ప్రస్తుతం అమెరికాలోని భారతీయ వ్యాపార ప్రముఖుల్లో వివేక్ కూడా ఒకరు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన వివేక్.. అమెరికా ఉన్నత ఆదర్శాలను తిరిగి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకోవటానికి నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ప్రపంచంలో చైనా వంటి దేశాలతో అమెరికాకు ఉన్న ముప్పును తొలగించే మార్గం వెతకాల్సి ఉందన్నారు. స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తున్న వివేక్.. అంతకు ముందు ఫార్మా రంగంలో రాణించారు. 2016లో ఫోర్బ్స్ లెక్కల ప్రకారం వివేక్ మొత్తం ఆస్తుల విలువ 600 మిలియన్ డాలర్లు. ఒక వేళ వివేక్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ట్రంప్ తర్వాత రిచెస్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడు.

ది ముకాబ్ : సౌదీ సృష్టించిన 8వ వింత

0

పండోరా.. 2009 అవతార్ రిలీజ్ తర్వాత అందరినీ వెంటాడిన అద్భుత ప్రపంచం. దట్టమైన అడవులు, అద్భుతమైన జలపాతాలు, ప్రకృతితో కలిసి జీవించే నావీలు.. వారికోసం ఒక్కటయ్యే వన్యప్రాణులు. ఇలా చాలా అంశాలు ప్రపంచాన్ని వెంటాడాయి. ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. పండోరా లాంటి ప్రపంచం నిజంగా ఉంటే? అంటులో మనమూ జీవిస్తే ఎంత బావుటుందో అని అనుకోని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఐతే.. పండోరా అనేది సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్, రియల్ లైఫ్‌లో అంత సీన్ కష్టం అని రియలైజ్ అవ్వడానికి ఎవరికీ పెద్దగా టైం పట్టదు. కానీ, అసాధ్యాలను సుసాధ్యం చేసే సంపన్న దేశం సౌదీ అరేబియా.. పండోరాను మించిన ప్రపంచాన్ని నిర్మించేందుకు సిద్ధమైంది. ఈ ప్రపంచంలో పండోరాలో కనిపించిన చాలా దృశ్యాలు రియల్‌గానూ.. సాధ్యంకాని కొన్నింటిని రియలిస్టిక్‌గానూ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంటూ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి.
ముకాబ్.. ఎ గేట్ వే ఆఫ్ అనదర్ వాల్డ్‌. సౌదీ అరేబియా సృష్టిస్తున్న మరో ప్రపంచానికి సంబంధించిన విజువల్స్ ఇవే. 20 బిల్డింగ్‌లను కప్పుతూ ఓ ఆకారం.. అందులోనే రెస్టారెంట్లు, మ్యూజియాలు, యూనివర్సిటీలు, హాస్పిటళ్లు.. ఇలా ఒక్కటేంటి వాట్ నాట్ వైనాట్ అన్నట్టుగా.. ఒక్కచోటే అన్ని సదుపా యాలుండే ప్యాకేజీలా ఉండే మెగా ప్రాజెక్ట్‌ను సౌదీ అరేబియా ప్రభుత్వం పట్టాలెక్కించింది. ఆ దేశ రాజధాని రియాద్‌లో 400 మీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తుతో అత్యంత భారీ ఘనాకార నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ భవనం కింది భాగంలో ఉండే సిటీని న్యూ మురబ్బాగా ప్రకటించింది.
ది ముకాబ్‌లో మొత్తంగా లక్షకు పైగా ఇళ్లుంటాయి, వేల కొద్దీ హోటళ్లుంటాయి, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ ఉంటాయి. అంతేకాదు.. చదువుకోడానికి ఏకంగా ఒక యూనివర్సిటీనే ఉంటుంది. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ద్వారా ఎన్నో సాధ్యం కాని అద్భుతాలను అరచేతిలోకి తెచ్చేలా నిర్మాణం చేస్తున్నారు. ముకాబ్‌ని 2030 నాటికి సిద్ధం చేస్తామని సౌదీ సర్కార్ చెప్తోంది. ఇక్కడి నుంచి ఎయిర్‌ పోర్టుకు కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చని, నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకొనేందుకు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది. భవిష్యత్‌లో మార్స్‌పైకి వెళ్లాలనిపిస్తే, ఇక్కడి నుంచే వెళ్లేలా ఏర్పాట్లు కూడా చేయనుంది. ఐతే.. సౌదీ ప్లాన్ చేసిన అద్భుతం ఇదొక్కటే కాదు.. అంతకుమించిన భారీ ప్రాజెక్ట్‌ను గతంలోనే ప్రకటించి ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యపరిచింది.
పాన్‌జియోస్.. గతేడాది సౌదీ అరేబియా ప్రకటించిన ప్రాజెక్ట్ ఇదే. అచ్చంగా తాబేలును పోలి ఉండే నౌకలాంటి నగరమే పాన్‌జియోస్. 1800 అడుగుల పొడవు, 2వేల అడగుల వెడల్పు ఉంటుంది. ఈ షిప్ సిటీలో హోటల్స్, షాపింగ్ మాల్స్, పార్కులు వంటివి ఉంటాయి. నౌకపై విమానాల్ని కూడా ల్యాండ్ చేయొచ్చు. వేరే నౌకలతో ఈ నౌకను అనుసంధానం చేసేలా మధ్యలో పోర్టులాంటి నిర్మాణం కూడా ఉంటుంది. ఈ నౌకలో దాదాపు 60 వేల మంది నివసించే వీలుంది. దీని రెక్కల భాగంలో 19 ప్రైవేటు విల్లాలు, 64 అపార్ట్‌మెంట్స్ ఉంటాయి. తక్కువ బరువుతో ఉండే పాంజియోస్‌లో ఎక్కువ శక్తితో పని చేసే 9 హెచ్‌టీఎస్ ఇంజిన్లు ఉంటాయి. ప్రతి ఇంజిన్లో 16వేల 800 హార్స్ పవర్ ఉన్న మోటార్లు నౌకను నడిపిస్తాయి. ఈ నౌక మొత్తానికి కావాల్సిన విద్యుత్‌ను దీనిలోనే ఉత్పత్తి చేస్తారు. ఈ నౌక గంటకు 5 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. నౌక పైభాగం నుంచి సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. అలాగే సముద్రంలో ప్రయాణించేటప్పుడు అలల నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే కదిలే నగరం పాంజియోస్ ప్రత్యేకతలు ఇవే. అయితే, ముకాబ్‌లా ఏడేళ్లలో దీని నిర్మాణం పూర్తికాదు.. పాన్‌జియోస్ పూర్తవ్వడానికి దాదాపు 20 ఏళ్లు పడుతుందనే అంచనాలున్నాయి.
మరోవైపు.. ప్రపంచం మొత్తం ఆర్ధిక సంక్షోభంవైపు అడుగులేస్తుంటే.. అరబ్ దేశాలు మాత్రం ఇలాంటి అద్భుత కట్టడాలపై ఎలా ఫోకస్ చేస్తున్నాయనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి అరబ్ దేశాలపై ఆర్థిక మాంద్యం ప్రభావం చాలా తక్కువ. ఇందుకు కారణం ఆ దేశాల్లో ఉన్న చమురు నిక్షేపాలే. అందుకే ఈ దేశాలు ప్రపంచంతో సంబంధం లేకుండా, ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా సరికొత్త కట్టడాలను నిర్మిస్తున్నాయి. గతంలో దుబాయ్‌.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా నిర్మిస్తే.. ఇప్పుడు సౌదీ సైతం ముకాబ్, పాన్‌జియోస్ లాంటి భారీ ప్రాజెక్టులను ప్రకటిస్తూ తగ్గేదే లేదంటోంది. మొత్తంగా ఈ రెండు ప్రాజెక్టులు ఎప్పుడెప్పుడు నిర్మాణం పూర్తిచేసుకుంటాయా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.