ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరూ ఊహించని పరిణామం సంభవించింది. రేపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఇప్పటికే విచారణ ఎదుర్కొని వాంగ్మూలం ఇట్టిన అరుణ్ పిళ్ళై.. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కావాలంటూ పిటిషన్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. తాను కవితకు బినామీని అని మొదట ఈడీ ముందు వాంగ్మూలం ఇచ్చిన అరుణ్ పిళ్ళై.. ఇప్పుడు అదంతా అబద్ధమంటూ మాట మార్చేశాడు. ఈ హఠాత్మరిణామం ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరటనిచ్చే పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే.. అరుణ్ పిళ్ళై ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు అరుణ్ పిళ్ళై కనుక ఈ కేసులో కవితకు సంబంధం లేదని మరో వాంగ్మూలం ఇస్తే.. ఇక ఆమె కేసు నుంచి బయటపడినట్టే.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన ఈడీ.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోదియాను మరోసారి అరెస్టు చేసింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను విచారించేందుకు నోటీసులు జారీ చేసింది. రేపు ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో అరుణ్ పిళ్ళై మాట మార్చటం కేసులో సంచలనంగా మారింది. అయితే.. రేపు ఎమ్మెల్సీ కవిత విచారణ సందర్భంలో అరుణ్ పిళ్ళైని కూడా కలిపి విచారించనున్నట్లు తెలుస్తోంది.
మాట మార్చిన అరుణ్ పిళ్ళై.. ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట
జెలెన్ స్కీకి షాకిచ్చిన ఆస్కార్ కమిటీ
మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ప్రసంగించాలని కోరుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఆస్కార్ అకాడమీ షాకిచ్చింది. ఆస్కార్ వేదికపై యుద్ధం గురి మాట్లాడటానికి ఆస్కార్ అకాడమీ అనుమతి నిరాకరించింది. అనుమతి ఎందుకు ఇవ్వలేదంటూ మీడియా ప్రతినిథులు అకాడమీ ప్రతినిథులను ప్రశ్నించగా.. వారు సమాధానమిచ్చేందుకు తిరస్కరించడం గమనార్హం. ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలు పెట్టిన తర్వాత తనకు అవకాశం వచ్చిన ప్రతి అంతర్డాతీయ వేదికపైనా జెలెన్ స్కీ ప్రసంగించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రష్యా తమ దేశంపై దండయాత్ర చేస్తోందనీ.. తమ దేశానికి సహాయం కావాలని అడిగేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. 2 నెలల క్రితం జరిగిన గ్రామీ అవార్డు వేదికపై కూడా జెలెన్ స్కీ వర్చువల్ గా ప్రసంగించాడు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి యేడాది పూర్తయ్యింది. ఇప్పటికీ విజయం ఇరుపక్షాలకు చిక్కకుండానే ఉంది. అమెరికా, యూరప్ సహా నాటో దేశాలన్నీ ఉక్రెయిన్ కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తుండటంతో ఇప్పటి వరకూ ఉక్రెయిన్ పై రష్యా పూర్తి విజయాన్ని సాధించలేకపోయింది. ఇరుదేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు భారీ సాయం అందించిన ఆయా దేశాలు కూడా ప్రస్తుతం ఆర్థికంగా నష్టపోయాయి. అమెరికా ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు వెనుకడుగు వేస్తున్న క్రమంలో ఆస్కార్ వేదికపై ప్రసంగించేందుకు అకాడమీ అనుమతి నిరాకరించటం చర్చనీయాంశంగా మారింది.
బాయ్ ఫ్రెండ్ చేతిలో చావు దెబ్బలు తిన్న నటి : వైరల్ ఫోటోస్
తమిళ నటి అనికా విజయి విక్రమన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తమిళ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. తనను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మానసికంగానూ, శారీరకంగానూ తీవ్రంగా హింసించాడంటూ అనికా కొన్ని ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో శరీరంపై తీవ్రమైన గాయాలు, కంటి కింద గడ్డకట్టిన నెత్తురు.. అసలు అనికానేనా అనే విధంగా పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రూపం కనిపిస్తోంది. చాలా రోజుల నుంచి తాను ఈ టార్చర్ ను ఎదుర్కుంటున్నాను అంటూ అనికా ఈ ఫోటోలను రివీల్ చేయటంతో పాటు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. తనకు, తన కుటుంబ సభ్యులకు అతడి వల్ల ప్రాణ హాని ఉందంటూ ఆమె పోలీస్ కంప్లైంట్ లో పేర్కొంది.
తను నన్ను మొదటిసారి చెన్నైలో కొట్టాడ.. ఆ తర్వాత నేను మోకాళ్ళపై కూర్చొని నా పరిస్థితిని తల్చుకొని ఏడ్చాను.. కానీ ఆ తర్వాత కూడా అతడిని నమ్మాను. నేను ఏమీ చేయలేనని అతడికి పూర్తి నమ్మకం.. అందుకే నన్ను తీవ్రంగా హింసించేవాడు. నేను పోలీసులకు చెప్పినా అతడిని పోలీసులు ఏమీ చేయలేదు. ఎందుకంటే అతను పోలీసులకు డబ్బు ఇచ్చి కొనేశాడు.. అంటూ తీవ్రమైన భావోద్వేగంతో కూడిన పోస్టును షేర్ చేసింది. విషమకరన్, ఐకేకే, ఎంగ పట్టన్ సొత్తు వంటి సినిమాల్లో నటించిన అనికా.. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు సంపాదిస్తోంది.
నవీన్ డెడ్ బాడీ ముక్కలను నీహారికకు చూపించిన హరికృష్ణ
సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు వెలుగు చూస్తున్నాయి. 3 నెలలు ముందుగానే నవీన్ ను చంపేయాలని నిర్ణయించుకొని ప్లాన్ చేసిన హరికృష్ణ.. నవీన్ ను హతమార్చాక కూడా భయం గొలిపే పనులకు పాల్పడ్డాడు. నవీన్ ను చంపేసి గుండె, చేతివేళ్ళను హరిహరకృష్ణ తన వెంట తీసుకెళ్ళాడనీ.. ఆ రోజు తన స్నేహితుడైన హసన్ ఇంటికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని అక్కడి నుంచి పారిపోయాడని మీత్రమే ఇప్పటి వరకూ తెలుసు. హసన్ కూడా తనకు ఈ కేసుతో సంబంధం లేదు అన్నట్టే వ్యవహరించాడు. కానీ పోలీసులు స్టైల్ మార్చి విచారణ చేయటంతో ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
నవీన్ ను హతమార్చిన తర్వాత ఈ విషయాన్ని నీహారికకు ఫోన్ చేసి చెప్పాడట హరిహరకృష్ణ. ఆ తర్వాత నీహారిక, హసన్ ఇద్దరూ కలిసి ముక్కలై పడి ఉన్న నవీన్ శరీరాన్ని చూడటానికి సంఘటన స్థలానికి వెళ్ళారట. వీళ్ళిద్దరూ చూసి వెళ్ళిన తర్వాత హరిహరకృష్ణ మళ్లీ అక్కడికి వెళ్ళి ఆ ముక్కలను కాల్చివేశాడట. నవీన్ కు మందు తాగించేందుకు నీహారిక స్వయంగా హరిహరకృష్ణకు 15 వందల రూపాయలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తెలిసిందట. నవీన్ హత్యకు కొద్ది సేపటి ముందే ఈ విషయం హసన్, నీహారికలకు తెలుసన్న విషయం ఇప్పుడు ఆశ్చర్యపరిచే అంశంగా మారింది. విచారణలో ఈ విషయాలను హరిహరకృష్ణ వెల్లడించిన తర్వాత హసన్, నీహారికలను ఏ2, ఏ3లుగా నమోదు చేసుకొని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.
పోలీస్ ట్రక్ పై ఆత్మాహుతి దాడి : 9 మంది పోలీసులు మృతి
వరుస తీవ్రవాద ఘటనలతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. గత పది రోజుల నుంచి పాకిస్తాన్ లో పేరు మోసిన తీవ్రవాదులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేస్తుండటం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ను వార్తల్లో నిలిపింది. సోమవారం నాడు మరో సంచలన ఘటన పాకిస్తాన్లో జరిగింది. పోలీసులు ప్రయాణిస్తున్న ట్రక్ పై ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్తాన్ లోని క్వెట్టాకు 120 కిలోమీటర్ల దూరంలో గల ఖచ్చీ జిల్లాలోని దాదర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ప్రయాణిస్తున్న ట్రక్ ను ఓ సూసైడ్ బాంబర్ బైక్ పై వెంబడిస్తూ వెనుక నుంచి ఢీకొట్టి తనను తాను పేల్చివేసుకున్నాడు. దీంతో ట్రక్ లో ప్రయాణిస్తున్న వారిలో 9 మంది పోలీసులు మృత్యువాతపడ్డారు. మరో 16 మంది పోలీసులు గాయపడ్డారు.
పేరుమోసిన తీవ్రవాదులను వరుసగా గుర్తు తెలియని వ్యక్తులు చంపేస్తుండటానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బలూచిస్తాన్ తిరుగుబాటు దారుల పని కూడా అయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత 10 రోజులుగా పాకిస్తాన్ లో వరుసగా తీవ్రవాదులను టార్గెట్ కిల్లింగ్ చేస్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులు. తీవ్రవాదులు ఉన్న ప్రదేశంలోకి బైక్ పై వేగంగా వెళ్ళి వారిని దగ్గరి నుంచి నుదుటిపై షూట్ చేసి చంపిన ఘటనలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. దూరం నుంచి స్నైపర్ గన్స్ తో కాల్చిన ఘటనలు సైతం పాకిస్తాన్ లో నమోదయ్యాయి. దేశంలోనే పేరు మోసిన తీవ్రవాదులుగా పేరున్న వారినే లక్ష్యంగా చేసుకొని సినిమా తరహాలో ఈ హత్యలు జరుగుతున్నాయి. అయితే.. ఈ పని భారత్ కు చెందిన రీసెర్చ్ ఆండ్ అనాలిసిస్ వింగ్ పనిగా మొదట భావించారు. కానీ.. ఐఎంఎఫ్ షరతుల మేరకు పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ గూఢచార సంస్థ కావాలని తాను పెంచి పోషించిన తీవ్రవాదులను తానే హతమారుస్తున్నట్టు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ బయటపెట్టింది.
ప్రీతి కేసులో ట్విస్ట్ ఇచ్చిన “టాక్సికాలజీ” రిపోర్ట్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ప్రీతి నాయక్ కేసులో మరో భారీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రీతి శరీరంలో అసలు రసాయలనాల ఆనవాళ్ళే లేవంటూ టాక్సికాలజీ రిపోర్టు వచ్చింది. సీనియర్ సైఫ్ వేధింపులతో తీవ్రం అవమానానికి గురైన ప్రీతి నాయక్.. పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిందంటూ ఆమెను హాస్పిటల్ లో అడ్మిట్ చేసినప్పుడు డాక్టర్లు, పోలీసులు చెప్పారు. విషం ప్రభావంతోనే కిడ్నీలు, లివర్ పని చేయలేదని కూడా చెప్పారు. చివరికి ప్రీతి ప్రాణాలు కోల్పోయింది. కానీ టాక్సికాలజీ రిపోర్టులో మాత్రం ప్రీతి శరీరంలో అసలు ఏ రకమైన రసాయనాలు లేవంటూ రావటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ప్రీతిని హైదరాబాద్ లోని నిమ్స్ లో అడ్మిట్ చేయటానికి ముందు నుంచే ఆమె పాయిజన్ ఇంజక్షన్ తీసుకున్నట్టు వైద్యులు, పోలీసులు చెప్పారు. ప్రీతికి వైద్యం అందుతున్నన్ని రోజులు ఇదే చెప్పిన వైద్యులు.. చివరికి ఆమె శరీరంలో రసాయనాల ఆనవాళ్ళు లేవంటూ రిపోర్టులో పేర్కొనటం కేసులో అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉంటే.. అసలు ప్రీతి ఆత్మహత్యకు ముందు కాలేజ్ లో ఏం జరిగింది.. ఆమెను ఎవరు వేధించారు.. సైఫ్ చేసిందేమిటి.. ప్రీతి పోస్ట్ మార్టంలో ఏముంది.. ఇలా అనేక ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానాలు లేవు. ప్రతిపక్ష పార్టీలు మళ్ళీ ప్రభుత్వంపై విమర్శల దాడి మొదలుపెట్టాయి.
ఊరు వదిలి వెళ్ళిపోయిన “కచ్చా బాదమ్” స్టార్
కచ్చా బాదమ్ అంటూ దేశవ్యాప్తంగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన పశ్చిమ బెంగాల్ కు చెందిన భుబన్ బద్యాకర్.. ప్రస్తుతం అష్టకష్టాలు అనుభవిస్తున్నాడు. కనీసం ఇంటి అద్దె కట్టలేని పరిస్థితుల్లో సొంత ఊరు వదిలి మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. భూబన్ సొంతూరు భీర్ భూమ్ లోని కురల్ జురి. అయితే.. సొంత గ్రామంలో యువకుల వేధింపులు భరించలేక.. ఇటు ఇంటి కిరాయి కూడా కట్టలేక.. చివరకు కుటుంబంతో సహా గ్రామాన్ని వదిలి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వలస వెళ్ళాడు. ప్రతి నెలా 2800 ఇంటి కిరాయి కట్టడానికి కూడా భూబన్ కష్టపడాల్సి వస్తోందట.
శెనగలు, పల్లీలు అమ్ముకుని జీవనం గడిపే భుభన్.. కచ్చా బాదామ్ పాటతో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయాడు. దేశవ్యాప్తంగా కచ్చా బాదమ్ పాటతో పాటు భుబన్ వైరల్ అయిపోయారు. ఆ తర్వాత ఓ మోడల్ తో కలిసి కచ్చా బాదామ్ వీడియో సాంగ్ చేయటం.. అది కూడా యూట్యూబ్ లో బ్లాక్ బస్టర్ కావటంతో భుబన్ దశ తిరిగిపోయింది. కానీ ఆ మంచి కాలం ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రస్తుతం మళ్ళీ శెనగలు, పల్లీలు అమ్ముకున్నా కూడా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితి వచ్చింది పాపం. సెలబ్రిటీగా మారిన తర్వాత తాను సంపాదించిన డబ్బును ఊర్లోని యువకులు రకరాలుగా లాగేసుకున్నారనీ.. ఇప్పుడు కనీసం ఊర్లో ఉండనివ్వటం లేదనీ వాపోతున్నాడు భుబన్. తనను ఫేమస్ చేసిన కచ్చా బాదామ్ పాటకు కూడా కాపీరైట్ రావటంతో కనీసం ఆ పాట కూడా పాడుకోలేని పరిస్థితికి వచ్చేశాడు. భుబన్ ను ఎవరు ఆదుకుంటారో పాపం.
చెప్పింది చేసి చూపించిన యోగీ : యూపీలో భారీ ఎన్ కౌంటర్
ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనం రేకెత్తించిన ఉమేశ్ పాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉమేశ్ పాల్ ను హత్య చేసిన నిందితుడు విజయ్ అలియాస్ ఉస్మాన్ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్లో హతమార్చారు. సోమవారం తెల్లవారుఝామున ప్రయాగ్ రాజ్ లోని కౌంధియారా పోలీస్ స్టేషన్లో పారిపోవటానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు కాల్పులు జరపటంతో విజయ్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ ను వారం రోజుల క్రితం కాల్చి చంపిన కేసులో విజయ్ అలియాస్ ఉస్మాన్ నిందితుడు. ఇంటికి వెళ్తున్న సమయంలో ఉమేష్ పాల్ తో పాటు అతడి గన్ మెన్ పై కాల్పులు జరపటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇది ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది.
ఉమేశ్ పాల్ హత్య ఘటన యూపీ అసెంబ్లీని కుదిపేసింది. అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష నాయకులు యోగీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. యోగీ అసమర్థత వల్లే ఉత్తర్ ప్రదేశ్ లో మాఫియా చెలరేగిపోతోందంటూ అఖిలేష్ యాదవ్ ఆరోపించటంతో యోగీ అసెంబ్లీలో ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఉమేష్ పాల్ ను నేను హత్య చేసానా.. అంటూ అసెంబ్లీలో ప్రతిపక్షాలను నిలదీసిన యోగీ.. మాఫియా డాన్లను ఎన్ కౌంటర్ చేస్తానంటూ అసెంబ్లీలోనే యోగీ ప్రకటన చేయాల్సి వచ్చింది. యోగీ చెప్పినట్టుగానే ఉమేష్ పాల్ ను హత్య చేసిన నిందితుల్లో ఇప్పటికే ఇద్దరిని పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. మరో నిందితుడు అర్బాజ్ ను పోలీసులు ఫిబ్రవరి 27న ఎన్ కౌంటర్ చేశారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ పోలీసులు మాఫియా వేటలో ఉన్నట్టు సమాచారం. హత్యలు, కిడ్నాప్ లు చేసే వారిని వందల కొద్దీ మాఫియా లీడర్లను ఇప్పటికే ఎన్ కౌంటర్ లేదంటే జైళ్ళో వేసిన యోగీ ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి మాఫియాపై ఉక్కుపాదం మోపుతోంది.
టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్న జాన్వి లుక్
జాన్వీ కపూర్ త్వరలో తెలుగులో సినిమా చేయబోతోందంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నప్పటికీ దానిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్లు మాత్రం రాలేదు. అసలు జాన్వీ తెలుగులో సినిమా ఒప్పుకుంటుందా.. ఇప్పటికే ఒప్పుకుందా.. అనేది సస్పెన్స్ గానే ఉండేవి. ఎన్టీఆర్ తో కలిసి జాన్వీ తెలుగులో ఎంటర్ కాబోతోందన్న వార్తలు కూడా చాలా కాలంగా వినిపిస్తున్నా.. క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఎన్టీఆర్ పక్కన జాన్వీ కలిసి కనిపించబోతోంది. స్వయంగా జాన్వీయే దీనిపై క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు సంబంధించిన తన లుక్ తో ఓ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది.
లంగా ఓణీలో అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపిస్తున్న జాన్వీ కపూర్ ఫోటో ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ఫోటోనే దర్శనమిస్తోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఇటు తెలుగు ప్రేక్షకులు కలిసి ఈ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు. జాన్వి లుక్ ను చూసిన జనాలు ఫిదా అయిపోతున్నారు. ఇన్నాళ్ళూ సస్పెన్స్ గా ఉంచి ఇప్పుడు సడన్ గా సీక్రెట్ రివీల్ చేయటంతో ప్రస్తుతం జాన్వీ కపూర్ ఇంటర్నెట్ ను షేక్ చేసేస్తోంది.
బ్రేకింగ్ : రేవంత్ రెడ్డి కాన్వాయ్ కు భారీ యాక్సిడెంట్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్ లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొని ధ్వంసం అయ్యాయి. ప్రమాదంలో రేవంత్ రెడ్డి కారు తన ముందు కారును బలంగా ఢీకొట్టగా.. వెనుక నుంచి రేవంత్ రెడ్డి కారును మరో కారు ఢీకొట్టింది. బెలూన్లు ఓపెన్ కావటంతో రేవంత్ రెడ్డికి ఘోర ప్రమాదం తప్పినట్టైంది. కాన్వాయ్ లోని కార్లలో ఉన్న మీడియా ప్రతినిథులకు చాలా మందికి గాయాలయ్యాయి. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణనష్టం వాటిల్లకపోవటం అదృష్టంగా చెప్పుకోవాలి. సిరిసిల్ల జిల్లాలోని శ్రీపాద ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. కాన్వాయ్ వేగంగా వెళ్తున్న సమయంలో ఏదో అడ్డు రావటం వల్ల కాన్వాయ్ లోని మొదటి కారు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందనీ.. దీంతో అన్ని కార్లు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయనీ స్థానికులు చెప్తున్నారు.