గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో తరచూ వినిపిస్తున్న పేర్లు.. నరేశ్, పవిత్ర. త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నామంటూ సెన్సేషనల్ అనౌన్స్ మెంట్ చేసిన ఈ ఇద్దరూ.. సోషల్ మీడియాలో వాళ్ళ రిలేషన్షిప్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు పెట్టేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఆ మధ్య వీళ్ళు షేర్ చేసిన లిప్ కిస్ వీడియో.. టాలీవుడ్ కే కాదు.. మామూలు జనానికి కూడా పెద్ద షాకే ఇచ్చింది. ఇప్పటికే చెరో రెండు, మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకున్న భారీ అనుభవం ఉన్న జంట ఇది. అందుకే వీళ్ళు ఏం చేసినా అది వైరల్ అవుతోంది. అయితే.. లేటెస్ట్ గా ఈ జంట గురించి ఓ న్యూస్ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది.
రీసెంట్ గా సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్ళి వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఈ వీడియో చూసిన జనాలు వీళ్ళిద్దరూ పెళ్ళి చేసేసుకొని హనీమూన్ కు చెక్కేశారని అనుకున్నారు. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. ప్రస్తుతం నరేష్ తన సొంత ఖర్చులే “సెకండ్ ఇన్నింగ్స్” అనే సినిమా తెరకెక్కిస్తున్నాడట. ఇదివరకే పెళ్ళై విడాకులు తీసుకున్న ఓ మిడిల్ ఏజ్ జంట.. మళ్ళీ పెళ్ళితో ఒకటై జీవితంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెడితే ఎలా ఉంటుందో అనేది ఈ సినిమా కథ. అంటే దాదాపుగా వీళ్ళిద్దరి రియల్ లైఫ్ స్టోరీ అన్నమాట. ఈ సినిమా కోసం షూట్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో వదిలేస్తూ హంగామా సృష్టించారు ఇన్ని రోజులు. చివరికి అవి వీళ్ళ కొత్త సినిమాలోని వీడియోలని తెలిసి జనం షాకవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ సినిమా కోసం తీసిన విజువల్స్.. వీళ్ళ రియల్ సెకండ్ ఇన్నింగ్స్ కు సంబంధించినవి అని ఇన్ని రోజులు జనం పొరపాటు పడ్డారన్నమాట.
నరేశ్, పవిత్ర “సెకండ్ ఇన్నింగ్స్” : షాకింగ్ సీక్రెట్స్
కెనడా పారిపోయిన అమృత్ పాల్ సింగ్ ?
ఖలిస్తాన్ వేర్పాటు వాద అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చుకొని తనకు తాను విప్లవకారుడిగా ప్రకటించుకున్న అమృత్ పాల్ సింగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పోలీసు వ్యవస్థకే సవాల్ విసిరిన అమృత్ పాల్ సింగ్ మరియు అతని అనుచరులను ఎట్టకేలకు పంజాబ్ పోలీసులు కేంద్ర బలగాలతో కలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. చివరి క్షణంలో అమృత్ పాల్ సింగ్ తప్పించుకొని పారిపోయాడు. పంజాబ్ రాష్ట్రం మొత్తం వంద కార్లు, వేలాది మంది పోలీసులు జల్లెడపట్టినప్పటికీ అతని ఆచూకీ తెలియటం లేదు. ఇప్పటికే సరిహద్దులు దాటి నేపాల్ గుండా కెనడాకు అమృత్ పాల్ సింగ్ తప్పించుకొని పారిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయినా సరే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ఆపటం లేదు.
పంజాబ్ లో శాంతి భద్రతలకే శరాఘాతంగా మారిన అమృత్ పాల్ సింగ్ ను పోలీసులు చూస్తూ ఊరుకున్నారే తప్ప ఏమీ చేయలేకపోయారు. తన అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఏకంగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి ఎఫ్ఐఆర్ కాపీని చించేసి.. తన అనుచరులను విడిపించుకొని పోయినా పోలీసులు కనీసం అడ్డుకునే ధైర్యం చేయలేదు. దీంతో కేంద్ర హోంశాఖ దీనిపై దృష్టి పెట్టింది. అమృత్ పాల్ సింగ్ ను అరెస్ట్ చేయకపోతే పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పంజాబ్ సీఎం భగ్వంత్ సింగ్ మాన్ ను హెచ్చరించి.. చివరికి 18 కంపెనీల కేంద్ర బలగాలను దించి.. అమృత్ పాల్ పై దాడి చేశారు. కానీ.. పోలీసుల దాడిని ముందే పసిగట్టిన అమృత్ పాల్ పారిపోయాడు. అతడి అనుచరులు సుమారు 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మిసైల్ మీపైకి రావచ్చు : ఐసీసీకి రష్యా వార్నింగ్
రష్యా అధ్యక్షుడు పుతిన్ పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మెన్ దిమిత్రి మెద్వెదేవ్ ఊహించని షాకిచ్చాడు. ఐసీసీ భవనంపై మిసైల్ దాడి చేస్తామంటూ హెచ్చరించాడు మెద్వెదేవ్. “మీ భిల్డింగ్ మా మిసైల్ కు ఎక్కువ దూరంలో లేదు.. ఆకాశాన్ని గమనిస్తూ ఉండండి.. రష్యా మిసైల్ ఏ క్షణమైనా మీ మీద పడవచ్చు..” అంటూ తీవ్రంగా హెచ్చరించాడు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఓ దయనీయ సంస్థ అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు. రష్యా హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ నేరాలపై విచారణ చేపట్టే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకే రష్యా మిసైల్ హెచ్చరికలు చేయటం ఊహించని పరిణామం.
ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న రష్యా.. అక్కడి నుంచి పిల్లలను అక్రమంగా తమ దేశంలోకి రవాణా చేస్తోందంటూ ఐసీసీ ఆరోపించింది. రష్యా అధ్యక్ష హోదాలో పుతిన్ పలు యుద్ధ నేరాలకు పాల్పడ్డాడంటూ అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో రష్యా తీవ్రంగా రియాక్టైంది. ఏకంగా కోర్టు భవనాన్నే పేల్చేస్తానంటూ హెచ్చరించింది. నిజానికి రష్యా ఏనాడూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టును లెక్కచేయలేదు సరికదా.. అసలు ఐసీసీని మేం గుర్తించనేలేదంటూ గతంలోనే రష్యా స్పష్టం చేసింది. రష్యా హెచ్చరికలపై అమెరికా సహా ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది.
పేపర్ లీకేజిపై కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్లు చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం పట్ల విమర్శించటంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు చేసిన పని మాత్రమేననీ.. దీని వల్ల మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వచ్చిందనీ అన్నారు. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. కమిషన్ లోనే పని చేస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా చేసిన ప్రవీణ్, రాజశేఖర్ అనే వ్యక్తులను తాము ఉపేక్షించేది లేదనీ.. సిట్ దర్యాప్తు పూర్తైన వెంటనే కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. “తెలంగాణ ఉద్యమానికి పునాదే నీళ్ళు, నిధులు, నియామకాలు.. అలాంటిది నియామకాల విషయంలో ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకోదు.. జరిగిన ఘటన పట్ల మాకు కూడా బాధగానే ఉంది..” అంటూ క్లారిటీ ఇచ్చారు కేటీఆర్.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్.. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి కమిషన్ రూపొందించిన ప్రశ్న పత్రాలను దొంగిలించి లీక్ చేశారు. దీంతో ఇప్పటికే జరిగిన ఏఈ, గ్రూప్-1 లాంటి పరీక్షలతో పాటు జరగాల్సిన అన్ని పరీక్షలను కమిషన్ రద్దు చేసింది. త్వరలోనే మళ్ళీ కొత్త ప్రశ్న పత్రాలతో పరీక్ష నిర్వహిస్తామని కమిషన్ అధికారులు చెప్పారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పరీక్షలు రాసిన వేలాది మంది పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనీ.. పేపర్ లీకేజీలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు టీఆర్ఎస్ మంత్రుల పాత్ర ఉందనీ విమర్శించారు. దీంతో కేటీఆర్ పై విధంగా ఘాటు సమాధానం చెప్పారు.
అమెరికన్లకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అందరికీ షాకిచ్చాడు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటన అనంతరం ట్రంప్ ను సోషల్ మీడియా బ్యాన్ చేసింది. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్.. ఇలా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి ట్రంప్ నిషేధం ఎదుర్కున్నాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉన్న నేపథ్యంలో.. ట్రంప్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై రీఎంట్రీ ఇచ్చాడు. ట్విటర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేసిన వెంటనే గత నవంబర్ లో ట్రంప్ అకౌంట్ యాక్టివ్ చేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకూ ట్రంప్ ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. ఇప్పుడు మిగతా వేదికలైన ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్ లలో అయామ్ బ్యాక్ అంటూ రీఎంట్రీ ఇచ్చి అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.
ట్విటర్ లో ట్రంప్ కు 87 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా.. ట్రంప్ యూట్యూబ్ చానల్ కు ఏకంగా రెండున్నర మిలియన్లకు పైగానే సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఫేస్ బుక్ లో 34 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇంత ఫాలోయింగ్ కలిగి ఉన్న పొలిటికల్ లీడర్ ను బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన తర్వాత అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి నిషేధించారు. చాలా కాలంగా దీనిపై మౌనంగానే ఉన్న ట్రంప్.. ఇప్పుడు ఫుల్ యాక్టివ్ గా మారనున్నాడు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అమెరికా అధ్యక్షుడిగా తాను పోటీ చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. ఎన్నికల్లో తనకు కావాల్సిన మద్దతు కోసం ప్రయత్నాలు ఎప్పుడో మొదలుపెట్టేశాడు. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ను ఆయన పాలనా విధానాన్ని విమర్శిస్తూ అప్పుడప్పుడు అమెరికాలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న ట్రంప్.. ఇప్పుడు మరింత స్పీడు పెంచనున్నాడన్నమాట.
ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్ న్యూస్ : అన్ లిమిటెడ్ డేటా ఫ్రీ
5జీ రాకతో మరోసారి టెలీకామ్ ఆపరేటర్ల మధ్య పోటీ పెరిగింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు.. యూజర్లను పెంచుకునేందుకు.. లీడింగ్ ఆపరేటర్లు అయిన రిలయన్స్ జియో మరియు ఎయిర్ టెల్ రేసు మొదలుపెట్టాయి. ఇటీవలే భారతదేశంలోని సెలెక్టెడ్ నగరాలలో 5జీ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. 5జీ ముబైల్ హ్యాండ్ సెట్ కలిగి ఉండి 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో ఉండే వారికి డేటా విషయంలో లిమిట్ తీసేసింది రిలయన్స్ జియో. రోజుకు ఇంతే డాటా వాడుకోవాలనే రూల్ ను ఎత్తేసి వెల్కమ్ ఆఫర్ కింద 5జీ వినియోగదారులకు అన్ లిమిటెడ్ డాటాను అందుబాటులోకి తెచ్చింది. దీంతో మరో లీడింగ్ ఆపరేటర్ ఎయిర్ టెల్ కూడా ఇదే ఆఫర్ రిలీజ్ చేసింది. కనీసం 239 రీచార్జ్ చేసుకున్న వారికి అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ ను ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 4జీ యూజర్లకు వర్తించదు.
దేశవ్యాప్తంగా 270 నగరాలు, పట్టణాల్లో 5జీ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు 5జీ ఫోన్లు కలిగి ఉంటే కనుక.. ఇక వారికి డేటా విషయంలో హద్దులు లేవన్నమాట. వినియోగదారులు నిరంతరం ఆన్ లైన్ లో ఉండి సేవలను పొందటానికే ఈ ఆఫర్లను ప్రకటించామంటూ ఆపరేటర్లు చెప్తున్నాయి. జియో, ఎయిర్ టెల్ ఆఫర్లతో రానున్న రోజుల్లో 5జీ ముబైల్స్ అమ్మకాలు పెరగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5జీ యూజర్లు పెరిగితే కనుక 4జీ డేటా ధరలు కాస్త తగ్గే అవకాశం ఉంది. మరో సంవత్సరం కల్లా ప్రస్తుతం 4జీ వినియోగిస్తున్న యూజర్లలో కనీసం 30 శాతం మంది 5జీకి అప్ గ్రేడ్ అవుతారని అంచనా.
TSPSC సంచలన నిర్ణయం : ఆ 20 పరీక్షలు రద్దు
పేపర్ లీకేజి వివాదంలో తెలంగాణ పబ్లిక్ సర్వీర్ కమిషన్ పై తీవ్ర ఒత్తిడి నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే గ్రూప్ 1, ఏఈ పరీక్ష రద్దు చేసినట్టు ప్రకటించిన కమిషన్.. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం 20కి పైగా పరీక్షలను పూర్తిగా రద్దు చేసి మరోసారి నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలతో పాటు జరగాల్సిన పరీక్షలను కూడా రద్దు చేసి.. మరో కొత్త ప్రశ్న పత్రాలు తయారు చేసిన తర్వాత మళ్ళీ పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈ, డీఏఓ, టౌన్ ప్లానింగ్ పరీక్షలు రద్దు చేశారు. ఇవి ఇప్పటికే పూర్తైన పరీక్షలు కాగా.. షెడ్యూల్ చేసిన పరీక్షలను కూడా రద్దు చేసింది. మరికొద్ది సేపట్లో ఇందుకు సంబంధించిన వివరాలను కమిషన్ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రవీణ్ ఇంట్లో సోదాలు చేపట్టిన పోలీసులు.. ప్రవీణ్ లాప్ టాప్, పెన్ డ్రైవ్ వంటివి తనిఖీ చేయగా.. కమిషన్ రూపొందించిన అన్ని రకాల ప్రశ్నపత్రాలు తన పెన్ డ్రైవ్ లో కాపీ చేసి పెట్టుకున్నట్టు పోలీసులు గుర్తించారు. భవిష్యత్తులో జరగాల్సిన పరీక్షల కోసం రూపొందించిన క్వశ్చన్ పేపర్లను కూడా ప్రవీణ్ వద్ద ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఈ పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడో ఎంత మంది కొన్నారో సమాచారం లేదు కాబట్టి.. అన్ని పరీక్షలను రద్దు చేయటం తప్ప కమిషన్ కు మరో అవకాశం లేకుండా పోయింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ ను జూన్ 11న నిర్వహిస్తామని ప్రకటించిన కమిషన్.. మిగతా పరీక్షల తేదీలను త్వరలో వెల్లడిస్తామని ప్రకటించింది.
వైరల్ న్యూస్ : మోడీకి నోబెల్ పీస్ ప్రైజ్ !?
నోబెల్ పీస్ ప్రైజ్.. ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం. ఈ పురస్కారానికి నామినేట్ కావడమే ఓ చరిత్ర. ఇక సొంతం చేసుకున్నవారి పేరు హిస్టరీలో నిలిచిపోతుంది. అలాంటి నోబెల్ పీస్ ప్రైజ్ ఈసారి భారత ప్రధాని మోడీకి దక్కబోతుందనే చర్చ జోరందుకుంటుంది. దీనికి కారణం నార్వే నోబెల్ కమిటీ సభ్యులు ఇస్తున్న హింట్సే. ఇటీవల భారత్‌లో పర్యటించిన కమిటీ సభ్యులు ప్రపంచ అత్యున్నత పురస్కారం మోడీకి కాక మరెవరికి అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇదే ప్రపంచ వ్యాప్తంగా చర్చకు కారణమైంది.
పెద్దన్న హోదా అంటే నచ్చనివారిని పబ్లిక్‌గా విమర్శించడం, మెచ్చేవారిని పక్కన పెట్టుకోవడం కాదు. ప్రపంచ శాంతిని దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకెళ్లడం. ఆ పని చేయడంలో అమెరికా ఎప్పుడో విఫలమైంది. పైగా ఉక్రెయిన్-రష్యాలను తన్నుకుచావండని ఎంకరేజ్ చేసి ప్రపంచం మొత్తానికీ శాపంగా మారింది. అదే అమెరికా స్థానంలో ఇండియా ఉంటే ఏం జరిగుండేదో అనే చర్చ ఇటీవలికాలంలో జోరుగా సాగుతోంది. దీనికి కారణం భారత విదేశాంగ విధానాలే. ప్రపంచ ఉద్రిక్తతలపై ప్రధాని మోడీ నిత్యం చెప్పే మాట ఒక్కటే డైలాగ్ అండ్ డిప్లమసీ. వీటితో మాత్రమే ప్రపంచ శాంతి లభిస్తుందని చాలా సందర్భా ల్లో మోడీ ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధంపైనా అంతర్జాతీయ వేదికలపై ఇదే అంశాన్ని ప్రస్తావించి ప్రపంచ దేశాల అటెన్షన్ సాధించారు. గతేడాది సమర్‌కండ్‌లో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌లో ఏకంగా పుతిన్‌తో సమావేశంలోనే ఇది యుద్ధ యుగం కాదన్న మోడీ కామెంట్‌కు ప్రపంచమే సెల్యూట్ చేసింది. ఆ క్షణం నుంచి అమెరికా స్థానంలో భారత్ ఉండుంటే ప్రపంచానికి ఈ పరిస్థితి వచ్చుండేది కాదనే చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచ శాంతి పురస్కారం నోబెల్ వార్తలతోనూ మరోసారి అలాంటి చర్చలే షురూ అయ్యాయి.
ఇటీవలే నోబెల్ బహుమతి కమిటీ బృందం నార్వే నుంచి భారత్‌కు వచ్చింది. నోబెల్ శాంతి బహుమతి విజేతను నిర్ణయించే ఈ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ అస్లే టోజే ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. ప్రధాని మోడీ లాంటి శక్తివంతమైన నేతకు ప్రపంచంలో శాంతిని నెలకొల్పే అద్భుతమైన సామర్థ్యం ఉందని కితాబు ఇచ్చారు. మోడీ లాంటి నేత శాంతిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించగలరని నమ్ముతున్నట్లు అస్లే టోజే అన్నారు. నోబెల్ శాంతి బహుమతి విషయంలో ఇండియా నుంచి అధిక సంఖ్యలో నామినేషన్లు అందుతున్నాయన్నారు. ప్రపంచంలోని ప్రతిదేశ అగ్రనేతలు శాంతి కోసం అవసరమైన కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత ప్రధాని మోడీ లాంటి వ్యక్తిపై ప్రపంచ వ్యాప్తంగా నమ్మకం ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో మోడీ కీలకపాత్ర పోషిస్తారు, ఆయనకు ఆ సత్తా ఉందని అస్లే టోజే కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద యుద్దాలను సైతం మోడీ తన నాయకత్వ ప్రతిభ, విశ్వసనీయతతో ఆపడానికి ప్రయత్నిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు.. యుద్ధం ముఖ్యం కాదని భవిష్యత్తు అంతా శాంతితో ఉండాలని రష్యా, అమెరికా, చైనా లాంటి దేశాల అధినేతలతో ప్రధాని మోడీ చర్చలు జరిపారని అస్లే టోజే గుర్తుచేశారు. ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఎంతో నేర్చుకోవాలని, త్వరలోనే భారత్ సూపర్ పవర్‌గా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అస్లే టోజే ఈ వ్యాఖ్యలతోనే నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోడీ గట్టిపోటీ ఇస్తారన్న చర్చ మొదలైంది. అయితే, నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్.. మోడీకి నోబెల్ అందుకునే అర్హత ఉందని హింట్స్ ఇవ్వడానికి ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై భారత వైఖరి ఒక్కటే కారణం కాదు. ప్రపంచానికి మోడీ సర్కార్ అంతకుమించి ఎంతో సాయం చేసింది. ప్రపంచం శాంతిని, స్నేహాన్ని కోరుకోవడంలో ప్రధాని మోడీ ఎప్పుడూ ముందుంటారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో పడనీయకుండా కాపాడారు. అదే సమయంలో చాలా దేశాలకు కోవిడ్ టీకాలు అందించి ఆపద్భాంధవుడిగా నిలిచారు. ఇక ప్రకృతి వైపరీత్యాలతో విలవిల్లాడిన దేశాలకు కూడా తన మన అనే బేధాలు లేకుండా కొండంత అండగా నిలిచారు. ఇటీవల తుర్కియేకు చేసిన సాయమే దీనికి ఉదాహరణ. ఇలా ప్రపంచ శాంతి కోసం నిత్యం కృషి చేస్తున్న లీడర్‌గా అంతర్జాతీయంగా మోడీ మంచి పేరు తెచ్చుకున్నారు. అందుకే నోబెల్ ప్రైజ్ కమిటీ డిప్యూటీ లీడర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
భారత ప్రధాని మోడీని నోబెల్ వరిస్తుందా లేదా అనేది కాస్త పక్కనపెడితే.. ఈ ప్రతిష్టాత్మక పురస్కారంపై మరో దేశాధినేత కన్నేసినట్టు కనిపిస్తోంది. గతేడాది ఎస్‌సీఓ సమ్మిట్‌లో ప్రధాని మోడీ ఇది యుద్ధ యుగం కాదన్న తర్వాత.. తనకు అలవాటులేని శాంతి రాగం అందుకున్నారు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్. ఎలాంటి ప్రయోజనం లేకుండా జిన్‌పింగ్ ఏ పనీ చేయరనే అపవాదు ఉంది. అలాంటి వ్యక్తి ప్రపంచ శాంతికి కృషి చేస్తానని ప్రకటించడం ఏంటన్నదే అసలు ప్రశ్నంతా. వాస్తవానికి.. అంతర్జాతీయంగా జిన్‌పింగ్‌కు మంచి గుర్తింపు లేదు. కోవిడ్ తర్వాత చైనా అంటే ఓ డేంజర్ కంట్రీ అనేంతగా పరిస్థితులు మారిపోయాయి. దీనికితోడు తైవాన్‌తో పాటూ పొరుగు దేశాలపై కవ్వింపులు కూడా ఎక్కువయ్యాయి. ఫలితంగా చైనాకు ప్రపంచ విలన్‌గా గుర్తింపు వచ్చింది.దీని ప్రభావం క్రమంగా ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపైనా పడుతోంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ తన పీస్ కామెంట్లతో ప్రపంచం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నో ఏళ్లుగా బద్ధ శత్రువులుగా ఉంటున్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు తిరిగి పట్టాలెక్కేలా జిన్‌పింగ్ పావులు కదిపారు. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతికి కృషి చేస్తామని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పరిణామాల ద్వారా ప్రపంచ శాంతికి కృషి చేస్తున్న ఏకైక లీడర్‌గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే, సౌదీ అరేబియా, ఇరాన్‌ను కలిపినంత ఈజీగా ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి చెక్ పెట్టడం సాధ్యం కాదు. ఇదే సమయంలో ఈ రెండు అంశాలతోనే జిన్‌పింగ్ ప్రపంచ శాంతి స్థాపకులు అయిపోరు. నోబెల్ శాంతి పురస్కారం వరకూ వెళ్లే సీన్ అసలే ఉండకపోవచ్చు.
జిన్‌పింగ్ పీస్ డ్రామాను కాస్త పక్కనపెడితే.. మోడీకి నోబెల్ ఛాన్సెస్ మెండుగా ఉన్నాయనే వార్త కాషాయ శ్రేణుల్లో కావాల్సినంత జోష్ నింపుతోంది. అయితే, ఈ వార్తలపై ప్రతిపక్ష పార్టీలు మాత్రం మోడీకి నోబెల్ అందుకునే అంత సీన్ లేదని విమర్శిస్తున్నాయి. అయితే, గతంలోనూ మోడీకి నోబెల్ డిమాండ్లు బలంగా వినిపించాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి అనేక కార్యక్రమాల ద్వారా ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో, పేదరికాన్ని తగ్గించడంలో అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో మోడీ చేసిన కృషికి ప్రతిష్టాత్మక అవార్డు పొందే అర్హత ఉందని చాలా మంది వాదించారు. ఇక.. 2018లో అంతర్జాతీయ సహకారానికి, ప్రపంచ ఆర్ధిక వృద్ధిని పెంపొందించడానికి చేసిన కృషికి ప్రతిష్టాత్మక సియోల్ శాంతి బహుమతి మోడీని వరించింది. అప్పటికి 28 సంవత్సరాలలో ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయుడిగా మోడీ నిలిచారు.
ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని 2002లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్, 2009లో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అందుకున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితి, ప్రధాన కార్యదర్శి కోఫీ అన్నన్, 2012లో యూరోపియన్ యూనియన్, 2014లో భారత బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థి, పాకిస్తాన్‌కు చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌లను ప్రతిష్టాత్మక శాంతి బహుమతి వరించింది. మదర్ థెరిసా మానవ సేవకు గాను 1979లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. ఇక అన్ని అనుకూలిస్తే.. ఈ ఏడాది భారత పీఎం మోడీ కూడా నోబెల్ శాంతి పురస్కారం అందుకుంటారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. అదే జరిగితే భారత కీర్తి విశ్వవ్యాప్తం కావడంతోపాటూ ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే స్థానంలో ఇండియా నిలుస్తుందనే చర్చ జరుగుతోంది. మరి నిజంగానే మోడీని నోబెల్ శాంతి బహుమతి వరిస్తుందేమో చూడాలి.
టాక్ ఆఫ్ ది వరల్డ్ : గ్యాంగ్ స్టర్ కు 1310 సంవత్సరాల జైలు శిక్ష
ఎల్ సాల్వెడార్.. ఈ లాటిన్ అమెరికా దేశం క్రైమ్‌కు కేరాఫ్ అడ్రస్. 65 లక్షల జనాభా, వేలల్లో జరిగే క్రైమ్స్, లక్షల సంఖ్యలో క్రిమినల్స్. చీకటిపడిందంటే కత్తులు నెత్తురు చిందిస్తాయి. తుపాకులు అమాయకుల ప్రాణాలు తీసేస్తాయి. సిల్లీ రీజన్లతో సీరియస్‌గా మర్డర్లు జరుగుతాయి. సింపుల్‌గా చెప్పాల్సి వస్తే.. భూమ్మీద ప్రత్యక్ష నరకం చూడాలని ఎవరైనా ఆశపడితే ఎల్ సాల్వెడార్‌కు వెళితే సరిపోతుంది. అది కూడా తిరిగొద్దామనే ఆలోచన లేకపోతేనే. అలాంటి క్రిమినల్ హిస్టరీ ఉన్న ఎల్ సాల్వెడార్ ఓ గ్యాంగ్‌స్టర్‌కు విధించిన శిక్షతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా మారిపోయింది. ఆ క్రిమినల్‌కు ఎన్నేళ్ల జైలు శిక్ష విధించారో తెలుసా? అక్షరాలా 13వందల 10 సంవత్సరాలు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే నిజం.
కేవలం 65లక్షల జనాభా ఉండే ఈ దేశంలో క్రిమినల్స్ సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా లక్షా 50వేలు. అదికూడా అంచనా మాత్రమే. అంతకుమించి ఉంటారనేందుకు ఇటీవల అరెస్టవుతున్న క్రిమినల్స్ సంఖ్యే తేల్చేస్తోంది. అలా అరెస్ట్ అయిన వారిలో ఓ గ్యాంగ్‌స్టర్‌కు విధించిన జైలు శిక్ష ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఎల్ సాల్వెడార్‌లోనే మోస్ట్ వాంటెడ్.పేరు విల్మేర్ సెగోవియా. ఇతడి క్రిమినల్ యాక్టివిటీస్ తెలిస్తే నిలువునా వణుకుపుట్టడం ఖాయం. 33 మందిని నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. మరో తొమ్మిది మంది హత్యకు కుట్రలు పన్నాడు. దొమ్మీలూ, దోపిడీల గురించయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మాదకద్రవ్యాల చీకటి ప్రపంచంలో ఇతడు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అందుకే ఈ ప్రమాదకర గ్యాంగ్‌స్టర్‌కు ఎల్ సాల్వెడార్ న్యాయస్థానం ఏకంగా 1310 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నరహంతకుడు మారా సాల్వట్రుచ గ్యాంగ్‌కు చెందిన షల్టన్ సెల్ సభ్యుడు. ఈ గ్యాంగ్ ఎల్ సాల్వెడార్‌లో ఎన్నో క్రూరమైన నేరాలకు పాల్పడింది. ఈ గ్యాంగ్‌నే ఎంఎస్-13 అని కూడా పిలుస్తారు.
ఇతగాడి క్రిమినల్ హిస్టరీ ఎలా ఉన్నా ఒక నేరస్తుడికి ఏకంగా 13 శతాబ్దాలకుపైగా శిక్ష విధించడం మాత్రం ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఎల్ సాల్వెడార్‌లో ఇలాంటి భారీ శిక్షలు విధించడం కొత్తేం కాదు. విల్మేర్ సెగోవియా కంటే ముందే మరో గ్యాంగ్‌స్టర్‌కు ఈ తరహా జైలు శిక్ష విధించింది ఎల్ సాల్వెడార్ కోర్టు. మిగ్వెల్ ఏంజిల్ పోర్టిల్లో అనే గ్యాంగ్‌స్టర్ మొత్తం 22 క్రూరమైన హత్యా నేరాలు చేశాడు. అంతేగాక పలు హత్యాయత్నాలు, దాడులు, బలవంతపు వసూళ్లలో అతని పాత్ర ఉంది. దాంతో మిగ్వెల్‌కు అక్కడి న్యాయస్థానం ఏకంగా 945 సంవత్సరాల జైలుశిక్ష విధించింది. అయితే, వందేళ్లు కూడా జీవించని వ్యక్తులకు ఇలా సుదీర్ఘ జైలు శిక్షలు విధించడం వెనుక ఓ ఆశక్తికర అంశం ఉంది. ఇలా సుదీర్ఘ శిక్ష పడిన నేరస్తులు శిక్షాకాలం పూర్తి కాకుండా మరణిస్తే.. ఆ శిక్ష పూర్తయ్యే వరకూ మృతదేహాలను నిందితుడి ఫ్యామిలీకి ఇవ్వరు. వాటిని ఫ్రీజర్లలోనే ఉంచి శిక్షాకాలం పూర్తయిన తర్వాతే కుటుంబ సభ్యులకు అందజేస్తారట. దీంతో నేరాల సంఖ్య తగ్గుతుందనేది ఎల్ సాల్వెడార్ నమ్మకంగా చెబుతున్నారు. ఈ విషయాన్ని కాస్త పక్కనపెట్టి ఎంఎస్-13 గ్యాంగ్ విషయానికొస్తే.. ఈ గ్యాంగ్‌లో ఏకంగా 60 వేల మంది వరకు సభ్యులు ఉన్నారని ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు వాళ్లందరినీ జైల్లో పెట్టేందుకు ఒక పక్కా ప్రణాళికను రచిస్తోంది. ఇప్పటికే కొన్ని వేల మంది గ్యాంగ్ సభ్యులు ఎల్ సాల్వెడార్ జైళ్లలో ఉన్నారు. అందుకే ఎల్ సాల్వెడార్ రీసెంట్‌గా ఓ భారీ జైలును నిర్మించి వార్తల్లోకి ఎక్కింది. వందల మంది క్రిమినల్స్ గుంపులుగా వచ్చిపడుతున్న ఈ జైలును ఎల్ సాల్వెడార్ రీసెంట్‌గా నిర్మించింది. ఈ జైలు రాజధాని శాన్ సాల్వెడార్ నుంచి గ్నేయ దిశగా 74 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని భూమ్మీద నిర్మించిన నరకంగా అభివర్ణిస్తారు. ఇప్పటికే వేలమంది ఖైదీలను ఈ జైలుకు పంపారు.
ఇందులో 40వేల మంది క్రిమినల్స్‌ను ఉంచే వీలుంది. అలాంటి జైలు ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. 60వేల మంది క్రిమినల్స్ ఉన్న మారా సాల్వట్రుచ గ్యాంగ్‌లో ఇప్పటివరకూ అరెస్ట్ అయింది దాదాపు రెండువేల మంది మాత్రమే. మిగిలిన క్రిమినల్స్ అందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించాలంటే కొత్తగా నిర్మించిన జైలు లాంటివి మరిన్ని అవసరం అవుతాయి. ఇప్పుడు ఎల్ సాల్వెడార్ అదే పనిలో ఉన్నట్టు ప్రకటించింది. ఉగ్రవాద నిర్బంధ కేంద్రంగా పేరు పెట్టిన కొత్త జైలుకు తొలుత 2వేల మంది ఖైదీలను తరలించారు. వారంతా హత్యలు, దాడులు, వంటి ఘోర నేరాలకు పాల్పడే గ్యాంగ్‌స్టర్లుగా ఎల్ సాల్వెడార్ ప్రకటించింది. మరోవైపు.. ఎల్ సాల్వెడార్ ప్రభుత్వం యాక్షన్‌పై ప్రతిపక్షాలతో పాటూ మానవహక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం రాజకీయ కక్షతోనే పలువురిని అరెస్టు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల హక్కులను బుకెలే సర్కార్ కాలరాస్తోందని మండిపడుతున్నారు. అయితే ఖైదీలకు కోర్టుల్లో తమ వాదనలను వినిపించేందుకు న్యాయవాదులను నియమించుకునే ఛాన్స్ కల్పిస్తామని అధ్యక్షుడు నయీబ్ బుకెలే తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం అమాయకులను అరెస్టు చేస్తుందని, ఎందరో పోలీసు కస్టడీలో మరణించారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎలాంటి వారెంట్లు లేకుండా అరెస్టు చేసినట్టు విమర్శిస్తున్నాయి. కానీ, ప్రభుత్వ చర్యలను ప్రజలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే ఎల్ సాల్వెడార్‌పై వరల్డ్ క్రైమ్ కేపిటల్ అనే ముద్ర చెరిగిపోదంటున్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత స్వేచ్ఛగా రోడ్లు తిరుగుతున్నామంటున్నారు. మరి గ్యాంగ్‌స్టర్లపై బుకెలే సర్కార్ ఇదే దూకుడు కొనసాగిస్తుందేమో చూడాలి.
“నీ అమ్మా మొగుడిచ్చాడా..?” : తమ్మారెడ్డిపై నాగబాబు ఫైర్
ఆస్కార్ దాకా వెళ్ళి ఇప్పటికే అవార్డుల పంట పండించిన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ చుట్టూ ఇప్పటికే పలు వివాదాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా చుట్టూ మరో భారీ గొడవ మొదలైంది. ప్రముఖ సినిమా ప్రొడ్యూసర్ కమ్ క్రిటిక్ తమ్మారెడ్డి భరద్వాజ.. ఆర్ఆర్ఆర్ సినిమా చుట్టూ ఈ వివాదం చక్కర్లు కొడుతుండగా.. మధ్యలో ఎంటరైన మెగా బ్రదర్ నాగబాబు చేసిన సంచలన కామెంట్లతో ఈ వివాదం తుఫాన్ లా మారింది. ఏదో ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ ప్రమోషన్ల కోసం 80 కోట్లు ఖర్చు చేశారనీ.. ఆ డబ్బుతో కనీసం 10 కొత్త సినిమాలు తీయవచ్చనీ కామెంట్లు చేశారంటూ ఓ వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. దీనిపై నాగబాబు తీవ్రంగా రియాక్ట్ కావటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.
తమ్మారెడ్డి కామెంట్లపై రియాక్ట్ అయిన నాగబాబు.. “80 కోట్లు ఖర్చు పెట్టారా.. నీ అమ్మా మొగుడిచ్చాడా 80 కోట్లు..?” అంటూ ఫైర్ అయ్యాడు. అసలు తమ్మారెడ్డి భరద్వాజ ఆర్ఆర్ఆర్ సినిమాపై ఇలాంటి కామెంట్లు చేశాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో నాగబాబు ఇలా రియాక్ట్ కావటం సంచలనంగా మారింది. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్ళని తమ్మారెడ్డి.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇలా మాట్లాడింది నిజమేనా అనేది స్పష్టత వస్తే కానీ.. ఈ వివాదం కొలిక్కి వచ్చేలా లేదు. త్వరలోనే దీనిపై తమ్మారెడ్డి ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.