స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం ఈ రోజు విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకుంది. గుణశేఖర్ మరో అద్భుతమైన విజువల్ వండర్ క్రియేట్ చేశాడని చెప్పుకుంటున్నారు అభిమానులు. సినిమా సంగతి పక్కనపెడితే.. సమంతకు ఉన్న క్రేజ్ మాత్రం టాలీవుడ్ ను షాక్ కు గురి చేస్తోంది. శాకుంతలం విడుదలైన థియేటర్ల దగ్గర సమంత ఫ్యాన్స్ చేసిన హడావుడి చూస్తే.. స్టార్ హీరోలు సైతం అవక్కవ్వాల్సిందే. పెద్ద పెద్ద కటౌట్లు.. బాంబుల మోతలు.. కొబ్బరికాయలు.. పాలాభిషేకాలు.. ఎక్కడ చూసినా ఇదే తంతు. ఇంత పాపులారిటీ తెలుగులో ఒక హీరోయిన్ కు రావటం చాలా చాలా అరుదైన విషయం. ఒక హీరోయిన్ కు కటౌట్లు పెట్టడం.. ఇంత హడావుడి చేయటం గత పది పదిహేనేళ్ళలో కేవలం అనుష్కకు మాత్రమే జరిగింది.. ఇప్పుడు ఆ లిస్టులో సమంత జాయిన్ అయ్యింది.
అరుంధతి సినిమాతో పిచ్చి క్రేజ్ సంపాదించుకున్న అనుష్క.. ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి చేసిన సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను మించిపోయింది. ఇప్పటి వరకు ఒక్క అనుష్కకు మాత్రమే ఇంత పాపులారిటీ కనిపించింది. ఇప్పుడు సమంత దాన్ని మించిపోయేలా కనిపిస్తోంది. శాకుంతలం సినిమాలో సమంత పర్ఫార్మెన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత-శాకుంతలం టాపికే కనిపిస్తోంది. గుణశేఖర్ ఈ సినిమాతో ఓ పెద్ద కమర్షియల్ బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. సమంత కూడా ఈ సినిమాతో కెరీర్ లో ఓ మెట్టు పైకెక్కినట్టే. భారీ ఓపెనింగ్స్ దక్కించుకున్న శాకుంతలం.. ఇలాగే కొనసాగితే సమంత కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా మిగిలిపోతుంది.
సమంత ఫాలోయింగ్ మామూలుగా లేదు : ఇంత క్రేజా..!
ట్వీట్ చేస్తే డబ్బులు : ఎలాన్ మస్క్ బంపర్ ఆఫర్
ట్విటర్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ యూజర్లకు ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. ట్విటర్ లో చేసే ట్వీట్ తో డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ప్రకటించాడు మస్క్. ట్విటర్ లో చేసే పోస్ట్ అది ఏదైనా సరే.. స్టోరీ రాయటం.. వీడియో పోస్ట్ చేయటం.. ఇలా ఏది చేసినా దానిపై రెవెన్యూ సంపాదించుకునే మానెటైజేషన్ ను ఇస్తున్నట్టు మస్క్ అనౌన్స్ చేశాడు. అయితే.. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే.. కానీ త్వరలోనే ప్రపంచం మొత్తం ట్విటర్ మానెటైజేషన్ అమలు చేయబోతున్నట్టు కూడా చెప్పాడు. డబ్బులు సంపాదించుకునే క్రియేటర్ నుంచి ట్విటర్ ఎలాంటి కమిషన్ కానీ, రెవెన్యూలో భాగం కానీ తీసుకోబోమని కూడా చెప్పాడు. సంవత్సరం పాటు ట్విటర్ ద్వారా వచ్చే రెవెన్యూ మొత్తం క్రియటర్ కే ఇస్తామనీ.. సంవత్సరం తర్వాత ఆ రెవెన్యూలో కొంత షేర్ ట్విటర్ తీసుకుంటుందని చెప్పాడు.
ఫేస్ బుక్ కూడా మొదట సోషల్ మీడియా షేరింగ్ ప్లాట్ ఫామ్ గానే వచ్చి ఆ తర్వాత డబ్బులు సంపాదించి పెట్టే కమర్షియల్ ప్లాట్ ఫామ్ గా మారింది. ప్రస్తుతానికి యూట్యూబ్, ఫేస్ బుక్ అతిపెద్ద సోషల్ మీడియా ఎర్నింగ్ ప్లాట్ ఫామ్ లు. ఇప్పుడు ట్విటర్ కూడా మానెటైజేషన్ ఇచ్చేసింది. ట్విటర్ మానెటైజేషన్ వెనుక మస్క్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ట్విటర్ ను లాభాల బాట పట్టించటంతో పాటు సోషల్ మీడియా మార్కెట్లో మరింత బలంగా ట్విటర్ ను మార్చేందుకే మస్క్ ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఏది ఏమైనా.. ట్విటర్ మానెటైజేషన్ తో కంటెంట్ క్రియేట్ చేసే వారి సంఖ్య పెరగటంతో పాటు ట్విటర్ అకౌంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
కరోనా డేంజర్ బెల్స్ : మళ్ళీ మాస్క్ లు తప్పనిసరి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్ళీ పెరగటం సర్వత్రా ఆందోళనకు కారణమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో రాష్ట్రాలకు గైడ్ లైన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ పెంచాలని ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య ఊహించనంతగా పెరిగిపోయాయి. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. జ్వరం, దగ్గు, తుమ్ములు ఉన్న వాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ.. వీలైతే ఇంటి నుంచి పని చేసే ప్రయత్నం చేయాలంటూ సూచించింది. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా కరోనా పరిస్థితులను మరోసారి సమీక్షించింది.
అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం కరోనా గురించి మరీ అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. కరోనా కేసులు పెరగటం అనేది పరీక్షలు చేయటంపై ఆధారపడి ఉన్నదని.. ఎంత ఎక్కువ పరీక్షలు చేస్తే అన్ని పాజిటివ్ కేసులు నమోదు అవుతాయని చెప్తున్నారు. కరోనా వైరస్ మన శరీరంలో లేదని చెప్పలేమనీ.. ఎక్కువ మంది శరీరాల్లో వైరస్ ఉంది కానీ రోగ నిరోధక వ్యవస్థ మెరుగైన స్థితిలో ఉండటం వల్ల వైరస్ మనల్ని ఏమీ చేయలేకపోతున్నదని అంటున్నారు. అయితే.. జ్వరం, దగ్గు, తుమ్ములు వంటి లక్షణాలు ఉన్న వారు మాత్రం కనీసం జనంతో కలవకుండా ఉండటం ఖచ్చితంగా చేయాలంటున్నారు. దీని వల్ల కరోనా కొత్త కొత్త వేరియంట్ల వ్యాప్తి తగ్గుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం. ఇప్పటికిప్పుడు కరోనా వల్ల వచ్చిన ముప్పేమీ లేదనీ.. కాకపోతే వయసు మీద పడిన వాళ్ళు, ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకు మాత్రం ఇది ప్రమాదమేనని చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు : ఒప్పుకున్న చంద్రబాబు ?
ఏపీలో పొత్తులపై జనసేన, తెలుగుదేశం పార్టీ ఇదివరకే ఫుల్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. కలిసే ఎన్నికలకు వెళ్తామని రెండు పార్టీల నుంచి స్పష్టత వచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకూ సీట్ల పంపకాల విషయంలో మాత్రం అటు పవన్ కళ్యాణ్ కు, ఇటు చంద్రబాబుకు ఏ క్లారిటీ లేదు. జనసేన కోసం పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు అడుగుతున్నాడు.. వాటిలో తెలుగుదేశం పార్టీ గెలిచే సీట్లు ఎన్ని.. ఎన్ని స్థానాలను వదులుకోటానికి చంద్రబాబు ఒప్పకున్నాడు.. ఇలాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు. పొత్తు ఖరారైనా ఇప్పటికీ సీట్ల పంపకాల విషయంపై అధికారికంగా ప్రకటన రాకపోయినా.. ప్రస్తుతం ఓ వార్త మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జనసేన, టీడీపీ రెండు పార్టీల కీలక వ్యక్తుల మధ్య సీట్ల పంపకం విషయంలో భేటీ జరిగిందనేది ఆ వార్త సారాంశం.
కులం ప్రాతిపదికన తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చాలా వరకు సీట్లను జనసేన అడిగిందని సమాచారం. గోదావరి జిల్లాల్లో పవన్ కు మద్దతు ఎక్కువ కాబట్టి ఆ రెండు జిల్లాలో అధిక శాతం స్థానాలను జనసేన అడిగిందట. ఇక రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సామాజికవర్గం అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొనే సీట్ల పంపకానికి ప్రతిపాదనలు జరిగినట్టు తెలుస్తోంది. ఇదంతా పక్కనపెడితే.. మొదటి రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది జనసేన ప్రధాన డిమాండ్ అని సమాచారం. ఒంటరిగా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే గెలుపు కాస్త కష్టమే అన్న రాజకీయ విశ్లేషకుల అంచనాలు బలంగా వినిపిస్తున్న వేళ.. జనసేనను పక్కన పెట్టి టీడీపీ ఒంటరి పోరు చేయదు. అలాంటప్పుడు జనసేన రెండున్నరేళ్ళ పాటు సీఎం సీటు అడగటంలో తప్పేమీలేదన్న మాట కూడా వినిపిస్తోంది. కాకపోతే చంద్రబాబు ఈ డిమాండ్ కు ఒప్పుకున్నాడా లేదా అనేదానిపై స్పష్టత మాత్రం లేదు.
ఎన్టీఆర్ పార్టీలో అమేజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ స్టార్లుగా మారిపోయారు. ప్రపంచవ్యాప్తంగా పేరుమోసిన ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళను కలిసేందుకు రావటం మామూలైపోయింది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ ఇంట్లో జరిగిన ఓ పార్టీకి అమేజాన్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫరెల్ హాజరు కావటం టాలీవుడ్ కి అట్రాక్షన్ గా మారింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ సక్సెస్ పార్టీలు ఇవ్వటం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన స్పెషల్ పార్టీకి రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ కూడా హాజరయ్యారు. మరి కొంత మంది టాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ పార్టీలో పార్టిసిపేట్ చేశారు. జేమ్స్ ఫరెల్ తో కలిసి టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ 30 వ సినిమా తెరకెక్కుతోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఎన్టీఆర్30లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల ఉంటుందని యూనిట్ ఇదివరకే అనౌన్స్ మెంట్ చేసింది. ఆస్కార్ యాక్టర్ కావటంతో ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల కానున్న ఎన్టీఆర్30కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
రేవంత్ రెడ్డికి మరో షాక్ : బైబై చెప్పిన మహేష్ రెడ్డి
ఎప్పుడూ ఎదో ఒక వివాదంతో సతమతమయ్యే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి.. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పెద్ద షాక్ తగిలింది. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్న ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ అయిన సీనియర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖను పంపటం.. దానికి ఆమోదం పడిపోవటం.. బీజేపీలో చేరటం చకచకా జరిగిపోయాయి. దీంతో రేవంత్ రెడ్డి మరో సీనియర్ లీడర్ ను పోగొట్టుకున్నట్టయింది. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నుంచి నోటీసులు అందుకున్న కొద్ది గంటల్లోనే మహేశ్వర్ రెడ్డి తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరిపోయారు. రేవంత్ రెడ్డిపై కోపంతోనే మహేశ్వర్ రెడ్డి ఈ పనిచేసినట్టు ఆయన క్యాడర్ చెప్తోంది.
కాంగ్రెస్ లో ఉంటూ సొంత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడనీ.. బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నాడని కొద్ది రోజుల నుంచి మహేశ్వర్ రెడ్డి విషయంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై సమాధానం చెప్పాలంటూ టీపీసీసీ నుంచి షోకాజ్ నోటీసు వచ్చింది. దీంతో ఆగ్రహించిన మహేశ్వర్ రెడ్డి వెంటనే పార్టీకి రాజీనామా చేశాడు. త్వరలోనే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరబోతున్నాడనే వార్తలు గత వారం రోజులుగా జోరుగా వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిపోయాడు.
చైనాకు షాకిచ్చిన యాపిల్ : ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ
ప్రపంచ తయారీ హబ్ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు చైనా. ఇది ఎవరూ కాదనలేని నిజం. కానీ, భవిష్యత్ మాత్రం ఆ దేశానిది ఎంత మాత్రం కాదు. ఎందుకంటే తయారీ రంగంలో డ్రాగన్‌కు ఇప్పుడు పోటీ పెరుగుతోంది. అదికూడా ఇండియా నుంచి. భారత్ ఎప్పట్నుంచో చైనా స్థానాన్ని భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఇండియాకు ఆ దిశగా అవకాశాలు పెరుగుతున్నాయి. ఇదే సమయంలో చైనాకు అవకాశాలు క్రమంగా దూరమవుతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ భారత్ ఎంట్రీనే. అదికూడా చైనా మ్యానుఫాక్చరింగ్‌ను తలదన్నే స్థాయిలో ఇండియాలో యాపిల్ కార్యాచరణ ఉండబోతోంది. యాపిల్‌తో పాటూ మరిన్ని అంతర్జాతీయ బ్రాండ్స్ డ్రాగన్‌కు గుడ్‌బై చెప్పడానికీ, భారత్‌లో ఎంట్రీ ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాయి.
తయారీ రంగంలో భారత్‌కు ఉన్న అవకాశాలపై ఇటీవలే గోద్రెజ్ అండ్ బోయ్స్ ఛైర్మన్ జంషీద్ నౌరోజీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నరేళ్లలో కరోనా, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వంటి పరిణామాలు వ్యాపారాలను దెబ్బతీశాయని తెలిపారు. దానివల్ల భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అద్భుతమైన అవకాశం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఇప్పటికే చాలా కంపెనీలు చైనా నుంచి తయారీని ఇతర ప్రాంతాలకు మార్చే పనిలో ఉన్నాయని.. మరిన్ని కంపెనీలు కూడా అదే ఆలోచనలో ఉన్నాయన్నారు. కాబట్టి తయారీకి అనువైన హబ్‌గా భారత్ ఎక్కువమందికి ఆకర్షణంగా మారిందని వివరించారు. తయారీ రంగంలో ఉండే సవాళ్లను అధిగమించేందుకు, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని తెలిపారు. తయారీకి అత్యంత సామర్థ్యం కలిగి ఉండాలని.. దానికి తోడు వ్యాపారం ఇబ్బందుల్లేకుండా కొనసాగేందుకు సరఫరాదారులు, తయారీదారుల మధ్య పరస్పర భాగస్వామ్యం ఎంతో ముఖ్యమన్నారు. ముఖ్యంగా సరఫరాలో సమస్యలు తలెత్తకూడదని నౌరోజీ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో కాకుండా గ్రామ స్థాయిలోనూ అందుకవసరమైన అవగాహన ఉండాలని అన్నారు.
నౌరోజీ చెప్పారని మాత్రమే కాదు.. తయారీ రంగంలో ఇండియాకు చైనాను చేరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయనేది అంతర్జాతీయ నిపుణుల మాట. ఎందుకంటే అగ్రరాజ్యం హోదాలో ఉన్న అమెరికా ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. రోజురోజుకు అమెరికన్ డాలర్ వినియోగాన్ని ఇతర దేశాలు తగ్గిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలు కూడా తమ సొంత కరెన్సీలోనే జరుపుతున్నాయి. తొలుత రష్యా మొదలు పెట్టగా అదే బాటలో చైనా, బ్రెజిల్ అడుగులేశాయి. ఇప్పుడు భారత్ కూడా మున్ముందు ఆ దేశాలలాగే ఎగుమతులు, దిగుమతులు చేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అదే జరిగితే భారత్ కరెన్సీ విలువ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక అత్యధిక విదేశీ కంపెనీలు ఉన్న చైనాలో కూడా అనుకూల పరిస్థితులు లేక భారత్ బాట పడుతున్నాయి. ఈ తరుణంలో భారత్ తయారీ రంగంలో ఉన్నత హోదాను పొందడానికి ఎక్కువ సమయం పట్టదనేది నమ్మలేని నిజం. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇండియాకు స్మార్ట్ ఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది.
భారత్‌లో యాపిల్ మొట్టమొదటి రిటైల్ స్టోర్ ప్రారంభానికి టైం ఫిక్స్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ తొలి స్టోర్‌ను ముంబైలోని బంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసింది. ఈ స్టోర్‌ను ఈ నెల 18న ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. అలాగే, ఈ నెల 20న ఢిల్లీలోనూ మరో స్టోర్ ప్రారంభించనున్నట్టు యాపిల్ ప్రకటించింది. ఈ రెండు స్టోర్స్ ప్రారంభోత్సవానికి యాపిల్ సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యే అవకాశం ఉంది. రిటైల్ స్టోర్ల ఓపెనింగ్ కోసం టిమ్ కుక్ వస్తున్నారన్న వార్తలను బట్టి.. ఐఫోన్లు సహా ఆపిల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి, మార్కెటింగ్ విషయంలో భారత మార్కెట్‌కు ఆ గ్లోబల్ కంపెనీ ఎంత ప్రాధాన్యతను ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. అయితే, టిమ్ కుక్ పర్యటనను యాపిల్ ఇంకా అధికారంగా ప్రకటించలేదు. మరోవైపు.. 2016లో ఆపిల్ CEO తొలిసారి భారత్‌కు వచ్చారు. మళ్లీ ఏడు సంవత్సరాల తర్వాత ఇండియాలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనే కనుక నిజమైతే భారత్‌లో యాపిల్ కార్యాచరణ అంతకుమించి ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
వాస్తవానికి భారత ఐఫోన్‌ల విక్రయాలు ఆల్‌టైమ్ హైకి చేరాయి. మన దేశం నుంచి వార్షిక ఐఫోన్ ఎగుమతులు బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. బీజింగ్, వాషింగ్‌టన్ మధ్య వాణిజ్య సంబంధాలు చెడిపోవడం, జిన్‌పింగ్ సర్కార్ నియంతృత్వ నిర్ణయాలతో చైనాను మించిన అసెంబ్లింగ్ కార్యకలాపాలను విస్తరించేందుకు యాపిల్ కంపెనీ భారత్ వైపు చూస్తోంది. వాస్తవానికి, ఈ రెండు స్టోర్లను చాలా కాలం క్రితమే ఓపెన్ చేయాల్సి ఉంది. దేశీయ అమ్మకాల్లో ఎక్కువ మొత్తాన్ని దేశీయంగా తయారు చేయని గ్లోబల్ కంపెనీలు తమ సొంత బ్రాండ్ అవుట్‌లెట్‌లను మన దేశంలో ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన నియమాలు విధించింది. దీంతో ఈ రెండు స్టోర్లు చాలా కాలంగా పెండింగ్ ఉన్నాయి. దేశీయంగా ఇప్పటి వరకు ఫిజికల్ స్టోర్‌ను ప్రారంభించలేకపోయినా, ఇండియన్ ఆన్‌లైన్ స్టోర్‌ను 2020లోనే ఆపిల్ ప్రారంభించింది. మన దేశం ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటిగా ఉంది. ఫలితంగా యాపిల్ ఇండియావైపు చూస్తున్నట్టు ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
మరోవైపు.. ముంబై, ఢిల్లీ స్టోర్ ప్రారంభోత్సవాల మధ్య ఉన్న గ్యాప్‌లో, ప్రధాని మోడీతో టిమ్ కుక్ సమావేశం కానున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఇందుకోసం ప్రధాని మోడీని సమయం కేటాయించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. నిజానికి.. భారత్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మార్చేందుకు మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, ఈ విభాగంలోకి వచ్చే కంపెనీలను అధికంగా ప్రోత్సహిస్తోంది. యాపిల్ తయారీ భాగస్వాములైన ఫాక్స్‌కాన్, పెగాట్రాన్ కోసం బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందించింది. ఈ క్రమంలోనే యాపిల్ ఎర్నింగ్స్ కాల్స్‌లోనూ భారత మార్కెట్, ఉత్పత్తి కేంద్రంగా భారతదేశ ప్రాముఖ్యత గురించి టిమ్‌కుక్ ప్రస్తావించారు. త్రైమాసిక ఆదాయ రికార్డును భారత్ నెలకొల్పింది, గతేడాది కంటే బలమైన రెండంకెల వృద్ధిని సాధించిందని అన్నారు. భారతదేశం తమకు అత్యంత ఉత్తేజకరమైన మార్కెట్ అనీ, తమ ప్రధాన దృష్టి ఇండియాపైనే అని కుక్ ఇటీవలే చెప్పారు.
ముంబై, ఢిల్లీ స్టోర్‌లు మాత్రమే కాదు.. యాపిల్ ఉత్పత్తుల్లో మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా భారత్ అవతరించడానికీ రంగం సిద్ధమవుతోంది.దేశీయ మార్కెట్లో నమ్మికైనా టాటా గ్రూప్ బెంగళూరులోని విస్ట్రాన్ ఐఫోన్ ప్లాంట్‌ను ఈ నెల చివరి నాటికి కొనుగోలు చేసే ఛాన్స్ ఉందని నివేదికలు చెప్తున్నాయి. ఇదే జరిగితే యాపిల్ ఉత్పత్తుల కోసం భారతదేశం మొదటి స్వదేశీ ఉత్పత్తి శ్రేణిగా అవతరిస్తుందనటంలో సందేహం లేదు. టాటా గ్రూప్ ఈ కంపెనీని సొంతం చేసుకున్న తర్వాత ఐఫోన్15ను తయారు చేసే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విస్ట్రాన్ ప్లాంట్‌లోని ఎనిమిది ఉత్పత్తి లైన్లలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 14 తయారవుతున్నాయి. టాటా బెంగళూరు ప్లాంట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత, యాపిల్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే ఏకైక ప్లాంట్ విస్ట్రాన్ పూర్తిగా దేశీయ మార్కెట్‌కు దూరంగా ఉంటుంది. ఇవన్నీ టాటా గ్రూప్ సొంతమవుతాయి. యాపిల్ ఉత్పత్తులకు భారతీయ మార్కెట్ సుమారు 600 మిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. ఈ టేకోవర్ ఒక ముఖ్యమైన పరిణామంగా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా యాపిల్ చైనా నుండి షిఫ్ట్‌ను ప్లాన్ చేస్తున్న కారణంగానే ఇండియాలోని ప్లాంట్ టాటా గ్రూప్ స్వాధీనం చేసుకునే అవకాశం ఏర్పడింది.
గతేడాది కాలిఫోర్నియాకు చెందిన కుపెర్టినో కంపెనీ చైనా, అమెరికా మధ్య విభేదాలు ఏర్పడిన కారణంగా తమ ఉత్పత్తిలో 25శాతం భారతదేశానికి మార్చాలని దాని కోసం తన ప్రణాళికలను కూడా ప్రకటించింది. మన దేశంలో యాపిల్ ఉత్పత్తులను అసెంబ్లింగ్ చేసే మూడు తైవాన్ కంపెనీలలో విస్ట్రాన్, పెగాట్రాన్, ఫాక్స్‌కాన్ వున్నాయి. ఇప్పుడు విస్ట్రాన్‌లో కంపెనీ ఉత్పత్తులు నిలిపివేయగా.. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్లలో ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. అయితే భారత్‌లో టాటా మోటార్స్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. దీనికోసం కొత్త ఉత్పత్తులను ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇది మాత్రమే కాకుండా ఐఫోన్ కోసం పెగాట్రాన్ తయారీ యూనిట్లను టాటా కొనుగోలు చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
వాస్తవానికి.. యాపిల్ ఉత్పత్తుల్లో చైనా బయట తయారీ జరుగుతోంది కేవలం 5శాతం మాత్రమే. మిగిలిన 95శాతం ఉత్పత్తి చైనా కేంద్రంగానే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియాలో తమ కార్యకలాపాలతో ఆ పరిస్థితులు మార్చాలని యాపిల్ భావిస్తోంది. యాపిల్ సీఈవో తాజా పర్యటనలో మోడీతో భేటీ అంటూ జరిగితే ఆ దిశగానే చర్చలు జరిగే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అదే నిజం అయితే ప్రధాని మోడీ సైతం పాజిటివ్‌గానే రియాక్టయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం బీజేపీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా 2.ఓ లో భాగంగా 27 రంగాలపై దృష్టి సారిస్తోంది. వాటిలో 15 తయారీ, 12 సేవా రంగాలు ఉన్నాయి. ఫర్నీచర్, అగ్రి ప్రోడక్ట్స్, టెక్స్‌టైల్, రోబోటిక్స్, టెలివిజన్, అల్యూమినియం రంగాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం భారత తయారీ రంగం దేశ జీడీపీలో 15-16శాతం వాటా కలిగి ఉంది. రానున్న సంవత్సరాల్లో దీన్ని 25శాతానికిపైగా తీసుకెళ్లాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మోడీ సర్కార్ తాజా లక్ష్యాలకు యాపిల్ ఎంట్రీ ఓ కీలక ముందడుగుగా చెబుతున్నారు.
ఇండియన్ పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ : కాంగ్రెస్ కు అండగా నితీష్
వందేళ్ళకు పైదా చరిత్ర కలిగిన ఇండియన్ సీనియర్ మోస్ట్ పొలిటికల్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అండగా జనతాపరివార్ ఏకం అయింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన జేడీయూ ఇప్పుడు యూపీఏ పక్షాన నిలుస్తోంది. అందుకు సంకేతంగా ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి జనతాపరివార్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని, ప్రత్యేకించి మోడీని ప్రధాని పదవి నుంచి తొలగించడానికి అందరూ ఐక్యంగా ముందుకు నడవాలని ఆ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ చైర్ పర్సన్ తేజస్వీ యాదవ్ హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్ ఏర్పాటుకు ఈ సమావేశం నాంది పలుకుతుందంటున్నారు. కాంగ్రెస్, జనతాదళ్, రాష్ట్రీయ జనతాదళ్ అగ్ర నాయకులు అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయాలని నిర్ణయించారు.
జేడీయూ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్, ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ మనోజ్ కుమార్ ఝా, కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తదితరులు పాల్గొన్న ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా విపక్షాలు భావిస్తున్నాయి. దీన్నో చారిత్రక సమావేశంగా కాంగ్రెస్ చెబుతోంది. రాబోయే ఎన్నికల కోసం ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుంది. ఆ విషయాన్ని ఒకరోజు ముందే సోనియగా చెప్పగా.. తాజాగా ఖర్గే, రాహుల్ సైతం అవే కామెంట్స్ చేశారు. విపక్ష పార్టీలన్నింటితో కలిసి వచ్చే సార్వ త్రిక ఎన్నికలకు వెళ్లనున్నట్టు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన అడుగు ఢిల్లీ వేదికగా తాజా సమావేశం ద్వారా పడినట్టు రాహుల్ భావిస్తున్నారు. ఇదో ప్రక్రియ గా చెబుతూ దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని పెంచుతుందని అన్నారు.
మరోవైపు.. ఖర్గే సైతం తాజా భేటీని చారిత్రాత్మక సమావేశంగా అభివర్ణించారు. 2024లో బీజేపీ ని ఢీకొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి, కలిసి కట్టుగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. ఆ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేతలు ప్రజల గొంతును పెంచడానికి, దేశానికి కొత్త దిశను అందించడానికి ప్రతిజ్ఞ జరిగిందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, దేశాన్ని కాపాడతాం అంటూ హిందీలో ట్వీట్ చేస్తూ విపక్షాలను ఆకర్షించారు.
బిహార్ సీఎం నితీశ్ గతేడాది నుంచే కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాల ఐక్యత దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నితీష్ 2022 సెప్టెంబర్‌లోనూ ఢిల్లీకి వెళ్లారు. శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, డి.రాజాం, సీతారం ఏచూరి, అఖిలేష్ యాదవ్ తదితర నేతలతో వరుస భేటీలు నిర్వహించారు. గత ఫిబ్రవరిలో సీపీఐ 11వ జనరల్ కన్వెన్షన్‌లోనూ నితీష్ పాల్గొంటూ, విపక్ష ఐక్య ఫ్రంట్ ఏర్పాటు ఆవశ్యకతను బలంగా చెప్పారు. సమష్టిగా పోరాడితే బీజేపీని 100 సీట్లకు పరిమితం చేయచ్చని తెలిపారు. తాజా సమావేశంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించాలన్న అభిప్రాయంతో ఉన్న విపక్ష పార్టీల నేతలతో మాట్లాడి వారిని కలుపుకునే బాధ్యతను పూర్తిగా నితీష్ తన భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది.
బిహార్ బీజేపీ అధ్యక్షుడు మాత్రమే కాదు.. నితీశ్ యాక్షన్‌పై కమలం పార్టీ ముందు నుంచీ ఇవే విమర్శలు సంధిస్తోంది. అయితే, ప్రధాని కావాలన్న ఆశలు తనకు లేవని నితీష్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. కానీ, ప్రధాని రేసులో చాలాకాలంగా నితీశ్ పేరు వినిపిస్తోంది. బాగా వెనకబడి ఉన్న బీహార్‌ను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించారనే పేరు నితీష్‌కు ఉంది. అవినీతి లేని పాలన.. మిస్టర్ క్లీన్ ఇమేజ్ నితీశ్ సొంతం. తనకున్న పాజిటివ్ ఇమేజ్‌తో భవిష్యత్తులో తానే ప్రధాని కాగలననేది నితీష్ మనసులో మాటగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తనకు ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకునే ఎత్తుగడలో ఉన్నారాయన. అందుకే, బీఆర్ఎస్ లాంటి వాటి వెనక తాను పడకుండా.. ఎప్పటికైనా బీజేపీ వ్యతిరేక పార్టీలు తన వెంటే నిలుస్తాయనే ధీమాతో ఉన్న నితీశ్.. మొదటినుంచీ ఎలాంటి కూటములను ప్రోత్స హించడం లేదనే చర్చ జరుగుతోంది. తాజా యాక్షన్ కూడా ఇందులో భాగమే అయ్యుండచ్చే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించారు కాబట్టి నితీశ్ ప్రధాని రేసులో లేనట్టు కాదు.
ఎందుకంటే కాంగ్రెస్ నేతృత్వంలో నడవడానికి మెజారిటీ పార్టీలు ఓకే చెప్పినా రాహుల్‌ను ప్రధాని చేయడానికి మాత్రం అంగీకరించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఒకవేళ విపక్ష పార్టీలు ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ ను కాదనే పరిస్థితే వస్తే నితీశ్ కుమార్‌కే అవకాశం వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం విపక్ష పార్టీల్లో మిస్టర్ క్లీన్‌గా బిహార్ సీఎంకు పేరుండడం ఒకటయితే, బీజేపీపై పోరాటంలో విపక్ష పార్టీలను ఏకం చేయడంలోనూ కీలక పాత్ర పోషించడం కూడా అనే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే నితీశ్ కుమార్ ఐక్యతారాగం అందుకుంటున్నారనేవారు కూడా లేకపోలేదు. అయితే, బీజేపీని ఢీకొట్టడానికి హస్తానికి షేక్‌హ్యాండ్ ఇచ్చేదెవరు? హ్యాండ్ ఇచ్చేదెవరనే దానిపైనే విపక్షాల ఐక్యతయినా, నితీశ్ ప్రధాని ఆశలైన సజీవంగా ఉండేది.
విపక్షాల ఐక్యతపై కొన్ని పార్టీలు తమ స్టాండ్‌ను క్లియర్ చేయగా.. మరికొన్ని పార్టీలు మిక్సిడ్ సంకేతాలే ఇస్తున్నాయి. ఉదాహరణకు తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తొలుత ప్రకటించింది. నార్త్‌ఈస్ట్ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్, బీజేపీల మధ్య కుదిరిన అవగాహన వల్లే ఓటమి జరిగిందని తృణమూల్ ఆరోపించింది. అయితే, రాహుల్ గాంధీ తన మోడీ ఇంటిపేరు వ్యాఖ్యపై క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత పార్టీ తనవైఖరిని మార్చుకుంటున్నట్లు కనిపించింది. వెంటనే, బెనర్జీ ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి బిజెపిని అధికారంనుండి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఏదైనా ఫ్రంట్‌లో చేరడంపై తన స్టాండ్‌ను ఇంకా స్పష్టం చేయని మరో కీలక ప్రతిపక్ష శక్తి ఆమ్ ఆద్మీ పార్టీ. ఆ పార్టీకి ఇటీవల జాతీయ హోదా లభించి ఢిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉంది. ఈ నెల మొదట్లో మీడియాతో మాట్లాడిన అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ఐక్యత ముఖ్యం అనీ, ప్రతిపక్ష ఐక్యత కాదని అన్నారు. ఒకరిని ఓడించేందుకు కలిసి వచ్చామని పార్టీలు చెబితే ప్రజలకు నచ్చడం లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి ప్రతిపక్ష ఫ్రంట్ కోసం ఎత్తుగడలు వేసింది కానీ అందులో కాంగ్రెస్‌ను కోరుకోవడం లేదు. ఇక.. మరో కీలక సీనియర్ నేత శరద్ పవార్ అయితే ఇటీవల బీజేపీకి ఫేవర్‌గా కామెంట్ చేయడం విపక్షాల ఐక్యతను గట్టిగానే ప్రశ్నించింది.
ఇలాంటి సమయంలో విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఎంతవరకూ ఎదుర్కోగలుగుతాయనేదే మిలియన్ డాలర్ల ప్రశ్న. నితీశ్ కుమార్ తాజా ప్రయత్నాలు ఫలించి ఏకతాటిపైకి వచ్చినా సీట్ల సర్ధుబాటు దగ్గర నుంచి ప్రధాని అభ్యర్ధి ఎవరనేదాని వరకూ ఒక్క మాటపై నిలబడ్డం అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఒకవేళ 2024 ఎన్నికల సమయం వరకూ ఐక్యత ప్రయత్నాలే కొనసాగి అందులో విఫలమైతే మొత్తానికే ఎసరొచ్చే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు. ఈ ప్రయత్నాలు చేసి ఐక్యత సాధించడంలో విఫలమైతే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం కూడా ఎదురు కావొచ్చు. మరి ఈ అంశంలో నితీశ్ కుమార్ ఎంతవరకూ విజయం సాధిస్తారో చూడాలి.
విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ “సింగరేణి” స్కెచ్
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకోగా.. తాజాగా స్టీల్ ప్లాంట్ ను కొనుక్కోవాలనుకునే వారి కోసం కేంద్రం టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ టెండర్లలో బిడ్ దాఖలు చేయటం సంచలనంగా మారింది. తన రాష్ట్రంలోని స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు ఏపీ ప్రభుత్వమే ఏ ప్రయత్నమూ చేయని సమయంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సింగరేణి కాలరీస్ సంస్థ నుంచి టెండర్లలో బిడ్ దాఖలు కావటం అందరికీ షాకిచ్చింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. తాము విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనే పరిస్థితుల్లో లేమంటూ క్లారిటీ ఇచ్చింది. అసలు తెలంగాణ నుంచి టెండర్ లో బిడ్ రావటం వెనుక కేసీఆర్ మాస్టర్ స్ట్రేటజీ ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను కనుక కేసీఆర్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళకుండా ఆపగలిగి సింగరేణి సొంతం అయితే కనుక అటు ఏపీ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ గురించి చర్చ జరగటం ఖాయం. దీంతో జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీకి కావాల్సినంత మైలేజీ వస్తుంది. బీజేపీకి ఎదురుగాలి కూడా తప్పదు. తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేసినప్పుడు ఇదే అంశాన్ని రాజకీయంగా గట్టిగానే వాడుకోవచ్చు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవటం ఎలాగో మిగితా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసినట్టు అవుతుంది.. అలాగే చాలా పార్టీలు బీఆర్ఎస్ తో చేతులు కలపేందుకు రెడీ అవుతాయి. ఇంత పొలిటికల్ మైలేజీ ఉంది కాబట్టే కేసీఆర్ సింగరేణితో విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేసేందుకు బిడ్ వేయించారని రాజకీయ విశ్లేషకుల భావన.
రైతు కొడుకును పెళ్ళి చేసుకుంటే అమ్మాయికి 2 లక్షల బహుమతి
ఎన్నికల వేళ కర్ణాటకలో ఫ్రీ పథకాల ప్రచారం జోరందుకుంది. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత కుమారస్వామి ఓ విచిత్రమైన పథకాన్ని అనౌన్స్ చేశారు. రైతు కొడుకును పెళ్ళి చేసుకున్న అమ్మాయికి ప్రభుత్వం తరఫున 2 లక్షల బహుమతి అందజేస్తామని సరికొత్త పథకాన్ని ప్రకటించాడు కుమారస్వామి. రైతుల కొడుకులను పెళ్ళి చేసుకునేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపించటం లేదనీ.. కాబట్టే రైతుల ఆత్మాభిమానాన్ని పెంచటానికి.. వారి విలువ అమ్మాయిలకు తెలిసి రావటానికే ఈ పథకాన్ని ప్రకటించానంటూ క్లారిటీ ఇచ్చాడు కుమార స్వామి.
నిన్న కోలార్ లో జరిగిన పంచరత్న ప్రచార ర్యాలీలో కుమారస్వామి కొత్త పథకాన్ని ప్రకటించారు. రైతుల కుమారులను పెళ్ళి చేసుకోటానికి ఈ కాలం అమ్మాయిలు ఆసక్తి చూపటం లేదని.. ఏదో ఒకటి చేయండి అంటూ తనకు కొంత మంది రైతులు వినతి పత్రం అందజేశారనీ.. అందుకే ఈ పథకాన్ని ప్రకటించానని క్లారిటీ ఇచ్చాడు.
మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఇప్పటికే జేడీఎస్ 93 మంది పేర్లతో అభ్యర్థుల జాబితా విడుదల చేయగా.. బీజేపీ మాత్రం ఇంకా కుస్తీలు పడుతూనే ఉంది. కర్ణాటక బీజేపీ అగ్రనేతలు యడ్యూరప్ప, బస్వరాజ్ బొమ్మ, నళిన్ కుమార్ నాలుగు రోజులుగా ఢిల్లీలోనే బీజేపీ అధిష్టానంతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తన తొలి జాబితా ఇప్పటికే విడుదల చేయగా.. బీజేపీ ఈ రోజు రాత్రికల్లా తొలి జాబితా విడుదల చేస్తామని చెప్పింది. ఎన్నికల వేళ.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు ఇంకా ఏం విచిత్రమైన పథకాలు ప్రకటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.