కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంపై అనుమానాస్ఫదంగా కనిపించిన బెలూన్ ను అమెరికన్ ఎయిర్ ఫోర్స్ కూల్చి వేసిన విషయం తెలిసిందే. కూల్చివేసిన తర్వాత అది చైనాకు చెందిన నిఘా బెలూన్ అని.. అమెరికా అంతర్గత రహస్యాలు తెలుసుకునేందుకు చైనా పన్నిన కుట్ర అనీ అమెరికా తేల్చింది. బెలూన్ ను కూల్చివేసిన తర్వాత దాని శకలాలను సేకరించిన అమెరికన్ ఇంటలిజెన్స్ అధికారులు బెలూన్ ఏ వివరాలు సేకరించగలిగింది.. ఎలా పనిచేస్తుంది అనే వివరాలు తెలుసుకోగలిగారు. అయితే.. ఆ వివరాలను అమెరికా ఇన్ని రోజులు వెల్లడించలేదు. తాజాగా చైనా స్పై బెలూన్ కు సంబంధించిన వివరాలను అమెరికా అధికారులు భారత ప్రభుత్వానికి అందజేశారు. అమెరికా-భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎక్స్ కోప్ ఇండియా 23 సైనిక విన్యాసాలలో భాగంగా ఢిల్లీలో భేటీ అయిన ఇరుదేశాల సైనికాధికారులు ఈ విషయంపై చర్చించటంతో పాటు నిఘా బెలూన్ వివరాలను అందజేశారు.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌద్రీ, అమెరికన్ పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్ బాష్ మధ్య జరిగిన సమావేశం అనంతరం కెన్నిత్ ఇండియన్ మీడియాతో మాట్లాడారు. చైనా స్పై బెలూన్ కు సంబంధించిన సీక్రెట్ డిటైల్స్ ను భారత అధికారులతో పాటు మరి కొన్ని దేశాలకు కూడా అందజేశామని చెప్పారు. భారతదేశంలోని అండమాన్ సమీపంలో కూడా ఇలాంటి నిఘా బెలూన్ ను మన ఆర్మీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా, భారత్ దేశాలతో చైనాకు ఉన్న సంబంధాలు బలహీనమయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తైవాన్ పై చైనా సైనిక చర్యకు దిగబోతోందన్న వార్తల నేపథ్యంలో భారత్-అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చనున్నాయి. తైవాన్ విషయంలో చైనా హద్దుమీరితే యుద్ధంలోకి అమెరికా సహా నాటో దేశాలు ప్రవేశిస్తాయి. ఇదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు రావచ్చనేది అంతర్జాతీయ విశ్లేషకుల భావన.
భారత్ చేతిలో చైనా స్పై బెలూన్ సీక్రెట్స్
రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి ఈజిప్టు : అమెరికాకు షాక్
దాదాపు 14 నెలలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంత కాలం అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు ఇప్పుడు అమెరికాకు బద్ధ శతృవైన రష్యాకు మద్దతు పలికింది. సుదీర్ఘ యుద్ధం కారణంగా ఆయుధాలు కోల్పోయిన రష్యాకు ఏకంగా 40 వేల రాకెట్లను ఈజిప్టు అప్పజెప్పిందని అమెరికా మీడియా చెప్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత ఫిబ్రవరిలోనే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి రష్యాకు ఆయుధాలు సరఫరా చేయటంపై సైన్యాధికారులతో చర్చించడంతో పాచు ఆ తర్వాత పెద్దమొత్తంలో ఆయుధాలను రష్యాకు తరలించబడ్డాయి. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా అమెరికా తెలుసుకుంది. కానీ అమెరికా బహిరంగంగా ఈ విషయంపై స్పందించలేదు.
ఈజిప్టు చర్య అమెరికాను షాక్ కు గురిచేసింది. కనిక్టికట్ జూనియర్ సెనేటర్ క్రిస్ ముర్ఫీ ఈ విషయంపై స్పందిస్తూ.. నిజంగా ఈజిప్టు కనుక రష్యాకు మద్దతుగా ఆయుధా సాయం చేస్తే.. అది చాలా తీవ్రమైన చర్యగా పరిగణించాలంటూ వ్యాఖ్యానించాడు. ఈ చర్య అమెరికాతో పాటు ఈజిప్టు దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించాడు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ ఏడాది జనవరి చివరలో కైరోలో ఎల్-సిసితో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఇరుదేశాలు కలిసి ఓ ప్రకటన కూాడా విడుదల చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఈజిప్టు వైఖరి గురించి వెల్లడైన ఈ ప్రకటనలో.. ఈజిప్టు దేశం అమెరికాకు మద్దతుగా మరియు ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్నట్టు తెలిపింది. కానీ ఇప్పుడు రష్యాకు ఆయుధ సాయం చేయటం సంచలనంగా మారింది. అయితే.. రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునే ఈజిప్టు.. ఆహార కొరత నేపథ్యంలో గోధుమల కోటా పెంచినందుకే రష్యాకు ఈజిప్టు ఆయుధాలు సరఫరా చేసినట్టు సమాచారం. కాకపోతే ఈ విషయంపై ఇంకా ఈజిప్ట్ స్పందించలేదు.
30వ తేదీ లోపు చంపేస్తా : సల్మాన్ ఖాన్ కు బెదిరింపు ఫోన్
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరించటం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి ఈ నెల 30వ తేదీ లోపు సల్మాన్ ఖాన్ ను చంపేస్తామంటూ చెప్పటం సంచలనంగా మారింది. ఏకంగా పోలీస్ కంట్రోల్ రూమ్ కే ఫోన్ చేసి బెదిరించటంతో పోలీసులు షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు ఫోన్ కాల్ ను ట్రేస్ చేసే పనిలో పడ్డారు. కాల్ చేసింది ఎవరు.. ఎక్కడి నుంచి చేశారు.. ఆ వ్యక్తి ఒక్కడేనా.. లేక ఏదైనా తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందా.. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ప్రస్తుతం ముంబై పోలీసులు బిజీగా ఉన్నారు. బెదిరింపు ఫోన్ కాల్ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచారు.
అయితే సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు కొత్తేమీ కాదు. మార్చి 18న కూడా ఇలాంటిదే ఓ ఈమెయిల్ సల్మాన్ ఖాన్ కు వచ్చింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి చంపేస్తామంటూ మెయిల్ వచ్చి కలకలం సృష్టించింది. ఇప్పుడు అలాంటిదే మరొకటి. ఈ విషయానికి వస్తే అసలు బాలీవుడ్ ప్రముఖులకు చంపేస్తామంటూ బెదిరింపులు రావటం చాలాసార్లు జరిగింది. కాకపోతే ఇలా వచ్చిన ఫోన్ కాల్స్ లో దాదాపుగా అన్నీ ఆకతాయిల నుంచి వచ్చినవే. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
విదేశాల్లో రాహుల్ గాంధీ అక్రమ వ్యాపారాలు : ఆజాద్ సంచలన ఆరోపణలు
దశాబ్ధాల పాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి.. కశ్మీర్ ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక కీలక పదవులు చేపట్టిన సీనియర్ లీడర్ గులాం నబీ ఆజాద్.. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం రాహుల్ గాంధీ ప్రవర్తన వల్లనే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వస్తోందంటూ ఆరోజున కన్నీటి పర్యంతమైన ఆజాద్.. తాజాగా మరోసారి రాహుల్ పై సంచలన ఆరోపణలు చేశాడు. రాహుల్ గాంధీ తరచూ విదేశాలకు ఎందుకు వెళ్తాడో తెలుసా.. అక్కడ ఎవరెవరిని కలుస్తాడో తెలుసా అంటూ రహస్యాలు బయటపెట్టాడు. రాహుల్ విదేశాల్లో చీకటి వ్యాపారాలు చేసే వాళ్ళను కలిసి వ్యాపార లావాదేవీలు చేస్తాడంటూ ఆజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. ఆజాద్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
రాహుల్ గాంధీ తరచుగా విదేశీ పర్యటనలకు వెళ్తాడన్న విషయం తెలిసిందే. యేడాదికోసారి ఆయన రాజకీయాలకు దూరంగా విదేశాలకు వెళ్ళి సేదతీరతాడంటూ కాంగ్రెస్ నేతలు చెప్తుంటారు. కానీ.. ఆజాద్ మాత్రం రాహుల్ అక్రమ వ్యాపారాలు చేసే వాళ్ళను కలిసేందుకే విదేశీ పర్యటనలు చేస్తాడంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దశాబ్ధాల తరబడి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి అందరు సీనియర్ కాంగ్రెస్ నేతలను దగ్గరగా చూసిన అనుభవం గులాం నబీ ఆజాద్ కు ఉంది. కాబట్టి.. ఆజాద్ ఆరోపణలకు బలం చేకూరింది. ఆజాద్ వ్యాఖ్యలను బీజేపీ అస్త్రంగా మార్చుకుంది. గతంలో హిండెన్ బర్గ్ అదానీ వివాదంలో మోడీపై తీవ్రమైన ఆరోపణలు చేసిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు ఆజాద్ వ్యాఖ్యలపై స్పందించాలని డిమాండ్ చేస్తోంది. రాహుల్ విదేశాలకు వెళ్ళి ఏం చేస్తాడు.. ఎవరిని కలుస్తాడనే వివరాలు బయటపెట్టాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే.. ఆజాద్ వ్యాఖ్యలపై ఇంకా కాంగ్రెస్ నేతలు ఎవరూ స్పందించలేదు.
వకీల్ సాబ్-2 అప్డేట్ ఇచ్చిన వేణు శ్రీరామ్
పవన్ బ్లాక్ బస్టర్ సినిమా వకీల్ సాబ్ కు సీక్వెల్ ఉంటుందన్న వార్తలపై డైరెక్టర్ వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. వకీల్ సాబ్-2 సినిమాకు సంబంధించిన వర్క్ షాప్ స్టార్ట్ అయ్యిందనీ.. ప్రస్తుతానికి స్క్రిప్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయనీ వేణు చెప్పాడు. రెండేళ్ళ క్రితం లాక్ డౌన్ తో టాలీవుడ్ డల్ అయిన టైమ్ లో బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా వచ్చి తెలుగు ప్రేక్షకులను, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విశేషంగా అలరించింది వకీల్ సాబ్ సినిమా. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ త్వరలో రాబోదోందన్న వార్తతో పవన్ ఫ్యాన్స్ హ్యాప్పీగా ఫీలవుతున్నారు. నివేతా థామస్, అనన్య నాగల్ల లీడ్ రోల్స్ లో సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక పవర్ ఫుల్ లాయర్ క్యారెక్టర్లో పవన్ పాత్రను రక్తికట్టించాడు.
పింక్ సినిమాకు ఎలాంటి సీక్వెల్ లేదు. కానీ వేణు శ్రీరామ్ మాత్రం వకీల్ సాబ్ కు సీక్వెల్ ఉందంటే.. అది పూర్తిగా కొత్త కథలో తెరకెక్కనున్నదన్నమాట. ఆవేశంతో ఊగిపోయే లాయర్.. పేరు, పలుకుబడి ఉన్న ఓ యంగ్ గ్యాంగ్.. ఏ అండా లేని ఇద్దరు ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యం నేపథ్యంలో వకీల్ సాబ్ తెరకెక్కగా.. సీక్వెల్ ఇందుకు పూర్తి భిన్నంగా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనా డైరెక్టర్ వేణు చేసిన అనౌన్స్ మెంట్ తో పవన్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాప్పీ.
భారత్ నీటిని ఆపేస్తే ఎలా..? : వణుకుతున్న పాకిస్తాన్
ఆర్ధిక మాంద్యం, ఆకలి చావులకుతోడు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితే వస్తే? పాకిస్తాన్ వెన్ను లో వణుకు పుట్టిస్తున్న అంశం ఇప్పుడిదే. గతేడాది తీవ్ర ఆర్ధిక సంక్షోభానికి వెల్‌కమ్ చెప్పిన పాకిస్తాన్ ఈ ఏడాది మొదట్లోనే ప్రజల ఆకలి తీర్చడంలో చేతులెత్తేసింది. ఇప్పుడా దేశంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలూ, కడుపు కాలిన మరణాలే. మూడు పూటలా తిండి తొరికే పరిస్థితి లేదు. కంటినిండా నిద్రపోయే అవకాశం లేదు. చేద్దామంటే పనుండదు.. ఉంటే జీతం చేతికందే ఛాన్స్ ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే భూమ్మీద ప్రత్యక్ష నరకంగా పాకిస్తాన్ మారిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఆ దేశానికి అసలు చిక్కొచ్చి పడింది. దశాబ్దాలుగా ఇండియా-పాక్ మధ్య ఎడతెగని వివాదంగా కొనసాగుతున్న సింధు జలాల ఒప్పం దంపై చర్చకొస్తారా? కాదని మొండికేసి ఇబ్బందులు కొనితెచ్చుకుంటారా? అంటూ ఇండియా గేర్ మార్చింది.
ప్రపంచంలోని పెద్ద నదీ ఒప్పందాల్లో సింధు నదీ ఒప్పందం ఒకటి. ఈ నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లు. ఈ నది పాకిస్థాన్‌లో 47 శాతం ప్రవహిస్తుండగా.. భారత్‌లో 39 శాతం, చైనాలో 8 శాతం, అఫ్గానిస్తాన్‌లో 6 శాతం ప్రవహిస్తోంది. ఈ నదీ పరివాక ప్రాంతంలో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారని అంచనా. ఈ నదీ జలాలను ఎవరెవరు ఎలా ఉపయోగించాలనే విషయమై, 62 సంవత్సరాల క్రితం ఒప్పందాలు జరిగాయి. 1960లో కుదిరిన ఈ ఒప్పందాన్ని పాక్ చాలా సందర్భాల్లో ఉల్లంఘిస్తూనే వచ్చింది. ఇన్నేళ్లూ మౌనంగా సహించిన భారత్, ఇక పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధపడింది. ఈ ఏడాది జనవరి చివర్లో ఒప్పందంలోని పన్నెండో ఆర్టికల్ కింద పాకిస్తాన్‌కు నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్‌కు పాకిస్తాన్ 90 రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. తాజాగా పాకిస్తాన్ నుంచి ఆ స్పందన రానేవచ్చింది. ఇండియా ఇచ్చిన నోటీస్‌పై స్పందించిన పాక్.. ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. భారత్ సైతం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పినదాని ప్రకారం. ఈ ఏడాది జనవరిలో ఇండియా ఇచ్చిన నోటీస్‌కు బదులుగా పాకిస్తాన్ ఓ లేఖ పంపించింది. ప్రస్తుతం ఆ లేఖను పరిశీలిస్తున్నట్టు అరిందమ్ బాగ్చి స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో ఆ లేఖపై పాకిస్తాన్ మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. సింధు జలాల ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ తెలిపినట్టు పీటీఐ తెలిపింది. అలాగే, సింధు జలాల ఒప్పందంలోని ఆర్టికల్ 12 ప్రకారం ద్వైపాక్షికంగా సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకునే వరకు ప్రస్తుత ఒప్పందం కొనసాగుతుందని పాక్ విదేశాంగ కార్యాలయం తెలిపినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఇప్పటివరకూ సింధు జలాల ఒప్పందంపై చర్చకు నో చెబుతూ వచ్చిన పాకిస్తాన్.. తాజాగా పాజిటివ్‌గా స్పందించడంతో సింధు జలాల ఒప్పందంలో మార్పలు, చేర్పులకు ఓకే చెప్పినట్టే అనే చర్చ జరుగుతోంది.
నిజానికి.. భారత్, పాక్ మధ్య సింధూ నదీజలాల ఒప్పందం కుదర్చడంలో ప్రపంచ బ్యాంకు కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం కింద ఒక ప్రతినిధి బృందం రెండు దేశాల్లోనూ పర్యటిస్తుంది. పరస్పరం సహకరించుకోవాల్సిన అంశాలను చర్చిస్తుంది. ఈ విషయంలో పాక్ అనుసరించిన ధోరణి భారత్‌కు ఆగ్రహం తెప్పించింది. భారత్ కొన్నేళ్ల క్రితం కిషన్ గంగ, రాల్లె హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులను నిర్మించింది. వీటి విషయంలో పాకిస్తాన్ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. తటస్థ నిపుణిడి నియామకం కోసం 2015లో ఓ అభ్యర్థన చేసింది. ఆ తరువాత దాన్ని ఉపసంహరించుకుని తన అభ్యంతరాలను పరిశీలించేందుకు మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయడాన్ని ప్రతిపాదించింది. భారత్ మాత్రం ఈ అంశాన్ని తటస్థ నిపుణుడికి రెఫర్ చేయాల్సిందిగా ప్రపంచబ్యాంకును కోరింది. పాకిస్తాన్ ఏకకాలంలో రెండు రకాల ప్రక్రియలకు ప్రయత్నించడాన్ని ప్రపంచబ్యాంక్ గుర్తించింది. తన నిర్ణయానికి బ్రేక్ వేసింది. సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా రెండు దేశాలకూ సూచించింది.
మరోవైపు.. సింధూ జలాల ఒప్పందం విషయంలో ప్రపంచబ్యాంకు చేసిన సూచనకు భారత్ సానుకూలంగా స్పందించింది. పాకిస్తాన్ మాత్రం ఎప్పట్లానే మొండి వైఖరిని అనుసరించింది. 2017 నుంచి 2022 వరకు ఐదేళ్ల కాలంలో ఐదుసార్లు జరిగిన సమావేశాల్లో ఆయా అంశాలను చర్చించేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచబ్యాంకు మళ్లీ రంగంలోకి దిగింది. పాకిస్తాన్ అభ్యర్థించిన విధంగా తటస్థ నిపుణుడి నియమించే విషయంలోనూ, సేమ్ టైం మధ్యవర్తిత్వ కోర్టు ప్రక్రియపై కూడా చర్యలకు శ్రీకారం చుట్టింది. కానీ, ఒకే అంశంపై రెండు రకాల సమాంతర ప్రక్రియలపై చర్యలు తీసుకోవడాన్ని భారత్ తప్పుబట్టింది. అలాంటి దానికి ఒప్పందంలో స్థానం లేదనే అంశాన్ని స్పష్టం చేసింది. అలాగే ఒప్పందంలో మార్పులకు వీలు కల్పించేలా పాకిస్తాన్‌కు నోటీస్ కూడా జారీ చేసింది. అసలే ఆర్ధిక ఇబ్బందులు చుట్టు ముట్టిన వేళ ఇండియా పంపిన నోటీస్ మూలిగే నక్కపై తాటిపండుపడ్డచందంగా మారింది.
పాకిస్తాన్ పట్ల మెతగ్గా వ్యవహరించిన ప్రతీ సందర్భంలోనూ ఇండియాకు ఎదురుదెబ్బలే తగిలాయి. స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది నెలలకే కశ్మీర్ విషయంలో భారత్ దెబ్బతింది. 1960లో కుదిరిన సింధూనదీ జలాల ఒప్పందంలోనూ అదే జరిగింది. ఇండియా ఉదారంగా ఉండాలనుకుంటే.. పాక్ మాత్రం మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. అదే ఇప్పుడు సింధూ నదీజలాల ఒప్పందంపై వివాదానికి దారి తీసింది. నీళ్లలో మంటలు వచ్చేలా చేసింది. తాజా నోటీస్ కింద ఒప్పంద ఉల్లంఘనలపై ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరపాలని పాకిస్తాన్‌కు భారత్ సూచించింది. అంతేగాకుండా గత 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాలను ఒప్పందంలో పొందుపర్చాల్సిన అవసరాన్ని కూడా స్పష్టం చేసింది. నాటి ఒప్పందం ప్రకారం.. మూడు తూర్పు నదులు.. సట్లెజ్, బియాస్, రావి నదుల జలాలను ఎలాంటి ఆంక్షలు లేకుండా పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఇండియాకు హక్కు ఉంది. మూడు పశ్చిమ నదులు.. ఇండస్, జీలం, చీనాబ్‌లపై హక్కు పాక్‌కు లభించింది. అదే సమయంలో ఈ మూడు పశ్చిమ నదుల నుంచి.. నిర్దేశిత డిజైన్‌లో రూపొందించిన ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేసుకునే హక్కు కూడా భారత్‌కే దక్కింది. ప్రాజెక్టుల డిజైన్ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని లేవనెత్తే వీలు పాకిస్తాన్‌కు ఉందని కూడా ఈ ఒప్పందం సూచిస్తోంది.
వాస్తవానికి.. భారత్ చేపట్టిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు పాకిస్తాన్‌కు ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఈ ఒప్పందం విషయంలో ఆయా అంశాలను పరిష్కరించుకునేందుకు ఆ దేశ సర్కార్ ఎంచుకున్న మార్గాలే వివాదానికి దారి తీశాయి. భారత్‌కు ఆగ్రహం వచ్చేలా చేశాయి. ఈ వ్యవహారం ముదిరిపాకన పడి ఎక్కడికి దారి తీస్తుందో అనే ఆందోళన ఇప్పుడు పాకిస్తాన్ ప్రజల్లో వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ తీరుపై ఆగ్రహించిన భారత్, పాకిస్తాన్‌కు నీటి సరఫరాలో అడ్డంకులు కలిగిస్తే.. అసలుకే ఎసరు వస్తుందన్నవాదన కూడా వినిపిస్తోంది. ఇదే అంశం పాకిస్తాన్ పాలకులను సైతం భయపెడుతున్నట్టు కనిపిస్తోంది. అందుకే, ఈ వివాదంలో తెగేవరకూ లాగితే జరిగే నష్టాన్ని అంచనా వేసే భారత్ నోటీస్‌పై స్పందించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడైనా ఈ వివాదం పరిష్కారానికి ఓకే చెబుతుందో.. లేదంటే ఎప్పట్లానే చివరి నిమిషంలో మాట మారుస్తుందో చూడాలి.
పవన్ సినిమా డబ్బుల్లేక ఆగిపోయిందట..!?
ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. రాజకీయాలతో పాటు సినిమాలను కూడా ప్యార్లల్ గా మెయింటెన్ చేస్తూ వస్తున్నాడు. పార్టీని నడిపించటానికి తనకు సినిమాలు తప్ప మరో ఆదాయమార్గం లేదని పదే పదే చెప్పే పవన్ తన సినిమా కెరీర్ కొనసాగిస్తాననీ.. వరుస సినిమాలు చేస్తాననీ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ హరిహర మీరమల్లు సినిమా చేస్తున్నాడు. అయితే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను డబ్బు కష్టాలు చుట్టుముట్టాయంటూ టాలీవుడ్ లో ఓ వార్త బలంగా వినిపిస్తోంది. చాలా రోజుల క్రితమే పట్టాలెక్కిన హరిహర వీరమల్లు సినిమా కోసం పవన్ డేట్స్ దొరకటం కాస్త కష్టంగా మారిన నేపథ్యంలో ఫైనాన్షియర్ లు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని సమాచారం.
మామూలుగా సినిమా ఫైనాన్షియర్లు సినిమా కోసం సొంత డబ్బుతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ డబ్బులనే ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. సినిమా నిర్మాణం కోసం చేసిన అప్పులు.. వాటి వడ్డీలు ఫైనాన్షియర్లను భయపెడుతుంటాయి. అనుకున్న సమయానికి సినిమా పూర్తి కాకపోతే ఈ వడ్డీ కష్టాలు మరింత ఎక్కువ అవుతాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇలాంటి కష్టాన్నే ఎదుర్కుంటున్నట్టు తెలుస్తోంది. టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ సినిమాకు డబ్బు కష్టాలు రావటం అనేది నమ్మలేని నిజంగా విచిత్రమే. కాకపోతే.. దీనిపై ఎలాంటి అఫీషియల్ వార్తలూ రాలేదు.
పవన్ కళ్యాణ్ కోసం జనసేనలోకి దిల్ రాజు ?
ప్రముఖ నిర్మాత దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బలగం సినిమా ఫంక్షన్ కు హాజరైన కేటీఆర్ దిల్ రాజు పొలిటికల్ ఎంట్రీపై కామెంట్స్ చేయటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనిపై దిల్ రాజు కూడా స్వయంగా స్పందించాడు. తనకు రాజకీయాల్లోకి రమ్మని చాలా ఆఫర్లు ఉన్నాయనీ.. కాకపోతే ఇప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదనీ దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. దిల్ రాజు త్వరలోనే తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి వెళ్ళి నిజామాబాద్ లో పోటీ చేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా దిల్ రాజుపై మరో ఆసక్తికర వార్త వినిపిస్తోంది. దిల్ రాజు పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనలోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నాడనేది ఈ వార్తల సారాంశం.
సినిమా ఇండస్ట్రీలో దిల్ రాజు అగ్రశ్రేణి నిర్మాత. తెలంగాణలోని థియేటర్లలో మేజర్ వాటా కలిగిన వ్యక్తి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తో దగ్గరి సంబంధాలు కలిగిన టాలీవుడ్ నిర్మాత. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అన్నింటికీ మించి ఏపీలో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఆర్థికంగా పవన్ ను సపోర్ట్ చేయబోతున్నట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే.. ఈ వార్తలపై ఎక్కడా ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఆఫర్ ను కాదనుకొని మరీ ఏపీలో పవన్ కళ్యాణ్ వెంట నడిచే ఆలోచన దిల్ రాజు చేయబోడనే అంటున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
బండి సంజయ్ అరెస్టుపై భగ్గుమన్న బీజేపీ
పదో తరగతి పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇదివరకే అరెస్ట్ చేసిన నిందితుడు ప్రశాంత్ తో బండి సంజయ్ వాట్సాప్ లో చాట్ చేయటంతో పాటు వందకు పైగా కాల్స్ మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు బండి సంజయ్ ను నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. బండి సంజయ్ అరెస్టు అక్రమం అంటూ రోడ్లపైకి ఎక్కి ధర్నాలు, రాస్టారోకోలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తో పాటు పలువురు బీజేపీ నేతలను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.
పేపర్ లీక్ కావటానికి ముందు నిందితుడు ప్రశాంత్ బండి సంజయ్ తో వాట్సాప్ లో చాట్ చేసినట్టు పోలీసులు చెప్తున్నారు. అలాగే సుమారు 120 సార్లు ఫోన్ లో మాట్లాడాడని అంటున్నారు. దీనిపై తమ వద్ద సాక్ష్యాలున్నాయనీ.. వాట్సాప్ చాట్ ను రికవర్ చేసి భద్రపరిచామనీ చెప్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్ ను వరంగల్ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా ఈ ఘటనపై ఘాటుగానే స్పందిస్తున్నారు. బీజేపీ పార్టీ కుట్ర చేసి పేపర్ లీకేజీలు చేయిస్తోందనీ.. పదో తరగతి పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ కుట్ర ఉందనీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ ఆక్రమణకు చైనా కొత్త కుట్ర
సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా మరో దుస్సాహసానికి తెగబడింది. మన భూభాగం అరుణాచల్ ప్రదేశ్ తమదే అన్నట్టుగా పేర్లమార్పు కుట్రలు కొనసాగిస్తోంది. గత కొన్ని నెలలుగాఅరుణాచల్ ప్రదేశ్‌ను తమ ప్రాంతంగా ప్రకటించుకుంటోంది. అలాగే, దాన్ని వారి దేశ పటంలోనూ చూపించుకుంటోంది. ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్‌కు చైనీస్, టిబెటన్, పిన్యిన్ అక్షరాలలో మూడవ సెట్ పేర్లను విడుదల చేసింది. చైనా క్యాబినెట్ స్టేట్ కౌన్సిల్ జారీ చేసిన భౌగోళిక పేర్లపై నిబంధనలకు అనుగుణంగా అరుణాచల్ ప్రదేశ్‌కు 11 ప్రాంతాల ప్రామాణిక పేర్లను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిందని చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీంతో చైనా చర్యను భారత్‌తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టంచేస్తూ డ్రాగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేర్లు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాది అయిపోదంటూ ఫైర్ అయింది.
వాస్తవానికి.. అరుణాచల్ ప్రదేశ్ భారత దేశానికి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. ఈ రాష్ట్రం భూటాన్, చైనా, మయన్మార్ సరిహద్దుల్లో ఉంది. మన దేశ రక్షణ, భద్రత విషయంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. బ్రిటిష్ అధికారులు నియంతృత్వంతో గీసిన రేఖతోపాటు అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సరిహద్దులు భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఐతే 1949లో చైనాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వివాదం ప్రారంభమైంది. అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఈ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తుంగలో తొక్కింది. అసమానతలతో కూడిన ఒప్పందాల తమపై రుద్దారని ఆరోపిస్తూ, భారత్‌తో అన్ని సరిహద్దులను మళ్లీ చర్చించి, నిర్ణయిం చాలని డిమాండ్ చేస్తోంది. ఈస్టర్న్ సెక్టర్‌లో మెక్‌మెహన్ రేఖను 1914లో బ్రిటిష్ ఇండియా-టిబెట్ మధ్య సరిహద్దుగా నిర్ణయించారు. చైనా, టిబెట్, గ్రేట్ బ్రిటన్ మధ్య కుదిరిన సిమ్లా ఒప్పందంలో ఈ నిర్ణయం జరిగింది.
మరోవైపు.. అరుణాచల్ ప్రదేశ్‌పై చిచ్చు రేపింది డ్రాగన్ కంట్రీనే. అధికారికంగా గీయని సరిహద్దు ను డ్రాగన్ వివాదాస్పదం చేసింది. చైనా 1949-50లో టిబెట్‌పై దాడి చేసింది. సిమ్లా ఒప్పందంపై టిబెట్ ప్రభుత్వం సంతకం చేసిందని, అప్పటికి టిబెట్ సార్వభౌమాధికారం గల దేశం కాదని చైనా వాదించింది. తవాంగ్‌తోపాటు అరుణాచల్ ప్రదేశ్ టిబెట్‌లో భాగమని చైనా వాదించింది. 1962లో భారత్‌పై చైనా యుద్ధం చేసింది. హిమాలయాలకు పశ్చిమ దిశలో ఉన్న చికెన్స్ నెక్‌గా పేర్కొనే ఆక్సాయ్ చిన్ ప్రాంతంలోనే ఈ యుద్ధం జరిగింది. 90 వేల చదరపు కిలోమీటర్లు తనదేనని వాదించింది. అంటే దాదాపుగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం అంతా తనదేనని డ్రాగన్ కంట్రీ వాదించింది. అరుణాచల్ ప్రదేశ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపించే మ్యాప్స్ తయారు చేసింది. ఈ రాష్ట్రాన్ని జంగ్నన్ రాష్ట్రంగా పేర్కొంది. ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల పేర్లను గతంలో కూడా చైనా మార్చింది. యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చేందుకు 2017, 2021 సంవత్సరాల్లో ప్రయత్నించింది. అప్పుడు కూడా ఈ దుశ్చర్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారత దేశంలో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. పెట్టుడు పేర్లను పెట్టినంత మాత్రానికి వాస్తవాలు మారిపోయే ప్రసక్తే లేదంది.
ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్ కేంద్రంగా ఇరు దేశాల మధ్య చిన్నపాటి యుద్ధాలే జరిగాయి.
చైనా, భారత్ సైన్యాల మధ్య తీవ్రమైన ఘర్షణ 1975లో అరుణాచల్ ప్రదేశ్‌లోని తులుంగ్ లా ప్రాంతంలో జరిగింది. ఈ ఘర్షణలో నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. 2020లో గాల్వన్ లోయలోజరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులు కాగా, చైనా సైన్యం కేవలం నలుగురినే కోల్పోయినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది. కానీ 40 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు విదేశీ మీడియా సంస్థలు నివేదించాయి. ఇక గతేడాది డిసెంబర్‌లోను అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్, యాంగ్‌ట్సే వద్ద ఇరు దేశాల సైన్యాలు తలపడ్డాయి. ఇక.. భారత్-చైనా మధ్య సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు వరకు ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వద్ద ఉన్న సరిహద్దును ఈస్టర్న్ సెక్టర్ అంటారు. లడఖ్ వద్ద ఉన్న సరిహద్దును వెస్టర్న్ సెక్టర్ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వద్ద ఉన్న సరిహద్దునుమిడిల్ సెక్టర్ అంటారు. ఐతే ఎల్ఏసీ కేవలం 2వేల కిలోమీటర్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది. ఈ సరిహద్దులను సక్రమంగా నిర్వచించకపోవడం వల్లే ఇరు దేశాల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
అరుణాచల్ ప్రదేశ్‌పై డ్రాగన్ యాక్షన్ మార్చడానికి ఇటీవల జరిగిన పరిణామాలే కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఆరేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రమైన డోక్లాంపై మార్చి ఎండింగ్‌లో భూటాన్ ప్రధాన మంత్రి లోటే షెరింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతవరకు డ్రాగన్ కంట్రీ ఆ ప్రదేశంలోకి అక్రమంగా చోరబడుతోందని విశ్వసిస్తుంటే.. ఈ వివాదం పరిష్కరించడంలో భాగమవ్వడానికి చైనాకు కూడా హక్కు ఉందని భూటాన్ ప్రధాని షెరింగ్ అన్నారు. దీనిపై చర్చించేందుకు తాము సిద్దంగానే ఉన్నామని, భారత్, చైనాలు కూడా రెడీగా ఉంటే చర్చించుకుందాం అన్నారు. ఐనా మూడు సమాన దేశాలే అనీ.. ఇందులో పెద్ద లేదా చిన్నా దేశాలు లేవు కదా వ్యాఖ్యానించారు. తద్వారా భూటాన్ తాను చర్చలకు సుముఖంగా ఉన్నట్లు నేరుగానే సంకేతాలిచ్చింది. భూటాన్ ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌ని టెన్షన్‌లో పడేశాయి.
డోక్లాం అనేది భారత్, చైనా, భూటాన్ కూడలిలో ఉండే ప్రాంతం. ఈ ఎత్తైన పీఠభూమి సిలిగురి కారిడార్‌కి సమీపంలో ఉంది. చైనా ఈ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టి విస్తరించే యోచన చేసింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించడమే గాక భారత్ బలగాలు ఆ పనులను అడ్డుకున్నాయి కూడా. వాస్తవానికి సిలిగురి కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలను భారత్‌లోని మిగతా భూభాగంతో కలిపే ప్రాంతం. గతంలో 2019లో ఈ ట్రై జంక్షన్ పాయింట్ వద్ద ఏకపక్షంగా ఎటువైపు నుంచి ఎవరూ ఏం చేయకూడదన్న ఒప్పందానికి భూటాన్ ప్రధాని షెరింగ్ చేసిన ప్రకటన చాలా విరుద్ధంగా ఉంది. చైనా ఆ ట్రై జంక్షన్‌ని బటాంగ్ లా నుంచి దక్షిణాం వైపు దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌంట్ గిమ్‌మోచి అనే శిఖరానికి మార్చాలనుకుంటోంది. అదే జరిగితే మొత్తం డోక్లాం భూభాగం డ్రాగన్ కంట్రీ భాగమవుతుంది. ఇది భారత్‌కి ఎట్టిపరిస్థితుల్లోనూ మంచిది కాదు. అయితే ఆ సమయంలో చైనా ఒత్తిడితోనే భూటాన్ ప్రధాని ఆ తరహా వ్యాఖ్యలు చేశారనే చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో భారత్ కూడా అందుకు తగ్గట్టే యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. భూటాన్ ప్రధాని ప్రకటనపై పైకి స్పందించకున్నా అంతర్గతంగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే భూటాన్ రాజు భారత్ టూర్ ఖరారైంది. ఈ పరిణామం డ్రాగన్ కంట్రీకి ఊహించని షాకిచ్చినట్టయింది.
భూటాన్ రాజు ఇండియాలో అడుగుపెట్టడం, అరుణాచల్ ప్రదేశ్ పేర్లు మారుస్తున్నట్టు చైనా మీడియా ప్రకటించడం ఆల్మోస్ట్ ఒకే సమయంలో జరిగాయి. ఇదే సమయంలో భూటాన్ రాజు భారత్‌లో అడుగుపెట్టిన వెంటనే సమావేశమైంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌లతోనే. భూటాన్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారం తర్వాత ఆ దేశ రాజుతో దోవల్, జైశంకర్ ఎలాంటి చర్చలు జరుపుతారో చైనాకు తెలుసు. అందుకే ఈ భేటీ తర్వాత బీజింగ్‌లో కొత్త అనుమానాలు మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది. భారత్‌కు వ్యతిరేకంగా డోక్లాంలో మకాం వేద్దాం అనుకున్న వేళ భూటాన్ ఇండియాకు దగ్గర కావడం బీజింగ్‌కు ఏమాత్రం రుచించని అంశమే. దీంతో భూటాన్ రాజు భారత పర్యటను వ్యతిరేకిస్తూనే అరుణాచల్‌ప్రదేశ్ పేర్లమార్పు డ్రామాకు తెరతీసిందనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ద్వారా ఇండియాపై తన యాక్షన్ ఏంటో భూటాన్‌కు తెలియజెప్పే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. అయితే, డ్రాగన్ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో భారత్ లేదు. అలాగే భూటాన్‌ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో ఇండియాకు తెలుసు. ఈ విషయంలో ప్రధాని మోడీ, భూటాన్ రాజు సమావేశం ముగిసిన తర్వాత భారత విదేశాంగ కార్యదర్శ అలాంటి క్లారిటీనే ఇచ్చారు. డోక్లామ్ సరిహద్దు నిర్ణయంపై భారత వైఖరిని పునరుద్ధాటించారు.
మొత్తంగా.. డోక్లాంలో మకాం వేద్దామని ప్లాన్ చేస్తున్న చైనాను భూటాన్ అడ్డుకునేలా ఇండియా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనిపిస్తోంది. ఈ విషయంలో తాజా ఒప్పందాల ద్వారా ఆ దేశం ఇండియాకు దగ్గరయితే డోక్లాంలో డ్రాగన్ ఆటలు సాగే పరిస్థితి ఉండదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్‌పై కుట్రలు చేస్తూ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తోంది. ఒక్కమాటలో భారత్, భూటాన్ దోస్తీతో డ్రాగన్ ఆశలు గండిపడ్డం ఖాయం.