గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కుర్చీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కర్ణాటక రాజకీయాల్లో అందరూ అనుకున్నట్టుగానే షాకింగ్ పరిణామం సంభవించింది. ప్రస్తుతం కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్దరామయ్య తన సీటును సీనియర్ నాయకుడు డీకే శివకుమార్ కోసం త్యాగం చేయటం ఖాయమంటూ వార్తలు వినిపించినా.. అదేమీ లేదనీ.. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగుతాడనీ కర్ణాటక కాంగ్రెస్ చెప్పుకొచ్చింది. కానీ.. అనూహ్యంగా డీకే శివకుమార్ ఢిల్లీ ప్రయాణం మరిన్ని ఊహాగానాలకు తావిచ్చింది. సీఎం పదవి మార్పు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎవరి మనసూ నొప్పించకుండా ఈ నాయకత్వ మార్పు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కృషి చేస్తోందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో కొన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు అతి త్వరలోనే తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, గురువారం సిద్ధరామయ్య తొలుత సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి, అనంతరం బెంగళూరులోని లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పిస్తారని సమాచారం. మరోవైపు, డీకే శివకుమార్ రేపు ఉదయాన్నే దిల్లీ నుంచి నేరుగా సీఎం ఇంటికి వెళ్లనున్నారు. అక్కడ వారు సమావేశం కానున్నారని ఆయన కార్యాలయం తెలిపింది. అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో సీఎం మార్పుపై కొనసాగుతున్న ఊహాగానాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
నిజానికి.. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడే.. సీఎం పదవి కోసం సిద్దరామయ్య డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కానీ సీనియర్ కాబట్టి సిద్దరామయ్య వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినా.. డీకే శివకుమార్ కోసం పెద్దలు దిగిరాక తప్పలేదు. చివరికి.. చెరో రెండున్నరేళ్ళు సీఎంగా ఉంటారని అధిష్టానం తేల్చి చెప్పింది. కానీ.. రెండున్నరేళ్ళు కాదు కదా.. మూడేళ్ళు దాటిపోయినా ఇంకా సీఎం పదవి మార్పుపై ఏ ప్రకటన లేదు. కానీ డీకే శివకుమార్ వర్గం మాత్రం త్వరలోనే తమ ప్రియతమ నాయకుడు సీఎం అవుతాడని వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంత రచ్చ జరుగుతుంటే.. పార్టీ సీనియర్ నేతలు ఢిల్లీ టూర్లకు వెళ్ళటం మరింత కన్ఫ్యూజన్‌ను క్రియేట్ చేస్తోంది. అన్నింటికీ మించి.. పార్టీ సీనియర్ నేత జి.పరమేశ్వర కొత్త ముఖ్యమంత్రి కాబోతున్నారన్న వార్త కర్ణాటక రాజకీయాల్లో మరో ప పెద్ద మంట పెట్టింది. ఇంత జరుగుతున్నా.. ముఖ్యమంత్రి పదవి మార్పుపై అధిష్టానం మాత్రం ఏ ప్రకటనా చేయకుండా మౌనంగానే ఉంటోంది.

