Home Blog Page 14

ఇది రజినీకాంత్ లాస్ట్ సినిమా

0

సూపర్ స్టార్ రజినీకాంత్ త్వరలోనే తన సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడా.. 72యేళ్ళ వయసులో కూడా అభిమానులను అలరిస్తున్న రజినీ.. త్వరలోనే తన లాస్ట్ సినిమా అనౌన్స్ చేయబోతున్నాడా.. అవుననే చెప్తున్నాడు తమిళ డైరెక్టర్ మిస్కీన్. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పాడు. మిస్కీన్ మాటలు సౌత్ ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారాయి. అయితే.. ఈ విషయంపై రజినీ మాత్రం ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం రజినీకాంత్ జైలర్ సినిమాతో పాటు లాల్ సలామ్ సినిమాలో నటిస్తున్నాడు. జైలర్ దాదాపు పూర్తి కావచ్చింది. లాల్ సలామ్ సినిమా మాత్రం ఇప్పుడే సెట్స్ పైకి వెళ్ళింది. ఈ సినిమాకు రజినీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత జైభీమ్ సినిమా డైెరెక్టర్ జ్ఞానవేల్ తో మరో సినిమా చేయనున్నట్టు రజినీ ఇటీవలే ప్రకటించాడు.
విక్రమ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో రజినీకాంత్ ఓ సినిమా చేయబోతున్నాడనీ.. ఇద్దరి మధ్య దీనిపై చర్చ జరిగిందనీ.. బహుశా ఈ సినిమా తర్వాతే రజినీ తన సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడనీ మిస్కీన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. రజినీ తనంత తానే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ను తనతో సినిమా చేయాలని కోరినట్టు మిస్కీన్ చెప్పటం విశేషం. రజినీ లాస్ట్ సినిమా వ్యాఖ్యలపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. రజినీకాంత్ తాను చివరి సినిమా అని ఆయన నోటి వెంట చెప్పాలి కానీ వేరే వాళ్ళు చెప్పటం ఏమిటంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. సూపర్ స్టార్ పై అవసరమైన వ్యాఖ్యలు తెలిసీ తెలియకుండా చేయవద్దని మిస్కీన్ కు సలహా ఇస్తున్నారు. మిస్కీన్ చెప్పినట్టు రజినీ లోకేష్ కనకరాజ్ తో చివరి సినిమా తీయాలని అనుకుంటే.. అది రజినీ కెరీర్ లో 171వ సినిమా అవుతుంది.

జైశంకర్ సమాధానం ఇలా ఉంటుందని యూరప్ ఊహించలేదు

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధానికి ముగింపు అసాధ్యమని తేలిపోయింది. ఎప్పుడైతే కీవ్ డ్రోన్ మాస్కో వైపు వెళ్లిందో ఆ క్షణమే క్రెమ్లిన్ మిస్సైళ్లు కీవ్‌ను టార్గెట్ చేశాయి. సింపుల్‌గా చెప్పాలంటే సరిహద్దుల్లో కొట్లాట కాస్తా అధ్యక్షుల మధ్య ఫేస్ టూ ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్ అన్నట్టుగా మారిపోయింది. ఇందులో భాగంగానే యుద్ధ వ్యూహాలూ మారిపోతున్నాయి. ఉన్నట్టుండి ఉక్రెయిన్ అధ్యక్షుడు బ్రిటన్‌లో ప్రత్యక్ష్యం కావడం.. ఆ వెంటనే ఉక్రెయిన్‌పై మాస్కో మిస్సైళ్ల వర్షం కురవడం లాంటి పరిణామాలు యుద్ధభూమిలో ఇంకేదో జరగబోతోందనే ఉత్కంఠను రేపుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాస్కోను ఏవిధంగా నిలువరించలేకపోతున్నామనే భావన పశ్చిమ దేశాల్లో మళ్లీ మళ్లీ బయటపడుతోంది. యుద్ధం మొదట్లో అమెరికా సైడ్ తీసుకున్న యూరోపియన్‌యూనియన్ దేశాలు మాస్కోపై ఎడాపెడా ఆంక్షలు విధించాయి.
రష్యా నుంచి క్రూడాయిల్ దిగుమతి చేసుకోకుంటే కష్టాలు తప్పవని తెలిసి కూడా పుతిన్‌ను ఆంక్షలతో అడ్డుకునేలా యాక్షన్‌లోకి దిగాయి. దీనికి ఫలితంగా చలి పులి దెబ్బ గట్టిగానే రుచి చూడాల్సి వచ్చింది యూరోపియన్ దేశాలు.
రష్యాకు ప్రధాన ఆదాయ వనరు క్రూడాయిలే అని తెలిసిన యూరప్.. కష్టమే అయినా మాస్కో నుంచి దిగుమతులు నిలిపేస్తే ఆ ఎఫెక్ట్ పుతిన్‌పై పడుతుందనీ, ఫలితంగా యుద్ధంలో ఓడిపోతారనీ కలలు కన్నారు. కానీ, పుతిన్ మాత్రం అమెరికా సహా పశ్చిమ దేశాలకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తనపై ఆంక్షలు విధిస్తున్న దేశాలను పరిశీలించి.. చివరికి ఇండియా, చైనా లాంటి మద్దతు దేశాలకు తక్కువ ధరకే క్రూడాయిల్ అంటూ బంపరాఫర్ ఇచ్చారు. ఈ పరిణామాన్ని అగ్రరాజ్యంతోసహా మరే ఇతర దేశం ఊహించలేదు. ఫలితంగా మాస్కోకు ఫైనాన్షియల్ ఇబ్బందులు తొలగిపోయాయి. ఈ కారణంతోనే యుద్ధాన్ని ఇంతకాలం కంటిన్యూ చేయగలుగుతున్నారు. అందుకే ఇండియాపై చాలా సందర్భాల్లో అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు విమర్శలు చేశాయి. అయినా జైశంకర్ మాత్రం మొదట దేశ ప్రయోజనాలే తమకు ఇంపార్టెంట్ అని తేల్చి చెప్పారు. అయితే, ఇదంతా గతం. ఈ విషయంలో అమెరికా సహా అన్ని దేశాలూ సైలెంట్ అయిపోయాయి అనుకుంటున్న సమయంలో ఈయూ మళ్లీ తన కడుపుమంటను బయటపెట్టుకుంది.
భారత్ రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురును.. శుద్ధి చేసిన చమురు పేరిట యూరోపియన్‌ యూనియన్‌కు అమ్ముతుందని ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త జోసెఫ్‌ బొర్రెల్ ఆక్షేపించారు. దీనికి అడ్డుకట్ట వేయాలని ఆయన ఫైనాన్షియల్‌ టైమ్స్‌కు చెప్పారు. భారతీయ చమురు శుద్ధి కంపెనీలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుని అటు నుంచి యూరోపియన్‌ యూనియన్‌కు తరలిస్తున్నాయని బోరెల్‌ అన్నారు. రష్యా చమురు దిగుమతిపై ఉన్న ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ మార్గాన్ని అనుసరిస్తున్నాయని విమర్శించారు. ఇందులో డీజిల్‌ ఎగుమతులు కూడా ఉన్నట్టు ఆయన అన్నారు. ‘రష్యా తక్కువ ధరకు అమ్మవచ్చు. ఇండియా కొనవచ్చు. అది వారిరువురి పరస్పర ప్రయోజనం. కానీ అదే చమురు యూరోపియన్‌ యూనియన్‌కు అమ్మడం అంటే ఆంక్షలను వమ్ము చేయడమే’ అంటూ జోసెఫ్ మరోసారి ఏడ్చాడు మీడియా ముందు. ఫైనాన్షియల్ టైమ్స్‌తో ఈయూ చీఫ్‌ దౌత్యవేత్త చేసిన వ్యాఖ్యలు భారతవి దేశాంగ మంత్రి జైశంకర్ చెవిన పడ్డాయి. ఇంకేముంది.. ఈ ఎపిసోడ్‌పై తన మార్క్ కౌంటర్లతో జైశంకర్ విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్, స్వీడన్, బెల్జియం దేశాల్లో పర్యటిస్తున్న జైశంకర్.. బెల్జియంలోని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగానే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ నిబంధనలను చూసుకోవాలని సలహా ఇచ్చారు.
రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఇచ్చిన ఆన్సర్ ఇదే. రష్యన్ క్రూడాయిల్‌ భారత దేశంలో పూర్తిగా మారుతోందనీ, ఒక్కసారి ఇండియాకు వచ్చిన తర్వాత ఆ క్రూడాయిల్‌ను రష్యన్ చమురుగా ఎంత మాత్రం పరిగణించరని చెప్పారు. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 833/2014ను ఓసారి పరిశీలిస్తే మీకే క్లారిటీ వస్తుందనేలా కౌంటరిచ్చారు. జైశంకర్ కౌంటర్ తర్వాత విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మార్గరెత్ వెస్టాజర్.. ఆంక్షలకు చట్టబద్ధత ఉండటంపై సందేహాలు లేవంటూ వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. యూరోపియన్ యూనియన్, ఇండియా మిత్రులుగా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కరచాలనం చేసే చేయిగా ఈ చర్చలు జరుగుతాయని, వేలెత్తి చూపించే విధంగా జరగబోవని చెప్పారు.
మాస్కోపై పశ్చిమదేశాల ఆంక్షల లక్ష్యం నేరవేరాలన్న ఆలోచనతోనే రష్యాతో వాణిజ్య సంబంధాలను కనిష్ట స్థాయికి తగ్గించాలని భారత దేశంపై పాశ్చాత్య దేశాలు ఒత్తిడి తెస్తున్నాయని జైశంకర్ గతంలో కూడా విమర్శించారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడాన్ని సమర్థించారు. యూరోపియన్ యూనియన్ తన సొంత ఇంధన అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చుకుంటూ, అదే సమయంలో భారత్ వేరొక విధంగా వ్యవహరించాలని కోరుతోందని, ఇది చాలా ఆశ్చర్యంగా ఉందని చాలా సందర్భాల్లో బహిరంగంగానే విమర్శించారు. ఈ విషయాన్ని కాస్త పక్కనపెడితే.. మాస్కోతో క్రూడాయిల్ డీల్స్‌ అనేది పూర్తిగా భారత్ అంతర్గత విషయం.. ఈ అంశంలో ఇండియాను విమర్శించే హక్కు మరే ఇతర దేశానికీ లేదు. అలాగే మనదేశం నుంచి క్రూడాయిల్ కొనితీరాలని యూరోపియన్ దేశాలను ఎవరూ బలవంతం చేయడం లేదు కూడా. వద్దనుకుంటే ఇండియా నుంచి క్రూడాయిల్ దిగుమతులు ఈయూ దేశాలు ఎప్పుడైనా నిలిపేసుకోవచ్చు. అలా కాదని ఇలా విమర్శలకు దిగడం వల్ల జైశంకర్ నుంచి ఊహించని కౌంటర్ వస్తుందని పాపం జోసెఫ్ మరిచిపోయినట్టున్నాడు.. అందుకు ఫలితం తాను అనుభవించటమే కాకుండా.. మొత్తం యూరప్ పరువు తీయించాడు దగ్గరుండి మరీ.

దిగొచ్చిన డీకే శివకుమార్ : సోనియా మంత్రం పనిచేసినట్టే

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చునేది ఎవరు అనే దానిపై కాంగ్రెస్ పార్టీలో క్లారిటీ లేకుండా పోయింది. వారం రోజుల పాటు క్యాంపు రాజకీయాలు గట్టిగా నడిచిన తర్వాత మొత్తానికి డీకే శివకుమార్ అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తనకు సీఎం పదవి ఇవ్వకపోతే క్లిష్టమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బహిరంగంగానే కాంగ్రెస్ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన డీకే.. చివరకు సోనియా గాంధీ బుజ్జగింపులకు, ఆఫర్లకు సరే అన్నాడు. దీంతో కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీకి తెరపడినట్టైంది. రేపు.. అంటే శుక్రవారం నాడు సిద్దరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కాంగ్రెస్ జాతీయ అధిష్టానం ప్రకటించింది. ఇక డీకే మాత్రం తనకు ఆఫర్ చేసిన డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కూడా వద్దని చెప్పినట్టు సమాాచారం. ఏ మంత్రి పదవి కూడా లేకుండా కేవలం సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగేందుకు డీకే నిర్ణయించుకోవటం ఆయన అనుచరులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఒక్కలిగ కులం ఓట్లు పడటానికి ఒకే ఒక్క కారణం డీకే శివకుమార్ మాత్రమే. ఈ వర్గం ఓట్లు రాకపోయి ఉంటే ఖచ్చితంగా ఓట్ల చీలిక ఏర్పడి బీజేపీకి మెజార్టీ వచ్చేది. అంటే.. మొత్తం పొలిటికల్ పిక్చర్ తారుమారు అయ్యేది. అలాంటి ఒక్కలిగ ఓట్లను సంపాదించిన పెట్టిన డీకే శివకుమార్ కు కాకుండా సిద్దరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం ఒక్కలిక వర్గానికి ఏమాత్రం రుచించదు. అయితే.. ప్రస్తుతానికి తల ఊపిన డీకే శివకుమార్.. ఎప్పుడు ఎదురు తిరిగి ప్రభుత్వాన్ని పడగొడతాడో అనే అనుమానం కూడా అధిష్టానానికి ఉంది. డీకే సీఎం పదవిలో లేకపోతే భవిష్యత్తులో ఈడీ, సీబీఐ నుంచి కేసులు ఎదుర్కోవాల్సి రావటంతో పాటు అక్రమాస్తుల కేసు రుజువైతే జైలుకు వెళ్ళాల్సి ఉంటుంది. పైగా.. ఎందుకూ పనికిరాడు అని బహిరంగంగా డీకే శివకుమార్ తిట్టిపోసిన కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్.. ఇప్పుడు సీబీఐ కొత్త డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. సో.. డీకే శివకుమార్ త్యాగం చేసింది ముఖ్యమంత్రి కుర్చీని మాత్రమే కాదు.. తన భవిష్యత్తును కూడా. ఇప్పుడు డీకే ఏం చేయబోతున్నాడు అనేది దేశవ్యాప్తంగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అన్నమాట.

“ది కేరళ స్టోరీ”పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

0

రిలీజ్ కు ముందే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ది కేరళ స్టోరీ విషయంలో రోజుకోసారి బ్రేకింగ్ న్యూస్ లో ఉంటూ వస్తోంది. లేటెస్ట్ గా ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాళ్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. అంతే కాదు.. సినిమాపై నిషేధం ఎత్తివేసి భద్రత కల్పించి మరీ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలంటూ మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. ఓ వర్గం మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అభ్యంతరం చెప్తూ మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించింది. కానీ తాజా సుప్రీం నిర్ణయం మమతకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం ఎత్తివేయాలంటూ సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
విచారణ సందర్భంగా సుప్రీం సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే మమతా బెనర్జీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేశారు. ఒక్కసారి సెన్సార్ బోర్డు సినిమాను పూర్తిగా చూసి అవసరం లేని సన్నివేశాలు తొలగించాలని చెప్పిందనీ.. ఆ తర్వాత రెండోసారి సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు పూర్తిగా చూసి అనుమతి ఇచ్చారనీ సాల్వే పేర్కొన్నారు. సెన్సార్ సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ దానిపై రాష్ట్రాలు సొంత నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాలు ఎందుకు వస్తున్నాయంటూ ఆయన బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్యల పేరుతో సినిమాల విడుదలను ఆపటం కాకుండా.. శాంతి భద్రతలను రక్షించేందుకు చర్యలు తీసుకోవచ్చు కదా అంటూ మరో ప్రశ్న సంధించారు. వెంటనే సినిమాపై నిషేధం ఎత్తివేసి విడుదలకు ఏర్పాట్లు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మమతా బెనర్జీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటెల రాజేందర్

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అనూహ్య విజయం తర్వాత పలువురు బీజేపీ నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ తెలంగాణలో వార్తలు జోరుగా వినిపించాయి. కర్ణాటక తరహాలోనే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ కాంగ్రెస్ నేతలు జోష్యం చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేతలు సహా చాలా మంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. వారిలో బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పేరు కూడా గట్టిగానే వినిపించింది. త్వరలోనే ఈటెల బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. దీనిపై ఎట్టకేలకు ఈటెల స్పందించాడు. తాను బీజేపీని వదిలి మరో పార్టీలో చేరబోతున్నాననే వార్తల్లో నిజంలేదని క్లారిటీ ఇచ్చారు.
ట్విటర్ వేదికగా దీనిపై ఈటెల స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్మి పార్టీలో చేరాననీ.. కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యంగా పనిచేస్తున్నాననీ చెప్పిన ఈటెల.. తాను ఎప్పటికీ బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. ఈటెలతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా పార్టీ మార్పు వార్తలపై స్పందించాడు. తాను బీజేపీలో చేరిన తర్వాత మరో పార్టీలోకి వెళ్ళే ఆలోచనే లేదని చెప్పాడు. కాంగ్రెస్ తెలంగాణలో ఎన్నటికీ అధికారంలోకి రాదనీ.. నాలుగు వర్గాలున్న కాంగ్రెస్ లో అందరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడే వాళ్ళేనంటూ చురక అంటించాడు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. కర్ణాటక రాజకీయ పరిస్థితులకు, తెలంగాణ రాజకీయ పరిస్థితులకు ఏమాత్రం పోలిక లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమంటూ టీకాంగ్రెస్ నేతలు గాలిలో మేడలు కడుతున్నారు.

ప్రపంచ డ్రగ్స్ మాఫియాను శాసిస్తున్న హాజీ సలీం.. అసలెవడు వీడు ?

పాబ్లో ఎస్కోబార్.. ఒకప్పుడు ప్రపంచ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఏలిన మకుటంలేని మహారాజు ఇతను. తన కూతురుకు చలేస్తున్నదని ఒక రాత్రి మొత్తం కరెన్సీ నోట్లను తగలబెడుతూ చలి కాచుకున్న చీకటి రాజ్యపు బిల్ గేట్స్. డ్రగ్స్ మార్కెట్ అంటే అంత పెద్ద సామ్రాజ్యం మరి. డ్రగ్స్ మరియు ఆయుధ మాఫియా తలచుకుంటే దేశాల ప్రభుత్వాలే కూలిపోతాయి. అంత శక్తివంతమైనది డ్రగ్స్ మాఫియా. అందుకే పాబ్లో ఎస్కోబార్ ప్రపంచంలోని చాలా దేశాల ప్రభుత్వాలను కంటి చూపుతో శాసించాడు. ఇప్పుడు అలాంటి మరో కొత్త డాన్ చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఆ కొత్త డాన్ పేరు హాజీ సలీం.
అరేబియా సముద్రంలో మూడురోజుల క్రితం ఎన్‌సీబీ అధికారులు భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 2.5 టన్నుల మెథంఫెటమిన్‌ను సీజ్ చేశారు. దీని విలువ 15వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో దాని వ్యాల్యూ 25వేల కోట్ల రూపాయలని తేలింది. ఇండియా చరిత్రలో ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. ఆ సమయంలో ఈ ఘటనను దేశం మొత్తం రెగ్యులర్‌గా జరిగే ఇష్యూగానే చూసింది. అరేబియా సముద్రంలోనో మరో చోటో ఇలా డ్రగ్స్ పట్టుబడ్డంలో పెద్ద వింతేం ఉందిలే అనుకుంది. కానీ, ఇందులోని సీరియస్ నెస్‌ మాత్రం ఆ మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్న అధికారులకే తెలుసు. ఎందుకంటే వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారమే ఆపరేషన్ సముద్రగుప్తను నిర్వహించారు. అరేబియా సముద్రంలో ఇంత పెద్ద ఆపరేషన్ నిర్వహించడానికి అసలు కారణం 2.5 టన్నుల డ్రగ్స్ వెనుక ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ కింగ్‌పిన్ హాజీ సలీం ఉండటమే.
హాజీ సలీం.. అలియాస్ హాజీ అలీ. భారత ఎన్‌సీబీ అధికారుల మోస్ట్‌వాంటెడ్‌ డ్రగ్స్‌ కింగ్‌పిన్‌. ఎలా ఉంటాడో తెలీదు.. ఎప్పుడు ఎక్కడుంటాడో కనిపెట్టడం కష్టం. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అండతో అరేబియా సముద్రంలో వేల కోట్ల డ్రగ్స్‌ సామ్రాజ్యాన్ని నిర్వహిస్తున్నాడు. అలా వచ్చిన డబ్బుతో అదే ఐఎస్ఐతో పాటూ పాకిస్తాన్ తీవ్రవాద సంస్ధలకు అండగా నిలుస్తున్నాడు. ఇతడి లక్ష్యం ఇండియాను నాశనం చేయడం ఒక్కటే.
హాజీ సలీం ఎక్కడా ఒక చోట స్థిరమైన స్థావరంలో ఉండడని ఎన్‌సీబీ అధికారులు చెబుతున్నారు. అతడు కొలంబియా డ్రగ్‌ లార్డ్‌ పాబ్లో ఎస్కోబార్‌ తరహాలో స్థావరాలను మార్చేస్తాడని పేర్కొన్నారు. ఇరాన్‌, పాకిస్తాన్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి తన వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అతడికి ఐఎస్‌ఐ అండదండలు పుష్కలంగా లభిస్తాయి. పాకిస్తాన్‌లో అతడు బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఉంటాడు. అతడి వెంట ఎప్పుడూ ఏకే-47లు, ఇతర అత్యాధునిక ఆయుధాలతో కూడిన బాడీగార్డుల వలయం ఉంటుంది. సలీం ఎల్లవేళలా శాటిలైట్‌ ఫోన్‌ వాడుతుంటాడు. మాల్దీవుల నుంచి పాకిస్తాన్‌ వరకు కమ్యూనికేషన్లు నెరుపుతుంటాడు. ఇప్పటికే డీజీ స్థాయి సమావేశంలో భారత్‌ అతడి వివరాలను పాక్‌, ఇరాన్, అఫ్గాన్‌కు అందించింది. కానీ, ఆ దేశాలన్నీ ఇతడిని చూసీచూడనట్లు వదిలేసేవే కాబట్టి ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో విచ్చల విడిగా ఈ కేటుగాడి వికృత క్రీడ కొనసాగుతోంది.
డ్రగ్స్‌ సరఫరాలో హాజీ సలీం యాక్షన్ అంతుచిక్కని రీతిలో ఉంటుంది. మాదక ద్రవ్యాలను కార్టల్స్‌కు సరఫరా చేసేందుకు ముందే డబ్బు తీసుకోడు. అప్పుగా వాటిని సరఫరా చేస్తాడు. తొలుత వాటిని విక్రయించి.. ఆ తర్వాత వచ్చిన సొమ్మును హవాల మార్గంలో చెల్లించమని చెబు తాడు. అలాగే, సలీం నుంచి వివిధ కార్టల్స్‌కు సరఫరా అయ్యే మాదకద్రవ్యాల ప్యాకెట్లపై ప్రత్యేకమైన గుర్తు లుంటాయి. ఇవి ఆ కార్టల్స్‌కు మాత్రమే తెలుసేలా ఉంటాయి. వీటిల్లో 999, 777, రోలెక్స్‌ 555, తేలు, బిట్‌కాయిన్‌, ఎగిరే గుర్రం, కింగ్‌ 21 లాంటి గుర్తులను ఎన్‌సీబీ, డీఆర్‌ఐ, ఎన్‌ఐఏ సంస్థలు గుర్తించాయి.
హాజీ సలీం నుంచి సరఫరా అయ్యే డ్రగ్స్‌ కనీసం ఏడు పొరలతో బలంగా ప్యాక్‌ చేస్తారు. వాటిని నీటిలో పడేసినా దెబ్బతినకుండా ఇలా చేస్తుంటారు. కొన్ని నెలల క్రితం భారత్‌లో అతడి తరఫున పనిచేస్తున్న వారిని ముంద్రా పోర్టు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. అప్పట్నుంచే ఈ డ్రగ్ కింగ్‌పిన్‌ ఆట కట్టించాలని ఎన్‌సీపీ బలంగా డిసైడ్ అయింది. మరో షాకింగ్ విషయమేంటంటే.. హాజీ సలీం శ్రీలంకలోని డ్రగ్ మాఫియా డాన్లు సి.గుణశేఖరన్ అలియాస్ గుణ, పుష్పరాజ్ అలియాస్ పూకుట్టి కన్నాలతో చేతులు కలిపాడు. ప్రస్తుతం వీళ్లంతా ఎల్టీటీఈ ని పునరుద్దరించే పనిలో ఉన్నారు. ఇందుకోసం అవసరమైన డబ్బును డ్రగ్స్ రూపంలోనే ఇస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఎల్టీటీఈని ఇండియాకు వ్యతిరేకంగా బలోపేతం చేయడమే హాజీ అసలు లక్ష్యం అని అధికారులు అనుమానిస్తున్నారు. ఇదే సమయంలో హాజీ సలీంకు మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో బలమైన సంబంధాలు ఉన్నాయి. డ్రగ్‌ డీల్స్ కోసం కరాచీలోని క్లిఫ్టన్‌ రోడ్డులో దావూద్‌ రహస్య స్థావరానికి ఇతడు వస్తుంటాడని తెలుస్తోంది. చాలా సందర్భాల్లో పాకిస్తాన్‌ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ కూడా హాజీ సాయం తీసు కుంటోంది. ప్రత్యేకించి ఇండియాలో డ్రగ్స్ వ్యాపార విస్తరణతోపాటూ భారత వ్యతిరేక శక్తులకు యాక్టివ్ చేయడమే ఈ కేటుగాడి లక్ష్యంగా కనిపిస్తోంది. అసలే ఖలిస్తానీ శక్తులు బలపడి ఇండియాకు సవాళ్లు విసురుతున్న ఇలాంటి సమయంలో ఎల్టీటీఈ కూడా బలపడితే మన దేశానికి ముప్పు తప్పకపోవచ్చు. తమిళనాడులో ఇప్పుడున్న డీఎంకే సర్కార్‌ కూడా ఎల్టీటీఈని వ్యతిరేకించదు. హాజీ సలీం కూడా ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే కుట్రలు చేస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ఇండియా ముందున్న లక్ష్యం ఒక్కటే డ్రగ్స్ కింగ్‌పిన్ హాజీ సలీం ఆటకట్టించడం. ఇందులో భాగంగానే ఆపరేషన్ సముద్రగుప్తి పేరిట ఎప్పుడో యాక్షన్‌లోకి దిగిపోయింది. ఈ క్రమంలోనే ఆల్మోస్ట్ 40వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐతే, దీనివెనుకున్న డ్రగ్స్ డాన్ మాత్రం అంత ఈజీగా దొరికే పరిస్థితులు కనిపించడంలేదు. మరి ఈ కన్నింగ్ డాన్‌కు ఇండియా ఎలాంటి క్లైమాక్స్ ఇస్తుందో చూడాలి.

కాంగ్రెస్ కు అసలు యుద్ధం ఇక్కడే : సచిన్ Vs గెహ్లాట్

కర్ణాటక ఎన్నికల యుద్ధం చివరి అంకానికి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికలను 2024 సార్వత్రిక పోరుకు సెమీఫైనల్‌గా భావించినా.. ఇక నుంచి జరిగే ప్రతి ఎన్నికా అంతకుమించే ఉంటుంది. మరీ ముఖ్యంగా బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్న కాంగ్రెస్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరి ఓటు పోలయ్యే వరకూ చావో రేవో తేల్చుకునేలానే యుద్ధం చేయాల్సి ఉంటుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిణామాలు సంభవించినప్పటికీ.. ఆ పార్టీకి అసలైన సవాల్ మాత్రం ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లోనే. కర్ణాటకలో ఓడినా అక్కడ అధికారంలో లేం కాబట్టే అని సరిపెట్టుకోవచ్చు. కానీ, రాజస్థాన్‌లో అధికారంలో ఉండికూడా ఓడితే దాని ప్రభావం ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుంది. ఇదే సమయంలో ఇప్పటికే తిరుగులేని శక్తిగా ఉన్న కమలం పార్టీ మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది. ఈ విషయాలన్నీ ప్రత్యర్ధులకంటే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి ఇంకాస్త ఎక్కువగానే తెలుసు. ఎందుకంటే మధ్య ప్రదేశ్, పంజాబ్‌లో తగిలిన ఎదురు దెబ్బలను మరిచిపోవటం హస్తం పార్టీకి అంత తేలిక కాదు.
ఈ ఏడాది చివరినాటికి రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగబోతోంది. దీనికోసం కమలం పార్టీ ఆల్రెడీ గ్రౌండ్‌లెవెల్‌ యాక్షన్‌లోకి కూడా దిగిపోయింది. ఇప్పటికే ప్రధాని మోడీ రాజస్థాన్‌లో అభివృద్ధి యాక్షన్‌ షురూ చేశారు. అయితే, అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరిస్థితే అంతగా బాలేదు. సీనియర్, జూనియర్ పంచాయితీలో టాప్‌లో ఉండే హస్తం పార్టీని రాజస్థాన్‌లోనూ అవే సమస్యలు వెంటాడుతున్నాయి. గతంలో ఎన్నికల్లో గెలిచిన తర్వాత అశోక్ గెహ్లట్, సచిన్ పైలెట్ మధ్య సీఎం కుర్చీ వివాదం రాజుకుంది. అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పిలిచి ఇద్దరిని కన్విన్స్ చేసి అశోక్‌గెహ్లట్‌ను సీఎంగా ప్రకటించింది. సీనియారిటీకే ప్రధాన్యత ఇచ్చింది. కానీ, సచిన్ పైలట్ కారణంగానే రాజస్థాన్‌లో హస్తం పార్టీ గెలిచిందనే వాదన ఉంది. సచిన్ పైలట్ సైతం కష్టం తనది, సీఎం కుర్చీ మాత్రం అశోక్‌దీ అన్నట్టుగా చాలా సందర్భా ల్లో వ్యతిరేకతను బయటపెడుతూనే ఉన్నారు. ఇటీవల నిరాహార దీక్షలు సైతం నిర్వహించిన సచిన్.. ఇప్పుడు జన్ సంఘర్ష్ యాత్ర అంటూ జనంలోకి వెళ్లిపోయారు. అదికూడా అధిష్టానం మాట లెక్కచేయకుండానే.
తమ గళాన్ని వినిపించడానికి, ప్రజల గొంతులను తెలుసుకోడానికీ, తాను ప్రజల గళంగా మారడానికీ ఈ యాత్ర చేపట్టినట్టు సచిన్ పైలట్ తెలిపారు. అవినీతిపై పోరాటం అగ్ని నదిని దాటడం లాంటిదని, మనం ఆ నదిని ఈదాల్సిందేనని తన మద్దతు దారులకు పిలుపునిచ్చారు. ఇదే సమయంలో వేలాది మంది మద్దతుదారులు ఈ యాత్రలో సచిన్ పైలట్‌ను అనుసరించారు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష పేపర్ల లీకేజీ గురించి కూడా ఈ యాత్రలో పైలట్‌ ప్రస్తావించారు. రాజస్థాన్‌లో అవినీతిని అరికట్టాలని ఏడాది కాలంగా తాను సీఎంకు లేఖలు రాస్తున్నా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని మరోసారి పునరుద్ఘాటించారు. సచిన్ జన్‌సంఘర్ష్‌ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఓ అంచనాకు వచ్చిన హస్తం పార్టీ.. పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాలు చేసింది. తాజా యాత్ర పూర్తి‌గా సచిన్ వ్యక్తిగతమని, పార్టీతో దీనికి ఎలాంటి సంబంధం లేదని రాజస్థాన్‌ కాంగ్రెస్‌ లీడర్ గోవింద్‌ స్పష్టం చేశారు. పార్టీ గుర్తు, కాంగ్రెస్‌ అగ్రనేతల ఫొటోలతో చేపడితేనే అది కాంగ్రెస్‌ యాత్ర అవుతుందని, సచిన్ యాత్ర అలాంటిది కాదన్నారు.
ఓ వైపు సచిన్ పైలట్ తాను ఎవరినీ టార్గెట్ చేసేందుకు యాత్ర చేయడం లేదని స్పష్టంగా చెబుతుంటే.. మరోవైపు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాత్రం సచిన్‌ను టార్గెట్ చేస్తూ జన్ సంఘర్ష్‌ యాత్రకు లేనిపోని మైలేజ్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదే సమయంలో ప్రధాని మోడీ సైతం ఇటీవల తన రాజస్థాన్ పర్యటన లో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాజస్థాన్ కాంగ్రెస్‌లో ఐక్యత లేదనీ, వారిలో వారు తన్నుకోవడానికి టైం సరిపోవడం లేదనే అర్ధం వచ్చేలా సెటైర్లు వేశారు. సీఎం కుర్చీ కోసమే తప్ప ప్రజల ప్రయోజనాలు హస్తం పార్టీ నేతలకు పట్టవంటూ ఫైర్ అయ్యారు. ఫలితంగా మధ్య ప్రదేశ్, పంజాబ్‌లో జరిగినట్టే రాజస్థాన్‌లోనూ జరుగుతోందా? అనే ప్రశ్నలు మొదలయ్యాయి.
గతంలో మధ్య ప్రదేశ్‌లో జరిగిందే ఇప్పుడు రాజస్థాన్‌లోనూ జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మధ్య ప్రదేశ్‌లో కూడా జ్యోతిరాధిత్య సిందియాకు సంబంధించిన విషయంలో సీఎం పదవి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ఇవ్వలేదు. దీంతో విసిగి వేసారిపోయిన జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. మరో రాష్ట్రం పంజాబ్‌లోనూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. అక్కడ కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధు మధ్య జరిగిన అంతర్గత రచ్చతోనే అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉండి కూడా దారుణంగా ఓటమి పాలయ్యారు. సింపుల్‌గా చెప్పాలి అంటే పంజాబ్, మధ్య ప్రదేశ్ లాంటి ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ తనకు తానే ఓటమి కొనితెచ్చుకుంది. ఇదే సమయంలో ఆయా ప్రాంతాల్లో బీజేపీ పుంజుకుంటోంది. ఇప్పుడు రాజస్థాన్‌లోనూ అదే జరిగేలా కనిపిస్తోంది.
మరోవైపు.. రాజస్థాన్‌లో రాజకీయ పరిణామాలు కూడా చాలా వేగంగా మారిపోతున్నాయి. అసాధ్యం అనేచోట కమలం పార్టీ బూస్టింగ్ ఇచ్చే విజయం సాధించింది. స్థానిక లోకల్ బాడీ ఎన్నికల్లో 14 స్థానాల్లో బీజేపీ 8 చోట్ల విక్టరీ కొట్టింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలకే పరిమితమైంది. ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎక్కడా కూడా కాంగ్రెస్ ఓడి పోలేదు. కానీ, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడటం ఊహించని పరిణామం. ఇలాంటి టైంలో సచిన్ పైలట్ గేర్ మార్చడం కాంగ్రెస్‌ను కష్టాల్లోకి నెట్టడం మాత్రమే కాదు. అంతకుమించిన ఫలితాలనే ఇవ్వబోతోందనే విశ్లేషణలు మొదలయ్యాయి. అదే నిజమై మధ్య ప్రదేశ్, పంజాబ్‌ను చేజార్చుకున్నట్టే రాజస్థాన్‌ను కూడా కోల్పోవాల్సి వస్తే మాత్రం 2024లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆశించిన ఫలితం ఎంతమాత్రం రాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. సింపుల్‌గా చెప్పాలంటే సచిన్ వర్సెస్ గెహ్లాట్ ఎపిసోడ్‌కు ముగింపు ఇవ్వగలిగితేనే హస్తం పార్టీకి అవకాశాలుంటాయి. ఆ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఎంతవరకూ సక్సెస్ అవుతారో చూడాలి.

“ఇలా సీఎం కాలేను” : కుండ బద్దలుకొట్టిన పవన్ కళ్యాణ్

0

వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ముఖ్యమంత్రి పదవి.. ఇలాంటి కీలక అంశాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశాడు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో పవన్ చాలా అంశాలపై స్పష్టతనిచ్చారు. సీఎం సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వేళ.. ఇలా అరిస్తే తాను ముఖ్యమంత్రిని కాలేననీ.. గజమాలలకు బదులు ఓట్లు వేస్తే మాత్రమే తాను సీఎం కాగలననీ ముక్కుసూటిగా చెప్పేశాడు పవన్. అలాగే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీతో పొత్తు ఉంటుందని కుండ బద్దలు కొట్టేశాడు. ఏది ఏమైనా సరే ఆ రెండు పార్టీలతో కలిసే ఎన్నికలకు వెళ్తానని ఇందులో సందేహమే లేదని పూర్తి స్పష్టతనిచ్చాడు పవన్. పవన్ దృష్టి మొత్తం సినిమాలపైనే ఉందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కూడా పవన్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే జూలై నుంచి తాను పూర్తిగా పార్టీ పనులు, వచ్చే ఎన్నికలపైనే దృష్టి సారిస్తానని తేల్చి చెప్పాడు.
మూడో పార్టీలో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి బలి కావటానికి జనసేన సిద్ధంగా లేదంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఓటమి తప్పదని పవన్ భయపడుతున్నాడా అనే విధంగా ఉన్నాయి పవన్ వ్యాఖ్యలు. ప్రతిసారీ వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అని బల్లగుద్ది చెప్పే పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా అదే మాట చెప్పాడు. ముఖ్యమంత్రిని కావటం తన మొదటి లక్ష్యం కాదనీ.. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని దించటమే తన మొదటి లక్ష్యమనీ వ్యాఖ్యానించాడు. ముందు ఎన్నికల వ్యూహం రచించటం.. పొత్తులు తేల్చటం.. గెలవటం.. ఇవన్నీ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి పదవి గురించి ఆలోచిస్తానంటూ సీఎం పదవిపై కీలక వ్యాఖ్య చేశాడు. సీఎం పోస్టు అడిగే అర్హత సంపాదించి.. ఆ తర్వాత అడుగుతానన్నాడు. మొత్తానికి తన లక్ష్యం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని గద్దె దించటం మాత్రమే అనేది బల్లగుద్ది చెప్పాడు పవన్ కళ్యాణ్. ఇన్ని రోజులు పొత్తులు, సీట్లు, ముఖ్యమంత్రి పదవి ఎవరికి.. ఇలాంటి విషయాల్లో చాలా అనుమానాలు, పుకార్లు వినిపించేవి.. ఇప్పుడు పవన్ స్టేట్మెంట్ తో ఫుల్ క్లారిటీ వచ్చేసింది.

“నేనే కర్ణాటక కింగ్” : సంబరపడిపోతున్న కుమార స్వామి

కర్ణాటక ఎన్నికలు పూర్తైన వేళ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. జాతీయ స్థాయిలో దాదాపు తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో మాత్రం 120 సీట్లు సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రావటమే ఇందుకు కారణం. కానీ ఈ సర్వే ఫలితాలు తప్పు అనీ.. అన్ని సర్వేలు తప్పుడు ఫలితాలనే చెప్పాయనీ బల్లగుద్ది చెప్తున్నాడు జేడీఎస్ అధినేత కుమారస్వామి. అటు కాంగ్రెస్ పార్టీకి గానీ, ఇటు బీజేపీకి గానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సరిపడే సీట్లు ఖచ్చితంగా రావని చెప్తున్న కుమారస్వామి.. తన మద్దతు లేకుండా ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. 40 సీట్లతో తన పార్టీయే కింగ్ మేకర్ గా అవతరిస్తుందని.. కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోయే కింగ్ తానేననీ బహిరంగంగానే చెప్పేస్తున్నాడు కుమారస్వామి. ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్, బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం సాధ్యం కాదని కుమారస్వామి ఫీలింగ్.
2018లో కూడా కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ.. సిద్దరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తాయిలాల కోసం ఆశపెట్టి బీజేపీకి మద్దతిచ్చేలా చేయటంతో కాంగ్రెస్-జేడీఎస్ ఉమ్మడి ప్రభుత్వం కుప్పకూలి బీజేపీ చేతికి అధికారం చిక్కింది. ఎప్పుడు ఎదురు తిరుగుతారో తెలియని జేడీఎస్ తో పొత్తు పెట్టుకుంటే మళ్ళీ ఇలాంటి పరిస్థితే వస్తుందేమోనని కాంగ్రెస్ భయపడుతుండగా.. తమతో పొత్తు తప్ప కాంగ్రెస్ కు మరో మార్గం లేదని జేడీఎస్ సవాల్ చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటూ బీజేపీ నేతలు కూడా తనను సంప్రదించారంటూ కుమారస్వామి చెప్తుండగా.. తాము ఎవరినీ కలుపుకోబోమనీ.. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్, బీజేపీ నొక్కి చెప్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటేనే జేడీఎస్ కు లాభం కాబట్టి ఈసారి జేడీఎస్ బీజేపీతో పొత్తు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమనే అంచనాలు వినిపిస్తున్నాయి. మరి కొద్ది గంటల్లో ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరో 24 గంటల్లో ఫలితాలు దాదాపుగా తెలిసిపోతాయి. అప్పుడు మొదలవుతుంది అసలు పొత్తుల రాజకీయం. ఈసారి కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేయటానికి సరిపడే నిధులు సమకూర్చుకోవటం అసాధ్యం. అలాంటప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మరో భారీ పరాజయం తప్పదు. ఇది కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం.. కాబట్టి కర్ణాటక ఫలితం కాంగ్రెస్ కు జీవన్మరణ సమస్య.

వచ్చే ఆర్నెల్లు సినిమాలు చేస్తే ఆ తర్వాత చేసేదేముంది పవన్ ?

0

ఏపీలో పొత్తులు, పంపకాలతో ఎలక్షన్ పాలిటిక్స్ ఊపందుకున్న వేళ.. పవన్ కళ్యాణ్ గురించి ఓ వార్త మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ చేయటానికి పవన్ పక్కా ప్లాన్ వేసుకున్నాడనీ.. వచ్చే ఆర్నెల్లలో ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత ఎన్నికల మీద ఫుల్ ఫోకస్ చేయాలని పవన్ గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆ వార్త సారాంశం. ఏపీ ఎన్నికలకు ఉన్నదే యేడాది సమయం. ఒక వేళ ముఖ్యమంత్రి జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే నిర్ణయం గానీ తీసుకుంటే.. ఆ మాత్రం సమయం కూడా ఉండదు. పార్టీ పుట్టి తొమ్మిదేళ్ళు దాటి పదో యేట అడుగుపెట్టినా.. సంస్థాగత స్థాయిలో జనసేన పార్టీ నిర్మాణం ఇప్పటికీ జరగలేదు. బూత్ స్థాయిలో పార్టీ పటిష్ఠంగా తయారైనప్పుడే ఆ పార్టీ సంపూర్ణ నిర్మాణం జరిగినట్టు. నియోజకవర్గంలోని గ్రామగ్రామాల్లో తిరిగి పట్టు సాధించిన నాయకులు ఉన్నప్పుడు బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణం జరుగుతుంది. అలాంటి నాయకులు జనసేనలో లేరు కాబట్టే వైసీపీ అధినేత జగన్.. దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయగలవా అంటూ సవాల్ చేస్తున్నాడు. ఇలాంటి స్థితిలో జనసేన పార్టీ ఉన్నప్పుడు.. ఇప్పటి నుంచే ఎన్నికలపై దృష్టి పెడితేనే నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం సాధ్యమవుతుంది. కానీ పవన్ మాత్రం వచ్చే ఆరు నెలల్లో సినిమాలు వేగంగా పూర్తి చేసి.. ఆ తర్వాత ఆరు నెలలు ఎన్నికలపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకోవటం తప్పుడు నిర్ణయం అవుతుంది.
నిజానికి ఏ రాష్ట్రంలోనైనా సరే ఎలక్షన్ ఫీవర్ అనేది ఓ సంవత్సరం ముందే మొదలవుతుంది. నాలుగేళ్ళు పరిపాలనపై దృష్టిపెట్టిన ప్రభుత్వాలు.. ఆ చివరి యేడాది ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పనిచేస్తాయి. ఎన్నికల్లో గెలవటానికి ఏ వ్యూహాలతో వెళ్ళాలి.. మేనిఫెస్టోలో ఏ అంశాలు ఉండాలి.. ఎన్ని ఫ్రీ పథకాలు ఇస్తే జనాన్ని ఆకర్షించవచ్చు.. కులం, మతం లెక్కన ఓట్లు రాబట్టాలంటే ఏం చేయాలి.. ప్రతిపక్ష పార్టీ పుంజుకోకుండా ఎవరిని టార్గెట్ చేయాలి.. ఇలా ఎన్నికలు అంటే సవాలక్ష సవాళ్ళు, లెక్కలు ఉంటాయి. ఇలాంటి లెక్కలు వేయటానికి జనసేనలో తలపండిన రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. జనసేన పేరు చెప్తే పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్.. అప్పుడప్పుడు కనిపించి పలకరించే నాగబాబు.. వీరు తప్ప ఇంకెవరూ చెప్పుకోదగిన నాయకులు జనసేనలో లేరు. కాబట్టి పవన్ వీలైనంత తొందరగా ఎమ్మెల్యే అభ్యర్థులను వెతికే పని మొదలుపెట్టాలి. బూత్ స్థాయిలో కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసే దిశగా గట్టి ప్రచారాన్ని ప్రారంభించాలి. దశాబ్ధాల అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలే ఎప్పుడో పాదయాత్రలు, బస్సు యాత్రలంటూ ప్రజల్లోకి వెళ్ళటం మొదలుపెట్టేశారు. చంద్రబాబు, లోకేష్ కాలుకి బట్టకట్టకుండా రాష్ట్రమంతా తిరుగుతున్నారు. కానీ పవన్ మాత్రం ఇంకా సినిమాలు అంటూనే తిరిగితే ఈసారి కూడా పవన్ ప్రతికూల ఫలితాలనే చూడాల్సి వస్తుంది. రాజకీయం చేయాలంటే పవన్ కు ఆదాయమార్గం సినిమా ఒక్కటే అనేది నిజమే. కానీ.. ఎన్నికల యేడాదిలో కూడా సినిమాలపైనే ఫోకస్ చేస్తే.. డబ్బులు వస్తాయే తప్ప ఓట్లు రావు. ఒక్కో ఇంటికి పదేసి సార్లు తిరిగి అడుక్కుంటేనే ఓట్లు పడతాయన్న నమ్మకం లేదు. ఇక వారాహి ఎక్కి అంత దూరం నుంచి దండం పెట్టి ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తే ఓటర్లు కరుణిస్తారా అనేది పవన్ కొంచం ఆలోచించాలి.