Home Blog Page 15

“మళ్ళీ పెళ్ళి” కాదు.. “మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెళ్ళి” !

0

“మళ్ళీ పెళ్ళి సినిమాను 600 భాషల్లో తీయొచ్చు.. అంత కంటెంట్ ఉంది ఈ సినిమాలో”.. ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ డైలాగ్. నరేష్, పవిత్ర లోకేష్ తమ నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామనీ.. అన్ని దేశాల వారికీ, అన్ని భాషల వారికీ ఈ సినిమా కనెక్ట్ అవుతుందని చెప్తూ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నరేష్ ఈ కామెంట్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. “అన్ని భాషల్లో తీయటానికి నువ్వేమైనా ప్రపంచ యుద్ధం గురించి సినిమా తీస్తున్నావా..” అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో నరేష్ ను పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. “మళ్ళీ పెళ్ళి అని కాదు.. మళ్ళీ మళ్ళీ మళ్ళీ పెళ్ళి అని పేరు పెట్టాల్సింది ఈ సినిమాకు” అని ఒకరు.. “ఎనిమిదో పెళ్ళి” అని పేరు పెట్టాల్సింది అంటూ మరొకరు.. ఇలా మళ్ళీ పెళ్ళి సినిమాను ఆట ఆడేసుకుంటున్నారు. నరేష్ ఈ డైలాగ్ చెప్తున్న సమయంలో పవిత్ర సిగ్గు పడుతూ నవ్వుతున్న సీన్ ను “మీరు సిగ్గు పడకండి.. చచ్చిపోవాలనిపిస్తుంది” అనే డైలాగ్ తో కలిపి సోషల్ మీడియాలో వదిలేశారు జనాలు. మొత్తానికి మళ్ళీ పెళ్ళి సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసిందన్నమాట.
ఏదేమైనా నరేష్ కాన్ఫిడెన్స్ ను మెచ్చుకోవాలి. లేకపోతే.. తాను చేసుకున్న నాలుగు పెళ్ళిళ్ళు.. పవిత్ర చేసుకున్న మూడు పెళ్ళిళ్ళ చుట్టూ ఓ కథ రాసేసుకొని.. అది సినిమాగా తీయటం.. అదేదో పాన్ ఇండియా సినిమా రేంజ్ లో పబ్లిసిటీ చేసుకోవటం.. ఏమిటిదంతా..?! ఇదేదో సుభాష్ చంద్రబోస్ లేక నెల్సన్ మండేలా బయోపిక్ సినిమానా..? లేకపోతే.. భారత స్వాతంత్రోద్యమం గురించి తెరకెక్కించిన ఓల్డ్ క్లాసిక్ సినిమానా..? ఇంతోటి దానికి టీజర్ లాంచ్ ఈవెంట్లు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు..!! బయటకు చెప్పటం లేదు గానీ.. టాలీవుడ్ జనాలు లోలోపల తెగ నవ్వుకుంటున్నారనిపిస్తోంది. కృష్ణ ఫ్యామిలీకి ఉన్న గౌరవాన్ని చెడదొబ్బటం కాకపోతే.. ఏంది ఈ రచ్చ..? ఇప్పటికే “ఆయనకు నాలుగు.. ఆమెకు మూడు..” అంటూ మీడియా ఏకి పారేస్తున్నా వీళ్ళకు సిగ్గుగా అనిపించటం లేదేమో. చేసిందే వెధవ పని.. అందులో మళ్ళీ లాజిక్స్ చెప్తారు మహానుభావులు. మూడో పెళ్ళానికి విడాకులు ఇవ్వకుండా నాలుగో పెళ్ళి.. అది కూడా మూడు సార్లు విడాకులు తీసుకున్న హీరోయిన్ తో..! దీని గురించి సినిమా.. దానికి పబ్లిసిటీ.. ఏంటో దిక్కుమాలిన పని..? వెర్రి కాకపోతే ఏమిటిది.. !?. ట్రైలర్ లాంచ్ కే ఇంత రచ్చ చేస్తున్నారు.. సినిమా రిలీజైన రోజున ఇంకెన్ని వినాలో.. ఇంకెన్ని చూడాలో.. ఖర్మ..!!!

భారత్ ఎఫెక్ట్ : వన్డే వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఔట్ ?

ఆసియా కప్ వేదిక పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినందుకు ప్రతీకారంగా ఆసియా కప్ తో పాటు వన్డే ప్రపంచ కప్ నుంచి కూడా వైదొలగుతామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ లో జరగాల్సిన ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకోవటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు నజమ్ సేథి తాము ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఇటు ఆసియా కప్ తో పాటు వచ్చే ప్రపంచ కప్ పై కూడా సంధిగ్ధత నెలకొంది. అసలు ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉండగా దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాము పాకిస్తాన్ లో పర్యటించటం కుదరదంటూ ఆసియా క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. దీనిపై బీసీసీఐని ఏసీసీ పునరాలోచించాలని కోరగా.. ఈ విషయంలో బీసీసీఐ ఏమీ చేయలేదనీ.. దీనిపై తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనంటూ తేల్చి చెప్పింది. భారత్ నిర్ణయంతో ఆసియా కప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మారుస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని మ్యాచ్ లను కాకపోయినా కనీసం తాము ఆడే మ్యాచ్ లను అయినా పాకిస్తాన్ లో నిర్వహించాలంటూ కోరింది. కానీ ఏసీసీ అందుకు అంగీకరించలేదు. కావాలంటే పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. దీనిపై శ్రీలంక అభ్యతరం చెప్పింది. ఎండాకాలంలో దుబాయ్ లో మ్యాచ్ లు ఆడటం తమ వల్ల కాదని శ్రీలంక స్పష్టం చేసింది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. చివరికి ఆసియా కప్ అన్ని మ్యాచ్ లను శ్రీలంకలోనే నిర్వహించాలని నిర్ణయించింది.
అటు తిరిగి ఇటు తిరిగి పాకిస్తాన్ లో జరగాల్సిన టోర్నమెంట్ ను శ్రీలంకకు మార్చటం తమకు ఏమాత్రం నచ్చలేదనీ.. కేవలం భారత్ అభ్యంతరం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతీకారంగా తాము ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తున్నామని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ లో కనీసం తాము ఆడే నాలుగు మ్యాచ్ లైనా నిర్వహిస్తామంటేనే తాము ఈ రెండు టోర్నమెంట్లలో ఆడుతామనీ.. లేదంటే మాత్రం ఈ రెండు మెగా టోర్నీలలో తాము ఆడేది లేదంటూ తుది నిర్ణయం చెప్పింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ లో అడుగు పెట్టేదే లేదని.. ఇది కేవలం క్రికెట్ కు సంబంధించిన అంశంగా తాము చూడటం లేదని భారత్ చెప్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించటం సరికాదని.. దీన్ని అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. పంతానికి పోయి పాకిస్తాన్ ఆసియా కప్ తో పాటు ప్రపంచ కప్ ను బహిష్కరించటం ఖాయంగా కనిపిస్తోంది.

“అంత అహంకారమా ?” : పవన్ పై పూనమ్ కౌర్ ఫైర్

0

వివాదాస్ఫద వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడూ అలా బ్రేకింగ్ న్యూస్ లో కనిపించే నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా పోస్టర్ పై చేసిన ట్వీట్ మళ్ళీ ఆమెను బ్రేకింగ్ న్యూస్ లో ఉండేలా చేసింది. లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ విడులదైంది. ఈ పోస్టర్ పైనే పూనమ్ కౌర్ విమర్శ చేసింది. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ కాలు కనిపిస్తోంది. ఈ కాలు కింద సినిమా టైటిల్ ఉస్తాద్ భగత్ సింగ్ అని ఉంది. దీనిపైనే పూనమ్ ఫైర్ అయ్యింది. మీరు స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయినా ఫరవాలేదు.. కానీ అవమానించకండి.. కాలు కింద భగత్ సింగ్ పేరు వేస్తారా.. అంటూ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ప్రశ్నించింది. దీనిపై ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ కు పూనమ్ కు మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మళ్ళీ వార్తల్లో కనిపించే పని మొదలుపెట్టావా అంటూ పూనమ్ ను పవన్ ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.
పూనమ్ కౌర్ బ్రేకింగ్ న్యూస్ గా మారటానికి చేసినా.. నిజాయితీగా చేసినా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అది అవ్వటానికి కేవలం సినిమా పోస్టరే అయినా.. టైటిల్ ప్లేస్ మెంట్ కరెక్ట్ కాదనే అనిపిస్తోంది. కాలు కింద టైటిల్ ప్లేస్ చేసే బదులు అదేదో పైన పెట్టేస్తే సరిపోతుంది కదా. నిజానికి పోస్టర్ డిజైన్ చేసిన సమయంలో ఇంత లోతుగా ఆలోచించి ఉండకపోవచ్చు. టైటిల్ పైన కాలు ఫోటో బాగోదన్న ఆలోచన తట్టి ఉండకపోవచ్చు. పూనమ్ దురుద్దేశంతో చేసినా సరే సినిమా యూనిట్ పాజిటివ్ గా తీసుకొని పోస్టర్ సవరిస్తే బాగుంటుంది. దీని వల్ల పూనమ్ కౌర్ కు వచ్చే క్రెడిట్ ఏమీ లేదు.. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా టీమ్ కు పోయేది కూడా ఏమీ లేదు. పైగా.. పోస్టర్ డిజైన్ మార్చితే సినిమాపై గౌరవం పెరుగుతుంది.

కర్ణాటకలో మెజార్టీ రాకపోతే..! : ప్లాన్ సిద్ధం చేసిన అమిత్ షా

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన వేళ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు రాజకీయాన్ని మరింత రసవత్తరం చేశాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించటంతో పాటు కర్ణాటకలో పొత్తులు లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. సర్వే ఫలితాలు దాదాపుగా కాంగ్రెస్ కే ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ వస్తుందంటూ చెప్తున్నాయి. ఒకటి రెండు సర్వేలు మాత్రమే కాస్త బీజేపీకి వంద సీట్లు వస్తాయన్నట్టుగా చెప్తున్నాయి. అయితే కర్ణాటకలో తెరవెనుక రాజకీయం రంజుగా సాగుతోంది. ఎన్నికల ప్రచారం సమయంలో కర్ణాటకకు వచ్చిన అమిత్ షా.. ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన ఆధిత్యం రాకపోతే ఏం చేయాలో పక్కా ప్లాన్ చేసి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంలో అసలు గత 20 యేళ్ళలో కర్ణాటకలో ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
2004లో కూడా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు ఈ ఎన్నికల్లో లాగానే. బీజేపీకి 79 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 65 సీట్లు రాగా.. బీజేపీ కంటే తక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 58 సీట్లలో విజయం సాధించిన జేడీఎస్ తో కలిసి అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కొద్ది నెలల్లోనే ప్రభుత్వం కుప్పకూలిపోయి రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది. కాంగ్రెస్, జేడీఎస్ రెండు పార్టీలూ కూడా తామే కర్ణాటకను ఏలాలనీ.. పాలన అధికారాలు మొత్తం తమ వద్దే ఉండాలని కోరుకుంటాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య పొసగని పొత్తు కుప్ప కూలింది. ఆ తర్వాత 2018 కూడా ఇదే తప్పు రిపీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి ఆధిపత్యం తమకే దక్కాలని కోరుకునే జేడీఎస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి యేడాది తర్వాత మళ్ళీ పొత్తు బెడిసికొట్టి ప్రభుత్వం రద్దు అయ్యింది.
ఎగ్జిట్ పోల్ అంచనాలను ఓసారి పరిశీలిస్తే.. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి రావాల్సిన 113 సీట్ల పూర్తి ఆధిక్యత రానున్నట్టు కనిపించటం లేదు. పైగా ఈ సారి కూడా జేడీఎస్ 30కి పైగా సీట్లతో కింగ్ మేకర్ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కానీ ఈసారి జేడీఎస్ తో పొత్తు పెట్టుకొని ప్రభుత్వ ఏర్పాటు జరుగుతుందా లేదా అనేదే అసలు విషయం. 25 సీట్లు వస్తే చాలు తన కొడుకును సీఎం చేయటానికి ఎత్తులు వేస్తున్నాడు కుమారస్వామి తండ్రి దేవెగౌడ. అటు కాంగ్రెస్ ముందు ఇటు బీజేపీ ముందు ఒక్కటే డిమాండ్ పెట్టేసాడు.. అది తన కొడుకును సీఎం చేయాలని. 90 నుంచి 100 సీట్లు సాధించిన పార్టీ ఏదైనా 25 సీట్లు సాధించిన పార్టీకి సీఎం పదవి ఇస్తుందా.. అదీ ఇక్కడ అసలు సమస్య.
కాంగ్రెస్ కు పూర్తి ఆధిక్యత రాకపోతే అనే సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ కు 120 సీట్లు వచ్చినా ఇక్కడ ముఖ్యమంత్రి పదవి చాలా పెద్ద సమస్య అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్దరామయ్య సీఎం కాకూడదనేది డి శివకుమార్ బలమైన కోరిక. తానే సీఎం సీటు ఎక్కాలని చాలా పట్టుదలతో ఉన్నాడు శివకుమార్. కానీ కాంగ్రెస్ సోనియా, రాహుల్ మాత్రం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే శివకుమార్ కు ప్రియాంక గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదాలున్నాయి. ఇలా కాంగ్రెస్ లోనే రెండు వర్గాల మధ్య సీఎం సీటు పై ఆశ ఉండగా.. తాను చచ్చేలోగా కుమారస్వామిని సీఎంగా చూడాలని ఎంతటి రాజకీయమైన చేయటానికి దేవెగౌడ సిద్ధంగా ఉన్నాడు. ఇదీ కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీ పరిస్థితి.
ఇక్కడే ఎవరూ ఊహించని ఓ సీన్ జరగబోతోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి అమిత్ షా వచ్చిన మొదటి రోజే రాత్రి 2 గంటలకు రహస్యంగా శివకుమార్ అమిత్ షా తో భేటీ అయ్యాడు. కేవలం 10 నిముషాల పాటు జరిగిన ఈ భేటీలో భవిష్యత్తు గురించి స్కెచ్ రెడీ అయిపోయింది. 2018లో కుమారస్వామి ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య ఎలగైతే పడగొట్టి కాంగ్రెస్ ను అధికారానికి దూరం చేశాడో ఇప్పుడు అందుకు ప్రతీకారంగా శివకుమార్ అదే పని చేయబోతున్నాడన్నమాట. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కని పరిస్థితుల్లో శివకుమార్ తన సొంత పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను బీజేపీలో చేరేందుకు డీల్ సెట్ చేస్తాడు.. భారీ ఆఫర్లతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మద్దతు ఇస్తారు. అలా బీజేపీ అధికారంలోకి వస్తుంది.. ఇందుకు బహుమతిగా శివకుమార్ ను అక్రమ ఆస్తుల కేసులో విచారిస్తున్న సీబీఐ.. అరెస్టు చేయకుండా ఉంటుంది. ఒక వేళ సిద్దరామయ్య కాకుండా శివకుమార్ సీఎం అభ్యర్థి అయితే బీజేపీ జేడీఎస్ ను కలుపుకోటానికి ప్రయత్నిస్తుంది. ఎటూ వచ్చి.. ఈసారి కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు అనేది బీజేపీ ప్లాన్. కర్ణాటకో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చే ఎన్నికలకు కావాల్సిన డబ్బును సమకూర్చుకోగలుగుతుంది. ఇదే జరిగితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకుంటుంది. ఇది బీజేపీకి ఏమాత్రం ఇష్టంలేదు.. ఉండదు. సో.. కర్ణాటకలో కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడుతుంది. ఈసారి కాంగ్రెస్ ఓడిపోతే దేశంలో కాంగ్రెస్ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే. బీజేపీకి కావాల్సింది కూడా అదే. సో.. కర్ణాటకలో స్కెచ్ వేస్తే ఢిల్లీ కుర్చీ కింద భూకంపం రావటంతో పాటు వందేళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుంది. ఇదీ.. కంటికి కనిపించని తెరవెనుక జరుగుతున్న అసలు రాజకీయం. చూద్దాం.. ఏం జరుగుతుందో.

పాకిస్తాన్ చరిత్రలో అత్యంత భయానక సందర్భం ఇది

మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో భగ్గుమన్న పాకిస్తాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ప్రస్తుతం ఆ దేశం అంతర్యుద్ధంతో రణరంగంగా మారింది. ఇమ్రాన్ అనుకూల వర్గం వారు వేలాదిగా రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తుండటం.. వారిని అడ్డుకునేందుకు పాకిస్తాన్ పోలీసులు మరియు ఆర్మీ ఎదురుదాడి చేయటంతో పాకిస్తాన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న పాకిస్తాన్.. ఈ అల్లర్లతో చరిత్రలో కోలుకోలేని స్థితికి దిగజారటం ఖాయమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అన్నం కోసం తుపాకులతో కాల్చి చంపుకుంటున్న పాకిస్తాన్ ప్రజలు.. త్వరలో ఆకలి చావులు చావటం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కావటం.. ప్రజల ఆస్తులు కూడా ఈ అల్లర్లలో ధ్వంసం కావటం వల్ల భవిష్యత్తులో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎవరూ కాపాడలేనంతగా దిగజారతాయని ఆర్థిక నిపుణుల అంచనా.
ఇమ్రాన్ ఖాన్ పై దాదాపు 85 కేసులు పెట్టారు పాకిస్తాన్ పోలీసులు. ఇమ్రాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భవిష్యత్తులో ఎలాగో రాజీనామా చేయాల్సి వస్తుందని ముందే భావించి.. ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన కోట్ల రూపాయల వస్తువులను ఎవరికీ తెలియకుండా దొంగతనం చేశాడనేది అతడిపై ఉన్న అతిపెద్ద ఆరోపణ. భూములు కబ్జా చేయటం, సెటిల్మెంట్లకు పాల్పడి భారీగా లంచాలు తీసుకోవటం వంటి ఇతర కేసులు డజన్ల కొద్దీ నమోదు చేశారు ఇమ్రాన్ పై. కానీ ఏ ఒక్క కేసులో కూడా ఇమ్రాన్ కు అరెస్టు వారెంట్ జారీ కాలేదు. కేసులపై కోర్టుకు హాజరై సమాధానం చెప్పాలని మాత్రమే నోటీసులు ఇవ్వగా ఇమ్రాన్ ఆ నోటీసులను తిరస్కరించి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈక్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం తనను అక్రమంగా అరెస్టు చేసి హత్య చేయాలని చూస్తోందంటూ బహిరంగంగానే ఇమ్రాన్ ఆరోపించేవాడు. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన ఇమ్రాన్ ను పోలీసులు ముందస్తు హెచ్చరికలు లేకుండా లాక్కెళ్ళి తమ కస్టడీలో ఉంచుకున్నారు.
ఇమ్రాన్ అరెస్టు తర్వాత అతడి అనుచరులను రెచ్చగొట్టి అల్లర్లను మరింత తీవ్రం అయ్యేలా చేశాడు ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు పాకిస్తాన్ ఉపాధ్యక్షుడు షా మహ్మద్ ఖురేషీ. దీంతో అతడిని కూడా పోలీసులు అరెస్టు చేయగా.. ఈ రెండో అరెస్టుతో పాకిస్తాన్ లో అల్లర్లు మరింత తీవ్రంగా మారాయి. చాలా చోట్ల కర్ఫ్యూ విధించినప్పటికీ ఇమ్రాన్ మద్దతుదారులు పోలీసులపై దాడులు చేస్తూనే ఉన్నారు. అల్లర్లు ఎంత తీవ్రంగా ఉంటే ఇమ్రాన్ ప్రాణాలతో ఉండేందుకు అంత ఎక్కువ అవకాశాలుంటాయి. ప్రజల దృష్టి ఇమ్రాన్ అరెస్టు నుంచి ఏమాత్రం మారి తమ ఆర్థిక పరిస్థితిపైకి మళ్ళినా అది ఇమ్రాన్ కు ప్రమాదకరమే. ఏది ఏమైనా పాకిస్తాన్ సైన్యం మాత్రం ఇమ్రాన్ ను ప్రాణాలతో ఉంచుతుందనే నమ్మకం తక్కువనే చెప్పాలి. ఇమ్రాన్ ను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించే మధ్యలో అతడిని హత్య చేసి తీవ్రవాద దాడిగా చిత్రీకరించబోతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఏ క్షణంలో ఏం జరిగినా ఆశ్చర్యంలేదని అప్ఘనిస్తాన్ దౌత్యవేత్త ఖలీల్జాద్ వ్యాఖ్యానించారు. దీంతో యావత్ ప్రపంచం దృష్టి ఇప్పుడు పాకిస్తాన్ పైనే ఉంది.

ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వ పెత్తనంపై సుప్రీం సంచలన తీర్పు

కేంద్ర పాలిత ప్రాంతం మరియు రాష్ట్రంగా రెండు హోదాలతో దేశ రాజధానిగా ఉన్న ఢిల్లీ ప్రభుత్వంపై ఇప్పటి వరకూ ఉన్న అన్ని అనుమానాలకు సమాధానం చెప్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఢిల్లీలో పరిపాలన సర్వీసులపై పూర్తి అధికారం ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రజా ప్రతినిథులతో కూడిన ప్రభుత్వానికే ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉండదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ పై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలో చెప్పాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పష్టమైన తీర్పును వెలువరించింది. అడ్మినిస్ట్రేషన్ పై పూర్తి అధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉండాలని.. అందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పూర్తిగా సహకరించాలంటూ స్పష్టం చేసింది.
ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పై పూర్తి అధికారాలు కేంద్రానికే ఉంటాయంటూ 2015లో కేంద్రం హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కేంద్ర హోంసాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర హోంశాఖ నిర్ణయాన్ని సమర్థించింది. కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి కేంద్రానికే అధికారాలు ఉండటం సబబేనని అప్పడి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తీర్పునిచ్చారు. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి విచారణ సుదీర్ఘంగా సాగుతూ వచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతం మరియు రాష్ట్రం హోదా కలిగి ఉండటం మరియు దేశ రాజధానిగా ఉండటంతో ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ పై నియంత్రణాధికారం ఎవరికి ఉండాలనేది తేల్చటం కష్టంగా మారింది. సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వం వైపు నిలిచింది. ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న ప్రజా ప్రతినిథులతో నడిచే ప్రభుత్వానికే అధికార యంత్రాంగంపై నిర్ణయాధికారం ఉండాలనేది ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయం అని చెప్పింది. అధికారులు చివరికి రిపోర్టు చేయాల్సింది సంబంధిత శాఖల మంత్రులకే కాబట్టి తమ తీర్పు సబబేనని సమర్థించుంకుంది.

ఈ రోజు నుంచే ఓటీటీలో శాకుంతలం

0

గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందించిన సమంత లేటెస్ట్ సినిమా శాకుంతలం ఈ రోజు నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమేజాన్ ప్రైమ్ లో గురువారం శాకుంతలం సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా చూడొచ్చు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన శాకుంతలం చివరికి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. రుద్రమదేవి సినిమా తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోని గుణశేఖర్.. ఈ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చి పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంటాడని అంతా అనుకున్నారు. అటు సమంత కూడా ఈ ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకుంది. చివరికి అటు గుణశేఖర్ కు.. ఇటు సమంతకు కూడా నిరాశనే మిగిల్చింది శాకుంతలం సినిమా.
గుణశేఖర్ డైరెక్టర్ గా ఫ్లాప్ అందుకోవటం కంటే సినిమా కోసం ఇన్వెస్ట్ చేసి కోట్లు నష్టపోవటమే అతడికి పెద్ద లాస్. కోట్లాది రూపాయలు ఇన్వెస్ట్ చేసిన దిల్ రాజు కూడా శాకుంతలం సినిమాతో భారీగానే నష్టపోయాడు. 5 భాషల్లో రిలీజ్ చేస్తే కనీసం సినిమా కోసం ఇన్వెస్ట్ చేసిన సగం బడ్జెట్ కూడా శాకుంతలం రాబట్టలేకపోయింది. దీంతో హడావుడిగా ఓటీటీ రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సినిమా విడుదలైన నెల రోజుల్లోపే ఓటీటీ రిలీజ్ అయిపోయింది. అమేజాన్ ప్రైమ్ కూడా కాస్త ఎక్కువగానే చెల్లించి శాకుంతలం సినిమా రైట్స్ ను కొనుగోలు చేసింది. థియేటర్లో ఆడని సినిమాను ఓటీటీలో జనం ఏం చేస్తారో చూడాలి.

“ది కేరళ స్టోరీ” : ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు

0

మతమార్పిడి చేసి తీవ్రవాదం వైపు మళ్ళించటం అనే కాన్సెప్టుతో తెరకెక్కి దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ది కేరళ స్టోరీ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. చాలా రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించినా.. థియేటర్లు బాయ్ కాట్ చేసినా.. కలెక్షన్లలో ఈ సినిమా ఏమాత్రం తగ్గటం లేదు. విడుదలైన ఫస్ట్ డే నే కంట్రీ వైడ్ గా సుమారు 7 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందట. ఇప్పటి వరకు ఇండియా వైడ్ గ్రాస్ సుమారు 60 కోట్ల వరకు ఉంటుందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. త్వరలోనే ఈ సినిమా 75 కోట్ల వసూళ్ళు రాబట్టడం ఖాయమని చెప్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి నిషేధం లేకుండా విడుదల అయి ఉంటే రెండు వారాల్లో వంద కోట్లు కలెక్షన్లు సాధించే సత్తా ఉన్న సినిమా అని సినీ వర్గాల విశ్లేషణ. రిలీజ్ కు ముందే కాంట్రవర్సీ కావటం.. సొంత రాష్ట్రం కేరళలోనే సినిమా బ్యాన్ కావటంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ బజ్ ఏర్పడింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ ను మించి ఉందంటూ వస్తున్న ఓరల్ పబ్లిసిటీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
కేరళలో అమాయక హిందూ అమ్మాయిలను ఇస్లామిక్ తీవ్రవాదులు మాయమాటలతో ఏమార్చి ఇస్లాం మతంలోకి మార్చి.. ఆ తర్వాత వాళ్ళను ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థ కోసం పనిచేసే విధంగా మార్చటం ఈ సినిమాలో ప్రధాన సబ్జెక్ట్. కేరళలో కొన్ని వేల మంది ఇలా మత మార్పిడికి గురయ్యారనీ.. వారిలో చాలా మంది ఐఎస్ఐఎస్ కోసం ఇస్లామిక్ దేశాలకు పంపించబడ్డారనీ చెప్తోంది ది కేరళ స్టోరీ. ఇది ఓ వర్గాన్ని కించపరిచేలా అవమానపరిచేలా ఉందంటూ కేరళ ప్రభుత్వం బ్యాన్ చేయగా.. చాలా వరకు రష్ట్రాల్లో సినిమా విడుదలైంది. సినిమా చూసిన జనం ఏ వర్గాన్ని కూడా అవమానపరిచేలా సినిమా కథ లేదనీ.. కేవలం బలవంతపు మత మార్పిడి, ఇస్లామిక్ తీవ్రవాదం గురించి మాత్రమే ఉన్నది ఉన్నట్టు చూపించారనీ అంటున్నారు. ఇన్ని నిషేధాలు, బాయ్ కాట్ లు ఉంటేనే ఇంత కలెక్షన్ సాధించిందంటే.. అవన్నీ లేకపోతే ఇది భారీ వసూళ్ళే రాబట్టి ఉండేదనేది మాత్రం నిజం.

మమతా బెనర్జీకి షాకిచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్

కశ్మీరీ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ది కశ్మీర్ ఫైల్స్ సినిమా. 2022 మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా గురించి ఇప్పటికీ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తూనే ఉంది. లేటెస్ట్ గా ది కేరళ స్టోరీ సినిమా రిలీజైన నేపథ్యంలో మరోసారి ది కశ్మీర్ ఫైల్స్ గురించి మళ్ళీ చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి తమ సినిమా గురించి, తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం కలిగించినందుకు బేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే ఆరోపణలు రుజువు చేయాలని నోటీస్ లో పేర్కొన్నారు. లీగల్ నోటీసుల కాపీలను ట్విటర్ ద్వారా షేర్ చేసారు. తమ సినిమాపై అనుచితంగా మాట్లాడారంటూ ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు పంపించటం బాలీవుడ్ తో పాటు బెంగాల్ లో చర్చనీయాంశంగా మారింది.
కోల్ కతా లోని సెక్రెటేరియల్ ఆవరణలో జరిగిన ప్రెస్ మీట్ లో ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించటం గురించి మాట్లాడుతున్న సందర్భంలో మమతా బెనర్జీ ది కశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి మాట్లాడారు. ది కశ్మీర్ ఫైల్స్ ఓ వర్గాన్ని కించపరిచే, అవమానించే కథ అనీ.. ది కేరళ స్టోరీ కూడా అలాంటి సినిమాయేననీ వ్యాఖ్యానించింది మమత. అంతే కాకుండా ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బీజేపీ డబ్బులు సమకూర్చిందంటూ సంచలన ఆరోపణ చేసింది మమతా బెనర్జీ. బీజేపీ నాయకులు వెనకుండి డబ్బులు ఇచ్చి ఇలాంటి సినిమాలు తీయిస్తున్నారు అంటూ బీజేపీపై కూడా ఆరోపణలు చేసింది. తమకు బీజేపీతో ఎలాంటి సంబంధం లేదన్న వివేక్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్.. తమపై ఆరోపణలు రుజువు చేయాలి లేదంటే క్షమాపణ చెప్పాలంటూ మమతకు లీగల్ నోటీసులు ఇచ్చారు.

ఇమ్రాన్ ఖాన్ బతికే అవకాశాలు ఉన్నాయా ?

పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం పాకిస్తాన్ పారా మిలటరీ రేంజర్లు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కోర్టు ముందే ఇమ్రాన్ ఖాన్ ను కాలర్ పట్టుకొని లాక్కెళ్ళారు రేంజర్లు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారుల నిరసనలు, హింసతో పాకిస్తాన్ అట్టుడికిపోతోంది. పాకిస్తాన్ లో ఉన్న తమ ప్రజల కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు హెచ్చరికలతో కూడిన గైడ్ లైన్స్ ప్రకటించాయి. గుంపులుగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండండి అంటూ అమెరికా, కెనడా దేశాలు పాకిస్తాన్ లోని తమ ప్రజలకు హెచ్చరిక జారీ చేయగా.. పాకిస్తాన్ లో ఈ హింస ఇప్పటితో ఆగేది కాదనీ.. రాను రాను పరిస్థితి అత్యంత తీవ్రంగా మారే అవకాశం ఉందనీ అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ప్రకటించింది. పాకిస్తాన్ లో ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే సీఐఏ చెప్పింది నిజమే అనిపిస్తోంది.
పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా మారిన వారిని చంపేయటం ఆ దేశ సైనికాధ్యక్షులకు అలవాటు. ప్రధానమంత్రి పదవిలో ఉన్న వాళ్ళను సైతం పదవి నుంచి దింపేసి అరెస్టు చేసి మళ్ళీ ఎన్నికల పేరుతో తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళను ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడం పాకిస్తాన్ సైన్యం చేసే పని. కొత్త ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే పాత ప్రధానమంత్రి చనిపోవటం ఇక్కడ రివాజు. తీవ్రవాదుల ముసుగులో పాకిస్తాన్ సైన్యమే మాజీ అధ్యక్షులను చంపిన ఘటనలు ఇదివరకు ఎన్నో ఉన్నాయి. సైన్యానికి ఎదురు తిరిగిన అధ్యక్షుడిని విమానం ఎక్కించటం.. ప్రయాణిస్తుండగా ఆ విమానాన్ని కూల్చివేయటం ఇదివరకు రెండు సార్లు జరిగింది పాకిస్తాన్లో. అదృష్టం బాగుంటే సైన్యం చెర నుంచి తప్పించుకొని ఏ అరబ్ దేశానికో పారిపోయి చచ్చేదాకా అక్కడే బతకొచ్చు. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ ఇదేవిధంగా పాకిస్తాన్ సైన్యం నుంచి తప్పించుకొని పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు.. ఇటీవలే ముషార్రఫ్ అనారోగ్యంతో మృతి చెందాడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి కూడా దాదాపుగా సైన్యం చేతిలో చచ్చిన మాజీ అధ్యక్షులలాగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఇమ్రాన్ ను అరెస్టు చేసినట్టు మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు.. కానీ.. అతడు ఎంతో కాలం బతికే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితమే రోడ్ షో లో ఇమ్రాన్ పై తుపాకులతో కాల్పులు జరిగి హత్యాప్రయత్నం చేసినా.. ఇమ్రాన్ మద్దతుదారులు చుట్టూ ఉండటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ కేసులో ఇద్దరు యువకులను పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. కానీ హత్యాయత్నం చేసింది మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ అనేది బహిరంగ రహస్యం. పదవి పోయినప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ భారత్ ను, మెడీని ఆకాశానికి ఎత్తేస్తూ పాకిస్తాన్ పాలకులను, సైన్యాన్ని తీవ్రంగా ఆరోపించాడు. అప్పుడే ఇమ్రాన్ ను చంపేయాలని ఐఎస్ఐ నిశ్చయించుకుంది. కాకపోతే.. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. కరువు, ఆకలి విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇమ్రాన్ ను ఏదోరకంగా హతమారుస్తుంది ఐఎస్ఐ. తిండి కోసం అల్లాడుతున్న పాకిస్తాన్ ప్రజలు.. ఇమ్రాన్ ఖాన్ హత్య గురించి ఎక్కువ రోజులు మాట్లాడుకోరు కాబట్టి ఇదే మంచి సమయం అని పాకిస్తాన్ సైన్యం భావిస్తోంది. ఆధారాలు లేని కేసులో నన్ను అరెస్టు చేసి ఆ తర్వాత చంపేస్తారంటూ ఇప్పటికే ఇమ్రాన్ సెల్ఫీ వీడియోలో చెప్పాడు కూడా. ఇప్పుడు ఆ ప్రాసెస్ స్టార్ట్ అయ్యిందన్నమాట. ఇమ్రాన్ ఖాన్ కు సంబంధించిన ఆస్తులు ఆరా తీసి స్వాధీనం చేసుకొని, ఇతడి వద్ద ఉన్న మిలటరీ లేదా ఇతర దేశాల రహస్యాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంది ఐఎస్ఐ. ఆ తర్వాత తీవ్రవాద దాడిలోనో లేక విమాన ప్రమాదంలోనో ఇమ్రాన్ ఖాన్ చావటం ఖాయం.. కాకపోతే కాస్త సమయం అటూ ఇటూ.. అంతే..!