ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏమిటో చాటిన ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ ను ఓ చేదువార్త విషాదంలో ముంచేసింది. ఈ సినిమాలో స్కాట్ దొర క్యారెక్టర్లో విలన్ గా అద్భుతంగా నటించిన ఐరిష్ నటుడు రే స్టీవెన్సన్ గుండెపోటుతో కొద్ది గంటల క్రితం మరణించాడు. 58 సంవత్సరాల స్టీవెన్సన్ మరణ వార్తతో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. నిన్న మొన్నటి దాకా వార్తల్లో నిలిచిన మనిషి సడన్ గా మన మధ్య లేరని తెలియటంతో యావత్ సినీ ప్రపంచం దీనిపై విచారం వ్యక్తం చేస్తోంది. ఈ వార్తను విని నమ్మలేకపోయాననీ.. 58 యేళ్ళ వయసులో కూడా స్టీవెన్సన్ కుర్రాళ్ళతో పోటీ పడేంత ఆరోగ్యంగా ఉండేవాడనీ పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా క్లైమాక్స్ లో కారులో నుంచి పైకి లేచి తుపాకీతో కాల్చే సీన్ చేయటానికి ఏమాత్రం సంకోచం లేకుండా ఒప్పుకున్నారనీ.. ఆయన అంత డెడికేటెడ్ నటుడనీ రాజమౌళి చెప్పారు.
స్టీవ్ మరణ వార్త విని షాక్ కు గురయ్యాననీ.. ఆయనకు ఇంకా చాలా సినిమా కెరీర్ మిగిలి ఉండగానే మనందరినీ వదిలి వెళ్ళిపోవటం చాలా బాధాకరమనీ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఆయనతో పని చేయటం చాలా గొప్ప అనుభవం అని చెప్పిన ఎన్టీఆర్.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ థోర్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రే స్టీవెన్సన్ ఐర్లాండ్ నటుడు. 1964 మే 25న జన్మించిన ఈయన.. తొలుత టీవీ రంగంలో ఆ తర్వాత సినీ రంగంలో రాణించి.. ప్రస్తుతం హాలీవుడ్ స్థాయిలో విశేష గుర్తింపు ఉన్న నటుడిగా మారారు. ఆర్ఆర్ఆర్ స్కాట్ క్యారెక్టర్ కు అచ్చుగుద్దినట్టు సరిపోతాడని భావించిన రాజమౌళి అంచనా నిజమై.. సినిమాలో ఆయన క్యారెక్టర్ కు మంచి గుర్తింపు వచ్చింది.
ఆర్ఆర్ఆర్ విలన్ “స్కాట్” మృతి : షాక్ కు గురైన టాలీవుడ్
మోడీ పాపువా న్యూ గినియా పర్యటన : బైడెన్, జిన్ పింగ్ కు కోలుకోలేని దెబ్బ
స్థానిక రాజకీయం, అంతర్జాతీయ రాజకీయం ఒక్కటి కాదు.. ఇక్కడ గెలవాలంటే విమర్శలూ, వ్యూహాలకు పదునుపెడితే సరిపోతుంది. అంతర్జాతీయంగా గెలవాలంటే మాత్రం అంతకుమించి ఆలోచనలు చేయాలి. అదికూడా పొరుగున చైనా లాంటి కంత్రీ కంట్రీ ఉన్నప్పుడు ఆ ఆలోచనలు అంతకుమించే ఉండాలి. ఇందులో ఏమాత్రం తేడాకొట్టినా ఫలితం దేశాన్నే ప్రమాదంలో పడేస్తుంది. ఈ విషయం ప్రధాని మోడీకి చాలా బాగా తెలుసు. మోడీ ప్రత్యర్ధులు ఈ విషయాన్ని ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే వాస్తవం అనేది గత కొద్ది యేళ్ళుగా భారత విదేశాంగ విధానం నిరూపిస్తూ వస్తున్నది. ఇటీవలి కాలంలో చైనాతోముప్పు పెరుగుతున్న కారణంగా సరిహద్దుల్లో భద్రత పెంచుతున్న మోడీ సర్కార్.. త్రివిధ దళాల బలోపేతంపై దృష్టి పెడుతూనే డ్రాగన్‌కు ఎక్కడ, ఎప్పుడు, ఎలా చెక్ పెట్టాలనేదానిపై వర్క్‌ఔట్ చేస్తోంది. కానీ, అనుకున్నదే తడవుగా యాక్షన్‌లోకి దిగిపోడానికి ఇది లోకల్ రాజకీయం కాదు.. సమయం, సందర్భం కూడా కలిసిరావాలి. జీ7 సదస్సు కోసం జపాన్ వెళ్లిన మోడీకి ఇప్పుడు అలాంటి అవకాశమే దొరికింది.
ప్రధాని మోడీ హిరోషిమా పర్యటన దగ్గర నుంచి పాపువా న్యూ గినియా ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ వరకు టార్గెట్ అంతా డ్రాగన్ కంట్రీనే. మరీ ముఖ్యంగా ఇండో-పసిఫిక్‌లో ఆ దేశ యాక్షన్‌కు చెక్ పెట్టాలనేదే లక్ష్యంగా మోడీ వైఖరి కనిపించింది. నిజమే.. భారత భద్రత పరంగా ఇండో-పసిఫిక్‌లో బీజింగ్ ఆధిపత్యాన్ని అడ్డు కోకుంటే ఎప్పటికైనా చిక్కులు తప్పవు మరి. ఇందులో భాగంగానే హిరోషిమాలో శాంతి సందేశం ఇచ్చిన వెంటనే పాపువా న్యూ గినియా ఫ్లైట్ ఎక్కేశారు భారత ప్రధాని. పాపువా న్యూ గినియాకు వెళ్లిన భారత తొలి ప్రధాని మోడీనే. ఈ క్రమంలోనే మోడీపై ఉన్న అభిమానంతో తమ దేశ సంప్రదాయాలను బ్రేక్ చేస్తూ కనీవినీ ఎరుగని రీతిలో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో దేశానికి చేరుకున్న మోడీకి దేశ ప్రధానికి జేమ్స్ మరాపే స్వాగతం పలికారు. మోడీ పాదాలకు నమస్కారం చేసి ఆత్మీయతను చాటుకున్నారు. ఊహించని ఈ పరిణామంతో ప్రధాని మోడీ భావోద్వేగానికి గురయ్యారు. ఐతే, పాపువా న్యూ గినియా ప్రధాని ఇంతలా అభిమానం చూపించడానికి కారణం ఆ దేశానికి భారత్ అందించిన సాయమే. ప్రపంచాన్ని కోవిడ్ వణికించిన సమయంలో పాపువా న్యూ గినియా కూడా అల్లాడిపోయింది. తీవ్ర ఆరోగ్య సంక్షోభాన్ని చవిచూసింది. ఆ సమయంలో భారత్ ఇతోధికంగా సాయమందించింది. కొవిడ్-19 వ్యాక్సిన్లను భారీగా పంపించింది. అప్పటి నుంచి పాపువా న్యూ గినియా మన దేశాన్ని ఆరాధిస్తోంది. అందుకే మోడీకి ఆ దేశంలో ఆత్మీయ స్వాగతం లభించింది. వాస్తవానికి.. పాపువా న్యూగినియా దేశానికి ఒక సంప్రదాయం ఉంది. సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన నాయకుడికైనా స్వాగత ఉత్సవాన్ని నిర్వహించదు. కానీ భారత ప్రధాని మోడీ కోసం ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టింది. రాత్రి 10 గంటల తర్వాత మోడీ.. పాపువా న్యూ గినియా లో అడుగుపెట్టారు. ఐనా మోడీకి స్వాగత ఉత్సవాన్ని ఆ దేశం అద్భుతంగా నిర్వహించింది.
ప్రపంచ వేదికపై భారత నాయకత్వాన్ని కొనియాడారు పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే. ఇండియా అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు చెప్పిన మరాపే.. అగ్ర దేశాలు అధికారం కోసం ఆడుతున్న ఆటలో తాము బాధితులమయ్యాం అని వాపోయారు. ఇదే సమయంలో మోడీని ఉద్దేశిస్తూ మీరు గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం వహిస్తున్నారనీ, అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వెన్నంటి ఉంటామనీ ప్రకటించారు. ఈ ప్రకటన బీజింగ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చేదే. ఎందుకంటే ప్రపంచ పెద్దన్నగా ఎదిగేందుకు కుట్రలనే నమ్ముకున్న బీజింగ్.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కింగ్‌గా మారి గ్లోబల్ సౌత్ లీడర్‌గా అవతరించాలని కలలు కంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం సాధిస్తే అమెరికా, భారత్‌ను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటుగా వాణిజ్యపరంగానూ ఎదిగేందుకు ఉపయోగపడుతుందని లెక్కలు కట్టింది. ఈ విషయంలో కొంత మేర విజయం సాధిస్తోంది కూడా. పసిఫిక్ రీజియన్‌లోని పలు దేశాలకు అప్పులిస్తూ తన ఉచ్చులోకి దించే ప్రయత్నాలు చేసింది.
ఈ పరిస్థితులకు కారణం అగ్రరాజ్యం అమెరికానే. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తిరుగు లేని సైనిక శక్తి అమెరికా. ఈ పవర్ ఉందనే ఇన్నాళ్లు ఇండో-పసిఫిక్ రీజియన్ దేశాలను అగ్రదేశం ఏ మాత్రం పట్టించుకోలేదు. శతాబ్దాలు గడుస్తున్నా.. ఈ ప్రాంతంలోని కొన్ని దేశాల్లో అమెరికా అధ్యక్షులు ఇప్పటివరకు కాలు మోపలేదు. దీన్ని ఆసరాగా తీసుకునే.. డ్రాగన్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. ఆయా దేశాల్లో మౌలిక వసతులు పేరుతో పాగా వేసింది. పరిస్థితి చేయిదాటిపోయిందని గుర్తించి అమెరికా.. ఈ పరిస్థితులకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పాపువా న్యూ గినియాలో పర్యటిస్తానని ప్రకటించారు. సుమారు 18 దేశాలను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాల్లో భాగంగా పాపువా న్యూ గినియా పర్యటనకు బైడెన్ సిద్ధమయ్యారు. కానీ, ఆర్ధిక ఇబ్బందుల నేపధ్యంలో ఆపర్యటనను బైడెన్ క్యాన్సిల్ చేసుకోవాల్సివచ్చింది. ఒకవేళ బైడెన్ పాపువా న్యూ గినియాలో పర్యటించినా ఇప్పుడు మోడీకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆయనకు దక్కేది కాదు. దీనికి చాలానే కారణాలున్నాయి. అగ్ర దేశాలు అధికారం కోసం ఆడిన ఆటలో తాము బాధితులం అయ్యామని తాజాగా పాపువా న్యూ గినియా ప్రధాని చేసిన కామెంట్ అమెరికాను ఉద్దేశించే.
మొత్తంగా.. ప్రధాని మోడీ పాపువా న్యూ గినియా పర్యటన జిన్‌పింగ్‌కు దిమ్మదిరిగే కౌంటర్ లాంటిదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్‌లోనూ పసిఫిక్ దీవులకు భారత్ అందించే ఆపన్న హస్తంలో ఏమాత్రం తేడా ఉండదని ప్రకటించడం ద్వారా చైనాను ఆ పరిశరాలకు కూడా వెళ్లకుండా చేయడంలో మోడీ విజయం సాధించినట్టే అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఒక్కమాటలో సైనిక పరంగా స్ట్రాంగ్‌గా ఉండికూడా చైనాను నిలువరించడంలో బైడెన్ విఫలమైన చోట మోడీ విజయం సాధించి చూపించినట్టే కనిపిస్తోంది. మరి మోడీ పర్యటనపై బీజింగ్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
“మోసగాళ్ళకు మోసగాడు” : 52 యేళ్ళ తర్వాత రీ రిలీజ్
సూపర్ స్టార్ కృష్ణ శతజయంతి సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా 4కే రిజల్యూషన్ తో. 52 సంవత్సరాల క్రితం విడుదలై తెలుగు సినిమాకు హాలీవుడ్ కౌబోయ్ సినిమా ఫ్లేవర్ రుచి చూపించింది మోసగాళ్ళకు మోసగాడు సినిమా. సూపర్ స్టార్ కృష్ణ చేసిన ట్రెజర్ హంట్ కౌబోయ్ ప్రయోగం టాలీవుడ్ నే కాదు.. ఇండియన్ సినిమానే ఆశ్చర్యపోయేలా చేసింది. అసలు అలాంటి సినిమాల గురించే తెలియని తెలుగు ప్రేక్షకుడు ఈ సినిమా చూసి థ్రిల్ అయిపోయారంటే అతిశయోక్తి కాదు. పద్మాలయ స్టూడియోస్ సంస్థ ద్వారా నిర్మించబడిన మోసగాళ్ళకు మోసగాడు సినిమాకు అలనాటి అద్భుత దర్శకులు కేఎస్ఆర్ దాస్ మరియు బి.విఠలాచార్య దర్శకత్వం వహించారు.
హాలీవుడ్ సినిమాలైన ఫర్ ఎ డాలర్ మోర్ మరియు మెకన్నాస్ గోల్డ్ వంటి ట్రెజర్ హంట్ సినిమాల స్ఫూర్తితో బొబ్బిలి రాజవంశం మరియు బ్రిటిష్ వారికి మధ్య జరిగిన ఓ సంగ్రామ ఫలితంగా జరిగే ట్రెజర్ హంట్ సినిమా ఇది. తెలుగు ఫ్లేవర్ కోసం ప్రతీకారం అనే జానర్ ను కూడా యాడ్ చేసి లవ్ స్టోరీని మిక్స్ చేసి మొత్తానికి ఇండియన్ ఫిల్మ్ గా రూపొందించారు మోసగాళ్ళకు మోసగాడు సినిమాను. ఇప్పుడు చూసినా ఈ సినిమా ప్రేక్షకులను కట్టి పడేస్తుంది. అలాంటి సినిమాను కృష్ణ వందో పుట్టిన రోజును పురస్కరించుకొని అభిమానులకు కానుకగా ఈ సినిమా మళ్ళీ థియేటర్లలో ప్లే కావటానికి రెడీ అవుతోంది. మే 31న తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. 4కే రిజల్యూషన్ తో రూపొందించిన కొత్త ట్రైలర్ ను కృష్ణ కుమారుడు మహేశ్ బాబు విడుదల చేశారు.
అమెరికా మరో షాకింగ్ నిర్ణయం : ఉక్రెయిన్ కు ఎఫ్-16
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య ఆయుధ నిల్వలు తరిగిపోవటం.. జీ-7 సదస్సులో ఈ యుద్ధాన్ని ఆపి శాంతి నెలకొలపాలన్న వివిధ దేశాల ప్రయత్నాలు ఓ వైపు జరుగుతుండగా.. అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంతో కాలంగా తమకు ఎఫ్-16 ఫైటర్ యుద్ధ విమానాలు ఇవ్వాల్సిందిగా అమెరికా, యూరప్ దేశాలను కోరుతున్న జెలెన్ స్కీ కోరికను ఆయాదేశాలు మన్నించాయి. లక్షల కోట్ల డాలర్ల విలువ చేసే అత్యాధునిక ఫైటర్ జెట్ అయిన ఎఫ్-16 విమానాలను ఉక్రెయిన్ కు అందించేందుకు సరేనన్నాయి. దీంతో నేడో రేపో యుద్ధం ఆగి శాంతి నెలకొంటుందన్న గల్లంతయ్యాయి. అమెరికా తాజా నిర్ణయంపై రష్యా తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయొద్దని హెచ్చరించినా అమెరికా, యూరప్ దేశాలు పట్టించుకోవటం లేదనీ.. దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రష్యా హెచ్చరించింది.
జపాన్ లోని హిరోషిమా లో ప్రస్తుతం జీ-7 దేశాల సదస్సు జరుగుతోంది. ఈ వేదికపై రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని అమెరికా, యూరప్ దేశాలు మొదటి నుంచి చెప్తుంటే.. శాంతి దిశగా ఆ నిర్ణయాలు ఉంటాయేమో అనుకున్నారు. కానీ.. ఇప్పుడు కూడా రష్యాపై ఆంక్షలు విధిస్తూ యుద్ధం పరిస్థితులను మరింత తీవ్రతరం చేస్తోంది అమెరికా. అప్పుల ఊబిలో మునిగి ఊపిరి ఆడని పరిస్థితుల్లో ఉన్న అమెరికా త్వరలో దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. ఇలాంటి సమయంలో ఉక్రెయిన్ కు ఆయుధ సాయం చేయటం అమెరికాకు ఆర్థికంగా పెనుభారంగా పరిణమించనుంది. దివాలా అంచున ఉండి కూడా బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు సాయం ప్రకటించటంపై రిపబ్లికన్లు మండిపడుతున్నారు.
ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేసి యుద్ధంలో రష్యాను మరింత బలహీనం చేసి.. చివరకు రష్యాను ఓడించి సోవియట్ దేశాలను విచ్ఛిన్నం చేయాలనేది అమెరికా మరియు నాటో దేశాల వ్యూహం. ఇందులో భాగంగానే అన్ని దేశాలు కలిసి ఉక్రెయిన్ కు సాయం అందిస్తున్నాయి. రష్యాను ఓడించే వ్యూహంలో ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాలు ఆర్థికంగా బలహీనం అయ్యాయి.. కానీ సాయం మాత్రం ఆపటం లేదు. ఇది ఇలాగే కొనసాగితే చివరకు రష్యా అధినేత పుతిన్ అణుయుద్ధానికైనా సిద్ధపడతాడే గానీ అమెరికా ముందు లొంగిపోడు. మొత్తం ఉక్రెయిన్ ను బూడిద చేస్తాడేమో గానీ పుతిన్ ఓటమి అంగీకరించే వ్యక్తి కాదు. ఈ విషయం తెలిసి కూడా అమెరికా, యూరప్ దేశాలు పుతిన్ ను రెచ్చగొడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే మరో ప్రపంచ యుద్ధం తప్పదనేది అంతర్జాతీయ విశ్లేషకుల హెచ్చరిక.
2వేల నోటు కొత్త రూల్స్ : కొత్త వెయ్యి నోటుపై ఆర్బీఐ క్లారిటీ
2 వేల నోటును ఉపసంహరిస్తూ ఆర్బీఐ ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 లోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2 వేల నోట్లను బ్యాంకులో మార్చుకోవచ్చు మరియు కావాలంటే అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బీఐ ఇదివరకే చెప్పింది. ఈ విషయంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టమైన మార్గదర్శకాలు వెల్లడించారు. తమ వద్ద ఎన్ని నోట్లు ఉన్నా అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవచ్చనీ.. కేవలం మార్చుకోవటం విషయంలో మాత్రమే 20 వేల పరిమితి ఉందనీ చెప్పారు. అయితే.. అకౌంట్లలో డిపాజిట్ చేసే విషయంలో డిపాజిట్ మొత్తం 50 వేలకు పైన ఉంటే పాన్ నెంబర్ తప్పనిసరి అనే రూల్ యధావిధిగా అమలు అవుతుందని చెప్పారు. ప్రజలు కంగారు పడాల్సిన అవసరం లేదనీ.. 2 వేల నోట్ల మార్పిడి కోసం నాలుగు నెలల సుదీర్ఘ సమయం ఉందనీ శక్తికాంతదాస్ పేర్కొన్నారు.
చాలా కాలంగా వ్యాపారులు 2 వేల నోటును తీసుకోటానికి నిరాకరిస్తున్నారనీ.. మొత్తం 2 వేల నోట్లలో ప్రస్తుతం చలామణిలో ఉన్నవి కేవలం 10 శాతం మాత్రమేనని చెప్పారు. మిగతా కరెన్సీ నోట్లు బ్లాక్ చేయబడ్డాయని గుర్తు చేశారు. 2 వేల నోటు రద్దు తర్వాత మార్చుకోవటానికి కావాల్సినంత మిగతా కరెన్సీ నోట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మార్కెట్లో 2 వేల నోటు చలామణి విషయంలో అన్ని విషయాలు పూర్తిగా గమనించి, సామాన్యులకు ఇబ్బందులు ఎదురవుతాయా అన్న విషయంపై పూర్తిగా చర్చించిన తర్వాతనే ఉపసంహరణ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. దీని వల్ల సామాన్యుడికి, మధ్య తరగతి వారికి ఎలాంటి ఇబ్బందులూ రావన్నారు. అయితే.. మళ్లీ వెయ్యి నోటు ముద్రిస్తారన్న వార్తలు మాత్రం పూర్తిగా అవాస్తవం అని చెప్పారు.
కొత్త వెయ్యి నోటు ప్రతిపాదన ఏమీ లేదని చెప్పిన దాస్.. 2 వేల నోట్లు మార్పిడి కోసం కావాల్సిన ఇతర డినామినేషన్ సిద్ధం చేశామన్నారు. బ్లాక్ చేయబడిన నల్లధనం బ్యాంకుల్లోకి చేరితే ఆ విషయాన్ని చూసుకోటానికి ఇన్ కమ్ ట్యాక్స్ శాఖ సిద్ధంగా ఉందని చెప్పారు. 2 వేల నోట్లు మార్చుకోటానికి బ్యాంకులకు వచ్చే ప్రజలకు పూర్తి సౌకర్యాలు కల్పించాలని బ్యాంకులకు సూచించారు. 2 వేల నోట్ల ఉపసంహరణ వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థకు నామమాత్రపు ఇబ్బందులు కూడా రావనీ.. బ్లాక్ మనీ బ్యాంకులకు రావటం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడే అవకాశం ఉందని చెప్పారు.
నటుడు శరత్ బాబు ఇక లేరు
గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై ఉన్న సీనియర్ నటుడు శరత్ బాబు కొద్ది సేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కిడ్నీలు, ఊపిరితిత్తులు, లివర్ పాడవటంతో శరత్ బాబు మరణించినట్టు హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. శరత్ బాబు మరణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది. ఆయన మృతిపట్ల టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శరత్ బాబు భౌతిక కాయాన్ని చెన్నై తరలించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అభిమానుల సందర్శన కోసం ఆయన దేహాన్ని హైదరాబాద్ లో ఉంచుతారా లేదా అనే దానిపై ఆయన కుటుంబ సభ్యులు ఏ విషయమూ చెప్పలేదు. విషయం తెలిసిన పలువురు సన్నిహితులు హాస్పిటల్ కు బయల్దేరారు.
శరత్ బాబు సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస. ఆయన తల్లిదండ్రుల పేర్లు విజయ శంకర దీక్షితులు, సుశీలా దేవి. పోలీస్ ఆఫీసర్ కావాలని జీవిత లక్ష్యంగా చదువు పూర్తి చేస్తున్న క్రమంలో అనుకోకుండా నాటకాల వైపు వచ్చిన శరత్ బాబు.. ఆ తర్వాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు. 1973 లో విడుదలైన రామరాజ్యం సినిమాలో హీరోగా నటించారు శరత్ బాబు. ఆ రోజుల్లో శరత్ బాబుకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేది. శోభన్ బాబు, మురళీ మోహన్ వంటి సీనియర్ నటులకు ధీటుగా మహిళా ప్రేక్షకుల్లో శరత్ బాబుకు ఆదరణ ఉండేది. హీరోగా విపరీతమైన పోటీ ఎదుర్కున్న శరత్ బాబు.. ఒకానొక దశలో సెకండ్ హీరోగానూ.. ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగానూ కూడా నటించాల్సి వచ్చింది. ముఖ్యంగా సీతకోక చిలుక సినిమా శరత్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా. మరో చరిత్ర, ఇది కథ కాదు లాంటి ఓల్డ్ క్లాసిక్ సినిమాల్లో శరత్ బాబు గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు. సితార సినిమాతో అవార్డులు అందుకున్నారు. ఇక సాగర సంగమం సినిమాలోని ఆయన పాత్ర కమల్ హాసన్ తో సరిసమానంగా ఉంటుంది. అన్వేషణ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కూడా శరత్ బాబుకు మంచి పేరు తెచ్చింది. సంసారం ఓ చదరంగంలో స్వార్థపరుడైన కొడుకు పాత్రతో పాటు క్రిమినల్ సినిమాలో స్నేహితుడిని మోసం చేసే నెగెటివ్ రోల్ చేశారు. ఇలా రకరకాల పాత్రల్లో నటించిన శరత్ బాబు 250కు పైగా సినిమాల్లో నటించారు. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే రమాప్రభతో ప్రేమవివాహం చేసుకొని కొద్ది సంవత్సరాలకే ఇద్దరూ విడిపోయారు.
ఐపీఎస్ లకు కేజ్రీవాల్ బెదిరింపులు : అమిత్ షా ఎంట్రీతో సీన్ రివర్స్
దేశ రాజధాని ఢిల్లీపై పరిపాలన అధికారాలు మొత్తం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి మరియు మంత్రులకు మాత్రమే ఉంటుందంటూ సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు నుంచి ఇలా జడ్జిమెంట్ కాపీ ఢిల్లీ ప్రభుత్వానికి అందిందో లేదో.. ఎగిరి గంతేశాడు సీఎం కేజ్రీవాల్. ఇక తన పెత్తనానికి తిరుగులేదని భావించిన కేజ్రీ.. క్షణం ఆలస్యం చేయకుండా అధికార దుర్వినియోగం మొదలుపెట్టాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఢిల్లీ ఎడ్యుకేషన్ స్కామ్ తో పాటు ఇటీవల తన అధికారిక నివాసం కోసం లెక్కలు చెప్పకుండా ఖర్చు చేసిన కోట్లాది రూపాయలకు సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫైల్స్ ఎక్కడ ఎవరి దగ్గర ఉన్నాయో ఆ అధికారులను పిలిచి మరీ వారిని బెదిరించాడు కేజ్రీవాల్. తమ వద్ద ఉన్న సాక్ష్యాలు, ఫైల్స్ ను మర్యాదగా ఇచ్చేయాలనీ లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఐపీఎస్, ఐఏఎస్ అధికారులను బెదిరించాడు. విషయం హోమంత్రి అమిత్ షా చెవిన పడింది.. వెంటనే రంగంలోకి దిగిన అమిత్ షా ఢిల్లీ పరిపాలన అధికారాలను ఢిల్లీ ప్రభుత్వానికి కట్టబెడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన పిటిషన్ పై కౌంటర్ ఫైల్ చేయించాడు. దీంతో పాటు ఢిల్లీపై సర్వాధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు కట్టబెడుతూ అప్పటికప్పుడు ఆర్డినెన్స్ జారీ చేశాడు. దీంతో పట్టుపని పది రోజులు కూడా అధికారం చెలాయించలేని కేజ్రీవాల్.. మళ్ళీ చతికిలపడిపోయాడు. అసలు ఢిల్లీ పరిపాలన అధికారం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ ప్రభుత్వం మధ్య ఏం జరిగిందో చూస్తే..
ఢిల్లీలో ఎవరి అధికారాలు ఏంటన్నదానిపై వివాదం ఇప్పటిది కాదు. 2015 నుంచే ఈ రచ్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఢిల్లీ పాలనాధికారాలను మొత్తం ఎల్జీ చేతిలో పెట్టింది. అప్పట్లో అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వాన్ని డమ్మీని చేసేందుకే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకొన్నదన్న విమర్శలు వినిపించాయి. కేంద్రం నిర్ణయంపై కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు వెళ్లటంతో.. కోర్టు కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ వివాదాన్ని విచారించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం.. ఎల్జీ, ఎన్నికైన ప్రభుత్వం మధ్య స్పష్టమైన అధికారాల విభజనను సూచిస్తూ ఈ నెల 11న తీర్పు ఇచ్చింది. నగరంలో పోలీస్ వ్యవస్థ బాధ్యత మాత్రమే ఎల్జీదని, ఇతర శాసన, కార్యనిర్వాహక బాధ్యతలు ఎన్నికైన ప్రభుత్వానికే చెందుతాయని స్పష్టం చేసింది. ఈతీర్పు వెలువడి వారం తిరక్కముందే కేంద్రం తాజా ఆర్డినెన్స్ తెచ్చింది. ఈ ఆర్డినెన్స్‌తో లెఫ్టినెంట్ గవర్నర్‌కు గతంలోకంటే అధిక అధికారాలు వచ్చాయి. శాంతి భద్రతలతోపాటు కార్యనిర్వాహక అధికారాలు కూడా ఎల్జీ చేతుల్లోకే వెళ్లిపోయాయి. ఐతే, దేశ ప్రయోజనాల దృష్ట్యా నగరంలో అధికారాల సమతుల్యం కోసమే ఈ ఆర్డినెన్స్ తెచ్చామని కేంద్రం చెబుతోంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన ఆర్డినెన్స్‌తో ఢిల్లీలో గ్రూప్(ఏ)తోపాటు డీఏఎన్‌ఐసీఎస్ అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలపై ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాలు పూర్తిగా రద్దయ్యాయి. ఇదే సమయంలో నగరంలో పై అధికారుల పోస్టింగ్, బదిలీలతోపాటు విజిలెన్స్ అధికారాలు లెఫ్టినెంట్ గవర్నర్ కు దఖలుపడ్డాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీ పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. దీనికి చైర్మన్‌గా ఢిల్లీ ముఖ్యమంత్రి ఉంటారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సభ్యుడిగా, నగర హోంశాఖ కార్యదర్శి మెంబర్ సెక్రెటరీగా ఉంటారు. నగరంలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, పోస్టింగ్ ఇవ్వాలన్నీ ఈ ముగ్గురూ సమావేశమై, ఓటింగ్ నిర్వహించి ఎల్జీకి నివేదించాల్సి ఉంటుంది. ఐనా, ఈ అథారిటీ సిఫారసులను ఎల్జీ గౌరవించాల్సిన పనిలేదు. వాటిని కాదని, తన సొంత నిర్ణయంతో వ్యవహరించే వీలు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఉంటుంది. ఢిల్లీలోని పోలీస్ వ్యవస్థ ఇప్పటికే ఎల్జీ చేతిలో ఉంది. దేశ రాజధానిలో శాంతిభద్రతల బాధ్యత మొత్తం లెఫ్టినెంట్ గవర్నర్‌దే. సివిల్ అధికారులపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండేది. తాజా ఆర్డినెన్స్‌తో ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి ఆ అధికారాలు కూడా లేవు. సింపుల్‌గా చెప్పాలంటే కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌లో ఉంది ఇదే. మొత్తంగా.. ఢిల్లీ పాలనాధికారాపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగే అవకాశాలు కనిపించడం లేదు. మరి కేంద్రం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.
ప్రధాని మోడీని కలవనున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవనున్నాడు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారి ఇద్దరి భేటీ జరగనుంది. త్వరలో జపాన్ లోని హిరోషిమాలో జరగనున్న జీ7 సమ్మిట్ లో ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో ఈ భేటీ ఉన్నదని విదేశాంగ శాఖ పేర్కొన్నదే తప్ప ఎక్కడ ఎప్పుడు జరగనుందన్న విషయంతో పాటు ఇద్దరి మధ్య ఏయే అంశాలు చర్చకు వస్తాయన్న విషయం మాత్రం ఎక్కడా పేర్కొనలేదు. అమెరికా ఆర్థిక సంక్షోభం ముంగిట ఉండటం.. రష్యా దగ్గర ఆయుధ నిల్వలు అడుగంటిపోవటం.. చైనా జర్మనీ మధ్య హంబర్గ్ పోర్టు ఒప్పందం జరగటం.. ఇలాంటి కీలక పరిణామాల మధ్య ప్రధాని మోడీ జపాన్ పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
గత సంవత్సరం ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య ప్రారంభించిన రెండో రోజే ఉక్రెయిన్ విదేశాంగ ప్రతినిథి బహిరంగంగా ఓ ప్రకటన చేశాడు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని కేవలం మోడీజీ మాత్రమే ఆపగలరనీ.. వెంటనే పుతిన్ తో మోడీ మాట్లాడి ఉక్రెయిన్ పై యుద్ధాన్ని నిలువరించాలని కోరాడు. కానీ ఇందుకు భారత్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. భారత్ యుద్ధాన్ని ఎప్పుడూ సమర్థించదు అని చెప్తూనే ఉక్రెయిన్ కు అనుకూలంగా, రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఎలాంటి ప్రకటన చేయకుండా తటస్థంగా ఉంటూ వచ్చింది. కొద్ది రోజుల క్రితం కూడా జెలెన్ స్కీ ఓ ప్రకటన చేశాడు. తమ వద్ద ఆయుధ నిల్వలు అయిపోవటంతో పాటు ఉక్రెయిన్ ఆర్థికంగా చితికిపోయిందనీ.. భారత్ తమను ఆదుకునేందుకు ఆయుధ ప్యాకేజీతో పాటు ఆర్థిక సాయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశాడు. కానీ భారత్ అందుకు అంగీకరించలేదు. భారత్ రష్యా వైపే ఉందని నిరూపించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు కావాలనే అలాంటి విజ్ఞప్తి చేశాడన్న విషయం భారత్ కు తెలుసు. ఉక్రెయిన్ ఎన్నిసార్లు సాయం కోరినా భారత్ నిరాకరించి రష్యాను సమర్థించింది అని చెప్పేందుకే ఈ ప్రయత్నం.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం విషయంలోనూ.. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రపంచం ముందు ఉంచే విషయంలోనూ భారత్ చేసిన ప్రయత్నాలను ఉక్రెయిన్ అనేకసార్లు వ్యతిరేకించింది. ఇప్పుడు కూడా హిరోషిమాలో జెలెన్ స్కీ మోడీని కలిసి అడిగేది ఒక్కటే.. పుతిన్ ను యుద్ధం విరమించేలా మధ్యవర్తిత్వం చేయాలనీ.. అలాగే తమకు ఆయుధ, ఆర్థిక సాయం అందజేయాలని మాత్రమే. ఇంతకు మించి భారత్ ఉక్రెయిన్ ప్రధానుల మధ్య చర్చకు వచ్చే అంశాలేవీ ఉండే అవకాశం లేదు. కానీ ఈ పర్యటనలో మోడీ మిగతా దేశాలతోో కీలక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
“ది కేరళ స్టోరీ” నిజమైన బాధితులను ప్రపంచానికి మూవీ టీమ్
రోజుకో రకంగా వార్తల్లో నిలుస్తోంది వివాదాస్ఫద సినిమా ది కేరళ స్టోరీ. తమపై నిరాధార ఆరోపణలు చేశారని ఏకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకే పరువు నష్టం కేసులో నోటీసులు పంపించి అందరికీ షాకిచ్చింది ఈ సినిమా టీమ్. ఇప్పుడు మరోసారి ఊహించని షాకిచ్చారు సినిమా మేకర్స్. కేరళలో అమాయకమైన ఆడపిల్లల మతమార్పిడులు జరిగాయని అనడానికి సాక్ష్యాలేవి అని ప్రశ్నించిన వారికి గట్టి సమాధానం చెప్పారు ఈసారి. నిజ జీవితంలో ముస్లిం మతానికి బలవంతంగా మార్పిడికి గురై.. తీవ్రవాదం వైపు ప్రోత్సహించబడి జీవితాలు నాశనం చేయబడిన నిజమైన బాధితులను సినిమా టీమ్ ప్రపంచానికి పరిచయం చేసింది. బలవంతంగా మతం మార్చబడిన 26 మంది మహిళలను పరిచయం చేశారు సినిమా యూనిట్.
అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇనాని, సోనియా బలానీ నలుగురు నటీమణులు, సినిమా నిర్మాత అమృత్ లాల్ షా, డైరెక్టర్ సుదీప్తో సేన్ కలిసి 26 మంది బాధిత మహిళలతో పాటు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నిజాన్ని సమాజానికి పరిచయం చేశారు. తమను ప్రశ్నించిన వారికి గట్టి సమాధానంగా బాధిత మహిళల విషాద కథలను తెలియజేస్తూ తాము సినిమాలో చూపించిన దానిలో ఏమాత్రం అసత్యం లేదని కుండ బద్దలు కొట్టేశారు. తమ సినిమా సాధించిన వసూళ్ళలో నుంచి 51 లక్షల రూపాయలను బాధిత మహిళల కోసం వారి ఆశ్రమానికి విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా అదా శర్మ మాట్లాడిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. “మతమార్పిడి కుట్రకు బలైన వారి గురించి కొంత మంది ఆధారాలు అడుగుతున్నారు.. రోజుకు 15 సార్లు తనపై అత్యాచారం జరిగిందని కంప్లైంట్ చేసిన మహిళను ఆధారాలు అడిగితే ఎలా..?” అంటూ తమ సినిమా ప్రామాణికతను ప్రశ్నించిన వారిని ఎదురు ప్రశ్నించింది అదా శర్మ. దీంతో మరోసారి అదా దేశవ్యాప్తంగా మరోసారి వార్తల్లో మనిషైంది. సినిమా విడుదలైన నాటి నుంచి అదా శర్మ హనుమాన్ చాలీసా చదివే వీడియో, కర్రసాము వీడియో, గన్ షూటింగ్ వీడియో, దేవాలయంలో పూజలు చేస్తున్న వీడియో.. ఇలా చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు అదా శర్మ భారత్ లో మోస్ట్ డిస్కసింగ్ యాక్ట్రెస్ అయిపోయింది.
కేరళలో కొన్ని వేల మంది అమాయక హిందూ మహిళలను ఇస్లాం మతం లోకి మార్చి వారిలో తీవ్రవాద భావజాలాన్ని నింపి ఇరాక్ కేంద్రంగా పనిచేసే ఐఎస్ఐఎస్ తీవ్రవాద సంస్థకోసం పనిచేసేలా ప్రోత్సహించటం.. ఇరాక్ తరలించి తీవ్రవాదులుగా మార్చటం.. ఇదే ది కేరళ స్టోరీ కథ. ఈ సినిమా విడుదలైన రోజు నుంచి కొంత మంది కథ కల్పితం మాత్రమేననీ.. నిరాధారమనీ వాదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజజీవితంగా ఇస్లాం మతమార్పిడికి గురైన బాధితులను లైవ్ లో ప్రపంచానికి పరిచయం చేయటం ఊహించని పరిణామం. ఇది కేరళతో పాటు భారత్ ను మరోసారి కుదిపేసే అవకాశం ఉంది.
ఐశ్వర్య రాజేశ్ కామెంట్లపై వైరల్ అవుతున్న రష్మిక ట్వీట్
స్టార్ హీరోయిన్లు రష్మిక మందన, ఐశ్వర్య రాజేశ్ ఫ్యాన్స్ మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రష్మికను ఐశ్వర్య కించపరిచేలా మాట్లాడిందన్న వార్తలపై స్పందించిన రష్మిక ఫ్యాన్స్.. ఐశ్వర్యను ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. దీంతో ఐశ్వర్య తాను ఏ వ్యాఖ్యలు చేయలేదంటూ వివరణ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య మాట్లాడుతూ.. తనకు పుష్ప సినిమాలోని రష్మిక క్యారెక్టర్.. అలాగే దసరా సినిమాలోని కీర్తిసురేష్ క్యారెక్టర్.. ఇలాంటివి బాగా సెట్ అవుతాయని కామెంట్ చేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం “పుష్ప సినిమాలో రష్మిక కంటే నేను ఇంకా బాగా చేసేదాన్ని” అని ఐశ్వర్య కామెంట్ చేసినట్టు ప్రచారం జరిగింది. చిన్నగా మొదలైన వివాదం పెద్దదవుతుండటంతో ఐశ్వర్య రాజేశ్ స్వయంగా దీనిపై స్పందించింది. ట్విటర్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. “నేను రష్మికను ఏమీ అనలేదు.. ఆమె నటన అంటే నాకు చాలా ఇష్టం.. కావాలని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు.. రష్మిక పాత్ర నాకు బాగా సెట్ అవుతుందని మాత్రమే అన్నాను..” అంటూ క్లారిటీ ఇచ్చింది.
ఐశ్వర్య ట్వీట్ పై రష్మిక కూడా రియాక్ట్ అయ్యింది. “మై లవ్.. నేను ఇప్పుడే దీని గురించి తెలుసుకున్నాను.. నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను.. నువ్వు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు.. నాకు నీ పైన ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నాయి.. ఎప్పటికీ ఉంటాయి కూడా. నీ కొత్త సినిమా ఫర్హానా చూశాను.. చాలా బాగుంది.. ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేసింది. రష్మిక ఐశ్వర్య పట్ల పాజిటివ్ గా స్పందించటంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడనుంది. ఐశ్వర్య పట్ల రష్మిక పాజిటివ్ గా స్పందించటం పట్ల ఇద్దరు హీరోయిన్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దీన్ని కూడా వైరల్ చేసేస్తున్నారు.