ఉత్తర్ ప్రదేశ్ లో మరో గ్యాంగ్ స్టర్ హత్య చోటు చేసుకుంది.. అది కూడా కోర్టులో. ఓ కేసులో విచారణ నిమిత్తం గ్యాంగ్ స్టర్ అయిన సంజీవ్ జీవాను లక్నో లోని సివిల్ కోర్టుకు హాజరు పరుచేందుకు పోలీసులు తీసుకొచ్చారు. సంజీవ్ అక్కడికి వస్తాడని ముందె తెలిసిన కొంత మంది పక్కా ప్లాన్ ప్రకారం లాయర్ల వేషంలో వచ్చి సంజీవ్ కు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి పక్కనే ఉన్న పోలీసులతో పాటు ఓ ఆరేళ్ళ బాలిక కూడా ఈ కాల్పుల్లో గాయపడినట్టు సమాచారం. దుండగుల కాల్పుల్లో సంజీవ్ జీవా తప్ప ఇంకెవరికీ ప్రాణహాని జరగలేదు. సంజీవ్ హత్య మరోసారి ఉత్తర్ ప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ అదుపులో లేదంటున్న ప్రతిపక్షాలు.. ఈ ఘటనతో మరోసారి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పై విరుచుకుపడేందుకు సిద్ధమవుతున్నాయి.
కొద్ది రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్ లోనే పేరు మోసిన మాఫియా డాన్ అతీక్ అహ్మద్ ను పోలీసుల అదుపులో ఉండగానే దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. మీడియా వ్యక్తుల వేషంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతీక్ అహ్మద్ ను పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురి పెట్టి కాల్చి చంపారు. అతీక్ తో పాటు పక్కనే ఉన్న అతని సోదరుడు ఆష్రఫ్ ను సైతం దుండగులు కాల్చి చంపేశారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఓ పక్క పోలీసులు పేరు మోసిన మాఫియా డాన్ లనూ.. గ్యాంగ్ స్టర్ లనూ ఎన్ కౌంటర్లో చంపేస్తుంటే.. మరో పక్క పేరు మోసిన మాఫియా వ్యక్తులను వారి శతృవుల రూపంలో అదే మాఫియా బలి తీసుకుంటున్నది. ఈ రోజు జరిగిన హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
బ్రేకింగ్ : యూపీలో మరో గ్యాంగ్ స్టర్ హతం – కోర్టులోనే హత్య
వైరల్ వీడియో : యుద్ధ ట్యాంక్ అనుకొని ట్రాక్టర్ ను పేల్చేశారు
తమను వేటాడేందుకు రష్యా సైన్యం యుద్ధ ట్యాంకును పంపించిందని అనుకొని.. వ్యవసాయానికి ఉపయోగించే స్ట్రేయర్ ట్రాక్టర్ ను పేల్చి వేసింది ఉక్రెయిన్ సైన్యం. పైగా తామేదో ఘనకార్యం సాధించామంటూ అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. “మేం రష్యాకు చెందిన 2 జర్మన్ లియోపార్డ్ ఎంబీటీ యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశాం..: అంటూ పోస్ట్ చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఈ వీడియోలు చూసిన రష్యాన్ ఆర్మీ అధికారులు.. అక్కడ ధ్వంసం చేయబడినవి జర్మన్ లియోపార్డ్ ఎంబీటీ ట్యాంకులు కాదు.. అవి వ్యవసాయం కోసం ఉపయోగించే ట్రాక్టర్ స్ప్రేయర్లు. జాన్ డీర్ 4830 మోడల్ కు చెందినవి.. అంటూ ట్వీట్ చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకునే ఈ మోడల్ ట్రాక్టర్లను పొలంలో స్ప్రే చేయటానికి ఉపయోగిస్తారు. ఇంజిన్ స్టార్ట్ చేసేసి.. స్ప్రే ఆన్ చేస్తే దానంతట అదే పొలంలో తిరుగుతూ స్ప్రే చేస్తుంది. దగ్గర్లో ఉన్న పొలాల నుంచి నడుస్తూ నడుస్తూ పొరపాటున యుద్ధం జరుగతున్న ప్రదేశానికి దగ్గరిదాకా వచ్చేశాయి.
దూరం నుంచి చూస్తే ట్రాక్టర్ పై ఉన్న పొడవాటి స్ప్రేయర్ అచ్చం యుద్ధ ట్యాంకర్ లాగా కనిపించేలా ఉంటుంది. పొలాల్లో నుంచి నెమ్మదిగా కదులుతూ యుద్ధక్షేత్రాన్ని సమీపించాయి ఈ ట్రాక్టర్లు. డీజిల్ పూర్తిగా అయిపోతుండటంతో ఆగుతూ కదులుతూ ముందుకెళ్తున్నాయి. వీటి కదలికలను బట్టి, ఆకారాన్ని బట్టి ఖచ్చితంగా యుద్ధ ట్యాంకర్లు అని నిర్థారించుకున్న ఉక్రెయిన్ సైనికులు.. గురి చూసి వాటిని పేల్చేశారు. తీరా చూస్తే అవి పొలంలో తిరిగే ట్రాక్టర్లు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 15 నెలలు గడిచినా రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ముగింపుకు రాలేదు. అమెరికా, యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధ, ఆర్థిక సాయం చేస్తుండటంతో.. ఉక్రెయిన్ తో పోరాటం రష్యాకు తలకు మించిన పనిగా మారింది.
సిసోడియా కోసం అందరి ముందు ఏడ్చేసిన కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ సభా వేదికపై ఎమోషనల్ అయ్యారు. తన సహచర మంత్రి మనీష్ సిసోదియాను తలచుకొని కంటతడి పెట్టుకున్నాడు. ఢిల్లీ విద్యా శాఖ కోసం ఎంతో కష్టపడి పనిచేసిన మనీష్ సిసోదియాను జైళ్ళో పెట్టడం అన్యాయం అంటూ ఆక్రోశించాడు పాపం కేజ్రీవాల్. విద్యాశాఖను పూర్తిగా సంస్కరించేందుకు సిసోదియా ఎంతో పట్టుదలతో, కమిట్మెంట్ తో పనిచేశాడనీ.. తాను అనుకున్నట్టే ఎన్నో మార్పులు చేసి విద్యాశాఖను సంస్కరించి అభివృద్ధి చేశాడనీ చెప్తూ.. అలాంటి వ్యక్తిని అన్యాయంగా జైళ్ళో పెట్టారంటూ బాధపడ్డాడు కేజ్రీవాల్. ఢిల్లీలోని ఓ ప్రైవేట్ విద్యాసంస్థ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఢిల్లీ సీఎం.. ఇలా అందరి ముందు కంటతడి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈయన ఎవరి కోసం అయితే ఏడ్చాడో ఆయన లిక్కర్ కుంభకోణంతో పాటు మరి కొన్ని నేరారోపణలపై అరెస్టు చేయబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ వంటి 13 శాఖలకు మంత్రిగా వ్యవహరించేవాడు మనీశ్ సిసోదియా. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు ఇతడే.
అప్పటికే ఢిల్లీలో ఆచరణలో ఉన్న లిక్కర్ విధానాన్ని పూర్తిగా మార్చేసి ప్రభుత్వంపై కాసుల వర్షం కురిపించే ప్రైవేట్ లిక్కర్ పాలసీని రూపొందించిన వారిలో ముఖ్యుడు సిసోదియా. దీని కోసం కోట్లాది రూపాయలు చేతులు మారాయనీ.. దీని ద్వారా వచ్చిన సొమ్మునే పంజాబ్ ఎన్నికల్లో ఖర్చు చేశారనీ సీబీఐ ఆరోపణ. విచారణకు రావాలంటూ సీబీఐ నోటీసులు ఇచ్చినా సరిగ్గా స్పందించక పోవటం.. చివరికి విచారణకు హాజరై కూడా సీబీఐ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవటంతో అప్పట్లో వివాదం పెద్దదైంది. “మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా.. నేను ఢిల్లీ డిప్యూడీ ముఖ్యమంత్రిని.. అలాగే 13 శాఖలు నా చేతిలో ఉన్నాయి.. నేను ఒక్క నిముషం కూడా వృధా చేయను.. నాతో కాస్త మర్యాదగా మాట్లాడండి..” అంటూ సీబీఐ అధికారులను సిసోదియా బెదిరించాడు. ఆ తర్వాత పాపం.. తాను మంత్రిగా ఉన్న అన్ని శాఖలకు రాజీనామా చేసి.. చివరకు ఉప ముఖ్యమంత్రి పదవికి కూడా స్వస్తి చెప్పి.. అదే సీబీఐ అధికారుల ముందు చేతులు కట్టుకొని నిలబడి.. చివరకు జైలుకు వెళ్ళాడే తప్ప.. దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసో.. ప్రజా ఉద్యమం చేసో కాదు. కానీ.. ఎంతైనా తనతో పాటు కుంభకోణాల్లో పాలు పంచుకున్నవాడు కాబట్టి.. కేజ్రీవాల్ కు ఆమాత్రం ఆప్యాయత ఉంటుంది మరి.
తిరుమలలో హీరోయిన్ కు ముద్దుపెట్టిన ఆదిపురుష్ డైరెక్టర్
ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి తిరుమలలో జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్ ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం సినిమా డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ కలిసి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మాడ వీధుల్లో మీడియాకు కనిపించారు వీళ్ళిద్దరూ. ఈ క్రమంలో ఫోటోలకు ఫోజులిస్తూ.. కాస్త ఎమోషనల్ అయిన డైరెక్టర్ ఓం రౌత్.. హీరోయిన్ కృతి సనన్ ను కౌగిలించుకొని.. బుగ్గ మీద ముద్దుపెట్టాడు. ఇది ఇప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. పవిత్ర స్థలం అయిన తిరుమలలో ఇలా బహిరంగంగా కౌగిలించుకోవటం.. ముద్దు పెట్టడం అనేవి అసభ్యకరంగా అనిపించటం లేదా అంటూ డైరెక్టర్ ఓం రౌత్ ను తిట్టిపోస్తున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పెద్ద చర్చే నడుస్తోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కామెంట్ల రూపంలో జనాలు వీళ్ళిద్దరిపై విరుచుకుపడుతున్నారు.
నిజానికి దీన్ని అంత వివాదం చేయాల్సిన అవసరం లేదేమో. బాలీవుడ్ వాళ్ళకు ఆడ, మగ తేడా లేకుండా కౌగిలించుకోవటం.. బుగ్గ మీద ముద్దు పెట్టడం అలవాటే తప్ప అసభ్యత అని వాళ్ళు అనుకోరు. కాకపోతే తిరుమల లాంటి పవిత్ర ప్రదేశంలో ఇలా చేయటం తప్పే అయినా.. వాళ్ళ మనసులో అసభ్యత లేదు అనేది కాస్త అర్థం చేసుకుంటే మంచిది. ఒకరిపై ఒకరు తమకు గల ఆప్యాయతను, ఎమోషన్ ను వ్యక్తం చేసే ఒక పద్ధతిగానే వాళ్ళు దీని గురించి ఆలోచిస్తారే తప్ప బుగ్గ మీద ముద్దు పెట్టుకోవటం తప్పుగా భావించరు. మనం కూడా దీన్ని అదే దృష్టితో చూస్తే మంచిదేమో. నిజానికి తిరుమలలో జరుగుతున్న అరాచకాలతో పోల్చితే ఇదేమంత నేరం కాదు. కొండ మీదే మందు, సిగరెట్లు విచ్చలవిడిగా అమ్మేయటం మనం చూడటం లేదా..? ఇతర మతాల ప్రచారం స్వేచ్ఛగా జరగటం మనకు తెలియదా..? అసలు టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న వాళ్ళే ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న విషయం నిజం కాదా..? భక్తుల తల వెంట్రుకల దగ్గరి నుంచి హుండీలో వేసే బంగారం దాకా కోట్ల రూపాయలు టీటీడీ అర్జిస్తే వాటికి లెక్కలు చెప్పకుండా అక్కడి ప్రభుత్వాలు ఎత్తుకెళ్తే ఎవ్వడూ అడిగేవాడు లేడు కానీ.. తమ సినిమా సక్సెస్ కావాలని దేవుడిని మొక్కి తన సహచరులపై ఆప్యాయతతో అలా తాకీ తాకనట్టు బుగ్గపై ముద్దు పెడితే.. పెద్ద రచ్చ చేస్తున్నారు. కొండ మీద జరిగే అన్ని అరాచకాలను చూసి కూడా ప్రశ్నించే దమ్ము లేని వాళ్లు.. ఫ్రీగా ట్విటర్ లో ఫేస్ బుక్ లో పోస్టులు పెట్టి విమర్శిస్తే ఎలా.. ఓ సారి ఆలోచించుకుంటే మంచిది.
ఓటీటీలో నాగ చైతన్య “కస్టడీ” సినిమా
క్రేజీ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో నాగచైతన్య లీడ్ రోల్ లో తెరకెక్కిన కొత్త సినిమా కస్టడీ.. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. జూన్ 9 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని అమేజాన్ ప్రైమ్ ట్వీట్ చేసింది. నాలుగు సౌత్ ఇండియన్ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ కాబోతోందని అనౌన్స్ చేసింది. థియేటర్ రిలీజ్ అయిన నెల లోపే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. వెంకట్ ప్రభు-నాగచైతన్య కాంబినేషన్ పై అంచనాలు భారీగానే ఉన్నప్పటికీ.. అంచనాలను అందుకోలేకపోయింది కస్టడీ సినిమా. కాకపోతే.. డిఫరెంట్ స్టోరీ, వెరైటీ సబ్జెక్ట్ లతో సినిమాలు చేసే వెంకట్ ప్రభు.. ఈసారి కూడా అరే రీతిలో కస్టడీని తెరకెక్కించాడు. మామూలుగా నేరస్తులను పోలీసులు శిక్షించాలని చూస్తారు.. కానీ ఈ సినిమాలో ఒక పోలీసు తన కస్టడీలో ఉన్న నిందితుడికి ఇతరుల నుంచి ఉన్న ప్రాణహానిని అడ్డుకుంటూ కాపాడుతూ వస్తాడు. విభిన్నమైన జానర్ లో సినిమా తెరకెక్కి.. మాస్ ఆడియన్స్ ను మాత్రం మెప్పించింది ఈ సినిమా. కాకపోతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టలేకపోయింది.
రోడ్డుపై గొడవపడుతున్న ఇద్దరు వ్యక్తులను డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్టు చేస్తాడు పోలీస్ కానిస్టేబుల్ అయిన హీరో. ఆ ఇద్దరిలో ఒకరు కరడుగట్టిన నేరస్తుడు అయితే.. మరొకడు సీబీఐ ఆఫీసర్. అలా పోలీస్ కస్టడీలోకి వచ్చిన నేరస్తుడు రాజును కోర్టులో హాజరు పరచాలని కానిస్టేబుల్ భావిస్తే.. అనుకోకుండా పోలీస్ కమిషనర్ రంగంలోకి దిగి నిందితుడు రాజును చంపాలని ప్రయత్నిస్తుంటాడు. ఇలా చేయమని స్వయంగా ముఖ్యమంత్రి ఆ కమిషనర్ ను ఆదేశిస్తాడు. ఈ క్రమంలో ఆ కమిషనర్ నుంచి నేరస్తుడు రాజును కానిస్టేబుల్ ఎలా కాపాడతాడు అనేది సినిమా. ఈ కథకు కాస్తంత లవ్ స్టోరీ.. కాస్తంత రొమాన్స్.. కాస్తన్ని ఎమోషనల్ సీన్లు.. ఫైట్ సీన్లు.. ఇలా అన్నీ కలిపితే కస్టడీ. థియేటర్లో బ్లాక్ బస్టర్ కాలేకపోయిన కస్టడీ.. ఓటీటీలో ఏం టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
అమర్నాథ్ లో పాక్ టెర్రర్ కుట్ర : ఇంటలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్
జూన్ 1న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రపై తీవ్రవాదులు దాడులు చేయబోతున్నట్టు ఇండియన్ ఇంటలిజెన్స్ ఇచ్చిన హెచ్చరికతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ కేంద్రంగా పని చేసే తీవ్రవాద సంస్థ అమర్నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యత ఇద్దరు కశ్మీరీ యువకులకు అప్పగించిందనీ.. వాళ్ళకు ఇదివరకే శిక్షణ ఇవ్వటంతో పాటు ఆయుధాలు, దాడికి కావాల్సిన సూచనలు అందుబాటులో ఉంచిందనీ ఇంటలిజెన్స్ చెప్తోంది. దీంతో కశ్మీర్ లోయలో సెక్యూరిటీని పెంచింది కేంద్ర ప్రభుత్వం. రాజౌరీ-పూంచ్, చీనాబ్ వ్యాలీ ప్రాంతాల్లో దాడులకు అవకాశాలున్నాయని పేర్కొంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచటంతో పాటు భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. దాడులకు పాల్పడేందుకు సిద్ధమైన ఆ ఇద్దరు కశ్మీరీ యువకుల ఆచూకీ కనిపెట్టేపనిలో సైన్యం నిమగ్నమైంది. ఆ యువకులు ఎవరు.. వారి కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు.. వంటి విషయాలపై సైన్యం నిఘా ఉంచింది. అయితే.. దీనిపై జాతీయ మీడియాలో కథనాలే తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ సైన్యం నుంచి గానీ అధికారిక సమాచారం లేదు.
ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు అమర్నాథ్ యాత్ర జరుగుతుంది. దేశ విదేశాల నుంచి శివభక్తులు లక్షలాదిగా ఈ యాత్రకు హాజరవుతారు. 2017లో పాకిస్తన్ కు చెందిన తీవ్రవాద సంస్థ లష్కర్ ఈ తయ్యబా అమర్నాథ్ యాత్రీకులపై దాడికి పాల్పడ్డారు ఈ దాడిలో 8 మంది యాత్రీకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతిష్టాత్మక జీ20 సదస్సును కశ్మీర్ లో నిర్వహించటం పట్ల పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అందుకు కౌంటర్ కూడా ఇచ్చింది. కశ్మీర్ లో తీవ్రవాదం అనేది లేదనీ.. కశ్మీర్ పూర్తిగా భారత్ లో అంతర్భాగమనీ చెప్పటానికే భారత ప్రభుత్వం శ్రీనగర్ లో సదస్సు నిర్వహించింది. ఎలాగైనా కశ్మీర్ లో తీవ్రవాద దాడి చేసి భారత్ కు సవాల్ విసరాలనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్టు గ్రూపుల కుట్ర. ఇటీవలే కశ్మీర్ లో ఆర్మీ వ్యాన్ పై టెర్రర్ అటాక్ జరిగి 8 మంది జవాన్లు సజీవదహనం అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కశ్మీర్ లో దాగి ఉన్న తీవ్రవాదులను ఏరివేసేందుకు సైన్యం సెర్చ్ ఆపరేషన్లు, సోదాలు, దాడులు చేస్తూనే ఉంది.
“భారత్ అలాంటి దేశమే” – అమెరికా సంచలన స్టేట్మెంట్
“ఒక దేశంలో పూర్తి చైతన్యవంతమైన ప్రజాస్వామ్య ఎలా ఉంటుందో చూడాలంటే భారత్ ను చూడండి.. భారత్ అలాంటి దేశమే.. కావాలంటే మీరు ఢిల్లీ వెళ్ళి దీన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు..” ఈ మాటలు మాట్లాడింది అమెరికా వైట్ హౌజ్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అడ్వైజర్ జాన్ కర్బీ. తనకు పోటీ వచ్చే దేశాన్ని ఏదో రకంగా అంతర్జాతీయ సమాజం ముందు అభాసుపాలు చేయటం అమెరికాకు అలవాటు. ప్రపంచాన్ని శాసించాలనీ.. ప్రపంచం మొత్తానికీ అమెరికాయే దిక్కుగా ఉండాలనీ ఆ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు కోరుకుంటారు. అమెరికాలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. ఆ ప్రభుత్వ ఆలోచన మాత్రం ఇలాగే ఉంటుంది. కరడుగట్టిన సామ్రాజ్యవాదానికీ.. నియంతృత్వానికీ అమెరికా అధ్యక్షులు పెట్టింది పేరు. తాము పూర్తి ప్రజాస్వామికంగా వ్యవరిస్తామని చెప్తూనే ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చి అంతర్యుద్ధం సృష్టించి ప్రభుత్వాలను పడగొట్టడమే అమెరికా ఘన చరిత్రలో అతి ముఖ్య ఘట్టాలు. అలాంటి అమెరికా భారత్ పట్ల తన వైఖరి చాలా వరకు మార్చుకున్నట్టే కనిపిస్తోంది.
త్వరలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్-మోడీ సమావేశం.. భారత్-అమెరికా సంబంధాల గురించి ప్రస్తావించిన జాన్ కర్బ్.. మీడియా ముందు భారత్ ను.. ఇక్కడి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రశంసించాడు. భారత్ తో స్నేహం అనేది అమెరికాకు అత్యంత ప్రాముఖ్యమైన అంశమనీ.. ఇండో పసిఫిక్ వ్యూహంలో భారత్ అత్యంత కీలక భాగస్వామి అనీ వ్యాఖ్యానించాడు కర్బీ. “ప్రపంచంలో ఏ దేశంలోనైనా సరే ఆందోళనకరమైన లేదా అభ్యంతరకరమైన పరిస్థితి ఉంటే దాని గురించి నిజం మాట్లాడటానికి మేం ఎప్పుడూ సిగ్గుపడము. భారత్ గురించి చెప్పాలంటే వంద ఉదాహరణలు చెప్పొచ్చు. మోడీ-బైడెన్ మీటింగ్ అనేది చాలా ప్రాముఖ్యతగలమైన విషయం. భారత్ క్వాడ్ కూటమిలో భాగస్వామి..!” అని కర్బీ వ్యాఖ్యానించాడు. ఓ వైపు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో భారత్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనంగా ఉందని ఊదరగొట్టేస్తూ అక్కడా ఇక్కడా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే.. జాన్ కర్బీ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
సరిగ్గా మోడీ అమెరికా పర్యటనకు ముందు రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద తన పర్యటనను షెడ్యూల్ చేసుకున్నాడు. అమెరికాలో మోడీ పర్యటిస్తున్న సమయంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కడెక్కడ ఎలాంటి నిరసనలు చేపట్టాలి.. మోడీ ప్రభుత్వంపై ఎలా బురదచల్లాలి.. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చేసి ప్రజల్లో వ్యతిరేకత పెంచాలి.. అనే వాటిపైనే ముఖ్యంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. అవసరం లేకపోయినా అప్రస్తుతమైన అంశాలను ఢంకా బజాయించి అమెరికాలో ప్రచారం చేస్తున్నాడు రాహుల్. రాహుల్ వ్యాఖ్యలు ప్రపంచం ముందు భారత్ ను ఓ అప్రజాస్వామిక దేశంగా నిలుపుతాయేమో అని అనుకునేలోపే అమెరికా ప్రతినిథి నోట భారత ప్రజాస్వామ్యంపై ఇలాంటి అద్భుతమైన వ్యాఖ్యలు రావటం నిజంగా భారత్ పరపతి పెరిగిందని చెప్పటానికి నిదర్శనం.
ఓటీటీ రిలీజ్ కోసం అఖిల్ ‘ఏజెంట్’ సినిమా కొత్త వర్షన్
భారీ అంచనాలతో విడుదలై డిజాస్టర్ గా మిగిలిపోయిన అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్.. ఇప్పుడు మాడిఫికేషన్ పనుల్లో ఉందట. సినిమాలోని కొన్ని సీన్లు మార్చేసి కొత్త వర్షన్ ను ఓటీటీలో రిలీజ్ చేయటానికి సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. సినిమాలో బోరింగ్ గా అనిపించిన కొన్ని సీన్లను డిలీట్ చేయటంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సమయంలో డిలీట్ చేసిన కొన్ని సీన్లను స్క్రీన్ ప్లే మార్చి సినిమాలో చేర్చబోతున్నారట. షూట్ చేసి సినిమాలో నుంచి లేపేసిన రష్ ను కొత్త స్క్రీన్ ప్లే తో సినిమాలో యాడ్ చేసి ఏజెంట్ కొత్త వర్షన్ ను తయారు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా మాడిఫికేషన్ పనుల్లో ఉందనీ.. త్వరలోనే ఓటీటీలో రిలీజ్ అవుతుందని టాక్. అప్పుడెప్పుడో ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సిన ఏజెంట్ సినిమా.. థియేటర్లలో కంటే బెస్ట్ వర్షన్ ను తయారు చేసిన తర్వాతే రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని ఓటీటీ రిలీజ్ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారట. త్వరలోనే ఫుల్ డిటైల్స్ అనౌన్స్ చేసే అవకాశముంది.
హిట్ సినిమాలు లేక డల్ అయిపోయిన హీరోలకు బ్రేక్ ఇచ్చి మళ్ళీ గాడిలో పెట్టే సెన్సేషనల్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సుమారు 65 కోట్ల బడ్జెట్ తో ఏజెంట్ సినిమా తెరకెక్కింది. ప్రస్తుతం స్పై థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తుండటంతో అఖిల్ ఈ కథతో ప్రయోగం చేశాడు. కానీ పాపం.. ప్రయోగం బెడిసికొట్టి కనీసం ప్రమోషన్ కోసం ఖర్చుపెట్టిన డబ్బులు కూడా రాలేదు ఏజెంట్ సినిమాకు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సురేందర్ రెడ్డికీ.. బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు.. కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసిన హీరోయిన్ సాక్షివైద్యకు.. అక్కినేని ప్రేక్షకులకు.. ఇలా అందరినీ డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. ఇక ఓటీటీలో మాత్రం ఏం చేస్తుందో చూడాలి.
ఆదిపురుష్ ప్రతి థియేటర్లో హనుమంతుడి కోసం సీటు రిజర్వ్
ఆదిపురుష్ టీమ్ ప్రమోషన్లలో కొత్త కొత్త దారులు వెతుకుతోంది. సినిమా యూనిట్ తీసుకున్న ఓ సరికొత్త నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. రామాయణం ఎక్కడ చెప్పుకుంటున్నా సరే అక్కడికి హనుమంతుల వారు అందరికంటే ముందు వచ్చి కూర్చొని.. రామాయణం పూర్తిగా విని.. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోతారట. ఈ విషయం పురాణాల్లో చెప్పబడింది. అంతే కాదు సీతారాముల గురించి ఎక్కడ ప్రస్తావన వచ్చినా ఆంజనేయుడు అక్కడికి వెళ్ళి ఆ చర్చను ఆసాంతం వింటారట. దీని ఆధారంగా ఆదిపురుష్ ఓ వెరైటీ నిర్ణయం తీసుకున్నది. ఆదిపురుష్ సినిమా షో జరుగుతున్న ప్రతి థియేటర్లోనూ చిరంజీవి హనుమంతుల వారి కోసం ఓ సీటు రిజర్వ్ చేసి పెడతారట. ఆ సీటులో వేరెవ్వరూ కూర్చోవద్దనీ.. ఖచ్చితంగా ఆదిపురుష్ సినిమా చూడటానికి ఆంజనేయుడు ఆ థియేటర్ కు వస్తాడనీ.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామనీ చెప్తోంది సినిమా యూనిట్.
వేల సంవత్సరాలుగా ప్రపంచానికి సుపరిచితమైన సీతారాముల రామాయణ గాధ ఆధారంగా డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా జూన్ 16న విడుదల కానున్న విషయం తెలిసిందే. జూన్ 6న తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా.. ఈ వేడుకకు త్రిదండి చిన జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.
ఉక్రెయిన్ లో దారుణం : అతిపెద్ద డ్యామ్ కూల్చివేతతో లక్షల ప్రాణాలు బలి
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మొదటి సారి పెను విధ్వంసం జరిగింది. ఖేర్సన్ కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైడ్రోపవర్ డ్యామ్ పై బాంబుల వర్షం కురిసింది. ఫలితంగా డ్యామ్ ఆనకట్ట తెగి నీరు కట్టలు తెంచుకొని ఉధృతందా నగరంవైపు ప్రవహిస్తోంది. దీంతో లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పట్టుకొని అక్కడి నుంచి పరుగులు తీస్తున్నారు. కొన్ని వేల కుటుంబాలు ఆపదలో చిక్కుకున్నాయి. ఇంత దారుణ ఘటనకు బాధ్యులు ఎవరు అనేది మాత్రం తెలియరాలేదు. ఉక్రెయిన్ తీవ్రవాదులే ఈ చర్యకు పాల్పడ్డారని రష్యా ఆరోపిస్తుంటే.. రష్యా బలగాలే డ్యామ్ కూల్చివేసాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మంగళవారం తెల్లవారుజామున నీపర్ నదిపై ఉన్న కఖోవ్కా డ్యామ్ ఆనకట్ట పూర్తిగా తెగిపోయిన విషయాన్ని ఉక్రెయిన్ వెల్లడించింది. అర్థరాత్రి 2 గంటల ప్రాంతం నుంచి డ్యామ్ గోడలు, వాల్వ్, గేట్లపై బాంబుల వర్షం కురుస్తోందనీ.. తెల్లవారే సమయానికి డ్యామ్ ఆనకట్ట పూర్తిగా తెగిపోయి వరద నగరంవైపు దూసుకొస్తున్నదనీ ఉక్రెయిన్ ప్రకటించింది.
వరద ప్రభావిత ప్రాంతాలైన మైఖోలావికా, ఓల్హికా, లివొ, టియాంగికా, పోనియాటివ్కా, ఇవానివ్కా, టోకరివ్కా వంటి చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు వెంటనే ఇళ్ళు ఖాలీ చేసి వెళ్ళిపోవాలని ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు హెచ్చరించారు. ముబైల్ ఫోన్ వంటి అత్యవసర ఎలక్ట్రానిక్ పరికరాలు, తిండి సామాగ్రి, దుస్తులు వెంట పెట్టుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనీ.. లేకపోతే భయంకరమైన ప్రాణనష్టం తప్పదనీ హెచ్చరికలు జారీ చేశారు. కఖోవ్కా హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1956లో ఈ డ్యామ్ నిర్మించారు. 30 మీటర్లు ఎత్తు, కొన్ని వందల మీటర్ల పొడవు ఉండే ఈ రిజర్వాయర్‌లో 18 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉంది. ఈ పరిమాణం గ్రేట్ సాల్ట్ లేక్‌లోని నీటికి సమానం. నగరాలకు విద్యుత్ ను సప్లై చేసే హైడ్రోపవర్ ప్లాంట్ కూలిపోవటంతో ఉక్రెయిన్ కు కరెంట్ కష్టాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే పవర్ సప్లైలో కీలక పాత్ర పోషించే జపోరిజియాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ను రష్యా స్వాధీనం చేసుకుంది.