ఖలిస్తాన్ తిరుగుబాటు నాయకుడు, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ అయిన హర్ దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఖలిస్తాన్ వేర్పాటు నేతలకు కావాల్సిన ఆర్ధిక సహాయంతో పాటు నెట్ వర్క్ ఏర్పాటు చేయటం వంటి రహస్య కార్యకలాపాలకు హర్ దీప్ సింగ్ సాయం చేస్తుంటాడు. సిక్ ఫర్ జస్టిస్ సంస్థతో కూడా హర్ దీప్ సింగ్ నిజ్జర్ కు దగ్గరి సంబంధాలున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ మద్దతుదారులను కూడ గట్టడం.. ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని వ్యాప్తి చేయటంతో పాటు భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటాడు ఈ హర్ దీప్ సింగ్. సోషల్ మీడియా ద్వారా భారత వ్యతిరేక మరియు ఖలిస్తాన్ భావజాలాన్ని వ్యాప్తి చేయటంతో పాటు అమాయక సిక్కులను రెచ్చగొట్టి ఖలిస్తాన్ వేర్పాటు వాదానికి మద్దతిచ్చేలా వాళ్ళను మోటివేట్ చేసి వాళ్ళను కూడా ఖలిస్తాన్ ఉద్యమంలోకి లాగటమే ఇతడి ముఖ్యమైన పని.
ఇతడి ఫేస్ బుక్ మరియు ఇతర అకౌంట్లలో రెచ్చగొట్టే ఉపన్యాసాల వీడియోలు, ఇతర పోస్టులను పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హర్ దీప్ పై భారత్ లో అనేక కేసులు నమోదయ్యాయి. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఇతడనిపై కేసులు నమోదు చేసి రెడ్ కార్నర్ జారీ చేసింది. పంజాబ్ లో కూడా ఇతడిపై అనేక కేసులు ఉన్నాయి. భారత్ కు అప్పగించాల్సిన నేరస్తుల జాబితాలో భారత్ ఇతడి పేరు కూడా చేర్చి 2018లోనే కెనడా ప్రభుత్వానికి అందజేసింది. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన హర్ దీప్ సింగ్ నిజ్జర్.. కెనడాలో ఆశ్రయం పొంది అక్కడ గల ఖలిస్తాన్ మద్దతుదారులను కూడగట్టే పని చేస్తున్నాడు. అయితే.. ఎవరూ ఊహించని రీతిలో గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వారాలోనే ఇతడిని కాల్చి చంపడం సంచలనంగా మారింది. మరో వైపు ఖలిస్తాన్ లిబరేషన్ టైగర్స్ సంస్థ నేత అవతార్ సింగ్ ఖాండా కూడా బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లో ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించాడు. వారిస్ దే పంజాబ్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ పోలీసుల నుంచి తప్పించుకోటానికి సహాయం చేసింది ఇతడే. ఖలిస్తాన్ మద్దతుదారుల్లో ఇద్దరు కీలక వ్యక్తులు యాధృచ్ఛికంగా ఒకే రోజు మరణించారు.
కెనడాలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హత్య
ఇది రామాయణమా.. రివేంజ్ డ్రామానా..!? ఓం రౌత్ పైత్యమా ?
ఆదిపురుష్ సినిమాలో అన్నీ తప్పులే చూపించారంటూ సోషల్ మీడియా దద్దరిల్లిపోతున్నది. సినిమాలో అసలు విషయం కంటే ఓం రౌత్ పైత్యమే ఎక్కువగా కనిపించిందంటూ విమర్శకులు భగ్గుమంటున్నారు. ఎవరు రాసిన రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఓం రౌత్ ఈ సినిమా తీశాడో చెప్పాలంటూ కోర్టుల్లో కేసులు నమోదవుతున్నాయి. హిందూ సంఘాలైతే ఏకంగా సినిమాను ప్రదర్శించటం ఆపేయాలంటూ కేసులు వేస్తున్నాయి. సినిమాలో ఒక్క విషయం కూడా సరిగ్గా చూపించలేదనీ.. ఎవరి ఇష్టమొచ్చినట్టుగా వాళ్ళు రామాయణాన్ని మార్చేస్తే చూస్తూ ఊరుకోమంటూ పలు సంఘాలు ఓం రౌత్ ను హెచ్చరిస్తున్నాయి. ఆదిపురుష్ విడుదలై ఒక్క రోజే అయ్యింది. మరుసటి రోజు నుంచే కేసులు పెట్టడం జరుగుతోంది. అయితే.. ఓం రౌత్ చేసింది తప్పేనా..? సినిమాకు తగినట్టు రామాయణ గాధను మార్చేయటం సరైనదేనా..? విమర్శకుల విమర్శల్లో పస ఉందా..?
వాల్మీకి మహర్షి రాసిన రామాయణం అనేది మిగతా రామాయణాలకు ఆధారం. అనేక మంది కవులు రామాయణాన్ని అనువదించారు.. మళ్ళీ రాశారు.. కానీ మాతృక అయినటువంటి వాల్మీకి రామాయణాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. మొల్ల రాసిన మొల్ల రామాయణం, గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం, తిక్కన సోమయాజి రాసిన నిర్వచనోత్తర రామాయణం.. ఇలా ఎంతో మంది కవి సార్వభౌములు రామాయణాన్ని మళ్ళీ రాశారు.. కానీ మూలాన్ని మార్చే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే.. రామాయణాన్ని రాయాలనే వారి సంకల్పంలో తమ కవితా ప్రజ్ఞను చాటుకోవాలనే ఆశ కావచ్చు.. లేదా మహోత్తర రామాయణ గాధను తాము రాశామన్నది చరిత్రలో నిలిచిపోవాలన్న కోరిక కావచ్చు.. కానీ స్వప్రయోజనం మాత్రం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాముడంటే తండ్రిమాట జవదాటని ధర్మనిష్ట. రాముడంటే సీతను తప్ప పర స్త్రీ నీడను కూడ తాకనంత పత్నీవ్రత్యం. రాముడంటే నమ్మిన ధర్మం కోసం రాజ్యాన్ని త్యజించి అడవికి వెళ్ళిన కర్మాచరణ కర్త. రాముడంటే జనం మాట కోసం ప్రాణ సఖిని అరణ్యం పాలు చేసిన పాలనోత్తముడు. రాముడంటే కష్టం తప్ప సుఖం తెలియని జీవితాన్ని అనుభవించిన త్యాగి. ఇలా చెప్పుకుంటూ పోతే రామ లక్ష్మణులు, సీత, హనుమంతుడు.. లేక మరే పాత్ర అయినా.. అది కేవలం మనల్ని ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదనే జీవిత నిర్దేశం చేసేదే.
చరిత్రలో ఏ కవి కూడా రామాయణాన్ని తనకు ఇష్టం వచ్చినట్టు మార్చలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రావణుడు సీతను అపహరించి పతనమయ్యాడే తప్ప అతడు గొప్ప శివభక్తుడు. లంకా సామ్రాజ్యం నిత్యం కళకళలాడే సువర్ణ మందిరాల నిలయం. రావణుడు ఇంద్రాది దేవతలను ఓడించిన వీరుడు. కానీ ఆదిపురుష్ లో లంక ఓ భూత్ బంగ్లా..! రావణుడు నీతి లేని ఓ క్రూరుడు..! శివుడి పేరే ఎత్తని రాక్షసుడు..!! ఇలా చూపించటం సబబేనా ఎవరికైనా..? సీత అనుమతి లేనిది ఎవరైనా సరే ఆమెను తాకితే బూడిద అయిపోవాల్సిందే.. అందుకే రావణుడు ఆమె నిలబడిన భూమితో సహా పెకిలించి అపహరించాడు.. ఇది చిన్న పిల్లలకు కూడా తెలిసిన విషయం. కానీ ఆదిపురుష్ లో ఓం రౌత్ ఏం చూపించాడో మనం చూశాం. నిత్యం శ్రీరామనామం వెలువడే హనుమంతుడి నోట బూతులా..? ఏమిటిది పైత్యం కాకపోతే..! సీతను విడువమని హనుమంతుడు రావణుడికి ఎలా చెప్పాడో తెలుసా.. “ఓయి మూర్ఖపు రాజా.. సీతమ్మ తల్లిని అపహరించటం పతనానికి నాంది అని తెలియనివాడా..! చేసిన అపరాధానికి చెంపలు వేసుకొని సీతమ్మ వారిని నా దేవుడు శ్రీరాముడికి అప్పగించి.. ఆ రాముని పాదాలను ఆశ్రయించు..!” అని. కానీ ఆదిపురుష్ లో హనుమంతుడు ఏం చెప్తున్నాడో సోషల్ మీడియాలో కనిపిస్తోంది అద్భుతంగా. లంకా దహనం చేసిన హనుమంతుడిని సీతమ్మ.. “హనుమా.. నిన్ను శ్రీరాముడు లంకకు వెళ్ళి చూసి రమ్మన్నాడా.. కాల్చి రమ్మన్నాడా..” అని ప్రశ్నించింది. అందుకు హనుమంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా.. “తల్లీ.. ఎవరు పెట్టిన చిచ్చు వారినే దహించును..” ఆదిపురుష్ లో చూపించిన పద్ధతి ఇదేనా..? కాదు కదా..! అలాంటప్పుడు దీన్ని పైత్యం అనటంలో తప్పేమీ లేదు మరి. శ్రీరాముడి గురించి ప్రపంచమంతా తెలియాలంటూ పదే పదే చెప్పుకొచ్చిన ఓం రౌత్.. ముందు తాను శ్రీరాముడి గురించి తెలుసుకుంటే బాగుండేది. యావత్ ప్రపంచం ముందు రామాయణ గాధను రివేంజ్ డ్రామా చేసేశాడు ఓం రౌత్. దాని కోసం రామయణమే దొరికిందా..? రాయలసీమ ఫ్యాక్షన్ కథ తీస్తే సరిపోయేది కదా..! ఇష్టమొచ్చినన్ని మాస్ పంచ్ డైలాగ్స్ తో పాటు కావాల్సినన్ని బూతులు రాసుకోవచ్చు. ముమ్మాటికీ ఓం రౌత్ చేసింది నూటికి వెయ్యి శాతం తప్పే. సో.. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏమిటంటే.. ప్రభాస్ కోసం ఆదిపురుష్ చూస్తామని చెప్పే అభిమానులని వదిలేయాలి… అది వారి అభిమానం. కానీ రామాయణం కోసమో, శ్రీరాముడి కోసమో ఆదిపురుష్ చూస్తామంటే మాత్రం.. అస్సలు వద్దు. అలా చూస్తే మనమే మూర్ఖులమవుతాం అనేది నిజం..!!
అభిమానులకు షాకిచ్చిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఆసియా కప్, వరల్డ్ కప్ లలో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లపై గందరగోళం ముగిసిపోయింది అనుకున్న వేళ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నజం సేథి వ్యాఖ్యలు మరో సారి అదే గందరగోళాన్ని క్రియేట్ చేశాయి. భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులతో చర్చించిన తర్వాత ఎట్టకేలకు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఏషియా కప్ తేదీలను ప్రకటించింది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ల షెడ్యూల్ రిలీజ్ కావటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో మ్యాచ్ ల కోసం ఎదురు చూస్తున్న వేళ.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. భారత్ లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటించటం అనేది బోర్డు చేతిలో ఉండే అంశం కాదనీ.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేవలం పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమేననీ.. తమకు ఎలాంటి అధికారాలు లేవనీ వ్యాఖ్యానించాడు. దీంతో ఖచ్చితంగా జరుగుతాయని భావించిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లపై మరోసారి గందరగోళం నెలకొంది. అంతా అయిపోయిందని అనుకున్న సమయంలో మళ్ళీ నజం సేథి వ్యాఖ్యలు దేనికి సంకేతమో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
తొలుత ఏషియా కప్ ను పాకిస్తాన్ లో నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ భావించాయి. కానీ.. ఏషియా కప్ గానీ లేదా వరల్డ్ కప్ గానీ పాకిస్తాన్ లో నిర్వహిస్తే భారత జట్టు ఆయా టోర్నమెంట్లలో పాల్గొనబోదంటూ భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. బీసీసీఐ కూడా ఇది తమ చేతుల్లో నిర్ణయం కాదనీ.. ప్రభుత్వం నిర్ణయమే ఫైనల్ అని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఐసీసీ ఏషియా కప్, వరల్డ్ కప్ వేదికను శ్రీలంకకు మార్చింది దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. తమ దేశంలో అడుగు పెట్టడానికి భారత్ కు అభ్యంతరం ఉన్నప్పుడు.. శ్రీలంకలో భారత్ తో మ్యాచ్ ఆడటానికి మేం కూడా నిరాకరిస్తున్నామంటూ నజం సేథీ తేల్చిచెప్పాడు. దీంతో ఆలోచనలో పడిన ఐసీసీ కొన్ని మ్యాచ్ లను పాకిస్తాన్ లో, కొన్ని మ్యాచ్ లను శ్రీలంకలో షెడ్యూల్ చేసింది. వరల్డ్ కప్ ను భారత్ లో షెడ్యూల్ చేస్తామని చెప్పింది. శ్రీలంకలో భారత్ తో మ్యాచ్ లు ఆడబోమని చెప్పిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, చర్చల తర్వాత భారత్ తో ఆడేందుకు అంగీకరించింది. వరల్డ్ కప్ ను భారత్ లో నిర్వహించటం పట్ల కూడా తమకు అభ్యంతరం లేదని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్లీ వరల్డ్ కప్ లో ఆడటానికి పాకిస్తాన్ క్రికెట్ టీమ్ భారత్ లో అడుగు పెట్టాలంటే అందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి కావాలంటూ మళ్లీ నజం సేథి మాట్లాడటం క్రికెట్ అభిమానులకు షాకిచ్చింది. దీనిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి : ఈ సారి పక్కా !?
చాలా రోజులుగా బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ చేరబోతున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. శనివారం ఉదయం కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీతో ఈ ఇద్దరు నేతలూ జూమ్ కాల్ ద్వారా రాహుల్ తో సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. గతంలోనే వీళ్ళిద్దరూ రాహుల్ గాంధీతో ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. తమకు ఖమ్మం జిల్లాలో కావాల్సిన సీట్లు తదితర అంశాలపై తమ డిమాండ్లను రాహుల్ గాంధీ ముందు ఉంచగా.. వీరి డిమాండ్లు వర్కౌట్ అయ్యే అవకాశం లేదంటూ రేవంత్ రెడ్డి చెప్పటంతో వీళ్ళ కాంగ్రెస్ చేరికకు బ్రేక్ పడింది. ఆ తర్వాత బీజేపీ నేతలు కూడా వీళ్ళతో సంప్రదింపులు జరిగినా.. అప్పుడు కూడా చర్చలు తప్ప మరేమీ జరగలేదు. చివరకు ఈటెల రాజేందర్ స్వయంగా వీరిద్దరూ బీజేపీలో చేరే అవకాశం లేదంటూ బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయినప్పటి నుంచీ వీళ్ళు ఎటూ తేల్చకుండా విషయాన్ని నాన్చుతూనే ఉన్నారు.
చివరకు ఈ రోజు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ సారి రాహుల్ తో చర్చలు సఫలం అయినట్టు తెలుస్తోంది. మరో వైపు రేవంత్ రెడ్డి శనివారం సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ సీనియర్ నేతలతో భేటీ కానున్నారు. కీలక అంశాలపై చర్చించేందుకే ఈ భేటీ జరగుతున్నదని కాంగ్రెస్ వర్గాల మాట. అయితే.. రేవంత్ సీనియర్లతో చర్చించబోయేది పొంగులేటి, జూపల్లి చేరిక గురించే అనే మాట కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా.. వీళ్ళ చేరిక వాళ్ళంతట వాళ్ళే స్వయంగా ప్రకటించేంత వరకూ నమ్మలేం. సొంత జిల్లాలో ఎంత ఫాలోయింగ్ ఉన్నా మరీ ఇంత సాగదీత మంచిది కాదు అనేది వాళ్ళ అనుచరులే అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. ఈసారైనా ఈ జంట కవులు కాంగ్రెస్ లో చేరతారో లేదో చూడాలి.
ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్.. ఊహించిన దానికంటే చాలా ఎక్కువ
పాన్ వరల్డ్ మూవీగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆదిపురుష్ సినిమా.. సినీ ట్రేడ్ వర్గాలు ఊహించిన దాని కంటే ఎక్కువ వసూళ్ళే సాధించింది. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్ 140 కోట్లుగా నమోదైందంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అఫీషియల్ గా ట్వీట్ చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ ను బట్టి ఆదిపురుష్ ఫస్ట్ డే 100 నుంచి 120 కోట్ల వరకు కలెక్షన్లు సాధించగలదనీ.. ఇది రికార్డుగా నిలిచిపోతుందనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ.. ఆదిపురుష్ అంచనాలను మించిపోయింది. ఇప్పటి వరకూ ఇండియన్ సినిమాకు ఈ రేంజ్ లో కలెక్షన్లు రావటం ఇదే రికార్డు అని విశ్లేషకులు చెప్తున్నారు. రెండు వారాల్లో వెయ్యి కోట్లు కలెక్షన్లు సాధించగలదని సినిమా విడుదలకు ముందు అందరూ అంచనా వేశారు. ఫస్ట్ డే అనుకున్న దానికంటే ఎక్కువే వచ్చినా.. రాబోయే రోజుల్లో ఇదే రేంజ్ లో కలెక్షన్లు ఉండే అవకాశాలు మాత్రం కనిపించటం లేదు.
రిలీజ్ ముందు భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఫస్ట్ డే టాక్ మాత్రం అంత పాజిటివ్ గా లేదు. సినిమా విజువల్ వండర్ అని అందరూ చెప్పారు.. కానీ విజువల్స్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్ ఓం రౌత్.. చాలా విషయాల్లో సొంత ప్రయోగాలు చేసి సినిమాను ట్రాక్ నుంచి పక్కకు తీసుకెళ్ళాడంటూ సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. మొదటి రోజు సాయంత్రానికి సినిమా గురించి పూర్తి ఓరల్ టాక్ నెగెటివ్ గానే వచ్చింది. ముఖ్యంగా సీతను రావణుడు అపహరించే సీన్ నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయ్యింది. అసలు రామాయణంలో సీతను రావణుడు అపహరించిన తీరు వేరు.. ఆదిపురుష్ లో చూపించింది వేరు. ఇక రావణుడి ఆహార్యాన్ని చూపించిన తీరే ఎవరికీ నచ్చలేదు. ఇదే కాదు.. సినిమాలో ఇంకా చాలా నెగెటివ్ పాయింట్స్ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా సినిమాలోని పాత్రల మధ్య ఎంతో ఎమోషన్ ను చూపించే అవకాశం ఉన్నప్పటికీ.. క్యారెక్టర్ల మధ్య సినిమాటిక్ డ్రామా తప్ప ఎమోషన్ లేదనేది ప్రధాన విమర్శ. మొత్తానికి ఏదో అనుకుంటే ఆదిపురుష్ ఇంకేదో అయ్యేలా ఉంది. మిగతా రోజుల కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి.
“ఓపెన్ జైల్” : యూపీ సీఎం యోగీ షాకింగ్ నిర్ణయం
సీఎం యోగీ.. ఈయన ఏం చేసినా సంచలనమే. ఏ నిర్ణయం తీసుకున్నా బ్రేకింగ్ న్యూసే. అది కేవలం ఉత్తర్ ప్రదేశ్ లో మాత్రమే కాదు.. భారరతదేశం మొత్తం వైరల్ వార్త అవుతుంటుంది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఉత్తర్ ప్రదేశ్ మాఫియా లీడర్లను గజగజ వణికిస్తున్నాడు యోగీ. రౌడీలు లొంగిపోతే జైలుకు పంపించటం.. లొంగపోతే ఎన్ కౌంటర్లో హతమార్చటం.. ఇదీ.. మాఫియా నిర్మూలనలో యోగీ ఎజెండా. నిజానికి ఏ ముఖ్యమంత్రి అయినా మాఫియా లీడర్లను అరెస్టు చేసి జైళ్ళో వేసే వరకే ఆలోచిస్తారు. కానీ యోగీ మాత్రం గీత దాటి ఆలోచిస్తున్నాడు. పట్టుకొని జైళ్ళో వేయటమే కాదు.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారి నేర ప్రవృత్తిని మార్చి మంచి వాళ్ళుగా తీర్చి దిద్దే పనిని ఇప్పుడు యోగీ మొదలుపెట్టాడు. దీనికి పెట్టిన పేరే సుధార్ ఘర్.. అంటే సంస్కరణ నిలయం అన్నమాట.
అప్పుడెప్పుడో బ్రిటిష్ కాలం నాడు రూపొందించిన జైళ్ళ చట్టాన్నే ఇప్పటికీ అమలు చేయటం సరికాదనీ.. 1894 మరియు 1900 జైళ్ళ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందనీ చెప్తున్న యోగీ.. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ జైల్ కాన్సెప్ట్ మొదలుపెట్టాలని ఆదేశాలు జారీ చేశాడు. పరిస్థితులకు లోబడి లేక తొందరపాటులోనో.. ఇలా చాలా సందర్భాల్లో నేరాలు ఉద్దేశపూర్వకంగా చేయబడవు అనేది నిజం. నేర చరిత్ర కలిగిన వాళ్ళను పక్కన పెట్టి.. మిగతా ఖైదీల జీవితాలను తెరచి చూస్తే వారిలో 90 శాతం మంది ఉద్దేశ పూర్వకంగా నేరం చేయని వాళ్ళే ఉంటారు. అలా నేరం చేసిన వారికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చి మంచి వాళ్ళుగా చేయాలనే ఆలోచనకు రూపమే ఈ సుధార్ ఘర్. నిజానికి జైలు శిక్ష అసలు ఉద్దేశం.. నేరస్తులను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచి.. వారిలో పశ్చాత్తాపం వచ్చేలా చేసి వారిని మారేలా చేయటమే. దీన్నే సాధారణ జైలు శిక్షగా వ్యవహరిస్తారు. ఇప్పుడు యోగీ మరో అడుగు ముందుకేసి.. నేరస్తులను సమాజానికి పనికి వచ్చే వాళ్ళలా మార్చాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం నేరస్తులకు కౌన్సిలింగ్ ఇవ్వటం.. ఏదైనా పనిలో శిక్షణ ఇవ్వటం.. తద్వారా వాళ్ళు మళ్ళీ నేరాల జోలికి వెళ్ళకుండా ఉంచటం.. ఇదీ సుధార్ ఘర్ కాన్సెప్ట్. యోగీ కొత్త కాన్సెప్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రైలు ప్రమాద బాధితులకు జైలు నుంచే 10 కోట్లు పరిహారం
బాలాసోర్ రైలు ప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ బాధితుల కోసం ఓ నేరస్తుడు ఏకంగా 10 కోట్ల రూపాయల నష్ట పరిహారం ఇస్తానంటూ రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు లేఖ రాశాడు. ఆ నేరస్తుడు ఎవరో కాదు.. మనీ లాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేశ్ చంద్రశేఖర్. 200 కోట్ల రూపాయల గోల్ మాల్ కేసులో ఇతడిని ఈడీ అరెస్టు చేసి జైళ్ళో పెట్టింది. ప్రస్తుతం జైల్లో ఉన్న సుకేశ్.. తన వద్ద ఉన్న లీగల్ సొమ్ము నుంచే రైలు ప్రమాద బాధితులకు నష్ట పరిహారం అందజేస్తాననీ.. అక్రమంగా సంపాదించిన డబ్బు కాదనీ చెప్తున్నాడు. ఇందుకు సంబంధించి ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు సుకేశ్. ఆ పది కోట్లకు సంబంధించిన అన్ని లీగల్ డాక్యుమెంట్లు ప్రభుత్వానికి చూపిస్తాననీ.. ఇన్ కమ్ ట్యాక్స్ కూడా చెల్లించిన తర్వాతే ఆ సొమ్మును స్వీకరించాలని కూడా చెప్తున్నాడు. రైలు ప్రమాదంలో 289 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మృతుల కుటుంబాలతో పాటు గాయపడిన వారికి 10 కోట్ల సొమ్మును విభజించి పంచాలని కోరుతున్నాడు.
రాన్ బాక్సీ ఫార్మా కంపెనీకి చెందిన ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివీందర్ సింగ్ అనే ఇద్దరు జైలు శిక్షకు గురయ్యారు. అయితే.. వీళ్ళకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఇద్దరి దగ్గర కలిపి సుసమారు 200 కోట్లు వసూలు చేశాడనేది సుకేశ్ పై ఈడీ మోపిన అభియోగం. ఈ కేసులోనే అరెస్ట్ అయ్యి తీహార్ జైళ్ళో ఉన్నాడు. బాలీవుడ్ నటి జాక్విలీన్ ఫెర్నాండెజ్ ను జైలుకు పిలిపించుకొని తన సరదా తీర్చుకున్నాడు ఈ ఘనుడు. ఇందుకు గానీ జైలు అధికారులకు భారీగా సొమ్ము ముట్టజెప్పినట్టు ఆరోపణలు వచ్చాయి. జైలు నుంచే జాక్వలీన్ కు ప్రేమలేఖలు రాయటం.. పుట్టినరోజున కానుకలు పంపడం చేస్తుంటాడు సుకేశ్. తనకు జైళ్ళో రక్షణ కల్పిస్తానని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రులు తన వద్ద 10 కోట్లు తీసుకున్నాడని సంచలన ఆరోపణ చేశాడు. జైళ్ళో ఉన్న ఈ ఆర్థిక నేరస్తుడు శారదా ట్రస్టు పేరుతో ప్రజల కోసం వివిధ సహాయక కార్యక్రమాలు చేయటం.. చిన్న పిల్లలు, అనాధల కోసం సేవా కార్యక్రమాలు చేయటం చాలా మందికి తెలియని విషయం.
దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్
భారత దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ నగరం ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయంటూ బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ విద్యా సాగర్ రావు వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ అనే అంశంపై మాట్లాడటం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశానికి రెండో రాజధానిపై రాజ్యాంగంలో కూడా స్పష్టంగా చెప్పబడిందంటూ క్లారిటీ ఇచ్చారు విద్యా సాగర్ రావు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో నూతన సెక్రెటేరియట్ భవనాన్ని ప్రారంభించే కార్యక్రమానికి అతిథిగా హాజరైన అంబేద్కర్ మనవడు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు విద్యాసాగర్ రావు కూడా హైదరాబాద్ దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మిగతా పార్టీల నేతలు స్పందిస్తూ.. విద్యాసాగర్ రావు వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవా.. లేక పార్టీ మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా అనేదానిపై కూడా స్పష్టత ఇవ్వాలంటూ కోరారు.
నిజానికి విద్యాసాగర్ రావు చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఉందనే చెప్పాలి. దేశానికి రెండో రాజధాని అనే విషయం రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొనటం నిజమే. భారత్ లాంటి అతిపెద్ద విస్తీర్ణం గల దేశంలో పరిపాలన వికేంద్రీకరణ మరియు అధికారాల లభ్యత కోసం రెండో రాజధాని ఏర్పాటు చేయటం సబబేనని రాజ్యాంగంలో పేర్కొన్నారు. ఢిల్లీ రాజధానిగా ఉండగా దక్షిణ భారత దేశం నుంచి మరో కీలక నగరాన్ని రాజధానిగా చేసుకొని అక్కడి నుంచి కూడా దేశ పరిపాలన జరగటం దేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచటానికి ఉపకరిస్తుందనేది దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన సమయంలో ఆంధ్రప్రదేశ్ కు రాజధాని నిర్మాణం జరిగే వరకూ హైదరాబాద్ నగరాన్నే ఏపీ రాజధానిగా ఉంచవచ్చనే నిబంధన ఉంది. అయితే.. ఇది కేవలం పదేళ్ళు మాత్రమే. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ళ తర్వాత హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండో రాజధానిగా హైదరాబాద్ ను ప్రకటిస్తే.. అది సంచలన నిర్ణయమే అవుతుంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా హైదరాబాద్ నగరానికి విశేషమైణ ఆదరణ, అభివృద్ధిలో గణనీయమైన అవకాశాలు లభిస్తాయి.
ఆదిపురుష్ : కాస్త ఎమోషన్ తగ్గింది.. అంతే !
భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా 7 వేల థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆదిపురుష్ సినిమా. లక్షలాది మంది ప్రేక్షకులు మొదటి రోజు పోటీ పడి మరీ థియేటర్లకు వచ్చి సినిమా చూశారు. మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్లు పక్కా అని సినిమా ట్రేడ్ వర్గాలు వేసిన అంచనా నిజమైంది. కలెక్షన్ సంగతి పక్కన పెడితే.. ఆదిపురుష్ పై లెక్కకు మించి అంచనాలు పెట్టుకున్న జనాలు.. కాస్తంత డిసప్పాయింట్ అయినట్టు కనిపిస్తోంది. సినిమా మొదలైన దగ్గరి నుంచి చివరి దాకా ప్రేక్షకులు కనీసం తల పక్కకు తిప్పుకునే అవకాశమే లేనంత విజువల్ వండర్ గా సినిమా తెరకెక్కించారట డైరెక్టర్ ఓం రౌత్. శ్రీరాముడి పాత్రలో ప్రభాస్.. సీత పాత్రలో కృతి సనన్.. ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రలకు తగినట్టు అద్భుతంగా నటించారని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ సినిమాలో భావోద్వేగాలు మాత్రం కాస్త తక్కువ అయ్యాయని చెప్తున్నారు. రామాయణం అంటేనే ప్రేమ, భక్తి.. ఎన్నో భావోద్వేగాల గాధ అది. కానీ ఆదిపురుష్ లో అవి కాస్త తగ్గాయంటున్నారు కొంత మంది ప్రేక్షకులు.
ఒకే ప్రాణంగా బ్రతికే సీతారాముల మధ్య ఎడబాటు అంటే గుండె ముక్కలయ్యే ఎమోషన్స్ తో చూపించాలి. అలాగే కేవలం శ్రీరామ నామమే ఊపిరిగా జీవించే చిరంజీవి హనుమంతుడి భక్తి చూస్తే తన్మయత్వం, పారవశ్యం ప్రేక్షకులను కళ్ళ నుంచి నీళ్ళు తెప్పించేలా ఉండాలి. రావణాసురుడి రాక్షసత్వమైనా.. శ్రీరాముడి ఓర్పు, ధర్మ నిష్ట.. ఇవన్నీ విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు ప్రేక్షకులపై. కానీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ విషయాన్ని కాస్తంత తక్కువ చేశాడంటూ కొంత మంది ప్రేక్షకులు నిరాశ వ్యక్తం చేశారు. కేవలం ఆ ఒక్క విషయంలో తప్ప ఆదిపురుష్ సినిమా మొత్తం అద్భుతంగా ఉందనీ.. అలనాటి రామాయణాన్నే కొత్తగా అద్భుతమైన విజువల్స్ తో చూపించాడనీ.. దీన్ని ఒప్పుకోక తప్పదనీ క్రిటిక్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి.. ఆదిపురుష్ అనుకున్నట్టుగానే ఫస్ట్ డే కలెక్షన్లలో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేది చూడాలి.
“బాలీవుడ్ లో ఆ దరిద్రం పోదు” – తాప్సీ కొత్త కాంట్రవర్సీ
సినిమా ఇండస్ట్రీపై తరచూ ఏవో విమర్శలు చేసే యాక్ట్రెస్ట్ తాప్సీ.. మరోసారి బాలీవుడ్ పై వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కింది. బాలీవుడ్ లో క్యాంపు రాజకీయాలు, ఫేవరెటిజం అనేవి ఎప్పటికీ పోవనీ.. బాలీవుడ్ స్టార్లంతా తమకు ఇష్టమైన వాళ్ళను, తమకు కావాల్సిన వాళ్ళనే తమ సినిమాల్లోకి తీసుకోవాలని భావిస్తారనీ.. బయటి వాళ్ళు ఎదగటం కష్టమనీ కామెంట్ చేసింది. బాలీవుడ్ లో ఎదగాలంటే ఇవన్నీ తట్టుకొని అవకాశాలు సాధిస్తే మాత్రమే సాధ్యమవుతుందంటూ వ్యాఖ్యానించింది. బాలీవుడ్ లో ఈ దరిద్రం ఎప్పటికీ పోనే పోదంటూ చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల క్రితం ప్రియాంకా చోప్రా ఇదే విధంగా మాట్లాడింది. బాలీవుడ్ లో కొంత మంది తనపై కక్ష కట్టి తనకు అవకాశాలు రాకుండా చేశారనీ.. దీని వల్లనే తాను బాలీవుడ్ వదిలి హాలీవుడ్ లో అవకాశాలు వెతుక్కున్నాననీ ప్రియాంకా చోప్రా వ్యాఖ్యానించింది. దీనిపైనే స్పందించిన తాప్సీ.. బాలీవుడ్ లో క్యాంపులు, ఫేవరెటిజం తప్పవంటూ రియాక్ట్ అయ్యింది. కాకపోతే.. ఇలా చేసే వాళ్ళను తప్పు పట్టలేమనీ.. అది వాళ్ళ కెరీర్ కోసం ముఖ్యమైనదంటూ చెప్పుకొచ్చింది తాప్సీ.
గతంలో కూడా బాలీవుడ్ పై ఇలాంటి వ్యాఖ్యలే చేసింది తాప్సీ. బాలీవుడ్ లో నెపోటిజం విపరీతంగా ఉందనీ.. దానితో పాటు లైంగిక వేధింపులు కూడా తట్టుకుంటేనే బాలీవుడ్ లో స్టార్ అవుతారంటూ వ్యాఖ్యానించింది. అంతకు ముందు తెలుగు సినీ పరిశ్రమపై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. తెలుగు డైరెక్టర్లకు హీరోయిన్లపై ఉండే అభిప్రాయమే వేరుగా ఉంటుందంటూ కామెంట్లు చేసింది. “డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారికి.. నా బొడ్డుపై కొబ్బరికాయ వేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు.. అసలు ఆ కాన్సెప్ట్ ఏమిటో వాళ్ళకే తెలియాలి..” అంటూ టాలీవుడ్ డైరెక్టర్లను విమర్శించింది తాప్సీ. ఇప్పుడు బాలీవుడ్ పై తాప్సీ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.