Home Blog Page 59

అజిత్ తెగింపు ఎలా ఉందంటే..!

అజిత్ తెగింపు సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. అజిత్ అంటేనే యాక్షన్.. థ్రిల్లింగ్ సినిమాలు. ఇప్పుడు వచ్చిన తెగింపు కూడా అదే జానర్ కు చెందిన సినిమా. యాక్షన్ తో పాటు సోషల్ కోణం కూడా ఉన్న కథతో తెరకెక్కిన సినిమా తెగింపు. వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి.. బ్యాంకింగ్ వ్యవస్థ సామాన్యుడి పట్ల ఓ రకంగా డబ్బు ఉన్న వాళ్ళ పట్ల ఓ రకంగా ఎందుకు పనిచేస్తోంది.. స్కాములు.. మోసాలు.. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు.. ఇలా అన్నింటినీ కలిపి రూపొందించిన కథ. బ్యాంక్ దోపిడీ సీన్ తో మొదలయ్యే తెగింపు.. ఫస్ట్ హాఫ్ మొత్తం రెండు దోపిడీ గ్యాంగ్ ల మధ్య సీన్లతోనే సాగిపోతుంది. అజిత్ కూడా డార్క్ డెవిల్ పేరుతో బ్యాంకు దోపిడీ బ్యాచ్ లో కనిపిస్తాడు. అయితే.. అజిత్ భారీ ట్విస్టులతో ఆకట్టుకున్నాడు. అవేంటో సినిమాలోనే చూడాలి.

ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అజిత్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ మొత్తం ఫైట్లు ఫైరింగ్ సీన్లే కనిపిస్తాయి. ఇక్కడే అజిత్ దోపిడీ గ్యాంగ్ స్టర్ గా ఎందుకు మారాడో చెప్పాడు దర్శకుడు. సినిమా మొత్తం.. మోసపోయిన ఓ వ్యక్తి తిరుగుబాటు లాంటి కథే. కాకపోతే..అజిత్ మార్క్ యాక్షన్ సీన్లకు మాత్రం కొదవ లేదు. అజిత్ ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేస్తుంది సినిమా. కామన్ ఆడియన్స్ కు సినిమాలోని కథ నచ్చుతుందని చెప్పాలి. మొత్తానికి అజిత్ తెగింపు.. ఫుల్ యాక్షన్ ఆండ్ మెసేజ్ సినిమా. ఇంత కంటే ఎక్కువ చెప్తే థియేటర్లో చూడటానికి ఏమీ ఉండదు కాబట్టి.. ఇక్కడితో ఆపేద్దాం..!

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వాయిదా

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 19న హైదరాబాద్ పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయానికి.. తెలంగాణ ప్రభుత్వానికిి సమాచారం వచ్చింది. జనవరి 19న హైదరాబాద్ లో మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రారంభించటం సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాల్సి ఉంది. అలాగే జింఖానా గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉంది. కానీ అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది. కారణాలు ఏమిటనేవి మాత్రం ఇంకా తెలియరాలేదు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దీనిపై స్పందించారు. మోడీ పర్యటన వాయిదా పడిందనీ.. కారణాలు వెల్లడించలేమనీ చెప్పిన ఆయన.. పర్యటన వాయిదా మాత్రమే పడిందనీ.. రద్దు కాలేదనీ చెప్పారు. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. మోడీ పర్యటనను తెలంగాణ బీజేపీ రాజకీయంగా క్యాష్ చేసుకోటానికి ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొననున్నారు.

పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ వశం అయ్యే సమయం వచ్చేసిందా !?

దశాబ్ధాలుగా భారత్ పాకిస్తాన్ దాయాదుల మధ్య ఉన్న పీఓకే సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందా.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ త్వరలో భారత్ వశం అవ్వనుందా.. భారత్ అవలంబిస్తున్న అంతర్జాతీయ దౌత్య నీతి.. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయనుందా.. ప్రస్తుతం ప్రపంచ దౌత్య నిపుణుల్లో చర్చనీయాంశంగా మారిన అంశమిది. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు.

అంతర్జాతీయ వాణిజ్యం చేయటం సంగతి పక్కనపెడితే.. కనీసం నిత్యావసరాలు కొనుక్కోటానికి కూడా పాకిస్తాన్ దగ్గర డాలర్లు లేవు. ఉన్న కొద్ది మొత్తం డాలర్లు మరో వారంలో ఖర్చు అయిపోతాయి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ లోన్ ఇవ్వటమో.. అమెరికా ఆర్థిక సాయం చేయటమో జరిగితే తప్ప పాకిస్తాన్ కు ఊరట కలిగే అవకాశమే లేదు. అయితే.. ఇప్పటికే పాకిస్తాన్ తీసుకున్న లోన్లకు ఈఎంఐ కట్టలేని స్థితిలో ఉందనీ.. నెలవారీ చెల్లింపులు పెండింగ్ లో పెట్టిందనీ ప్రపంచ బ్యాంకు చెప్తోంది. ఇలాంటి సందర్భంలో పాక్ కు కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేదు. అమెరికాలో పరిస్థితులు మారాయి. రిపబ్లికన్ల ఒత్తిడితో అమెరికా అటు ఉక్రెయిన్ కు గానీ.. ఇటు పాకిస్తాన్ కు గానీ ఆర్థిక సాయం చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఫ్యుయెల్ రేట్ల దృష్ట్యా ఇతర దేశాలకు సాయం చేసే స్థితిలో ఆ దేశం లేదు. అయినా సరే బైడెన్ బ్లాంకు చెక్కులు ఉక్రెయిన్ పాకిస్తాన్ దేశాలకు ఇవ్వటాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ప్రజలు కూడా ఈ విషయంలో బైడెన్ పై వ్యతిరేకతతో ఉన్నారు. సో.. పాకిస్తాన్ కు డోర్స్ క్లోజ్. ఇక చైనా విషయానికి వస్తే.. పాకిస్తాన్ పై చాలానే ఖర్చు చేసిన చైనా.. ఇప్పుడు మరింత ఖర్చు పెట్టే ఆలోచనలో లేదు. ఎందుకంటే.. పాకిస్తాన్ లో తాలిబన్ల ప్రభావం పెరిగిపోయింది. ఏ క్షణంలో పాకిస్తాన్ ప్రభుత్వం రద్దై ఆర్మీ పాలన వస్తుందో తెలియదు.. ఏ క్షణంలో తాలిబన్లు పాక్ ఆర్మీతో యుద్ధం ప్రకటిస్తారో తెలియదు.. పాకిస్తాన్ లో ఎటు చూసినా సంక్షోభమే. మరో భయానక విషయం ఏమిటంటే.. చైనా ప్రభుత్వం తాలిబన్లతో చేతులు కలిపినట్టు అనధికార సమాచారం. పాకిస్తాన్ కు సాయం చేసినా.. స్నేహం చేసినా చైనాకు పనికిరాదు. కాబట్టి చైనా కూడా పాకిస్తాన్ కు దూరంగానే ఉంటుంది. మొత్తంగా ఇదీ పాకిస్తాన్ పరిస్థితి.

పాక్ పరిస్థితికి.. కశ్మీర్ భారత్ వశం కావటానికి సంబంధం ఏమిటనేదే ప్రశ్న అయితే..
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర మొదలు పెట్టిన తర్వాత ప్రపంచం మొత్తం రెండు వర్గాలుగా విడిపోయినట్టైంది. కొన్ని దేశాలు అమెరికా వైపు నిలబడితే.. మరి కొన్ని దేశాలు రష్యా వైపు నిలబడ్డాయి. కానీ ఎంతగా అంతర్జాతీయ ఒత్తిళ్ళు వచ్చినా భారత్ మాత్రం తన వైఖరి తటస్థమనే చెప్పింది. తమ దేశానికి కావాల్సిన వాటిని ఎవరి దగ్గరి నుంచి కొనాలో.. ఏ దేశంతో స్నేహం.. ఏ దేశంలో ఎలాంటి దౌత్యం చేయాలో తమకు చెప్పాల్సిన అవసరం లేదంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్ని అంతర్జాతీయ వేదికలపై స్పష్టంగా చెప్పారు. భారత్ అంతర్జాతీయ దౌత్యం అద్భుతంగా పనిచేసింది.. ఫలితంగా భారత్ కు హెచ్చరికలు చేసే పెద్దన్న దేశాలన్నీ భారత్ గ్రేట్ అంటూ కితాబులిచ్చే స్థాయికి వచ్చేశాయి. భారత్ ఎటు వైపు నిలబడితే అటే విజయం అన్న విషయాన్ని అన్ని దేశాలు గ్రహించాయి. మొండి మనిషి.. ఎవరి మాటనూ లెక్క చేయని రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోడీకి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల భారత్ ప్రభ మరింత వెలిగిపోయింది. మొత్తంగా భారత్ ను బెదిరించే దేశాలు ఇప్పుడు బతిమిలాడే స్థితికి వచ్చాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు భారత్ ముందు రెండే రెండు అతి పెద్ద లక్ష్యాలు.. అవి.. ఒకటి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం.. రెండు.. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అణచివేయటంతో పాటు కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం. బహుశా భారత ప్రభుత్వం ఎన్నికల లోపు తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలు వీటికి ముడిపడే ఉండనున్నాయేమో. ఇదీ భారత్ పరిస్థితి.

విలయ తాండవం చేస్తున్న కరువును ఎదుర్కోవాలా.. పెంచి పోషించిన తాలిబన్లు పాముల్లా మారి కాటేస్తుంటే ఆ పాము కోరలు పీకేందుకు సిద్ధం కావాలా.. నమ్మించి మోసం చేసిన చైనా ఏ కుట్ర చేస్తుందోనని భయపడాలా.. అప్పు కోసం ఐఎంఎఫ్ చుట్టూ తిరగాలా.. ఆర్థిక సాయం కోసం అమెరికాను ప్రసన్నం చేసుకునే మార్గాలు ఆలోచించాలా.. అసలేం చేయాలో తెలియని గందరగోళ పరిస్థితి పాకిస్తాన్ ది. ఇలాంటి సందర్భంలో పాకిస్తాన్ పై ఒత్తిడి తేవటం ద్వారా కశ్మీర్ సహా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం అనే సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇదే భారత్ ముందున్న అత్యంత క్లిష్టమైన.. అత్యంత ముఖ్యమైన లక్ష్యం. ఈ లక్ష్యాలు కూడా యుద్ధంతో కాకుండా కేవలం దౌత్యపరమైన ఎత్తులు పై ఎత్తులతోనే సాధించాలి. ఇది బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా చాలా పెద్ద సవాల్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఉచిత పథకాలతో ప్రజలను ప్రలోభపెట్టడం కంటే.. భారత చిరకాల ఆకాంక్షలను నెరవేర్చటం ద్వారా అదే ప్రజలను ప్రసన్నం చేసుకోవటమే బీజేపీకి ఉత్తమ మార్గం. చూద్దాం.. ఏం జరగబోతోందో..!

సోమేష్ కుమార్ సంచలన నిర్ణయం.. ఇక రిటైర్మెంటే

తెలంగాణ చీఫ్ సెక్రెటరీ పదవి నుంచి రిలీవ్ చేసుకొని ఏపీ వెళ్ళిపోవాలన్న హైకోర్టు ఆదేశాలతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీకి వెళ్ళటం ఇష్టం లేని సోమేష్ కుమార్.. కోర్టు ఆదేశాలు వెలువడిన వెంటనే సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలోనే సోమేష్ కుమార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందస్తు రిటైర్మెంట్ తీసుకొని తెలంగాణలోనే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరో విశేషం ఏమిటంటే.. రిటైర్మెంట్ తర్వాత సోమేష్ కుమార్ కు కేసీఆర్ చీఫ్ అడ్వైజర్ పదవి ఇవ్వనున్నారని సమాచారం.
సీఎం కేసీఆర్ మొదటి నుంచి సోమేష్ కుమార్ కు చాలా ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. కానీ కోర్టు ఉత్తర్వులు కేసీఆర్ మరియు సోమేష్ కుమార్ అభీష్టానికి వ్యతిరేకంగా వచ్చాయి. 2014లో ఆంధ్రప్రదేష్ విభజన జరిగి ఏపీ తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా అవతరించిన తర్వాత ఐఏఎస్ అధికారుల పంపకంలో సోమేష్ కుమార్ ఏపీకి కేటాయించబడ్డారు. కానీ క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆయన తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో అప్పీల్ చేయగా.. ఆయనను ఏపీకి వెళ్ళిపోవాలంటూ హైకోర్టు ఆదేశించింది.

మీ ఆస్కార్ ను తాకే అవకాశం ఇవ్వండి నాకు

రామ్ చరణ్ కు షారూఖ్ రిక్వెస్ట్

ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఈ సినిమా పలు దేశాల్లో అవార్డుల పంట పండిస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం దర్శకుడు రాజమౌళి న్యూయార్క్ లో ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నాడు. అయితే.. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో నిలిచిన విషయం తెలిసిందే. కన్నడ సినిమా కాంతారతో పాటు ఆర్ఆర్ఆర్ కూడా ఆస్కార్ బరిలో నిలవగా.. ఆర్ఆర్ఆర్ ఖచ్చితంగా ఆస్కార్ గెలిచి తీరుతుందనే అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈక్రమంలోనే బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఆర్ఆర్ఆర్ కు ఖచ్చితంగా ఆస్కార్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. షారూఖ్ ఈ ట్వీట్ చేశారు. మీరు ఆస్కార్ అవార్డును భారత్ తీసుకువస్తే.. దాన్ని ఒక్కసారి తాకే అవకాశం నాకు ఇవ్వండి.. అంటూ రామ్ చరణ్ ను కోరాడు షారూఖ్. అందుకు రిప్లై ఇచ్చిన రామ్ చరణ్.. తప్పకుండా సార్.. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వస్తే.. అది ఇండియన్ సినిమాకు వచ్చినట్టే.. అంటూ రిప్లై ఇచ్చాడు. ఒకప్పుడు ఇండియన్ సినిమాలను దశాబ్ధాల పాటు ఏలిన బాలీవుడ్.. ఇప్పుడు సౌత్ సినిమా ముందు మోకరిల్లింది. భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా.. తెలుగు జాతి సత్తా చాటుతోంది.

నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్..

ఏపీ నిరుద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయటంతో పాటు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేసి కొత్త పోస్టులను క్రియేట్ చేయాలని కూడా ఆదేశించారు. అలాగే 63 సీడీపీఓ పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అప్పుడే పుట్టిన పసిపాప మరియు బాలింతల ఆరోగ్యం విషయంలో అత్యంత ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని స్త్రీ శిసు సంక్షేమ శాఖ అధికారులకు చెప్పారు. వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు వారికి ఎదురు కాకూడదని, ఆరోగ్యశ్రీ ద్వారా అందాల్సిన సేవల్లో కూడా ఎలాంటి లోపం ఉండరాదనీ చెప్పారు.
అంగన్ వాడీల ద్వారా ప్రతి వార్డులోని తల్లి పిల్లలకు అవసరమైన సేవలు అందించటంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని.. అధికారులు నిరంతరం సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. తల్లులకు టేక్ హోమ్ విధానంలో రేషన్ విధానంపై కసరత్తు పూర్తి చేసి.. వీలైనంత త్వరలో ఇంటికే సేవలను అందించే కార్యక్రమం ప్రారంభించాలని చెప్పారు. గతంలో ఈ సేవల విషయంలో సిబ్బంది కొరత ఉన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావటంతో.. వెంటనే ఆయా ఖాళీలను భర్తీ చేసి పూర్తి స్థాయి సిబ్బంది నియామకాన్ని చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.

గోధుమ పిండి కోసం తొక్కిసలాట.. పాక్ లో ఘోరం

ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న పాకిస్తాన్ లో రోజురోజుకూ సంక్షోభం ముదురుతోంది. కరెంటు లేక రాత్రి 8 గంటలకే నగరాలన్నీ షట్ డౌన్ చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఇంతే కాదు.. పాకిస్తాన్ లో చాలా రకాల కరువు ఆ దేశ ప్రజలను పీడిస్తోంది. కానీ ఆ విషయాలు బయటకు పొక్కకుండా పాక్ మీడియాను ప్రభుత్వం కట్టడి చేస్తోంది. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘటన మనసులను కలచి వేస్తోంది. పాక్ ప్రజలు చాలా వరకు గోధుమ రొట్టెలతోనే భోజనం చేస్తారు. ఇప్పుడు అదే గోధుమ పిండి లేదా గోధుమలు దొరకక పాక్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. గోధుమ పిండి కోసం లైన్లో నిల్చున్న వాళ్ళు పోటీ పడి తొక్కిసలాట జరిగి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పాకిస్తాన్ లో ప్రతి వస్తువుకీ  రేషన్ విధించింది అక్కడి ప్రభుత్వం. గోధుమ పిండిని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేస్తోంది. ఈ రేషన్ షాపుల ముందు క్యూలలో ప్రతి రోజూ అసాధారణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పిండి కోసం క్యూలో నిల్చున్న ప్రజలు పోటీ పడటం.. తొక్కిసలాటలు జరిగి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం అక్కడ సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు ఏకంగా పోలీసుల పహారాలో గోధుమ పిండి రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం లేక.. దిగుబడులు జరగక అన్ని రకాల వస్తువులకు షార్టేజ్ నెలకొంది. మరో వారం రోజుల్లో పాక్ దగ్గరున్న డాలర్లు పూర్తిగా ఖర్చు అయిపోతాయనీ.. ఇక దివాలా ప్రకటించటం తప్ప మార్గం లేదనీ అంతర్జాతీయ మీడియా చెప్తోంది. కొద్ది రోజుల్లో శ్రీలంకలో జరిగిన పరిణామాలే పాకిస్తాన్ లో జరగనున్నట్టు అంచనాలు వేస్తున్నారు నిపుణులు. ఇదీ మన పొరుగు దేశం  పాకిస్తాన్ పరిస్థితి.

సోమేష్ కుమార్ కు షాకిచ్చిన హైకోర్టు

తెలంగాణ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సోమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేష్ కు వెళ్ళిపోవాలంటూ హీకోర్టు తీర్పునిచ్చింది. సీఎస్ సోమేష్ కుమార్ నియామకం అక్రమం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఈ తీర్పు రావటం సంచలనంగా మారింది. దీనిపై 3 వారాల సమయం కావాలన్న న్యాయవాది కోరికను కూడా కోర్టు తిరస్కరించింది. వెంటనే సోమేష్ కుమార్ తెలంగాణ సీఎంతో భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరి భేటీకి ప్రాముఖ్యత ఏర్పడింది. కేసీఆర్ ఎలాంటి చర్య తీసుకోబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. తాను గతంలోనే సోమేష్ కుమార్ నియామకం అక్రమమంటూ చెప్పానన్నారు. ఆయన తీసుకువ్చిన ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ట్విటర్ లో పోస్టు చేశారు.

బీఆర్ఎస్ పై పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పై తిరుగుబాటు మొదలుపెట్టిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాక్షస ప్రభుత్వం నడుస్తోందనీ.. ఎమ్మెల్యేలు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ దోచుకుంటున్నారనీ అన్నారు. తనకు నాలుగేళ్ళుగా పదవులు దక్కక పోవటం వల్ల ఇలా మాట్లాడటం లేదనీ.. అరాచక పాలనపై గొంతు విప్పకుండా ఉండలేక పోతున్నానని అన్నారు. బీఆర్ఎస్ నేతలను ఉద్దేశిస్తూ.. తన మాటల వల్ల వారికి ఇబ్బందులు ఎదురైతే.. మరి వాళ్ళు తనను ఎంత ఇబ్బంది పెట్టారో నాకే తెలుసు అంటూ వ్యాఖ్యానించారు. పరోక్షంగా సీఎం కేసీఆర్ పై కూడా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమించటం ఆ వ్యక్తికి చేతకాదని.. గద్దల్లా తనపై యుద్ధం చేయాలని ఆయన వెంట ఉన్న వారు ఆలోచిస్తున్నారనీ అన్నారు.

శీనన్న ఒక్కడు కాదు.. శీనన్న వెంట ప్రజలున్నారు.. ఖమ్మంలో నాకు ఎవ్వరూ గాడ్ ఫాదర్ లేడు.. నా తండ్రి.. నా తాత రాజకీయాల్లో లేరు.. నాకు నేనే గాడ్ ఫాదర్.. ఖమ్మం జిల్లా ప్రజలంతా నా వాళ్ళే.. దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను.. ఇప్పుడు మీరు రెచ్చిపోవచ్చు.. మీకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది.. అంటూ పరోక్షంగా కేసీఆర్ ను బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పొంగులేటి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.

షాంఘైలో మరణ మృదంగం

కోటి 75 లక్షల మందికి వైరస్

కరోనా వైరస్ తో అల్లాడుతున్న చైనాలో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. షాంఘై సిటీలోనే ఒక కోటి 75 లక్షల మందికి వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు అంతర్జాతీయ మీడియా చెప్తోంది. రోగులకు సరిపడా వైద్యులు, బెడ్లూ అందుబాటులో లేక వైరస్ సోకిన వారు రోడ్లపైనా, ఫుట్ పాత్ ల పైనా పడుకుంటున్నారనీ.. కనీస వైద్యం అందక ప్రతి రోజూ వేలల్లో మరణాలు నమోదు అవుతున్నాయనీ సమాచారం. ఇక స్మషానాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక శవాన్ని కాల్చటానికి మృతుడి కుటుంబానికి కేవలం 5 నిముషాల సమయం మాత్రమే ఇస్తున్నారట. 5 నిముషాల్లో శవాన్ని కాల్చేసి అస్తికలు తీసుకొని స్మషానం నుంచి బయటకు రావాల్సిందే. అంటే.. అక్కడ మరణాలు ఎంత స్థాయిలో సంభవిస్తున్నాయో ఊహించికోవచ్చు. చైనాలో కరోనా ఒమిక్రాన్ బీఎఫ్7 వేరియంట్ అల్లకల్లోలంపై అంతర్జాతీయ మీడియా ఎన్ని కథనాలు ప్రచురిస్తున్నా.. చివరకు ప్రపంచ ఆరోగ్య సమితి సైతం ఆందోళన వ్యక్తం చేసినా.. చైనా మాత్రం ఈ వార్తలను అంగీకరించటం లేదు.
అయితే.. చైనాలో వైరస్ విస్తృతి మొదలైన రెండు వారాల్లో భారత్ లో కూడా అల్లకల్లోలం తప్పదని వచ్చిన వార్తలకు బ్రేక్ పడింది. ఇప్పటికే చైనాలో వైరస్ ఉధృతి మొదలై నాలుగు వారాలకు పైగా సమయం గడిచినా.. భారత్ పై ఎలాంటి ప్రభావం చూపకపోవటం ఊరటనిచ్చే విషయం. భారతీయులు కూడా కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. భారతీయులు వాడిన వ్యాక్సిన్ ప్రభావాన్ని మించి కరోనా వైరస్ ప్రభావం చూపించలేదనీ.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మాత్రం ఆరోగ్య శాఖ చెప్తోంది. కానీ అప్రమత్తంగా ఉంటూ.. మాస్క్ ధరించటం శ్రేయస్కరమని చెప్తోంది.