Home Blog Page 55

బాలయ్యను ఓవర్ టేక్ చేసిన వీరయ్య

సంక్రాంతి బరిలో నిలిచిన బాలకృష్ణ చిరంజీవిల మధ్య పోటీ ఏమాత్రం తగ్గటం లేదు. రెండు సినిమాలూ వసూళ్ళలో పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. అయితే… వాల్తేరు వీరయ్య సినిమా విడుదల తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. రెండు రోజులు లేటుగా వచ్చిన వీరయ్య.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మొదటిరోజే 35 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన చిరు సినిమా.. మూడు రోజుల్లో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. బాలయ్య సినిమా కంటే ఓ అడుగు ముందుందని సినీ అనలిస్టులు చెప్తున్నారు. అటు ఓవర్సీస్ లో కూడా వీరయ్య రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకుంది.

పండగ సమయంలో ప్రేక్షకులు బాలయ్య సినిమా చిరంజీవి సినిమా అనే తేడా లేకుండా ఎక్కడ టికెట్లు దొరికితే అక్కడ ఫిక్సై పోతున్నారు. సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత ఈ రెండు సినిమాలకు కలెక్షన్లు పెరగవచ్చని అంటున్నారు. ఈ రెండు సినిమాలకూ కనీసం 3 వారాల దాకా కలెక్షన్ల సునామీ తప్పదని క్రిటిక్స్ అంచనా. మొత్తానికి ఇద్దరు సూపర్ స్టార్లు.. తమ సినిమాలతో సంక్రాంతికి కళ తీసుకొచ్చారు.

ఇన్ కమ్ ట్యాక్స్ కట్టే వారికి బంపర్ ఆఫర్

5 లక్షల దాకా నో టాక్స్

చిన్న చిన్న ఉద్యోగాలు చేసే మధ్య తరగతి వారికి భారీ ఊరటనిచ్చే వార్త ఇది. సంపాదించే అరకొర సంపాదనలో కూడా పన్నులు చెల్లించాలా అని బాధపడే వారికోసం ప్రభుత్వం పెద్ద బహుమతి ఇవ్వబోతోంది. వచ్చే బడ్జెట్ లో ఇన్ కమ్ ట్యాక్స్ స్లాబ్ లలో భారీ ఊరట ఇవ్వనుంది. ప్రస్తుతానికి 2.5 లక్షలుగా ఉన్న పరిమితి ఇకపై 5 లక్షలు కానుంది. రెండున్నర లక్షల నుంచి 5 లక్షల మధ్య వార్షిక ఆదాయం ఉన్న వారు వారి ఆదాయంలో 5 శాతాన్ని ఇన్ కమ్ టాక్స్ గా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ లిమిట్ 5 లక్షలు కానుంది. 5 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. మే నెలలో ఈ విషయాన్ని ప్రభుత్వం బడ్జెట్ లో పొందుపరిచి ప్రకటన చేయనుందని సమాచారం.

పెట్రోల్ గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవటంతో దేశంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ గత పదేళ్ళలో భారీగా పెరిగింది. సంవత్సరానికి రెండున్నర లక్షల సంపాదన అనేది ఈ రోజుల్లో చాలా తక్కువ అయిపోయింది. ఈ సంపాదనతో అప్పుల బాధ లేకుండా బతకటమే కష్టంగా మారిన తరుణంలో ఇదే సంపాదనలో పన్ను కట్టాల్సి రావటం సామాన్యుడికి గుదిబండగా మారింది. మారిన కాలానికి అనుగుణంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం మధ్య తరగతి వారికి ఊరటనిచ్చే విషయమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు బలం ఇచ్చేదనే చెప్పాలి. పన్ను కట్టాల్సిన అవసరం లేనప్పుడు ఆ సొమ్మును రకరకాల పెట్టుబడులుగానూ లేదంటే కొనుగోళ్ళ కోసమైనా వెచ్చిస్తారు. దీని వల్ల మార్కెట్ లో మనీ ఫ్లో పెరిగి ఆర్థిక వ్యవస్థ విలువ పెరుగుతుంది. త్వరలోనే ఈ శుభవార్తను ప్రభుత్వమే స్వయంగా ప్రకటించనుంది.

బీజేపీ కీలక నిర్ణయం వచ్చే ఎన్నికల దాకా నడ్డానే అధ్యక్షుడు

ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కనీసం సంవత్సరం సమయం కూడా లేని సమయంలో.. భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డానే కొనసాగనున్నట్టు అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో దేశవ్యాప్తంగా పార్టీకి సంబంధించిన కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నారు. నడ్డా పార్టీ కోసం ఎంతో చేశారనీ.. దేశవ్యాప్తంగా ఒక లక్ష 30 వేల బూత్ కమిటీలు ఏర్పాటు చేశారనీ.. బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయటంలో ఆయన విజయం సాధించారనీ అమిత్ షా అన్నారు.

తెలంగాణ వంటి ప్రాంతాల్లో కూడా బీజేపీ పుంజుకున్నదనీ.. దక్షిణ భారత దేశంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కరోనా సమయంలో కూడా బీజేపీ కార్యకర్తలకు కావాల్సిన సాయాన్ని నడ్డా పార్టీ ద్వారా అందజేశారనీ.. అందుకే ఆయన నేతృత్వంలోనే బీజేపీ మరోసారి ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నదని చెప్పారు. జేపీ నడ్డా వచ్చే సంవత్సరం జూన్ వరకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ విషయంలో పార్టీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు.

అదే చేయాల్సి వస్తే తల నరుక్కుంటా రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ లో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ.. అక్కడే జరిగిన మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానంగా.. భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో అడుగుపెట్టడం కంటే తల నరుక్కోవటం మేలనీ.. తనకు అలాంటి పరిస్థితి వస్తే తల నరుక్కుంటాననీ చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తేవటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ను ప్రక్షాళన చేయాలని నిర్ణయించుకున్న సోనియా గాంధీ.. మొదటిసారిగా గాంధీ వారసులకు కాకుండా బయటి వారికి ఏఐసీసీ పగ్గాలు అప్పజెప్పారు. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఉన్న విషయం తెలిసిందే.

బీజేపీ రహిత భారత దేశాన్ని సాధిస్తామంటూ రాహుల్ గాంధీ పదే పదే చెప్తుంటాడు. ఎక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నా రాహుల్ అలాగే ఏదో ఒక వివాదాస్ఫద వ్యాఖ్యలు చేయటం గమనార్హం. మహారాష్ట్రలో జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో దామోదర్ సావర్కర్ ఓ దేశద్రోహి అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. రాహుల్ వ్యాఖ్యలతో మహారాష్ట్ర ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఉన్న కాస్తో కూస్తో ప్రేమ కూడా లేకుండా పోయిందని ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

రాహుల్ యాత్రలో భద్రత వైఫల్యం

కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే సంకల్పంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ లోని హోషియాపూర్ లో జోడో యాత్ర నిర్వహిస్తున్నాడు. ఈ యాత్రలో భద్రతా వైఫల్యం బయటపడింది. రాహుల్ ను కౌగిలించుకోటానికి ఓ యువకుడు గుంపు లో నుంచి రాహుల్ వైపు దూసుకువచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పక్కకు తీసుకెళ్ళారు. రాహుల్ తో పాటు ఉన్న పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఆ యువకుడిని ఆపేసి పక్కకు పంపించి వేశారు. రాహుల్ ఢిల్లీలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న సమయంలో సెక్యూరిటీ సరిగ్గా లేదంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కాంగ్రెస్ నేతలు లేఖ రాశారు.

పంజాబ్ లో ఈ ఘటన జరగటం పట్ల అక్కడి ప్రభుత్వం స్పందించింది. రాహుల్ యాత్రకు ప్రభుత్వం పూర్తి సెక్యూరిటీ అందజేస్తున్నదని చెప్పింది. అనుకోకుండా జరిగిన ఘటన వెనుక ఏదైనా కుట్ర ఉన్నదా అనేది గుర్తించేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్టు చెప్పింది. ఇటీవల ప్రధానమంత్రి మోడీ రోడ్ షో లో కూడా ఇదే విధంగా ఓ వ్యక్తి మోడీ వైపు చేతిలో పూలదండతో దూసుకొచ్చాడు. వెంటనే అలర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

కనీ వినీ ఎరుగని స్థాయిలో ఖమ్మం బీఆర్ఎస్ సభ

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ భారత్ రాష్ట్ర సమితి పార్టీగా రూపాంతరం చెంది జాతీయ పార్టీగా ఆవతరించిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మొదటి సారిగా బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించనుండటం తెలిసిందే. బీఆర్ఎస్ ఆవిర్భావ సభగా చెప్తున్న ఈ పబ్లిక్ మీటింగ్ కు కనీ వినీ ఎరుగని స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రులు ఈ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేసీఆర్ తో పాటు వేదికపై కూర్చోనున్నారు. కాబట్టి ఈ సభకు గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ చౌహాన్ చెప్పారు. 5 వేల మంది పోలీసు సిబ్బందితో ఖమ్మం సభ వద్ద భారీ బందోబస్తు చేశామన్నారు. సభకు వెళ్ళటానికి సెల్ ఫోన్లు తప్ప మరేవీ అనుమతించమని చెప్పారు.

కేసీఆర్ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించటం వెనుక ఓ పెద్ద రాజకీయ కోణం.. వ్యూహం ఉన్నాయంటున్నారు రాజకీయ నిపుణులు. ఖమ్మంలో గ్రూపు రాజకీయాలు.. తిరుగుబాటు దారుల విమర్శలు.. ప్రతిపక్షాలు పుంజుకోవటం.. ఇలాంటివన్నింటకీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ ఖమ్మంలోనే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశారని చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కంటి వెలుగు కార్యక్రమం ఈ సభ ద్వారానే ప్రారంభం కానుంది. ఈ సభ ద్వారా కేసీఆర్ చాలా కీలకమైన నిర్ణయాలను ప్రకటించనున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు.

పవన్ పై పోటీ చేస్తా ఆలీ

సినిమా వేరు రాజకీయం వేరు.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీ చేయటానికైనా రెడీ.. అంటూ సినీ నటుడు ఆలీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పవన్ తనకు మంచి మిత్రుడే.. అయినా సరే జగన్ పోటీ చేయమంటే చేస్తాను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. పార్టీ కార్యక్రమంలో పాల్గొని పర్యటిస్తున్న ఆలీ.. మీడియా ప్రతినిథులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒకే పార్టీకి ఓట్లు వేయరనీ.. ఇది కూడా అలాంటిదేననీ చెప్పాడు.
ఇక రోజా గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రోజాను డైమండ్ రాాణి అన్నారనీ.. డైమండ్ చాలా విలువైనది.. ఖరీదైనది కాబట్టే ఆమెను డైమండ్ రాణి అన్నారనీ చెప్పాడు. మెగా ఫ్యామిలీతో రోజాకు మంచి సంబంధాలు ఉన్నాయనీ.. రాజకీయాల్లో విమర్శలు.. ప్రతివిమర్శలు సహజమనీ చెప్పాడు. తనకు పార్టీయే అన్నింటికంటే ముఖ్యమైనదనీ.. వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచైనా సరే పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆలీకి టిక్కెట్ ఇచ్చే అస్కారం ఉందా అనేది అసలు ప్రశ్న.

బుద్ధొచ్చింది క్షమించండి : భారత్ కు పాక్ ప్రధాని వేడుకోలు

భారత్ పట్ల ఎప్పుడూ విద్వేషాన్ని వెల్లగక్కే పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ నోట మొదటిసారి శాంతి మంత్రం వినిపించింది. భారత్ తో శతృత్వం ఇక తమ వల్ల కాదనీ.. స్నేహాన్ని కోరుకుంటున్నామనీ బహిరంగంగానే ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేసిన తర్వాత ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఇదే షరీఫ్.. తలతిక్క వ్యాఖ్యలు చేశాడు. తను ప్రధాన మంత్రిగా దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తాననీ.. అలాగే పాక్ చిరకాల స్వప్నమైన కశ్మీర్ యాపిల్ ను తాను సాకారం చేస్తాననీ వ్యాఖ్యానించాడు. అప్పటి నుంచి పాకిస్తాన్ లో ఆకలి అల్లకల్లోలం సృష్టించింది. కరువు విలయ తాండవం చేసింది. పెట్రోల్, గ్యాస్ కోసం క్యూలో నిలబడటం.. ఒక్క గోధుమ రొట్టె కోసం తుపాకీకి ఎదురెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేసింది. అప్పుకోసం ఏ గడప తొక్కినా నిరాశ ఎదురుకావటంతో ఇక పాకిస్తాన్ కు భారత్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. చివరకు భారత్ ముందు మోకాళ్ళపై నిలుచోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ దేశ ప్రధాన మంత్రికి.

ఓ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ తో మూడు యుద్ధాలు చేసిన తర్వాత గానీ తమకు గుణపాఠం రాలేదంటూ వ్యాఖ్యానించాడు. భారత్ తో శతృత్వం వల్ల తమకు మిగిలింది పేదరికం, ఆకలి తప్ప ఇంకేం లేదనీ.. భారత నాయకత్వం ప్రస్తుతం తమతో స్నేహం గురించి ఆలోచించాలని విజ్ఞప్తి చేశాడు. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం భారత్ పాకిస్తాన్ చర్చలు జరిపితే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. యుద్ధం వల్ల బాంబులు, బుల్లెట్లు వృధా అవుతాయే తప్ప పాకిస్తాన్ కు ఒరిగేది ఏమీ లేదన్నాడు. పాక్ కు సాయం చేయటానికి ఏ దేశమూ ముందుకు రాకపోవటమో.. లేక మరోటో తెలియదు గానీ.. షరీఫ్ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.

రాజాసింగ్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న బీజేపీ

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. హైదరాబాద్ రాజకీయాల్లో సంచలన నేత. హిందుత్వమే ప్రధాన ఎజెండాగా రాజకీయం చేసే కట్టర్ హిందుత్వ వాది. మతంపై ఎవరు ఏ తప్పు మాట మాట్లాడినా వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేస్తాడు రాజాసింగ్. అవసరమైతే పార్టీ లైన్ కూడా దాటేందుకు రెడీ అవుతుంటాడు. బీజేపీ పార్టీ కార్యకర్తల ఫాలోయింగ్.. సొంత అనుచరుల సపోర్ట్ రాజాసింగ్ కు ఫుల్లుగా ఉంటుంది. ఎప్పుడు ఆయన రోడ్డెక్కిన ఆయన వెంట చాలా మంది ఉంటారు. కానీ కొద్ది రోజుల క్రితం జరిగిన పరిణామాలు బీజేపీని రాజాసింగ్ కు దూరం చేశాయి. ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాద్ధాంతానికి దారి తీసి ఏకంగా పీడీ యాక్టుకు గురై జైలు శిక్ష అనుభవించటమే కాకుండా బీజేపీ అధిష్టానం ఆగ్రహానికి గురై పార్టీ నుంచి కూడా సస్పెన్షన్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన బీజేపీలో ఉన్నాడా లేడా అన్న విషయంలో అందరికీ తికమకే.

సరైన వివరణ ఇస్తేనే పార్టీలోకి తీసుకుంటామని తేల్చి చెప్పిన బీజేపీ.. ఇంకా ఆ విషయంలో క్లారిటీ ఇవ్వటం లేదు. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ విషయంలో కోర్టు తీర్పుపై లేఖ ద్వారా స్పందించిన రాజాసింగ్ కు బీజేపీ సపోర్ట్ చేసింది. బీజేపీ అఫీషియల్ నోట్ లో రాజాసింగ్ పేరు ఉంది. కానీ రాజాసింగ్ బీజేపీలోనే ఉన్నారా లేరా అన్నదానిపై మాత్రం కన్ఫ్యూజన్ అలాగే ఉంది. క్రమశిక్షణ చర్య పేరుతో ఇన్ని రోజులు రాజాసింగ్ ను పార్టీకి దూరంగా ఉన్న బీజేపీ.. ఇప్పటికైనా మళ్ళీ పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రకటిస్తే మంచిదన్న వాదన వినిపిస్తోంది. అప్పుడే పాతబస్తీలో బీజేపీ బలపడే అవకాశం ఉంటుంది.

చాలా మంది డైరెక్టర్లు హర్ట్ అవుతారేమో.. కానీ

వాల్తేరు వీరయ్య సినిమా వసూళ్ళతో బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించిన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఈ రోజు జరిగాయి. చిరంజీవి, డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సహా సినిమా యూనిట్ ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ వేదికపై చిరంజీవి మాట్లాడుతూ డైరెక్టర్ బాబీని ఆకాశానికెత్తేశాడు. ప్రొడ్యూసర్లకు నష్టాలు రాకుండా ఆలోచించే కొద్ది మంది డైరెక్టర్లలో బాబీ ఒకడని చెప్పాడు. సినిమా కోసం ఖర్చు పెడుతున్న డబ్బు నిర్మాతదేననీ.. కానీ అవసరమా కాదా అనే ఆలోచన లేకుండా నిర్మాతల డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఆలోచించి సినిమా తీసే గుణం డైరెక్టర్లలో ఉండాలని చిరంజీవి అన్నారు. ఇలాంటి డైరెక్టర్లు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారన్న చిరు.. మిగితా సీనియర్ డైరెక్టర్లు హర్ట్ అయినా సరే తాను చెప్పేది నిజం అంటూ చెప్పుకొచ్చారు.

సినిమా పూర్తైన తర్వాత ఎడిటింగ్ రూమ్ లో గంటల కొద్దీ కథ, సీన్లు మిగిలిపోయే రోజుల్లో తమ సినిమా మొత్తంలో కేవలం 10 నిముషాల సీన్లు మాత్రమే పక్కన పడిపోయాయనీ.. అంత జాగ్రత్తగా సినిమా పిక్చరైజేషన్ జరిగిందనీ.. ఇందుకు బాబీయే కారణమన్నారు. మైత్రి మూవీ మేకర్స్ తో చాలా కంఫర్ట్ గా ఉంటుందనీ.. ఎంతో మంది ప్రొడ్యూసర్లను చూశాను కానీ.. మైత్రి లాంటి వాళ్ళు చాలా తక్కువ అనీ చెప్పారు. చిరంజీవి మాటలకు డైరెక్టర్ బాబీ సంతోషంతో చిరంజీవికి నమస్కరించటం కనిపించింది. పక్కనే ఉన్న దేవిశ్రీ ప్రసాద్ కూడా చిరంజీవి కామెంట్లకు బాబీని అభినందించాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన వాల్తేరు వీరయ్య.. ఫస్ట్ 35 కోట్లకు పైగా కలెక్షన్లతో నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది.