Home Blog Page 56

భారత్ వెళ్ళిపోతామంటున్న పాకిస్తానీ జనం

ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మళ్లీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క రొట్టె కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి. ప్రభుత్వం రేషన్ ద్వారా సప్లై చేస్తున్న గోధమల బస్తాను ఇంటికి తెచ్చేలోపు ప్రాణాలతో ఉంటామా లేదా గ్యారంటీ లేని దారుణమైన స్థితి. తుపాకీలు చూపించి బెదిరించి మరీ గోధమల బస్తాలను ఎత్తుకెళ్తున్నారు. అంటే.. తిండి కోసం ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోంది. ఇటు ఆకలి.. అటు తీవ్రవాదుల బెదిరింపులు.. సైన్యం అరాచకాలు.. తాలిబన్ల దాడులు.. ఇలా ఒక్కటి కాదు.. అనేక సమస్యలతో పాకిస్తాన్ జనాలు దినదిన గండంగా బతుకుతున్నారు. ఇక ఇక్కడ బతకలేమని భావించిన పాక్ ప్రజలు కార్గిల్ రోడ్డును తెరిచి భారత్‌లో కేంద్ర పాలిత ప్రాంతం లఢఖ్ పరిధిలోని కార్గిల్ జిల్లాలో కలపాలని కోరుతూ నిర్వహించిన భారీ ర్యాలీ వీడియోలు ట్విట్టర్‌లోకి చేరాయి.

ముఖ్యంగా గడిచిన 12 రోజులుగా ఆ ప్రాంతంలో నిరసన ప్రదర్శనలు ముమ్మరంగా సాగుతున్నాయి. గోధుమ, ఇతర ఆహారోత్పత్తులపై సబ్సిడీలను పునరు ద్ధరించాలని కోరుతున్నారు. పాకిస్థాన్ ఆర్మీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం పాక్ తన చరిత్రలోనే అత్యంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా అక్కడి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో, పాక్ ప్రజల జీవన పరిస్థితులు మరింత దిగజారాయి. నిత్యావసరాలను కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి టైంలో పాకిస్తాన్‌ ఆహార సంక్షోభానికి సంబంధించిన వీడియోలే కాదు.. మరో అంశానికి సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.

ముక్తదర్ ఖాన్ అనే భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు, డెలావేర్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా ఈయన చేసిన విశ్లేషణ విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్‌ మీద భారత్‌ దాడి చేసి, నాశనం చేసే అవకాశమున్నా ఆ పని భారత పాలకులు చేయరని చెప్పారు. అదే సమయంలో పాకిస్తాన్‌లో ఉన్న దుర్భర పరిస్థితులు భారత్‌లో కనుక ఉండి ఉంటే పాకిస్తాన్ ఇప్పటికే దాడి చేసేదని అంచనా వేశారు. ఒకవేళ పాకిస్తాన్‌ తరహా పరిస్థితులు భారత్‌లో ఉంటే, ఇండియాలో మనీ లేదని, ఆర్థిక వ్యవస్థ పడిపోతోందని, తమిళనాడు విడిపోతోందని, అస్సాం విభజనను కోరుకుంటోందని.. ఇప్పుడు మనం దాడి చేసి కశ్మీర్‌ను తీసుకోవచ్చని పాకిస్తాన్ దాడి చేసి ఉండేదని ఖాన్ అన్నారు. నిజానికి.. ముక్తదర్ ఖాన్ చెప్పింది అక్షరాల నిజం. పాకిస్తాన్ ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూస్తుందనడంలో అనుమానమే లేదు. కానీ, శత్రువు బలహీనంగా ఉన్న సమయంలో ఓడించడం రాజనీతి కాదన్న విషయం ఇండియాకు తెలుసు.

చంపేస్తామంటూ నితిన్ గడ్కరీకి ఫోన్ కాల్

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపు కాల్స్ నాగ్ పూర్ లో కలకలం రేపాయి. ఈరోజు ఉదయం 11.30 గంటలకు ఒకసారి.. మళ్ళీ పది నిముషాల తర్వాత.. అంటే 11.40 గంటలకు మరోసారి గుర్తు తెలియని వ్యక్తి నితిన్ గడ్కరీ కార్యాలయానికి ఫోన్ చేసి గడ్కరీని చంపేస్తామనీ.. అలాగే నాగ్ పూర్ లోని ఆయన కార్యాలయాన్ని పేల్చేస్తామని బెదిరించాడట. వెంటనే గడ్కరీ కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. కార్యాలయంతో పాటు ఆ ప్రాంతం మొత్తాన్ని ఆధీనంలోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఆ ప్రాంతమంతా అణువణువూ తనిఖీలు చేపట్టారు. ఈ విషయాలన్నీ పోలీసులు స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ ఇల్లు, కార్యాలయం కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంది. ఫోన్ కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

కోడి పందేలు.. ఊర్లలో విచిత్రమైన ఆఫర్లు

సంక్రాంతి వచ్చిందంటే ఏపీలో కోడిపందేలకు సిద్ధమవుతారు పందెం రాయుళ్ళు. కొన్ని నెలల ముందే సంక్రాంతి కోడి పందేలకు రెడీ అవుతుంటారు. యేడాది పొడవునా బాగా మేపి.. మంచి దిట్టమైన పందెం కోడిని సిద్ధం చేసుకొని.. సంక్రాంతి సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు. పోలీసులు, ప్రభుత్వాలు కోడి పందేలు నిషేధించామని చెప్తుంటారే కానీ.. జనం సెంటిమెంటును కాదని వాళ్ళు పెద్దగా ఏమీ చేయరు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఏపీ మొత్తం పందెం కోళ్ళ కూతలతో మార్మోగిపోతోంది. కోడి పందేలు యేటా జరిగేవే కానీ.. ఈసారి మాత్రం చిత్రవిచిత్రమైన సన్నివేశాలు.. కొత్త కొత్త ఆఫర్లు కనిపిస్తున్నాయి ఏపీ గ్రామాల్లో.
ఇక్కడ డబ్బులు అమ్మబడును అంటూ కొత్త బోర్డులు కనిపిస్తున్నాయి కోడి పందేలు జరిగే స్థలాల్లో. అంటే.. క్రెడిట్, డెబిట్ కార్డులు స్వైప్ చేస్తే చాలు మనకు కావాల్సిన డబ్బును వాళ్ళు అక్కడికక్కడే అరేంజ్ చేస్తారన్నమాట. కాకపోతే కమిషన్ చెల్లించాల్సి ఉంది. ఫోన్ పే, గూగుల్ పే లాంటివి కూడా స్కానర్లతో సహా అందుబాటులో ఉన్నాయి. బంగారం తాకట్టు పెట్టుకునే వాళ్ళు కూడా స్టాల్స్ ఓపెన్ చేసి వడ్డీ ఆఫర్లు ఇచ్చేస్తున్నారు. పర్సనల్ లోన్ కావాలన్నా సరే అప్పటికప్పుడు చిన్న చిన్న మొత్తాలను ఇచ్చేస్తున్నారు. మొత్తానికి పందెం రాయుళ్ళ కోసం వడ్డీ వ్యాపారులు టెక్నాలజీని భారీగానే ఉపయోగించి.. పందేలకు సౌకర్యాలను కల్పిస్తున్నారన్నమాట.

హైదరాబాద్ ఖాళీ.. మాటేసి రెడీగా ఉన్న దొంగలు

సంక్రాంతి వచ్చిందంటే చాలు రాజధాని నగరం హైదరాబాద్ 90 శాతం ఖాళీ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు వారి వారి సొంతూళ్ళకు వెళ్ళిపోగా.. తెలంగాణ జనాలు కూడా పండగకు ఇళ్ళకు పయనమవుతారు. దీంతో నగరం ఖాళీ అయిపోతుంది. చాలా మంది జనం ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళే కావటం.. వారంతా పండగకు సొంతూళ్ళకు వెళ్ళటంతో సిటీ రోడ్లు ఖాళీగా దర్శనమిస్తాయి.. ఇళ్ళకు తాళాలు కనిపిస్తాయి. దొంగతనాలకు ఇదే మంచి చాన్స్ అని దొంగలు రాత్రికి రాత్రి ఇళ్ళు దోచే స్కెచ్చులు వేసుకొని ఎదురు చూస్తుంటారు. ప్రతి యేటా జరిగే తంతే ఇది. ఈసారి కూడా దాదాపు సిటీ ఖాళీ అయిపోయింది. కాలనీలు నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో దొంగలకు మళ్ళీ చాన్స్ దొరికింది.
అందుకే పోలీసులు ఈ 5 రోజుల కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ రోజుల పాటు ఇంటిని వదిలి వెళ్ళే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. సొంతూళ్ళకు వెళ్ళే ముందు నగదు, నగలను బ్యాంకులో దాచుకొని వెళ్ళటం మంచిదనీ.. దొంగతనాలు జరిగిన తర్వాత బాధపడే కంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటమే మేలని చెప్తున్నారు. ప్రతి కాలనీపైనా నిఘా వేసి ఉంచామని చెప్తున్నారు పోలీసులు. అయితే.. పోలీసులు ఎంత పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసినా మన జాగ్రత్తలో మనం ఉంటేనే మంచిది.

వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతో తెలుసా

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి రవితేజ సినిమా వాల్తేరు వీరయ్య మొదటి రోజు బ్లాక్ బస్టర్ కలెక్షన్లు వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లను మించి ఓపెనింగ్ కలెక్షన్లను సొంతం చేసుకుంది వాల్తేరు వీరయ్య. ముఖ్యంగా అమెరికాలో బాలకృష్ణ వీరసింహారెడ్డిని మించిన కలెక్షన్లు వసూలు చేస్తోందట వాల్తేరు వీరయ్య. ఈ సినిమా మొత్తం బడ్జెట్ 140 కోట్లు అని మేకర్స్ అనౌన్స్ చేశారు. సెకండ్ డే కలెక్షన్లు ఫస్ట్ డే కలెక్షన్లను మించి ఉంటాయని సినిమా క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.

రిలీజ్ కు ముందు దీనిపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత రెస్పాన్స్ మరింత భీభత్సంగా ఉంది. సినిమాలో చాలా విషయాల గురించి ప్రమోషన్స్ లో చెప్పకుండా దాచారనీ.. సినిమాలో మాస్ కంటెంట్ ఓ రేంజ్ లో ఉందనీ టాక్. రవితేజ పర్ఫార్మెన్స్ గురించి ఇక చెప్పాల్సిన అవసరంలేదు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ కు వాల్తేరు వీరయ్య నిజంగానే పండగ గిఫ్ట్ అని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

ఆదిపురుష్ కు షాకిచ్చిన అలహాబాద్ హైకోర్టు

ట్రైలర్ వచ్చీ రాగానే తీవ్ర విమర్శల పాలైన ప్రభాస్-ఓమ్ రౌత్ సినిమా ఆదిపురుష్ సినిమాకు మళ్ళీ కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డు అనుమతి లేకుండానే సినిమా ట్రైలర్ ను విడుదల చేశారంటూ తివారి అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డును వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో సెన్సార్ కమిషన్ ఆదిపురుష్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అది సినిమా అయినా.. ట్రైలర్ అయినా.. సెన్సార్ బోర్డు ముందుకు రాకుండా విడుదల చేయటం నిబంధనలకు విరుద్ధమని సెన్సార్ బోర్డు పేర్కొంది. ఇతర భాషల్లో సెన్సార్ బోర్డు అనుమతి తీసుకున్నంత మాత్రాన ఉత్తర్ ప్రదేశ్ సెన్సార్ బోర్డు ముందు ప్రదర్శించకుండానే ట్రైలర్ ఎలా విడుదల చేస్తారంటూ సెన్సార్ సభ్యులు మండిపడ్డారు.

ఆదిపురుష్ రామాయణం ఆధారంగా తెరకెక్కిన మైథలాజికల్ సినిమా. ఈ సంక్రాంతికి ఆదిపురుష్ విడుదల కావాల్సి ఉండగా.. సినిమా చుట్టూ ఉన్న వివాదాలతో రిలీజ్ వాయిదా పడింది. సినిమాలో రామాయణంలోని క్యారెక్టర్లను తన ఇష్టమొచ్చినట్టుగా మార్చేశాడంటూ డైరెక్టర్ ఓం రౌత్ పై విమర్శలు వచ్చాయి. అలాగే.. ఇదేదో యానిమేషన్ సినిమాలా ఉందే తప్ప మనుషులను పెట్టి తీసిన సినిమాలాగా లేదంటూ క్రిటిక్స్ కామెంట్స్ చేశారు. దీంతో సినిమా విడుదల వాయిదా పడింది. పాన్ ఇండియా సినిమా అని చెప్తున్న ఆదిపురుష్ ఎప్పటికి థియేటర్లలోకి వస్తుందో తెలియదు.

గోల్డెన్ గ్లోబ్ ఎఫెక్ట్ : మార్మోగుతున్న ప్రేమ్ రక్షిత్ పేరు

భారత సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైమ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న నాటు నాటు పాట గురించే చర్చ. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ సినిమా రిలీజైన నాటి నుంచి ప్రతి రోజూ దీని గురించి ఏదో ఓ వార్త వింటూనే ఉన్నాం. రికార్డులు.. కలెక్షన్లు.. అవార్డులు.. సత్కారాలు.. ఇలా ఎప్పుడూ ఆర్ఆర్ఆర్ వార్తల్లోనే ఉంటూ వచ్చింది. తాజాగా నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అ‌వార్డు వచ్చిన తర్వాత.. సడన్ గా కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సూపర్ స్టార్ అయిపోయాడు. మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి గానీ.. రాజమౌళి గానీ ఇప్పటికే ఎన్నో అవార్డులు సత్కారాలు అందుకున్న లెజెండ్స్. కానీ గోల్డెన్ గ్లోబ్ అనేది ప్రేమ్ రక్షిత్ కు మాత్రం లైఫ్ లో బిగ్గెస్ట్ అవార్డుగా నిలిచిపోనుంది.

నాటు నాటు పాట కోసం సుమారు 18 రకాల హుక్ స్టెప్పులు ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేశాడట. కానీ అన్నింటికంటే కూడా ఇప్పుడు మనం సినిమాలో చూస్తున్న స్టెప్ రాజమౌళికి బాగా నచ్చిందట. ఇద్దరు హీరోలు చేతులు కట్టుకొని స్టెప్పులు వేయటం నచ్చి ఈ హుక్ నే ఫైనల్ చేశారట. ఇప్పుడు అదే స్టెప్ ప్రపంచంలో ఎక్కడ చూసినా దర్శనమిస్తోంది. ఎక్కడెక్కడో దేశాలకు చెందిన సెలబ్రిటీలు కూడా నాటు నాటు అంటూ స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ కు ఫేమ్ రావటం కాస్త లేటైనా.. లైఫ్ లో దీన్ని మించింది రాదేమో అనే రేంజ్ లో అతను పాపులర్ అయిపోయాడు.

జెర్సీ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ కొత్త సినిమా

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. అవార్డుల పంట పండించిన జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కొత్త ప్రాజెక్టు ఓకే అయ్యిందంటూ ట్విటర్ లో చెప్పాడు విజయ్. ఈ స్క్రిప్టు విన్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది.. అంటూ తన నెక్స్ట్ సినిమా డిటైల్స్ షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో విజయ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. మరో విశేషం ఏంటంటే దేశభక్తి చుట్టూ తిరిగే పీరియాడికల్ సినిమా అయి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టర్ ను కూడా విజయ్ షేర్ చేశాడు. ముఖం కనిపించని యూనిఫామ్ లో ఉన్న పోలీస్ ఫోటోతో పాటు డోన్ట్ నో వేర్ ఐ బిలాంగ్ టు టెల్ యూ హూమ్ ఐ బిట్రేడ్ అనే కొటేషన్ ఈ సినిమా పోస్టర్ లో కనిపిస్తోంది. దాని కింద స్పై అని రాసి ఉంది. అంటే విజయ్ ఏదో థ్రిల్లింగ్ ఎలిమెంట్ తో వచ్చేస్తున్నాడన్నమాట.

భారీ అంచనాలతో రిలీజైన లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ ప్రస్తుతం ఖుషీతో బిజీగా ఉన్నాడు. అయితే.. పూరీ జగన్నాథ్ జనగణమణ పరిస్థితి ఏంటో ఇంకా తెలియదు. ఈలోగా గౌతమ్ తిన్ననూరితో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు. ఆకట్టుకునే కథతో అద్బుతమైన ఎమోషన్స్ తో ప్రేక్షకులను అలరించిన జెర్సీని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి సినిమా కావటంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉంటాయి.

దిల్ రాజుకు ఈ సారి పెద్ద షాకే

తెలుగులో వారసుడు పేరుతో విడుదలకు సిద్ధమైన తమిళ్ హీరో విజయ్ కొత్త సినిమా వారిసు.. దిల్ రాజుకు ఊహించని కష్టాలను తెచ్చిపెట్టేట్టు కనిపిస్తోంది. తమిళంలో మొదటి రోజు కలెక్షన్లు బాగానే ఉన్నా.. రెండో రోజు వచ్చేసరికి వారిసు డీలా పడిపోయింది. తమిళ్ వర్షన్ చూసిన చాలా మంది తెలుగు ప్రేక్షకులు.. ఈ సినిమా త్రివిక్రమ్ సినిమాకు కాపీ అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. తమిళంలోనే అజిత్ తునివు సినిమాతో పోటీలో కష్టపడుతున్న వారిసు.. తెలుగులో అటు బాలయ్య.. ఇటు చిరంజీవి సినిమాల మధ్య అస్సలు నిలదొక్కుకునే అవకాశాలు లేవని సినీ క్రిటిక్స్ అంచనా.

తమిళంలోనూ తెలుగులోనూ ఒకేసారి ఈ సినిమా విడుదలైతే రెండు చోట్లా కలెక్షన్లు ఉండేవనీ.. తమిళంలో రిలీజ్ చేసి కథ తెలిసిపోయి ఇలా ట్రోలింగ్ చేసే స్థాయికి వచ్చాక విడుదల చేస్తే ఖచ్చితంగా బోల్తా కొట్టడం ఖాయమని పబ్లిక్ ఒపీనియన్. అంతే కాక.. తెలుగులో ఇద్దరు సూపర్ స్టార్ సినిమాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకెళ్తున్న వేళ.. తెలుగు ప్రేక్షకులు పండగ పూట మన హీరోల సినిమాలు వదిలి విజయ్ సినిమా చూస్తారా అనేది కొంత మంది ప్రశ్న. మొన్న వచ్చిన వీరసింహారెడ్డి.. ఈరోజు వచ్చిన వాల్తేరు వీరయ్య హవా ముందు వారసుడికి కష్టమే. సో.. ఈ సారికి దిల్ రాజుకు ఈ డబ్బింగ్ సినిమా హ్యాండివ్వటం పక్కా అనిపిస్తోంది.

విజయ్ సేతుపతి కిర్రాక్-షాహిద్ కపూర్

హీరో.. విలన్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఏ తేడా లేకుండా ఇచ్చిన పాత్రకు న్యాయం చేసే విజయ్ సేతుపతి బాలీవుడ్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం షాహిద్ కపూర్ ఫార్జీ వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఫర్జీ ట్రైలర్ లాంచ్ వేడుక ముంబైలో ఈ రోజు గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో షాహిద్ కపూర్ తో పాటు విజయ్ సేతుపతి కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా షాహిద్ కపూర్.. విజయ్ ను పొగడ్తలతో ముంచేశాడు. విజయ్ సేతుపతి నటన తనకు ఎంతో ఇష్టమనీ.. విజయ్ ను మక్కల్ సెల్వన్ అని పిలిస్తే అచ్చుగుద్దినట్టు సరిపోతుందనీ షాహిద్ అన్నాడు.
విజయ్ సేతుపతి నటన.. ఆయన వ్యక్తిత్వం తనకు చాలా నచ్చాయన్న షాహిద్ కపూర్.. ఫర్జీ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూడబోతున్నారని హింట్ ఇచ్చాడు. తనతో పనిచేయటం చాలా సంతోషంగా ఉందనీ.. భవిష్యత్తులో విజయ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉందని చెప్పాడు. రాజ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఫర్జీ సిరీస్.. ఫిబ్రవరి 10 నుంచి అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.