పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు సమస్యలన్నీ పక్కనపెట్టి అదానీ పాటే పాడుతున్నాయి. అదానీ కుంభకోణం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో తేల్చాలంటూ రాహుల్ గాంధీ నేటి పార్లమెంట్ సమావేశాల్లో డిమాండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ.. అదానీ, మోడీ స్నేహం చాలా గొప్పది అంటూ సెటైర్లు వేశాడు. కేవలం మోడీ అండ వల్లనే అదానీ ఇంత పెద్ద కోటీశ్వరుడిగా ఎదిగాడనీ.. ఇప్పటికీ అదానీని మోడీ కాపాడుకుంటూ వస్తున్నాడనీ రాహుల్ ఆరోపించాడు. చిన్న చిన్న నేరాలపైనే రంగంలోకి దిగే ఈడీ, సీబీఐ.. అదానీ విషయంలో ఎందుకు విచారణ చేయటం లేదని ప్రశ్నించాడు. మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలపైనే సీబీఐ, ఈడీలను వాడుతుందే తప్ప.. నిజంగా నేరాలు చేసిన వారిని మాత్రం రక్షిస్తూ వస్తుందన్నాడు.
ఇక మరో ప్రతిపక్ష నేత కనిమొళి కూడా అదానీ-మోడీ వివాదంపైనే ఆరోపణలు చేశారు. అంత పెద్ద ఆర్థిక నేరం చేసినప్పటికీ అదానీని మోడీ ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తోందని ఆరోపించింది కనిమొళి. రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలా రాస్తోందనీ.. తెలంగాణ, తమిళనాడులో గవర్నర్లు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారనీ కనిమొళి ఆరోపించింది. నిరుద్యోగం, పేదరికం పెరగటం కళ్ళ ముందు కనిపిస్తున్నా.. తమది విజయవంతమైన ప్రభుత్వం అంటూ బీజేపీ చెప్పుకోవటం సిగ్గుచేటు అంటూ విరుచుకుపడింది.
అదానీ మోడీ ఫ్రెండ్షిప్ చాలా గొప్పది – రాహుల్ గాంధీ
ప్రభాస్ సినిమా రికార్డును టచ్ చేయలేని పఠాన్
షారూఖ్ ఖాన్ పఠాన్ సినిమా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా తిరగరాసేలా కనిపిస్తోందంటున్నారు సినిమా క్రిటిక్స్. సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత కలెక్షన్ల సునామీ ఆగిపోతుందని అందరూ భావించారు. కానీ.. రోజురోజుకూ పెరుగుతోందే తప్ప తగ్గటం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా రికార్డులను ఇప్పటికే పఠాన్ సినిమా తిరగరాసింది. వెయ్యి కోట్ల రికార్డుకు అతి దగ్గర్లో ఉన్న పఠాన్.. బాహుబలి-2 పేరిట ఉన్న రికార్డును మాత్రం పఠాన్ ఇంకా చేరుకోలేదు.
అమెరికాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఫస్ట్ సినిమా బాహుబలి-2 మాత్రమే. ఈ రికార్డు ఇంకా బాహుబలి2 మీదే ఉంది. 20.5 మిలియన్ కలెక్షన్ సాధించిన ప్రభాస్-రాజమౌళి సినిమా.. ఇప్పటికీ ఆల్ టైమ్ రికార్డు తన పేరిటే ఉంచుకుంది. కాకపోతే ఆ దిశలా పఠాన్ దూసుకెళ్తోంది. బాహుబలి-2 రికార్డును కూడా పఠాన్ బ్రేక్ చేస్తే అమెరికాలో అత్యధిక కలెక్షన్ సాధించిన ఇండియన్ సినిమా పఠాన్ అవుతుంది. కాకపోతే ఇది అంత సులభంగా అయ్యేలా కనిపించటం లేదు… అలాగని అసాధ్యం కూడా కాదు.. అంటూ సినిమా క్రిటిక్స్ చెప్తున్నారు. చాలా యేళ్ళుగా హిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్న షారూఖ్ ఖాన్ ఎదురు చూపులకు ముగింపు పలుకుతూ సిద్ధార్థ్ ఆనంద్ భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చేశాడు.
ఆ విషాదం తలచుకొని కంటతడి పెట్టుకున్న ప్రధాని మోడీ
టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి విలయం మానవ చరిత్రలో దారుణమైన దృశ్యాలకు వేదికైంది. కీలోమీటర్ల మేర నిర్మాణాలు కూలిపోయి వాటి శిథిలాల మధ్య ఇరుక్కొని సాయం కోసం ఎదురు చూస్తున్న అభాగ్యులతో ఆ ప్రదేశం నిండిపోయింది. శిథిలాల మధ్య శవాలు.. ఇనుప చువ్వల మధ్య సగం ఇరుక్కుపోయి బయటికి తీసేవాళ్ళ కోసం ఎదురు చూస్తున్న బాధితులు.. తలలు పగిలి రక్తమోడుతూ కుటుంబ సభ్యుల కోసం వెతుకుతున్న వాళ్ళు.. ఎక్కడ చూసిన ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సాయం చేయటానికి వెళ్ళిన ఆర్మీ బృందాలు, సమాచారం సేకరించేందుకు వెళ్ళిన మీడియా ప్రతినిథులు సైతం కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. ఈ హృదయ విదారక దృశ్యాలు చూసిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం కన్నీళ్ళు పెట్టుకున్నారు.
బీజేపీ పార్లమెంటరీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న మోడీ.. టర్కీ, సిరియా దేశాల్లో ఉన్న పరిస్థితిని వివరిస్తూ గతంలో గుజరాత్ లో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. 2001లో గుజరాత్ లోని భుజ్ లో సరిగ్గా రిపబ్లిక్ డే రోజున సంభవించిన భూకంపం.. భారత దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన విషాదం. అధికారిక లెక్కల ప్రకారం ఈ భూకంపంలో 20 వేలకు పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోగా సుమారు లక్ష 70 వేల మంది గాయపడ్డారు. గుజరాత్ ను కుదిపేసిన ఈ భూకంపం.. ఆ రాష్ట్రాన్ని కొన్ని దశాబ్ధాలు వెనక్కి తీసుకెళ్ళింది. టర్కీ,సిరియా భూకంపం నేపథ్యంలో మోడీ తన సొంత రాష్ట్రంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డారు. తాను స్వయంగా తన కళ్ళతో చూసిన క్షణాలు గుర్తు చేసుకున్నారు.
ఇప్పటికే భారత్ కు చెందిన సహాయక బృందాలు టర్కీ, సిరియాలో సహాయక చర్యలు అందిస్తున్నాయి. ఎమర్జెన్సీ మందులు, ఇతర మెడికల్ పరికరాలతో పాటు వైద్యుల బృందం కూడా భారత్ నుంచి టర్కీ, సిరియా దేశాల్లో సేవలందిస్తున్నాయి. ఆయా దేశాలకు అవసరమైన సాయాన్ని ఎప్పటికప్పుడు అందజేస్తామని భారత్ ఇదివరకే చెప్పింది.
నియంత కిమ్ జోంగ్ ఉన్ మాయం.. ఎక్కడున్నారో తెలియదట
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ గత 40 రోజులుగా కనిపించటం లేదట. నాలుగు రోజుల్లో కొరియా పీపుల్స్ ఆర్మీ 75 వార్షికోత్సవ పెరేడ్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో కిమ్ బయటకు కనిపించకపోవటంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. కిమ్ ఆరోగ్యం బాగాలేదంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సందర్భంలో కిమ్ చాలా రోజులు కనిపించకపోవటంతో అంతర్జాతీయ మీడియా కిమ్ కు ఏదో జరిగి ఉంటుందంటూ వార్తలు ప్రచురిస్తున్నాయి. కానీ సోమవారం మిలటరీ కమిషన్ మీటింగ్ జరిగిందనీ.. ఈ సమావేశానికి అధ్యక్ష హోదాలో కిమ్ హాజరయ్యాడనీ మిలటరీ వర్గాలు చెప్తున్నాయి.
మరోవైపు సైన్యం ఏర్పడి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ లో ఆర్మీ విన్యాసాలు మొదలు పెట్టారని తెలుస్తోంది. కొరియా వద్ద గల ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్, యుద్ధ విమానాలు తదితర వాటిని ఈ సందర్భంగా ప్రదర్శిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని శాటిలైట్ సమాచారాన్ని విశ్లేషించటం ద్వారా తెలిసిందని అమెరికా చెప్తోంది. ఆర్మీ పరేడ్ కు సమయం ఎక్కువ లేకపోయినా కిమ్ గురించి ఏ సమాచారం అందుబాటులో లేకపోవటం చర్చనీయాంశంగా మారింది. కిమ్ కు సంబంధించిన ఫోటో లేదా వీడియో కూడా మిలటరీ అధికారులు కిమ్ కు ఏమీ కాలేదనటానికి రుజువుగా చూపించటం లేదు.
టర్కీ, సిరియాల్లో దారుణమైన పరిస్థితులు
టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో మృత్యుమృదంగం ఆగటం లేదు. సోమవారం తెల్లవారుజాము నుంచి 3 సార్లు భారీ భూకంపాలు సంభవించగా.. మంగళవారం ఉదయం నాటికి కనీసం 100 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. టర్కీ, సిరియా దేశాల చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎదుర్కోనిదని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ ప్రకృతి విలయతాండవంలో 5 వేల మందికి పైగా మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. రెండు దేశాల్లో కలిపి మృతుల సంఖ్య మరింత భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే శిథిలాల కింద మరో 20 వేల వరకు ఇరుక్కుపోయి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత 30 గంటలుగా సుమారు 100 సార్లు భూప్రకంపనలు సంభవించాయనీ.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతకు తగ్గకుండా ఈ ప్రకంపనలు ఉన్నాయనీ జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు.
భూకంపం తీవ్రతకు టర్కీలోని ఇసికందరన్ పోర్టు తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక్కడ రవాణా కోసం సిద్ధంగా ఉంచిన కంటైనర్లలో అగ్నిప్రమాదం సంభవించి కంటైనర్లన్నీ కాలి బూడిద అవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ సరఫరా పైప్ లైన్లు తీవ్రంగా ధ్వంసం కావటంతో ప్రభుత్వం గ్యాస్ సరఫరాను నిలిపివేసి ముబైల్ ప్లాంట్ల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తోంది. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నాశనమైపోయింది. భూకంపానికి తోడు అగ్ని ప్రమాదాలు టర్కీని అతలాకుతలం చేస్తున్నాయి. సహాయ చర్యలు చేపట్టినప్పటికీ ఏమాత్రం సరిపోవటం లేదు. మొదటి భూకంపం సంభవించి ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినా.. శిథిలాల కింద ఇరుక్కున్న వారిని కాపాడే ప్రయత్నాలు ముందుకు సాగటం లేదు. అటు భూప్రకంపనలు కూడా ఆగటం లేదు. మరిన్ని రోజులు ప్రకంపనలు ఇలాగే కొనసాగుతాయని అధికారులు చెప్తున్నారు. మరింత తీవ్ర భూకంపం సంభవించే ఆస్కారం కూడా ఉందని చెప్పటంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.
అక్బరుద్దిన్ తో కాంగ్రెస్ నేతల మీటింగ్ : పొత్తు కోసమేనా ?
తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం పార్టీ నేత అక్బరుద్దిన్ ఒవైసీ.. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలే.. అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిచ్చిన అక్బర్.. కేటీఆర్ కామెంట్లను సీరియస్ గా తీసుకుంటున్నామనీ.. ఈ సారి 50 స్థానాల్లో పోటీ చేస్తామనీ చెప్పాడు. ఈ నేపథ్యంలో అక్బరుద్దిన్ ఒవైసీతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ కావటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అక్బరుద్దిన్ ఒవైసీతో సుమారు గంట పాటు మంతనాలు జరిపారు. దీంతో కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు ఏర్పడబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు వరకూ ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ వెంటే నడిచేది. కానీ టీఆర్ఎస్ పార్టీ అధికారం ఏర్పాటు చేశాక.. అప్పటి నుంచీ ఎంఐఎం పార్టీ కేసీఆర్ వెంటే నడిచింది. తాజాగా కాంగ్రెస్ నేతలతో మళ్ళీ అక్బరుద్దిన్ భేటీ కావటం ఇందుకే ప్రాధాన్యత సంతరించుకుంది. కాకపోతే.. కాంగ్రెస్ నేతలు మాత్రం పొత్తు ఉద్దేశమే లేదనీ.. చాలా రోజులైంది కాబట్టి కాసేపు కలిసి మాట్లాడుకున్నామనీ చెప్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే.. మేం పొత్తు పెట్టుకుంటే మాత్రం తప్పేముంది.. ఇది వరకు మా మధ్య పొత్తు ఉన్నదే కదా… అంటూ రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు. నిజానికి కేటీఆర్ వ్యాఖ్యలతో ఎంఐఎం పార్టీకి వచ్చిన నష్టమూ లేదు.. అక్బరుద్దిన్ కు ఎదురైన అవమానమూ లేదు. అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, అక్బరుద్దిన్ మధ్య తరచూ ఇలాంటి మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ మాత్రం దానికే ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ మీద అలిగి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదనే చెప్పాలి. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా నిలబెట్టుకోటానికి నానా తంటాలు పడుతూ అంతర్గత కలహాలతో నిత్యం నిప్పుల కుంపటిలా మారిన కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఎంఐఎం పార్టీకి ఏమాత్రం లాభం చేయబోదు. అధికార పార్టీని కాదని ఒక వేళ ఎంఐఎం పార్టీ వచ్చే ఎన్నికల్లో కొత్త పొత్తులు పెట్టుకున్నా.. ఏ పార్టీ అండ అవసరం లేకుండానే 90 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకునే స్థితిలో ఉంది బీఆర్ఎస్ పార్టీ.
పొంగులేటికి షాక్..! అనుచరులను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ రెబల్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సొంత పార్టీపైనా.. అధినేత కేసీఆర్ పైనా విరుచుకుపడ్డాడు. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధిష్టానానికి సవాల్ విసిరాడు. గత కొంత కాలంగా అసమ్మతి గళం వినిపిస్తున్న పొంగులేటి.. అవకాశం దొరికినప్పుడల్లా పార్టీకి, అధినేత కేసీఆర్ కు వ్యతిరేకంగా వివాదాస్ఫద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడు. సోమవారం నాడు భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేటలో పొంగులేటి తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాడు. ఈ సమ్మేళనంలో మాట్లాడిన పొంగులేటి తన విమర్శల వాడి మరింత పెంచి.. ఏకంగా అధిష్టానాన్ని సవాల్ చేశాడు. కేసీఆర్ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదనీ, పార్టీని వీడటం.. మరో పార్టీలో చేరటం అనేది తన అనుచరులను అడిగి నిర్ణయించుకుంటానని చెప్పాడు.
అయితే.. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ నాయకులకు జిల్లా పార్టీ షాకిచ్చింది. పొంగులేటి కార్యక్రమానికి హాజరైన వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా పార్టీ కార్యాలయాల నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తరచూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానంపై వ్యతిరేకతతో మాట్లాడుతున్న పొంగులేటి వెంట నడిచినందుకే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తన అనుచరులను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం పొంగులేటికి గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యింది. ఇది ఇలా ఉంటే.. పొంగులేటి పార్టీని వీడతారా లేదా క్లారిటీ లేదు. పార్టీ వీడినా ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు. వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చేలా చేసుకోవాలని.. తద్వారా లబ్ధి పొందాలనేది పొంగులేటి ఆలోచన అని జిల్లా పార్టీ నేతల అభిప్రాయం. త్వరలో పార్టీ నుంచి పొంగులేటి సస్పెండ్ అవుతారనే మాట కూడా వినిపిస్తోంది.
టర్కీలో రెండోసారి భూకంపం.. ఈ సారి మృతులు వేలల్లోనే
సోమవారం ఉదయం సంభవించిన భూకంపంతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియా సరిహద్దు ప్రాంతాల్లో రెండోసారి మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఇది 7.6గా నమోదైంది. సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం వల్ల సుమారు 7 వందల మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని భావించగా.. వేలాది మంది శిథిలాల్లో చిక్కుకొని ఉన్నారు. ఈక్రమంలో రెండోసారి సంభవించిన భూకంపం పరిస్థితిని మరింత దారుణంగా మార్చేసింది. రెండోసారి సంభవించిన భూకంపం వల్ల వేలాది మంది భవనాలు కుప్పకూలగా.. అప్పటికే దెబ్బతిని ఉన్న భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో ఆయా శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే అవకాశమే లేకుండ పోయిన దీన స్థితి నెలకొంది. రెండోసారి సంభవించిన భూకంపం వల్ల రెండు దేశాల్లో కలిపి సుమారు 15 వందల మంది ప్రాణాలు కోల్పోయారని.. గాయపడిన వారి సంఖ్య అప్పుడే చెప్పలేమనీ అంటున్నారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడే క్రమంలో రెండోసారి భూకంపం సంభవించటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ తరచుగా స్వల్ప భూ ప్రకంపనలు సంభవిస్తూనే ఉండటం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక ప్రజలంతా రోడ్లపై ప్రాణాలు అరచేత పట్టుకొని సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పలు దేశాల నుంచి ఆర్మీ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టాయి. భారత్ నుంచి టర్కీకి అవసరమైన సాయాన్ని ఇప్పటికే ప్రధాని మోడీ ప్రకటించారు.
ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం : ఉక్రెయిన్ కు ఐరన్ డోమ్
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై సుమారు యేడాది పూర్తవుతున్న వేళ తాజాగా యుద్ధం లోకి ఎంట్రీ ఇచ్చిన ఇజ్రాయెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా మిసైళ్ళ దాడితో అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ కు ప్రపంచంలోని అత్యుత్తమ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ఐరన్ డోమ్ టెక్నాలజీని ఇవ్వాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఫ్రెంచ్ కు చెందిన ఎల్సీఐ చానల్ కు ఫిబ్రవరి 5న ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు నెతన్యాహు ఈ విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ కు ఐరన్ డోమ్ టెక్నాలజీ ఇవ్వాలా వద్దా అనేది ఇజ్రాయెల్ జాతికి సంబంధించిన నిర్ణయం. ఈ విషయంలో ఇజ్రాయెల్ సరైన నిర్ణయం తీసుకుంటుంది అంటూ నెతన్యాహు పేర్కొనటం గమనార్హం. అయితే.. తాము రష్యా ఎయిర్ ఫోర్స్ కు వ్యతిరేకంగా పనిచేయాలని ఖచ్చితంగా కోరుకోవటం లేదని మరోరకంగా వ్యాఖ్యానించాడు నెతన్యాహు.
పాలస్తీనా సహా సరిహద్దు దేశాల నుంచి మరియు తీవ్రవాదుల నుంచి తరచుగా జరిగే మిసైల్ దాడుల నుంచి రక్షణ కోసం ఇజ్రాయెల్ ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీని రూపొందించింది. నిర్ణీత ప్రాంతంపై పడే మిసైళ్ళను ఆకాశంలోనే పేల్చి వేస్తుంది ఐరన్ డోమ్. నేల మీది లక్ష్యాలను మిసైల్స్ చేరుకోకుండానే గగనతలంలోనే మిసైల్స్ ను పేల్చి వేసే ఐరన్ డోమ్ ను ఉక్రెయిన్ కు గనక ఇజ్రాయెల్ ఇస్తే.. ఇది ఖచ్చితంగా ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ కు సాయం చేసే దేశాలపై ఆగ్రహంతో ఊగిపోతున్న పుతిన్.. ఉక్రెయిన్ ను పూర్తిగా రక్షించే రక్షణ వ్యవస్థ కనుక ఇజ్రాయెల్ ఇస్తే.. అస్సలు ఊరుకునే పరిస్థితి లేదు. ఇది యుద్ధాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్ళినట్టే. ఉక్రెయిన్ పై రష్యా పట్టు సడలినట్టు అనిపించినా పుతిన్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ వైపు చూస్తాడని చెప్పటంలో సందేహమే లేదు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన నాటి నుంచి అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ సహా యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆర్థిక మరియు ఆయుధ సాయాన్ని చేస్తూ వస్తున్నాయి. ఈ సాయంతో ఉక్రెయిన్ ఇంకా రష్యాతో పోరాడగలుగుతోంది. ఆర్థిక సంక్షోభం నీడలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని దేశాలూ ఉక్రెయిన్ కు సాయం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో రష్యా పట్టు నెగ్గించుకుంటుందేమో అనుకున్న తరుణంలో ఇజ్రాయెల్ ఎంట్రీ ఇచ్చింది. భారత్ నిర్ణయాన్ని సమర్థించే ఇజ్రాయెల్.. ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు ఏకంగా ఐరన్ డోమ్ టెక్నాలజీని ఇవ్వటం అనేది భారీ విషయమే. దీనిపై మిగతా దేశాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
డెల్ సంచలన నిర్ణయం : 6650 మంది ఉద్యోగాలు ఫట్
ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం భయపెడుతున్న వేళ.. ఐటీ రంగంలో కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో ఐటీ దిగ్గజం డెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 6650 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం. సంస్థ ఉద్యోగుల్లో ఇది 5 శాతంతో సమానం. డెల్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత భారీ లేఆఫ్ ఇదే తొలిసారి. ఈ మేరకు ఉద్యోగులకు డెల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జెఫ్ క్లార్క్ మెమోలు పంపించినట్టు బ్లూమ్ బర్గ్ కథనం. అస్ఫష్టమైన భవిష్యత్తు వైపు డెల్ ప్రయాణిస్తోంది. కాబట్టి కొత్త ఉద్యోగాల నియామకాలతో పాటు చాలా ఖర్చులు తగ్గించుకోవాల్సిన సమయం వచ్చినట్టు అనిపిస్తోంది. అంటూ క్లార్క్ ఆ లేఖలో పేర్కొన్నారని బ్లూమ్ బర్గ్ న్యూస్ చెప్తోంది.
అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు అమేజాన్, గూగుల్, ఫేస్ బుక్, గోల్డ్ మెన్ సాక్స్ సహా చాలా కంపెనీలు సుమారు లక్ష మంది ఉద్యోగులను ఇప్పటి వరకు తొలగించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగమనం బారిన పడటంతో రాబోయే రోజుల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదంటూ అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. రాబోయే సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు కొన్ని సంస్థలు ముందు జాగ్రత్తగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతుండగా.. కొన్ని కంపెనీలు ఇప్పటికే నష్టాలబాటలో ప్రయాణం మొదలుపెట్టాయి. కొత్త ప్రాజెక్టులు లేక ఐటీ కంపెనీలు.. ఆ కంపెనీలనే నమ్ముకున్న ఔట్ సోర్సింగ్ కంపెనీల్లో భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన నిర్ణయాలు తప్పేలా కనిపించటం లేదు.