భారీ భూకంపం టర్కీ, సిరియా దేశాలను కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి ఇరుదేశాల్లో కలిపి మొత్తం సుమారు 7 వందల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వందల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతంలోని గాజియాన్ తెప్ ప్రాంతానికి 33 కిలోమీటర్ల దూరంలో.. 18 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ప్రకటించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. భూకంపం సంభవించిన తర్వాత సుమారు 20 సార్లు భారీ ప్రకంపనలు ఏర్పడటంతో భవనాలు కూలి ఎక్కువ నష్టం వాటిల్లినట్టు అధికారులు వెల్లడించారు. వందలాది మంది ఇంకా శిథిలాల కిందే ఇరుక్కున్నారు. రంగంలోకి దిగిన ఆయా దేశాల ఆర్మీ.. సహాయక చర్యలను ముమ్మరం చేసింది.
టర్కీ చరిత్రలో 1939లో సంభవించిన భారీ భూకంపం తర్వాత ఇదే మళ్ళీ అంత తీవ్రమైనదిగా రికార్డైంది. 1939లో సంభవించిన భూకంపంలో ఎర్జికాన్ పట్టణంలో దాదాపు 33 వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భూకంపం సంభవించిన ప్రాంతంలో టర్కీ ఆర్మీకి చెందిన ఎయిర్ కారిడార్ ఉంది. భూకంపం విషయం తెలిసిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారత్ నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని వెల్లడించారు. భారత్ నుంచి మెడికల్ బృందాలు, డాక్టర్లతో పాటు మందులను కూడా వెంటనే ప్రత్యేక విమానంలో టర్కీ పంపించారు. 100 మందితో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా టర్కీ బయల్దేరాయి. అత్యవసర సమయంలో సేవలందించే ఈ బృందంతో పాటు ఎమర్జెన్సీలో కూడా అనేక అత్యాధునిక పరికరాలను భారత ప్రభుత్వం పంపించింది. గాయపడిన వారికి అవసరమయ్యే మందులను త్వరలోనే ఏర్పాటు చేసి టర్కీకి పంపిస్తామని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తెలిపారు.
టర్కీ, సిరియాలో భారీ భూకంపం.. వందలాది మంది మృతి
తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే
2023-24 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఈరోజు ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఎన్నికల సంవత్సరం కావటంతో ఈ బడ్జెట్ అధికార పార్టీకి ఎంతో కీలకంగా మారింది. అన్ని వర్గాల వారిని సంతృప్తి పరచేందుకు కేసీఆర్ క్యాబినెట్ తీవ్ర కసరత్తే చేసినట్టు కనిపిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 2,90,396 కోట్ల బడ్జెట్ ను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. అంటే సుమారు 3 లక్షల కోట్ల లెక్క. ఈ బడ్జెట్ లో కేటాయింపులు ఇలా ఉన్నాయి.
మొత్తం తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు కాగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధన వ్యయం రూ.2,11,685 కోట్లు, తలసరి ఆదాయం అంచనా రూ.3,17,115, నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు, ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ.36,750 కోట్లు, మహిళా, శిశు సంక్షేమం కోసం రూ.2,131 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు,
దళిత బంధు కోసం రూ.17,700 కోట్లు, రైతు రుణమాఫీకి రూ.6,385 కోట్లు, రైతు బంధు కోసం రూ.15,075 కోట్లు, ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.3,560 కోట్లు, హోంశాఖకు రూ.9,599 కోట్లు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకానికి రూ.12,000 కోట్ల కేటాయింపులు జరిగాయి. సంక్షేమ పథకాలకే భారీ కేటాయింపులు జరపాల్సి వచ్చింది. రైతుబంధు, రైతు రుణమాఫీ, దళిత బంధు పథకాలకే సుమారు 30 వేల కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. 26,885 కోట్లతో నీటి పారుదల రంగానికి కేటాయించి సాగునీటికి పెద్దపీట వేసి తన ప్రభుత్వం మొదటి లక్ష్యం నీరేనని ప్రభుత్వం మరోసారి చెప్పింది.
నర్స్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
అన్ స్టాపబుల్ షో సందర్భంగా నర్సులపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. నర్సులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమంటూ బాలకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నర్సింగ్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా బాలయ్యపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అయితే.. ఎట్టకేలకు దీనిపై బాలకృష్ణ స్పందించారు. వివాదంపై సుదీర్ఘ వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “అందరికీ నమస్కారం. నేను నర్సులను కించపరుస్తూ మాట్లాడనని విమర్శిస్తున్నారు. నా మాటలను వక్రీకరించారు. నాకు నర్సులంటే అపారమైన గౌరవం. బసవతారకం హాస్పిటల్ లో నర్సుల సేవలను కళ్ళారా చూశాను. రోగుల ప్రాణాలు కాపాడటం కోసం వారు పడే శ్రమ ఎంతో గొప్పది. కరోనా సమయంలో కూడా రోగుల ప్రాణాలు కాపాడింది నర్సులే. నర్సులపై నాకు ఎంతో గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు నర్సులకు బాధ కలిగించి ఉంటే నేను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను..” అంటూ బాలకృష్ణ తన పోస్టులో వివరించారు.
ఇటీవలి కాలంలో బాలకృష్ణ చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్ఫదంగా మారుతున్నాయి. వీరసింహారెడ్డి విజయోత్సవ కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో అన్ స్టాపబుల్ కార్యక్రమంలో బాలకృష్ణ తనకు గతంలో జరిగిన యాక్సిడెంట్ గురించి చెప్తూ నర్సుల గురించి చేసిన ఓ కామెంట్ మరో వివాదానికి దారి తీసింది. మొత్తానికి ఈ వివాదానికి బాలకృష్ణ పోస్టులో ఫుల్ స్టాప్ పడినట్టే.
అఖిల్ ‘ఏజెంట్’ కొత్త అప్డేట్.. అదిరిపోయింది !
లవ్ స్టోరీలు, క్లాస్ సినిమాలనే నమ్ముకొని ఇప్పటి వరకూ బ్లాక్ బస్టర్ అందుకోలేకపోయిన అక్కినేని అఖిల్.. రూటు మార్చి స్పై థ్రిల్లర్ స్టోరీతో వస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఏజెంట్.. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే ఆడియన్స్ అటెన్షన్ ను గ్రాబ్ చేసింది. ఈ కొత్త లుక్ కోసం అఖిల్ భారీ వర్కౌట్లే చేశాడు. సిక్స్ ప్యాక్ తో ఫుల్ యాక్షన్ హీరో మోడ్ లోకి వెళ్ళటానికి అఖిల్ బాగానే చెమట చిందించాడు. లేటెస్ట్ గా ఏజెంట్ సినిమా నుంచి ఓ కొత్త అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఏజెంట్ సినిమాలోని ఓ వైల్డ్ వీడియో క్లిప్ ను అభిమానుల కోసం రిలీజ్ చేశారు.
వీడియోలో స్పై గా పనిచేస్తున్న అఖిల్ ను శతృవులు టార్చర్ చేసే సీన్ ను చూపించారు. క్యాసినో రాయల్ సినిమాలో డేనియల్ క్రేగ్ ను ఎలాగైతే కుర్చీలో బట్టలు లేకుండా కూర్చోబెట్టి నిజం రాబట్టడం కోసం టార్చర్ చేస్తారో.. ఈ క్లిప్ లో కూడా అలాంటి కంటెంటే ఉంది. పోలీస్ వా, రా నా.. ఏ ఏజెన్సీ నీది.. ఈ నెట్వర్క్ లోకి ఎవడు పంపాడ్రా నిన్ను.. అంటూ విలన్ ఏజెంట్ ను ముఖం పగిలేలా గుద్దుతుంటే.. మాస్క్ వేసుకున్న ఏజెంట్ దానికి వైల్డ్ గా ఆన్సర్ ఇస్తాడు. ఒసామా బిన్ లాడెన్, గదాఫీ, హిట్లర్ పంపాడుబే.. అంటూ ఏజెంట్ రియాక్షన్ ఇస్తాడు. ఆ తర్వాత సాలే నహీ.. వైల్డ్ సాలే బోల్ అంటూ ఫైరింగ్ ఆన్సర్ చెప్తున్న అఖిల్ ముఖం కనిపిస్తుంది. డైలాగ్ కు తగినట్టే అఖిల్ ఎక్స్ ప్రెషన్ వైల్డ్ గానే కనిపిస్తోంది. ఈ ఒక్క క్లిప్ చూస్తే చాలు.. సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడో. ఏప్రిల్ 28న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉంటుందని కూడా మేకర్స్ ఈ వీడియో ద్వారా అనౌన్స్ చేశాడు. ఏదిఏమైనా.. అఖిల్ అప్పియరెన్స్.. వైల్డ్ డైలాగ్ మాత్రం సూపర్ అనే చెప్పాలి.
భారత్ బడ్జెట్ లెక్క చూసి భయపడుతున్న చైనా
సంవత్సరానికోసారి దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును అంచనా వేస్తూ చేసే కేటాయింపులు.. లెక్కలు.. పద్దులు.. బడ్జెట్ అంటే ఇవి మాత్రమే. కానీ అదే బడ్జెట్ ను విదేశాంగ విధానంతో రంగరించి సరిహద్దు దేశాలపై అస్త్రంగా కూడా ఉపయోగించుకోవచ్చని భారత్ చాటి చెప్పింది. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కొత్త వార్షిక బడ్జెట్ పార్లమెంట్ ముందుంచిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ లోనే ఉంది అసలు లెక్కంతా. వడ్డింపులు, కేటాయింపులే కాదు.. పక్కనే ఉంటూ పక్కలో బల్లెంలా ప్రవర్తించే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు పనికొచ్చే ఎత్తులు, పైఎత్తులు కూడా ఈ బడ్జెట్ లో పొందు పరిచింది మన కేంద్ర ప్రభుత్వం.
మారిన విదేశాంగ విధానానికి అనుగుణంగా మోడీ సర్కార్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో సైతం అంతకుమించిన యాక్షనే ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు కారణం తాజా బడ్జెట్‌లో మిత్ర దేశాలకు చేసిన కేటాయింపులే. తాలిబన్ల రాజ్యం అఫ్ఘనిస్తాన్‌కు కూడా రెండోందల కోట్ల కేటాయింపులు జరిపారు. అయితే, మన బడ్జెట్‌లో ఇతర దేశాలకు కేటాయింపులు జరపడం వెనుక మోడీ సర్కార్ వ్యూహమేంటి? సరిహద్దు దేశాలకు ఆర్ధిక సాయంతో.. శత్రుదేశాలకు ఎలా చెక్ పెట్టబోతున్నారు?
శత్రువుకు షాకివ్వాలంటే సరిహద్దుల్లో బుల్లెట్లు పేల్చాల్సిన పనిలేదు. సరిహద్దు దేశాలతో మైత్రిని మిస్సవ్వకుండా ఉన్నా సరిపోతుంది. గతకొంత కాలంగా డ్రాగన్ కంట్రీ చైనా చేస్తోంది ఇదే. కాకపోతే చైనా తన అవసరాల కోసం చిన్న దేశాలను వాడుకుని వదిలేస్తుంది. కానీ, భారత్ మాత్రం ఒక్కసారి తనతో దోస్తీ చేస్తే కడవరకూ అండగా నిలుస్తుంది. అంతే తేడా.. భారత్, చైనా విదేశాంగ విధానంలో తేడాల గురించి సింపుల్‌గా స్పష్టంగా చెప్పాలంటే.. శ్రీలంకకు అప్పులిచ్చి హంబన్‌టోట పోర్టును ఆధీనంలోకి తెచ్చుకోవడం, పాకిస్తాన్‌తో ఎకనామిక్ కారిడార్ అంటూ భారత్‌పై కుట్రలు చేయడం.. ఇప్పుడు తాలిబన్లతో వ్యాపారం పేరుతో దగ్గర కావడం లాంటివి.. చైనా తీరుకు అద్దం పట్టేవి. అదే భారత్ విషయానికి వస్తే.. పొరుగు దేశాలతో వాణిజ్యం ఉన్నా, లేకున్నా కష్ట కాలంలో అండగా నిలవడం మన నైజం. అదికూడా ఆ దేశాల నుంచి ఏం ఆశించకుండానే. ఇప్పుడు కూడా భారత్ తన బడ్జెట్‌లో పొరుగు దేశాలకు కేటాయింపులు చేసిం ది. కానీ, ఈ కేటాయింపులు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే గతకొంతకాలంగా చైనా దూకుడుకు ఈ కేటాయింపులు కళ్లెం వేస్తాయి.
కేంద్ర బడ్జెట్ 2023లో భారత్ తనతో సఖ్యాతగా ఉన్న మిత్రదేశాలకు కేటాయింపులు చేసింది. భూటాన్‌కు అత్యధికంగా 2వేల 400 కోట్లు.. నేపాల్‌కు 550 కోట్లు.. మారిషస్‌కు 460.79 కోట్లు.. మాల్దీవులకు 400 కోట్లు.. మయన్మార్‌కు 400 కోట్లు.. ఆఫ్రికన్ దేశాలకు 250 కోట్లు.. బంగ్లాదేశ్‌కు 200 కోట్లు.. ఆప్ఘనిస్తాన్‌కు 200 కేటాయిపులు చేసింది. ఆర్థికమాంద్యం కారణంగా ఈ బడ్జెట్లో విదేశాలకు అందించే సాయం ప్యాకేజీని 5వేల 848.58 కోట్లకు తగ్గించాల్సి వచ్చిందని భారత్ ప్రకటించింది. నిజానికి.. కేంద్రంలో మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిత్ర దేశాలకు భారీగానే కేటాయింపులు చేస్తుంది. మన దౌత్య విధానం సైతం మారడంతో అందుకు తగ్గట్టుగా బడ్జెట్లో కేటాయింపులు చేస్తోంది. దీని వల్ల అడ్వాంటేజ్ భారత్‌కు ఉంటుంది. ఎందుకంటే చైనా మన పొరుగు, మిత్ర దేశాలైన పాకిస్తాన్.. శ్రీలంక.. మయన్మార్.. నేపాల్ వంటి దేశాలకు నగదు సాయం అందిస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకొని జల.. భూ రవాణా మార్గాల్లో పెత్తనం చెలాయిచేందుకు యత్నిస్తోంది. దీంతో భారత్‌కు కొంతవరకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి చెక్ పెట్టే ప్రయత్నమే తాజా కేటాయింపులుగా చూడొచ్చు.
నిజానికి.. ఆసియాలో చైనా తర్వాత అతిపెద్ద దేశం ఇండియానే. సరిహద్దు దేశాలతో సఖ్యత ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్‌గా మారుతుంది. ఆయా దేశాలు సైతం భారత్‌కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. ఫలితంగా సరిహద్దుల్లో ఉద్రిక్తలు తగ్గే అవకాశం ఉండటంతోపాటు స్వేచ్ఛా వాణిజ్యం సులభం ఔతుంది. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి సంస్కరణలు మరింత సక్సెస్ కావాలంటే పొరుగుదేశాలతో వాణిజ్యం చాలా ఇంపార్టెంట్. చిన్న దేశాలతో వాణిజ్యం విషయంలో కోవిడ్ ముందు వరకూ చైనా ఆదిపత్యమే కొనసాగింది. కరోనా కల్లోలం తర్వాత చైనా వాణిజ్యానికి బ్రేకులుపడ్డాయి. అదే కోవిడ్ టైంలో సరిహద్దు దేశాలకు వ్యాక్సిన్, ఔషధాల సరఫరా లాంటి సాయం చేసిన భారత్ వాటితో భేష్ అనిపించుకుంది. ఫలితంగా అప్పటివరకూ చైనాతో వాణిజ్యానికి అలవాటుపడిన చాలా దేశాలకు భారత్ ఇంకాస్త దగ్గరయింది. ఇలాంటి సమయంలో మన బడ్జెట్‌లో పొరుగు దేశాలకు కేటాయింపులు చేయడం అంటే పరోక్షంగా చైనా వాణిజ్యానికి చెక్ పెట్టడమే.
ప్రధానంగా పొరుగు దేశాలకు తాజా కేటాయింపుల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు 200 కోట్లు కేటాయించడం మోడీ సర్కార్ వ్యూహానికి అద్దం పడుతోంది. ఎందుకంటే ఇటీవల డ్రాగన్ దేశం తాలిబన్లతో దోస్తీకి తహతహ లాడుతోంది. ప్రపంచం మొత్తం తాలిబన్ల పాలనను గుర్తించకపోయినా వారితో వాణిజ్యానికి సిద్ధపడింది. దీని లక్ష్యం ఆఫ్ఘన్‌లో ఉన్న ట్రిలియన్ డాలర్ల చమురు నిక్షేపాలపై కన్నేయడమే. ఆ చమురు నిక్షేపాలు కొల్ల గొట్టేందుకు ఎప్పట్నుంచే డ్రాగన్ ఎదురుచూస్తోంది. చివరకు తాలిబన్లకు సైతం నిధులు అవసరం కావడంతో చైనాతో వాణిజ్యానికి అంగీకరించారు. తాలిబన్లతో వాణిజ్యం చేసుకోడానికి మరో కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే తాలిబన్లు పాకిస్తాన్‌పై దాడులకు దిగుతున్నారు. భవిష్యత్‌లో పాకిస్తాన్ తాలిబన్ల వశమయ్యే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. చైనాతో సన్నిహితంగా మెలుగుతున్న సమయంలో తాలిబన్లు పాక్ ను ఆక్రమించుకుంటే పరిస్థితులు మనకు ప్రమాదకరంగా మారొచ్చు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. ఆ దిశగా తాలిబన్లను ఉపయోగించుకునే ప్రమాదముంది. నిజానికి.. పాకిస్తాన్‌తో చైనా దోస్తీ చేయడానికి కూడా రీజన్ భారత్‌లో టెర్రర్ అలజడులు సృష్టించడమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. కానీ, ప్రస్తుతం పాక్ అన్నిరకాలుగా చేతులెత్తేయడంతో దాన్ని వెంటాడుతున్న తాలిబన్లకు వాంటెడ్‌గా చైనా దగ్గరైందనే విశ్లేషణ వినిపిస్తోంది.
ఇలాంటి సమయంలో తాలిబన్లకు ఏం ఆశించకుండానే భారత్ తన బడ్జెట్‌లో 200 కోట్లు కేటాయించింది. ఈ ప్రకటనపై తాలిబన్లు హర్షం వ్యక్తం చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల బంధం బలోపేతం కావడానికి ఈ పరిణామం ఎంతో దోహదపడుతుందన్నారు. అలాగే ఆప్ఘాన్లో తాత్కాలికంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను భారత్ తిరిగి పూర్తి చేయాలని తాలిబన్లు కోరారు. 2021 ఆగస్టులో తాలిబన్లు అప్ఘనిస్తాన్‌ను ఆక్రమించిన తర్వాత భారత్ ఆ దేశంలో ప్రాజెక్టులను నిలిపివేసింది. నిజానికి.. తాలిబన్లు కోరుతున్నట్టు ఆఫ్ఘన్‌లో నిలిచిపోయిన ప్రాజెక్టులను భారత్ ఇప్పటికిప్పుడు తిరిగి పట్టాలెక్కించక పోవచ్చు. కానీ, అదే తాలిబన్లు గుడ్డిగా చైనా వలలో చిక్కకుండా తాజా బడ్జెట్ కేటాయింపులు వర్క్‌ఔట్ అవుతాయి. ఇదే సమయంలో భారత్ విషయంలో పాకిస్తాన్ మళ్లీ తోకజాడించినా తాలిబన్ల సపోర్ట్ మనకు దొరుకుతుంది. అందుకే కేంద్ర బడ్జెట్‌లో విదేశాలకు చేసిన కేటాయింపుల్లో ఆఫ్ఘనిస్తాన్‌కు చేసిన కేటాయింపు లది ప్రత్యేక స్థానంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఒక్క ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు.. భూటాన్, నేపాల్, శ్రీలంక లాంటి దేశాలన్నీ భారత్‌కు ప్రత్యేకమే. ఈ దేశాలకు కేటాయింపులు చేయడం ద్వారా డ్రాగన్ కంట్రీ చైనా మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తీ కాదు. అందుకే, శత్రువుకు చెక్ పెట్టాలంటే సరిహద్దుల్లో యుద్ధం ఒక్కటే కాదు.. స్నేహం కూడా ఓ మార్గం అవుతుందనేది. ఏదేమైనా పొరుగు దేశాలకు మోడీ సర్కార్ చేసిన కేటాయింపులు బీజింగ్‌కు ఓ రకమైన షాకింగ్ మూమెంటనే చెబుతున్నారు.
సన్నీ లియోన్ ఫ్యాషన్ ఈవెంట్ వద్ద భారీ పేలుడు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో శక్తివంతమైన పేలుడు చోటు చేసుకుంది. శనివారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో ఓ ఫ్యాషన్ ఈవెంట్ వేదికకు వంద మీటర్ల దూరంలో బాంబు పేలుడు సంభవించింది. ఇదే ఈవెంట్ కు రేపు నటి సన్నీ లియోన్ హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఖాదీ వస్త్రాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ఈ ఫ్యాషన్ ఈవెంట్ జరగటం కొంత మంది స్థానికులకు ఇష్టం లేదు. సన్నీ లియోన్ ఈ వేడుకకు అటెండ్ కావటం కూడా కొన్ని స్థానిక సంఘాల నేతలకు నచ్చలేదు. బహుశా వీళ్ళే ఈ పేలుడుకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. పేలుడు జరిగిన ప్రాంతం మొత్తాన్ని పోలీసులు స్వాధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఐఈడీ పేలుడా లేక గ్రనేడ్ పేలుడా అనేది ఇంకా గుర్తించలేదు. లోకల్ మిలిటెంట్ గ్రూపులు కూడా ఎవరూ ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించలేదు. ఈ ఘటనతో రాజధాని ఇంఫాల్ ఉలిక్కిపడింది. పూర్తి వివరాలు తెలిసే వరకూ నగరం మొత్తం అలర్ట్ ప్రకటించారు పోలీసులు.
గాయని వాణీ జయరాం ఇక లేరు
కొత్త సంవత్సరం సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. గత నెల రోజుల నుంచి సినీ ప్రముఖుల మరణ వార్తలు వింటున్న తెలుగు వారికి నేడు మరో విషాద వార్త. అలనాటి అద్భుత గాయని వాణీ జయరాం తుదిశ్వాస విడిచారు. చెన్నై లోని తన ఇంట్లో ఆమె ఈ రోజు ఉదయం మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 78 యేళ్ళ వాణీ జయరాం తమిళనాడులోని వెల్లూరులో 1945 నవంబర్ 30న జన్మించారు. కుటుంబంలో 5వ సంతానంగా జన్మించిన వాణీ అసలు పేరు కలైవాణి. అతి చిన్న వయసులోనే కచేరీ నిర్వహించి అలనాటి సంగీత విధ్వాంసులచే ఔరా అనిపించుకున్నారు వాణీ జయరాం. పూర్తిగా చెన్నైలోనే చదువుకున్న ఈమె అన్ని దక్షిణ భారత భాషలను అద్భుతంగా మాట్లాడగలదు.
ప్లేబ్యాక్ సింగర్ గా వాణీ జయరాం ఓ తరాన్ని ఏలిన అతికొద్ది మందిలో ఒకరు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలతో పాటు హిందీ వంటి ఉత్తర భారత భాషల్లో కూడా పాటలు పాడిన వాణీ జయరాం.. మొత్తం 14 భాషల్లో సుమారు 20 వేలకు పైగా పాటలు పాడారు. 80 వ దశకం మరియు 90వ దశకాలలో ఈమె పాడిన పాటలకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటికీ వాణీ పాడిన పాటలు అలనాటి ఆణిముత్యాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంతో కలిసి వాణఈ జయరాం పాడిన పాటలు ఇప్పటికీ అజరామరాలే. సీతాకోకచిలుక సినిమాలోని మాటే మంత్రము పాట వందేళ్ళైనా చెరగని అనుభూతినిచ్చే పాటగా ఆమె అభిమానులు చెప్పుకుంటారు. తన తేనె గొంతుకతో కోట్లాది మందిని అలరించిన వాణీ జయరాం మరణం.. సౌత్ సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి.
ఇజ్రాయెల్ మిసైల్ దాడులతో ఇరాన్ తో మొదలైన యుద్ధం
ఉక్రెయిన్-రష్యా యుద్ధం భీకరంగా కొనసాగుతుండగానే ప్రపంచం ముందు మరో వార్‌సైరన్ మోగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఎప్పట్నుంచో ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు దాడులు, వార్నింగ్‌ల వరకూ వెళ్లాయి. ఇరాన్ క్షిపణి స్థావరమే లక్ష్యంగా మూడు డ్రోన్లు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడి ఇజ్రాయెల్ నిఘా సంస్థ పనే అంటూ ఇరాన్ యాక్షన్‌లోకి దిగిపోయింది. దాడికి ప్రతి దాడి తప్పదని హెచ్చరికలు చేస్తోంది. ఏ రెండు దేశాల మధ్య అయినా యుద్ధం ఒక్క బుల్లెట్‌తోనే మొదలవుతుంది. అలాంటి పరిస్థితులనే గతేడాది ఫిబ్రవరి 24న ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడు మరోసారి అదే ఫిబ్రవరి ఇంకో యుద్ధా న్ని ప్రపంచానికి పరిచయం చేయబోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇస్ఫహాన్.. ఈ సిటీ ఇరాన్‌కు అత్యంత కీలకమైన నగరం. ఎందుకంటే ఇక్కడే ఇరాన్ ఆర్మీకి ఆయుధాలు అందించే కీలక క్షిపణి కేంద్రాలున్నాయి. ఈ దాడి విజువల్స్ కూడా అలాంటి క్షిపణి కేంద్రాలపై జరిగినప్పుడు క్యాప్చర్ చేసినవే. ఈ నగరంలో ఏం జరుగుతుం దో.. ఇరాన్ సర్కార్ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహిస్తుందో సొంత ప్రజలకే తెలీదు. అలాంటిది బయటి నుంచి మూడు డ్రోన్లు నగరంలోకి వచ్చి ఎంచుకున్న పాయింట్లపై బాంబులు విడిచి విధ్వంసం సృస్టించాయి అంటే.. ఇది పూర్తిగా తెలిసిన బయటివారిపనే అయి ఉండాలి. ఇస్ఫహాన్‌లో ఇరాన్ యాక్షనేంటో పూర్తిగా తెలిసింది ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌కే. ఈ విషయం ఇరాన్‌కు కూడా తెలుసు. అందుకే, ఈ దాడి జరిగిన తర్వాత పూర్తి వివరాలు బయటకు చెప్పని ఇరాన్ సర్కార్.. ఇస్ఫహాన్‌లో దాడికి మూడు డ్రోన్లు వస్తే.. రెండింటిని కూల్చివేశామని మాత్రమే చెప్పింది. అయితే, ఆ మూడు డ్రోన్లు ఎందుకొచ్చాయో.. అవి ఏ లక్ష్యంతో దాడులకు దిగాయో ఇరాన్‌కు పూర్తిగా తెలుసు. కానీ, దాడులపై మాత్రం తేలుకుట్టిన దొంగలా సైలెంట్‌గా ఉండిపోయింది. ఇస్ఫహాన్‌లో తమ యాక్షన్ బయటి ప్రపంచానికి తెలియకూడదని ఇరాన్ భావించింది కాబట్టే ఇరాన్ సైలెంట్‌గా ఉండిపోయింది.
నిజానికి.. ఇస్ఫహాన్‌లో రెండు క్షిపణి అభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు మరో రెండు క్షిపణి సాంకేతికతకు సంబంధించిన సంస్థలు కూడా ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని లండన్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్ట్రాటజిక్ స్టడీస్ పేర్కొంది. వీటన్నింటికీమించి అణు ప్రయోగ ల్యాబ్‌లకు ఇస్ఫహాన్ సిటీ కేరాఫ్ అడ్రస్. ఈ నగరంలో నాలుగు అణు ల్యాబ్‌లు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఇటీవల దాడి జరిగిన ప్రదేశంలో ఇరాన్ ఓ హైపర్‌సోనిక్ క్షిపణిని అభివృద్ధి చేసిందని ఇజ్రాయెల్ కూడా ఆరోపణలు చేస్తోంది. తాజాగా దాడి జరిగిన ప్రదేశం ఇరాన్ హైపర్ సోనిక్ క్షిపణి అభివృద్ధి కేంద్రం కావొచ్చని మొస్సాద్ మాజీ చీఫ్ డానీ యాటమ్ ఇజ్రాయెల్ ఆర్మీ రేడియోలో చెప్పారు. ఇరాన్ వద్ద దాదాపు 3వేల వరకూ బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయని.. వీటిల్లో కొన్ని టెల్ అవీవ్‌ను కూడా చేరుకోగలవని యాటమ్ తెలిపారు. ఇజ్రాయెల్ నిఘా సంస్థ దగ్గర ఇస్ఫహాన్ గురించిన సీక్రెట్స్ అన్నీ ఉన్నాయనేందుకు ఈయన మాటలే బెస్ట్ ఎగ్జాంపుల్. ఇరాన్ అభివృద్ధి చేసిన ఆయుధాలను యుద్ధ కల్లోలిత దేశాలు సిరియా, పాలస్తీనా, లెబనాన్‌కు సరఫరా చేస్తోందని, అందుకే క్షిపణి కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్‌గా చేస్తోందనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఇస్ఫహాన్‌లో దాడులపై మొదట సైలెంట్‌గా ఉన్న ఇరాన్.. ఆ తర్వాత ఇజ్రాయెల్‌ను కార్నర్ చేయడం మొదలుపెట్టింది. తమ భూభాగంలో ఉన్న ఆయుధ కర్మాగారంపై దాడి చేసింది ఇజ్రాయెలేనని ఇరాన్ ఆరోపించింది. తాజాగా.. ఐక్యరాజ్యసమితికి రాసిన లేఖలో ఇజ్రాయెల్ దాడిపై ప్రతీకారం తీర్చుకునే హక్కు తమకు ఉందని లేఖలో చెప్పింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలో ఆర్మీ ఆయుధ కర్మాగారంపై మూడు డ్రోన్లు దాడి చేయగా వాటిలో రెండింటిని కూల్చేశామనీ.. మూడో డ్రోన్ వల్ల స్వల్ప ఆస్తి నష్టం వాటిల్లిందని లేఖలో పేర్కొంది. తమ ప్రాథమిక దర్యాప్తులో ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్లు తేలిందన్న ఇరాన్.. తగిన సందర్భంలో సరైన రీతిలో బదులిస్తామని పేర్కొంది. అంటే, ఇజ్రాయెల్‌పై దాడికి దిగుతామని పరోక్షంగా ఐక్యరాజ్యసమితికి తేల్చి చెప్పారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజానికి.. ఇరాన్ అణ్వస్త్రాలు ప్రయోగించకుండా అడ్డుకోవడమే ఇజ్రాయెల్ తొలి ప్రాధాన్యం. ఇజ్రాయెల్ రెండు పనులు చేయాల్సి ఉంది. వాటిలో మొదటిది ఇరాన్ అణ్వాయుధాల తయారీని ఆపడమైతే.. రెండోది అణ్వస్త్రాలు ప్రయోగించే వ్యవస్థలు ఇరాన్‌కు దక్కకుండా చేయడం. దీనికి తోడు ఇరాన్ అభివృద్ధి చేసిన పలు రకాల ఆయుధాలను సిరియా, లెబనాన్, పాలస్తీనాకు సరఫరా చేయడం తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఇస్ఫహాన్‌లోని క్షిపణి కేంద్రాన్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ లక్ష్యంగా చేసుకొని ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ తరహా దాడులు చేయడంలో ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ది అందెవేసిన చేయి. ఇప్పుడు కూడా మొస్సాద్ తన సీక్రెట్ ఏజెంట్ల సాయంతోనే ఇస్ఫహాన్ నగరంలో ఉన్న క్షిపణి కేంద్రాలను అతిదగ్గర నుంచి ప్లాన్ చేసి కొట్టినట్టు మిలటరీ ఎక్స్‌పర్ట్స్ అనుమానిస్తున్నారు. ఇరాన్ సైతం ఇలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తోంది. మొస్సాద్‌కు చెందిన వారు కాకుండా మరే ఇతర వ్యక్తులకూ ఇస్ఫహాన్‌లో దాడులు చేసే సీన్ ఉండదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. ఈ దాడి వెనుక రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కోణం కూడా ఉందని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి. దీనికి ఇరాన్ డ్రోన్లే కారణమని వెస్ట్రన్ మీడియా చెబుతోంది. పశ్చిమ దేశాల ఆరోపణలకు కారణం ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా ఉపయోగిస్తున్న ఇరాన్ డ్రోన్లే. ఇరాన్ నుంచి అందిన షహీన్ డ్రోన్లతో మాస్కో దళాలు ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్నాయి. ఈ డ్రోన్లు తమకు కలిసి రావడంతో ఇరాన్ నుంచి క్షిపణులు కూడా కొనాలని మాస్కో భావిస్తున్నట్టు అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్ సాయంతో క్షిపణి కేంద్రంపై అమెరికానే దాడి చేయించిందనే ప్రచారం ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్‌లో పర్యటించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఈ విషయాన్ని కాస్త తాజా పరిణామాలతో ఇరాన్ అణు ఒప్పందంపై ఆశలూ క్రమంగా తగ్గుతున్నాయి. ఈ టైంలో జరిగే ఈ దాడులకు ఇరాన్ స్పందించి.. పరిస్థితిని ఉద్రిక్తంగా మార్చడమో.. అమెరికా, యూరప్ తో అణు ఒప్పందం చర్చలను కొనసాగించడమో తేల్చుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ సైనిక ఇంటెలిజెన్స్ మాజీ అధికారి గ్రిన్ బెర్గ్.. రేడియో ఫ్రీ యూరప్ రేడియో లిబర్టీ పత్రికకు చెప్పారు. ఓవరాల్‌గా తాజా దాడులతో ఇరాన్ తెగిస్తే మరో భీకర యుద్ధం మొదలైనట్టే అనే విశ్లేషణలే వినిపిస్తున్నాయి.
ఏపీలో పీక్స్ కు చేరిన ఫోన్ ట్యాపింగ్ ఫైట్
రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కొత్తేం కాదు. ఈ అంశంపై స్టేట్ అయినా సెంట్రల్ అయినా అధికార పార్టీపై విపక్షాలు ఆరోపణలు కూడా సర్వసాధారణం. గతంలో పెగాసస్ ఎపిసోడ్ కేంద్రంలోనూ, ఏపీ లోనూ పెను ప్రకంపనలే సృష్టించింది. కట్‌చేస్తే.. ఇప్పుడు ఏపీలో మరోసారి అదే ట్యాపింగ్ పంచాయితీ రచ్చ రచ్చ చేసేస్తోంది. ఇందుకు కారణం అధికార పార్టీపై సొంత నేతల ఎదురుదాడే. నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డి, ఆనం తమపై ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, అదికూడా జగన్ సర్కారే చేయించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడే స్టేట్ పాలిటిక్స్ షేక్ అవ్వడం మొదలైంది. ఐతే, ఈ ఆరోపణలను అధికార పార్టీ కొట్టిపారేసింది. కాకపోతే ఇదే సమయంలో రెబల్ నేతలపై విమర్శలు చేసింది. ఇక్కడే సీన్ మరో లెవెల్‌కు చేరింది.
తాను చేసిన ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ విమర్శలకు కోటంరెడ్డి ఇచ్చిన కౌంటర్లే ఇవి. “ఎప్పుడొస్తారో రండి.. ఎన్ని కేసులు పెడతారో డిసైడ్ చేసుకోండి” అంటూ ట్యాపింగ్ ఆరోపణలకు మించి అధిష్టానంపైనా, తనను విమర్శించిన నేతలపైనా విరుచుకుపడిపోయారు. ట్యాపింగ్ ఆరోపణలతోనే ఆగిపోననీ, పార్టీని ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. తన గొంతును ఆపాలనుకుంటే ఎన్‌కౌంటర్ చేయడం ఒక్కటే ఆప్షన్ అంటూ చెలరేగిపోయారు. అయితే, కోటంరెడ్డి ఈ రేంజ్‌లో చెలరేగిపోయిన తర్వాత వైసీపీ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటుంది? ఆ వెంటనే కాకాణి రంగంలోకి దిగారు. వస్తూ వస్తూనే కోటంరెడ్డిపై కౌంటర్లు షురూ చేశారు. కోటరెడ్డిపై జరిగింది ఫోన్ ట్యాపింగ్ కాదు.. ముమ్మాటికీ మ్యాన్ ట్యాపింగే అంటూ పరోక్షంగా టీడీపీ టార్గెట్ చేశారు.
నిజానికి.. కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను టీడీపీలో చేరడానికి చేస్తున్న ఆరోపణలుగానే వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. కోటంరెడిని చంద్రబాబు పావులా వాడుకుంటున్నారని, ఆయన భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారని, బాబు ఉచ్చులో కోటంరెడ్డి పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే అది ఫోన్ ట్యాపింగ్ కాదు, మ్యాన్ ట్యాపింగ్ అనే వాదన వినిపిస్తున్నారు. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై వైసీపీ సర్కార్ ఎలా ముందుకెళ్లబోతోందనే చర్చపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి కాకాణి. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని ప్రభుత్వం చెబుతోందనీ, జరగని దాన్ని జరిగినట్టు చెపుతుంటే, దానిపై విచారణ ఏముంటుందని అన్నారు. ఆధారాలుంటే కోటంరెడ్డే వాటిని కేంద్రానికి పంపించాలన్నారు. లేదంటే కోర్టుకైనా వెళ్లొచ్చనీ.. కోర్టుకి వెళ్తే అది ట్యాపింగా, రికార్డింగా అనేది తేలిపోతుందన్నారు. తన కామెంట్లతో పరోక్షంగా టీడీపీని కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
మరోవైపు.. వైసీపీలో రెబల్ రచ్చను టీడీపీ ఇంకోలా విశ్లేషిస్తోంది. వైసీపీలో అసమ్మతివాదులు బాగా పెరిగిపోయారని వారంతా ఏకమై ప్రభుత్వాన్ని కూల్చటం ఖాయమంటోంది. ప్రతీ జిల్లాలోను ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్‌పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారని దానికి ప్రత్యక్ష ఉదాహరణే కోటంరెడ్డి, ఆనం వంటి నేతల వ్యతిరేకత గళాలని చెబుతోంది. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే కాదని సాక్షాత్తు కోటంరెడ్డి చెప్పిన మాటలేనని ఆ పార్టీ నేత ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. 35మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీలో ఇమడలేకపోతున్నారని పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారంటూ కోటంరెడ్డి అన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. నెల్లూరు జిల్లాలో రాజుకున్న ఈ నిరసన సెగలు ప్రతీ జిల్లాకు పాకుతాయని నెల్లూరు నుంచి కృష్ణాజిల్లాకు నిరసనలు పాకాయని.. ఇక అసహనంతో ఉన్న నేతలంతా ఒక్కొక్కరుగా బయటపడతారంటున్నారు. సరే.. ప్రతిపక్ష నేత కాబట్టి పత్తిపాటి ఈ తరహా వ్యాఖ్యలు చేసినప్పటికీ.. నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇందుకు కారణం నెల్లూరు వైసీపీకి పెట్టనికోట కావడమే.
2014 ఎన్నికల నుంచీ నెల్లూరుపై వైసీపీ చెరగని ముద్ర వేసింది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు కైవసం చేసుకుంది. మిగిలిన 2 స్థానాలను టీడీపీ దక్కించుకుంది. దీంతో వైసీపీ కంచుకోటగా నెల్లూరు జిల్లా ఆవిర్భవించింది. అదే ఊపును 2019 ఎన్నికల్లో 10సీట్లను కైవసం చేసుకొని నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. దీంతో మళ్లీ బలమైన కంచుకోటగా నెల్లూరు మారింది. అలాంటి కంచుకోటలో ఆనం, కోటంరెడ్డి లాంటి నేతలు రెబల్స్‌గా మారడం అధికార పార్టీపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన నేతలపై ఎదురుదాడికి దిగడం కూడా నెగిటివ్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల ప్రకంపనలు మాత్రం ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.
హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు
హైదరాబాద్ రోడ్లపై అప్పుడెప్పుడో నిజాం కాలం నాడు డబుల్ డెక్కర్ బస్సులు తిరిగేవని అందరికీ తెలిసిందే. రాను రానూ సిటీలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించకుండా పోయాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో హైదరాబాద్ సిటీ రోడ్లపై మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు తిరగబోతున్నాయి. మరో 2,3 రోజుల్లోనే ప్రభుత్వం ఈ డబుల్ డెక్కర్ బస్సులను లాంచ్ చేయనుందని సమాచారం. ఒక్కొక్కటి సుమారు 2 కోట్లు ఖరీదు చేసే 6 ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ.. అధికారిక ప్రకటన తర్వాత హైదరాబాద్ సిటీ రోడ్లపై బస్సులు తిరగటం ప్రారంభం అవుతుందనీ తెలుస్తోంది.
అయితే.. ఈ బస్సులు సిటీ మొత్తం తిరగటానికి కాకుండా కేవలం భాగ్యనగరంలోని టూరిస్ట్ ప్రదేశాల మధ్య మాత్రమే తిరుగుతాయట. హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలన్నింటినీ కలుపుతూ ఓ కొత్త రూట్ మ్యాప్ సిద్ధం చేసి ఈ రూట్లలో ప్రతి రోజూ డబుల్ డెక్కర్ బస్సులు నడపటానికి ఆర్టీసీ రెడీ అయ్యింది. గోల్కొండ, చార్మినార్, హుస్సేన్ సాగర్, కుతుబ్ షాహీ టూంబ్స్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే వారికి స్పెషల్ అట్రాక్షన్ గా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు నిలవనున్నాయి. టికెట్ ధర ఇంకా తెలియలేదు కానీ.. అత్యధికంగా 65 రూపాయలకు మించకుండా టికెట్ రేట్లు ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు.