Home Blog Page 40

వైరల్ అవుతున్న చిరంజీవి కామెంట్లు

సింగర్ స్మిత హోస్ట్ గా నిజం విత్ స్మిత పేరుతో ఓ సరికొత్త షో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అనౌన్స్ చేసిన నాటి నుంచీ మేకర్స్ ఈ షో కు సంబంధించిన ప్రోమోలు ఒక్కోటీ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ రేటింగ్ పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. మొన్న సాయిపల్లవి కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియోగా మారగా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఓ వీడియో రచ్చ రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో స్మిత అడిగిన ప్రశ్నలు.. చిరంజీవి ఇస్తున్న సమాధానాలు చర్చనీయాంశాలుగా మారాయి.
మీ కాలేజ్ క్రష్ ఎవరు అని స్మిత అడిగిన ప్రశ్నకు పాపం మెగాస్టార్ కాస్త ఆలోచనలో పడినట్టు కనిపిస్తోంది. స్టార్ డమ్ సాధించాలంటే అవమానాలు భరించాల్సిందేనా అన్న ఉద్దేశంతో స్మిత అడిగిన ప్రశ్నకు చిరంజీవి ఇచ్చిన సమాధానం హాట్ టాపిక్ గా మారింది. జగిత్యాలలో పూలవర్షం పడింది.. ఆ తర్వాత కోడిగుడ్లేసి కొట్టారు.. అంటూ చిరంజీవి ఇచ్చిన ఆన్సర్ మెగా అభిమానులకు టాపిక్ గా మారింది. నిజంగా చిరంజీవి జగిత్యాల వెళ్ళినప్పుడు ఆయనపై కోడిగుడ్లు విసిరారా.. విసిరితే అది ఎవరై ఉంటారు.. అసలు చిరంజీవి జగిత్యాలకు ఏపనిమీద వెళ్ళారు.. సినిమా ఫంక్షనా లేక పొలిటికల్ మీటింగా.. ఇన్ని ప్రశ్నలు అభిమానుల్లో సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి షోలలో ప్రశ్నలు కాస్త సెన్సేషన్ క్రియేట్ చేసే విధంగానే ఉంటాయి. ఈ విషయం బాలకృష్ణ అన్ స్టాపబుల్ తో ప్రూవ్ అయ్యింది. మరి నిజం విత్ స్మిత షోలో ఇలాంటి ప్రశ్నలు ఎన్ని ఉన్నాయో.. వాటికి గెస్ట్ లు ఇచ్చిన ఆన్సర్స్ ఎలా ఉన్నాయో అన్న ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. షో స్ట్రీమింగ్ కు ముందే మంచి రేటింగ్ సొంతం చేసుకునే అవకాశముంది.

వైరల్ ఫోన్ కాల్ ఆడియోపై ట్విస్ట్ ఇచ్చిన బాబూ మోహన్

తరచూ నోరు పారేసుకొని వివాదాస్ఫదం అయ్యే బాబూ మోహన్.. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఓ బీజేపీ కార్యకర్త బాబూ మోహన్ కు ఫోన్ చేయగా.. ఆయన తిట్ల దండకం అందుకున్న కాల్ ఆడియో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినే తిట్టేసిన బాబూ మోహన్ ఫోన్ కాల్ సంభాషణ బీజేపీలో కలకలం సృష్టించింది. బాబూ మోహన్ మాట్లాడిన తీరు చూస్తుంటే ఆయన పీకలదాకా తాగేసి ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. అయితే.. ఈ ఫోన్ కాల్ రికార్డ్ పై బాబూ మోహన్ స్పందించాడు. అసలు ఆ కాల్ రికార్డు తనది కానే కాదంటూ ట్విస్ట్ ఇచ్చాడు బాబూ మోహన్.
“అసలు ఆ రోజు నేను ఏ ఫోన్ కాల్ మాట్లాడనే లేదు. తెల్లవారితే పార్టీ మీటింగ్ ఉంది కాబట్టి ఆ రోజు త్వరగా నిద్రపోయాను.. ఆసలు నేను మాట్లాడిన కాల్ కాదు.. కావాలంటే నా ఫోన్ ఇస్తాను చెక్ చేస్కోండి.. కావాలనే నాపై ఎవరో కుట్ర చేసి ఈ విధంగా బద్నం చేస్తున్నారు.. బండి సంజయ్ ఎప్పుడూ నా తమ్ముడే..” అంటూ పేర్కొన్నాడు బాబూ మోహన్. ఆందోల్ నియోజకవర్గానికి చెందిన వెంకట రమణ అనే కార్యకర్త బాబూ మోహన్ కు ఫోన్ చేయగా.. ఆయన స్పందించిన తీరుతో ఆగ్రహించిన ఆ వ్యక్తి.. కాల్ రికార్డును సోషల్ మీడియాలో లీక్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే.. బాబూ మోహన్ కు ఇదేం కొత్త కాదు. గతంలో కూడా ఆయన సహచరులపైనా.. సాధారణ జనాలపైనా.. ప్రభుత్వ అధికారులపైనా చాలా సార్లు నోరు పారేసుకొని విమర్శలపాలయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్ దొరకక బీజేపీలో చేరిన బాబూ మోహన్.. వచ్చే ఎన్నికల్లో ఆందోల్ నుంచే బీజేపీ టికెట్ పై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజా పరిణామాలు చూస్తుంటే అసలు బాబూ మోహన్ కు టికెట్ దొరుకుతుందో లేదో అనుమానమే.

టర్కీ కోసం భారత్ “ఆపరేషన్ దోస్త్”

వరుస భూకంపాలతో అతలాకుతలం అవుతున్న టర్కీ కోసం భారత్ సరికొత్త ఆపరేషన్ ను చేపట్టింది. టర్కీని ఆదుకునేందుకు ఆపరేషన్ దోస్త్ పేరుతో ఆ దేశానికి అవసరమైన అన్ని రకాల సామాగ్రిని పంపిస్తోంది భారత్. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రత్యేక కార్గో విమానాల ద్వారా టర్కీకి కావాల్సిన ఎమర్జెన్సీ పరికరాలను మరియు మందులు, ఇతర మెడికల్ పరికరాలను పంపించింది భారత్. వీటితో పాటు అత్యుత్తమ వైద్యులతో కూడిన వైద్య బృందాన్ని కూడా టర్కీకి పంపించింది. భూకంపం సంభవించిన 24 గంటల్లోనే టర్కీకి 100 మంది సభ్యులతో కూడిన రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను హుటాహుటిన పంపిన భారత ప్రభుత్వం.. ఆ తర్వాత టర్కీలో వరుస భూకంపాలు సంభవించటం.. అగ్ని ప్రమాదాలు సంభవించటంతో టర్కీకి కావాల్సిన అన్ని రకాల సాయాన్ని చేస్తూ వస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్ కు ఆపరేషన్ దోస్త్ అని నామకరణం చేసింది భారత్.
సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపంతో టర్కీలో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించగా.. ఆ తర్వాత కూడా సుమారు 48 గంటల పాటు 5 సార్లు భారీ భూకంపాలు టర్కీని అతలాకుతలం చేశాయి. సుమారు 125 సార్లు రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతను మించిన ప్రకంపనలు సంభవించాయి. దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ పైప్ లైన్లు ధ్వంసం కావటంతో చాలా చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఒకే సమయంలో దేశంలోనే వందలాది చోట్ల ప్రమాదాలు సంభవించటంతో రెస్క్యూ సిబ్బంది సంఖ్య ఏమాత్రం సరిపోలేదు. పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తమ ఆర్మీని టర్కీ, సిరియా దేశాలకు సాయం అందించేందుకు పంపించాయి. శతృదేశమైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలన్న ఉద్దేశంతో భారత్ టర్కీకి మిగతా దేశాలను మించిన సాయం అందిస్తోంది. ఎప్పుడూ టర్కీకి వంతపాడే పాకిస్తాన్ మాత్రం నోరు తెరవటం లేదు. పైగా.. టర్కీకి సాయం అందించటానికి బయల్దేరిన భారత విమానాలు తమ దేశ గగనతలం గుండా వెళ్ళకూడదంటూ అడ్డుపడుతోంది పాకిస్తాన్.

అసెంబ్లీలో బీజేపీని ఆటాడుకున్న మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన హరీష్ రావు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. బీజేపీ అద్భుతమైన విజయాలు సాధించిందని వ్యంగ్యాస్త్రాలు సంధించిన హరీష్ రావు.. మోడీ బ్లాక్ మనీ హామీ దగ్గర మొదలుపెట్టి.. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ వరకు ఒక్కొక్క అంశం గురించి లేవనెత్తి మరీ బీజేపీని చెడుగుడు ఆడుకున్నాడు.. మంత్రి హరీష్ రావు.
బీజేపీ ప్రభుత్వం ప్రతి బడ్జెట్ కు ఒక పేరు పెడుతుందనీ.. అందమైన పేరు పెట్టడం తప్ప బడ్జెట్ లో ఇంకేమీ ఉండదని విమర్శించాడు. బీజేపీ బడ్జెట్ కు ధోకా అని పేరు పెట్టారు హరీష్ రావు. యేడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ధోకా, అర్హులైన వారందరికీ ఇళ్ళు ధోకా, రైతుల సంక్షేమం..ధోకా, లోక్ పాల్ బిల్లు ధోకా, నదుల అనుసంధానం ధోకా.. ఇవన్నీ ధోకాలే. అంటూ బీజేపీని ఉతికి ఆరేశారు. ధోకాలే కాకుండా బీజేపీకి చాలా విజయాలు ఉన్నాయని మరోసారి వ్యంగ్యాస్త్రం సంధించిన హరీష్ రావు.. జీడీపీని మంటగలపటంలో సక్సెస్.. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయటంలో సక్సెస్.. 160 లక్షల కోట్ల అప్పు చేయటంలో సక్సెస్.. అడ్డగోలు పన్నులు వేయటంలో సక్సెస్.. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచటంలో సక్సెస్.. ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో సక్సెస్.. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయటంలో సక్సెస్.. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయటంలో సక్సెస్.. ఇలా చాలా విజయాలు సాధించిందని ఘాటైన విమర్శలు చేశాడు హరీష్ రావు. హరీష్ రావుతో పాటు మిగతా ఎమ్మెల్యేలు, మంత్రులు కోరస్ అందించి వంతపాడటంతో అసెంబ్లీలో విచిత్రమైన సన్నివేశాలు కనిపించాయి. ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా గనుక తెలంగాణ అసెంబ్లీ లైవ్ చూస్తే ఏమైపోతారో అనిపించింది.

చైనా స్పై బెలూన్ : సంచలన నిజాలు వెల్లడించిన అమెరికా

చైనా నిఘా బెలూన్ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది. యావత్ ప్రపంచం ఈ విషయంలో చైనాపై కన్నెర్ర చేస్తోంది. కొద్ది రోజుల క్రితం అమెరికా గగనతలంలో చైనాకు చెందిన అనుమానాస్ఫద బెలూన్ ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. జనావాసాల మీదుగా ఎగురుతున్న ఈ బెలూన్ ను సముద్రం మీదకు రాగానే గత ఫిబ్రవరి 4న అమెరికా వైమానిక దళం కూల్చివేసింది. చెల్లాచెదురైన బెలూన్ భాగాలు సుమారు 11 కిలోమీటర్ల మేర సముద్రభాగంలో పడిపోయాయి. ప్రస్తుతం అమెరికాకు చెందిన ఎఫ్ బీ ఐ.. ఈ భాగాలను జాగ్రత్తగా సేకరించే పనిలో ఉంది. అయితే.. ఈ బెలూన్ ఖచ్చితంగా నిఘా బెలూనే అని అమెరికాకు స్టేట్ డిప్యూటీ సెక్రెటరీ వెండీ షెర్మన్ అమెరికా ప్రభుత్వానికి రిపోర్ట్ చేశాడు. అమెరికాతో పాటు 40 దేశాల ఎంబసీలకు ఈ బెలూన్ కు సంబంధించిన సమగ్ర వివరాలను అందజేశాడు. ఆయా దేశాలు తమ మిత్రదేశాలతో ఈ సమాచారాన్ని పంచుకోవాలని సూచించాడు.
షెర్మన్ రిపోర్ట్ లో చైనా బెలూన్ గురించి ఊహకు అందని విషయాలు ఉండటం గమనార్హం. చాలా సంవత్సరాలుగా చైనా ఇలాంటి నిఘా బెలూన్లతో అమెరికా, జపాన్, భారత్, తైవాన్ సహా చాలా దేశాల కదలికలను నిశితంగా గమనిస్తోందని రిపోర్టులో పేర్కొన్నాడు. దేశాలకు చెందిన అంతర్గత రహస్యాలతో పాటు సైన్యం కదలికలను చైనా ఎప్పటికప్పుడు స్పై బెలూన్ల ద్వారా సేకరిస్తోందన్నాడు. చైనాలోని హెయినాన్ ప్రావిన్స్ లో ఏర్పాటు చేసిన రహస్య స్థావరానికి ఈ బెలూన్ల నుంచి సేకరించిన సమాచారం వెళ్తోందనీ.. ఇక్కడే రహస్య సమాచారాన్ని విశ్లేషిస్తారనీ షెర్మన్ రిపోర్టులో పేర్కొన్నాడు. భారత్, అమెరికా, జపాన్, ఫిలిపీన్స్, తైవాన్ వంటి దేశాలకు చెందిన అత్యంత రహస్య సమాచారాన్ని ఈ స్పై బెలూన్ల ద్వారా చైనా దొంగిలించిందంటూ షెర్మన్ పేర్కొన్నాడు.
మరోవైపు అమెరికా ఈ విషయంపై చాలా కోపంగా ఉంది. అధ్యక్షుడు బైడెన్ చైనాకు సూటిగా హెచ్చరిక చేశాడు కూడా. అమెరికా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోటానికి ఏదైనా చేస్తుందని చెప్పాడు బైడెన్. చైనా తమకు వ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలు చేస్తున్నదని నిర్ధారణ జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఈ విషయంలో అమెరికా ఏమాత్రం ఆలోచించబోదనీ గట్టి హెచ్చరిక జారీ చేశాడు. కూల్చివేయబడిన బెలూన్ లో వాడిన పరికరాలను అమెరికా నిఘా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఈ భాగాలను చైనాకు తిరిగి ఇచ్చేది లేదని స్పష్టం చేసిన అధికారులు.. వాటిని ఎవరు తయారు చేశారు.. ఏ టెక్నాలజీ వాడారు అనే విషయాలను తేల్చే పనిలో ఉన్నారు.

వాడి వేడిగా అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గరమ్ గరమ్ వాతావరణం మధ్య కొనసాగుతున్నాయి. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సభ జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధి గురించి మంత్రి హరీష్ రావు వివరణాత్మకంగా మాట్లాడారు. కానీ దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రశ్నల వర్షం కురిపించారు. ఉద్యోగాల సంగతి.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల సంగతి.. ఏందో చెప్పాలంటూ ప్రశ్నించారు. దీనికి కౌంటర్ గా హరీష్ రావు ఏమాత్రం తగ్గకుండా సమాధానం ఇచ్చారు.
ఇక ఈటెల రాజేందర్ హరీష్ రావుల మధ్య ప్రశ్నలు సమాధానాలు చాలా ఆసక్తికరంగా కనిపించాయి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని చెప్పటాన్ని ఈటెల విమర్శించారు. ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి కావాల్సిన నిధులను ఇస్తుందే తప్ప ఒక రాష్ట్రం మీద కేంద్రం కక్ష కట్టిందని చెప్పటం సరికాదని హితవు పలికారు. రేపు బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో గెలిచి దేశాన్ని పరిపాలించే సందర్భం రావచ్చనీ.. అలాంటి సమయంలో నిజాయితీతో పద్ధతితో వ్యవహరించటం మంచిదనీ చెప్పారు. ఇక ఈటెల కామెంట్లకు హరీష్ రావు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార తీరును లెక్కలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. తెలంగాణకు కేంద్రం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వటం లేదన్న విషయాన్ని మరోసారి లెక్కలతో సభ ముందుంచారు. మొత్తానికి.. ప్రభుత్వ ప్రతిపక్షాల మధ్య వాడి ప్రశ్నలు, వేడి సమాధానాలతో తెలంగాణ అసెంబ్లీ ఆసక్తికరంగా సాగుతోంది.

ఇన్ స్టాలో సీక్రెట్ రివీల్ చేయనున్న కియరా-సిధ్

బాలీవుడ్ ప్రేమ పక్షులు కియరా అధ్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. మంగళవారం సాయంత్రం వీరి వివాహ వేడుక రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగ్రహ్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, కొద్ది సంఖ్యలో బంధుమిత్రులు, కొంత మంది బాలీవుడ్ స్టార్ల మధ్య ఈ ప్రేమజంట ఒక్కటైంది. నిన్న రాత్రి సంగీత్ ఫంక్షన్ లో ఆడి పాడి సరదాలు తీర్చుకున్న కియరా, సిద్ధార్థ్.. మంగళవారం సాయంత్రం వేళ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు. కానీ ఇప్పటి వరకూ కియరా గానీ సిద్ధార్థ్ గానీ వివాహం గురించిన ఏ చిన్న విషయాన్నీ ఎక్కడా చెప్పనేలేదు.
పెళ్ళి తంతు ఎలాగూ పూర్తైంది కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా రిసెప్షన్ గురించి వివరాలు పోస్ట్ చేస్తారని బాలీవుడ్ టాక్. రిసెప్షన్ ఎక్కడ జరిగేది.. ఎవరెవరు అటెండ్ అయ్యేది.. ఇలాంటి వివరాలను వీరిద్దరూ కలిసి ఇన్ స్టా లో పోస్ట్ చేస్తారట. అలాగే.. పెళ్ళి తర్వాత సుమారు 70 కోట్లు విలువ చేసే కొత్త ఇంట్లో కొత్త కాపురం స్టార్ట్ చేస్తారని కూడా బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. లస్ట్ స్టోరీస్ సినిమాతో ఒకరితో ఒకరికి ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయగా.. చాలా రోజులు వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి చర్చ జరిగింది. మొత్తానికి యువ ప్రేమ జంట ఒక్కటైందన్నమాట.

వావ్.. వాట్సాప్ లో అదిరిపోయే అప్డేట్ : లేడీస్ కు పండగే

ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్ రోజుకో అప్డేట్ తో యూజర్లను సర్ ప్రైజ్ చేస్తోంది. కొత్త సంవత్సరంలో ఇప్పటికే కొన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఫోటోలు షేర్ చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఎవరికైనా మీడియా ఫైల్స్ షేర్ చేసుకోవాలంటే ఇప్పటి దాకా దానికి ఓ లిమిట్ ఉంది. కేవలం 30 ఫోటోలు, లేదా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ సంఖ్యను 100కు పెంచింది వాట్సాప్. అంటే ఒకే సారి 100 ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. రోజంతా సెల్ఫీలు తీసుకునే లేడీస్ బ్యాచ్ కు ఇది గుడ్ న్యూసే. ఏ పని చేసినా ఓ సెల్ఫీ తీసుకొని కొంత మంది స్టేటస్ అప్డేట్ పెట్టుకుంటారు.. మరి కొంత మంది గ్రూప్స్ లేదా కాంటాక్ట్స్ కి డైరెక్ట్ గా షేర్ చేసుకుంటారు. ఇలాంటి వారికి ఇది పనికొచ్చే అప్డేట్.
ఈ ఫీచర్ మీ వాట్సాప్ వర్షన్ లో కనిపించకపోతే ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ 2.23.4.3 వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే. త్వరలోనే ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

తెలంగాణలో ఎంసెట్ సహా ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఇవే

తెలంగాణలో 2023-24 సంవత్సరానికి ఎంసెట్ తో పాటు వివిధ ఎంట్రన్స్ పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మే 7 వే తేదీ నుంచి జూన్ 1 వరకూ వివిధ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. మే 7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్ష జరగనుంది. 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అగ్రికల్చర్ మరియు ఫార్మా ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. మే 18న బీఈడీ కోర్సు కోసం నిర్వహించే ఎడ్ సెట్ పరీక్ష, మే 20వ తేదీన ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలోకి ప్రవేశించేందుకు రాసే ఈసెట్ పరీక్ష, మే 25వ తేదీన లాసెట్, పీజీ ఎల్ సెట్, మే 26, 27 తేదీల్లో ఐసెట్ పరీక్ష, మే 29 నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు తెలంగాణ పీజీఈ సెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు షెడ్యూల్ లో పేర్కొన్నారు.

వందే భారత్ తరహాలోనే వందే మెట్రో రైళ్లు : ఫుల్ డిటైల్స్ ఇవే

దేశంలో వేగవంతమైన ప్రయాణం కోసం ఇప్పటికే వందే భారత్ రైళ్లను వివిధ మర్గాల్లో అధునాతన హంగులతో… దూర ప్రాంతాలకు ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా వందే భారత్ తరహాలో వందే మెట్రో రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది భారత రైల్వే శాఖ. దేశంలో అత్యంత వేగవంతమైన ప్రయాణం చేయడానికి ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లు పట్టాలెక్కేశాయి. కీలక మార్గాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా మరిన్ని రూట్లలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. వీటికి అదనంగా వందే భారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది భారత రైల్వే శాఖ.
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనంగా వందేభారత్ తరహాలోనే వందే మెట్రో సర్వీసులను కూడా తీసుకురాబోతోంది ఇండియన్ రైల్వేస్. నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకి మినీ వెర్షనే ఈ వందే మెట్రో రైలు. ఈ ఏడాది చివరి నాటికి వందే మెట్రో డిజైన్, ప్రొడక్షన్ పూర్తి కానుంది. శివారు ప్రాంత ప్రజలను నగరాలతో కనెక్ట్ చేయడమే వందే మెట్రో సర్వీస్ లక్ష్యం. పెద్ద నగరాల చుట్టు పక్కల ప్రాంతాల్లో వందే మెట్రో సర్వీసులు తీసుకురానున్నారు. నగరాలకు రాకపోకలను సులభతరం చేసేందుకే వందే మెట్రో రైళ్లను ప్రారంభించనున్నామని, దీంతో తక్కువ సమయంలో గమ్యాన్ని చేరుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. వందే మెట్రో రూట్‌లో చిన్న స్టేషన్లు కవర్ కానున్నాయి. 60 – 70 కిలో మీటర్ల మధ్య ఉన్న పట్టణాల మధ్య ఈ వందే మెట్రో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ఉత్పత్తికి సంబంధించి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మెట్రోల ద్వారా తక్కువ సమయంలో, తక్కువ చార్జీలతో లక్షలాదిగా వివిధ గమ్యస్థానాలకు చెరుస్తున్నారు.. దీనికి ఆదర్శంగా వస్తున్న వందే మెట్రో రైళ్లు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చూడాలి.