గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రమాదం తప్పింది. గురువారం అసెంబ్లీకి హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో రాజాసింగ్ ఉపయోగించే కారు టైర్ ఊడిపోయింది. ధూల్ పేట ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. కారు తక్కువ స్పీడుతో వెళ్తుండటంతో ప్రమాదం జరగలేదు. దీంతో రాజాసింగ్ వేరే కారు తెప్పించుకొని అందులో వెళ్ళిపోయారు. కారు నడిరోడ్డుపై అలాగే ఉండిపోయింది. అయితే.. రాజాసింగ్ కారు మొరయించటం ఇది కొత్తేమీ కాదు. గతంలో రెండు సార్లు ఇలాగే కారు నడిరోడ్డుపై ఆగిపోయింది. అప్పుడు కూడా రాజాసింగ్ పరిస్థితి ఇదే. వేరే కారు తెప్పించుకొని అందులో వెళ్ళిపోయేవాడు.
ఈ కారును ప్రభుత్వమే కేటాయించిందనీ.. కారు పరిస్థితి ఏమీ బాగాలేదని ఎన్నోసార్లు తాను ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకుండా ఇదే పాత బుల్లెట్ ప్రూఫ్ కారును రిపేర్ చేయించి ఇస్తోందనీ రాజాసింగ్ పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత ఓ ఆడియో విడుదల చేసిన రాజాసింగ్.. తన కారును మార్చాలని ఎన్నిసార్లు అడిగినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదనీ.. ఇప్పటికైనా కారు మార్చాలనీ కోరారు. “ధూల్ పేటలో ఉన్న కాబట్టి ఏం కాలే.. అదే ఔటర్ రింగ్ రోడ్ మీద ఉంటే పెద్ద యాక్సిడెంట్ అయ్యేది.. ఇప్పటికైనా బండి మార్చండి.. లేకపోతే మీ బండి మీరు తీస్కోండి..” అంటూ రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తప్పిన ప్రమాదం
పాకిస్తాన్ ప్రధానికి షాకిచ్చిన టర్కీ మంత్రి
తీవ్రమైన భూకంపంతో విషాదంలో మునిగిపోయిన టర్కీ.. తన మిత్రుడిగా భావించి అతిగా ప్రేమించే పాకిస్తాన్ పై ఇప్పుడు రివర్స్ అయ్యింది. ప్రతి అంతర్జాతీయ వేదిక మీదా పాకిస్తాన్ ను వెనకేసుకురావటం.. అడిగినన్ని డబ్బులు ఆర్థిక సాయంగా ఇవ్వటం టర్కీకి అలవాటు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పాకిస్తాన్ మీద టర్కీకి కోపమొచ్చింది. భూకంపంతో కుదేలైన టర్కీని సందర్శించి పరామర్శించేందుకు వస్తానన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాద్ షరీఫ్ కు.. టర్కీ ఐటీ శాఖ మంత్రి షాకిచ్చింది. “ఇప్పుడు మీరు టర్కీకి రావాల్సిన అవసరం లేదు. మేం మా ప్రజలను ఆదుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాం. ఇలాంటి సమయంలో మీరు టర్కీకి వస్తే మీకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో మేం లేం. దాని వల్ల మాకు పెద్దగా ఉపయోగం కూడా లేదు. కాబట్టి మీరు టర్కీకి రావాల్సిన అవసరం లేదు” అంటూ ముఖంమీదే చెప్పేసింది టర్కీ ఐటీ మంత్రి మరియమ్ ఔరంగజేబ్. ట్విటర్ వేదికగా ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది సదరు మంత్రి. దీంతో పరువు పోగొట్టుకున్న పాక్ ప్రధాని.. కొన్ని అత్యవసర సమావేశాల వల్ల తన టర్కీ పర్యటన రద్దు చేసుకున్నాను అంటూ కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే పాక్ పరుగు గంగలో కలిసింది పాపం.
భూకంపంతో పెను విషాదాన్ని గుండెలమీద మోస్తున్న టర్కీకి ప్రపంచమంతా అండగా నిలిచింది. భారత్ ను ఎప్పుడూ వ్యతిరేకించే టర్కీ కోసం భారత్ కూడా భారీ సాయాన్ని ప్రకటించి మానవత్వాన్ని చాటుకుంది. టర్కీ కోసం ఆపరేషన్ దోస్త్ పేరిట ఇప్పటికే 6 సరుకు రవాణా విమానాలలో భారీ సాయాన్ని టర్కీకి చేరవేసింది భారత ప్రభుత్వం. కానీ టర్కీ తన మిత్రుడిగా భావించే పాకిస్తాన్ మాత్రం కనీసం తన ఆర్మీని టర్కీ పంపలేదు సరికదా.. కనీసం సానుభూతి వ్యక్తం చేయలేదు. పైగా.. భారత విమానాలు టర్కీకి చేరుకునేందుకు పాకిస్తాన్ గగనతలంపై నుంచి ప్రయాణించాల్సి వస్తే.. దానికి అనుమతిని నిరాకరించింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో భారత విమానాలు చుట్టూ తిరిగి టర్కీకి చేరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్తాన్ ప్రవర్తన టర్కీ నాయకత్వానికి కోపం తెప్పించింది. దీని ఎఫెక్టే.. మరియమ్ ఔరంగజేబ్ వ్యాఖ్యలు. ఏది ఏమైనా.. ఆపద వస్తే గానీ మన వాళ్ళెవరో తెలియదు అనే మాట టర్కీకి ఇప్పుడు తెలిసి వచ్చింది.
అన్నీ మాట్లాడిన మోడీ “ఆ ఒక్కటి” మాత్రం చెప్పలేదు
కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. 60 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ దేశచరిత్రలో పరిష్కారం కాని సమస్యలను సృష్టించిందే తప్ప ఒక్క సమస్యకు కూడా పరిష్కారాన్ని కనుక్కోలేదంటూ ఘాటైన విమర్శలు చేశారు. భారతదేశంలో పరిష్కారమే లేని సమస్యలు అని ముద్రపడిన వాటిని మేం పరిష్కరించాం అంటూ చెప్పుకొచ్చారు. ప్రసంగం సాగినంత సేపూ కాంగ్రెస్ పార్టీయే లక్ష్యంగా ఘాటైన విమర్శనాస్త్రాలు సంధించారు మోడీ. కానీ.. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అదానీ వివాదంపై మాత్రం మాట కూడా మాట్లాడలేదు. లోక్ సభలో అదానీ ఊసెత్తని మోడీ.. రాజ్యసభలో ఖచ్చితంగా అదానీ వివాదంపై క్లారిటీ ఇస్తారని అంతా భావించారు. కానీ అదానీ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండానే తన ప్రసంగాన్ని ముగించారు.
మోడీ ప్రసంగం మొదలైనప్పటి నుంచీ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు అడ్డుపడుతూనే ఉన్నారు. చప్పట్లు కొడుతూ నినాదాలు చేస్తూ మోడీని ప్రసంగించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సభ జరుగుతున్నంత సేపు మోడీ అదానీ భాయ్ భాయ్ అంటూ స్లోగన్స్ చేశారు. కానీ మోడీ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ప్రసంగించటం గమనార్హం. అదానీ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ సభ్యులు డిమాండ్ చేసినా దానిపై కనీసం స్పందించలేదు ప్రధాని. నెహ్రూ ఇంటిపేరును పెట్టుకోడానికి ఈ గాంధీలకు అంత భయమెందుకు అంటూ తన ఎదురుదాడి కొనసాగించారే తప్ప.. అదానీ ఊసెత్తలేదు. మొత్తానికి రాజ్యసభలో కూడా మోడీ.. అదానీ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు.
రేపే ఓటీటీలోకి సుధీర్ బాబు “హంట్”
సుధీర్ బాబు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా హంట్ ఓటీటీలో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఫిబ్రవరి 10న ఈ సినిమా అందుబాటులోకి రానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత సుధీర్ బాబు హంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. పదేళ్ళ క్రితమే హిందీలో వచ్చి ప్రేక్షకుల మెప్పు పొందిన ముంబై పోలీస్ సినిమాకు ఇది రీమేక్. అద్భుతమైన కథ, కథనాలతో ముంబై పోలీస్ సినిమా 2013లోనే మంచి హిట్ సినిమాగా నిలిచింది. సుధీర్ బాబు ఇదే సినిమా రీమేక్ లో నటించటం కాస్త చాలెంజింగ్ విషయమనే చెప్పాలి. తన స్నేహితుడైన తోటి పోలీస్ ఆఫీసర్ హత్యను ఇన్వెస్టిగేట్ చేస్తూ మధ్యలో యాక్సిడెంట్ వల్ల గతం మరిచిపోయి.. విచిత్రమైన పరిస్థితుల్లో మొత్తానికి మిస్టరీని చేదించే చాలెంజింగ్ రోల్ హీరోది. ఇలాంటి క్యారెక్టర్లో నటించిన సుధీర్ బాబు నటనకు నూటికి నూరు మార్కులు వేయొచ్చు.
సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, భరత్ నివాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు. థియేటర్లోకి వచ్చి పెద్దగా ఆదరణకు నోచుకోలేకపోయింది హంట్ సినిమా. కానీ ఓటీటీలలో యాక్షన్ థ్రిల్లర్ హవా నడుస్తున్న వేళ.. ఆహాలో హంట్ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ గా నిలుస్తుందని చెప్తున్నారు.
రాజ్యసభలోనూ అదే తీరు : కాంగ్రెస్ ను ఉతికి ఆరేసిన మోడీ
నిన్న పార్లమెంట్ లో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శించిన ప్రధాని మోడీ.. నేడు రాజ్యసభ ప్రసంగంలోనూ అదే విమర్శల ధాటి కొనసాగించారు. ఈసారి కూడా రాహుల్ గాంధీ విమర్శలను ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. పార్లమెంట్ లో కొంత మంది ప్రసంగం తమను తీవ్రంగా నిరాశకు గురి చేసిందంటూ పరోక్షంగా రాహుల్ నే టార్గెట్ చేశారు. తాను ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయానికి దేశం మొత్తం సమస్యలమయం చేసి తన ముందు ఉంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో తప్పులను ఎత్తి చూపారు. సమస్యలను సృష్టించటమే తప్ప సమస్యలకు పరిష్కారం కనుగొనటం కాంగ్రెస్ చేయలేదన్నారు. దేశం కోసం కాంగ్రెస్ పార్టీ ఖాతాను మూసివేయాల్సి వచ్చిందనీ.. ఇందుకు తమకు జాలిగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోడీ.
కాంగ్రెస్ సృష్టించిన సమస్యలను బీజేపీ ప్రభుత్వం ముగిస్తూ వచ్చిందనీ.. కోట్లాది మందికి బ్యాంకింగ్ ను, టెక్నాలజీని అందజేసింది తమ ప్రభుత్వమేననీ అన్నారు. 25 కోట్ల కుటుంబాలకు కొత్త గ్యాస్ కనెక్షన్లు అందజేసింది తామేనని ప్రకటించారు. కాంగ్రెస్ ది అబద్ధపు సెక్యులరిజం అని పేర్కొన్న మోడీ.. బీజేపీ పాటించేదే నిజమైన సెక్యులరిజం అని తేల్చి చెప్పారు. గడిచిన నాలుగేళ్ళలో 11 కోట్ల ఇళ్ళు నిర్మించి పేదలకు అందజేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేననీ.. 60 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఇలాంటి ఒక్క పనైనా చేసిందా అంటూ ప్రశ్నించారు. అందుకే దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనీ.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయమని జోశ్యం చెప్పారు మోడీ. దేశవ్యాప్తంగా 110 జిల్లాలను ఎంపిక చేసి ఆయా జిల్లాల్లో అభివృద్ధి కోసం చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు మోడీ. దీని వల్ల 3 కోట్ల మంది గిరిజనులు ప్రయోజనం పొందారని చెప్పారు.
ఆజాదీకా అమృత్ కాల్ ద్వారా పేద ప్రజలను అభివృద్ధి వైపు నడిపించే పథకాలకు తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. దేశాన్ని రక్షించే సైన్యంలో మహిళలను భాగస్వాములను చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. మోడీ ప్రసంగం కొనసాగుతున్నంతసేపు ప్రతిపక్ష పార్టీలు అదానీ మోడీ భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. మోడీ ప్రసంగిస్తున్నంతసేపు అడ్డుతగులుతూనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీ సభ్యులు. వారి గోల, నినాదాల మధ్య కూడా మోడీ తన ప్రసంగాన్ని ఆపకుండా కొనసాగించారు. అదానీ కుంభకోణంపై పార్లమెంటరీ కమిటీ వేయాలని పదే పదే ప్రతిపక్ష పార్టీల సభ్యులు డిమాండ్ చేశారు.
టర్కీ వందేళ్ళ చరిత్రలో ఇదే అత్యంత దారుణం
టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం సృష్టించిన మారణహోమంలో మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. గురువారం ఉదయం నాటికే రెండు దేశాల్లో కలిపి దాదాపు 16 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు వెల్లడించిన లెక్కల ప్రకారం టర్కీలో మృతుల సంఖ్య 12,873 కాగా, సిరియాలో 3,162 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వేలాది మంది శిథిలాల కిందే చిక్కుకొని ఉన్నారు. వారిలో 90 శాతం మంది ప్రాణాలతో ఉండే అవకాశాలు లేవని అధికారులు చెప్తున్నారు. సోమవారం తెల్లవారు జామున 7.8 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించిన తర్వాత 72 గంటల్లో 5 సార్లు దాదాపు 7.5 తీవ్రతకు తగ్గకుండా భూకంపాలు సంభవించాయి. దీంతో ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది.
వరుస భూకంపాలతో శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని కాపాడే అవకాశం కూడా లేకుండాపోవటంతో చిక్కుకున్న వాళ్ళు అక్కడే మృత్యువాత పడ్డారు. తన కళ్ళ ముందే తన 15 సంవత్సరాల కుమార్తె శిథిలాల కింద ఇరుక్కొని విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోవటంతో చనిపోయిన కుమార్తె చేయి పట్టుకొని విలపిస్తున్న ఆ తండ్రిని చూసి చూపరులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. టర్కీ, సిరియా సరిహద్దుల్లో ఎక్కడ చూసినా ఇటువంటి హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా దేశాల నుంచి సాయం అందించేందుకు ఆయా దేశాల ఆర్మీ రంగంలోకి దిగింది. సహాయ చర్యలు ముమ్మరంగా నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ఏర్పడుతున్న ప్రకంపనలు రెస్క్యూ సిబ్బందిని కూడా భయపెడుతున్నాయి. టర్కీ, సిరియా చరిత్రలో గత వందేళ్ళలో ఇంతటి విపత్తు ఎప్పుడూ సంభవించలేదని.. తాము కనీ వినీ ఎరుగని విపత్తు ఎదుర్కోవాల్సి వచ్చిందనీ.. ప్రపంచం తమకు అండగా నిలబడాలంటూ ఆయా దేశాల ప్రభుత్వాలు సాయం అర్థిస్తున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ దోస్త్ పేరిట భారత ప్రభుత్వం టర్కీకి అండగా నిలిచింది.
ఎస్ఎస్ఎల్వి-డీ 2 ప్రయోగానికి ఇస్రో సిద్ధం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరికొన్ని గంటల్లో ఈ ఏడాది తొలి ప్రయోగానికి సిద్ధమవుతోంది. అచ్చొచ్చిన వాహకనౌక ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) ద్వారా డి-2 ఉపగ్రహాన్ని శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపేందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. మరో 20 గంటల్లో శాస్త్రవేత్తలు తొలి ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ప్రయోగ నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ఇస్రో అధిపతి డాక్టర్ సోమనాథ్ ఇవాళ సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకెట్ నమూనాను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే శుక్రవారం ఉదయం 9 గంటల 18 నిమిషాలకు షార్ లో మొదటి ప్రయోగ వేదిక నుంచి చిన్న ఉప గ్రహ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగ ఏర్పాట్లు పరిశీలన, పర్యవేక్షణ కోసం ఇస్రో అధిపతి డా. డాక్టర్ సోమనాథ్ నిన్న షార్ కి చేరుకున్నారు. ప్రయోగ వేదికలోని వాహకనౌకను పరిశీలించి శాస్త్రవేత్తలకు పలు సూచనలు చేశారు
ఎస్ఎస్ఎల్వి -డీ 2 వాహకనౌక ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువుగల ఈవో ఎస్-07 ఉపగ్రహం తోపాటు… యూఎస్ఏలోని అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల బరువుగల జానూస్-1, చెన్నై స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్-2ను కక్ష్యలోకి మోసు కెళ్లనుంది. ప్రయోగ వేదిక నుంచి రాకెట్ బయలుదేరిన 15 నిమిషాల వ్యవధిలో మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. ఈవోఎస్-07కు 785 సెకన్లు, జానుస్-1 880 సెకన్లు, ఆజాదీశాట్ 900 సెకన్ల సమయం పట్టనుంది.
ఎస్ఎస్ఎల్వి డి-2 రాకెట్ ప్రయోగ నేపథ్యంలో షార్ లో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల నుంచి పలువురు శాస్త్రవేత్తలు, అంతరిక్ష పరిశోధకులు, ప్రముఖులు ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు.ఈ నేపథ్యంలో షార్ మొత్తం సిఐఎస్ఎఫ్ భద్రతా బలగాలు అధీనంలోకి తీసుకుంది. ఉపరితలం, సముద్ర మార్గంతో సహా అన్ని ప్రాంతాలలో భద్రతాధికారులు అనువణువును జల్లెడ పడుతున్నారు.పూర్తిస్థాయిలో వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాలలో అనుమానితులు, ఇతరులు కనిపించినా వారిని అదుపులోకి తీసుకొని విచారించి పంపుతున్నారు.
రేవంత్ రెడ్డి “అక్కయ్య” సెంటిమెంట్
పాదయాత్ర.. ఇది రాజకీయాల్లో చాలా కీలకమైన యాక్షన్ ప్లాన్. దేశ రాజకీయాల్లో అయినా సరే.. లోకల్ పాలిటిక్స్ లో అయినా సరే.. పాదయాత్ర రిజల్ట్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందని చెప్పటంలో సందేహం లేదు. తెలుగు రాజకీయాల్లో కూడా పాదయాత్రలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర తర్వాత పాదయాత్ర రాజకీయాలకు ఆయనే ఆద్యుడు అనే రేంజ్ లో జనంలో ముద్రపడిపోయింది. ఒకే ఒక్క పాదయాత్రతో వైఎస్ఆర్.. అధికారంలో ఉన్న చంద్రబాబు కుర్చీలో నుంచి దించేసి ఏకంగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిపోయాడు. దీంతో వైఎస్ యాత్ర ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తి అయ్యింది. ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రత్యర్థి చంద్రబాబు వారసుడు కూడా అదే స్ఫూర్తితో పాదయాత్ర మొదలుపెట్టాడు. మిగతా వాళ్ళ సంగతి పక్కనపెడితే ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా వైఎస్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. అచ్చంగా వైఎస్ ఫార్ములా మక్కీకి మక్కీ దించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది రేవంత్ రెడ్డి.
టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. కానీ తలో పాట పాడే కాంగ్రెస్ లో సింగిల్ మ్యాన్ అజెండా అంత ఈజీగా వర్కౌట్ చేయలేరు ఎవ్వరూ.. అది రేవంత్ అయినా సరే. అప్పుడెప్పుడో ప్లాన్ చేసుకుంటే ఇప్పటికి గానీ రేవంత్ పాదయాత్ర కార్యరూపం దాల్చలేదు పాపం. ఓ సారి జగ్గన్న ఎదురు తిరుగుతాడు.. మరోసారి భట్టి తిరుగుబాటు చేస్తాడు.. ఇంకోసారి ఉత్తమ్ విమర్శిస్తాడు.. ఓసారి కోమటిరెడ్డి బుంగమూతి పెట్టి అలుగుతాడు.. ఇంత మంది వ్యతిరేకుల మధ్య పాదయాత్ర కార్యరూపం దాల్చేలా చేయటం అంత ఈజీ కాదు మరి.
ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. రేవంత్ పాదయాత్ర విషయంలో వైఎస్ఆర్ సెంటిమెంట్ ను ఉన్నది ఉన్నట్టు ఫాలో అవుతున్నాడు. అప్పుడు వైఎస్ఆర్ చేవెళ్ళ చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గం నుంచే పాదయాత్ర మొదలు పెడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కయ్య సెంటిమెంట్ తో పాదయాత్ర ప్రారంభించే పనుల్లో ఉన్నాడు. ములుగు ఎమ్మెల్యే సీతక్క తన సొంత సోదరిగా చెప్పే రేవంత్ రెడ్డి.. ములుగు నుంచే పాదయాత్ర ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడట. వైఎస్ఆర్ కు కలిసి వచ్చిన సిస్టర్ సెంటిమెంట్ తనకు కూడా కలిసి వస్తుందనేది రేవంత్ నమ్మకం. టీపీసీసీలో కాంట్రవర్సీ అయిన ప్రతీసారి సీతక్క రేవంత్ కు వెన్నుదన్నుగా నిలిచింది వాస్తవమే. తన మంచి కోరుకునే సీతక్క నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తే పాజిటివ్ ఫలితం ఉంటుందేమో అన్న రేవంత్ సెంటిమెంట్ మంచిదే. కానీ.. తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి రావాలంటే.. అదీ కాంగ్రెస్ పార్టీకి అంత సులభం కాదు. పైకి ఎగబాకే పీత కాలు పట్టి మరో పీత లాగేసే కథ.. కాంగ్రెస్ కు అచ్చుగుద్దినట్టు వర్తిస్తుంది. ఇలాంటి పీతల మధ్య రేవంత్ అనే పీత పైకి ఎగబాకి ముఖ్యమంత్రి కావటం జరిగే పనేనా. ఒక వేళ నిజంగా కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినా.. పదవి లాగేసుకోటానికి అక్కడ సీఎం కుర్చీలో ఉన్నది చంద్రబాబు నాయుడు కాదు.. చంద్రశేఖర్ రావు. ఈ పాదయాత్రలూ బస్సు యాత్రలూ సార్ ముందు పనిచేయవు.
వైరల్ వీడియో : కమలా హ్యారిస్ భర్తకు ముద్దిచ్చిన బైడెన్ భార్య
మతిమరుపు చేష్టలు.. అర్థం పర్థం లేని కామెంట్లతో అప్పుడప్పుడూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇంటర్నేషనల్ హెడ్ లైన్స్ లో కనిపిస్తాడు. ఇప్పుడు ఆయన భార్య వంతు వచ్చినట్టుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బైడెన్ భార్య జిల్ బైడెన్ వీడియోనే దర్శనమిస్తోంది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ భర్త డౌ ఎమోఫ్ కు లిప్ కిస్ ఇచ్చింది వందలాది మంది చూస్తుండగా. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అమెరికా ఫస్ట్ ఉమెన్ సిటిజన్ అయిన జిల్ బైడెన్ అందరి ముందు చేసిన పనితో విమర్శలు ఎదుర్కుంటోంది. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు తమ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా.. బాధ్యత లేకుండా ఇలా ప్రవర్తించి దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళు.. అంటూ జనం తిట్టి పోస్తున్నారు. మంగళవారం క్యాపిటల్ హిల్ లో స్టేట్ ఆఫ్ ది యూనియన్ సమావేశం ముగిసిన తర్వాత జరిగింది ఈ ఘటన.
వెస్టర్న్ కల్చర్ లో లిప్ కిస్ పెద్ద ఘోరమైన విషయమేమీ కాదు. తమ ప్రేమను వ్యక్తీకరించే ఒక సైన్ గా మాత్రమే లిప్ కిస్ ను చూడాల్సి ఉంటుంది కొన్ని సార్లు. కానీ ప్రతి సందర్భంలోనూ ఇది ఏమాత్రం సరిపోయే భావ వ్యక్తీకరణ పద్ధతి మాత్రం కాదు. ప్రేమ లేదా అభిమానాన్ని ఎక్స్ ప్రెస్ చేయాలంటే ఎన్నో మార్గాలుంటాయి.. అదీ పెద్ద పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారికి చాలా తక్కువ మార్గాలుంటాయన్న విషయాన్ని వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది, లేకపోతే ఇలాగే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అమెరికాలో ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో.. అదీ డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడెప్పుడు బైడెన్ బుక్ అవుతాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఇలా నిజంగానే బుక్కయ్యారు బైడెన్ దంపతులు.
కాంగ్రెస్, రాహుల్ గాంధీని ఏకి పారేసిన మోడీ
పార్లమెంట్ సమావేశాల్లో బుధవారం నాడు ప్రసంగించిన ప్రధాని మోడీ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీనీ ఎడా పెడా ఏకి పారేశారు మోడీ. నిన్న పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రసంగం మొత్తాన్ని గుర్తు పెట్టుకొని మరీ ఒక్కో ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పారు. 2004 నుంచి 2014 వరకు ఆ పదేళ్ళ సమయాన్ని భారతదేశం కోల్పోయింది అంటూ భారీ వ్యాఖ్యలు చేశారు. ఆ పదేళ్ళలో జరిగిన అభివృద్ధి ఏమిటో అందరికీ తెలుసన్న మోడీ.. కోట్లాది మంది మహిళలు గ్యాస్ కనెక్షన్లు, కనీసం మరుగుదొడ్లు లేక అవస్థలు పడుతున్నా.. వారికి సాయం చేయలేకపోయిందని మండిపడ్డారు. దేశంలోని మహిళలకు కావాల్సినవి తాము ఇచ్చామన్న మోడీ.. ఇది కాంగ్రెస్ పార్టీకి నచ్చటం లేదన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగిన అభివృద్ధి పాపం రాహుల్ కు కనిపించటం లేదన్నారు.
తాము అధికారంలోకి వచ్చిన కొత్తలో భారతదేశానికి ప్రపంచ దేశాలు గౌరవం ఇవ్వటం లేదనీ.. ప్రపంచం ముందు భారత్ స్థాయి దిగజార్చారనీ మొత్తుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు పక్క దేశాలను భయపెట్టి ఒప్పందాలు చేసుకుంటున్నదంటూ మొదలుపెట్టారని మోడీ అన్నారు. కానీ.. గుర్తింపు లేని దశ భారతదేశం ఇప్పుడు ప్రపంచాన్ని ప్రభావితం చేసే దశకు చేరుకుందన్న విషయం రాహుల్ కు అర్థం కాలేదా అని ప్రశ్నించారు. “దమ్ముంటే కశ్మీర్ లో జెండావందనం చేసి చూపించండి అంటూ తీవ్రవాదులు పోస్టర్లు వేసేవాళ్ళు.. ఇప్పుడు మన సైనికులు కశ్మీర్ వీధుల్లో జెండా ఎగురవేస్తున్నారు.. ఇప్పుడు ఎవరైనా సరే సంతోషంగా కశ్మీర్ పర్యటించి రావచ్చు.. ఇది అభివృద్ధి కాదా.. 2004 నుంచి 2014 వరకు ఎన్నిసార్లు దేశవ్యాప్తంగా తీవ్రవాదులు దాడులు చేశారు.. ఇప్పుడు అదే పరిస్థితి ఉందా.. ఇది అభివృద్ధి కాదా.. ప్రపంచ దేశాల్లో పెట్రోల్, గ్యాస్, ఆహార ధరలు ఎలా ఉన్నాయి.. మన దగ్గర ఎలా ఉన్నాయి.. మన పక్క దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లలో పరిస్థితి ఎలా ఉంది.. భారత్ లో ఎలా ఉంది.. ఇది అభివృద్ధి కాదా..?” అంటూ ఉగ్రరూపం దాల్చారు మోడీ.
“కరోనా సమయంలో ప్రపంచ దేశాలకు భారత్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇచ్చింది.. గత తొమ్మిదేళ్ళలో ఎన్నో అంతర్జాతీయ ప్రాజెక్టులు భారత్ ను వెతుక్కుంటూ వచ్చాయి. ఎన్నో విషయాల్లో భారత్ చివరి స్థానం నుంచి మొదటి స్థానాలకు ఎగబాకింది. ఒక జీబీ డేటా కోసం తొమ్మిదేళ్ళ కింద జనం ఎంత ఖర్చు చేశారు.. ఇప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నారో ఆలోచిస్తే టెక్నాలజీలో భారత్ ఎంత ముందుకు వెళ్ళిందో అర్థమవుతుంది. 5జీ టెక్నాలజీని కాంగ్రెస్ కనీసం ఊహించగలదా.. దేశంలోని తల్లులు, చెల్లెళ్ళు మోడీపై నమ్మకం ఉంచారు.. ఆ నమ్మకం టీవీ, పేపర్ ప్రకటనలతో రాలేదు.. కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి వల్ల వచ్చింది.. ఆ నమ్మకం మీ అబద్ధపు ఆరోపణల వల్ల పోదు.. వచ్చే దశాబ్ధం భారతదేశానిదే. త్వరలో ప్రపంచ నెంబర్ వన్ స్థానంలో భారత్ ఉంటుంది..!” అంటూ మోడీ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు.