Home Blog Page 5

వాగ్నర్ గ్రూప్ నాశనాన్ని ఆపింది నేనే-లుకషెంకో

ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా సైన్యానికి అండగా ఉంటూ వచ్చిన వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. పుతిన్ పై తిరుగుబాటు ప్రకటించిన మరుసటి రోజే ప్రిగోజిన్ రష్యాకు వ్యతిరేకంగా పోరాడాలనే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. పుతిన్ ను అధ్యక్ష పీఠం నుంచి దింపేస్తానంటూ తొలుత ప్రకటించిన ప్రిగోజిన్.. ఆ మరుసటి రోజే తాను మాస్కోకు వ్యతిరేకంగా వెళ్ళాలని భావించటం లేదని.. అలాగే తాను యుద్ధ క్షేత్రం నుంచి వైదొలగుతున్నాననీ ప్రకటించి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తాజాగా బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో దీనిపై స్పందించాడు. ప్రిగోజిన్ తిరుగుబాటు ప్రకటించిన సమయంలో వాగ్నర్ గ్రూపు మొత్తాన్ని ప్రిగోజిన్ తో సహా నాశనం చేయాలని పుతిన్ నిర్ణయించుకున్నాడనీ.. తానే బలవంతంగా పుతిన్ ను శాంతపరిచి వాగ్నర్ గ్రూపును మరియు ప్రిగోజిన్ ప్రాణాలతో ఉండేలా పుతిన్ ను ఒప్పించాననీ వెల్లడించాడులుకషెంకో.

ఉక్రెయిన్ లోని బఖ్ముత్ ను చేజిక్కించుకునే క్రమంలో రష్యా సైన్యంతో కలిసి వాగ్నర్ గ్రూప్ సైనికులు వీరోచితంగా పోరాడారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ సైన్యాన్ని ఎదుర్కోవటంలో వాగ్నర్ గ్రూపు ముఖ్య పాత్ర పోషించింది. కానీ.. అదే యుద్ధం సమయంలో రష్యా సైన్యం తమకు కావాల్సినన్ని ఆయుధాలు ఇవ్వకుండా తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రిగోజిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చాలా రోజులుగా యుద్ధంలో తమకు కావాల్సిన సహాయ సహకారాలను రష్యా రక్షణ మంత్రి కావాలనే అడ్డుకుంటున్నాడని ప్రిగోజిన్ కోపంతో ఉన్నాడు. ఈ క్రమంలో బఖ్ముత్ ను చేజిక్కించుకున్న తర్వాత వాగ్నగ్ అధినేత ఇక రష్యా సైన్యానికి మద్దతుగా పోరాడ కూడదని నిర్ణయించుకొని పుతిన్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామం సంచలనం సృష్టించగా.. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో ఎట్టకేలకు ఈ ఘర్షణను నివారించగలిగాడు. ప్రస్తుతం ప్రిగోజిన్ బెలారస్ లోనే ఉన్నాడని కూడా లుకషెంకో ప్రకటించాడు.

షర్మిళ కాంగ్రెస్ లోకి వస్తే రేవంత్ పొజిషన్ ఏంటి..? ఇదేనా ?

0

వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ కొత్త పార్టీని స్థాపించి తెలంగాణలో రాజకీయం మొదలుపెట్టింది షర్మిళ. రాజన్న బిడ్డగా తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతాననీ.. రాజన్న రాజ్యం తెస్తాననీ పదే పదే చెప్పే షర్మిళ.. కొద్ది రోజులుగా సైలెంట్ అయిపోయి తెరవెనుక రాజకీయాలకే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. కొద్ది రోజులుగా ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నదంటూ వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. దీనిపై షర్మిళ కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వటం లేదు. నిన్న ట్విటర్ ఓ ప్రకటన చేసిన షర్మిళ.. తాను తెలంగాణ బిడ్డగానే ఉంటానని చెప్పిందే తప్ప పార్టీ విలీనంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవలే ఆమె కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలవటం.. రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పటం.. ఇలా కొద్దికొద్దిగా కాంగ్రెస్ కు దగ్గరగా వెళ్ళినట్టు కనిపిస్తోంది. తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ రెబల్ నాయకులు పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించటం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మళ్ళీ సొంత గూటికి వచ్చేస్తారంటూ వార్తలు రావటం.. ఇలా కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిళ కూడా తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం ఖాయంగా కనిపిస్తోంది. పైకి షర్మిళ అదేమీ లేదని చెప్తున్నా.. తెరవెనుక పరిణామాలు మాత్రం వేరే ఉన్నాయి.

అయితే.. తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతానంటూ శపథం చేసిన షర్మిళ.. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అందరికంటే ఎక్కువగా ఇబ్బంది పడేది రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎవరికి వారు సొంత పెత్తనం చేసే కాంగ్రెస్ పార్టీలో.. షర్మిళ వస్తే కొత్త పెత్తనం వచ్చినట్టే. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న నేతలంతా ఒకప్పుడు వైఎస్ఆర్ అధ్యక్షతన పనిచేసిన వాళ్ళే. ఇదే రేవంత్ రెడ్డికి వచ్చిన చిక్కు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలంతా వైఎస్ఆర్ తో కలిసి పనిచేసిన వాళ్ళే.. ఒక్క రేవంత్ రెడ్డి తప్ప. ఆ సమయంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుతో పాటు రాజకీయం చేశాడు. కానీ ఇప్పుడు.. ఒకప్పుడు వైఎస్ఆర్ నడిపించిన అదే పార్టీని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు. ఇప్పుడు పిక్చర్ లోకి సడన్ గా షర్మిళ వస్తే.. పరిస్థితి గందరగోళంగా మారుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడికి సమానంగా మరో నేత ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పటికే సీనియర్లతో రోజుకో తలనొప్పిని ఎదుర్కుంటున్న రేవంత్ రెడ్డికి ఇంకో కొత్త తలనొప్పి వచ్చి పడినట్టే. వి హనుమంతరావు, జగ్గారెడ్డి లాంటి నాయకులు రేవంత్ రెడ్డి అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఆ స్థానంలో షర్మిళను కూర్చోపెట్టాలని కొత్త పాట పాడినా ఆశ్చర్యం లేదు. వీళ్ళకు సడన్ గా వైఎస్ఆర్ పై వల్లమాలిన ప్రేమ పుట్టుకురాదనది చెప్పటానికి లేదు.. ఆ ప్రేమ రేవంత్ రెడ్డి మెడకు పాశంగా మారదని చెప్పటానికిీ లేదు. షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి రావటంపై ఇదివరకే రేేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చాడు. ఆమె పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామనీ.. కానీ పెత్తనం చేస్తానంటే మాత్రం కుదరదనీ తనలో ఎక్కడో దాగున్న భయాన్ని బట్టబయలు చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. సో.. ఖమ్మం జిల్లా నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావటం.. వెళ్ళిపోయిన రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులు రీ ఎంట్రీ ఇవ్వటం.. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవటం.. ఇవన్నీ రేవంత్ కు ఎంత సంతోషాన్ని ఇస్తాయో.. వైఎస్ షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి రావటం అంతకు వంద రెట్లు భయాన్ని, టెన్షన్ ను ఇస్తాయనేది వాస్తవం.

ఎమర్జెన్సీ మూవీ టీజర్ : టెన్షన్ పడుతున్న కంగనా

0

ఎమర్జెన్సీ.. భారతదేశ చరిత్రలో ఓ చికటి అధ్యాయంగా విశ్లేషకులు చెప్తారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వాన్ని నడిపిస్తున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎమర్జెన్సీ విధించి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందనేది చరిత్ర చెప్పే నిజం. ప్రతిపక్ష నాయకులను జైళ్ళలో వేయటం.. తిరుగుబాటు చేసిన వారిని పోలీసుల చేత కాల్చి చంపించటం.. ఇంకా ఎన్నో ఎన్నో ఘోరాలు ఎమర్జెన్సీ సమయంలో ఈ దేశంలో జరిగాయి. అయితే.. ఎప్పుడూ ఏదో వివాదాన్ని వెంట బెట్టుకునే బాలీవుడ్ నటి కంగణ.. ఇప్పుడు ఇదే ఇతివృత్తంతో ఎమర్జెన్సీ అనే సినిమాను తెరకెక్కిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను సినిమా యూనిట్ విడుదల చేసింది. అచ్చు గుద్దినట్టు ఇందిరా గాంధీలాగానే కనిపిస్తోంది ఈ టీజర్ లో కంగణ రనౌత్. ఎమర్జెన్సీ విధించబడిన సమయంలో అసలు ఏం జరిగింది అనే దానిపై సినిమా కథ నడుస్తున్నదని టీజర్ చూడకపోయినా అర్థం చేసుకోవచ్చు.. కానీ సినిమా కథలో ఎమర్జెన్సీని బలపరుస్తూ చూపించారా లేక ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ చూపించారా అనేది మాత్రం అర్థం కాలేదు.

1975 ఆగస్ట్ లో భారతదేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రధాని ఇందిర నిర్ణయం తీసుకోవటాన్ని టీజర్ లో చూపించారు. వార్తల్లోని హెడ్ లైన్స్ లో ఇందిరపై విమర్శలు రావటం.. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన పరిణామాలు.. ఇలా టీజర్ లో కనిపిస్తున్నాయి. ఇందిర అంటే భారత్.. భారత్ అంటే ఇందిర.. అంటూ కంగన డైలాగ్ ఇంట్రస్టింగ్ గా ఉంది. నవంబర్ 24న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎమర్జెన్సీ సినిమాకు నిర్మాత, డైరెక్టర్ అన్నీ కంగణానే. ఈ సినిమా కోసం తన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వచ్చిందంటూ చెప్తోంది కంగణ. ఈ సినిమాపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందనీ.. ఈ సినిమానే తనకు లైఫ్ ఆండ్ డెత్ సమస్య అనీ స్టేట్మెంట్ ఇచ్చింది. టీజర్.. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేయటంలో సక్సెస్ అయ్యింది.. సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

వైరల్ : మోడీ కాళ్ళకు నమస్కరించిన అమెరికన్ సింగర్

భారత ప్రధాని మోడీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా మోడీ పేరు మార్మోగిపోతోంది. ఎప్పుడూ జరగని విచిత్రమైన సన్నివేశాలు ఈ సందర్భంగా మనకు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జీ20 సదస్సు సందర్భంగా మోడీని ఆహ్వానించేందుకు వచ్చిన పాపువా న్యూ గినియా అధ్యక్షుడు జేమ్స్ మరాపే మోడీ పాదాలను తాకిన వీడియో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అచ్చంగా అలాంటి సంఘటన మరొకటి చోటు చేసుకుంది. మోడీ అమెరికా పర్యటన ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు వేడుకలో పాల్గొన్న అమెరికన్ సింగర్ మేరీ మిలిబెన్.. మోడీ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నది. వేడుకలో జాతీయ గీతం ఆలపించిన అనంతరం మోడీ వద్దకు వచ్చి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

పాపువా న్యూ గినియా దేశంలో మెజార్టీ జనం క్రిస్టియానిటీని ఆచరిస్తారు. జేమ్స్ మరాపే కూడా క్రైస్తవుడే.. అలాంటప్పుడు హిందువుల సాంప్రదాయమైన పాదాలకు నమస్కరించటం ఏమిటని మరాపేపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ సమయంలో.. తాను మతపరంగా క్రైస్తవుడిని అయినా.. హిందూ మతానికి, భారత ప్రధానమంత్రి మోడీకి అభిమానిని అంటూ సమాధానం చెప్పాడు మరాపే. ఇప్పుడు అమెరికాలో మోడీ కాళ్ళకు నమస్కరించిన సింగర్ మేరీ మిలిబెన్ కూడా క్రైస్తవ మతానికి చెందినామే. కానీ.. భారత దేశం అన్నా.. భారతీయుల ఆచార వ్యవహారాలన్నా ఈమెకు మక్కువ ఎక్కువ. గతంలోనే భారత జాతీయ గీతాన్ని ఆలపించి భారతీయులను ఆకట్టుకుంది. అమెరికా అధ్యక్షుడి ముందు అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించటం ఎంత గౌరవంగా భావిస్తానో.. మోడీ ముందు భారత జాతీయ గీతాన్ని ఆలపించటాన్ని కూడా అంతే గౌరవంగా తాను భావిస్తాననీ.. మోడీని కలవటం మరిచిపోలేని సంఘటన అని చెప్పింది. మేరీ మోడీ పాదాలను తాకిన వీడియోను అమెరికాలోని వార్తా సంస్థలు ట్వీట్ చేయగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో.

వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు : పుతిన్ కు షాక్

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు గడ్డుకాలం మొదలైనట్టు కనిపిస్తోంది.. 30 సంవత్సరాలుగా తనకు వెన్నుదన్నుగా నిలిచిన వాగ్నర్ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్.. ఇప్పుడు పుతిన్ పై తిరుగుబాటు చేసినట్టు అంతర్జాతీయ మీడియా కథనాలు చెప్తున్నాయి. పుతిన్ కు రక్షణ కవచంలా ఉండే రష్యాలోని ప్రైవేటు సైన్యం అయిన వాగ్నర్ గ్రూప్ కు అధిపతి అయిన ప్రిగోజిన్.. ఇకపై రష్యా అధ్యక్షుడికి అనుకూలంగా పనిచేయబోనని తేల్చిచెప్పినట్టు ఈ కథనాల సారాంశం. ఉక్రెయిన్ పై రష్యా కొనసాగిస్తున్న యుద్ధంలో వాగ్నర్ గ్రూప్ కీలక పాత్ర పోషిస్తున్నది. రష్యన్ ఆర్మీకి కావాల్సిన ఇంటలిజెన్స్ సమాచారాన్ని సేకరించి గైడ్ చేయటంతో పాటు యూరప్, అమెరికా దేశాల రక్షణ శాఖ అంతర్గత వ్యవహారాలను గూఢచర్యం ద్వారా తెలుసుకోవటంలో కూడా కేజీబీ మరియు వాగ్నర్ గ్రూప్ దే కీలక పాత్ర. ఉక్రెయిన్ లోని బఖ్ముత్ ను చేజిక్కించుకునే సమయంలో ఉక్రెయిన్ సైన్యంతో రష్యా సైన్యం పోరాటంలో వెనుకపడిపోయింది.. సరిగ్గా అప్పుడే వాగ్నర్ గ్రూప్ సైన్యం ఉక్రెయిన్ సైన్యాన్ని మట్టుబెట్టి బఖ్ముత్ ను రష్యా చేజిక్కించుకునేలా చేసింది. ఇదొక్కటే కాదు.. రష్యా కోసం ఏ పనైనా చేయటానికి వాగ్నర్ గ్రూప్ సిద్ధంగా ఉంటుంది.
గతంలో క్రిమియాను రష్యా చేజిక్కించుకోవటంలో కూడా సాయం చేసింది వాగ్నర్ గ్రూప్ సైన్యమే.

ప్రపంచంలో ఏ దేశ సైన్యం కూడా ఎదుర్కోలేనంత శక్తివంతంగా వాగ్నర్ గ్రూప్ సైన్యం ఉంటుందని చెప్తారు. అయితే.. నిజానికి వాగ్నర్ గ్రూప్ పేరుతో రష్యాలో ఏ సంస్థ కూడా రిజిష్టర్ కాలేదు. కేవలం చీకటి కార్యకలాపాలు చేయటానికే ఈ గ్రూపు పుట్టిందని అమెరికా నమ్ముతుంది. వివిధ దేశాల ఇంటలిజెన్స్ వ్యవస్థలతో వాగ్నర్ గ్రూప్ లోని సైనికులకు సంబంధాలు ఉంటాయట. స్పై సినిమాల్లో చూపించినట్టు.. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లోకి ప్రవేశించి అక్కడ జరిగే వాటిని గురించి తెలుసుకొని సమాచారం సేకరించి పుతిన్ కు అందజేస్తారట వాగ్నర్ సైనికులు. పుతిన్ కూడా రష్యా అధ్యక్షుడు కాకముందు పనిచేసింది గూఢచారిగానే. రష్యా గూఢచారి సంస్థ కేజీబీలో అత్యంత కీలక పదవిలో పుతిన్ పనిచేశాడు. ఇప్పుడు వాగ్నర్ గ్రూప్ కనుక రష్యాకు వ్యతిరేకంగా పనిచేయటం మొదలుపెడితే పుతిన్ కు కష్టకాలం మొదలైనట్టే. ఉక్రెయిన్ పై యుద్ధంతో ఆర్థికంగా పతనమైన రష్యా.. ఇప్పుడు తీవ్రమైన ఆయుధ కొరతతో సతమతమవుతున్నది. మిత్రదేశాల నుంచి ఆయుధ సాయం కోరే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వాగ్నర్ గ్రూప్ పుతిన్ కు సహకరించకపోతే ఈ యుద్ధంలో పుతిన్ ఓటమి తప్పదు. అయితే.. పుతిన్ ఓటమిని అంగీకరించే వ్యక్తిత్వం ఉన్నవాడు కాదు.. అవసరం అయితే తన సైన్యంతో అణుబాంబు ప్రయోగానికైనా పుతిన్ వెనుకాడడు గానీ.. ఓడిపోయి అమెరికాకు లొంగిపోవటాన్ని పుతిన్ సహించలేడు. అంటే.. తదుపరి పరిణామాలు కేవలం వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ చేతిలో ఉన్నాయన్నమాట. ఎందుకంటే.. పుతిన్ కనుక అణుదాడి నిర్ణయం తీసుకుంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి మొదటిమెట్టు అవుతుంది.

చరిత్ర సృష్టించిన మోడీ : భారత్ భవిష్యత్ మారనుంది

0

ప్రపంచ వేదికపై భారత కీర్తి పతాకం రెపరెపలాడుతోంది.. అగ్రదేశం అమెరికా మోడీ మేనియాతో ఊగిపోతోంది.. భారత్ అమెరికా చరిత్రలోనే ఎన్నడూ ఊహించని కీలకమైన ఒప్పందాలు కార్యరూపం దాల్చాయి.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన భారత చరిత్రలో మైలురాయిగా నిలిచిపోనుంది. న్యూయార్క్‌లో ఎన్నారైల ఘన స్వాగతం దగ్గర నుంచి వాషింగ్టన్‌లో బైడెన్ వెల్‌కమ్ చెప్పిన తీరు.. ఇద్దరు అగ్రనేతల ప్రెస్‌మీట్‌‌.. ప్రతిష్టాత్మక అమెరికా కాంగ్రెస్‌లో హిస్టారికల్ ప్రసంగం.. వీటన్నింటికీమించి ఇరు దేశాల మధ్య అతి కీలకమైన నాలుగు ఒప్పందాలు.. ఇలా ఒక్కటేంటి ? చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నో.. అన్నట్టుగా సాగింది మోడీ అమెరికా పర్యటన. ఈ పర్యటన ఆధ్యంతం ఇరు దేశాల మైత్రిని మరో స్థాయికి తీసుకెళ్లేలానే సాగింది. వాస్తవానికి.. ప్రధాని అమెరికా పర్యటన ఖరారయిన తర్వాత కొన్ని ప్రశ్నలతోపాటు, మరికొన్ని వివాదాలపైన కూడా చర్చ జరిగింది. దీనికి కారణం మోడీ పర్యటనకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ అమెరికాలో పర్యటించడం.. ఆ తర్వాత భారత్‌లో ప్రజాస్వామ్యంపై ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లాంటి పరిణామాలే. వీటన్నింటిపై స్పందించాల్సివస్తే మోడీ రియాక్షన్ ఎలా ఉంటుందనే ప్రశ్నలు కాస్త గట్టిగానే వినిపించాయి. అలాంటి ప్రశ్నలకు, వివాదాలకు భారత ప్రధాని తన మాట తోనే బదులిచ్చారు.

మోడీ అమెరికా పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలను కీలకంగా భావించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలతో శత్రుత్వం, భారత్‌తో పాటు ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు.. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారం అవసరం చాలానే ఉంది. తాజా ఒప్పందాల్లో అగ్రస్థానం కూడా అలాంటి రక్షణ ఒప్పందాలదే. గగనతలంలో శత్రుదేశంపై పైచేయి సాధించేందుకు మెరుపువేగంతో దూసుకెళ్లి దాడి చేసే యుద్ధవిమానాలు అవసరం. ఆ విమానాలకు అపార శక్తిని సరఫరాచేసే జెట్‌ ఇంజన్లే గుండెకాయ. అలాంటి అత్యంత అధునాతన ఎఫ్‌414 జెట్‌ ఇంజన్లను భారత్‌ లోనే తొలిసారిగా తయారుచేసేందుకు మార్గం సుగమమైంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఇది సాధ్యమైంది. ఈ మేరకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ ఏరోస్పేస్, భారత్‌కు చెందిన హిందుస్తాన్ ఎరోనాటిక్స్ మధ్య డీల్ ఫిక్స్ అయింది. భారత వాయుసేనకు చెందిన అధునాతన తేలికపాటి ఫైటర్ జెట్ తేజస్‌లో శక్తివంత ఎఫ్‌414 ఇంజన్లను అమర్చుతారు. ఈ ఇంజన్లను భారత్‌లోనే తయారుచేస్తామని జీఈ ప్రకటించింది. జెట్ ఇంజిన్ల డీల్‌పై ఇంకాస్త డెప్త్‌కు వెళితే.. ఎఫ్‌414 ఇంజిన్‌ పనితీరుతో ఏదీ సాటిరాదు. ఎఫ్‌414–ఐఎన్‌ఎస్‌6 ఇంజన్ల ఉమ్మడి తయారీ భాగస్వామ్యంతోపాటు అడ్వాన్స్‌డ్‌ మీడియా కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్ ఎంకే2 ఇంజన్‌ ప్రోగ్రామ్‌ కోసం భారత్‌తో జీఈ కలిసి పనిచేస్తాయి. ప్రస్తుతం భారత వాయుసేన తేలికపాటి 88 యుద్ధ విమానాల కోసం హాల్‌.. జీఈ 404 ఇంజన్లనే దిగుమతి చేసుకుని వాటికి అమర్చుతోంది. ఇకపై శక్తివంత ఎఫ్‌414 ఇంజన్ల సామర్థ్యంతో గగనతలంలో భారత వాయుసేన సత్తా మరింత ఇనుమడించనుంది.

ఇన్నాళ్లూ రష్యా, యూరప్ దేశాల నుంచే యుద్ధవిమానాలను కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న భారత్‌ ఇప్పుడు అమెరికా దిగ్గజ సంస్థతో తయారీ ఒప్పందం కుదుర్చుకోవడం భారత ఆయుధ మార్కెట్‌ను కూడా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది. దీని తర్వాత మరో మూడు కీలక ఒప్పందాలు కూడా జరిగాయి. ఇరుదేశాల నడుమ మారీటైమ్ ఒప్పందం కూడా ఫైనల్ అయింది. ఈ ఒప్పందం ప్రకారం ఆసియా ప్రాంతంలో సంచరించే అమెరికా నావికాదళం నౌకలకు ఒకవేళ మరమ్మత్తులు అవసరమైతే.. మన దేశంలోని షిప్ యార్డుల్లో ఆగవచ్చు. అలాగే మరమ్మత్తులు కూడా చేసుకోవచ్చు. ఈ పరిణామం చైనాకు షాక్ ఇచ్చేదే. ఎందుకంటే ఇండో-పసిఫిక్‌లో డ్రాగన్ ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో అమెరికా-భారత్ నేవీ సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు మరింత వీలవుతుంది.మరో కీలక ఒప్పందం విషయానికొస్తే.. సముద్రాలపై నిఘా కోసం అమెరికా మోస్ట్ అడ్వాన్స్‌డ్ డ్రోన్ భారత్‌కు రాబోతోంది. ఆర్మ్‌డ్‌ ఎంక్యూ–9బీ సీ గార్డియన్‌ డ్రోన్లను అమెరికా నుంచి భారత్‌ కొనుగోలు చేసేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇటువంటి సాయుధ డ్రోన్‌లకు ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయి. ఫైటర్‌ జెట్‌లు చేయగలిగే పనులు.. అంటే శత్రు లక్ష్యాలపై క్షిపణులతో దాడి చేయడం, మందు గుండు సామగ్రితో విధ్వంసం సృష్టించడం వంటి పనులను ఈ డ్రోన్లు ఈజీగా చేస్తాయి. అలాగే, వీటి నిఘా సామర్థ్యం అసాధారణంగా ఉంటుంది. ఈ డ్రోన్లలోని సాయుధ రకాల్లో హెల్‌ఫైర్ క్షిపణులు అమర్చి ఉంటాయి.

అమెరికాకు చెందిన చిప్‌ తయారీ కంపెనీ మైక్రాన్ గుజరాత్‌లో సెమీ కండక్టర్ల తయారీ, పరీక్షల ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 800 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు లైన్ క్లియర్ అయింది. తద్వారా చిప్ మార్కెట్‌లోనూ ఇండియా కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటికే ఈ మార్కెట్‌లో కింగ్ లాంటి కంట్రీ తైవాన్‌.. తమ ఉత్పత్తులను ఇండియాలో చేయాలని భావిస్తోంది. ఇలాంటి సమయంలో తన మిత్ర దేశం అమెరికా చేసుకున్న ఒప్పందం తైవాన్‌కు మరింత బూస్టింగ్ ఇచ్చేదే. వీటితోపాటు అమెరికాలో ఉన్న భారతీయులకు కూడా మోడీ. బైడెన్‌లు గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై హెచ్1-బి వీసాలు అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. ఇవి మాత్రమే కాదు మరికొన్ని బిగ్ డీల్స్ కూడా ఇరు దేశాల మధ్య జరిగాయి.మోడీ అమెరికా పర్యటనను కేవలం ఒప్పందాల కోణంలోనే చూడలేం. ఈ పర్యటనలో అంతకుమించిన అంశాలు చాలానే ఉన్నాయి. ప్రధాని అమెరికా వెళ్లేకొద్దిరోజులకు ముందు భారత ప్రజాస్వామ్యంపై పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. మోడీ కంటే ముందు అమెరికాలో పర్యటించిన రాహుల్ గాంధీ భారత్‌లో మైనారిటీలు నిస్సహాయస్థితిలో ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో మోడీ దేవుడికి కూడా పాఠాలు చెప్పగలరు అంటూ సెటైర్లు వేశారు. మోడీపై సెటైర్లు ఎలా ఉన్నా మైనారిటీ లు నిస్సహాయస్థితిలో ఉన్నారన్న రాహుల్ మాట అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత వివాదం సద్దుమణిగింది అనుకునేలోపు ట్విట్టర్ మాజీ సీఈవో భారత్‌లో ప్రజాస్వామ్యంపై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనల సమయంలో తమను బెదిరించారనీ, ఇదీ ప్రజాస్వామ్య భారత్ అంటూ ఎద్దేవా చేశారు. దీనికి కాంగ్రెస్ నేతలు మద్దతుగా నిలవడంతో మరోసారి కమలం వర్సెస్ కాంగ్రెస్ వార్ నడిచింది. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే మోడీ అమెరికా ఫ్లైట్ ఎక్కారు.

మోడీ అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత కూడా భారత్‌లో ప్రజాస్వామ్యంపై చర్చ జరిగింది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన దాదాపు 75 మంది ఎంపీలు బైడెన్‌కు లేఖ రాశారు. భారత్‌లో మైనారిటీలపై వేధింపులు, మానవహక్కుల ఉల్లంఘన వంటి అంశాలను లేవనెత్తి, ప్రశ్నించాలని బైడెన్‌ను కోరారు.
మరో ఇద్దరు ఎంపీలు ఇల్హాన్ ఒమర్, రషీదా త్లాయిబ్ అయితే అమెరికా కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అదికూడా.. భారత్‌లో మైనారిటీల అణచివేతకు నిరసనగా అని ప్రకటించి మరీ.. సరిగ్గా ఇలాంటి సమయంలో వైట్‌హౌస్ నుంచి ఓ సంచలన ప్రకటన వచ్చింది. ఇద్దరు అగ్రనేతలు ప్రెస్‌మీట్ నిర్వహిస్తారనీ, అమెరికా నుంచి ఓ ప్రశ్న, భారత్ నుంచి ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తారని ఆ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రెస్‌మీట్‌లో మోడీకి ఎదురైన ప్రశ్నకూడా భారత్‌లో ప్రజాస్వామ్యం గురించే. మైనారిటీల హక్కులను మెరుగుపరచడానికి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని ఓ పాత్రికేయుడు ప్రశ్నించారు. దానికి మోడీ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుశా?
“మనమంతా ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యం మన రక్తంలో నిండిపోయింది. దానినే మనం శ్వాసిస్తున్నాం. అది మన రాజ్యాంగంలోనే ఉంది. మానవ విలువలు, హక్కులు లేకపోతే.. ప్రజాస్వామ్యం అనేదే ఉండదు. మనం ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నప్పుడు.. వివక్ష అనే ప్రశ్నే ఉండదు’ అని ప్రధాని స్పష్టం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్, సబ్‌ కా విశ్వాస్‌ అనే నినాదం మీదే తమ ప్రభుత్వం నడుస్తోందని కుండబద్దలు కొట్టేశారు. మతం, కులం, వయసు, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్ని విమర్శలకూ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత బైడెన్ దంపతుల ఆతిధ్యం.. అనంతరం హిస్టారికల్ మూమెంట్.. అమెరికా కాంగ్రెస్‌లో ప్రసంగం జరిగాయి. సుదీర్ఘ సమయం సాగిన ఈ ప్రసంగం అయితే మోడీ మేనియాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.ఇదీ అమెరికా కాంగ్రెస్‌లో మోడీకి దక్కిన గౌరవం. దాదాపు గంటసేపు సాగిన మోడీ ప్రసంగంలో భారత్ మాతాకీ జై, మోడీ మోడీ నినాదాలు మార్మోగాయి. సరిగ్గా ఈ సమయంలోనే భారత శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు మోడీ. దశాబ్దాలు గడుస్తున్నా ఉగ్రవాదం ఇప్పటికీ ప్రమాదకరంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. 9/11, 26/11 దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదం, దాని పర్యవసానాలు గురించి వివరించారు. ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు ఉపేక్షించకూడదన్నారు. పరోక్షంగా చైనానూ టార్గెట్ చేశారు. ఐక్యరాజ్యసమితి సూత్రాలు, నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాల్సిందే అని తేల్చిచెప్పారు. ప్రధాని అమెరికాలో అడుపెట్టిన సమయంలోనే డ్రాగన్ ఓ డర్టీ పని చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా ఉగ్రవాది సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ టెర్రరిస్టు ముద్ర వేసేందుకు భారత్‌తో కలిసి అమెరికా చేసిన ప్రతిపాదనలను చైనా అడ్డుకున్నది. 26/11 ముంబై ఉగ్ర దాడుల్లో భాగస్వామ్యం ఉన్నందున సాజిద్ మిర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది అని ముద్ర వేయాలని భారత్‌తో పాటు అమెరికా ప్రతిపాదించాయి. ఐతే, 1267 ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అల్ ఖైదా శాంక్షన్స్ కమిటీ ముందు తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనను చైనా బ్లాక్ చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మోడీ ఆ రెండు దేశాలకూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో ఐదో స్థానంలో ఉన్న భారత్ త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని సంచలన ప్రకటన చేశారు.ఇలా ఒక్కటేంటి తన సుదీర్ఘ ప్రసంగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు ప్రపంచానికి భారత్ ఏంటో తెలిసేలా మాట్లాడారు. మరోసారి వశుదైక కుటుంబం అంశాన్ని ప్రస్తావించి ప్రపంచం అంతా ఒక్కటే ఫ్యామిలీ అని గుర్తుచేశారు. మొత్తంగా.. అగ్రరాజ్యంతో రక్షణ ఒప్పందాలతోపాటు భారత్‌పై కొందరు లేవనెత్తిన వివాదాలకు కూడా మోడీ పర్యటన ఫుల్‌స్టాప్ పెట్టినట్టయింది. ఒక్కమాటలో ప్రధాని మోడీ అమెరికా పర్యటన ఓ సరికొత్త అధ్యాయంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మళ్ళీ పెళ్ళి వివాదం : ఆహా, అమెజాన్ కు నరేష్ భార్య లీగల్ నోటీసులు

0

విపరీతమైన సోషల్ మీడియా ప్రచారం.. హడావుడితో విడుదలైన నరేష్, పవిత్ర లోకేష్ బయోపిక్ మళ్ళీ పెళ్ళి సినిమా.. అసలు ఎప్పుడు థియేటర్లలోకి వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా సరిగ్గా తెలియదు జనానికి. వీళ్ళిద్దరూ చేసిన హంగామా ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేయగలిగినా.. సినిమా చూసేందుకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయింది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, ఆహా ఓటీటీలలో మళ్ళీ పెళ్ళి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే.. ఇక్కడే నరేష్ భార్య షాకిచ్చింది. మళ్ళీ పెళ్ళి సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా ఆపేయాలంటూ అమేజాన్, ఆహాలకు లీగల్ నోటీసులు పంపించింది. సినిమాలో తన క్యారెక్టర్ ను తప్పుగా చూపించారనీ.. చాలా అబద్ధాలతో సినిమాను తెరకెక్కించి తన పరువుకు నష్టం వాటిల్లేలా చేశారని పేర్కొంటూ రమ్య రఘుపతి నోటీసులు పంపించింది. ఈ నోటీసులకు స్పందించిన అమేజాన్ యాజమాన్యం ప్రస్తుతం మళ్ళీ పెళ్ళి సినిమా స్ట్రీమింగ్ నిలిపివేసినట్టు సమాచారం.

మే 26న విడుదలైన మళ్ళీ పెళ్ళి సినిమా.. నరేష్, పవిత్ర లోకేష్ జీవితాల్లో జరిగిన పరిణామాలపై రాసిన కథతో సుమారు 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారట. కానీ విడుదలైన తర్వాత ఈ సినిమాను ఎవ్వరూ పట్టించుకోలేదు.. మొత్తానికి సినిమాకు వచ్చిన కలెక్షన్లు కేవలం 20 లక్షలు మాత్రమేనని టాక్. సినిమా రిలీజ్ కు ముందు తెగ హడావుడి చేసిన నరేష్.. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత కనీసం కనిపించలేదు ఎక్కడా. నరేష్ భార్య రమ్య రఘుపతి సినిమా విడుదలైన సమయంలో ఏమాత్రం స్పందించలేదు కానీ ఇప్పుడు స్ట్రీమింగ్ ఆపేయాలంటూ నోటీసులు ఇచ్చింది. థియేటర్లో ఎలగో ఎవరూ చూడరు.. ఇక ఇంట్లో ఫ్రీగా స్ట్రీమింగ్ అయితే జనం చూస్తారు.. దీని వల్ల సినిమాలోని తన క్యారెక్టర్ గురించి చర్చ మొదలవుతుందని భావించిన రమ్య రఘుపతి.. కావాలనే స్ట్రీమింగ్ కాకుండా లీగల్ నోటీసులు పంపించింది. అయితే.. ఆహాలో మాత్రం స్ట్రీమింగ్ నిలిపివేయకపోవటం గమనార్హం.

టైటన్ పేలిపోయిందని గంటలోనే నాకు తెలిసింది-జేమ్స్ కామెరూన్

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టైటన్ సబ్ మెరూన్ ప్రమాదంపై ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఊహించని విధంగా స్పందించారు. టైటన్ సబ్ మెరూన్ సిగ్నల్ రేంజ్ నుంచి బయటపడి సెంటర్ తో సంబంధాలు తెగిపోయిన గంటలోనే అది విచ్ఛిన్నమైందని తాను నిర్దారణకు వచ్చానంటూ ఆయన చెప్పారు. సంబంధాలు తెగిపోయిన కొద్ది సేపటి తర్వాత భారీ పేలుడు శబ్ధం వెలువడిందనీ.. హైడ్రోఫోన్ ద్వారా ఆ శబ్ధాన్ని తాను కూడా విన్నాననీ చెప్పారు. దీనిపై సముద్రంలో అన్వేషిస్తున్న సెర్చ్ టీమ్ తనకు సమాచారం అందజేయగా ఆ సమాచారాన్ని విశ్లేషించగలిగానని చెప్పిన జేమ్స్.. అప్పుడే టైటన్ పేలిపోయిందనీ.. అందులో ఉన్న వారు చనిపోయారని తాను చెప్పానన్నారు. కానీ ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా దీనిపై ప్రకటన చేయటం సరికాదన్న ఉద్దేశంతో పాటు వారు ప్రాణాలతో ఉండే ఉంటారన్న ఆశ తమలో అప్పటికీ ఉన్నదని చెప్పాడు.

టైటానిక్ షిప్ ఓ ఐస్ బర్గ్ ను ఢీకొని మునిగిపోయిన అతి ప్రమాదకరమైన ప్రాంతం అది. అలాంటి ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలనీ.. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు తప్పదనీ హెచ్చరించాడు కామెరూన్. ఓషియన్ గేట్ టైటన్ సబ్ మెరైన్ సెక్యూరిటీ విషయంలో అంతా బాగానే ఉందని తాను నమ్ముతున్నాన్నాడు. టైటన్ లో అధునాతన సెన్సార్లు, సెక్యూరిటీ సిస్టమ్ ఉన్నాయనీ.. ప్రమాదం జరుగుతున్న సమయంలో లోపల ఉన్న వారికి హెచ్చరికలు అందుతాయనీ.. కానీ.. ఏం జరుగుతుందో తెలిసేలోపే విధ్వంసం జరిగి లోపల ఉన్న వాళ్ళు తప్పించుకునే అ‌వకాశం లేకుండా పోయి ఉంటుందని జేమ్స్ చెప్పాడు. ప్రమాదంలో మరణించిన వారిలో సముద్ర పరిశోధనలు చేసే పాల్ హెన్రీ ఉన్న విషయం తెలిసిందే. హెన్రీ జేమ్స్ కామెరూన్ కు మధ్య 25 యేళ్ళుగా స్నేహం ఉంది. వీళ్ళద్దరూ చాలా సార్లు కలవటంతో పాటు సముద్ర అన్వేషణ విషయంలో చర్చించుకునేవాళ్ళట. హెన్రీ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని జేమ్స్ విచారం వ్యక్తం చేశాడు. పాల్ హెన్రీ టైటన్ ఘటనకు ముందు 37 సార్లు అదే ప్రాంతాన్ని సందర్శించాడట. ఏది ఏమైనా.. టైటానిక్ మునిగిన ప్రదేశాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఈరకంగా ప్రాణాలు కోల్పోవటం పట్ల ప్రపంచ వ్యాప్తంగా విచారం వ్యక్తమవుతోంది.

9 యేళ్ళుగా అడుగుతున్నా మోడీ సర్కార్ ఇవ్వలేదు-కేటీఆర్

0

సికింద్రాబాద్ ప్రాంతంలో ఆర్మీకి సంబంధించిన భూములను రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాలని గత 9 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా స్పందించటం లేదనీ.. ఇప్పటికీ ఈ విషయంలో వినతులు పంపిస్తున్నా సమాధానం చెప్పటం లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్ లోని చాలా ప్రాంతాలు ఇండియన్ ఆర్మీకి చెందినవే ఉన్నాయనీ.. ఆయా ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే అందుకు తగిన స్థలాలను ఆర్మీ కోసం ఇతర ప్రాంతాల్లో కేటాయించటానికి తాము సిద్ధంగా ఉన్నామనీ కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పలు స్థలాలపై తెలంగాణ ప్రభుత్వానికి హక్కు లేకపోవటం వల్ల చాలా అభివృద్ధి పనులు ఆగిపోయాయన్నారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి తొమ్మిదేళ్ళుగా వినతులు పంపిస్తున్నా వారు పట్టించుకోవటం లేదన్నారు. ఈ విషయం గురించి మాట్లాడేందుకే రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసానని చెప్పారు. ఈసారైనా కేంద్రం ఆర్మీ స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తే చాలా అభివృద్ధికి అ‌వకాశం ఏర్పడుతుందన్నారు.

హైదరాబాద్ లో కొత్తగా 31 కిలోమీటర్ల మేర మెట్రోను నిర్మించటానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని కూడా కేటీఆర్ చెప్పారు. ఈ మెట్రో ప్రాజెక్టు విషయంలో కూడా ఆర్మీ స్థలాల విషయంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. లఖ్నో మరియు అహ్మదాబాద్ లో మెట్రో ప్రాజెక్టు నిర్మించేందుకు కంటోన్మెంట్ స్థలాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చారనీ.. ఇక్కడ కూడా అదే విధంగా కంటోన్మెంట్ స్థలాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే మెట్రోకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు కేటీఆర్. ప్రజారవాణా ఎంతగా పెరిగితే అభివృద్ధికి అంత ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నారు. ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా అత్యుత్తమంగా ప్రజారవాణా మార్గాలు ఏర్పడటమే అసలైన అభివృద్ధి అని చెప్పిన కేటీఆర్.. రవాణా మార్గాలు ఏర్పడిన తర్వాతే మిగతా విషయాలు వాటంతట అవే అభివృద్ధి చెందుతాయని చెప్పారు. చాలా విషయాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లేదనీ.. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూపాయి వెళ్తే వారి నుంచి తిరిగి తెలంగాణకు కేవలం 40 పైసలు మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని కోరారు.

ఈటెల, కోమటిరెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు

0

ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ కలిసి ఢిల్లీకి రావాలంటూ బీజేపీ అధిష్టానం ఆదేశించింది. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కొద్ది రోజుల నుంచి వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఈటెల రాజేందర్ ను ఢిల్లీకి పిలిపించుకున్న అమిత్ షా.. ఆయనతో భేటీ అయ్యి కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు సమానంగా పదవి ఇవ్వబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తారంటూ రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ అవేవీ జరగలేదు సరికదా.. బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించే ప్రసక్తే లేదంటూ అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత తెలంగాణ బీజేపీ మళ్ళీ షరా మామూలుగానే ఉంది. కాకపోతే.. ఈటెల రాజేందర్ కు సరైన గౌరవం లభించటం లేదనీ.. ఈ విషయంలో ఈటెల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని మాత్రం జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈటెలను కాంగ్రెస్ లోకి రావాలంటూ ఆహ్వానించటం తెలంగాణ రాజకీయాలను హీటెక్కించింది. దీనిపై ఈటెల స్పందించటం.. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పటంతో వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.

ఇదంతా జరిగిన ఇన్ని రోజులకు మళ్ళీ ఈటెల రాజేందర్ తో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అమిత్ షా ఢిల్లీకి రావాలని ఆదేశించారు. ఈ సారి తెలంగాణ బీజేపీలో కీలక మార్పులు చేయబోతున్నారని చెప్పుకుంటున్నారు. క్రితం సారి ఈటెల ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటి నుంచీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే మునుగోడు పరాజయం తర్వాత కోమటిరెడ్డి కూడా పెద్దగా పార్టీ కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్టు కనిపించలేదు. పార్టీతో పాటు అసలు రాజకీయాలకే కోమటిరెడ్డి దూరంగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఇలా మౌనంగా ఉన్న వీళ్ళిద్దరినీ అమిత్ షా ఢిల్లీకి పిలవటం వెనుక కారణం వారికి పార్టీలో కీలక పదవులు కట్టబెట్టడమేనని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు.
ఖమ్మం జిల్లా కీలక నేత పొంగులేటితో పాటు జూపల్లిని బీజేపీలో చేర్చేందుకు ఈటెల గట్టిగానే ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరికి వీళ్ళిద్దరూ కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల వ్యూహం మరియు అభ్యర్థుల ఎంపిక తదితర కీలక అంశాలపై చర్చించటంతో పాటు తెలంగాణ బీజేపీలో ముఖ్యమైన పదవుల నియామకం గురించి మాట్లాడేందుకే ఈటెల, కోమటిరెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని తెలుస్తోంది.