Home Blog Page 4

డిలీట్ చేసిన డేటా కావాలి : సుశాంత్ సింగ్ కేసులో సీబీఐ ప్రకటన

0

బాలీవుడ్ యంగ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మూడేళ్ళ క్రితం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. అద్భుతమైన కెరీర్, మంచి ట్యాలెంట్ ఉన్న నటుడు సడన్ గా ఆత్మహత్య చేసుకోవటంపై అప్పట్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుశాంత్ ది ఆత్మహత్య కాదనీ.. డ్రగ్ మాఫియా సుశాంత్ ను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించిందంటూ చాలా ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత దీనిపై కేసు నమోదు చేసింది సీబీఐ. 2020 జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. సుమారు మూడేళ్ళుగా సుశాంత్ కేసు విచారిస్తున్నా.. ఇప్పటికీ ఈ కేసులో ఒక్క అంశంపై కూడా సీబీఐ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా.. సుశాంత్ కేసులో అతడి పర్సనల్ డేటా కోసం ఎదురు చూస్తున్నామనీ.. అతడి ఫోన్లలో డిలీట్ చేసిన గూగుల్ సహా ఇతర అకౌంట్లకు సంబంధించిన డిలిటెడ్ డేటా దొరికితేనే ఈ కేసులో ముందుకు వెళ్ళ గలమనీ సీబీఐ అధికారులు చెప్తున్నారు. డిలీటెడ్ డేటా కోసం ఆయా సంస్థలను చట్టబద్ధంగా సంప్రదించామనీ.. అనేక ప్రయత్నాలు చేస్తున్నామనీ చెప్తున్నారు.

అమెరికాలో హెడ్ ఆఫీసులు గల గూగుల్, ఫేస్ బుక్, ట్విటర్, వాట్సాప్ తదితర సంస్థలన్నింటినీ సీబీఐ సంప్రదించిందనీ.. కానీ వారి నుంచి తమకు కావాల్సిన సమాచారం రావటంలో ఇంకా ఆలస్యం జరుగుతూనే ఉందనీ సీబీఐ అధికారులు చెప్తున్నారు. అయితే.. దీనిపై మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొద్ది రోజుల క్రితం స్పందించాడు. సీబీఐతో సహా పోలీసులు ఈ కేసులో విచారణ చేస్తున్నారనీ.. ఆధారాల కోసం అన్వేషణ జరుగున్నదనీ చెప్పాడు. సుశాంత్ సంఘటన జరిగిన సమయంలో ఉన్న పరిస్థితులు మరియు కొంత మంది స్థానికులు ఇతరులు చెప్పిన సాక్ష్యాల చుట్టూ విచారణ జరుగుతోందనీ.. కేవలం ఆరోపణలను మూలంగా చేసుకొని ఎవరినీ విచారణ చేయలేమనీ ఫడ్నవీస్ చెప్పాడు. ప్రస్తుతం విచారణ జరుగుతున్నందున.. ఈ కేసుపై ఇంకా ఎక్కువ మాట్లాడటం సరికాదంటూ దాటేవేశాడు ఫడ్నవీస్. సుశాంత్ విషయంలో బాలీవుడ్ కు చెందిన చాలా మందిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో షర్మిళ పార్టీ విలీనం ?

0

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారన్న వార్తలు చాలా కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ విషయంపై ఎవరూ అధికారికంగా స్పష్టమైన వివరాలు చెప్పటం లేదు. ఈ నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన మరో కొత్త వార్త ప్రస్తుతం ఏపీ తెలంగాణలో వైరల్ గా మారింది. ఈ నెల 8న వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున షర్మిళ.. కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా, రాహుల్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నదనేది ఆ వార్త సారాంశం. ఇందులో మరో విశేషం ఏమిటంటే.. వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయను ఈ కార్యక్రమానికి వేదికగా ఎంచుకున్నారట. ఇప్పటికే ఈ విషయమై నిర్ణయం తీసుకున్నారనీ.. సోనియా, రాహుల్ సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే ఇడుపులపాయను పరిశీలించి భద్రత విషయంలో రిపోర్టు ఇచ్చారనీ చెప్పుకుంటున్నారు. కానీ ఇటు షర్మిళ నుంచి గానీ.. అటు కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుంచి గానీ ఈ విషయమై చిన్న సమాచారం కూడా రావటం లేదు. ఏపీ కాంగ్రెస్ నేత చింతా మోహన్ మాత్రం ఈ వార్తలు కేవలం పుట్టించిన వార్తలేననీ.. సోనియా, రాహుల్ రాక గురించి ఏపీ కాంగ్రెస్ కు కూడా ఎలాంటి సమాచారం లేదనీ చెప్తున్నాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హైలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీ పెట్టిన విషయం మనకు తెలిసిందే. సోనియాను కలవటానికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనీ.. అందుకే కాంగ్రెస్ కు పోటీగా కొత్త పార్టీ పెట్టారనీ ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇంత కాలం జగన్ వెంటే నడిచిన అతడి సోదరి వైఎస్ షర్మిళ.. హఠాత్తుగాా తెలంగాణ ముఖ్యమంత్రి అయి రాజన్న రాజ్యం తేవటమే లక్ష్యం అని చెప్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది. ఇంత కాలం పాదయాత్రలు, బస్సు యాత్రలతో జోరుగా రాజకీయం చేసిన షర్మిళ.. గత కొంత కాలంగా సైలెంట్ కావటమే కాకుండా.. కాంగ్రెస్ అగ్రనేతలకు టచ్ లో ఉంటోంది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను కలిసిన తర్వాత షర్మిళ తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారన్న వార్తలకు బలం చేకూరింది. ఇప్పుడు ఇదే అంశంపై కొత్త కొత్త ప్రచారాలు పుట్టుకొస్తున్నాయి.

గోద్రా అల్లర్ల కేసు : తీస్తా సెతల్వాద్ లొంగిపోవాలంటూ కోర్టు తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన గుజరాత్ గోద్రా అల్లర్ల కేసులో శనివారం ఉదయం గుజరాత్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2002లో జరిగిన ఈ అల్లర్ల పై ఇప్పటికీ పలు కేసులు విచారణలో ఉన్నాయి. ఈ అల్లర్లకు అసలు ఏమాత్రం సంబంధం లేని వారికి వ్యతిరేకంగా దొంగ సాక్ష్యాలు పుట్టించింది అంటూ సామాజిక కార్యకర్త అయిన తీస్తా సెతల్వాద్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఈ అల్లర్ల వెనుక ఉన్నారంటూ ఈమె సాక్ష్యాలు కోర్టుకు చూపించింది. అయితే.. ఈ సాక్ష్యాలు పుట్టించిన సాక్ష్యాలంటూ ఈమెపై కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఇదే కేసులో అరెస్ట్ అయిన తీస్తా సెతల్వాద్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. ప్రస్తుతం కూడా బెయిల్ పైనే ఉంది. అయితే.. తన బెయిల్ ను పొడగించాలంటూ ఈమె తరఫు లాయర్ వేసిన పిటిషన్ ను విచారించిన గుజరాత్ కోర్టు.. బెయిల్ ఇవ్వటం కుదరదనీ.. వెంటనే కోర్టు ఎదుట లొంగిపోవాలంటూ కీలక తీర్పునిచ్చింది. పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తి నిజార్ దేశాయి.. తీస్తా బయట ఉంటే సాక్ష్యాలను మళ్ళీ తారుమారు చేయవచ్చన్న వాదనలో అంగీకరించారు. వెంటనే ఆమెను కోర్టు ఎదుట లొంగిపోవాలని.. ప్రస్తుతం ఉన్న బెయిల్ ను కూడా ఈ రోజుతో రద్దు చేస్తున్నామనీ తీర్పునిచ్చారు.

గత సంవత్సరం జూన్ 25న తీస్తా సెతల్వాద్ తో పాటు డీజీపీగా పనిచేసిన ఆర్బీ శ్రీకుమార్ లను కూడా గుజరాత్ పోలీసులు అరెస్టు చేసి జైళ్ళో వేశారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిన సెతల్వాద్ 2022 సెప్టెంబర్ లో విడుదలై బెయిల్ పై ఉన్నది. గోద్రాలో అల్లర్లు జరిగిన సమయంలో ప్రస్తుత ప్రధాని మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే.. గోద్రా అల్లర్ల వెనుక అదృశ్య హస్తం గుజరాత్ ముఖ్యమంత్రి మోడీయేననీ అప్పటి డీజీపీ శ్రీకుమార్ తో కలిసి తీస్తా సెతల్వాద్ సాక్ష్యాలు పుట్టించింది. ముఖ్యమంత్రిపై వస్తున్న ఆరోపణలను నిజానిజాలు తేల్చాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అప్పటి సీబీఐ అధికారులు ఈ కేసును విచారించి.. తనకు ఉన్న అధికారాలతో డీజీపీ శ్రీకుమార్ మరియు తీస్తా సెతల్వాద్ దొంగ సాక్ష్యాలను పుట్టించారని తేల్చారు. దీంతో వీరిద్దరినీ గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు సాగిన సీబీఐ విచారణలో.. మోడీతో పాటు తీస్తా సెతల్వాద్ పేర్కొన్న ఎవ్వరికీ గోద్రా అల్లర్లతో ప్రమేయం లేదని తేల్చి క్లీన్ చిట్ ఇచ్చారు.

త్వరలో వరంగల్ లో మోడీ పర్యటన.. టీబీజేపీకి లాభిస్తుందా !?

0

ప్రధానమంత్రి మోదీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. జూలై 8న వరంగల్ లో పర్యటించి ఖాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, మెగా టైక్స్టైల్ పార్కు కు శంకుస్థాపన చేయనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత హన్మకొండలోని ఆర్స్ట్ కాలేజ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా తెలంగాణలో పర్యటించాల్సి ఉండగా ఉత్తరాదిన తుఫాన్ బీభత్సం సృష్టించటంతో ఆయన పర్యటన రద్దు చేసుకున్నట్టు తెలంగాణ బీజేపీ నేతలు చెప్పారు. ఇప్పుడు ప్రధాని మోడీ వరంగల్ లో పర్యటించనున్నారు. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ స్తబ్దుగా మారింది. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై తీవ్రంగా చర్చ జరగటంతో పాటు బండి సంజయ్ ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పిస్తారంటూ వార్తలు వినిపించాయి. కానీ అవేవీ లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పష్పంగా చెప్పటంతో ఈ వార్తలకు అడ్డుకట్ట పడింది.

గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో వర్గపోరు ఎక్కువైంది. ఈటెల రాజేందర్ మరియు బండి సంజయ్ మధ్య గ్యాప్ ఉన్నదనీ.. తెలంగాణ బీజేపీలో ఎన్నికల ముందు భారీ మార్పులు తప్పవనీ వినిపించింది. అంతే కాదు.. ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి వెళ్ళబోతున్నారని కూడా జోరుగా వార్తలు వినిపించాయి. చివరికి అలాంటిదేమీ లేదని వాళ్ళే క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీలో ఇంతటి కన్ఫ్యూజన్లు నెలకొన్న వేళ.. వాటిని ఏమాత్రం క్లియర్ చేయని జాతీయ అధిష్టానం.. మోడీ పర్యటనను షెడ్యూల్ చేయటం గమనార్హం. ముందుగా పార్టీలోని స్థానిక సమస్యలను పరిష్కరించి.. నేతల మధ్య అగాధం పూడ్చి.. ఎన్నికలకు ఓ స్పష్టమైన దిశా నిర్దేశం చేయకుండానే ఇలా ప్రధానమంత్రి పర్యటనలు చేయటం వల్ల తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు చాలా తక్కువ. మోడీ, అమిత్ షా, నడ్డా లాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు.. కానీ స్థానిక నేతల మధ్య ఐక్యత లేకపోతే పార్టీ పుంజుకోవటం అసాధ్యం. తెలంగాణలో కేసీఆర్ చరిష్మాను దాటి బీజేపీకి ఓట్లు పడాలంటే అన్నింటికంటే ముఖ్యంగా కావాల్సింది పార్టీలో ఐక్యత. అది లేకుండా జాతీయ నేతలు వచ్చి పోవటం వల్ల వచ్చే లాభమేమీ ఉండబోదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.

విదేశాంగ మంత్రి జైశంకర్ కు మోడీ గిఫ్ట్

0

భారత విదేశాంగ శాఖక మంత్రి ఎస్.జైశంకర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. విదేశీ మీడియాకు చురకలంటించటం.. విదేశీ గడ్డపై భారత్ విమర్శించే వారికి నేరుగా ప్రతివిమర్శ చేయటం.. ఇందుకు సంబంధించిన వీడియోలు నిత్యం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. ఇక ఆయన ఇంటర్వ్యూల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.. ఆ ఇంటర్వ్యూలు చూస్తే చాలు.. ఎంతో ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది ప్రేక్షకులకు. భారత విదేశాంగ విధానాన్నే మార్చేశాడు జైశంకర్. అయితే.. ఇప్పుడు జైశంకర్ రాజ్యసభ సభ్యత్వం జూలై నెలతో పూర్తి కాబోతున్నది. దేశవ్యాప్తంగా మొత్తం 10 రాజ్య సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వం ముగుస్తున్న వేళ.. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ జైశంకర్ ను రాజ్యసభ సభ్యుడిగా మరోసారి విదేశాంగ శాఖ మంత్రిగా కొనసాగిస్తారా.. లేక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మోడీ మంత్రి వర్గంలో మార్పులు ఏవైనా జరగబోతున్నాయా అనేది చర్చగా మారింది. ఈ రోజు ఉదయం ప్రధాని మోడీ మంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించగా.. క్యాబినెట్లో మార్పులపై చర్చించేందుకే ఈ సమావేశం జరిగిందన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే జైశంకర్ గురించి కూడా మీడియా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.

భారతదేశ విదేశాంగ శాఖ మంత్రిగా సుబ్రమణ్యం జైశంకర్ 2019లో బాధ్యతలు స్వీకరించాడు. అంతకు ముందు విదేశాంగ కార్యదర్శిగా అనేక దేశాల్లో పనిచేశాడు జైశంకర్. మంత్రి పదవి చేపట్టక ముందు 2015 నుంచి 2018 వరకు ఫారిన్ సెక్రెటరీగానూ, 2013 నుంచి 2015 వరకూ అమెరికాలో భారత అంబాసిడర్ గానూ, 2009 నుంచి 2013 వరకూ చైనాలో ఇండియన్ అంబాసిడర్ గా.. ఇలా చాలా హోదాల్లో పనిచేశాడు జైశంకర్. చైనాలో పనిచేసిన రోజుల్లోనే అక్కడే చైనా యువతి క్యోకోను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. చైనాలో పనిచేసిన అనుభవంతోనే చైనా మీడియాకు చైనా భాష మాండరిన్ లోనే సమాధానం చెప్పి వార్తల్లోకెక్కాడు. ఒక ఫారిన్ డిప్లొమాట్ విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించాడు ఈయన. అంతర్జాతీయ వేదికలపై తరచూ భారతదేశాన్ని విమర్శించే విదేశీ మీడియాకు సమాాధానం చెప్పలేక దాటవేసే వాళ్ళు మన పూర్వపు విదేశాంగ శాఖ మంత్రులు.

ఒకప్పుడు మీడియా భారత మంత్రులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసేది. కానీ, జైశంకర్ వచ్చిన తర్వాత భారత విదేశాంగ విధానంతో పాటు విదేశీ మీడియాతో నడక కూడా మారింది. విదేశీ మీడియా ప్రతినిథుల ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పి.. వాళ్ళు సమాధానం చెప్పలేని నాలుగు ప్రశ్నలను ఎదురు సంధిస్తాడు జైశంకర్. ఈ మధ్య జైశంకర్ ను ప్రశ్నించేందుకు విదేశీ మీడియా వెనుకాడుతోంది.. ముఖ్యంగా యూరప్ మీడియా. మరి ఇలాంటి మంత్రిని మళ్ళీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వటం ద్వారా కొనసాగిస్తారా అంటే ఖచ్చితంగా కొనసాగిస్తారనే సమాధానమే వినిపిస్తోంది. ఇంత కాలం అద్భుత పనితీరుతో మెప్పించిన జైశంకర్ కు మరోసారి రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఇదే విదేశాంగ మంత్రి పదవిని మోడీ కానుకగా ఇస్తారని మీడియా కథనాలు చెప్తున్నాయి. కానీ.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. మోడీ జైశంకర్ కు ఏదైనా కీలకమైన టాస్క్ అప్పగించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా కొద్ది రోజుల్లో ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది.

సాయిచంద్ కుటుంబాన్ని చూసి కంటతడి పెట్టుకున్న కేసీఆర్, కేటీఆర్

0

తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గోడౌన్స్ కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ ఈ రోజు ఉదయం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సాయిచంద్ హఠాన్మరణం పట్ల తెలంగాణ యావత్ ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ తో పాటు ఉద్యమించిన పలువురు గాయకులు, కళాకారులు ఈ విషయాన్ని నమ్మలేకపోయారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సాయి చంద్ ఇంటికి పయనమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహా అగ్రనేతలంతా సాయి చంద్ పార్థీవ దేహాన్ని సందర్శించేందుకు ఆయన ఇంటికి వెళ్ళారు. సాయి చంద్ భార్య, కుటుంబాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించారు. ఈ క్రమంలో సాయి చంద్ భార్య కేసీఆర్ కాళ్ళపై పడి బోరున విలపించటం అక్కడున్న వారిని, చూసే వారినే కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కదిలించింది. సాయి చంద్ భార్య దీన స్థితిని చూసిన కేసీఆర్ కంట తడి పెట్టుకున్నారు. ఆయన భార్యను, తండ్రిని ఓదార్చిన కేసీఆర్.. నేనున్నానంటూ వాళ్ళకు ధైర్యం చెప్పారు.

సాయి చంద్ మృతిపై స్పందించిన మంత్రి కేటీఆర్ కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన గురించి మాట్లాడుతూ గతాన్ని గుర్తుకు చేసుకున్న కేటీఆర్.. ఎమోషనల్ అయిపోయి కళ్ళ వెంట నీళ్ళు తెచ్చుకున్నారు. సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు అతడి గురించి గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు. సాయి చంద్ తెలంగాణ ఉద్యమ గొంతుక అనీ… ఆయన మరణించినా ఆయన పాటకు మాత్రం మరణం లేదనీ హరీష్ రావు వ్యాఖ్యానించారు. యువకుడైన సాయి చంద్ హఠాన్మరణంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నింపింది. నాగర్ కర్నూల్ లోని కారుకొండ ఫామ్ హౌజ్ లో ఉన్న సాయి చంద్ కు ఈ రోజు ఉదయం గుండెపోటు వచ్చింది. వెెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోని హాస్పిటల్ కు తరలించగా.. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్న సమయంలో చికిత్స తీసుకుంటూ సాయి చంద్ ప్రాణాలు విడిచారు. ఈ రోజు సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

మణిపూర్ లో రాహుల్ గాంధీ కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు

0

జాతుల మధ్య వైరంతో మణిపూర్ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రం మొత్తం ప్రస్తుతం పోలీసులు, ఆర్మీ అదుపులో ఉంది. ఎక్కడ చూసినా కత్తులు, ఏకే 47 తుపాకులతో జనం కాల్పులకు తెగబడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటించేందుకు వెళ్ళారు. తొలుత హెలీకాప్టర్ లో మణిపూర్ కు వెళ్ళనున్నట్టు చెప్పిన రాహుల్.. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా మణిపూర్ లోని ఇంఫాల్ కు చేరుకునే ప్రయత్నం చేశారు. ఇంఫాల్ కు 20 కిలోమీటర్ల దూరంలో పోలీసులు రాహుల్ గాంధీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు. ముందుకు వెళ్ళే పరిస్థితులు లేవని చెప్పిన పోలీసులు.. రాహుల్ కాన్వాయ్ తో సహా తిరిగి వెళ్ళిపోవాలని ఆదేశించారు. దీంతో అక్కడ కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన రాహుల్.. చివరకు ఇంఫాల్ ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్ళిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న మణిపూర్ రాష్ట్రంలో రాహుల్ పర్యటించాలని చూడటం సరికాదంటూ బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. అల్లర్లను, సంఘర్షణలను కూడా కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు వాడుకోవాలని చూస్తోందని బీజేపీ నేతలు మండిపడ్డారు.

మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ. వేర్వేరు తెగల వారికి వేర్వేరు చట్టాలు అమలు చేయటమే ఈ సమస్యకు మూలం. కుకీ తెగ వాళ్ళను పొరుగున ఉన్న మణిపూర్ వేర్పాటు వాదులు రెచ్చగొట్టి అల్లర్లకు ఎగదోస్తున్నారు. మణిపూర్ ను అల్లకల్లోలం చేయటమే లక్ష్యంగా కుకీ తెగ వారికి ఏకే 47 తుపాకులను, గ్రెనేడ్ లను సప్లై చేస్తున్నారు మయన్మార్ తీవ్రవాదులు. ఎన్ని రోజులుగా ప్రయత్నించినా మణిపూర్ లో పరిస్థితి సద్దుమణగటం లేదు. ఒక్క నిముషం పాటు పోలీసులు, ఆర్మీ కళ్ళు మూసుకున్నా మళ్ళీ రణరంగంగా మారుతుంది మణిపూర్. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటించాలని వెళ్ళటం వివాదాన్ని మరింత పెంచటమే అవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంకా రాహుల్ ఇంఫాల్ లోనే ఉన్నాడు. వీలైతే హెలీకాప్టర్ లో మణిపూర్ లో పర్యటించాలని అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నాడు.

కష్టాల్లో కర్ణాటక కాంగ్రెస్ : గెలిచిన సంబరం తీరకముందే..!!!

0

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పుడే కష్టాలు మొదలైనట్టు కనిపిస్తున్నది. గెలిచి ముచ్చటగా మూడు నెలలైనా కాకముందే కర్ణాటక పాలకులకు చుక్కలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావటానికి ప్రధాన కారణాలైన గ్యారంటీ హామీలు.. సిద్దరామయ్య ప్రభుత్వం మెడకు ఉరి తాడే బిగుస్తున్నాయి. తాజాగా.. అన్నభాగ్య పథకం ద్వారా ప్రజలకు అందజేయాల్సిన బియ్యం విషయంలో కర్ణాటక ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ప్రజలకు సరిపడా పంపిణీ చేసేందుకు బియ్యం సేకరించే ప్రయత్నాలు చేయగా.. అందుకు కావాల్సినంత మోతాదులో బియ్యం దొరకటం లేదు. దీంతో బియ్యం బదులు కిలోకు 34 రూపాయల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకు అకౌంట్లో వేస్తామంటూ పథకంలో మార్పులు తీసుకొచ్చింది సిద్దరామయ్య సర్కార్. కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి కిలోకు 34 రూపాయల చొప్పున డబ్బులు బ్యాంకు ఖాతాలో ప్రతీ నెలా జమ చేస్తామని చెప్తున్నాడు సీఎం సిద్దరామయ్య.

అన్నభాగ్య పథకం సంగతి పక్కనపెడితే మిగతా గ్యారంటీ పథకాలు కూడా కర్ణాటక సర్కార్ కు గుదిబండలా పరిణమిస్తున్నాయి. పెళ్ళి అయిన ప్రతి మహిళకు ప్రతీ నెలా 2 వేల రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తీరా చూస్తే ఇది ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ఇప్పుడు అర్థమైంది కాంగ్రెస్ కు. ప్రతి నెలా కోట్లాది రూపాయలు ఇస్తూ పోతే ఆరు నెలల్లో కర్ణాటక దివాలా తీయటమే. ఐదేళ్ళలో కర్ణాటక అప్పుల కుప్పగా మారటం ఖాయం. ఇక రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు విషయంలో కర్ణాటక ప్రజల కక్కుర్తి మామూలుగా లేదు. ఎన్ని యూనిట్లు వాడినా సరే కరెంటు బిల్లు మాత్రం కట్టేదే లేదంటూ భీష్మించుకొని కూర్చున్నారు జనం. బిల్లు వసూలు చేసేందుకు కరెంటు అధికారులు జనం ఇళ్ళకు వెళ్తే ఏకంగా చెప్పులతో కొట్టేస్తున్నారు. ప్రతీ మహిళకు ఉచిత బస్సు ప్రయాణం అనే స్కీమ్.. మరీ దారుణం. ఎక్కడ ఏ బస్సు కనిపిస్తే ఆ బస్సు ఎక్కేస్తున్నారు.. దిగమంటే డ్రైవర్లను చితకబాదుతున్నారు కర్ణాటక మహిళలు. కేవలం గ్యారంటీ పథకాల హామీల వల్లనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం సంపాదించిందనే విషయం అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి అధికారం లోకి రావటానికి దోహదం చేసిన అవే పథకాలు ఇప్పుడు ప్రభుత్వం పాలిట శాపంగా మారాయి.

ఉచితాలు దేశాన్ని నాశనం చేస్తాయనీ.. ఎన్నికల వేళ ఉచితాల హామీలు ఇవ్వటం సరికాదనీ బీజేపీ సర్కార్ నొక్కి చెప్తే.. లోకల్ పార్టీలు బీజేపీపై మండి పడ్డాయి. రైతులకు ఫ్రీ కరెంటు, విద్యార్థులకు ఫీజు రీఅంబర్స్ మెంట్.. ఇలాంటివైతే మంచిదే.. కానీ అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తాం.. మీరు ఇంట్లో కూర్చొండి అని చెప్పటం ఎంత తప్పో కర్ణాటక సీన్ చూస్తే అర్థం చేసుకోవచ్చు. జనానికి విద్య, వైద్యంలాంటివి ఫ్రీగా ఇవ్వాలి.. అది ప్రభుత్వం బాధ్యత..! కానీ నెలకు 2 వేలు ఖర్చులకు ఇచ్చేస్తాం.. కరెంటు బిల్లు మాఫీ చేసేస్తాం.. బస్సులో ఫ్రీగా తిప్పేస్తామని చెప్తే ఇలాగే ఉంటుంది. ఏది ఏమైనా.. గ్యారంటీ హామీల ఎఫెక్ట్ ఇప్పుడే మొదలైంది సిద్దరామయ్య సర్కార్ కు.. రాను రాను ఇది కాంగ్రెస్ ను ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి.

ఆదిపురుష్ టీమ్ పై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

0

విడుదలైన మొదటి రోజు నుంచే వివాదాల పాలవుతూ వస్తున్నది ఆదిపురుష్ సినిమా. అలనాటి రామాయణ ఇతిహాసం మరియు శ్రీరాముడి గొప్పదనాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసమే మేం ఈ సినిమా చేస్తున్నామంటూ మొదటి నుంచీ చెప్పుకొచ్చిన డైరెక్టర్ ఓం రౌత్.. చివరికి రామాయణాన్ని తన ఇష్టారీతిన మార్చేసి ఆదిపురుష్ సినిమాను తెరకెక్కించాడు. దీనిపై మొదటి నుంచీ విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా అలహాబాద్ హైకోర్టు ఆదిపురుష్ సినిమా టీమ్ పై ఘాటుగా వ్యాఖ్యానించింది. “ఆదిపురుష్ సినిమాతో మీరు ఏం చెప్పాలనుకున్నారు.. మీరు ఆ మతానికి చెందిన వారి ఓపికకు పరీక్ష పెట్టారా.. ఇతరుల నమ్మకాన్ని మార్చటానికి మీరెవరు ?” అంటూ ప్రశ్నించింది అలహాబాద్ హైకోర్టు. “రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అనే వారి పాత్రలను ఎంత అభ్యంతరకరమైన రీతిలో చూపించారు మీరు.. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి ?” అంటూ ఘాటుగా ప్రశ్నించింది. సామాజిక కార్యకర్తలైన కుల్దీప్ తివారీ, బందనా కుమార్ కలిసి రంజనా అగ్నిహోత్రి, సుధా శర్మ అనే లాయర్ల ద్వారా ఆదిపురుష్ సినిమాపై పబ్లిక్ ఇంట్రస్ట్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈ కేసును జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్, జస్టిస్ ప్రకాశ్ సింగ్ విచారించారు. ఈ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు న్యాయమూర్తులు.

ఆదిపురుష్ సినిమాకు డైలాగ్స్ రాసిన మనోజ్ ముంతాషిర్ పై కూడా న్యాయమూర్తులు ఘాటుగానే స్పందించారు. “రాముడు, లక్ష్మణుడు, సీత వంటి పాత్రల నోటి నుంచి ఇలాంటి మాటలు పలికించటం వెనుక మీ అభిప్రాయం ఏమిటి ?” అని సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు.. తాము తీసింది రామాయణం కాదు.. రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకొని అలాంటి ఓ సినిమా తీశామని మనోజ్ ముంతాషిర్ వ్యాఖ్యానించటాన్ని కూడా అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సినిమాలో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు, లంక పట్టణం.. ఇవన్నీ చూపించి ఇది రామాయణం కాదని చెప్పటమేమిటని ఘాటుగా ప్రశ్నించింది ధర్మాసనం. ఆదిపురుష్ డైలాగ్స్ పై విమర్శలు రావటంతో తాము తెరకెక్కించింది రామాయణం కాదంటూ మనోజ్ ముంతాషిర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన విషయం తెలిసిందే. “ఇలాంటి రీతిలో సినిమా తెరకెక్కినప్పుడు సెన్సార్ బోర్డు దీనిపై ఏదైనా చేసి ఉండాల్సింది.. ఇలా వదిలేస్తే ఎలా ?” అంటూ సెన్సార్ బోర్డుకు కూడా అక్షింతలు వేసింది ధర్మాసనం. పిటిషన్ దారులకు వివరణ ఇవ్వాలంటూ సినిమా యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇక సినిమా యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

ఊపుమీదున్న తెలంగాణ కాంగ్రెస్ : రేవంత్ ఫుల్ హ్యాప్పీ

0

ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరికతో తెలంగాణ కాంగ్రెస్ మంచి ఊపుమీదున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ శత విధాలా ప్రయత్నించినా వీరిద్దరూ కమలం పార్టీలోకి వెళ్ళేందుకు ఆసక్తి కనపరచలేదు. చివరికి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఖమ్మంలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేతలు కావటంతో వీళ్ళ చేరికతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకున్నదని చెప్పటంలో సందేహం లేదు. పార్టీ క్యాడర్ కాకుండా కాస్త సొంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు కాబట్టి ఖమ్మం రాజకీయాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి. ఈ పరిణామంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫుల్ హ్యాప్పీగా ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. సీనియర్లు కాస్త సైలెంట్ కావటం.. ఖమ్మం నేతలు కాంగ్రెస్ లో చేరటం.. ఖమ్మం నేతల చేరిక వెనుక రేవంత్ పడిన కష్టాన్ని రాహుల్ గాందీ అభినందించటం తదితర పరిణామాలతో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఆమాత్రం సంతోషంగా ఉండటంలో విశేషమేం లేదు.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. ఎమ్మెల్యే అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో గాంధీ భవన్ బిజీ బిజీగా మారింది. టిక్కెట్ పైరవీలతో జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులతో సందడిగా మారింది. అటు రాహుల్ గాంధీ కూడా తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ చేయటంతో టీ కాంగ్రెస్ లో జోష్ మరింత పెరిగింది. ఎలాగైనా సరే బీజేపీని ఎదగకుండా చేయాలంటే ఏం చేయాలో వ్యూహ రచన చేసేందుకు కాంగ్రెస్ సీనియర్లు కూడా గాంధీ భవన్ లోనే తిష్ట వేసినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా అధికార పార్టీలోని అసంతృప్తులను ఎలా కాంగ్రెస్ లోకి లాగాలి అనే దానిపై చర్చలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధిష్టానం కూడా అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో ఉంది. సుమారు 25 మంది సిట్టింగులకు ఈ సారి కేసీఆర్ టిక్కెట్లు ఇవ్వబోరని జోరుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆ 25 మందిని ఎలాగైనా కాంగ్రెస్ పార్టీలోకి లాగేందుకు రేవంత్ రెడ్డి స్కెచ్ వేస్తున్నారట. మొత్తానికి.. నిన్న మొన్నటి దాకా ఉసూరుమన్నట్టుగా ఉన్న గాంధీ భవన్ ఇప్పుడు బిజీగా మారిందన్నమాట.