గత కొద్ది రోజులుగా సొంత పార్టీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత ప్రదర్శిస్తున్న రెబల్ లీడర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరూ ఊహించని షాకిచ్చారు. వీలు దొరికినప్పుడల్లా అధినేత కేసీఆర్ తో పాటు లోకల్ లీడర్స్ పై ఆరోపణలు చేస్తూ వస్తున్న పొంగులేటి.. నేడో రేపో భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవటం ఖాయమని అంతా భావించారు. చిన్నా చితకా నేతలు కొంత మంది ఇటీవలి కాలంలో బీజేపీ తీర్థం పుచ్చుకోవటం జరుగుతుండటం.. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీజేపీ వివిధ పార్టీల కీలక నేతలకు గాలాలు వేస్తున్న నేపథ్యంలో పొంగులేటి బీజేపీలోకి వెళ్తారని అంతా భావించారు. కానీ పొంగులేటి మాత్రం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం పొంగులేటి.. షర్మిళతో రహస్యంగా భేటీ అయ్యారు. దీంతో పొంగులేటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలోకి వెళ్ళనున్నట్టు భావిస్తున్నారు. తనకు ఏ స్థానం నుంచి టికెట్ కావాలి.. తనతో పాటు ఎంత మంది షర్మిళ పార్టీలో చేరతారు.. ఇలాంటి కీలక విషయాలన్నింటిపైనా షర్మిళతో చర్చించిన అనంతరం పొంగులేటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ఊహించని ట్విస్ట్ : షర్మిళ పార్టీలోకి పొంగులేటి
న్యూజీలాండ్ కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్
ఇండోర్ లో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోవటంతో పరిమిత 50 ఓవర్లలో 385 పరుగుల లక్ష్యాన్ని కివీస్ ముందు ఉంచింది. ఓపెనర్ల తర్వాత విరాట్ కోహ్లీ కాసేపు మెరుపులు మెరిపించగా.. ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ఎవరూ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోయారు. 17 బాల్స్ లోనే 36 పరుగులు చేసిన విరాట్ డఫ్ఫీ బౌలింగ్ లో క్యాచౌట్ గా వెనుదిరగగా.. ఇషాన్ కిషన్ 17, సూర్యకుమార్ యాదవ్ 14, వాషింగ్టన్ సుందర్ 9, షార్దూల్ ఠాకూర్ 25, పరుగులు చేశారు. మిడిలార్డర్ లో హార్థిక్ పాండ్యా ఒక్కటే హాఫ్ సెంచరీతో రాణించాడు. 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 బాల్స్ లోనే 54 రన్స్ చేసిన పాండ్యాను డఫ్ఫీ పెవిలియన్ చేర్చాడు.
మొత్తానికి ఓపెనర్ల పుణ్యమానీ టీమిండియా భారీ స్కోరు నమోదు చేసింది. మూడేళ్ళ తర్వాత సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఇన్నింగ్స్ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. 386 పరుగుల లక్ష్యాన్ని సాధించటం కివీస్ కు అంత ఈజీ కాదు. ఈ వన్డేలో కూడా న్యూజీలాండ్ ఓడిపోతే భారత్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసినట్టే. వరల్డ్ కప్ ముందు సిరీస్ క్లీన్ స్వీప్ చేసి ఆత్మవిశ్వాసంతో వరల్డ్ కప్ కు సిద్ధం కావాలని టీమిండియా ఆకాంక్ష.
దిగ్విజయ్ సర్జికల్ స్ట్రైక్స్ వ్యాఖ్యలపై రాహుల్ కామెంట్
సర్జికల్ స్ట్రైక్స్ కు ఎలాంటి ఆధారాలు లేవనీ.. అది కేవలం బీజేపీ ప్రభుత్వం కల్పన మాత్రమేనంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. దిగ్విజయ్ సింగ్ వివాదాస్ఫద వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. భారత సైన్యంపై పిచ్చి ప్రేలాపనలు పేలవద్దనీ.. ఇలాంటి వాటితో రాజకీయం చేసి ఓట్లు సంపాదించటం కాంగ్రెస్ కు అలవాటైందనీ బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యల పట్ల ఊహించని విధంగా స్పందించాడు. దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేననీ.. వాటితో తనకు సంబంధం లేదని చెప్పాడు రాహుల్. తనకు భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉందనీ.. వారు చేసిన పని రుజువులు చూపించాల్సిన అవసరం వాళ్ళకు లేదనీ చెప్పాడు రాహుల్.
అయితే.. ఇదే రాహుల్ గాంధీ గతంలో దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలే చేశాడు. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని మోడీ చెప్పటంపై తనకు నమ్మకం లేదని వ్యాఖ్యానించిన రాహుల్.. సర్జికల్ స్ట్రైక్స్ కు రుజువేంటని ప్రశ్నించాడు. దీంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. బీజేపీ నేత ఒకరు.. రాహుల్ మీ తండ్రి రాజీవ్ అని చెప్పేందుకు రుజువు ఉందా అంటూ అభ్యంతరకరమైన విమర్శ చేయగా.. అది కూడా రాద్ధాంతంగా మారింది. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ గురించి వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసిన రాహుల్.. ఇప్పుడు మాట మార్చాడు. అయితే.. దిగ్విజయ్ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. ఎప్పుడో ముగిసిన వివాదాన్ని మళ్ళీ రాజేసి కాంగ్రెస్ పార్టీని విమర్శల పాలు చేయవద్దని దిగ్విజయ్ కు అధిష్టానం చెప్పినట్టు సమాచారం.
తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల-పవన్ కళ్యాణ్
తన కొత్త వాహనం వారాహికి పూజలు చేయించేందుకు గానూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ మీడియా సమావేశంలో మాట్లాడాడు. ఈ సందర్భంగా పవన్ పలు కీలక అంశాలపై క్లారిటీ ఇచ్చాడు. తెలంగాణలో 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని చెప్పాడు. ఆయా స్థానాల్లో తాను ఖచ్చితంగా పర్యటిస్తానని చెప్పాడు. తెలంగాణలో పూర్తి స్థాయిలో జనసేన బరిలో నిలవదని స్పష్టం చేశాడు. బలం లేని చోట పోటీ చేయకూడదు అనేది తన ఉద్దేశమనీ.. అందుకే తెలంగాణలో తన పాత్ర పరిమితమేననీ పవన్ క్లారిటీ ఇచ్చాడు.
తెలంగాణ ఉద్యమనేల అనీ.. తెలంగాణ నేల తనకు పునర్జన్మనిచ్చిన నేలగా తాను భావిస్తాననీ చెప్పాడు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రజల పోరాట పటిమ చాలా గొప్పదనీ.. ఈ నేలపై తిరిగితే.. ఈ గాలి పీల్చితే.. ఆవేశం వస్తుందనీ పవన్ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన పోరాట స్ఫూర్తితోనే తాను ఏపీలో రాక్షసుల వంటి మనుషులతో పోరాటం చేస్తున్నాననీ చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం కనుక తెలంగాణలో ఉండి ఉంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరగబడే వారనీ.. ఇక్కడి లెక్క వేరనీ పవన్ వ్యాఖ్యానించాడు. ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో కనీసం 10 మంది జనసైనికులు మాట్లాడాలనేది తన ఆకాంక్ష అని పవన్ తన మనసులో మాట చెప్పాడు. ఓటుకు మాత్రమే రాజకీయ నాయకులు భయపడతారనీ.. అలాంటి ఓటు ద్వారానే ప్రజలు సమాధానం చెప్పాలనీ అన్నాడు. నోటాకు మాత్రం ఓటు వేయకండి అంటూ సూచన ఇచ్చాడు. తెలంగాణ గురించి.. ఉద్యమం.. పోరాటం.. ఇవన్నింటి గురించీ మాట్లాడిన పవన్ కేసీఆర్ బీఆర్ఎస్ ను తాను స్వాగతిస్తానన్నాడు. ఈ సందర్భంగా పవన్ ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్శీ క్రియేట్ చేసే వ్యాఖ్యలు చేయకపోవటం విశేషం.
సెంచరీలతో రెచ్చిపోయిన ఓపెనర్లు.. భారీ స్కోర్ దిశగా భారత్
భారత్-న్యూజీలాండ్ ల మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇండోర్ లో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా ఓపెనర్లు సెంచరీలతో చెలరేగిపోయారు. సుమారు రెండేళ్ళ తర్వాత రోహిత్ శర్మ శతకం నమోదు చేయగా.. మంచి ఫామ్ లో ఉన్న శుబ్మన్ గిల్ అదే ఫామ్ ను కొనసాగిస్తూ శతకం బాదాడు. 85 బాల్స్ లో 6 సిక్సర్లు, 9 ఫోర్లతో సెంచరీ చేసిన రోహిత్.. ఆ వెంటనే ఔటయ్యాడు. 101 పరుగుల వద్ద బ్రేస్ వెల్ బౌలింగ్ లో బౌల్డ్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్ 78 బాల్స్ లో 5 సిక్సర్లు, 13 ఫోర్లతో సెంచరీ నమోదు చేసి.. 112 పరుగుల వద్ద టిక్నర్ బౌలింగ్ లో క్యాచౌట్ గా వెనుదిరిగాడు. ఓపెనర్లు 200 పరుగులకు పైగా ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు.
ఓపెనర్లిద్దరూ ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్ గా వచ్చిన విరాట్ కోహ్లీ కూడా రెచ్చిబోయి బ్యాటింగ్ చేస్తున్నాడు. వచ్చీ రాగానే సిక్సర్లు, ఫోర్లు బాదేస్తున్నాడు కోహ్లీ. మరోవైపు ఇషాన్ కిషన్ నిలకడగా బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే భారత్ స్కోర్ 250 చేరుకుంది. ఇదే ఊపుతో భారత్ బ్యాట్స్ మెన్ రెచ్చిపోతే భారీ స్కోర్ నమోదు చేయటం ఖాయం. కనీసం చివరి వన్డేలోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని కివీస్ భావిస్తుండగా.. భారత్ క్లీన్ స్వీప్ పై కన్నేసింది.
జన సంద్రమైన కొండగట్టు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనతో ఆ ప్రాంతమంతా అభిమానులతో నిండిపోయింది. పవన్ ను చూడటానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున కొండగట్టు చేరుకోవటంతో కొండగట్టు జనసంద్రమైంది. పవన్ కళ్యాణ్ త్వరలో ఏపీలో బస్సు యాత్ర నిర్వహించటానికి నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఆ బస్సు యాత్ర కోసమే పవన్ ప్రత్యేకమైన బస్సును తయారు చేయించుకున్నాడు. ఆర్మీ వ్యాన్ ను పోలిన ఈ బస్సు పేరు వారాహి అని పెట్టుకున్న పవన్.. తన వాహనానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు చేయించటానికి ఈ రోజు తెలంగాణలో అడుగు పెట్టాడు. పవన్ రాకతో తెలంగాణ జనసేన పార్టీ కార్యకర్తలు భారీ హంగామా చేస్తున్నారు.
కొండగట్టు తర్వాత ధర్మపురి క్షేత్రాన్ని కూడా పవన్ సందర్శించనున్నాడు. బస్సుయాత్రకు ముందు పవన్ కళ్యాణ్ పలు నరసింహ క్రేత్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నాడట. అలాగే తాను వెళ్ళిన ప్రతి చోటా జనసేన కార్యకర్తలతో సమావేశం జరిపి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తాడని తెలుస్తోంది. అయితే.. పవన్ కళ్యాణ్ ఏపీలో ఎప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నాడనేది మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు.
ఢిల్లీలో భూకంపం
రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. సుమారు 30 సెకన్ల పాటు భూమి కంపించటంతో జనం ఇళ్ళను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని చాలా సేపు వీధుల్లోనే జనం నిల్చుండిపోవటం కనిపించింది. నేపాల్ లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందనీ.. దాని ప్రభావంగానే ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించిందనీ అధికారులు చెప్తున్నారు. 20 రోజుల క్రితం జనవరి 5వ తేదీన అప్ఘనిస్తాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో కూడా ఇదే తరహా భూకంపం సంభవించగా.. దాని ప్రభావం వల్ల కూడా ఢిల్లీలో ప్రకంపనలు కనిపించాయి.
సోమవారం నాడు ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని టొబెలోకు 162 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 12 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అధికారులు చెప్తున్నారు.
బాలకృష్ణ కామెంట్లపై నాగచైతన్య రియాక్షన్
వీరసింహారెడ్డి విజయోత్సవ సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రాజేశాయి. నిన్న రాత్రి జరిగిన ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో బాలకృష్ణ మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. దీనిపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అక్కినేని నాగచైతన్య బాలకృష్ణ కామెంట్లపై ట్విట్ ద్వారా స్పందించాడు. ఎన్టీఆర్, ఎస్వీఆర్, ఏఎన్ఆర్ తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు.. వారిని అగౌరవపరచటం అంటే మనల్ని మనం అగౌరవపరిచినట్టే అంటూ నాగచైతన్య, అఖిల్ ట్వీట్ లో పేర్కొన్నారు.
నిన్న రాత్రి జరిగిన విజయోత్సవ సభలో బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు బాలకృష్ణ అభిమానులు.. ఇటు అక్కినేని అభిమానులు దీనిపై కామెంట్లు చేస్తుండటంతో టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే.. అక్కినేని నాగార్జున మాత్రం దీనిపై స్పందించలేదు. బాలయ్య కావాలని అలా మాట్లాడలేదని.. ఫ్లోలో తెలియకుండా జరిగిందనీ బాలకృష్ణ ఫ్యాన్స్ వాదిస్తే.. ఏది ఏమైనా పెద్ద వాళ్ళ పట్ల అలా నోరు జారటం తప్పు అని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు.
అమెరికాలో ఇండియన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు
2022 పోతూ పోతూ శాంటాక్లాజ్ ద్వారా సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు బోలెడన్ని కష్టాలను క్రిస్మస్ గిఫ్ట్ గా ఇచ్చిపోతే.. 2023 సంవత్సరం వస్తూ వస్తూనే ఆ కష్టాలను వంద రెట్లు చేసింది. ప్రపంచం మొత్తం ఐటీ సంక్షోభం ఆవహిస్తోంది. ఇప్పటికే దిగ్గజ కంపెనీలన్నీ లేఆఫ్స్ పేరిట ఉద్యోగులను ఇంటికి పంపించేస్తుంటే.. ఇక ఇప్పుడు చిన్న కంపెనీల వంతు కూడా వచ్చేసింది. మల్టీ నేషనల్ కంపెనీలే ప్రాజెక్టులు లేక ఉద్వాసన పర్వం కొనసాగిస్తుంటే.. ఆ కంపెనీల ప్రాజెక్టులను ఔట్ సోర్సింగ్ పేరుతో పూర్తి చేసి పెట్టే డొమెస్టిక్ కంపెనీల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇక ఐటీ ప్రపంచాన్ని శాసించే అమెరికాలో ఐటీ రెసిషన్ విలయ తాండవం చేస్తోంది. గూగుల్, అమేజాన్ సహా అనేక కంపెనీలు ప్రస్తుతం ఉద్యోగులను తగ్గించుకుంటోంది. ఇదే అమెరికాలోని ఇండియన్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను గజగజ వణికిస్తోంది.
ఓ కంపెనీలో ఉద్యోగం పోతే మరో కంపెనీలో ఉద్యోగం వెతుక్కునే పరిస్థితైనా ఉండేది గతంలో.. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. అన్ని కంపెనీలూ లేఆఫ్స్ పర్వం కొనసాగిస్తుంటే ఇక ఉద్యోగం దొరికేదెలా.. కరోనా పాండమిక్ సమయంలో ఉద్యోగాల కోత జరిగినా అది చాలా చాలా తక్కువ. చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ కు మారిపోయారే తప్ప పెద్దగా ఉద్యోగాల కోతల్లేవ్. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అయితే.. ఈ ఐటీ రెసిషన్ కు కారణం అమెరికా తీసుకున్న నిర్ణయాలే. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి పెద్దన్న స్థాయిలో అడ్డు చెప్పాల్సింది పోయి.. రష్యా మీద ప్రతీకారం తీర్చుకోవాలన్న కోరికతో ఉక్రెయిన్ కు కోట్లాది డాలర్లను సాయంగా ప్రకటించి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంది అమెరికా. దాని ఫలితమే ప్రస్తుతం ప్రపంచం పాలిట శాపంగా పరిణమించింది. వినాశనం దిశగా అమెరికా పోతూ పోతూ తన వెంట మిగితా ప్రపంచాన్ని కూడా ఈడ్చుకెళ్ళింది. దాని ఫలితమే అమెరికా కేంద్రంగా పనిచేసే దిగ్గజ కంపెనీలైన గూగుల్, అమేజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, స్ట్రైప్, హెచ్ పీ, ట్విటర్, గోల్డ్ మెన్ సాక్స్, అడోబ్.. ఇలా చాలా కంపెనీలు సుమారు లక్ష మంది సాఫ్ట్ ఉద్యోగులను రోడ్డున పడేశాయి. అందులో మనోళ్ళు కూడా ఉన్నారు. ఈ మాంద్యం కోరలు విరిచే బ్రహ్మాస్తం ఎవరి దగ్గర ఉందో.. ఎప్పుడు వస్తుందో.. ఎదురు చూడాలంతే.
అతియా శెట్టీ కేఎల్ రాహుల్ పెళ్ళిలో స్టార్ల సందడి
గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి.. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ఈ రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్న ఈ జంట.. జనవరి 23న పెళ్ళి అంటూ అనౌన్స్ మెంట్ చేసినప్పటి నుంచి బాలీవుడ్ కళ్ళన్నీ వీరిపైనే ఉన్నాయి. ముంబై ఖండాలాలోని తమ నివాసంలోనే ఘనమైన ఏర్పాట్ల మధ్య.. కుటుంబ సభ్యులు.. బంధువులు మధ్య అట్టహాసంగా కొద్దిసేపటి క్రితమే వివాహ తంతు పూర్తైంది. అతియా బాలీవుడ్ నటి కావటంతో అటు బాలీవుడ్ నుంచి స్టార్లు.. కేఎల్ రాహుల్ క్రికెటర్ కావటంతో ఇటు క్రికెట్ స్టార్లు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆదివారం సాయంత్రం నుంచే వీరిద్దరి వివాహ వేడుక ముంబైలో మోస్ట్ ఇంట్రస్టెడ్ ఈవెంట్ గా మారింది.
బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, మనా శెట్టి గారాల పుత్రిక కావటంతో అతియా శెట్టీ వివాహం రంగరంగవైభవంగా చేశాడు సునీల్ శెట్టి. ఆదివారం సాయంత్రం కుటుంబ సన్నిహితుల మధ్య సంగీత్ వేడుకలు జరిగాయి. సోమవారం సాయంత్రం 4 గంటలకు నిశ్చయించిన ముహూర్తానికి వివాహ తంతు పూర్తైంది. అనుష్క శెట్టి-విరాట్ కోహ్లీ బాలీవుడ్-క్రికెట్ పెళ్ళిళ్ళ వరుసలో ఇదే తర్వాతది.