Home Blog Page 2

మణిపూర్ అల్లర్ల కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

0

మేథీ, కూకీ తెగల మధ్య రగిలిన గొడవలు మణిపూర్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిన విషయం తెలిసిందే. అల్లర్లు మొదలై 2 నెలలు దాటినా ఇప్పటికీ మణిపూర్ లో పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. పరిస్థితి కాస్త సద్దుమణిగిందని భావించి కర్ఫ్యూ సడలించగానే మళ్ళీ జనాలు తుపాకులతో వీరంగం సృష్టిస్తున్నారు. దీంతో ఆర్మీ మణిపూర్ లో కర్ఫ్యూను సడలించటానికి కూడా జంకుతున్నది. అయితే.. మణిపూర్ లో అల్లర్లను అదుపు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లను అదుపుచేయటంలో కోర్టు జోక్యం చేసుకోవాలంటూ పబ్లిక్ ఇంట్రస్ట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషనర్ల తరఫున అడ్వొకేట్ కొలిన్ గొంజాల్వెస్ సుప్రీంలో వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

మణిపూర్ అల్లర్ల విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలను పర్యవేక్షించటం మాత్రమే సుప్రీంకోర్టు చేయగలదనీ.. ఇందులో కలగజేసుకొని శాంతి భద్రతలను నడపటం సుప్రీంకోర్టు పని కాదనీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడటం ప్రభుత్వం యొక్క ప్రథమ విధి అనీ.. కోర్టులు కలగజేసుకొని చర్య తీసుకోలేవనీ చెప్పారు. కావాలంటే ప్రభుత్వానికి కావాల్సిన సూచనలతో కూడిన ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు.

దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రభుత్వం తరఫున వాదిస్తూ.. కోర్టు ముందు ప్రభుత్వం నివేదిక ఉంచిందనీ.. ప్రభుత్వం సమర్పించిన నివేదిక పూర్తిగా అధ్యయనం చేయాలనీ కోరారు. కోర్టుకు ఎప్పుడూ తప్పుడు సమాచారం అందజేయకూడదని వ్యాఖ్యానించిన తుషార్ మెహతా.. చిన్న తప్పుడు చర్య కూడా పరిస్థితి మరింత దారుణంగా మారటానికి కారణం కావచ్చని చెప్పారు. దీనిపై సుప్రీంకోర్టు మరో వ్యాఖ్య కూడా చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం హింసను వాడుకోకూడదనీ.. కోర్టులను ఇలాంటి విషయాల్లో కలగజేసుకోవాలని ఎవ్వరూ కోరకూడదనీ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మణిపూర్ లో పరిస్థితిని మేం గమనిస్తున్నాం..

కానీ శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వాన్ని కాదని కలగజేసుకోవటం తప్పుడు సంకేతాలను ఇస్తుంది.. ఇలాంటి పిటిషన్లు వేసి తప్పుదోవ పట్టించటం సరికాదు.. అంటూ మొట్టికాయలు వేశారు జస్టిస్ చంద్రచూడ్. ప్రస్తుతం మణిపూర్ లో హింస అదుపులోనే ఉన్నప్పటికీ.. కర్ఫ్యూ ఎత్తివేసే పరిస్థితులు మాత్రం లేవు. రెండు రోజుల క్రితం ప్రజలు నిత్యావసరాలు కొనుక్కునేందుకు కర్ఫ్యూను సడలించిన కొద్ది సేపట్లోనే ఓ మహిళ కాల్చి చంపబడింది. ప్రజల్లో ఆవేశం చల్లారేంత వరకూ మణిపూర్ లో కర్ఫ్యూ సడలించే అవకాశాలు కనిపించటం లేదు.

సిరియాలో అమెరికా రష్యా డైరెక్ట్ వార్ : అమెరికన్ డ్రోన్లు కూల్చి వేసిన రష్యా

ఇంత కాలం ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా తలపడిన అమెరికా, రష్యా దేశాలు.. ఇప్పుడు నేరుగా పరోక్ష యుద్ధానికి దిగాయి. అమెరికా, రష్యా దేశాలకు సంబంధించిన యుద్ధ విమానాలు నేరుగా దాడులకు పాల్పడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ యుద్ధం ఎక్కడిదాకా వెళ్తుందోనని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. సిరియాలో అమెరికా వైమానిక దళం స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అమెరికన్ యుద్ధ విమానాలపైకి ష్యాకు చెందిన ఎస్‌యూ-34 ఫైటర్‌ జెట్లు దూసుకు వెళ్లడమే కాకుండా.. మంటలు రాజేసి ఎంక్యూ-9 రీపర్ల సామర్థ్యం దెబ్బతినేలా చేశాయి. ఇందుకు సంబంధించి అమెరికా వీడియోను విడుదల చేసింది. సిరియాలోని ఐఎస్ఐఎస్ పై తమ డ్రోన్లు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నాయనీ.. ఆ డ్రోన్ల పైకి రష్యను యుద్ధ విమానాలు దూసుకెళ్ళి తమ డ్రోన్లను ధ్వంసం చేసిందనీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు చెప్తున్నారు. రష్యా చేసిన ఈ పని వల్ల చిన్నపాటి యుద్ధమే జరిగింది రెండు దేశాల మధ్య. ఇరు దేశాల ప్రతినిథులు ఒకరికి ఒకరు నేరుగా హెచ్చరికలు చేయటం.. ఎవ్వరూ వెనక్కి తగ్గకపోవటంతోో ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైందనే ‌భావించింది ఐక్యరాజ్యసమితి. కానీ.. చివరకు ఇరుదేశాలు కాస్త శాంతించాయి.

ఈ నెల 5న ఉదయం 10 గంటల 40 నిమిషాలకు జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మరోసారి అమెరికా డ్రోన్లను రష్యా ఫైటర్ జెటంలు వెంటాడాయి. ఈ రెండో ఘటనకు వాయవ్య సిరియా వేదికయింది. వాస్తవానికి.. ఈ డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలు ఉండవు. కేవలం నిఘా వ్యవస్థల కోసం వీటిని ఉపయోగిస్తారు. అలాంటి డ్రోన్లపై రష్యా దాడి చేయడం చూస్తుంటే అమెరికాతో తేల్చుకోడానికి దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇవ్వడమే లక్ష్యంగా చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అమెరికా సెంట్రల్ కమాండ్‌హెడ్ జనరల్ ఎరిక్ కురిల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయత్నాలను రష్యా అడ్డుకోవడం వల్ల సిరియా గగనతలంలో మరింత ముప్పును పెంచుతోందని చెప్పారు. ఇవే పరిస్థితులు కొనసాగితే పరిస్థితులు దారుణంగా మారిపోతాయంటూ పరోక్షంగా పుతిన్‌ను హెచ్చరించే ప్రయత్నం చేశారు.

ఈ రెండు ఘటనలకు ముందు కూడా అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను రష్యా యుద్ధ విమానాలు కూల్చివేశాయి. నల్ల సముద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను మాస్కో ఫైటర్ జెట్లు కూల్చివేస్తున్న దృశ్యాలను కూడా పెంటగాన్‌ విడుదల చేసింది. అమెరికాకు చెందిన ఎంక్యూరీపర్‌- 9 డ్రోన్‌ వైపు రష్యాకు చెందిన రెండు సుఖోయ్‌ యుద్ధ విమానాలు దూసుకొస్తున్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. డ్రోన్‌పై రష్యా విమానాలు వెళ్లినప్పుడు దానికి ఏర్పాటు చేసి ఉన్న కెమెరాకు అంతరాయం కలిగింది. ఎస్​యూ-27 ఫైటర్ జెట్.. డ్రోన్‌పై ఇంధనాన్ని విడుదల చేయడం వల్ల డ్రోన్‌ దెబ్బతిందని పెంటగాన్ వివరించింది. ఐతే ప్రొపెల్లర్ ధ్వంసం కావడం వల్ల డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో కూల్చివేయాల్సి వచ్చిందని అమెరికా.. ఘటన జరిగాక వెల్లడించింది. ఆ సమయంలో ఇది ముమ్మాటికీ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని హెచ్చరించిం ది. అమెరికా వ్యాఖ్యలపై రియాక్టయిన మాస్కో.. తమ యుద్ధ విమానాలు రీపర్ డ్రోన్‌ను ఢీకొట్టడం గానీ, కాల్పులు జరపడం గానీ చేయలేదని పేర్కొంది. తమ సరిహద్దులకు సమీపంలో ఎగిరిన డ్రోన్‌.. రష్యాలోకి చొచ్చుకొచ్చిందని తెలిపింది. రష్యా యుద్ధ విమానాలను అడ్డగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసి నీటిలో కూలిపోయిందని కౌంటర్ ఇచ్చింది.

ఇదిలా ఉంటే.. సిరియాలో అయినా నల్ల సముద్రంపైన అయినా క్రెమ్లిన్ ఆదేశాలు లేకుండా అమెరికా డ్రోన్లపై దాడులు జరిగే ఛాన్స్ లేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మాస్కో ఎయిర్ ఫోర్స్ ఈ రేంజక్ యాక్షన్‌లోకి దిగుతుంది. అంటే, తాజా దాడులు కూడా పుతిన్ ఆదేశాలతో జరిగాయన్న మాటే. జరుగుతున్నది చూస్తుంటే పుతిన్ అన్నింటికీ తెగించే యాక్షన్ కు ఆదేశాలిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇటు ఉక్రెయిన్ కధ ముగించేందుకు బెలారస్‌లో వ్యూహాత్మక అణ్వాయుధాలను మోహరించిన పుతిన్.. ఇప్పుడు సిరియా వేదికగా అమెరికాను టార్గెట్ చేసి నాటో కూటమికి డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తోంది.
ఇలా పదే పదే అమెరికా డ్రోన్లు రష్యా ఫైటర్ జెట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను అమాంతం పెంచేస్తోంది. ఉక్రెయిన్​పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత ఇరు దేశాలు ఇలా నేరుగా ఘర్షణ పడటంపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు..

ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత అమెరికాకు చెందిన ఓ ఎయిర్‌క్రాఫ్ట్ లేదంటే డ్రోన్లపై మాస్కో దాడులు చేయడం ఇప్పుడే అని విశ్లేష కులు చెబుతున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే అమెరికా-రష్యా మధ్య యుద్ధానికి సిరియా దాడులు తొలి అడుగు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు రక్షణ నిపుణులు. అదే జరిగి తాజాఉద్రిక్తతలు తీవ్రరూపుదాల్చితే ప్రపంచానికి అంతకుమించిన శాపం మరొకటి ఉండదు. ఉక్రెయిన్ తో యుద్ధం వల్ల అన్ని రకాలుగా నష్టపోయిన పుతిన్.. అమెరికా విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదనీ.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రెండు దేశాల మధ్య ప్రత్యక్ష యుద్ధం తప్పదనీ.. ఇది ప్రపంచ యుద్ధానికి మొదటి అడుగు అవుతుందనీ అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

మరోసారి భగ్గుమన్న ఖలిస్తాన్ వేర్పాటు వాదం : మోడీ సర్కార్ కు సవాల్

అమృత్‌పాల్ సింగ్.. వారిస్ పంజాబ్ దే చీఫ్ గా తనను తాను ప్రకటించుకొని.. పంజాబ్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టి, సామాజిక మాధ్యమాల ద్వారా యువతను బుట్టలో వేసుకుని ఖలిస్తానీవాదం నూరిపోసిన వ్యక్తి. కొంతకాలం కిందట పంజాబ్‌లో అమృత్‌‌పాల్ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. తన మద్దతు దారుల కోసం పోలీస్ స్టేషన్ లో కత్తులు కటార్లతో వీరంగం సృష్టించడం దగ్గర నుంచి.. పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వరకూ.. దాదాపు 35 రోజుల సుదీర్ఘ ఆపరేషన్‌ తర్వాత పోలీసులకు చిక్కడం వరకూ ఇతడి పేరు దేశంలో మార్మోగుతూనే ఉంది. చివరికి అమృత్‌పాల్ సింగ్‌ను అరెస్ట్ చేసిన తర్వాత దేశంలో ఖలిస్తానీవాదానికి ఆల్మోస్ట్ ఎండ్‌కార్డ్ పడిపోయింది. అడపాదడపా ఖలిస్తానీ పోస్టర్లు కలకలం రేపినా, వాటికి ఎప్పటికప్పుడు కేంద్రం చెక్ పెట్టేస్తోంది. కానీ, విదేశాల్లో కూడా ఇలాంటి అమృత్‌పాల్ సింగ్ ఒకరున్నారు. భారత ఎంబసీలపై జరుగుతున్న ప్రతిదాడి వెనుక అతడి హస్తం కనిపిస్తోంది. తాజాగా అతడు ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు వార్తలొచ్చాయి. కానీ, అందులో నిజం లేదంటూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.

ఆ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు గురుపత్వంత్ సింగ్ పన్నూ.. సిఖ్ ఫర్ జస్టిస్ చీఫ్. విదేశాల్లో రెచ్చిపోతున్న ఖలిస్తానీ భూతాన్ని ముందుండి నడిపిస్తున్నది ఇతడే. తాజాగా ఓ రోడ్డు ప్రమాదంలో ఇతడు మరణించినట్టు వార్తలొచ్చాయి. కానీ, అనూహ్యంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ముందు నిల్చుని మాట్లాడుతున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కెనడా, అమెరికా, యూకేల్లో భారతీయ దౌత్యవేత్తలను బెదిరిస్తూ వెలిసిన పోస్టర్ల వెనక తన హస్తం ఉన్నట్లు పన్నూ స్పష్టం చేశాడు. ఇటీవల కెనడాలో చంపబడిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ తన సోదరుడని.. ఆయనతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉన్నట్లు చెప్పాడు. హర్దీప్‌సింగ్ నిజ్జర్ చనిపోవడానికి అమెరికా, కెనడాల్లోని భారతీయ దౌత్యవేత్తలే కారణం అని తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు. న్యూయార్క్‌లో యూఎన్ కార్యాలయం ముందు నిలబడి.. ఓదో రోజు ఖలిస్తాన్ జెండా ఇక్కడ ఎగురుతుందని అనడం వీడియోలో చూడవచ్చు. ఈ ఒక్క వీడియో చాలు ఖలిస్తానీవాదాన్ని ఎలా ముందుకు తీసుకెళుతున్నాడో చెప్పడానికి.

ఈ వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత ఎవరీ పన్నూ? అతడి గురించి భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది? అని సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. గురు పత్వంత్ సింగ్ స్వస్థలం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఖాంకోట్‌ గ్రామం. తండ్రి మహేందర్‌సింగ్‌ పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం పాకిస్తాన్‌ నుంచి ఇక్కడికి వచ్చింది. పన్నూది ధనిక కుటుంబం.. వ్యవసాయ భూములు, విద్యా సంస్థలు ఉన్నాయి. ముగ్గురు సంతానంలో ఒకరైన పన్నూ గురించి స్వగ్రామంలో ఎవరికీ పెద్దగా తెలియదు. పంజాబ్‌ విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తిచేసి.. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. ఆ దేశ పౌరసత్వం తీసుకొని అమెరికా, కెనడాల్లో న్యాయవృత్తిలో ప్రవేశించాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉన్నా.. 2007లోనే అతడిలోని రెండో మనిషి బయటకొచ్చాడు.

2007లో కొందరితో కలిసి సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థను ప్రారంభించి.. మానవ హక్కుల కోసం ఏర్పాటుచేసిన సంస్థగా చెప్పుకున్నాడు గురుపత్వంత్ సింగ్ పన్నూ. పంజాబ్‌ను సిక్కుల స్వయంప్రతిపత్తి ప్రాంతంగా ఖలిస్తాన్‌ ఏర్పాటు చేయటం తమ ఉద్దేశంగా పేర్కొన్నాడు. అప్పటి నుంచి విదేశాల్లో భారత వ్యతిరేక ప్రదర్శనలు, ఆందోళనలు సభలు, సమావేశాలకు కేంద్ర బిందువుగా వ్యవహరిస్తున్నాడు. కెనడా, అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. సోషల్‌ మీడియా లో రెచ్చగొట్టే పోస్టులు పెడుతూ.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ భవనాలపై తరచూ ఖలిస్తాన్‌ జెండా ఎగరేస్తూ అందరి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నాడు. అంతేకాదు, ఖలిస్తాన్‌ జెండా చేతపట్టే వారికి ఐ-ఫోన్లు, ఇతర ఖరీదైన బహుమతులను ఎరగా వేసి యువతను ఆకర్షిస్తుంటాడు. అంతటితో ఆగకుండా భారత నేతలను న్యాయపరంగా ఇరుకునపెట్టే ప్రయత్నాలు సైతం చేస్తూ వస్తున్నాడు.

2014లో ప్రధాని మోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, సోనియాగాంధీ, సుఖ్‌బీర్‌సింగ్‌ బాదల్‌, పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌సింగ్‌లపై అమెరికా, కెనడాల్లో కేసులు కూడా వేశాడు. ఈ కేసులతోనే అమరీందర్‌ సింగ్‌ 2016లో అమెరికా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత భారత్-చైనా గల్వాన్ ఘర్షణల్లో చైనాకు మద్దతుగా ప్రకటన చేశాడు. గల్వాన్‌లో చైనా సైనికుల పట్ల భారత సైన్యం జరిపిన క్రూరమైన దాడిని ఖండిస్తున్నట్టు జిన్‌పింగ్‌కు సంఘీభావం తెలిపాడు. ఇలాంటి ఎన్నో భారత వ్యతిరేక చర్యలకు పూనుకున్నాడు పన్నూ. ఈ క్రమంలోనే ఎస్‌ఎఫ్‌జే చర్యలు హద్దులు శ్రుతి మించడంతో 2019లో ఈ సంస్థను కేంద్రం నిషేధించి..

అనంతరం పన్నూను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇలాంటి ఛాన్స్ కోసమే చూసే పాక్.. రెఫరెండమ్-2020పేరుతో ఖలిస్తాన్‌కు మద్దతు కూడగట్టే పన్నూ ప్రయత్నాలకు మద్దతు ఇచ్చింది. అప్పటి నుంచీ పత్వంత్ సింగ్ పన్నూ మరింత రెచ్చిపోవడం మొదలుపెట్టాడు.
ఇప్పుడు పత్వంత్‌సింగ్ పన్నూను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. లేదంటే విదేశాల్లో ఖలిస్తానీవాదం మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. కానీ, అమృత్‌పాల్ సింగ్‌‌ను అరెస్ట్ చేసినంత ఈజీగా పన్నూను అడ్డుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. విదేశాల వ్యవహారం కాబట్టి ఆయా దేశాల నుంచి సహకారం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కెనడా లాంటి దేశాలయితే ఇందుకు అంగీకరించే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. మరి ఈ విషయంలో మోడీ సర్కార్ ఎలా ముందుకెళుతుందో చూడాలి.

కశ్మీర్ పై భారత్ యాక్షన్ తీసుకోబోతున్నదా ?

ప్రపంచంలో ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యలు అంటూ ఓ పదేళ్ళ క్రితం యూరప్ మీడియా కొన్ని సమస్యలతో ఓ లిస్టు అనౌన్స్ చేసింది. వాటిలో ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్య మొదటిది కాగా.. భారత్ పాకిస్తాన్ మధ్య గల కశ్మీర్ సమస్య రెండోది.. అలాగే బాబ్రీ మసీదు సమస్య మూడోది. భారత్ లో కుంభకోణాల సమస్య 9వ సమస్యగా యూరప్ మీడియా మొత్తం 20 సమస్యల లిస్ట్ ఇచ్చింది. ఈ పదేళ్ళలో ఆ లిస్టులో ఉన్న సమస్యల్లో భారత్ లోని రెండు సమస్యలు పరిష్కారమైపోయాయి. ఒకటి.. విదేశాలతో కుంభకోణాలు.. రెండోది బాబ్రీ మసీదు. ఇలా జరుగుతుందని యూరప్ మీడియానే కాదు.. భారత్ కూడా ఊహించలేదు. కానీ.. ఈ పదేళ్ళలో టాప్ టెన్ లోని రెండు సమస్యలు భారత్ పరిష్కరించుకుంది. ఇక ఇప్పుడు మూడో సమస్యను కూడా పరిష్కరించాల్సిన టైమ్ వచ్చేసిందనిపిస్తోంది. అదే.. భారత్ పాకిస్తాన్ మధ్య గల కశ్మీర్ సమస్య.

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేయటంతో యావత్ భారతదేశం అల్లకల్లోలంగా మారింది. అక్కడ రామమందిరం ఉండేదంటూ మొదలైన వివాదం సుప్రీంకోర్టులో దశాబ్ధాల తరబడి నలిగింది.. చివరికి మోడీ సర్కార్ యూపీ సర్కార్ కలిసి ఈ వివాదానికి పరిష్కారం చూపించాయి. ఇప్పుడు అక్కడ హిందువులు, ముస్లింలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎవరి దేవుడికి వాళ్ళు గుడి కట్టే పనిలో బిజీగా ఉన్నారు. రామమందిర నిర్మాణానికి ముస్లింలు స్థలాన్ని విరాళంగా ఇవ్వటంతో పాటు లక్షల సొమ్ము చందాగా అందజేస్తున్నారు. మసీదు నిర్మాణానికి హిందూ సంఘాల నేతలు విరాళాలు ఇస్తున్నారు. ఇలా జరుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు.. ముఖ్యంగా భారత్ అల్లకల్లోలంగా ఉండాలని కోరుకునే కొన్ని దేశాలు అస్సలు ఊహించలేదు.. కానీ జరిగింది.

అలాగే భారతదేశంపై ఉన్న అవినీతి కుంభకోణాల మచ్చ చెరిగిపోయింది.. అందుకు కారణం ఎవరు.. ఎలా చేశారు అనేది ఇప్పుడు అప్రస్తుతం.. ఎందుకంటే దీనిపై లోతుగా చర్చిస్తే అది వ్యక్తి పూజలా కనిపిస్తుంది.. సో.. టైమ్ ఫర్ పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్.
పాకిస్తాన్ ప్రస్తుతం ఆకలితో అలమటిస్తోంది.. రోజుకు ఒక్క పూట భోజనం కోసం తుపాకులతో కాల్చి చంపుకుంటున్నారు కశ్మీర్ ప్రజలు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న గోధుమ పిండి బస్తా కోసం వెళ్ళిన మనిషి బస్తాతో ఇంటికి వస్తాడో.. బుల్లెట్లకు బలైపోతాడో తెలియని పరిస్థితి. ఇక పాకిస్తాన్ సైన్యం పరిస్థితి మరీ దారుణం. కనీసం మూడు పూటలా భోజనం గతిలేదు పాక్ సైన్యానికి. యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాలు పార్కింగ్ లో పెట్టేసింది పాక్ సైన్యం. ఒకప్పుడు సరిహద్దుల్లో ఉన్న సైనికులు ట్రక్ లలో క్యాంపులకు వచ్చి భోజనాలు చేసి మళ్ళీ సరిహద్దులకు వెళ్ళే వారు అవే ట్రక్ లలో.

ఇప్పుడు బోర్డర్ నుంచి 2 కిలోమీటర్లు నడిచి క్యాంపుకు వచ్చి భోజనం చేసి వెళ్ళాలని సైనికులకు ఆదేశాలిచ్చింది పాక్ సైన్యం… డీజిల్ మిగులుతుందని. రోజుకు రెండే సార్లు సైనికులకు భోజనం లభిస్తోంది.. అది కూడా మూడు రొట్టెలు మాత్రమే. డాలర్లు చెల్లింది పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు కాబట్టి.. యుద్ధ ట్యాంకులు, విమానాలే కాదు.. రోజువారీ డ్రిల్స్ కోసం వాడే ట్రక్కులు కూడా పక్కన పెట్టేసింది. ఇలాంటి పరిస్థితుల్లో సైన్యం యుద్ధం చేయగలదా.. ఖచ్చితంగా లేదనే చెప్పాలి.
పాకిస్తాన్ వ్యాపారులు విదేశాల నుంచి చాలా వస్తువులను ఆర్డర్ చేశారు.. అవి ఇప్పుడు కరాచీ పోర్టుకు చేరి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి.. కానీ వాటికి పేమెంట్లు చేయాల్సింది డాలర్ల రూపంలో. డాలర్ రిజర్వ్ లేని పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకు ఇప్పుడు లక్షలాది డాలర్లను చెల్లించి కంటైనర్లలో ఉన్న సరుకు డెలివరీ తీసుకునేందుకు జంకుతోంది. ఆర్డర్లు పంపిన కంపెనీలు లబో దిబో మంటున్నాయి. కంటైనర్లు అక్కడే ఉన్నందుకు రోజుకు వెయ్యి డాలర్ల ఫైన్ చెల్లించాలి పాకిస్తాన్ ప్రభుత్వం.

అటు డెలీవరీ చార్జ్ చెల్లించాలా.. కంటైనర్లు నిలిపినందుకు పార్కింగ్ ఫీజు చెల్లించాలా.. ఈ నిర్ణయం తీసుకునేందుకు ఆలస్యం చేస్తే ఫైన్ చెల్లించాలా.. దిక్కుతోచకుండా ఉంది పాక్ పరిస్థితి. ఇలాంటి స్థితిలో భారత్ కనుక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే.. పాకిస్తాన్ సైన్యానికి లొంగిపోవటం తప్ప మరో ఆప్షన్ లేదు. తుప్పు పట్టిన తుపాకులు.. పార్కింగ్ లో పెట్టిన యుద్ధ ట్యాంకులు.. డీజిల్ లేక షెడ్లో పెట్టేసిన యుద్ధ విమానాలు.. దేనితో ఎదుర్కుంటారు పాక్ సైనికులు భారత సైన్యాన్ని. పాక్ ఆర్మీ క్యాంపులను కేవలం నిముషాల వ్యవధిలో మిసైల్ అటాక్స్ తో బూడిద చేయగలవు భారత్ ఇటీవల కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు. పాక్ ఒక వేళ అణుదాడికి సిద్ధపడితే.. ఆ దాడి జరిగేలోగానే భారత్ అణుదాడి చేసి మొత్తం పాకిస్తాన్ ను బూడిద చేయగలదు. సో.. భారత్ కనుక పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే.. పాకిస్తాన్ నిరభ్యంతరంగా ఇచ్చేయాలే తప్ప.. కశ్మీర్ కోసం యుద్ధం చేసి సైన్యాన్ని.. అణుదాడి చేసి మొత్తం దేశాన్నీ నాశనం చేసుకోలేదు. ఒక వేళ చైనా మనకు ఎదురు వస్తే.. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాలు భారత్ వెంట ఉంటాయి. అది చైనాకే తీరని నష్టాన్ని మిగులుస్తుంది. మొత్తానికి పాకిస్తాన్ ఇప్పుడు అష్టదిగ్బంధనంలో ఉందన్న విషయం ప్రపంచానికి తెలుసు.. ఇంత అనువైన సమయంలో భారత్ ఆ మూడో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తుందా.. ప్రపంచాన్ని వేధిస్తున్న అతి పెద్ద ప్రశ్న ఇది. బాలాకోట్ లో టెర్రరిస్టు క్యాంపుపై దాడి చేస్తాం.. పర్మిషన్ ఇవ్వండి అని ఇండియన్ ఆర్మీ అడిగితే.. కేవలం పావుగంట ఆలోచించి ఓకే చెప్పారు ప్రధాని మోడీ. మరి ఇప్పుడు మన సైనికులు మేం రెడీ అన్నారంటే.. ఇక పని అయిపోయినట్టే.

వణికిస్తున్న వెయ్యి ట్యాంకుల రేడియేషన్ వాటర్.. ఏం చేయబోతున్నారు

2011 మార్చి 11.. ఆ రోజు నిద్ర లేచిన జపనీయులకు మృత్యువే ఎదురుగా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పింది. మొదట భూకంపం, ఆ తర్వాత దాని ప్రభావంతో సునామీ జపాన్‌పై విరుచుకుపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా దాదాపు 20 వేల మంది మృత్యువాత పడ్డారు. లక్షలాది మంది జపనీయులు నిరాశ్రయులుగా మారారు. కానీ, అదే భూకంపం, సునామీ ధాటికి మరో ఉపద్రవం ముంచుకురాబోతుందని ఆ సమయంలో జపాన్ ప్రజలు ఏమాత్రం ఊహించలేదు.

సునామీ సమయంలో జపనీయులు ఊహించని ఆ ఉపద్రవం ఇదే. భూకంపం దాటికి జపాన్‌లోని ఫుకుషిమా అణుకేంద్రంలోని మూడు రియాక్టర్లు పేలిపోయాయి. అసలే భూకంపం, సునామీల దాటికి చెల్లా చెదురైపోయిన జపాన్ ప్రజలకు ఇది మరో శాపంగా మారింది. ఉన్నపళంగా వేలాది మందిని ఫుకుషిమా నుంచి దూరంగా తరలించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పట్లో 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణమో అర్ధం చేసుకోవచ్చు. అదికూడా సునామీ విరుచుకుపడ్డ సమయంలో అంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం మాటలు కాదు. కానీ, జపాన్ ప్రభుత్వం ఆ పని చేయాల్సి వచ్చింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాత పేలిపోయిన ఆ రియాక్టర్లను చల్లబర్చేందుకు వాడిన జలాలు రేడియోధార్మికతతో కలుషితమై, లీకయ్యాయి. ఆ నీటిని వెయ్యి ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. ఇప్పుడు అవే నీళ్లు జపాన్‌కు ఆనాటి గాయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాయి. గుర్తు చేయడం మాత్రమే కాదు ప్రాణసంకటంగా మారాయి కూడా.

వెయ్యి ట్యాంకుల్లో ఉన్న రేడియోధార్మికత నీళ్లను ఎన్నేళ్లని అలానే ఉంచుతారు? ఎంతకాలమని అవి ఆ ట్యాంకుల్లో అలాగే ఉంటాయి? ఏదో ఒకరోజు ట్యాంకులు ధ్వంసం అయితే? ఇలా ఒక్కటేంటి జపాన్ ప్రభుత్వాన్ని కలలోనూ వెంటాడే ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి. అందుకే, ఎలా అయినా ఆ టెర్రర్ వాటర్‌ను సముద్రంలో కలిపేసి వదిలించుకోవాలని కిషిద సర్కార్ ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది.

కానీ, రేడియోధార్మికత కలిసిన నీళ్లను సముద్రంలో కలుపుతామంటే పొరుగు దేశాలు ఊరుకుంటాయా.. జపాన్ విషయంలో కూడా అదే జరుగుతూ వస్తోంది. జపాన్ తన ప్రతిపాదనను తెరపైకి తెచ్చిన ప్రతిసారీ దాని పొరుగు దేశాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా చైనా, దక్షిణ కొరియా, ఫసిఫిక్‌లోని కొన్ని దీవులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో జపాన్ అనుకున్నది
జరగడం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జపాన్‌కు ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఫుకుషిమా న్యూక్లియర్ ప్లాంట్‌ ట్యాంకుల్లో ఉన్న జలాలను సముద్రంలో కలిపే సేందుకు ఓకే అంది. పొరుగు దేశాల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని జపాన్ చర్యలు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నాయని, ఆ జలాల వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండబోవని పేర్కొంది. ఇక్కడే జపాన్‌లో కొత్త ఆశలు చిగురించాయి. ఐఏఈఏ గైడ్‌లైన్స్ ప్రకారం ఆ నీటిని క్రమంగా సముద్రంలోకి విడుదల చేయొచ్చు. ఇందుకోసం సముద్రం కింద ఒక సొరంగాన్ని ఉపయోగించుకో వాల్సి ఉంటుంది.

అయితే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ క్లారిటీ ఇచ్చినా కానీ.. జపాన్‌ ప్రణాళికలను చైనా, దక్షిణ కొరియా లాంటి పొరుగు దేశాలు అంగీకరించడం లేదు. జపాన్ చర్యలవల్ల ప్రజారోగ్యానికి, సముద్ర పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని ఆరోపిస్తున్నాయి. జపాన్‌ మత్స్యకారులు కూడా దీనిపై ఆందోళన చెందుతున్నారు. తాము సరఫరా చేసే చేపల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతాయని వారు చెబుతున్నారు.

జపాన్ విడుదల చేసే నీటిలో ఎక్కువగా సీజియం, ఇతర రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. చాలావరకు వీటిని వడగట్టేస్తారు. ట్రిటియం ఐసోటోప్‌ను మాత్రం నీటి నుంచి వేరు చేయడం చాలా కష్టం. అందువల్ల సముద్రపు నీటితో దాన్ని వందరెట్లు పలుచగా చేసి, ఆ తర్వాతే పసిఫిక్‌ జలాల్లోకి వదులుతామని జపాన్‌ చెబుతోంది. ఫలితంగా ఆ వ్యర్థ జలాల్లో ట్రిటియం పరిమాణం.. అంతర్జాతీయంగా అమోదించిన స్థాయి కన్నా తక్కువగానే ఉంటుందని వివరించింది. కానీ, పొరుగు దేశాలు మత్సకార వర్గాలు అందుకు ససేమిరా అంటున్నాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ జపాన్‌కు మద్దతుగా నిలిచింది. కానీ, చైనా, సౌత్ కొరియా లాంటి దేశాలు అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ టెర్రర్ వాటర్‌ను జపాన్ ఎలా వదిలించుకుంటుందో చూడాలి.

బీజేపీ కోసం పూరీ జగన్నాధ్ సినిమా : స్క్రిప్ట్ అదిరిపోతుందట

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. రాజకీయా పార్టీలు తమ ప్రభావాన్నీ.. ఓటు బ్యాంకును పెంచుకునేందుకు సోషల్ మీడియాను దాటి సినిమాల దాకా వచ్చేశాయి. గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం చుట్టూ అల్లిన కథతో యాత్ర సినిమాను తెరకెక్కించి జనాన్ని రాజన్న ఎమోషన్లో కట్టి పడేసి.. ఆ ఎమోషన్ ను ఓట్ల రూపంలోకి మార్చుకున్నాడు వైఎస్ జగన్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. క్రేజీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో వ్యూహం పేరుతో కొత్త సినిమా మొదలుపెట్టాడు. ప్రతిపక్ష పార్టీ నేతలను నెగెటివ్ గా చూపించి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందేందుకు వేసిన స్కెచ్.. వ్యూహం సినిమా. ఇప్పుడు బీజేపీ కూడా సినిమాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్లాన్లు వేస్తోంది. టాలీవుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. బీజేపీకి అనుకూలంగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేసిన పూరీ.. బీజేపీ నేతలకు వినిపించాడట. పూరీ స్క్రిప్టు విని ఇంప్రెస్ అయిన సదరు బీజేపీ నేత.. 30 కోట్లు బడ్జెట్ కూడా ఇచ్చేశాడట.

కర్ణాటక బీజేపీ నేత మంజు.. కొద్ది రోజుల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఆయనే ఇప్పుడు బీజేపీకి అనుకూలంగా ఓ సినిమా చేద్దామంటూ కొంత మంది డైరెక్టర్లను కలిశాడు మంజు. పూరీని కలిసినప్పుడు వినిపించిన స్క్రిప్టుకు మంజు ఫిదా అయిపోయాడట. దీంతో పూరీతో కలిసి సినిమా పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడట. ప్రస్తుతం సినిమా కథలోని క్యారెక్టర్లకు నటీ నటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారట వీళ్ళిద్దరూ. కాస్ట్ ఓకే కాగానే సినిమా మొదలు పెట్టి సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారట. పూరీ ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ 2 సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలుపెట్టే లోపు బీజేపీ సినిమాను బుల్లెట్ స్పీడ్ తో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు సంబంధించిన సమాచారం ఇంకా బయటకు రాకపోయినా.. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

మోడీ క్యాబినెట్లోకి కొత్త మంత్రులు.. కీలక మార్పులు

కేంద్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ జాతీయ మీడియాలో పెద్దఎత్తున కథనాలు ప్రచురితమవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మోడీ తన క్యాబినెట్లో మార్పులు చేయనున్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా జూలై రెండో వారంలో కీలక మంత్రుల స్థానాలు మారబోతున్నాయని జాతీయ మీడియా బల్లగుద్ది చెప్తోంది. తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్లో మొన్నటి వరకూ కొనసాగిన కిషన్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మారి మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలోనే ఇంకొంత మంది మంత్రులు రాజీనామాలు చేయబోతున్నారనీ.. కీలక మంత్రిత్వ శాఖల విషయంలో కూడా బీజేపీ అధిష్టానం మార్పులు చేయబోతోందనీ సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ.. మంత్రుల పని తీరు దృష్ట్యా కొంత మంది మంత్రులకు కొత్త బాధ్యతలు అప్పగిస్తారనీ.. కొంత మంది మంత్రులను క్యాబినెట్ నుంచి తప్పించబోతున్నారనీ బీజేపీ నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రధాని మోడీ షెడ్యూల్ నాలుగు రాష్ట్రాల పర్యటనతో బిజీ బిజీగా ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర సహా మరో రెండు రాష్ట్రాల్లో మోడీ పర్యటన ముగిసిన అనంతరం జాతీయ కార్యవర్గం మరియు మంత్రి వర్గాలు సమావేశమై కొత్త నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధిష్టానం చాలా రోజుల క్రితమే మార్పులు చేర్పులు మొదలుపెట్టింది. కర్ణాటకలో బీజేపీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీ వ్యూహాలు మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రాల్లో బీజేపీకి ఆదరణ తగ్గటం పట్ల దృష్టిపెట్టిన అధిష్టానం.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఓట్లు పోకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను మార్చేసింది అధిష్టానం. జూలై రెండో వారంలో కీలక సమావేశాలు ముగిసిన తర్వాత మరిన్ని భారీ మార్పులు తప్పవని విశ్లేషకులు చెప్తున్నారు.

ఎర్రచందనాన్ని మించిపోయిన టమాటో

దేశవ్యాప్తంగా టమాటో ధరలు ఎన్నడూ లేనంత స్థాయిలో విపరీతంగా పెరిగిన విషయం మనకు తెలిసిందే. కర్ణాటకలోని కొన్ని మార్కెట్లలో టమాటో ధర ఆల్ టైమ్ హయ్యెస్ట్ గా కిలోకు 160 రూపాయల వరకూ పెరిగింది. లీటర్ పెట్రోల్ కంటే నలభై రూపాయలు ఎక్కువగా కిలో టమాటోల ధర ఉంది. ఇలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో టమాటో పంటను కాపాడుకోటానికి ఎర్రచందనం తోటకు వేసినట్టు కంచె వేసి రాత్రి వేళ పహారా కాయాల్సి వస్తోంది కొన్ని రాష్ట్రాల్లో. కర్ణాటకలో ఓ టమాటో తోటను రాత్రికి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దోచేయటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన పంటను ఎవరో కోసుకెళ్ళారంటూ ఆ తోట యజమాని పోలీసులకు కంప్లైంట్ చేయగా.. ప్రస్తుతం ఆ దొంగను పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. దోపిడీకి గురైన టమాటోల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 2.5 లక్షలు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చేతికొచ్చిన పంటను ఎవరు దోచేస్తారో తెలియక.. రైతులు రాత్రంతా తోటలకు కాపలా కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ఎర్ర చందనం తోటలకు హైలెవెల్ సెక్యూరిటీ పెట్టుకోవటం మనకు తెలిసిందే. ఒక్క దుంగ ఖరీదు మార్కెట్లో కొన్ని లక్షలు ఉంటుంది కాబట్టి ఎర్రచందనం తోటల చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, సీసీ కెమెరా సర్వైలెన్స్ తో పాటు సెక్యూరిటీ గార్డులు ఉంటారు. సెక్యూరిటీ వాళ్ళను హత్య చేసి ఎర్ర చందనం దుంగలను ఎత్తుకెళ్ళిన సంఘటనలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు టమాటో తోటలకు అలాంటి పరిస్థితే వచ్చింది. రాత్రంతా టమాటో తోటల్లో రైతులు తమ కుటుంబాలతో సహా కాపలా కాస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో తోటకు కాపలాగా ఉన్న ఇద్దరు రైతులను కొట్టి మరీ టమాటోలను కోసి ట్రక్ లో వేసుకొని వెళ్ళిపోయారు కొంత మంది. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద ఉన్నట్టే ఇప్పుడు చేతికొచ్చిన టమాటో తోటల చుట్టూ సెక్యూరిటీ కనిపిస్తోంది. ధరల పెరుగుదల ఇలాగే కొనసాగితే ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.

విజయ్ రష్మిక విడిపోయారా.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

0

విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఏదో ఉందంటూ నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంటుంది.. ఈ ప్రచారానికి తగ్గట్టే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడూ కలిసి తిరుగుతూ కెమెరా కంట పడుతుంటారు. కలిసి హాలిడేస్ వెళ్తున్నారనీ.. కలిసే ఉంటున్నారనీ.. ఇలా రకరకాల ప్రచారం వీళ్ళద్దరి చుట్టూ జరుగుతుంటుంది. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ ఇంట్లోనే భోజనం చేయటం.. అదీ ఫ్యామిలీలతో సహా కనిపించటంతో వీళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారని అభిమానులు ఫిక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు రష్మిక మందన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఫాలింగ్ అపార్ట్ అంటూ ఓ ఎమోషనల్ వీడియోను రష్మిక షేర్ చేసింది. కొంత మంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు.. వెళ్తూ ఉంటారు.. అనే అర్థం వచ్చేలా రష్మిక చేసిన ఈ పోస్ట్ ను చూస్తే విజయ్ దేవరకొండకు, రష్మికకు మధ్య ఏదో తేడా జరిగినట్టుంది అనే అనుమానం ఫ్యాన్స్ లో కనిపిస్తోంది.

రష్మిక ఇలాంటి పోస్టులు ఎప్పుడూ చేయదు.. ఎప్పుడూ చిల్ అవుతూనే ఉంటే మూమెంట్స్ ను తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. కానీ ఈ సారి రష్మిక ఇలా ఎమోషనల్ కావటం వెనుక ఏదైనా కారణం ఉందా.. లేకపోతే క్యాజువల్ గా అలా స్టోరీ షేర్ చేసిందా అని ఫ్యాన్స్ తెగ ఆలోచనలో పడిపోయారు. ఎప్పుడు ఎక్కడ విజయ్ గురించి ఎవరు ప్రశ్న వేసినా రష్మిక విజయ్ తన సొంత మనిషి అన్నట్టుగా సమాధానం ఇస్తుంది. రీసెంట్ గా ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ నా కోసం ఎప్పుడూ ఉంటాడు.. అంటూ మరోసారి ఎమోషనల్ సమాధానం చెప్పింది రష్మిక. మరి ఇప్పుడు ఇలాంటి స్టోరీ ఎందుకు షేర్ చేసిందోనని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకంగా డిస్కషన్లు పెట్టేస్తున్నారు.

కేసీఆర్ కాళ్ళు పట్టుకొని అడుగుతా-పోసాని

ఏపీ రాజకీయాలపై తరచుగా వివాదాస్ఫద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి ఈ సారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడి మళ్ళీ వార్తల్లోకెక్కాడు. సినిమా షూటింగ్స్ అన్నీ హైదరాబాద్ కేంద్రంగానే జరుగుతున్నాయనీ.. ఏపీలో అసలు సినిమా, సీరియల్ షూటింగ్స్ జరగటం లేదనీ ఆవేదన వ్యక్తం చేసిన పోసాని.. దయచేసి ఏపీలో కూడా సినిమా పనులు చేయాలని ఇండస్ట్రీ పెద్దలను కోరారు. ఏపీలో సినిమా షూటింగ్స్ చేస్తే అన్ని రకాల అనుమతులు ఇస్తామనీ.. ఫ్రీగానే షూటింగ్స్ చేసుకోటానికి తమకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నాడు. హైదరాబాద్ లో కేంద్రీకృతమైన సినిమా ఇండస్ట్రీని ఏపీకి తరలించాలంటే అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించాల్సి ఉంటుందని చెప్పిన పోసాని.. అలా ఒప్పించటానికి అవసరమైతే కేసీఆర్ కాళ్ళు పట్టుకుంటానంటూ వ్యాఖ్యానించాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన పోసాని.. ఈ వ్యాఖ్య చేశాడు. తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా మంచి వాడనీ.. మర్యాదపూర్వకంగా అడిగితే ఒప్పుకుంటాడని కూడా పోసాని చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్సే కాదు సినిమా, సీరియల్స్ కు సంబంధించిన అన్ని పనులు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయనీ.. ఏపీలో అసలు ఇండస్ట్రీ లేకుండా పోయిందనీ పోసాని ఆవేదన వ్యక్తం చేశాడు.

నంది అవార్డుల విషయంపై కూడా పోసాని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్న పోసాని.. ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నదనీ.. త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అర్హులైన వాళ్ళకు నంది అవార్డులు ఇస్తామని చెప్పిన పోసాని.. ఒక వేళ ఇదివరకే ఆరోపించినట్టుగా అనర్హులకు కనుక అవార్డులు ఇస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానంటూ చాలెంజ్ చేశాడు. అలాగే పద్య నాటకాలు అనేవి కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే చెందిన కళ అనీ.. ఈ రంగంలో కూడా విశేష కృషి చేసిన వాళ్ళకు నంది అవార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పాడు. ఇక సినిమా షూటింగ్స్ విషయంలో ఇండస్ట్రీని ఏపీకి విస్తరించేందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందంటూ కోరాడు పోసాని.