దాదాపు 14 నెలలుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంత కాలం అమెరికాకు మిత్రదేశంగా ఉన్న ఈజిప్టు ఇప్పుడు అమెరికాకు బద్ధ శతృవైన రష్యాకు మద్దతు పలికింది. సుదీర్ఘ యుద్ధం కారణంగా ఆయుధాలు కోల్పోయిన రష్యాకు ఏకంగా 40 వేల రాకెట్లను ఈజిప్టు అప్పజెప్పిందని అమెరికా మీడియా చెప్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత ఫిబ్రవరిలోనే ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్ సిసి రష్యాకు ఆయుధాలు సరఫరా చేయటంపై సైన్యాధికారులతో చర్చించడంతో పాచు ఆ తర్వాత పెద్దమొత్తంలో ఆయుధాలను రష్యాకు తరలించబడ్డాయి. ఈ విషయం నిఘా వర్గాల ద్వారా అమెరికా తెలుసుకుంది. కానీ అమెరికా బహిరంగంగా ఈ విషయంపై స్పందించలేదు.
ఈజిప్టు చర్య అమెరికాను షాక్ కు గురిచేసింది. కనిక్టికట్ జూనియర్ సెనేటర్ క్రిస్ ముర్ఫీ ఈ విషయంపై స్పందిస్తూ.. నిజంగా ఈజిప్టు కనుక రష్యాకు మద్దతుగా ఆయుధా సాయం చేస్తే.. అది చాలా తీవ్రమైన చర్యగా పరిగణించాలంటూ వ్యాఖ్యానించాడు. ఈ చర్య అమెరికాతో పాటు ఈజిప్టు దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించాడు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ ఏడాది జనవరి చివరలో కైరోలో ఎల్-సిసితో సమావేశమయ్యాడు. ఈ సందర్భంగా ఇరుదేశాలు కలిసి ఓ ప్రకటన కూాడా విడుదల చేశాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఈజిప్టు వైఖరి గురించి వెల్లడైన ఈ ప్రకటనలో.. ఈజిప్టు దేశం అమెరికాకు మద్దతుగా మరియు ఉక్రెయిన్ కు మద్దతుగా ఉన్నట్టు తెలిపింది. కానీ ఇప్పుడు రష్యాకు ఆయుధ సాయం చేయటం సంచలనంగా మారింది. అయితే.. రష్యా నుంచి గోధుమలు దిగుమతి చేసుకునే ఈజిప్టు.. ఆహార కొరత నేపథ్యంలో గోధుమల కోటా పెంచినందుకే రష్యాకు ఈజిప్టు ఆయుధాలు సరఫరా చేసినట్టు సమాచారం. కాకపోతే ఈ విషయంపై ఇంకా ఈజిప్ట్ స్పందించలేదు.