నైజాం సంస్థానాన్ని పరిపాలించిన నిజాం రాజుల చివరి వారసుడు నవాబ్ బర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా అంత్యక్రియలు హైదరాబాద్ లో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. హైదరాబాద్ లో తన అంత్యక్రియలు జరగాలనేది మరణించిన బర్కత్ ఆలీ ఖాన్ చివరి కోరిక అని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన చివరి కోరిక మేరకే అంత్యక్రియలు హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.
1971 వరకూ అధికారికంగా ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ గానే పరిగణించబడిన ఈయన.. ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న జన్మించారు. చిన్నతనంలోనే రాజుగా ప్రకటించబడిన ఈయన.. ఆ తర్వాత అనేక విషయాల్లో వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈయనకు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. విలాసాలకు పోయి విపరీతమైన ఖర్చులు చేసి చివరకు దివాలా తీశాడు చివరి నిజాం. ఈయన ఆస్తుల కోసం వారసులు కోర్టులకు ఎక్కడం.. భరణాల కోసం ఈయన భార్యలు కేసులు వేయటంతో పాటు ఇంకా అనేక వివాదాలు ఈయన చుట్టూ ఉన్నాయి. చివరికి ఆర్థిగా బాగా చితికిపోయిన ముకరం ఝా.. ఇస్తాంబుల్ లోని ఓ డబుల్ బెడ్ రూమ్ ఇంటికే పరిమితమయ్యాడు. చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితుల్లో తన సొంత ఇంట్లో ఒంటరిగా కన్నుమూశారు. ఈయన వారసులు వేసిన కేసుల వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ అంశంగా మారి ఇస్లాం దేశాలు కూడా నోరు విప్పే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ లోని మా ఆస్తులు అమ్మేసి మాకు సొమ్ము ఇప్పించాలన్న వారసుల కేసుల వల్ల.. చివరికి కోర్టు ఆయా భవనాలు, ఆభరణాలు.. ఇతర వస్తువులపై స్టే విధించాల్సి వచ్చింది. హైదరాబాద్ పై భారత ప్రభుత్వం తీసుకున్న మిలటరీ యాక్షన్ కు భయపడి.. తన వద్ద ఉన్న సొమ్మును పాకిస్తాన్ హై కమిషనర్ స్టేట్ బ్యాంక్ ఖాతాలోకి జమచేసి.. చివరికి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చాలా వివాదాల్లో ఇరుక్కొని అద్దె ఇంట్లో మరణించాడు. ఆయన తండ్రి సమాధి పక్కనే ముకరం ఝా ను సమాధి చేయనున్నారు.