ఆసియా కప్ వేదిక పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మార్చినందుకు ప్రతీకారంగా ఆసియా కప్ తో పాటు వన్డే ప్రపంచ కప్ నుంచి కూడా వైదొలగుతామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ లో జరగాల్సిన ఆసియా కప్ ను శ్రీలంకలో నిర్వహించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ తాజాగా నిర్ణయం తీసుకోవటంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు నజమ్ సేథి తాము ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తామంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో ఇటు ఆసియా కప్ తో పాటు వచ్చే ప్రపంచ కప్ పై కూడా సంధిగ్ధత నెలకొంది. అసలు ఏం జరిగిందంటే..
సెప్టెంబర్ లో పాకిస్తాన్ వేదికగా ఆసియా కప్ జరగాల్సి ఉండగా దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తాము పాకిస్తాన్ లో పర్యటించటం కుదరదంటూ ఆసియా క్రికెట్ బోర్డుకు స్పష్టం చేసింది. దీనిపై బీసీసీఐని ఏసీసీ పునరాలోచించాలని కోరగా.. ఈ విషయంలో బీసీసీఐ ఏమీ చేయలేదనీ.. దీనిపై తుది నిర్ణయం భారత ప్రభుత్వానిదేనంటూ తేల్చి చెప్పింది. భారత్ నిర్ణయంతో ఆసియా కప్ వేదికను పాకిస్తాన్ నుంచి శ్రీలంకకు మారుస్తూ ఏసీసీ నిర్ణయం తీసుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అన్ని మ్యాచ్ లను కాకపోయినా కనీసం తాము ఆడే మ్యాచ్ లను అయినా పాకిస్తాన్ లో నిర్వహించాలంటూ కోరింది. కానీ ఏసీసీ అందుకు అంగీకరించలేదు. కావాలంటే పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లను దుబాయ్ లో నిర్వహిస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. దీనిపై శ్రీలంక అభ్యతరం చెప్పింది. ఎండాకాలంలో దుబాయ్ లో మ్యాచ్ లు ఆడటం తమ వల్ల కాదని శ్రీలంక స్పష్టం చేసింది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. చివరికి ఆసియా కప్ అన్ని మ్యాచ్ లను శ్రీలంకలోనే నిర్వహించాలని నిర్ణయించింది.
అటు తిరిగి ఇటు తిరిగి పాకిస్తాన్ లో జరగాల్సిన టోర్నమెంట్ ను శ్రీలంకకు మార్చటం తమకు ఏమాత్రం నచ్చలేదనీ.. కేవలం భారత్ అభ్యంతరం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతీకారంగా తాము ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ను బహిష్కరిస్తున్నామని తేల్చి చెప్పింది. పాకిస్తాన్ లో కనీసం తాము ఆడే నాలుగు మ్యాచ్ లైనా నిర్వహిస్తామంటేనే తాము ఈ రెండు టోర్నమెంట్లలో ఆడుతామనీ.. లేదంటే మాత్రం ఈ రెండు మెగా టోర్నీలలో తాము ఆడేది లేదంటూ తుది నిర్ణయం చెప్పింది. కానీ భారత్ మాత్రం పాకిస్తాన్ లో అడుగు పెట్టేదే లేదని.. ఇది కేవలం క్రికెట్ కు సంబంధించిన అంశంగా తాము చూడటం లేదని భారత్ చెప్తోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో భారత జట్టు పాకిస్తాన్ లో పర్యటించటం సరికాదని.. దీన్ని అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. పంతానికి పోయి పాకిస్తాన్ ఆసియా కప్ తో పాటు ప్రపంచ కప్ ను బహిష్కరించటం ఖాయంగా కనిపిస్తోంది.