అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భారతదేశ ప్రజలు బంగారం, వెండి కొనటాన్ని తగ్గించాలంటూ కొద్ది రోజుల క్రితం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బంగారం కొనుగోళ్ళు చాలా వరకు తగ్గుముఖం పట్టగా.. ఆ తర్వాత కొద్ది రోజులకు బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. బంగారం ధరలు తగ్గుతుండటంతో ఇదే మంచి సమయం అని భావించిన జనం.. మళ్ళీ బంగారం కొనేందుకు మొగ్గు చూపారు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.. అంటే బంగారం ధర మళ్ళీ పైకి ఎగబాకింది. ఈ ట్రెండ్ కొద్ది రోజులు కొనసాగినా.. ఆ తర్వాత బంగారం కొనుగోళ్ళు చాలా వరకు తగ్గటంతో పాటు రేట్లు కూడా దిగివచ్చాయి. ఇదే దారిలో వెండి పరిస్థితి కూడా సాగింది. రూపాయి బలహీనపడటం, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడుతుండటంతో సిల్వర్ దిగుమతులను అరికట్టేందుకు పలు ఆంక్షలు విధించింది. వెండి రేణువులు, పొడుల దిగుమతులను నియంత్రిత వర్గంలో చేర్చింది. అంటే ఇక నుంచి వీటిని దిగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
బంగారం తర్వాత స్థానం వెండిదే కాబట్టి.. జనం బంగారం కొనటం తగ్గించినా.. వెండి ధరలు తగ్గటంతో దానిపై ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. దీంతో వెండి దిగుమతులపై కూడా కేంద్రం పలు ఆంక్షలు విధించాల్సి వచ్చింది. విదేశీ మారకద్రవ్యాన్ని దేశం దాటకుండా ఉంచాలంటే వెండి కొనుగోళ్ళు మరింత తగ్గించాల్సిన అవసరం ఏర్పడటంతో మరిన్ని ఆంక్షలకు కేంద్రం సిద్ధమైంది. 99.9 శాతం స్వచ్చత కలిగిన వెండి పొడి, రేణువులు, పాక్షికంగా తయారైన ఉత్పత్తులను విదేశాల నుంచి భారత దిగుమతిదారులు తెచ్చుకోవాలంటే ముందుగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నుంచి లైసెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. గత నెలలో వెండి కడ్డీలు, సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్స్‌ను ఈ జాబితాలోకి తీసుకురాగా.. ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తులను కూడా చేర్చింది. దేశంలో వెండి దిగుమతులు భారీగా పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా వెండిని వినియోగించే దేశంగా భారత్ ఉండగా.. రికార్డు స్థాయిలో దిగుమతులు చేసుకుంటుంది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.1.20 లక్షల కోట్లు దిగుమతుల కోసం ఖర్చు చేసింది. ఇక ఏప్రిల్‌లో వెండి దిగుమతులు 157 శాతం పెరిగింది. ఈ నిర్ణయాల వల్ల తక్షణమే వెండి ధరలు పెరగవచ్చని అంటున్నారు. అనుమతి తీసుకునేందుకు చాలా సమయం పడుతుంది. దీని వల్ల వెండి సరఫరా తగ్గడంతో పాటు తాత్కాలిక కొరత ఏర్పడుతుంది. దీని వల్ల ధరలు పెరుగుతాయని అంటున్నారు. ఇక వెండిని ముడి సరుకుగా ఎక్కువగా ఉపయోగించే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమలపై కూడా దీని ప్రభావం పడుతుందని చెబుతున్నారు. వెండిని నాణేలు, కడ్డీలు, పూజా సామాగ్రికి మాత్రమే కాకుండా పరిశ్రమ అవసరాల కోసం కూడా ఉపయోగిస్తారు. దీంతో వెండికి దేశంలో డిమాండ్ అనేది పెరిగిపోతుంది. ప్రస్తుతం కిలో వెండి రూ.2.90 లక్షల వద్ద కొనసాగుతోంది. గతంలో రూ.4 లక్షల వద్దకు చేరుకోగా.. ప్రస్తుతం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

