ఎంత సెక్యూరిటీ ఉన్నా ఫీమేల్ సెలబ్రిటీలు అప్పుడప్పుడు కొన్ని అనూహ్య పరిణామాలు ఎదుర్కుంటునే ఉంటారు. ముఖ్యంగా జనాలు భారీగా ఉన్న ఈవెంట్లకు, ఫంక్షన్లకు అటెండ్ అయినప్పుడు ఈ చాన్స్ మరింత ఎక్కువ. ఒక్కోసారి ఫ్యాన్సే హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు.. దాని వల్ల హీరోయిన్లు అసౌకర్యానికి గురవుతారు. హీరోయిన్ అపర్ణ బాలమురళి విషయంలో ఇలాంటి సంఘటననే చోటు చేసుకుంది. అపర్ణ లీడ్ రోల్ లో నటించిన తన్కమ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఓ కాలేజీకి తన సినిమా యూనిట్ తో కలిసి వెళ్ళింది అపర్ణ. కార్యక్రమంలో అందరి మధ్య అపర్ణ కూర్చొని ఉండగా.. ఆమె దగ్గరికి వచ్చిన ఆ కాలేజ్ కు చెందిన విద్యార్థి.. అపర్ణకు షేక్ హ్యాండిచ్చాడు. అభిమాని కదా అని చెయ్యి ఇస్తే.. అపర్ణను చేయి పట్టుకొని స్టేజ్ మీదకు లాగేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె భుజంపై చేయి వేయటానికి ప్రయత్నించారు. దీంతో అపర్ణ చాలా అసౌకర్యానికి గురై ఆ యువకుడి నుంచి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసింది. అంతలోనే అక్కడున్న ఇతర స్టూడెంట్స్ అరుపులు విన్న ఆ విద్యార్థి.. వెంటనే అపర్ణకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టి సారీ చెప్పే ప్రయత్నం చేశాడు. ఆ విద్యార్థి ప్రవర్తనతో కొద్దిసేపు అపర్ణ అసౌకర్యంగానే అక్కడ కూర్చుంది.
అయితే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ ను అభిమానులు ట్విటర్లో షేర్ చేస్తూ.. ఆ విద్యార్థిపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. అక్కడే ఉన్న తన్కమ్ హీరో వినీత్ శ్రీనివాసన్ కూడా స్పందించకపోవటం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం ఉంటే సరిపోతు.. ఎలా ప్రవర్తించాలో తెలియాలి.. అంతా అయిపోయాక క్షమాపణలు చెప్తే సరిపోతుందా.. అంటూ అపర్ణ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.