చికెన్ ప్రియులకు ఆల్ ఇండియా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ షాకిచ్చింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాన్స్‌పోర్టేషన్ ధరల వల్ల చికెన్ మరియు కోడిగుడ్ల ధరలు రానున్న రోజుల్లో భారీగా పెరగనున్నాయంటూ అసోసియేషన్ అనౌన్స్ చేసింది. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం వల్ల సరుకు రవాణాపై ధరల పెరుగుదల ప్రభావం పెరిగిందనీ.. దీంతో కోళ్ళ దానా సరఫరా రేటు కూడా పెరిగిందనీ అసోసియేషన్ చెప్తోంది. కోళ్ళకు పెట్టే దాణా, సోయాబీన్ మీల్ వంటి వాటి ధరలు పెరిగాయనీ.. కాబట్టి చికెన్ మరియు కోడిగుడ్ల ధరలు భవిష్యత్తులో పెంచక తప్పడం లేదని చెప్తున్నారు. గత రెండు నెలల్లోనే కోళ్ళ దాణా ఖర్చు సుమారు 25 శాతం వరకూ పెరిగిందని అసోసియేషన్ ప్రతినిథులు చెప్తున్నారు. పెరిగిన ఖర్చులతో కోళ్ళ ఫారమ్‌ల నిర్వహణతో పాటు రవాణా ఖర్చు పెరగటం వల్ల నిర్వహణ కష్టమైందన్నారు. అంతేకాకుండా జులై నుంచి అక్టోబర్ వరకు అనేక పండుగలు వస్తున్నాయి. శ్రావణ మాసం, నవరాత్రి లాంటివి రానున్నాయి. ఈ సమయంలో నాన్ వెజ్ విక్రయాలు సాధారణంగా తగ్గడం వల్ల మాంసానికి డిమాండ్ కూడా ఎక్కువగా ఉండదు. దీంతో ఉత్పత్తిని తగ్గించాలని పాల్ట్రీ పరిశ్రమ నిర్ణయించింది.
దాణా ఖర్చులు పెరగటానికి కృత్రిమ కొరత కూడా ఓ కారణం అని చెప్పొచ్చు. పెరుగుతన్న ధరల సాకును చూపించి కోళ్ళ దాణాను గోదాముల్లో దాచి.. రేట్లు పెంచేశారు దాణా అమ్మకందారులు. ఇది కూడా చికెన్, కోడిగుడ్ల ధరల పెరుగుదలకు కారణం కావచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర 280 రూపాయల నుంచి 290 రూపాయల మధ్య ఉంది. త్వరలోనే ఈ ధర 300 దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాణా అమ్మకందారులు దాణాను బ్లాక్ చేయకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ కోరుతోంది. ఏది ఏమైనా.. త్వరలో చికెన్ మరియు గుడ్ల ధరలు పెరగటం మాత్రం ఖాయం.

