కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి అయిన సందర్భంగా కేంద్రమంత్రి వర్గంలో కీలక మార్పులు చేర్పులు జరగనున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన తర్వాత.. ముఖ్యమైన శాఖల మంత్రులను మార్చాలని బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయించిందనీ.. ప్రస్తుతం పేలవమైన పనితీరు ఉన్న మంత్రుల స్థానంలో కొత్త వాళ్ళకు మంత్రులుగా అవకాశం ఇచ్చేందుకు మోడీ అమిత్ షా టీమ్ కసరత్తు చేస్తోందని సమాచారం. అంతర్జాతీయ రాజకీయ పరిణామాల్లో రోజురోజుకూ భారత్ పాత్ర పెరుగుతున్న దృష్ట్యా.. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగలిగిన మరియు.. సరికొత్త ఆలోచనలతో దేశగతిని మార్చగలిగిన కొత్త వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని బీజేపీ కేంద్ర అధినాయకత్వం ఆలోచిస్తోందట. దీంతో.. కొత్తగా మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయి అనే దానిపై ఎన్డీలోని అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ముఖ్యంగా.. జనసేన పార్టీ నుంచి ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కబోతోందన్న వార్త.. ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఎన్డీయే కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ నుంచి రామ్మోహన్ నాయుడు మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా కొనసాగుతుండగా.. తెలుగుదేశం పార్టీ నుంచి మరొకరికి మంత్రిపదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది. జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరికి కేంద్రమంత్రిగా అవకాశం దక్కనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనకు ఉన్న అనుభవం దృష్ట్యా వచ్చే మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి లేదా సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా కేంద్రమంత్రి పదవి రేసులో ఉన్నారు. బీజేపీ నుంచి మంత్రిపదవి రేసులో పురంధేశ్వరి ముందున్నారని సమాచారం. అయితే.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ గురించి బీజేపీ నుంచి అధికారికంగా ఇప్పటి వరకూ ఏ ప్రకటన రాలేదు. ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకునే మోదీ అమిత్ షా టీమ్.. ఈ సారి ఎవరి ఆశలను, ఊహలను నిజం చేస్తుందో చూడాలి.

