కూటమితో కలిసి ఆంధ్రలో అధికారం సంపాదించిన పవన్ కళ్యాణ్.. తన పార్టీ జనసేనను తెలంగాణలో కూడా క్షేత్రస్థాయిలో విస్తరించబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జూన్ 2.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన.. పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’ పేరుతో భారీ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేనానికి తెలంగాణ సర్కార్ ఊహించని షాకిచ్చింది.
శాంతి భద్రతల దృష్ట్యా ఈ సభకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. దీనిపై శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తల్లూరి రామ్ జూన్ 2న సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సుమారు 2 వేల మంది కార్యకర్తలతో నిర్వహించాలనుకున్న జనసేన సాధకుల సమావేశానికి అనుమతి కోరారనీ.. పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించిన మీదట.. సమస్యలు వస్తాయని భావించి పర్మిషన్ తిరస్కరించినట్టు ఆయన చెప్పారు.
పవన్ కళ్యాణ్ సభ నేపథ్యంలో ప్రొఫెసర్ కే.నాగేశ్వర్‌కు మరియు జనసేన నేతలకు మధ్య నెలకొన్ని వివాదాస్ఫద పరిస్థితులు.. కొంత మంది ఏపీ రాజకీయ నాయకులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణలో జరిగిన ఆందోళన కార్యక్రమాలు.. ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించారు. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అటు బీఆర్ఎస్, ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలు.. మంగళవారం జరగనున్న వివిధ కార్యక్రమాలకు హాజరయ్యే జనసందోహం.. ఇలాంటి కారణాలన్నీ పరిశీలించిన పోలీసులు చివరకు పవన్ సభకు అనుమతి ఇవ్వటం లేదని ప్రకటించారు. ఇదిలా ఉంటే.. జనసేన సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆ పార్టీ నేతలు కోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్‌లో తాము నిర్వహించబోయేది బహిరంగ సభ కాదనీ.. కేవలం పార్టీ సమావేశం మాత్రమేననీ చెప్పారు. కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య తాజాగా నెలకొన్న వివాదాల దృష్ట్యా.. కోర్టు కూడా ఈ సమావేశానికి అనుమతి ఇవ్వకపోవచ్చని సమాచారం.

