ఎవడి గోల వాడిది.. ఓ పక్క పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల.. మరో పక్క గ్యాస్ సిలిండర్లకు కొరత.. ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరల గురించి టెన్షన్.. ప్రపంచం ఇన్ని కష్టాలు ఎదుర్కుంటుంటే.. మందు బాబుల చింత మాత్రం లిక్కర్ రేట్లపై ఉంది. యుద్ధం పేరు చెప్పి అన్ని రేట్లు పెంచేస్తున్న ప్రభుత్వం.. ఎక్కడ మందు రేట్లు కూడా పెంచేస్తుందోనని భయపడిన మందుబాబులు.. జిల్లా కలెక్టర్‌కు ఓ వినూత్న విన్నపం పెట్టారు. జూన్ 2 నుంచి లిక్కర్ రేట్లు కూడా పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో.. సిరిసిల్ల జిల్లాకు చెందిన మందుబాబులు.. ఆ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు లేఖ రాశారు. “ఇప్పటికే అన్ని రేట్లు పెరిగి మేం నానా తంటాలు పడుతున్నాము.. దేనికీ డబ్బులు సరిపోవటం లేదు.. ఇక మీరు మందు రేట్లు కూడా పెంచేస్తే మా పరిస్థితి ఏంటి..” అంటూ లిక్కర్ ప్రియులు కలెక్టర్‌కు లేఖలో తమ ఆర్థిక కష్టాలు వెల్లబోసుకున్నారు. “ఇప్పటికే ఇతర రాష్ట్రాలతో పోల్చితే మన దగ్గర మందు రేట్లు ఎక్కువగా ఉన్నాయి.. ఇంకా కూడా రేట్లు పెంచేస్తే మా వల్ల కాదు” అంటూ చెప్పుకున్నారు మద్యం ప్రియులు.
ఊరంతా కలిసి ప్రభుత్వాధికారులకు సమస్యల గురించి లేఖలు రాయటం కొత్తేమీ కాదు. మా ఊరికి రోడ్డు వేయమనో.. మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్ అందుబాటులో ఉండటం లేదనో.. తాగు నీటి కష్టాలో లేక కరెంట్ కష్టాల గురించో లేఖలు రాస్తారు. కానీ.. మందుబాబులు మాత్రం మందు రేట్లు పెంచకండి అంటూ లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. బండ్లో పెట్రోల్ లేకపోతే నడిచి వెళ్తాం.. గ్యాస్ రేట్లు పెరిగితే ఎలక్ట్రిక్ కుక్కర్‌లో వంట చేసుకుంటాం.. కానీ మందు రేట్లు పెరిగితే ఏం చేయగలం.. అంటూ మందుబాబుల ఆవేదన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో తెలంగాణలో కొంత మంది మందు బాబులు సంఘంగా ఏర్పడి డ్రంక్ ఆండ్ డ్రైవ్ చేయకూడదంటూ తాగి మరీ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఏదేమైనా.. తెలంగాణలో మందుకు ఇచ్చే ప్రాముఖ్యత ఎప్పుడూ డిఫరెంటే.
