కేవలం 3 రోజుల్లో ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకుంటామన్న ధీమాతో రాత్రికి రాత్రి మిలటరీ యాక్షన్ పేరుతో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. నాలుగేళ్ళు గడుస్తున్నా ఉక్రెయిన్‌లోనే కేవలం 10 శాతం భూభాగాన్ని మాత్రమే రష్యా బలగాలు స్వాధీనం చేసుకోగలిగాయి. ఒంటరిగా యుద్ధం చేసుకన్న రష్యాకు వ్యతిరేకంగా.. ఉక్రెయిన్‌కు యూరోపియన్ యూనియన్, అమెరికా వంటి దేశాలు భారీ స్థాయిలో ఆయుధ, ఆర్థిక సాయం చేయటంతో.. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పుతన్ లక్ష్యం నెరవేరలేదు గానీ.. లక్షల సంఖ్యలో సైనిక నష్టం వాటిల్లింది. లక్షల కోట్ల డాలర్ల ఆయుధాలు మసై పోయినా వాటిని మళ్ళీ తయారు చేసుకోవచ్చు.. కానీ పోయిన ప్రాణాలను తిరిగి తేలేం కదా.. కానీ రష్యా ఉక్రెయిన్ మాత్రం తమ సైనికుల ప్రాణాలకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా సైనిక బలం దాదాపుగా సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పుతిన్ ఓ కీలక ప్రకటన చేశాడు. రష్యా ఆర్మీలో చేరిన యువతకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించాడు.
రక్షణశాఖతో ఒప్పందం కుదుర్చుకుంటే, వారికి, వారి కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్.. అంటే.. సుమారు రూ.1.33కోట్లు వరకు రుణం నుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, మే 1వ తేదీకి ముందు రుణాలు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని సమాచారం. కొత్తగా సైన్యంలో చేరాలనుకునే వారు కనీసం ఏడాది పాటు కొనసాగుతానని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునేందుకు రష్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే.. రష్యా యువకులు ఆర్మీలో చేరటం.. నాణ్యమైన ఆర్మీ ట్రైనింగ్ తీసుకోవటం.. ఆర్మీ పరీక్షల్లో పాస్ కావటం.. ఇవన్నీ చాలా టైమ్ తీసుకునే ప్రక్రియ. చనిపోయిన సైనికుల స్థానాల్లో కొత్త వారిని తీసుకొని వారి ప్రాణాలను పణంగా పెట్టడం కంటే.. మిత్రదేశాల భాగస్వామ్యంతో ఉక్రెయిన్‌తో శాంతికి సిద్ధం కావటం మంచిదని అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ.. పుతిన్ వారి మాటలను వినటం లేదు సరికదా.. లేటెస్ట్ గా ఉక్రెయిన్ కీలక ప్రాంతాల్లో ఒరెష్నిక్ మిసైల్‌తో దాడి చేసి అతి పెద్ద విధ్వంసం సృష్టించాడు. ఇంకా యుద్ధం కొనసాగించాలనే రష్యా ఉక్రెయిన్ ఆలోచిస్తున్నాయి.
